పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రపంచ నేల దినోత్సవం 5 డిసెంబరు

ప్రపంచ నేల దినోత్సవం గురించి తెలుసుకుందాం.

భూ ఆరోగ్య మరియు భూసార యాజమాన్యం

నేల మానవునికి ప్రకృతి సిద్ధంగా లభించిన సంపడల్లో ఒకటి. వ్యవసాయ ప్రధానమైన మన దేశం వంటి దేశాలకు నేల తల్లితో సరిసమానమంటే అతిశయోక్తి కాదు. పంటలు పండటానికి అవసరమయ్యే తేమ, పోషకాలు, సూక్ష్మజీవులను కూడా భూమి తనలో ఇముడ్చుకుని మొక్కలకు అవసరం మేర అందజేస్తుంది. కేవలం ఆహార సాధనకే కాక జాతి సౌభాగ్యం, దేశ ఆర్థిక స్థితికి తోడ్పడే భూమాతను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

నేలలో భౌతికంగా బంకమన్ను, ఒండ్రు, ఇసుక రేణువులతో పాటు సేంద్రియ పదార్థం అలాగే గాలి, నీరు, సూక్ష్మజీవులు, ఇతర క్రిమి కీటకాలు, వానపాములు, ఇతరత్రా పురుగులు ఉంటాయి. రసాయనికంగా ఉండే లవణాల పరిమాణం ఉదజని సూచిక, పోషకాల లభ్యత, సూక్ష్మజీవుల చర్య ఇవన్నీ మొక్కల పెరుగుదల, దిగుబడులు తద్వారా ఉత్పాదకశక్తి పై ప్రభావం చూపిస్తాయి. ఈ లక్షణాలన్నీ భూమి సారాన్ని తెలిపే సూచికలు. ఇవి భూమిలో ఎంత శాతం ఉన్నాయి ? పంటకెంత అవసరం ? ఏ విధంగా అందిస్తే మంచి ఫలితాలుంటాయి మొదలైన విషయాలు భూసార పరీక్షలలో తెలుస్తాయి.

భూసార పరీక్షా పత్రం ద్వారా లభించే సలహాలు:

 • భూసారాన్ని నిర్ధారించి రైతు వేయదలచిన పంటలకు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు ఖచ్చితమైన మోతాదులు నిర్ణయించడం.
 • సాగుకు అనుకూలంగా లేని ఆమ్ల భూములు, చౌడు భూముల్లో చాలా తక్కువ దిగుబడి వస్తుంది కనుక, వాటిని గుర్తించి బాగు చేసే విధానాలు, ఇతర యాజమాన్య పద్ధతులు సూచించడం.
 • ఎంపిక చేసిన నమూనాల్లో సూక్ష్మ పోషకాల విశ్లేషణ చేసి సలహాలు ఇవ్వడం

భూసార పరీక్షల్లో వివిధ దశలు :

 • మట్టి నమూనాలు సేకరణ
 • ప్రయోగశాలల్లో పరీక్షలు
 • ఫలితాలు ఆధారంగా ఎరువులు సిఫార్సులు, సమస్యాత్మక నేలలకు తగు సూచనలు.

భూసార పరీక్ష కొరకు మట్టి నమూనా సేకరణ ఆవశ్యకత

భూసార పరీక్షలకు మట్టి నమూనాల సేకరణ ముఖ్యమైన అంశంగా భావించాలి. సరైన నమూనా తీయడం కార్యక్రమ విజయానికి తొలిమెట్టు. తీసిన మట్టి నమూనా పొలంలోని మట్టి లక్షణాలకు ప్రాతినిధ్యం కలదిగాను, ప్రతి బింబించేదిగాను ఉండాలి. సరైన పద్దతిలో తగు జాగ్రత్తలతో తీసిన నమూనాల నుండి వచ్చే ఫలితాలు, సలహాలు లాభదాయకంగాను ఉంటాయి. భూసార పరీక్షా మట్టి నమూనాలు సేకరించడంలో కొన్ని మెళకువలు పాటించవలసి ఉంటుంది. ఒక మట్టి నమూనా సేకరించడానికి సుమారు ఒక గంట సమయం పడుతుంది.

భూసార పరీక్షకు మట్టిని పంపే పద్ధతి

 • పొలాలు ఖాళీగా ఉన్న సమయంలో ఎప్పుడైనా మట్టి నమూనాలు తీయవచ్చు.
 • సంవత్సరానికి ఒక పంట పండించే భూముల్లో ఫిబ్రవరి - ఏప్రిల్ మధ్యకాలం, రెండు పంటలు పండించే భూములల్లో మే నెలల్లో నమూనాలు సేకరించడానికి అనుకూలంగా ఉంటుంది.
 • మట్టి నమూనాల సేకరణకు పార, పలుగు అవసరమవుతాయి.
 • నేల రకం, రంగు, సాగునీటి వసతి, మెరక, పల్లం, సేద్య పద్దతులు, పంట దిగుబడిలోని వ్యత్యాసం ఆధారంగా వేరు వేరు నమూనాలు తీయాలి.
 • పొలం విస్తీర్ణం ఎంత తక్కువైనప్పటికీ తేడాలు గుర్తించినప్పుడు అన్ని నమూనాలు వేరుగా తీయాలి.
 • పొలమంతా ఒకేరకంగా ఉన్నప్పుడు 5 ఎకరాల విస్తీర్ణానికి ఒక్కో మట్టి నమూనా ప్రకారం తీస్తే సరిపోతుంది.

మట్టి నమూనా సేకరించే విధానం

 • మట్టి నమూనా తీయదలచిన పొలంలో 10-12 చోట్ల మట్టిని సేకరించాలి. నేలపై భాగంలోని చెత్త చెదారాన్ని తీసివేయాలి
 • పార ఉపయోగించి 'వి' ఆకారంలో 6 అంగుళాలు (15 సెం.మీ.) లోతు గుంత తీయాలి. పై నుండి దిగువ వరకు ఒకే మందంతో పలుచని పొర వచ్చే విధంగా మట్టిని తీయాలి.
 • ఇలా అన్ని చోట్ల తీసిన మట్టిని గోనెపట్టా లేదా పాలిథీన్ షీట్ లేదా గుడ్డమీద వేసి మట్టి గడ్డలను చిదిమి, బాగా కలిపి చతురస్రాకారంగా పరచి నాలుగు భాగాలుగా విభజించాలి. వీటిలో 1, 4 భాగాలు ఉంచుకుని, 2, 3 భాగాలలోని మట్టి తీసివేయాలి. మిగిలిఉన్న మట్టిని మరలా కలిపి అదే విధంగా 4 భాగాలుగా చేసి, 1, 4 భాగాలు ఉంచుకుని, 2, 3 భాగాలు తీసివేయాలి. ఈ పద్దతిలో సుమారు అర కిలో మట్టి మిగిలే వరకు ఈ విధంగా చేయాలి. నమూనాను శుభ్రమైన గుడ్డ సంచిలోగానీ, పాలిథీన్ సంచిలో గానీ వేయాలి. ఎరువులకు ఉపయోగించిన గోనె సంచులు, పాలిథీన్ సంచులు మట్టి నమూనాల సేకరణలో వాడకూడదు. మట్టి నమూనాలతో పాటు వివరాల పట్టికను సంచిలో ఉంచి పరీక్షా కేంద్రానికి పంపాలి.

మట్టి నమూనా సేకరించడంలో మెళకువలు

 • పొలంలోని మట్టి లక్షణాలకు పోలిక లేనిచోట్ల లేదా ప్రాతినిథ్యం వహించని చోట్ల మట్టి నమూనా తీయకూడదు. చెట్ల క్రింద, గట్ల పక్కన కంచెల దగ్గర, కాలి బాటలలో నమూనాలు తీయకూడదు. పశువుల ఎరువు, కంపోస్టు కుప్పలు నిల్వ ఉంచినచోట్ల నమూనాలు తీయకూడదు.
 • బాగా సారవంతమైన చోట్ల మరీ నిస్సారంగా ఉన్నచోట్ల మట్టిని కలిపి తీయకూడదు.
 • చౌడు భూముల్లో నమూనాలు విడిగా తీయాలి. వీటిని సాధారణ భూముల్లోని మట్టితో కలిపి తీయకూడదు.
 • రసాయనిక ఎరువులు వేసిన 45 రోజుల్లోపు నమూనా తీయకూడదు.
 • నమూనా తీసేటప్పుడు నేలపై ఉన్న ఆకులు, చెత్తా చెదారం తీసివేయాలే కానీ మట్టిని తొలగించకూడదు.
 • సాధారణంగా నీరు నిలిచి బురదగా ఉన్న నేల నుండి నమూనా తీయకూడదు. తవ్పనిసరిగా తీయవలసినప్పుడు నీడన ఆరబెట్టి పరీక్షకు పంపవచ్చు.
 • మెట్ట ఆరుతడి సేద్యంలో పైరు పెరుగుతున్న సమయంలో నమూనా తీయవలసినప్పుడు వరుసల మధ్య నుండి నమూనా సేకరించాలి..
 • చౌడు భూముల్లో 0-15 సెం.మీ. 15-30 సెం.మీ. లోతులో రెండు నమూనాలను తీయాలి.
 • పండ్ల తోటలు వేయవలసిన పొలాల్లో అయితే 5 ఎకరాల పొలంలో 3-4 చోట్ల 4-6 అడుగుల గుంతలు తీయాలి. పైన తెలిపిన విధంగా నమూనాలను 0-1 అడుగు వరకు ఒక నమూనా, 1-2 అడుగుల వరకు ఒక నమూనా, 2-3 వరకు ఒక నమూనా, 3-4 వరకు ఒక నమూనా, 4-5 వరకు ఒక నమూనా, 5-6 వరకు ఒక నమూనా మొత్తం 6 వరకు ఒక నమూనా మొత్తం 6 నమూనాలుగా వేరుగా తీసి పరీక్ష కొరకు వివరాలతో పరీక్షా కేంద్రానికి పంపాలి.

స్థూల పోషకాల ఫలితాల విశదీకరణ

లభ్య నత్రజని

వివరములు

లభ్య నత్రజని (కి/ ఎకరా)

తక్కువ

0-112

మధ్యస్థం

112-224

ఎక్కువ

224 కంటే ఎక్కువ

లభ్య భాస్వరం

వివరములు

లభ్య భాస్వరం (కి/ఎకరా)

తక్కువ

8

మధ్యస్థం

8-20

ఎక్కువ

20 కంటే ఎక్కువ

లభ్య పొటాష్

వివరములు

లభ్య పొటాష్ (కి/ఎకరా)

తక్కువ

60

మధ్యస్థం

60-120

ఎక్కువ

120 కంటే ఎక్కువ

అన్ని పైర్లకు భూసార పరీక్ష ఆధారంగా సిఫారుసు చేసిన ఎరువుల మోతాదు వాడినట్లయితే ఎరువులపై ఖర్చు తగ్గి రైతుకు లాభసాటిగా ఉంటుంది. సమస్యాత్మక భూముల్లో సమస్యలను సరిచేసినట్లయితే పోషకాల లభ్యత సక్రమంగా ఉంటుంది. కనుక సమస్యాత్మక భూముల్లో పోషక యాజమాన్యం కంటే భూములను సరిచేయడం చాలా ముఖ్యం.

3.00914634146
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు