పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పెరటి తోటల పెంపకంలో మెళకువలు

పెరటి తోటల పెంపకంలో మెళకువల గురించి తెలుసుకుందాం.

మనకు ప్రతి దినం కావాల్సిన విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, పండ్లు కూరగాయలలో లభిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యానికి మంచి పోషకాలు ఉన్న పండ్లు, కూరగాయలు ప్రతిదినం తీసుకోవడం తప్పనిసరి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో పండ్లు, కూరగాయలు ప్రాముఖ్యత వహిస్తాయి.

ఎంతో ఉపయోగకరమైన పండ్లు, కూరగాయలు బయట ఎక్కువ ధరకు లభిస్తున్నాయి. అలా కాకుండా వీటిని ఇంటి మీద ఆవరణ చుట్టు పక్కల పెరడులో గానీ, ఇంటి మేడ పైన టెర్రస్ గార్డెన్లా గానీ పెంచుకోవచ్చు. రసాయనాలు లేని తాజా రుచికరమైన కూరగాయలు, పండ్లను అతి తక్కువ ఖర్చుతో పొందవచ్చు. పెరటి తోటల పెంపకం వలన ఆరోగ్యమే కాకుండా, ఇంటి వారందరికి తీరిక వేళలో మొక్కల మధ్య పనిచేయడం ద్వారా మనోల్లాసం, ఆహ్లాదం లభిస్తుంది. చిన్న పిల్లలకు కూడా పెరటి తోటలో పనిచేయడం ద్వారా క్రమ శిక్షణ లభిస్తుంది,

పెరిగిన ఖర్చులకు అనుగుణంగా సంపాదనను లాభదాయకంగా ఖర్చు పెట్టడంలో పెరటి తోటల పెంపకం లాభదాయకం, పెరటి తోటల పెంపకం వయస్సుతో తేడా లేకుండా చిన్న పిల్లలకు పెద్దలకు కూడా ఆచరించవచ్చు.

పెరటి తోటలు పెంపకానికి అనువైన స్థలం:

పట్టణ ప్రాంతంలో కనీసం 50 చ.అ. నుండి 100 చ.అ. ఉండి నీటి సదుపాయం కలిగి ఉంటే పెరటి తోటల పెంపకానికి అనుకూలం.

పెరటి తోటల పెంపకంలో పాటించాల్సిన నియమాలు:

 • ముందుగా ఇంటి చుట్టుపక్కల స్థలాన్ని చెత్తా చెదారం లేకుండా శుభ్రం చేసుకోవాలి.
 • ఒక వేళ నేల సారవంతమైనది కాకపోతే ఎర్రమట్టి గానీ నల్లమట్టిని కానీ 15-30 సెం.మీ. మందంగా వేయించాలి.
 • నేలను మడులుగా కట్టి మడుల మధ్య పార సహాయంతో మెత్తగా తవ్వాలి.
 • ఒక చ.మీ.కి 25:500:125 గ్రా. అమ్మోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్పేట్, పొటాష్ ఎరువులను వేయాలి. యూరియా 2 లేదా 3 దఫాలుగా మొక్క ఎదుగుదల దశలో 50 గ్రా, చొప్పున వేయాలి,

పెరటి తోటల పెంపకానికి ముందు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు:

 • కుటుంబ సభ్యులు ఇష్టపడి ఎక్కువగా తినే వాటిని ముందుగా ఎంచుకోవాలి.
 • నేలకు వాతావరణానికి అనుకూలమైనవి ఎంచుకోవాలి.
 • ఏక వార్షికాలు, తక్కువ స్థలంలో పెరిగే మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
 • నీడనిచ్చే చెట్లను తోటకు అవతల పక్కన నాటుకోవాలి.
 • ఉదా: లెట్యూస్, స్పినాచ్, బీట్రూట్, ఉల్లి, వెల్లుల్లి, టమాట, క్యాబేజి, బెండ, టర్నిస్, ర్యాడిష్ మొదలైనవి తక్కువ స్థలంలో పెరిగే మొక్కలు.
 • ఎక్కువ పోషక విలువలు, రుచిని అందించే మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
 • ఉదా: స్వీట్ కార్న్ మంచి ఉదాహరణ, ఆస్పరాగస్, బఠాణి మొదలైనవి,

మొక్కలు నాటే సమయం, మొక్కల లక్షణాలు:

 • ఒకే కాలంలో వేయాల్సిన, ఏక వార్షికాలైన మొక్కలను ఒక సమూహంగా ఒక స్థలంలో వేరు వేరు మళ్ళల్లో వేయాలి.
 • బహువార్షికాలైన మామిడి, ఆస్పరాగస్, రూబర్న్, మునగ వంటి వాటిని తోటలో మరొక వైపు స్థలంలో నాటుకోవాలి. దీని వలన చెట్ల నీడ ఇతర మొక్కల పై పడకుండా కాపాడవచ్చు.

మొక్కల మధ్య దూరం:

వరుసల మధ్య సరైన ఖాళీలు, మొక్కల పెరుగుదలకు, సాగునీటి సౌలభ్యం, స్థలం - సమర్థవంతమైన వినియోగానికి వీలు కల్పించడం చాలా ముఖ్యం. సిఫార్సు చేయబడిన దూరంతో మొక్కలు నాటుకోవాలి. ఒకవేళ ఇంటి పెరడు స్థలం పుష్కలంగా కలిగి ఉంటే అంతరకృషి (ట్రాక్టర్, రైతు కదలికలకు అనుగుణంగా మడుల మధ్య దూరం ఎక్కువగా ఉండవచ్చు. దీని ద్వారా చేతి కలుపు తీయడానికి అనుకూలం.

పెరటి తోటల పెంపకానికి అనువైన పంటలు:

 • పెరటి తోటల పెంపకానికి అనువైన ఏక వార్షిక కూరగాయల మొక్కలు టమాట, వంగ, బెండ, తీగజాతి కూరగాయలైన బీర, కాకర, సొర, పొట్ల, దోసకాయ దుంపజాతి కూరగాయలైన క్యారెట్, ముల్లంగి, బీట్రూట్, బహువార్షికాలైన క్యాబేజి, కాలిఫ్లవర్ శీతాకాలపు పంటలైన బరాణి, చిక్కుడు మొదలైన వేసుకోవచ్చు. మొక్కల వరుసల మధ్య ఆకుకూరలైన పాలకూర, తోటకూర, గోంగూరు, కొత్తిమీర, మెంతి మొదలైనవి వేసుకోవచ్చు.
 • పండ్ల తోటలైన అరటి, నిమ్మ, బొప్పాయి, జామ, మామిడి, మొక్కలను సరిహద్దుల్లో పెంచుకోవచ్చు.
 • టమాట, వంగ, క్యాబేజి, కాలిఫ్లవర్ లాంటి కూరగాయలను మొదట చిన్న మడులలో నారు పెంచి మొక్కలను నాటుకోవాలి.
 • నారుమడిని 10-15 సెం.మీ. ఎత్తు, 1 నుండి 2 చ.మీ. వెడల్పుతో వేసుకోవాలి. ఈ నారు మడినీ తోటలో ఒక వైపు వేసుకోవాలి.
 • 4-5 వారాల వయస్సు ఉన్న మొక్కలు లేదా నారును మడులలో తిరిగి నాటుకోవాలి.
 • దుంప కూరగాయలైన క్యారెట్, ముల్లంగి, చామగడ్డ, బీట్రూట్ వంటి వాటిని మళ్ళను గట్టుగా చేసి గట్లపై నాటుకోవాలి.
 • రసం పీల్చే పురుగు ఆశించకుండా వేప కషాయాన్ని పిచికారీ చేయాలి.
 • కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి వేయాలి.
 • పురుగు పట్టినా, తెగుళ్ళు ఆశించినా వ్యాధి కారక మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేసి దూరంగా పడవేయాలి.
 • ఎండాకాలంలో 2-3 రోజులకోకసారి వర్షాకాలం, శీతాకాలంలో 5-6 రోజులకు ఒకసారి తోటలో నీరు పారించాలి,
 • వంట గదిలో ఆహారపు వ్యర్థాలను కంపోస్టుగా చేసి ఎరువుగా వాడవచ్చు.
 • ఈ కంపోస్టు గుంతలను పెరటి తోటలో ఒక మూలకి/పక్కకి ఏర్పాటు చేసుకోవాలి. గుంతలలో ఆహార వ్యర్థాలు, తోటలోని ఆకుల చెత్త వేసి కప్పి ఉంచాలి. ఈ విధంగా కంపోస్టు ఎరువును పెరటిలోనే తయారు చేయడం వలన తోట ఖర్చు తగ్గటమే కాక కల్తీలేని ఎరువులు పొందవచ్చు.
 • పెరటి తోటల పెంపకానికి తగు యోచన.
 • సంవత్సరం పొడవునా కూరగాయలు, పండ్లు లభించడానికి ముందుగానే ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి.
 • కాలానికి, నేలకు, వాతావరణానికి అనుగుణంగా ఉండేలా మొక్కరకాలను ఎంపిక చేసుకోవాలి.
 • ఇంటి స్థలాన్ని సమాన భాగాలు లేదా ఆకర్షణీయంగా కనిపించేలా చిన్న చిన్న మళ్ళను ఏర్పాటు చేసుకోవాలి.
 • తక్కువ కాలంలో కాపుకు వచ్చే మొక్కలని ఒకవైపు స్థలంలో వేయడం వలన తిరిగి ఖాళీ అయిన స్థలాన్ని వెంటనే వేరే మొక్కలు నాటి ఉపయోగించుకోవచ్చు.

ప్రభుత్వ పథకాలు:

 • పెరటి తోటల పెంపకానికి ప్రభుత్వం 'మన ఇల్లు మన కూరగాయలు' అనే పథకం ప్రారంభించింది.
 • కూరగాయల ఖర్చు, పోషకాహార లోపం, పట్టణాలలో తక్కువ స్థలం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన తాజా కూరగాయలను పురుగు మందుల అవశేషాలు లేకుండా అందించేందుకు ఉద్యానశాఖ, తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రీయ కృషి వికాస పథకం ద్వారా పట్టణ ప్రాంతాలలో ఇంటిపై కప్పుపై కూరగాయలు పెంచే పథకకం కొత్తగా ప్రవేశపెట్టారు.
 • ఈ పథకం ద్వారా కూరగాయలు పెంచడానికి కావాల్సిన మట్టి మిశ్రమం, విత్తన సంచి, సిల్పాలిన్ కవర్స్ వేప పిండి, వేప నూనె, పనిముట్లు 50 శాతం రాయితీతో ఉద్యానశాఖ ద్వారా ప్రతి ఇంటికి 2 యూనిట్లు అందిస్తారు. సాగుపై ఉచిత సలహాలు ఇస్తారు.

పెరటి తోటల పెంపకం వలన ప్రయోజనాలు:

 • ఏడాది పొడవునా కూరగాయలు పొందవచ్చు.
 • పురుగు మందుల అవశేషాలు, కల్తీలేని కూరగాయలను ఇంట్లోనే తక్కువ ఖర్చుతో పొందవచ్చు.
 • అధిక పోషక విలువలు కలిగిన తాజా కూరగాయలు లభిస్తాయి.
 • నిరుపయోగంగా ఉన్న ఇంటి చుట్టు పక్కల, ఇంటి పై స్థలాన్ని వినియోగించుకోవచ్చు.
 • కుటుంబ సభ్యులకు, చిన్న పిల్లలకు మొక్కల పై ఆరోగ్యం పైన పోషక విలువలు కలిగిన ఆహార నియమాలపై అవగాహన పెంచవచ్చు.
 • పెరటి మొక్కల పెంపకం వలన మానసిక ఉల్లాసమే కాక, శారీరక వ్యాయామానికి కూడా ఉపయోగపడుతుంది.

ఆధారం: ఉల్లంగుల స్రవంతి, పి. తనుజ, పి.ఎచ్.డి స్కాలర్స్, ఉద్యాన కళాశాల, శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, హైదరాబాద్

2.99349240781
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు