పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జీవన ఎరువులు రకాలు – వాటి ఉపయోగాలు

జీవన ఎరువుల ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

జీవన ఎరువుల వాడకం నానాటికి పెరుగుతూనే ఉంది, ఎందుకంటే అవి కలిగించే లాభాలు, కనీస ఖర్చులే వీటికి కారణం అని చెప్పవచ్చు.

నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులు

ఈ సూక్ష్మజీవులు గాలిలో గల 78 శాతం నత్రజనిని గ్రహించి నేలలో మొక్కలకు అందుబాటులో ఉండే నత్రజనిగా మారుస్తాయి. తద్వారా మొక్కల దిగుబడి, నాణ్యతా లక్షణాలను మీరు గ్రహించగలరు. ఈ రకపు సూక్ష్మజీవులు కేవలం నత్రజనినే కాక మొక్క పెరుగుదలకు అవసరమైన ఆక్సిన్స్, జీబ్బరిల్లిన్స్, సెడరోఫోక్స్, ఎసిసి డిఎమైనేజ్ వంటి ఆవశ్యక ఎంజైమ్లను మొక్కలకు అందిస్తున్నాయి. వీటి వలన మొక్కలు క్రిమి కారక సూక్ష్మజీవుల నుండి రక్షణ పొందడానికి గల శక్తిని పొందుతున్నాయి.

ఈ సూక్ష్మజీవులను నేలలో వేయడం వల్ల ఎటువంటి హానికారక ప్రయోజనాలు ఉండవు, నత్రజనిని స్థిరీకరించడానికి వివిధ రకాల పంటలకు వివిధ రకాల జీవన ఎరువులు ఉన్నాయి. ఒక పంటకు వినియోగించాల్సిన జీవన ఎరువులను మరొక పంటకు వాడవద్దని రైతులకు మనవి. అలా వాడటం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు.

రైజోబియం:

ఈ జాతి సూక్ష్మజీవులను మొదటగా పప్పుజాతి దినుసులో గుర్తించారు. వీటికి వేరు బుడిపెలు కలుగచేసి అందులో నత్రజనిని స్థిరీకరించగల శక్తి గలదు, హార్మోన్లు, విటమిన్లు, ఎంజైమ్లు విడుదల చేస్తాయి. తద్వారా వేర్లు మొక్క పెరుగుదలకు, మొక్క ఎదుగుదలకు తోడ్పడతాయి.

పంటలు: ప్రధానంగా పప్పుదినుసులలో వాడుకోవాలి. పప్పుదినుసులైనటువంటి కంది, మినుము, పెసర, సోయాచిక్కుడు, వేరుశనగ, చిక్కుడు ఇలా వివిధ పంటలలో వాడుకోవచ్చు.

అజొల్లా:

ఇది ఒక నాచు రకం. దీనిని అజొల్లా పిన్నేటా అని శాస్త్రీయంగా సంభోదిస్తారు. దీనికి గల సంచులలో అనాబినా అజొల్లా అనే సూక్ష్మజీవికి ఆవాసాన్ని కలిపిస్తుంది. ఈ సూక్ష్మజీవి గాలిలోని నత్రజనిని గ్రహించి మొక్కలు సంగ్రహించగలిగిన రీతిలో నత్రజనిని మారుస్తాయి. తరువాత ఆ నత్రజని మొక్కలు గ్రహించి వాటి పెరుగుదలకు, పోషణకు ఉపయోగించుకుంటాయి. ఈ అజొల్లా వల్ల కలుపు మొక్కల పెరుగుదలను నివారించవచ్చు. కానీ వీటి పెరుగుదలకు నీరు అవసరం కనుక వరి వంటి పంటలలో మాత్రమే వినియోగించుకోగలం. అజోల్లాను కోళ్ళకు, పశువులకు దాణాగా ఉపయోగించవచ్చు.

అజటోబ్యాక్టర్:

ఈ రకపు సూక్ష్మజీవులు స్వేచ్ఛగా నివసిస్తాయి. వీటికి రైజోబియంలాగా ఎటువంటి పంటలు ప్రాధాన్యం లేదు. ఇవి మొక్కల వేర్ల దగ్గరలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ రకపు సూక్ష్మజీవులు నత్రజనిని మొక్కలకు అందించి తద్వారా మొక్కల పెరుగుదలకు దోహదపడతాయి. ఈ సూక్ష్మజీవులకు అధిక మొత్తంలో ఆక్సిన్స్ను ఉత్పత్తి చేసే లక్షణాలు ఉన్నాయి. ఆక్సిన్స్ వలన వేరు పెరుగుదల పెద్ద మొత్తంలో ఉంటుంది. తద్వారా మొక్కలు ఎక్కువ మొత్తంలో నీరు, ధాతువులు పీల్చుకోగలుగుతుంది. అదే విధంగా ఈ సూక్ష్మజీవులు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే విధంగా మొక్కలను పెంపొందిస్తాయి.

పంటలు: పండ్లు, కూరగాయలు, గోధుమ, వరి, పొద్దుతిరుగుడు లాంటి పంటలకు వాడుకోవచ్చు.

అజోస్పైరిల్లం:

ఇవి మొక్కకు అతి సమీపంలో పెరుగుతుంటాయి. ఇవి స్వేచ్ఛగా నివసించే బ్యాక్టీరియా, ఈ జీవులు సాధారణంగా భూమిలో ఉండే పోషకాలను వినియోగించుకొని గాలిలోని నత్రజనిని గ్రహించి అమ్మోనియం రూపంలో భూమిలో స్థిరీకరిస్తాయి. కొన్ని పంటలు అమ్మోనియాను వినియోగించుకోవడంలో ముందు ఉంటాయి. చెరకు, వరి వంటి పంటలు అమ్మోనియాను పీల్చుకొని పిండి పదార్థాలను తయారు చేసుకోవడం వినియోగించుకొంటాయి,

పంటలు: గోధుమ, చెరకు, వరి, జొన్న, మొక్కజొన్న, కూరగాయ పంటలకు వినియోగించవచ్చు.

భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులు

సహజంగా భాస్వరం భూమిలో సేంద్రియ, రసాయన రూపంలో నిల్వ ఉంటుంది. రసాయన రూపంలో ఉన్న భాస్వరాన్ని మొక్కలు వినియోగించుకోలేవు. రసాయన భాస్వరం భూమిలో స్థిరీకరించబడి ఉంటుంది. మొక్కలు ఈ రసాయనిక భాస్వరాన్ని కరిగించలేవు తద్వారా మొక్కకు అందవలసిన పోషణ తగ్గుతుంది. కానీ మొక్కకు దగ్గరలో గల పి.జి.పి. బ్యాక్టీరియాలు తగు రీతిలో మొక్క స్థితిని బట్టి వ్యవహరిస్తాయి. పి.జి.పిన్. బ్యాక్టీరియా అయినటువంటి బాసిల్లస్, సూడోమోనాస్, అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, స్థిరీకరించబడిన భాస్వరం పైన తమ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి. తద్వారా భాస్వరం కరిగి మొక్కకు దొరుకుతుంది. ఇవే కాక కొన్ని శిలీంధ్రాలు కూడా భాస్వరం పైన పనిచేయగలవు.

పంటలు: అన్ని రకాల పంటలలో వాడవచ్చు.

జింక్ ను కరిగించే సూక్ష్మజీవులు

జింక్ లోపం ప్రధాన పంటలలో, పప్పుదినుసులలో ఇంకా వివిధ రకాల పంటలలో గమనించవచ్చు. ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, గోధుమలలో ప్రధానంగా జింక్ లోపాన్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించారు. జింక్ సేంద్రియ ఎరువులలో తక్కువ మొత్తంలో ఉంటుంది. రసాయనిక ఎరువులలో అధిక శాతం ఉన్నప్పటికీ వాటి వాడకం వలన మిగిలిన ధాతువులు స్థిరీకరించబడతాయి. జింక్ భూమిలో తగినంత లేనందున పంటల దిగుబడిలో తగ్గుముఖం పడుతుంది. ఇటువంటి పరిస్థితులలో జింకను కరిగించే జీవులు ఆమ్లాన్ని విడుదల చేసి భూమిలో స్థిరీకరించబడిన జింక్ ధాతువును కరిగించి పంటలకు అందే విధంగా చేస్తాయి.

పంటలు: అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు.

పొటాషియంను కరిగించే జీవులు

అధిక శాతం పొటాషియం నేలలో స్థిరీకరిచబడి ఉంటుంది. అందువలన మొక్కలకు అందక తద్వారా వాటి పెరుగుదల పైన ప్రభావం చూపిస్తాయి. రసాయన ఎరువుల వాడకం వలన పొటాషియం మరింత నేలలో స్థిరీకరించబడుతుంది. అందువలన మొక్కలలో ఎదుగుదల తగ్గిపోతుంది. పొటాషియంను కరిగించే సూక్ష్మజీవులు ఆమ్లాన్ని విడుదల చేసి నేలలో స్థిరీకరించబడిన పొటాషియంను మొక్కలకు అందేలా చేస్తాయి. తద్వారా మొక్కలు ఏపుగా పెరుగుతాయి. పొటాషియం కేవలం పెరుగుదలలోనే కాక వ్యాధులు, కీటకాలు, వెుక్క భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తాయి.

పంటలు: అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు.

ఆధారం: యలపర్తి నాగరాజు, పి.ఎచ్.డి స్కాలర్, అగ్రికల్చర్ కాలేజి, రాయచూర్.

3.01704545455
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు