పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

తేనెటీగల పెంపకం

మానవునికి మేలుచేయు కీటకాలలో అతి ముఖ్యమైనవి తేనెటీగలు.

మానవునికి మేలుచేయు కీటకాలలో అతి ముఖ్యమైనవి తేనెటీగలు. వీటి నుండి తేనె మాత్రమే కాకుండ ఇతర ముఖ్యమైన ఉప ఉత్పత్తులు మైనము, పుప్పొడి, రాజాహరం, విషం మరియు ప్రాపోలిస్ లభ్యమౌవుతాయి. మధురమైన తేనె మానవునికి సమతులాహారాన్ని అందించటమే కాకుండ మిగిలిన ఉప ఉత్పత్తుల, ఇతర పరిశ్రమల (కాస్మెటిక్) స్థాపనకు కూడ ఉపయోగపడతాయి. అంతేకాకుండ పంటలలో పరపరాగ సంపర్కము అరిగి అధిక దిగుబడులు రావటానికి తేనెటీగలు ఉపయోగ పడతాయి.

తేనెటీగల జాతులు

తేనెటీగల్లో నాలుగు జాతులు ఉన్నాయి. అవి

 1. కొండతేనెటీగలు (ఎపిస్ డోర్సేటా)
 2. చిన్న/ విసనకర్ర తేనెటీగలు (ఎపిస్ ఫ్లోరియా)
 3. పుట్ట తేనెటీగలు, (ఎపిస్ సెరేనా ఇండికా)
 4. ఐరోపా తేనెటీగలు (ఎపిస్ మెల్లిఫెరా)

మొదటి రెండు రకాలు పెంచటానికి అనుకూల మైనవి కావు. చివరి రెండింటిని పెంచవచ్చు. తేనెటీగలు సంఘజీవులు. ప్రతి తేనెపట్టులో ఒక రాణి ఈగ, కొన్ని వందల పోతుటీగలు, కొన్నివేల కూలి ఈగలు కలిసి జీవిస్తాయి.

తేనెటీగల రకాలు - తేనెపట్టు నిర్వహణ

రాణి ఈగ

ఇది సంపూర్ణంగా వృద్ధి చెందిన ఆడ ఈగ. జీవిత కాలంలో ఒకే సారి గాలిలో పోతుటీగతో సంపర్కం జరుపుతుంది. అప్పడప్పడు తన జీవిత కాలమంతా సరిపడా మగ బీజ కణాలను గ్రహించి, బీజ కోశంలో నిలువచేసుకుంటుంది.

రాణి ఈగ ముఖ్య కర్తవ్యం గుడ్లు పెట్టడం. అభివృద్ధిలో కీలకపాత్ర వహించడం. రాణి ఈగ ఫలదీకరణం చెందని గుడ్లను పెట్టడం విశేషం. ఫలదీకరణం చెందిన గుడు కూలి ఈగలుగా, ఫలదీకరణం చెందని గుడ్లు పోతుటీగలుగాను వృద్ధి చెందుతాయి. రాణి ఈగ తన జీవితకాలమంత కూలి ఈగలు ఉత్పత్తి చేసే రాజాహరంతో బతుకుతుంది.

పోతు టీగలు

రాణి ఈగతో సంపర్కం చేయటం, పట్టులో ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించడం తప్ప, ఇతర పనులు చేయవు. జీవితకాలం 2-3 నెలలు.

కూలి ఈగలు

ఇవి సంపూర్ణంగా వృద్ధి చెందని ఆడ ఈగలు. పునరుత్పత్తి తప్ప తేనెపట్టులోని పనులన్ని ఇవే చేస్తాయి. ఆరు వారాలు జీవిస్తాయి. మొదటి మూడు వారాలు పట్టు లోపలి పనులు అనగా మైనపు గదులను శుభ్రపరచటం, పిల్ల పురుగులకు ఆహారాన్నందించటం, మైనపు గదులను నిర్మించటం తరువాత మూడు వారాలు పట్టు వెలుపలి పనులు అనగా శత్రువుల నుండి పట్టును రక్షించటం, పుప్పొడి, మకరందం, నీరు మరియు ప్రాపోలిస్ సేకరించే బాధ్యతలను నిర్వహిస్తాయి.

జీవిత చక్రం

తేనెటీగల జీవితంలో నాలుగు దశలుంటాయి. అవి గ్రుడ్డు, లద్దె పురుగు, కోశస్థదశ మరియు రెక్కల పరుగు / ఈగ దశ.

తేనెటీగలు వివిధ దశల్లో గడిపే సమయం (రోజుల్లో)

దశలు

రాణి ఈగ

కూలి ఈగ

పోతుటీగ

గ్రుడ్డు

3

3

3

లద్దె పురుగు

5

5 - 6

7

కోశస్థ దశ

7 - 8

11 – 12

14

ఈగ వెలువడటం

16 వ రోజు

21 వ రోజు

24 వ రోజు

తేనెటీగల పెంపకానికవసరమైన పరికరాలు

తేనెటీగల పెట్టె

ఇది తేనెటీగల గృహం. దీనిలోని భాగాలు

ఎ) అడుగుబల్ల : ఇది పెట్టె క్రింది భాగం. తేనెటీగలు పెరిగే అరక్రిందివైపు మూయటానికి ఉపయోగపడుతుంది. ఈగలు పెట్టె నుండి వెలుపలికి వెళ్లటానికి, లోపలికి రావటానికి అనువుగా దీని ముందు భాగంలో చిన్న ద్వారముంటుంది.

తేనెటీగలు పెరిగే అరకన్నా, ఇది 10 సెం.మీ. పొడవుగా ఉంటుంది. అందువలన పెట్టె లోపలికి గాని, వెలుపలికి గాని వెళ్ళే ముందు తేనెటీగలు కొద్దిసేపు ఆగటానికనువుగా ఉంటుంది. ద్వారం వైపు వాలు ఉండేటట్లు అమర్చాలి. అందువలన వర్షపు నీరు పెట్టే లోపలికి ప్రవేశించదు.

బి) తేనెటీగలు పెరిగే అర : ఇది నలువైపుల మూయబడి, క్రింది మరియు పై భాగం తెరవబడి ఉంటుంది. తేనెటీగలు పెరిగే చట్రాలు అమర్చటానికి వీలుగా ఉంటుంది. పట్ట తేనెటీగల పెట్టెలో 8 చట్రాలు, ఐరోపా తేనెటీగల పెట్టెలో 10 చట్రాలు అమర్చవచ్చు.

సి) తేనెటీగల చట్రాలు : ప్రతి చట్రంలో పైన ఒక బద్ద, పక్కన రెండు బద్దలు, క్రింద ఒక బద్ద ఉంటాయి. పై బద్ద క్రింది బద్ద కన్నా పొడవుగా ఉండి, తేనెటీగలు పెరిగే అరలో అమర్చినపుడు వేలాడటానికి అనువుగా ఉంటుంది.

తేనెటీగలు దీనిపై మైనంతో షడ్భుజాకారపు గదులు నిర్మిస్తాయి. అవి తేనెటీగల సంతానోత్పత్తికి, పుప్పొడి, తేనె నిల్వ చేయటానికి ఉపయోగపడతాయి.

డి) తేనె నిల్వచేసే అర : ఇది తేనెటీగలు పెరిగే అరను పోలి ఉంటుంది. తేనె చట్రాలు అమర్చటానికి అనువుగా ఉంటుంది. ఐరోపా తేనెటీగల పెట్టెలో తేనెటీగలు పెరిగే అర మరియు తేనె నిల్వ చేసే అర ఒకే పరిమాణంలో ఉంటాయి. కాని పుట్ట తేనెటీగల పెట్టెలో తేనె నిల్వ చేసే అర, ఈగలు పెరిగే అరకన్నా చిన్నది. మకరందం సమృద్ధిగా లభించే సమయంలో దీనిని తేనెటీగలు పెరిగే అర పై అమర్చాలి.

ఇ) తేనె చట్రం : ఇది తేనెటీగల చట్రాన్ని పోలి ఉంటుంది. దీని మధ్యలో మైనంతో షడ్భుజాకారపు గదులు నిర్మించి తేనెను నిల్వ చేస్తాయి.

ఎఫ్) లోపలి మూత : ఇది తేనెటీగలు పెరిగే అర / తేనె నిల్వచేసే అర పై భాగం మూయటానికి ఉపయోగపడుతుంది. మధ్యలో ఇనుపజల్లెడ అమర్చిన రంధ్రం గాలి ప్రసరణకు అనువుగా ఉంటుంది.

జి) పై మూత : ఇది తేనేపట్టును ఎండ, వాన, గాలి నుండి రక్షణ కల్పిస్తుంది. దీనికి రెండు వైపుల జల్లెడతో కప్పబడిన రంధ్రాలు గాలి ప్రసరణకుపయోగపడతాయి.

హెచ్) డమ్మీ బోర్డు : ఇది తేనెటీగల చట్రం పరిమాణంలో ఉంటుంది. పెట్టెలో చట్రాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు దీనిని అమర్చాలి. అందువలన పెట్టెలోని ఉష్ణోగ్రతను తేనెటీగలకనువుగా క్రమబద్దీకరించుకుంటాయి.

స్టాండు

దీనిపై తేనెటీగల పెట్టె అమర్చినపుడు, పెట్టె నలువైపులకు గాలి ప్రసరణ అనువుగా ఉంటుంది. పెట్టెలను వర్షపునీరు నుండి రక్షిస్తుంది.

రాణిని వేరు పరిచే జల్లెడ

ఇది తేనెటీగల పెరిగే అర నుండి రాణి ఈగ తేనె అరలోనికి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అందువలన రాణి ఈగ తేనె అరలో గుడ్లు పెట్టలేదు. కూలి ఈగలు మాత్రం ఒక అర నుండి రెండవ అరలోనికి తిరగటానికి అవకాశం ఉంటుంది.

పొగ డబ్బా

ఇది ఈగలపై పొగ బారించటానికి ఉపయోగపడుతుంది. అందువలన పెట్టెలోని ఈగల కరకుతనం తగ్గి, పరిశీలించటానికి అనువుగా ఉంటుంది.

ముసుగు

ఇది ముఖంపై తేనెటీగలు కుట్టకుండా ఉపయోగపడుతుంది.

చేతి తొడుగులు

ఇవి ఈగలు చేతులకు కుట్టకుండా ఉపయోగించవచ్చు.

ప్లాస్టిక్ డబ్బా

మకరందం లభించనప్పుడు, పంచదార పాకం ఈగలకు పట్టటానికి ఉపయోగపడుతుంది.

తేనె తీసే యంత్రం

తేనె చట్రంలో మైనపు అట్టలు చెడకుండా తేనె తీయటానికుపయోగపడుతుంది. ఐరోపా/ తేనెటీగల పుట్ట తేనెటీగల చట్రాలనుండి తేనె తీయటానికి వేరు వేరు పరిమాణాలు గల యంత్రం అవసరం.

గిన్నెలు

వీటినే యాంట్ వెల్స్ అని కూడా పిలుస్తారు. ఈ గిన్నెల్లో పరిశుభ్రమైన నీరు పోసి వుంచాలి. తేనెటీగలకు వీటి నుంచి నీరు లభించటమే కాకుండా చీమలు మరియు చెదల బారి నుండి రక్షణకు కూడా ఈ గిన్నెలు ఉపయోగపడతాయి. ఈ గిన్నెలను స్టాండు క్రింద అమర్చాలి.

అనువైన ప్రదేశం

వివిధ రకాల పుష్పాల్లో లభించే పుప్పొడి, మకరందం తేనెటీగల ఆహారం. పుప్పొడి, మకరందం అందించగల పైరులు/వెుక్కలు/తోటలున్న ప్రదేశం పెంపకానికనువైనది. అందువలన, తేనెటీగల పెంపకానికి ముందుగా పుప్పొడి, మకరందం అందించే మొక్కలను గుర్తించి పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి.

తేనెటీగల పెంపకానికి పుప్పొడి/మకరందాన్ని అందించగల మొక్కలు

మొక్క పేరు

మకరందం మరియు

మకరందం పుప్పొడి

పుప్పొడి

ఫలమొక్కలు

నిమ్మ, నారింజ, బతాయి, జీడిమామిడి, అరటి, దానిమ్మ, తాడి, పచ్చ, రేగు చింత, జామ

ఉసిరి, నేరేడు, వెలగ, కుంకుడు, ములగ, కొబ్బరి, మామిడి

-

కూరగాయలు

దోస, గుమ్మడి, బీర, పొట్ల, కాకర

-

వంగ, మిరప, టమాట

సుగంధ ద్రవ్యాలు

-

ధనియాలు, ఉల్లి

-

నూనె గింజలు

ప్రాదుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, కుసుములు

-

ఆముదం

 

అపరాలు

పెసర, మినుము, కంది బరాణి, ఉలవలు

-

-

ధాన్యాలు

-

-

జొన్న, మొక్కజొన్న, సజ్జ, కొర్ర

కలుపు మొక్కలు

గడ్డి చామంతి, వామిటి, పల్లేరు, ఉత్తరేణి, తుత్తురు బెండ

 

-

-

ఇతర జాతి మొక్కలు

జనుము, వేప, మోదుగ, మద్ది, కానుగ

టేకు, యూకలిస్టస్

-

మంచి స్థలాన్ని ఎంపిక చేసుకొనడం

 1. తేనెటీగల పెంపకమును ప్రారంభించబోయే స్థలంలో తగినన్ని పుష్పజాతులుండి అవి ఎక్కువ మకరందమును మరియు పుప్పొడిని తేనెటీగలకు అందించగల్లేలా వుండాలి.
 2. ఆ ప్రాంతము రోడు మార్గం ద్వారా సులువుగా చేరుకునే లాగ వుండాలి.
 3. చిత్తడి లేకుండా పొడిగా వుండాలి మరియు చెదలు లేని ప్రాంతం ఎన్నుకోవాలి.
 4. విద్యుత్ స్టేషన్లకు, ఇటుకబట్టీలకు, రద్దీగా ఉండే రోడ్లకు మరియు రైల్వే ట్రాకుకు దూరంగా తేనె పెట్టెలు పెట్టుకోవాలి.
 5. స్వచ్చమైన పారే నీరు దగ్గరలో తేనెటీగలకు లభ్యమయ్యేలా వుండాలి.
 6. పెనుగాలుల నుండి ఈదురు గాలుల నుండి తేనె పట్టుల రక్షణ కొరకు సహజసిద్ధమైన లేక కృత్రిమంగా పెంచిన వృక్షాలు వండాలి.
 7. ఉదయకాలపు మరియు సాయంత్రపు సూర్యరశ్మి ఆ ప్రాంతంలో పడేలా వండాలి.
 8. వ్యాపార సరళిలో పెంచే తేనె పట్టులు ఒక యూనిట్ నుండి మరియొక యూనిట్ కి కనీసం 2-3 కి.మీ. దూరం వుండాలి.
 9. నిల్వ ఉన్న మురికి నీటి గుంటలు, రసాయనాలు తయారుచేసే పరిశ్రమలు మరియు షుగర్ ఫ్యాక్టరీ ప్రాంతాలలో తేనె పట్టులు పెట్టుకొనరాదు.

మంచి లక్షణాలున్న తేనెటీగల ఎంపిక

తేనెటీగల పెంపకాన్ని రెండు రకాల తేనెటీగలతో ప్రారంభించుకొనవచ్చును. అవి ఏమనగా పుట్ట తేనెటీగలు మరియు ఐరోపా తేనెటీగలు. తేనె పరిశ్రమను ప్రారంభించబోయే స్థలంలో లభించే పుష్ప జాతులను బట్టి రైతుల ఆర్థిక స్టోమతను బట్టి రెండు జాతులలో ఒక దానిని ఎంపిక చేసికొనవచ్చును. కాని తేనె పరిశ్రమలో రాణించాలంటే రెండు జాతులలోనూ నాణ్యమైన తేనెటీగలు మరియు ప్రత్యేకంగా రాణి ఈగను బట్టి వుంటుంది. పుట్ట తేనెటీగల ఒక్కొక్క పట్టు నుండి సంవత్సరానికి 5-6 కిలోల తేనె లభినుంది. అదే ఐరోపా తేనె వట్టు ఒక్కొక్కటి 15-20 కిలోల తేనెను సంవత్సరానికి ఇస్తుంది. తేనె రాబడి ముఖ్యంగా ఆ ప్రాంతంలోని పుష్పజాతి మొక్కల లభ్యంపై ఆధారపడి ఉంటుంది. పట్టులను ఒకచోట నుండి మరియొక చోటికి మార్చుతూ వుంటే ఇంకా ఎక్కువ తేనె దిగుబడి ఐరోపా పట్టుల నుండి పొందవచ్చును.

మంచి తేనెటీగల మరియు రాణి ఈగ ఎంపిక

 1. తేనెటీగల పెంపకంలో శిక్షణ పొందిన తరువాత, తేనెటీగల పెంపకదారుల వద్ద నుండి వ్యాధి సోకని తేనెపట్టులను కొనుగోలు చేసికొనవలెను.
 2. తేనె దిగుబడిని ఎక్కువగా ఇచ్చే వ్యాధి నిరోధక శక్తి గల, ఎక్కువ గ్రుడ్లు పెట్టే లేత వయస్సు గల రాణి ఈగ పట్టు నుండి మాత్రమే పట్టులను అభివృద్ధి పరచుకొనవలెను.
 3. మంచి ఫలవంతమైన రాణి ఈగలను పట్టులలో వుంచు కొనవలెను.
 4. ఇన్ బ్రీడింగ్ ను నివారించుకొనుటకుగాను ప్రకృతిలో సహజసిధ్ధంగా పెరిగే పట్టులను పెంచుకొని అభివృది చేసుకోవలెను.

తేనె పట్టుల యాజమాన్యం

 1. బి.ఐ.ఎస్ /ఐ.ఎస్.ఐ ప్రమాణములతో స్థానికంగా లభించే తక్కువ బరువు గల దారువ గల చెక్కతో తేనె పెట్టెలను చేయించు కొనవలెను.
 2. అడుగు బల్లను, పిల్లల గదితో కలిపి మేకులు కొట్టరాదు.
 3. ఒక నిర్ణీత ప్రాంతంలో 50-100 వరకు మాత్రమే తేనె పట్టులుండేలా చూచుకోవాలి.
 4. తేనె పెట్టెలను వరుసలలో వరుసల మధ్య దూరం 10 మీటర్లు ఉండేలా అమర్చాలి. ప్రతి వరసలో పెట్టె పెట్టెకు మధ్య దూరం 3 మీ. ఉండాలి.
 5. మితిమీరిన సంఖ్యలో తేనె పట్టులను ఒక ప్రాంతంలో పెట్టరాదు.

తేనెపట్టు తనిఖీ / పరిశీలన

 1. తరుచుగా అడుగు బల్లలను, పై మూతను శుభ్రం చేసికొనుట ద్వారా, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించుట ద్వారాను తేనెటీగలు పెంచే ప్రాంతాన్ని శుభ్రంగా వుంచుకోవాలి.
 2. క్రమం తప్పకుండా  పట్టులను పరిశీలించి, పట్టులలో ఏదైనా అసాధారణ పరిస్థితిని లేదా తేనెటీగల ప్రవర్తనలో ఏవైనా మార్పులుంటే వెంటనే తెలుసుకొనవలెను.
 3. పట్టుల పరిశీలనకు 20 మరియు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల దినాలలో చేపట్టవలెను.
 4. చలిగా, గాలి ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు మరియు మబ్బులు వున్నప్పడు పట్టులను పరిశీలించరాదు.
 5. తేనెటీగలు కుట్టే స్వభావాన్ని అణచుటకు పొగను అవసరమైనపుడు మాత్రమే వాడాలి.
 6. పట్టులలోని చిత్రాలను తీసేటపుడు కుదుపులతో కాకుండా, నెమ్మదిగా తీసి పరిశీలించుకొనవలెను.
 7. తేనె పట్టులను పరిశీలించినపుడు చిత్రాలు మధ్య ఈగలు నలిగి పోకుండా చూసుకోవాలి. లేనిచో పట్టులోని ఈగలు కుట్టడానికి దారితీస్తుంది.
 8. వ్యాధి సోక్రిన పటులను, ఆరోగ్యకరమైన పట్టుల నుండి వేరుచేసుకోవాలి.
 9. ఆరోగ్యకరమైన మరియు వ్యాధి గల పట్టులను విడివిడిగా పరిశీలించుకొనవలెను.
 10. తగిన రక్షణనిచ్చే దుస్తులు మరియు ముసుగును ధరించి పట్టులను పరిశీలించుకొనవలెను.

తాజా మంచినీటి ఏర్పాటు

ఆరోగ్యకరమైన తేనె పట్టులను కల్గియండాలంటే లోతులేని పళ్ళాలను తాజా నీటితో నింపి ఎల్లప్పుడూ తేనె టీగలకు అందుబాటులో వుంచాలి. ఎందుకనగా నీరు ఈ క్రింది విధముగా తేనెటీగలకు ఉపయోగపడుతుంది.

 1. తేనె పట్టులలో తగినంత తేమను కల్పించి తద్వారా పట్టులోని గ్రుడ్లు పొదగబడడానికి దోహదపడుతుంది.
 2. తేనె మరియు పుప్పొడి మిశ్రమాన్ని తగిన పాకంలో లేత కూలి ఈగలు తయారుచేసికొనటానికి నీరు అవసరం ఉంటుంది. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని లేత కూలి ఈగలు వట్టులోని లద్దెపురుగులకు ఆహారంగా అందిస్తాయి.
 3. తేనే పట్టులు పెట్టుకున్న ప్రాంతంలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగినపుడు తేనె టీగలు నీటి నుండి ఆవిరిని తయారుచేసి పట్టును చల్లపరచుకుంటాయి.

పుప్పొడి మరియు మకరందము లభించని కరువు కాలంలో తేనెటీగల యాజమాన్యం

 1. తేనె పట్టులలో మకరందము/ తేనె, నిల్వలు తగినన్ని లేనపుడు మరియు ఆ ప్రాంతంలో మకరందము లభ్యం కానపుడు 50 శాతం పంచదార పాకాన్ని పట్టులకు అందించవలెను.
 2. పంచదార పాకంను పట్టులకు ఇచ్చినపుడు తేనెటీగలు పాకంలో మునిగి చనిపోవుటను నివారించుకొనుటకు గాను పాకంను లోతు లేని పళ్ళాలలో పోసి గడ్డిని పాకంలో వుంచుట ద్వారా తేనెటీగలు గడ్డి మీద కూర్చొని సులువుగా పాకాన్ని తీసుకుంటాయి. ఫీడర్ ద్వారా కూడా పెట్టెలోనే పాకం అందించవచ్చు.
 3. ఆరుబయట పంచదార పాకాన్ని తయారు చేయకూడదు. దోచుకొనబడడాన్ని మరియు చీమల బారిన పట్టులు పడకుండా వుండునట్టు తేనె పట్టుల ప్రాంతంలో పాకం ఒలికిపోకుండా చూసుకోవాలి.
 4. ప్రాద్దు గూకిన తర్వాత మాత్రమే తేనెపట్టులకు పంచదార పాకాన్ని అందివ్వాలి.
 5. తేనెపటులన్నింటికీ ఒకేసారి పంచదార పాకాన్ని ఇవ్వాలి.
 6. తేనెపట్టులకు తేనెను గాని, తేనె కలిపిన పంచదార పాకాన్ని గాని ఇవ్వరాదు.
 7. క్రొవ్వు లేని సోయాపిండి : 3 పాళ్ళ

  బ్రూయర్స్ ఈస్ట్ : 1 పాలు

  సిమ్స్ పాలపొడి : 1 పాలు

  పంచదార : 22 పాళ్ళు

  తేనె : 50 పాళ్ళ

  నిష్పత్తితో చేయబడిన పదార్ధమును పుప్పొడికి బదులుగా పుప్పొడి నిల్వలు తగినన్నిలేని మరియు పుప్పొడి లభ్యం కాని సీజనులో పట్టులకు అందించాలి.

 8. గంధకపు పొడితో పొగబారించిన ఖాళీ మైనపు అట్టను గాలి చొరవడని గదులలో ఎవ్పటికవ్పడు భద్రపరచుకొనవలెను.
 9. పాతబడిన నల్లగా మారిన మైనపు అట్టలను తొలగించుకొనవలెను.

పట్టును వలస తీసుకొని పోవునపుడు తీసికొను జాగ్రత్తలు

 1. పట్టులకు ఆహారం లభ్యం కాని ప్రదేశం నుండి సమృద్ధిగా ఆహారం (పుప్పొడి, మకరందము) లభించే ప్రాంతాలకు మార్చుకొనవలెను.
 2. పట్టులను మార్చుటకు ముందు ఆయా ప్రాంతాలను సర్వే చేసుకొని అక్కడ తేనెటీగలకు లభ్యమయ్యే పంటలను అంచనా వేసుకోవాలి.
 3. పట్టులను మరియొక్క 533 మార్చుటకు ముందు, సాయంకాలం కూలి ఈగలన్నీ పట్టుకు చేరుకున్న తర్వాత తేనెపట్టు ద్వారములను మూసి వేసుకోవాలి.
 4. తేనె పెట్టె లోపలి భాగాన్ని వెలుపలి భాగాన్ని సరియైన విధంగా ప్యాకింగ్ క్రాని పట్టును కుదుపుల నుండి రక్షించుకొనవలెను.

వివిధ ఋతువులలో తేనె పట్టులలో చేపట్టవలసిన యాజమాన్యం

ఎండాకాలంలో తేనెపట్టుల యాజమాన్యం

 1. తేనెపట్టులను దట్టమైన నీడలో వుంచుకొనవలెను.
 2. తడిగోనె పట్టాను తేనె పెట్టె పై మూత పై యుంచాలి. మధ్యాహ్నం ఎండ వేళలలో నీటిని తేనె పెట్టె చుటూ చల్లి పట్టుల చుటూ చల్లని వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
 3. తేనె పట్టు ద్వారాన్ని వెడల్పు చేసుకొని పట్టుకు గాలి అందునట్లుగా చూసుకొనాలి. పది ఫ్రేములు గల పట్టులలో పదింటికి బదులు తొమ్మిదింటిని వుంచి, చిన్న చిన్న చెక్కముక్కలను గదుల మధ్య నుంచి, పట్టులోనికి తాజా గాలి ప్రసరించేటట్లు చూసుకోవాలి.
 4. తేనె పట్టులున్న ప్రదేశంలో తాజా మంచినీరు తేనె టీగలకు అందుబాటులో వుండునటు ఏర్పాటు చేసుకొనవలెను.

వర్షాకాలంలో తేనెపట్టుల యాజమాన్యం

 1. అడుగుబల్లపై నిండిన చెత్తను శుభ్రం చేసి, తొలగించి భూమిలో లోతుగా పాతిపెట్టాలి.
 2. స్వేచ్చగా వీచేగాలిని అడ్డుకునే అనవసరమైన చెట్ల కొమ్మలను నరికి వేసి పట్టులున్న ప్రాంతాన్ని శుభ్రంగా వుంచుకోవాలి.
 3. కృత్రిమ ఆహారాన్ని(పంచదారపాకం/ పుప్పొడికి బదులుగా వాడే పదార్థం) పట్టు అవసరాన్ని బట్టి తయారుచేసి పట్టుకు ఇవ్వాలి.
 4. తేనె పట్టులలో వలసను, దోచుకొనబడటంను తగిన జాగ్రత్తలు తీసికొని నివారించుకోవాలి.
 5. గుడ్లు పెట్టే కూలి ఈగలు గల పట్టులను/బలహీనమైన పట్టులను పేపరు పద్ధతి నుపయోగించి కలుపు కొనవలెను.
 6. కందిరీగలను, చీమలను, కప్పలను, బల్లలను తేనె పట్టులలో నివారించుకొనవలెను.

వర్షాకాలానంతర పట్టుల యాజమాన్యం

 1. పట్టులలో తగినంత ఖాళీని ఏర్పరచాలి.
 2. మగ ఈగల ఉత్పత్తిని పెరిగేలా పట్టులను బలపరచుకోవాలి.
 3. పట్టులను ఆశించి, నష్టపరచే నల్లులను, మైనపు పురుగును మరియు కందిరీగలను నివారించుకొనవలెను.

చలికాలంలో పట్టుల యాజమాన్యం

 1. పట్టులలో పుప్పొడి, మకరంద నిల్వలు పెరుగుట ద్వారా రాణి ఈగ ఎక్కువ గుడ్లను పెడుతుంది. కావున పట్టులోని ఈగల సంఖ్య పెరిగి, వలస పోవుటకు సిద్ధమవుతాయి.
 2. కొత్తగా కట్టే రాణి ఈగ గదులను ఎప్పటికప్పుడు తొలగించుకొంటూ, వలసను నివారించుకోవాలి.
 3. ఎండ పడే ప్రదేశంలో పట్టులను మార్చుకోవాలి.
 4. ఆకుపచ్చ పక్షుల నుండి, నల్ల పక్షుల బెడద నుండి పట్టులను కాపాడుకోవాలి.
 5. బలహీనమైన పట్టులను బలమైన పట్టులతో కలుపు కోవాలి.
 6. కృత్రిమ మైనపు అట్టలను పట్టుకు ఇచ్చి కొత్త అట్టలను అల్లించుకోవాలి.
 7. పాత రాణి ఈగల స్థానంలో కొత్తరాణి ఈగలను ప్రవేశ పెట్టుకోవాలి.
 8. పురుగు మందుల బారి నుండి పట్టులను కాపాడుకోవాలి.
 9. తేనె అరలలో పూర్తిగా నిండిన సీలు వేసిన ప్రేముల నుండి మాత్రమే తేనెను తేనె యంత్రములో తీసికోవాలి.

తేనెటీగలు-పంటల అధిక దిగుబడి

తేనెటీగల శరీరమంతా సన్నటి వెంట్రుకలతో కూడి పుప్పొడి సేకరించుటకు అనుకూలము. అంతేకాకుండ వాటి నాలుక, కాళ్ళు మకరందాన్ని, పుప్పొడిని సేకరించుటకు అనువుగా ఉంటాయి. ఈవిధంగా సేకరించే క్రమంలో మకరందాన్ని పుప్పొడిని తిని, పట్టులో నిల్వ చేయుటకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. ఒక్కొక్క తేనెటీగ కొన్ని వందల పుష్పాలను దర్శిస్తాయి. అందువలన పుష్పాలలో పరపరాగ సంపర్కం జరిగి, పంటల అధిక ఉత్పత్తికి దోహదం చేస్తాయి. తేనెటీగల జీవిత చక్రంలో నిద్రావస్థ లేదు. కావున, సంవత్సరం పొడవున పుష్పాలను సందర్శించి పుప్పొడి మరియు మకరందాన్ని సేకరిస్తాయి.

పంట 5 నుంచి 10 శాతం పూత దశలో ఉన్నప్పుడు ఒక హెక్టారులో 2-3 తేనెపట్టులను పొలంలో గాని, పొలం దగ్గరలోగాని ఉంచడంవల్ల పరపరాగ సంపర్కం జరిగి అధిక దిగుబడికి దోహదం చేస్తాయి.

తేనెటీగల శత్రువులు - నివారణ

గ్రేటర్ వాక్స్ మాత్: దీని ఉధృతి జులై-అక్టోబర్ లో ఎక్కువగా ఉంటుంది. రెక్కల పురుగు బలహీనమైన పటు పెట్టెలలోపలికి ప్రవేశించి గుడ్లు పెడుతుంది. లద్దె పురుగు మైనంలోకి తినుకుంటు పట్టుతో కూడిన సొరంగాలు చేస్తుంది. మరియు అడుగు బల్ల పై చిన్న చిన్న గదులు నిర్మిస్తుంది. మైనం తినడం వల్ల నష్టం జరుగును. మైనం రాలిపోయి పెట్ట అడుగున కనిపస్తుంది.

లెస్సర్ వాక్స్ మాత్ : దీని లద్దె పురుగు కూడా మైనపు అట్టలను త్తింటుంది. తేనెటీగ కోశస్ధ దశ ఉన్న గదుల మైనపు కప్పలను తింటాయి. దీనిని "బ్లడ్ బ్రుడ్" అంటారు.

నివారణ చర్యలు:

 • తేనె పుట్టలను శక్తివంత చేయాలి.
 • తేనె పెట్టెలలో పగుళ్ళు లేకుండా పత్తితో మూసి వేయాలి.
 • మైనపు అట్టలకు సల్పర్ పొగ పెట్టాలి.
 • నప్తలిన్ కూడా పెట్టవచ్చును.

చీమలు : చీమలు పెట్టెలోనికి ప్రవేశించి తేనెను, తేనెటీగ పెరిగే దశలను, తీసుకొని వెళ్ళిపోతాయి. నివారణకు నీటి తొట్టెలను స్టాండ్ కింద అమర్చాలి.

కందిరీగలు: వివిధ రకాలైన కందిరీగలు పెట్టలోనికి వచ్చి లేదా పెట్టె ద్వారం దగ్గర వేచి ఉంది తేనెటీగలు ఎత్తుకు పోయి చంపి వాటి పిల్లలకు ఆహారంగా అందజేస్తాయి.

నివారణ చర్యలు:

 • పెట్టేద్వారాన్ని చిన్నదిగా చేయాలి. దీని వలన కాంతిరిగాలు లోనికి రాలేవు.
 • కందిరీగలు గుళ్ళను వెతికి నాశనం చేయాలి.

చెదలు: ఇవి చెక్క పెట్టెల భాగాలను తినివేస్తాయి. నివారణకు చెక్క పెట్టెలకు రంగు వేయాలి.

తేనెటీగలకు వచ్చు వ్యాధులు

ఇతర జీవుల మాదిరిగానే తేనెటీగలకు కూడా వ్యాధులు, శత్రువులున్నాయి. వ్యాధులు లేదా కొన్ని శత్రువుల వ్యాప్తి తేనెటీగల్లో చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఎందుకనగా ఒక పట్టులోని తేనెటీగలన్నీ సంఘజీవులుగా ఒకేచోట జీవించి కూలి ఈగలు, ఆహారాన్ని లదై పరుగులకు, పోతు టీగలకు రాణి ఈగకు అందించడం వల్ల, వలసపోవుట, పట్టుల నుంచి తేనెటీగలు తప్పించుకొని పారిపోవుట, దోచుకొనుట, పుష్పాలను సందర్శించి పుప్పొడి, మకరందాన్ని సేకరించుట అను లక్షణాలతో వ్యాధులు, కొన్ని శత్రువుల వ్యాప్తికి దోహదపడతాయి. తేనెటీగల లదైపురుగులకొచ్చే కొన్ని రకాల వ్యాధులు చాలా తీవ్రమైనవి.

అమెరికన్ పౌల్ బ్రుడ్ వ్యాధి : వ్యాధి సోకిన పిల్ల పురుగులు తెలుపు నుండి గోధుమ రంగుకు మారును. తరువాత క్రమంగా ముదురు కాఫీ రంగుకు మారాను. పిల్ల పురుగు నీరు పురుగు ఎండిపోయి గట్టిగ మరి మైనపు గది

తేనెపట్టులలో సాక్ బ్రూడ్ వైరస్ తెగులు - నిర్ధారణ

 1. వయస్సులో పెద్ద లదైపురుగులు 53 వ్యాధి వల్ల చనిపోతాయి. కొన్నిసార్లు ప్యూపాదశ ప్రారంభంలో కూడా లద్దెపురుగులు చనిపోతాయి. చనిపోయిన లద్దెపురుగుల నుంచి ఏ ప్రత్యేక వాసన రాదు.
 2. తెగులు సోకి చనిపోయిన లద్దెపురుగులు గదిలో నిటారుగా ఉండి, తల నాలుక వలె సాగి, మైనపు గదుల నుంచి కన్పిస్తుంది.
 3. తెగులు సోకి చనిపోయిన లద్దెపురుగులు స్పష్టమైన గోధుమ రంగు కలిగి తల, నోటి భాగాలు నల్లబడి ఉంటాయి. లద్దెపురుగు రంగు తెలుపు నుంచి, పసుపుపచ్చ, గోధుమ రంగులోకి మారి చివరకు నలుపు రంగులోకి మారుతుంది. కాని నలుపు రంగులోనికి మారడం అనేది దక్షిణ భారతదేశంలో చాలా నెమ్మదిగా జరుగుతుంది. చివరగా లదైపురుగు మైనపుగదిలో ఎండిపోయి చూడడానికి పడవ ఆకారంలో ఉంటుంది.
 4. సంచి ఏర్పాటు లేత వయస్సులోని లద్దె పరుగుల్లో, చాలా స్పష్టంగా, సాక్ బ్రూడ్, థాయ్సాక్ బ్రూడ్ తెగుళ్ళ సోకిన తేనె పట్టులలో (ఉత్తర భారతదేశంలో) ఉంటుంది. అదే దక్షిణ భారతదేశంలో సంచి ఏర్పాటు సాక్ బ్రూడ్ లేదా థాయ్ సాక్ బ్రూడ్ తెగుళ్ళలో అంత స్పష్టంగా ఉండదు.
 5. చనిపోయిన లద్దె పురుగుల్లో సాగే గుణం, కుళ్ళిన వాసన ఉండదు.
 6. తెగులు సోకిన పట్టులో లదైపురుగుల అభివృద్ధి తగ్గిపోతుంది. కూలి ఈగల్లో పట్టులో చనిపోయిన లద్దెపురుగులను తోడివేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే పోషణ కూలి ఈగలు పెరిగే లదై పరుగులకు ఆహారం ఇచ్చి పోషించలేవు.
 7. వట్మలోని కూలీ ఈగలన్నీ పట్మను వదిలి పారిపోవడమనేది సాధారణంగా వ్యాధి సోకిన పట్టులో కనిపించే లక్షణం.

గమనిక : ఐరోపా తేనెటీగల్లో వచ్చే సాక్బ్రూడ్ తెగులు, పుట్టతేనెటీగల్లో వచ్చే థాయ్సాక్ బ్రూడ్ తెగులు లక్షణాలు ఒకేలా ఉంటాయి. కాని థాయ్సాక్ బ్రూడ్ తెగులు కల్లించే వైరన్ భౌతికంగా, రసాయనికంగా, సీరలాజికల్ గా సాక్ బ్రూడ్ తెగులు కలిగించే వైరస్ కంటే వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి.వట్మలోని కూలీ ఈగలన్నీ పట్మను వదిలి పారిపోవడమనేది సాధారణంగా వ్యాధి సోకిన పట్టులో కనిపించే లక్షణం.

సాక్ బ్రూడ్, థాయ్ సాక్ బ్రూడ్ తెగుళ్ళ నివారణ

సాక్, థాయ్ సాక్ బ్రూడ్ తెగుళ్ళు వైరస్ల ద్వారా వస్తాయి కాబట్టి ఒక నిర్దిష్టమైన నివారణ అంటూ లేదు. కారణం వైరస్ లద్దె పురుగుల్లోని, కణాల్లో ఒక భాగంగా ఉండిపోవడమే. అయినప్పటికి కింద సూచించిన చర్యలు వ్యాధులు వ్యాప్తి చెందకుండా కొంత వరకు అరికట్టుతాయి.

 1. తేనెపటులను బలంగా ఉంచుకోవాలి. దోచు కోబడటం, తేనెటీగలు పట్టును వదలిపెట్టి వెళ్ళడాన్ని నిరోధించాలి.
 2. ప్రకృతిలో లభించే పట్టులను పట్టుకొని పెట్టెలో పెంచరాదు.
 3. తేనె పరిశ్రమలో వాడే పరికరాలైన చాకు, తేనె పెట్టె (ఖాళీవి), ఇతర పరికరాలన్నీ సబ్బు ఫార్మాలిక్ ద్రావణంలో 24 గంటలు నానబెటుట ద్వారా తెగులుకు కారణమైన వైరస్ క్రిములు చనిపోతాయి.
 4. వెటరినరీ గ్రేడ్కు చెందిన టెర్రామైసిన్ మందును 200 మి.గ్రా. లను 500 మి.గ్రాల పంచదార పాకంలో కలిపి ఐరోపా తేనె పట్టులకు ఇవ్వాలి. టెట్రాసైక్లిన్ వెటరినరీ గ్రేడ్ మందును (200 మి.గ్రా.) 300 మి.లీ. పంచదాం పాకంలో కలిపి పట్టుతేనెటీగల పటులకివ్వాలి (వెటరినరీగ్రేడ్ లభించనట్లయితే మానవులకు వాడే టెర్రామైసిన్ గొట్టాలను అంతే డోసుగలవి వాడవచ్చు). మందును వారానికి 4 లేదా 5 సార్లు ఒక పట్టుకు, 5-6 వారాలు వాడాలి. ఈవిధంగా చేసి తేనె పట్టులకు వచ్చే ఇతర వ్యాధులను నిరోధించుకోవచ్చు.
 5. వ్యాధిని పూర్తిగా లేదా కొంత వరకు తట్టుకునే తేనె పట్టులను గుర్తించి వాటిని అభివృద్ధి పరచుకోవాలి.

యూరోపియన్ ఫౌల్బ్రూడ్ వ్యాధి

ఈ వ్యాధి ఐరోపా తేనెటీగలు ఎక్కడెక్కడున్నాయో అన్నిచోట్లా ఉంది. పట్ట తేనెటీగలు కూడా ఈ వ్యాధి బారిన పడతాయి. కాని వ్యాధిని కలుగజేసే బాక్టీరియా రకం వేరుగా ఉంటుంది. భారతదేశంలో ఈ వ్యాధి 1971 సం.లో పుట్ట తేనెటీగల్లో మహారాష్ట్రలో వచ్చింది. ఈ వ్యాధి మెలిసోకోకస్ ప్లూటాన్ అనే బాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ బాక్టీరియా పెరిగే లద్దెపురుగుల మధ్య పొట్టలో ఒంటరిగా గాని, గొలుసులుగా గాని లేదా గుంపులుగా గాని ఉంటుంది. బాక్టీరియా కణాలు ఆహారంతోపాటు పోయి, లద్దెపురుగు మధ్య పొట్టలో అభివృద్ధి చెందుతాయి.

యూరోపియన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధి - నిర్ధారణ

 1. వ్యాధి సోకిన లద్దెపురుగులు మైనపు గదుల్లో ఒక పక్కకు కొంచెం జరుగుతాయి.
 2. లద్దెపురుగుల 4-5 రోజుల వయస్సులో (వ్యాధి సోకిన తర్వాత) చనిపోతాయి. ఈ వయస్సులో ఇవి ముడుచుకున్న దశలో ఉంటాయి. అప్పటికి లద్దెపురుగుల మైనపు గది మైనంతో మూత వేయబడదు.
 3. లద్దె పురుగుల రంగు మెరిసే తెలుపు నుంచి పేలవమైన పసుపు రంగులోకి, ఆ తర్వాత గోధుమ రంగులోకి మారుతుంది. చనిపోయిన లద్దెపురుగులు చివరకు పొలుసులాగ ఎండిపోయి, మైనపు గదులకు అంటుకోకుండా, రబ్బరు లాగ కన్పిస్తాయి.
 4. వ్యాధి సోకి కుళ్ళిపోయిన లద్దెపురుగుల నుంచి పులిసిపోయిన వాసన వస్తుంది.
 5. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే సీలు వేసిన, సీలు వేయని లద్దెపురుగుల గదులు మైనపు అట్టపై చెదిరిపోయిన లక్షణం ఈ వ్యాధి ముఖ్యమైన గుర్తుగా తెలుసుకోవచ్చు.

వ్యాధి నివారణ

 1. తేనె పట్టులకు పంచదార పాకం ఇచ్చుట, సీలు వేసిన పిల్లల (లద్దెపురుగు) అట్టలను ఇచ్చుట, బలహీనమైన పటులను బలమైన పటులకు కలుపుట, బేసి తేనెపటులను బలంగా ఉంచుకోవాలి. వయస్సు మళ్ళిన రాణి ఈగల స్థానంలో కొత్తగా సంపర్కం చెందిన రాణి ఈగలను ఇచ్చినట్లయితే 2 లాభాలు ఉంటాయి. మొదట ఒక పట్టు బలం పెరుగుతుంది. రెండోసారి కూలి ఈగలు వ్యాధి సోకిన లద్దె పరుగులను మైనపు గదుల నుంచి తీసివేసి, మైనపు గదులను శుభ్రం చేయడానికి వ్యవధి దొరుకుతుంది.
 2. టెర్రామైసిన్ (వెటరినరి గ్రేడ్) అను యాంటిబయోటిక్ మందును 200 మి.గ్రా. తీసుకొని 500 మి.లీ. (అరకిలో) పంచదార పాకంలో కలిపి పటులకు వారానికి 4-5 సార్లుగా 5-6 వారాలు వ్యాధి తగ్గే వరకు పట్టుకు అందించాలి. ఇది ఐరోపా తేనెటీగల పట్టులకివ్వాల్సిన మోతాదు.
 3. పట్టు తేనెటీగల పట్టులకు టెట్రాసైక్లిన్ 200 మి.గ్రా, (వెటరినరీ గ్రేడ్) మందును 300 మి.గ్రా. పంచదార పాకానికి కలిపి వారానికి 4 నుంచి 5 సార్లుగా, 5 నుంచి 6 వారాలు పట్టులకు అందించి నివారణ చేసుకోవచ్చు. 3 ఖాళీ మైనపు అట్టలను 80 శాతం ఎసిటిక్ ఆమాన్ని 150 మి.లీ. ఒక పట్టుకు (8-10 ఖాళీ (ఫేములకు) ఇవ్వాలి (150 మి.లీ. ఎసిటిక్ ఆమాన్ని ఒక సీసాలో పోసి దాని వత్తిని ఏర్పాటు చేసి, పట్టులోని అడుగు బల్ల మీద ఉంచి పట్టులకు (ఖాళీవి) వాసన సోకేలా ఏర్పాటు చేయాలి). ఎసిటిక్ ఆమ్లపు ఆవిరిని 3-4 రోజులు పట్టులో  చేయాలి. ఖాళీ మైనపు గదుల్లోని బాక్టీరియా ఆమ్లపు ఆవిరికి చనిపోతుంది. తర్వాత ఖాళీ మైనపు అట్టలను ఒకరోజు నీడలో ఉంచి తిరిగి పట్టులకు సరఫరా చేసుకోవచ్చు.

ఆధారం : వ్యవసాయ పంచాంగం

3.00373134328
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు