పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

జీవన ఎరువులు

హరిత విప్లవం ద్వారా ప్రవేశపెట్టిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధిస్తున్నాము.

హరిత విప్లవం ద్వారా ప్రవేశపెట్టిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధిస్తున్నాము. భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం ఉత్పాదకతను పెంచవలసిన అవసరం ఉంది. మొక్క పెరుగుదలకు నత్రజని, భాస్వరం మరియు పోటాషియం చాలా ముఖ్యం. కాని వీటి తయారికి ఎక్కువగా పెట్రోలియం ఉత్పత్తులను వాడుతున్నారు కాబట్టి వాటి ఉత్పత్తికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అంతేకాకుండా చిన్న, సన్నకారు రైతులు రసాయన ఎరువులు, మందుల కోసం ఎక్కువ పెట్టుబడులు పెట్టి శ్రమపడుతున్నారు. వీటి వలన మనకు తెలియకుండానే భూమిలో ఉన్న ఉపయోగపడే సుక్ష్మజివుల పై ప్రభావం పడి వాటి సంఖ్య రోజురోజుకి తగ్గుతూ అవి జరిపే రసాయన చర్యలలో గణనీయమైన మార్పులు సంతరించుకోవచ్చును. భూమికి ఉన్న సహజ గుణాలు మరియు నేల ఆరోగ్య పరిస్ధితి నానాటికి క్షిణిస్తుంది.

వ్యవసాయంలో సుక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఇవి నత్రజనిని స్ధిరీకరిస్తాయి మరియు పోషకాలను కరిగించే మరియు పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి. కాని వీటి సంఖ్య త్వరితంగా తగ్గుతూ ఉంటుంది. పంటల యొక్క దిగుబడిని పెంచడానికి వేరు మండలంలో ఉండే సుక్ష్మజివులను గ్రహించి, కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి సూటి అయిన ఘనపదార్ధాలలో కలిపి మరల భూమిలో వేయవచ్చు. వీటినే జీవన ఎరువులు అంటారు.

జీవన ఎరువుల ఉత్పత్తి లేదా వినియోగం

గడిచిన మూడు దశాబ్దాల నుంచి జీవన ఎరువుల ఉత్పత్తి, సరఫరా వివిధ ప్రైవేటు, ప్రభుత్వ సంస్ధలు చేస్తున్నప్పటికీ ఆశించినంతగా రైతులలో అవగాహన, అవసరమైనంత సరఫరా జరగడం లేదు అని చెప్పవచ్చు. జీవన ఎరువులను వివిధ నాణ్యత ప్రమాణాలు లోపించకుండా ఉత్పత్తి చేసి అన్ని పంట పొలాల్లో 10-15% రసాయన ఎరువుల బదులుగా వాడినట్లయితే తగిన ప్రతిఫలాన్ని పొందే అవకాశం ఉంటుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం 45 వేల టన్నుల జీవన ఎరువులు ఉత్పత్తి చేస్తున్నారు. కాని మన వ్యవసాయానికి దీనికి రెండు రేట్లు అవసరం ఉంది. కాబట్టి ఈ సేంద్రియ విధానంలో జీవన ఎరువులను వాడి నత్రజని మరియు భాస్వారాన్ని భూమిలోని వివిధ సుక్ష్మజివుల ద్వారా పంటలకు అందుబాటులోకి తీసుకోనిరావచ్చు.

జీవన ఎరువులు

జీవన ఎరువులు లేదా మైక్రోబియాల్ ఇనాక్యులెంట్స్ అనేవి పొడిరుపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ముఖమైన ఉపయోగకరమైన సుక్ష్మజివులను కలిగి యుండే విత్తనానికి కలిపి లేదా నేలలో వేసే ఎరువులు. ఈ జీవన ఎరువులలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మొక్క వేరు బుడిపెలలోకి లేదా వేరు మండలంలోకి ప్రవేశించి మొక్కలను అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెచ్చి మొక్క పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి.

జీవన ఎరువులను వాటి క్రియాశీలతను మరియు వాడే విధానాన్ని బట్టి వివిధ రకాలుగా విభజించారు.

 • నత్రజనిని స్దిరీకరించే జీవన ఎరువులు
 • భాస్వరంను కరిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవులు
 • పోటాషియంను మొక్కలను అందించేవి
 • జింక్ ను కరిగించే సూక్ష్మజీవులు
 • సేంద్రియ పదార్ధలను విచ్చిన్నం చేసే సూక్ష్మజీవులు
 • వేరు మండలంలో ఉండి మొక్క పెరుగుదలకు దోహదం చేసే వేరు బాక్టీరియా

నత్రజనిని స్దిరీకరించే జీవన ఎరువులు

 • రైజోబియం: రైజోబియం అను బాక్టీరియా మొక్కలతో కలిసి నత్రజనిని స్దిరీకరిస్తుంది. ఈ రకమైన సాక్ష్మజీవులు పప్పుజాతి పంట మొక్కల వేర్లతో సహజీవనం చేస్తూ గాలిలో ఉన్న 78 శాతం నత్రజనిని, మొక్కల వేర్లను ఆకర్షించి వేర్ల మీద గులాబీ రంగు కలిగిన వేరు బుడిపెలను ఏర్పాటు చేస్తాయి. ఈ రైజోబియం, యొక్క విడుదల చేసే లేక్టిన్ అనే రసాయన పదార్ధం ద్వారా ఆకర్షింపబడుతుంది. ఈ రసాయనాలు వివిధ అపరాల పంటలలో వేరుగా ఉంటాయి. కాబట్టి ఏ పంటకు ప్రత్యేకించిన రాజోబియంను ఆ పంటలో మాత్రేమే వాడుకోవాలి. వేరే పంటలలో ఈ రైజోబియం వేరుబుడిపెలను ఏర్పరచలేదు, కాబట్టి రైతు సోదరులు గమనించి ఏ పంటకు నిర్దేశించిన రైజోబియంను ఆ పంటలో మాత్రమే వాడుకోవాలి.
 • సిఫారసు చేయవలసిన పంటలు : ఈ రకపు జీవన ఎరువులు 30-35 కి. గ్రా. నత్రజనిని ప్రతి హెక్టారుకు అందించగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ జీవన ఎరువులను పప్పుజాతి పంటలైన కంది, పెసర, మినుము, అలసంద, బఠాని మరియు నూనెగింజ పంటలైన వేరుశనగ, సోయచిక్కుడులో వాడి లాభాలు పొందవచ్చు .

 • అజటోబ్యాక్టర్ : ఈ సూక్ష్మజీవులు నేలలో ఒంటరిగా ఉంటూ నత్రజనిని స్దిరీకరిస్తాయి. అంతేకాకుండా మొక్క పెరుగుదలకు దోహదపడే ఇతర హర్మోనులను స్రవిస్తాయి(ఐ.ఎ.ఎ. జిబ్బరెల్లీన్స్). ఇవి వేరు పెరుగుదలకు తోడ్పడుతాయి. ఈ రకపు జీవన ఎరువులు వాడటం వలన మొక్కలకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
 • సిఫారసు చేయవలసిన పంటలు : ఈ జీవన ఎరువులను అన్ని వాణిజ్య పంటలు, మిరప, ప్రత్తి, చెఱకు, ప్రొద్దుతిరుగుడు, కుసుమ, ఆకుకూరలు, కూరగాయలు మరియు పండ్లతోటలలో నత్రజనిని సమకూర్చడానికి వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువు 10 నుంచి 20 కి. గ్రా. ల నత్రజనిని ప్రతి హెక్టారుకు స్దిరీకరించే సామర్ధ్యం కలిగి ఉంటుంది.

 • అజోస్పైరిల్లమ్ : ఈ రాకపు జీవన ఎరువులు వాడటం వలన సూక్ష్మజీవులు వేరు చుట్టూ జీవిస్తూ వేర్లు దగ్గరలో నత్రజనిని స్ధిరీకరిస్తాయి. వేర్లకు పోషకబలం చేకుర్చి మొక్కలు బలంగా ఎదగడానికి తోడ్పడే హార్మోనులను స్రవిస్తాయి. ఈ విధంగా మొక్కల పెర్గుదలకు పంట దిగుబడికి తోడ్పడతాయి. సేంద్రియ కర్బనం తక్కువగా ఉన్న నేలలో కూడా ఈ జీవన ఎరువు సమర్ధవంతంగా పనిచేస్తుంది.
 • సిఫారసు చేయవలసిన పంటలు : ఈ రకపు జీవన ఎరువును ముఖ్యంగా వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగి పంటలలో వాడి లాభాలు పొందవచ్చు. ఈ రకపు జీవన ఎరువు 20-25 కి. గ్రా. నత్రజనిని స్దిరీకరించే సామర్ధ్యం కలిగి ఉంటుంది.

 • అసిటోబాక్టర్ : ఇది ప్రత్యేకంగా చెఱకు మరియు ఘగర్బీట్ వంటి పంటలకు మాత్రమే నత్రజని సంబంధిత జీవన ఎరువుగా ఉపయోగపడును. ఈ జీవన ఎరువు నేరుగా మొక్కల వేర్ల పైన మరియు వేర్ల లోపల కూడ జీవించి నత్రజనిని స్దిరీకరించి మొక్కలకు అందించును. అంతేగాక ఐ.ఎ.ఎ అనబడే హర్మోన్ ను అధికంగా ఉత్పత్తి చేసి మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది.
 • వాడే విధానం : ఒక ఎకరం చెఱకు పంటకు 4 కిలోల జీవన ఎరువును రెండు దఫాలుగా వాడవలెను. ముచ్చెలు నాటేటప్పుడు 2 కిలోలు మరియు మోకాలు లోతు పంట అయిన తరువాత 2 కిలోలు, ప్రతిసారి 100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి వాడవలెను.

 • నీలి ఆకుపచ్చ నాచు : (సైనో బాక్టీరియా) ఇది వరికి మాత్రమే ఉపయోగపడే నత్రజనిని స్దిరీకరించే జీవన ఎరువు. ఈ జీవన ఎరువులో ముఖ్యంగా నాస్టాక్, అనాబినా మొదలగు నీలి ఆకుపచ్చ నాచు సముదాయం ఉంటుంది. రైతులు వరి పంట కాలానికి ముందుగ చిన్న చిన్న మడులలో గాని, తొట్టెలలో గాని పెంచుకొని వరి నాట్లు వేసిన తరువాత దీనిని వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువును 3-4 పంట కాలాలకు వరుసగా పొలంలో ఉపయోగిస్తే ఆ తరువాత నుండి వాడవలసిన అవసరం లేదు.
 • వాడే విధానం : ఒక ఎకరం పొలంలో వరి నాట్లు వేసిన 3-7 రోజుల వ్యవధిలో 4 నుండి 6 కిలోల జీవన ఎరువును 40-50 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి చల్లుకోవాలి. ఇది వేసిన 15-20 రోజులలో ఈ నాచుమందుగా, చాపలా పేరుకుపోతుంది, తర్వాత నీరు తీసివేసి నేలను తాకిన నాచును మట్టిలో కలిసేటట్లు చేయాలి. ఈ నాచు సేంద్రియ పదార్ధంగా కూడా ఉపయోగపడుతుంది.

  రైతులు తయారు చేసుకునే విధానం : ముందుగా తయారు చేసుకున్న నేలను బాగా చాడునుపర్చుకొని 20 x 2 మీ. వైశాల్యం గల ప్లాట్లుగా తయారు చేసుకొని వాటికీ గాట్లను, నీటి కాలువలను ఏర్పచుకోవాలి. 10 సెం. మీ. లోతు నీటిని ఉంచి దీనిలో 2 కిలొల సూపర్ ఫాస్ఫేట్ ను వేయవలెను. ఆ తరువాత 5 కిలోల కల్చర్ ను సమంగా చల్లుకావలెను. చీడపీడలు. 10 సెం.మి. నీటిమట్టం ఎల్లప్పుడూ ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. 15 రోజులలో మనకు మందమైన నాచుపోర ఈ నీటి పై ఏర్పడుతుంది. ఆ సమయంలో నీటిని పూర్తిగా తీసివేసి మడులను ఎందబట్టాలి. ఎండిన నాచు పెచ్చులు మాదిరిగా తిసినచో ఒక్కొక్క మడి నుండి 30-40 కిలోలు లభ్యమగును.

 • అజోల్లో : ఈ జీవన ఎరువు నీటిపై తేలియాడుతూ వరి పొలంలో పెరిగే ఫెర్న్ జాతి మొక్క. ఈ ఫెర్న్ మొక్కల ఆకులు అనాబినా అనే సైనోబాక్టీరియా కు ఆశ్రయం కల్పించి నత్రజనిని స్ధిరీకరించి వరి పైరుకు నత్రజనిని అందుబాటు లోకి తెస్తాయి. ఈ జీవన ఎరువు ఒక నాత్రజనిని మాత్రమే గాక, సేంద్రియ కర్బనం మరియు పొటాషియంను కూడా వరి పైరుకు అందించును. ఇది భూమి యొక్క భౌతిక గుణాలను, భూసారాన్ని పెంపొందించును. ఈ జీవన ఎరువు బాగా పెరగడానికి తక్కువ ఉష్ణోగ్రత, తగినంత నీరు, భాస్వరపు పోషకం సహాయపడుతాయి.
 • వాడే విధానం : వరి నాటిన వారం రోజుల తర్వాత సుమారు 200 కిలోల అజోల్లా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15 నుండి 20 రోజులు నీటి పై బాగా పెరగనివ్వాలి. తర్వాత నీటిని తొలగించినచో ఇది 3-4 రోజులలో కుళ్ళపోయి నత్రజనిని మరియు ఇతర పోషకాలను మొక్కలను అందిస్తుంది. అవకాశమున్న రైతులు దీనిని పచ్చిరొట్ట ఎరువుగా పెంచి దమ్ములో కలియదున్నినచో దీని ఉపయోగం మరింత బాగా ఉంటుంది. అంతేగాక చిన్న తొట్టెలలో పెంచిన అజోల్లోను బయటకు తీసి ఎండబెట్టి పొడిగా చేసి పశువుల దాణాలో కలపడం వల్ల పశువులలో పాలఉత్పత్తి కూడా పెరుగతుంది.

భాస్వరం ను కరిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవులు

ఈ రకపు సూక్ష్మజీవులు నేలలో వేయటం వల్ల భూమిలో ఎంజైములను, రకరకాల ఆమ్లాలను ఉత్పత్తి చేసి నేలలో ఉండి కూడా కరగని భాస్వరాన్ని కరిగించి మొక్కల వేర్లు తీసుకునేలా దోహదం చేస్తాయి. అంతే కాకుండా సుక్ష్మపోషకాలతో కలిసి వున్న భాస్వరాన్ని విడుదల చేసి మొక్కలకు అందిస్తాయి. ఉదా : బాసిల్లస్, పెన్సిలియమ్ భాస్వరం కరిగించడంలో తోడ్పడుతాయి.

పంటలు

భాస్వరం కరిగించే జీవన ఎరువులను అన్ని రకాల పంటలలో వాడి లాభాలను పొందవచ్చు. ఈ ఎరువుల వాడటం వలన 25 కిలోల భాస్వరం ప్రతి హెక్టారుకు అందించవచ్చు.

మైకోరైజా శిలీంద్రం : ఈ రకమైన జీవన ఎరువులలో వెసిక్యులర్ అర్బస్కూలార్ మైకోరైజా (వ్యామ్) అనే శిలీంధ్ర సముదాయం ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ జీవన ఎరువులలో ఉండే శిలీంద్రాలు వేరును ఆశించి వేరు మధ్య భాగంలోకి చొచ్చుకొని నివసిస్తుంటాయి. దీనివల్ల మొక్కలకు కావాల్సిన భాస్వరం సులువుగా అందుతుంది. ఈ శిలీంధ్రం మొక్కల వేర్లతో సాంగత్యము చేస్తూ భాస్వరంను మొక్కలకు అందిస్తుంది. మొక్కల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ శిలీంద్రాలు భాస్వరాన్ని అందజేయడమే కాకుండా ఇతర సూక్ష్మ ధాతువులైన జింకు, బోరాన్, ఇరాన్ లను మొక్కలకు అందిస్తాయి. వ్యామ్ ఇతర సూక్ష్మజీవులతో కలిసి ఇంకా మెరుగుగా వాటి పనితనాన్ని పెంపోదించగల్గుతాయి. అంతేకాకుండా ఈ జీవన ఎరువులు కొన్ని ఎక్కువ ఉష్ణోగ్రత, దీర్ఘకాలిక నీటిఎద్దడి ఉన్న పరిస్దితులలో కూడా మొక్కల యొక్క ఎదుగుదల తగ్గిపోకుండా తట్టుకోని ఉండేటట్లు చేయగల సామర్ధ్యం గలవి మరియు నేలలో ఉండే వ్యాధికారక శిలింద్రాల యొక్క పెరుగుదలను అధిగామిస్తాయి. మనదేశంలో వ్యామ్ శిలింద్రా జాతులైన గ్లోమస్, ఎండోగాన్ అకలోస్పోరాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ శిలీంద్రాలను అన్ని రకాల నేలల్లో మరియు అన్ని పంటలలో వాడుకొని సత్ఫలితాలను పొందవచ్చును.

ఈ శిలింధ్ర జీవన ఎరువులను వాడు పధ్ధతి :

విత్తనాలకు పట్టించడం/విత్తనశుద్ది :ఈ శిలింద్రాల మిశ్రమాన్ని విత్తనాలకు పొరగా పట్టించి, ఆరబెట్టి విత్తుకోనవచ్చు.

వ్యామ్ గుళికలు : ఈ శిలింధ్ర మిశ్రమాన్ని పిట్ తో కలిపి ఉండలుగా చేసి విత్తనాన్ని కూడా అందులో వుంచి విత్తుకోవలెను.

మట్టిలో వేయడం: 2 కిలోల శిలీంద్రాన్ని 200 కిలోల బాగా మాగిన పశువుల ఎరువు/ వానపాములు ఎరువుతో కలిపి విత్తుకునే ముందు పొలంలో చల్లుకోవలెను లేదా నాటిన తరువాత బోదేలలో వేసుకోవాలి. ఈ శిలీంధ్రాన్ని వేసేటప్పుడు భూమిలో తేమ తప్పకుండా ఉండాలి.

ముఖ్యంగా 15 కిలోల మైకోరైజా శిలీంద్ర మిశ్రమం ఒక హెక్టారు పొలానికి అవసరమవుతుంది.

పోటాషియంను మొక్కలకు అందించేవి

ఈ రకమైన జీవన ఎరువులు వాడటం వల్ల నేలలోని పోటాషియం మొక్కలకు తేలికగా అందుతుంది. నేలలో కరగనటువంటి/కరగలేని పొటాఫ్ పదార్దాలు కరిగిపోయి మొక్కల వేర్లకు అందుతాయి. ఈ జీవన ఎరువులలో ఉండేటటువంటి పోటాష్ మొబిలైజింగ్ సూక్ష్మజీవులు విడుదల చేసే రసాయనాలు, ఎంజైమ్ ల వలన ఈ ప్రక్రియ జరుగుతుంది. బాసిల్లస్ జాతి సుక్ష్మజీవులను పోటాషియం కరిగించే వాటిగా వాడుకోవచ్చు. సాధారణంగా బాసిల్లస్ జాతి బాక్టీరియా సూక్ష్మజీవులు పోటాషియం పదార్దాలను కరిగించే శక్తి కలిగి ఉంటాయి.

పంటలు : ఈ జీవన ఎరువులు అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చును.

జింక్ ను కరిగించే సూక్ష్మజీవులు

ఈ రకమైన జీవన ఎరువులను వాడుట వల్ల నేలలో ఉండి, మొక్కలకు లభ్యం గాని జింక్ మూలకాలు మొక్కలను అందుతాయి. ఈ బాక్టీరియాకు జింక్ ను కరిగించే క్రియాశీలత కలదు. ముఖ్యంగా బాసిల్లస్ జాతి సూక్ష్మజీవులను (బాక్టీరియా) ఈ జీవన ఎరువులుగా ఉపయోగిస్తారు.

పంటలు : ఈ జీవన ఎరువులను అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చును.

సేంద్రియ పదార్దాలను విచ్ఛిన్నం చేసే జీవన ఎరువులు

ఈ జీవన ఎరువులు సెల్యులోజ్ మరియు లిగ్నిన్ పదార్దాలను (మొక్కల యొక్క వ్యర్ధపదార్ధాలు) కుళ్ళింపజేయుటకు వాడుతారు. జీవన ఎరువులను వాడి పంటకోత తర్వాత మిగిలిన పదార్దాలను కుళ్ళింపజేసి నేల సాంద్రతను పెంపొందించి మొక్కలకు కావలసిన పోషకాలను అందచేయవచ్చును.

వేరు మండలంలో ఉండి మొక్క పెరుగుదలకు దోహదం చేసే వేరు బాక్టీరియా (పిజిపిఆర్)

కొన్ని రకాల సుక్ష్మజీవులు వేరు మడలంలో నివసిస్తూ మొక్కల పెరుగుదలకు క్రియాత్మకంగా పాటుపడుతూ ఉండే బాక్టీరియా జాతి సూక్ష్మజీవులు “ప్లాంట్ గ్రోత్ ప్రమొటింగ్ రైజో బాక్టీరియా” అంటారు. ప్రస్తుతము పిజిపిఅర్ బాక్టీరియా సుడోమోనాస్, బాసిల్లన్, అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లమ్, రాజోబియం జాతులకు చెందిన సూక్ష్మజీవులు ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. పిజిపిఆర్ ప్రత్యెక పనితీరుతో మొక్కలకు అవసరమైన నత్రజని, భాస్వరము, జింక్, పోటాష్ యం పోషక మూలకాలను కరిగించి వేళ్ళకు అందించే సామర్ధ్యము గలవి. అంతేకాకుండా మొక్కలు ఏపుగా పెరగడానికి కావాల్సిన మొక్కల పెరుగుదల హర్మోన్లను స్రవించి వేరు మరియు మొక్క పెరుగుదలకు తోడ్పడతాయి. పిజిపిఅర్ పరోక్షంగా హైడ్రోజాన్ సయనైడ్ వేరు నశించే శిలింద్రాలను నశింపజేస్తాయి. కొన్ని పిజిపిఅర్ సూక్ష్మజీవులు యాంటి బయాటిక్స్ ను స్రవించి వ్యాధికారక సూక్ష్మజీవులు మొక్కలతో వాటి సహజీవనాన్ని ప్రోత్సహించడం తెగులు కారక జీవులు విడుదల చేసే విష పదార్దాల తయారిని అడ్డుకోవడం వంటి అనేక రకాల క్రియా విధానాల యొక్క పెరుగుదలకు దోహదపడతాయి.

జీవన ఎరువులను వాడుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
 • మంచి నాణ్యత గల జీవన ఎరువుల ప్యాకెట్/బాటిల్ ను కొనడం అనేది చాలా ముఖ్యమైన విషయం (నాణ్యత గల జీవన ఎరువులో 107-108 బ్రతికి వున్న సూక్ష్మజీవులు తప్పకుండ ఉండాలి).
 • జీవన ఎరువుల ప్యాకెట్ ను కొనుగోలు చేసేటప్పుడు బి.ఐ.ఎస్ / ఐ. ఎస్. ఐ మార్కు కలిగి వున్న వాటినే కొనుగోలు చేయవలెను. అంటే కాకుండా వాటి తయారు తేదిని మరియు గడుపు తేదిని జాగ్రత్తగా గమనించి కాలపరిమితి చూసి కొనవలెను. కాలపరిమితి అయిపాయిన జీవన ఎరువులను వాడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.
 • రైజోబియం జీవన ఎరువులను కేవలం పప్పుజాతి పంటలైన పప్పు దినుసులు, నూనె గింజల పంటలలో వాటి ప్రత్యెకతను బట్టి వాడుకోనవలెను.
 • అజటోబ్యాక్టర్ / అజోస్పైరిల్లమ్ జీవన ఎరువులను చిరుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యాన పంటలలో వాడి లాభాలను పొందవచ్చును.
 • భాస్వరం, పోటాష్, జింక్ సంబంధిత జీవన ఎరువులు అన్ని రకాల పంటలో వాడుకొనవచ్చును.
 • జీవన ఎరువును రసాయనిక ఎరువులు/పురుగుల మందులలో కలిపి నిల్వ చేయడం గాని, వాడటం గాని ఎప్పటికి చేయకూడదు.
 • జీవన ఎరువులను వాడేటప్పుడు నేలలో తగిన తేమశాతం ఉండేటట్లు జాగ్రత్తపడాలి.
 • పొలంలో జీవన ఎరువులు వాడిన తరువాత ఒక వారం రోజుల వ్యవధిలో రసాయనిక ఎరువులు వాడవలెను.
 • ఉదయం / సాయంత్రం నీడ వున్న సమయాలలో జీవన ఎరువులు వాడటం మంచిది.
 • జీవన ఎరువులను వాడేటప్పుడు లేదా మొదటిసారిగా వినియోగించేటపుడు సంబంధిత శాస్త్రవేత్తలను గాని/వ్యవసాయ అధికారులను గాని సంప్రదించి వారి సలహా మేరకు వాడుకోవడం మంచిది.
 • జీవన ఎరువులతో విత్తనశుద్ధి చేసేటప్పుడు ముందుగా శీలీంధ్ర నాశిని తరువాత పురుగు మందును ఆ తరువాత మాత్రమే జీవన ఎరువులను పట్టించి, నీడలో ఒక గంట అరబెట్టిన తరువాత మాత్రమే విత్తనం విత్తుకోవాలి.
జీవన ఎరువులు వాడుకునే పద్ధతులు :

ముఖ్యంగా జీవన ఎరువులను నాలుగు పద్ధతులలో ఉపయోగించవచ్చును. 1. విత్తనశుద్ధి 2. నారును ముంచే పధ్ధతి 3. నేల ద్వారా / భూమిలో చల్లుట 4. డ్రిప్ పద్ధతిలో

1. విత్తనశుద్ధి చేయుట : ముఖ్యంగా వరి విత్తనాలు, గోధుమ, జొన్న, మొక్కజొన్న, మిరప మరియు నూనెగింజల పంటలైన వేరుశనగ, కుసుమ, ప్రొద్దుతిరుగుడు, పప్పుదినుసు పంటలైన అలసంద, పెసర, మినుము, సోయాచిక్కుడు మొదలైన పంటలలో జీవన ఎరువులను విత్తనశుద్ధి ద్వారా భూమిలో వేయవచ్చును. 200 గ్రా. జీవన ఎరువు ప్యాకెట్ ను 10 కిలోల విత్తనానికి పట్టించుకోవచ్చు. విత్తనానికి పట్టించిన తరువాత ఒక గంట నీడలో ఆరబెట్టే విత్తుకోవాలి.

పద్ధతి :

 • ఒక ఎకరానికి సరిపడా విత్తనాన్ని తీసుకుని కుప్పగా చేసుకోవలెను (శుభ్రమైన సిమెంట్ నేల లేదా జనపనార బస్తా సంచిని ఉపయోగించవలెను).
 • ఒక ప్యాకెట్ జీవన ఎరువును (200 గ్రా.) బెల్లం ద్రావణం (100 మి. లీ. నీటిలో 10 గ్రా. బెల్లంతో కలిపి కాచి జిగురు వచ్చిన తరువాత వాడవలెను లేదా గంజింతో కలుపవలెను.)
 • ఈ కలిపిన ద్రావకమును కుప్పగా వేసిన విత్తనాల పై చిలకరించావలెను. చిలకరించిన తరువాత బాగా చేతులతో కలిపి విత్తనం పైన పొరలా ఏర్పడేలాగా చేయవలెను.

2. నారును ముంచి వాడే పద్ధతి / నారుమడి పంటలలో : ఈ విధానాన్ని ముఖ్యంగా వరి, పొగాకు, టమాట, మిరప, ఉల్లి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలలో వాడవచ్చును.

వాడే పధ్ధతి :

 • ఒక కిలో జీవన ఎరువు తీసుకుని 10 నుంచి 15 లీటర్ల నీటితో బాగా కలుపుకోవలెను.
 • ఒక ఎకరాకు అవసరమైన నారును తీసుకోని కట్టలుగా కట్టుకోవలెను.
 • నారును (ముఖ్యంగా వేర్ల భాగాలు) మునిగేలా 15-30 నిమిషాలు జీవన ఎరువుల ద్రావణ మిశ్రమంలో ఉంచవలెను.
 • 1:10 నిష్పత్తి ప్రకారం జీవన ఎరువుల మిశ్రమం ప్యాకెట్ 10 లీటర్ల నీటిలో వేసుకోవలెను
 • కూరగాయ పంటలైన మిరప, టమాట, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలలో ఒక ప్యాకెట్ 0.1 హెక్టారుకు సరిపోతుంది.

3. నేల ద్వారా / భూమిలో చల్లుట ద్వారా :

ఈ పద్ధతి పంటను బట్టి, పంట కాలాన్ని బట్టి మారుతూ వుంటుంది. తక్కువ కాల వ్యవధి పంటలలో 1 నుంచి 1.5 కిలోల జీవన ఎరువును 40-60 కిలోల బాగా కుళ్ళిన పశువుల ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలానికి వాడుకొనవచ్చును. ఎక్కువ కాల వ్యవధి ఉన్న పంటలలో 2-3 కిలోల ప్యాకెట్ జీవన ఎరువును 80-120 కిలోల ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో వాడవచ్చును. ఈ మిశ్రమాన్ని విత్తుకునే సమయంలో లేదా పంట నాటిన తర్వాత నేలలో వేసి నీటి తడి ఎంచుకోవచ్చును లేదా దుక్కిలో వేసుకోవచ్చును లేదా ముందుగా పొలంలో చల్లుకోవచ్చును.

పండ్ల తోటలలో : ప్రూనింగ్ (ఆకులు కత్తిరించిన చెట్లు) చేసిన చెట్ల వేర్ల దగ్గర మట్టిని పాదులుగా చేసి (వేర్లను గాయపరచకుండా) జీవన ఎరువు మరియు కుళ్ళిన ఎరువుల మిశ్రమాన్ని వేసుకొని నీటిని పెట్టుకుంటే సరిపోతుంది.

4. డ్రిప్ పద్ధతిలో : సుమారు 300 మి. లీ. నీటిలో 500 మి. లీ. జీవన ఎరువును తీసుకుని డ్రిప్ ట్యాంకులో కలిపి మొక్కలు నాటిన వారం రోజులలో డ్రిప్ లైన్ల ద్వారా మొక్కలకు వేసుకోవలెను.

రసాయనిక మందుల ప్రభావాన్ని తట్టుకుని నేలలో ఉండే సూక్ష్మజీవులు

ముఖ్యంగా కొన్ని రకాల బాక్టీరియా, శిలీంద్రాలు నేలలో నివసిస్తూ మొక్కల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా భూమిలో వేసిన విషపూరితమైన రసాయన పురుగు మందులు, కలుపు మందుల ప్రభావం నుండి కాపాడి చివరకు

సుక్ష్మకివులు ఆహారంగా వినియోగించుకొని భూమిలో వాటి సంఖ్యను పెంచుకుంటాయి. ఈ సుక్ష్మజివుల కు వ్యవసాయదారులు ఎక్కువగా ఉపయోగించిన రసాయనిక పురుగు మందులు, శిలింధ్ర నాశినులను నశింపజేసే వీటిలో ముఖ్యమైనవి సుడోమోనాస్, బాసిల్లస్, పెనీ బాసిల్లస్, బ్రూకల్ట్రియా, అస్పర్జిల్లన్ మొదలుగునవి ప్రాచుర్యం పొందినవి. ఈ జీవన ఎరువులు రసాయనిక మందులను కరిగించి, విషరహితముగా చేయడంతో పాటు మొక్కల పెరుగుదలకు తోడ్పడే పోశాకలుగా మార్చుతాయి.

నేలలో ఉన్న ఆమ్ల క్షార ఉదజని లక్షణాన్ని బట్టి వాడుకునే జీవన ఎరువులు

కొన్ని రకాల జీవన ఎరువులు ఆమ్ల క్షార లవణాలు ఎక్కువగా ఉన్నటువంటి నేలలో కూడా నివసిస్తూ మొక్కల పెరుగుదలకు తోడ్పడుతాయి. ఈ రకపు జీవన ఎరువులు వాతావరణంలో వచ్చే మార్పులైన అధిక ఉష్ణోగ్రతలు అధిక తేమ పరిస్దితులలలో కూడా నివసిస్తూ మొక్కల పెరుగుదలకు తోడ్పడుతాయి. ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు వేరును శించి (వేరు మండలపు) మొక్కల పెరుగుదలకు తోడ్పడే బాక్టీరియా (పిజిపిఆర్) వేరు మండలంలో నివశించి మొక్క పెరుగుదలకు తోడ్పడే బాక్టీరియా కూడా అధిక ఉష్నోగ్రత అధిక ఉదజని సూచిక, విషపూరిత లోహాలను మరియు ఉప్పు అధికంగా ఉండే నేలలను తట్టుకొని ఉంటూ మొక్కల పెరుగుదలకు దోహదం చేస్తాయి అని నిరూపించారు. సూడోమోనాస్ బాసిల్లస్, పేని బాసిల్లస్ వంటి బాక్టీరియాలకు ఈ ప్రాముఖ్యత కలదు. ఈ బాక్టీరియా మొక్కలకు దైహక వ్యాధి నిరోధక శక్తిని (ఇండ్యుస్ సిస్టమిక్ రెసిస్టెన్స్ ను) బలోపేతం చేస్తూ అకాల వాతావరణ పరిస్దితులను అధిగమించి మొక్కల పెరుగుదలకు దోహదం చేస్తూ అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం కల్గిస్తుంది.

ఉదాహరణ :

అధిక అమ్లతత్వం వున్న నేలలు – బైజరింకియా, రైజోబియం అజటోబ్యాక్టర్ నత్రజని స్దిరీకరిణకు ఉపయోగిస్తారు.

అధిక క్షారగుణం కలిగిన నేలలో రైజోబియం, సూడోమోనస్, బాసిల్లస్ ను వాడుకోవచ్చు.

ద్రవరూప జీవన ఎరువులు

ఈ రకమైన జీవన ఎరువులు ద్రవరూపంలో ఉండును. సాధారణంగా వాడే పొడి రూపంలో ఉండే జీవన ఎరువులు కేవలం 6 నెలల వరకు మాత్రమే బాగా పనిచేయగలవు. అందుకే వీటి వినియోగం ప్రస్తుతం వినియోగంలో తక్కువగా ఉంది. ఆరునెలల తర్వాత ఈ పొడి రూపంలో ఉండే జీవన ఎరువులు వాడితే పంటలలో లాభాలు/దిగుబడులు సాధించడం కష్టము అవుతుంది. రైతులు వీటిని గురించి తెలుసుకోవడం, కొనుగోలు చేయడం, వాటిని వేసుకోవడం ఆలస్యమైతే వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆరునెలలు దాటితే వీటిలో ఉండే సూక్ష్మజీవులు చనిపోవడం జరుగుతుంది. కావున శాస్త్రవేతలు వీటికి బదులుగా ద్రవరూప జీవన ఎరువులు తయారుచేయడం జరిగినది. ఈ జీవన ఎరువులు ద్రవ రూపంలో ఉండి, వాటిలో కలిపే పదార్ధాలు సుక్ష్మజివుల పెరుగుదలకు తోడ్పడి, వాటి జివనకాలాన్ని పెంచుతాయి. అందుకే ఈ ద్రవరూప జీవన ఎరువులు సంవత్సరము నుండి రెండు సంవత్సరముల వరకు బాగా పనిచేస్తాయి. కాబట్టి వీటి వాడకం కూడా పొడి రూపంలో ఉండే జీవన ఎరువుల కంటే సులభతరం వీటిని రవాణా చేసుకోవడము కూడా పొడి జీవన ఎరువుల కంటే సులభతరము. ద్రవరూప జీవన ఎరువులను స్పై చేసుకోవచ్చు లేదా డ్రిప్ పద్ధతిలో కొన్ని పంటలలో వాడుట. ఈ మధ్యకాలంలో ప్రాముఖ్యతను సంతరించుకొని పంట అధిక దిగుబడులను సాధించడం జరిగినది. ఈ ద్రవ రూప జీవన ఎరువులను విత్తనశుద్ధి నారును ముంచడం, నేలలో వేసుకోవడం, స్ప్రే చేయడం, డ్రిప్ పద్ధతిలో వాడి దిగుబడులు సాధించవచ్చు.

ద్రవరూప జీవన ఎరువుల వలన లాభాలు

 • ఎక్కువ కాలము అనగా ఒక సంవత్సరము (365 రోజులు) నిల్వ ఉండును.
 • సీసాపై నమోదు చేయబడిన గడువు తేది వరకు అధిక సంఖ్యలో బాక్టీరియా ఉండును.
 • ఇతర బాక్టీరియాలతో కలుషితము అయి ఉడదు.
 • తేలికగా ఎక్కువ భూమి విస్తీర్ణమునకు తక్కువ సమయంలో ఉపయోగించవచ్చు.
 • ఈ ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులు వాడుట వలన మొక్క అధిక ఉష్ణోగ్రతలు మరియు ఇతర వాతావరణ ఒడిదుడుకులను తట్టుకొనే శక్తిని కల్గి ఉంటుంది.
 • తేలికగా పంట యొక్క వేర్ల చుట్టూ ఉన్న వాతావరణములో సమన్వయ సంబంధము ఏర్పరుచుకొని అధిక సంఖ్యలో పెరుగుతుంది.
 • పంట పెరుగుదల మరియు ఉత్పత్తి అధికముగా ఉండును.
 • సేంద్రియ వ్యవసాయంలో భాగంగా పంటకు కావలసిన పోషకములను సమకూర్చడంలో ఈ ద్రవరూప జీవన ఎరువులు ప్రధాన పాత్ర వహించును.
 • భూమిలో ఉండే ఇతర బాక్టీరియా ప్రభావాన్ని తట్టుకొని జీవించి ఉంటాయి.
 • వాడే మోతాదు కూడా పదిరెట్లు పొడి రూపంలో ఉండే వాటి కంటే తక్కువగా వేసి అధిక దిగుబడులు పొందవచ్చును.
 • ఈ జీవన ఎరువులు వాడుట వల్ల నేలలోని ఎంజైములు క్రియాశీలత పెరిగి నేల సాద్రతను పెంచుతాయి.
 • వీటిని నిల్వ ఉంచుకోవడం కూడా సులభతరం. ఉఫ్ణోగ్రతలు 450 సెల్సియస్ దాటినప్పటికీ వీటిలో ఉండే సూక్ష్మజీవులు చనిపోవడం జరగదు.

జీవన ఎరువుల ప్రయోగశాలలు – లభించే జీవన ఎరువులు

క్రం. సంప్రయోగాశాల / సంస్థఉత్పత్తి చేయు జీవన ఎరువులుప్యాకెట్ మొతాదు / పరిమాణంఖరీదు (రూ. )
1. జీవన ఎరువుల ఉత్పత్తి కేంద్రం, వ్యవసాయ సూక్ష్మజీవ శాస్రం, వ్యవసాయ కళాశాల, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాంజేద్రనగర్, హైదరాబాద్. ఇచ్చట పొడి రూపంలో ఉన్న జీవన ఎరువులు లభ్యమవుతాయి. రైజోబియం, అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లమ్, పి.యస్.బి. జన్.యన్.బి, కెఆర్.బి 500 గ్రా. 50.00
2. జీవన ఎరువు ఉత్పత్తి ప్రయోగాశాల, వ్యవసాయ పరిశోధన స్థానం, అమరావతి, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ ఈ ప్రయోగాశాలలో డి రూప మరియు ద్రవ రూపంలో ఉండే జీవన ఎరువులు లభ్యమవుతాయి. ద్రవరూప జీవన ఎరువులు రైజోబియం, అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లమ్, పి.యస్.బి. 500 మి. లీ 150.00
పొడి రూపంలో ఉండే జీవన ఎరువు రైజోబియం, అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లమ్, పి.యస్.బి., మైకోరైజా జీవన ఎరువులు 500 గ్రా. 4.00
3. జీవన ఎరువుల విభాగం అగ్రిబయోటిక్ ఫౌండేషన్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాంజేద్రనగర్, హైదరాబాద్. పొడి రూపంలో ఉండే జీవన ఎరువు రైజోబియం, అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లమ్, పి.యస్.బి., మైకోరైజా జీవన ఎరువులు 500 గ్రా. 40.00
4. జీవన ఎరువుల ప్రయోగాశాల, వ్యవసాయ పరిశోధన స్థానం, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాంజేద్రనగర్, హైదరాబాద్. ఇచ్చట పొడి రూపంలో ఉన్న జీవన ఎరువులు లభ్యమవుతాయి. రైజోబియం, అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లమ్, పి.యస్.బి. 500 గ్రా. 40.00

వివిధ రకాల జీవన ఎరువులు ఉపయోగించే పద్దతులు

క్ర. సంజీవన ఎరువులుపంటలుఉపయోగించే పద్దతి
1. రైజోబియం అన్ని రకముల పప్పుజాతి పంటలు మరియు కొన్ని నూనెజాతి పంటలలో వేసుకోవచ్చు విత్తనశుద్ది, నేలలో వేసుకోవడం
2. అజోస్పైరిల్లమ్ జొన్న, మొక్కజొన్న, వరి, గోధుమ, తృణధాన్యాలు, గడ్డిజాతి మొక్కలు, ప్రత్తి, మిరప, చెఱకు, అరటి, పసుపు, ద్రాక్ష మరియు అన్ని రకముల కూరగాయలు మరియు పండ్ల తోటలు విత్తనశుద్ది, నారు ముంచడం, నేలలో వేసుకోవడం
3 అజటోబ్యాక్టర్ వరి, ప్రత్తి, చెఱకు, జొన్నలు, మొక్కజొన్న, పూలతోటలు, అన్ని రకముల కూరగాయలు మరియు పండ్ల తోటలలో వేసుకోవచ్చు. విత్తనశుద్ది, నారు ముంచడం, నేలలో వేసుకోవడం
4. పి.యస్.బి (ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్) అన్ని రకాల పంటలు విత్తనశుద్ది, నారు ముంచడం, నేలలో వేసుకోవడం
5. మైకోరైజా శీలీంధ్ర జీవన ఎరువులు అన్ని రకాల పంటలు విత్తనశుద్ది, నేలలో వేసుకోవడం
6. పొటాషియం విడుదల చేసే బాక్టీరియా అన్ని రకాల పంటలు విత్తనశుద్ది, నేలలో వేసుకోవడం
7. జింక్ కరిగించేవి అన్ని రకాల పంటలు విత్తనశుద్ది, నేలలో వేసుకోవడం

ఆధారం : వ్యవసాయ పంచాంగం

3.01023890785
ఏలూరి.శ్రీనివాస్ Aug 25, 2019 12:12 AM

చాలా బాగుంది.జీవన ఎరువులు మదర్ కల్చర్ ఎక్కడ లబిస్తాయి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు