హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / భూసారం, సాగునీరు పంట మొక్కల పరీక్షల విధానం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

భూసారం, సాగునీరు పంట మొక్కల పరీక్షల విధానం

నేలలు వాటిలోని సహజంగా ఉన్న పోషక పదార్ధాలతో పాటు, అదనంగా వేసిన సేంద్రీయ మరియు రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడుతాయి

భూసారం (మట్టి లేదా వృత్తిక) పరీక్ష

నేలలు వాటిలోని సహజంగా ఉన్న పోషక పదార్ధాలతో పాటు, అదనంగా వేసిన సేంద్రీయ మరియు రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడుతాయి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు చేయకుండా, భూసారాన్ని కాపాడుకుంటూ, అధిక మరియు సుస్థిర దిగుబడులను పొందవచ్చు. దీనికి సంభందించి రైతులు తమ పొలంలోని మట్టని 2 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. పోశక పదార్ధాల గురించేకాక, భూమిలోని చౌడు గుణాలను, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు కూడా మృతిక (మట్టి) పరీక్ష చేయించుకోవాలి.

భూసార పరీక్షలో అన్నింటి కన్నా ముందు తెలుసుకోవల్సిన విషయం మట్టి నమూనాను సేకరించడం. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరియైనది కానిచో, దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీని వలన చేయించిన భూసార పరీక్ష, దానికి అనుగుణఁగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేకాక, ఒక్కొకసారి తప్పుడు సిఫార్సులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి, మట్టి నమూనా సేకరణలో ఊ క్రింది జాగ్రత్తలను తప్పక పాటించాలి.

 • పొలంలో “V” ఆకారంలో 15 సెం.మీ. వరకు పారతో గుంట తీసి, అందులో పైపొర నుంచి క్రింది వరకు ఒక ప్రక్కగా మట్టిని సేకరించాలి.
 • ఈ విధంగా ఎకరా వస్తీర్ణంలో 8-10 చోట్ల సేకరించిన మట్టిని ఒక దగ్గర చేర్చి, బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదుటి భాగాలు తీసుకొని, మిగితా భాగాలు తీసివేయాలి. ఈ విధంగా మట్టి 0.5 కిలో వచ్చే వరకు చేయాలి.
 • ఇలా సేకరించిన మట్టిలో రాళ్ళు, పంట వేర్ల మొదళ్ళు లేనట్లుగా చూసుకొని, నీడలో ఆరనివ్వాలి.
 • మట్టి నమూనా సేకరణకు రసాయనిక/సేంద్రీయ ఎరువుల సంచులను వాడరాదు.
 • మట్టి నమూనా కొరకు పొలంలో మట్టిని త్రవ్వి, సేకరించినప్పుడు,
  • గట్ల దగ్గరలోను మరియుపంట కాలువలలోను మట్టిని తీసుకోరాదు.
  • చెట్ల క్రిందనున్న పొలం భాగం నుంచి మట్టిని సేకరించరాదు.
  • ఎరువు (పశువుల పేడ, కంపోస్టు, వర్మి కంపోస్టు, పచ్చిరొట్ట మొదలగునవి) కుప్పలు వేసి ఉంచిన చోట మట్టిని సేకరించరాదు.
  • ఎప్పుడూ నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు.
 • పోలంలో వాలు ఎక్కువగా ఉన్నప్పుడు, దానిని ఎత్తు, పల్లపు ప్రాతాలుగా విభజించి వేరు మట్టి నమూనాలను సేకరించాలి. అటువంటి సందర్భాల్లో కూడా, పైన తెలిపిన జాగ్రత్తలు పాటించాలి.
 • పొలంలో అక్కడక్కడ చౌడు ప్రాంతంగా ఉన్నట్లు అనుమానం కలిగితే అక్కడి నుంచి ప్రత్యేకంగా నమూనాను తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పంపాలి. అంతేగాని, అటువంటి మట్టిని బాగుగా ఉన్న ఇతర ప్రాంతపు మట్టితో కలుపరాదు.
 • పండ్ల తోటలకు అనువైన నేలలను గుర్తించునప్పుడు గాని, పండ్ల చెట్లకు ఏవైనా పోషక పదార్ధాలు మరియు ఇతర సమస్యల గుర్తింపు కొరకు మట్టి నమూనాను ఈ క్రింది విధంగా తీసుకొవాలి.
  • సాధారణంగా పంటను బట్టి 3 నుండి 6 అడుగుల (1-2 మీ) లోతు ఏవైనా పోషక పదార్ధాలు మరియు ఇతర సమస్యల గుర్తింపు కొరకు మట్టి నమూనాలను ఈ క్రింది విదంగా తీసుకోవాలి.
  • మట్టి నమూనా కొరకు గుంట త్రవ్వినప్పుడు ఏవైనా గట్టి పొరలు ఉన్నట్లయితే వాటి లేతు మరియు వాటి లక్షణాలు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
  • పండ్ల తోటల విషయంలో ఇలాంటి నమూనా సేకరణ ఎకరాకు 2-4 చోట్ల నుంచి చేస్తే చాలా మంచిది.
 • ఇటువంటి నమూనాలను పరీక్ష కొరకు పంపునప్పుడు “పండ్ల తోటలకు అనువైన పరీక్షల కొరకు” అని తెలియజేయాలి.
 • పొలంలోని పలు ప్రాంతాల (8-10 చోట్ల) నుండి సేకరించిన మట్టిని ల దా పండ్ల తోట కొరకు తీసిన మట్టిని గాని, కలిపేందుకు యూరియా లేక ఇతర ఎరువుల సంచులను వాడరాదు. ఇందు కొరకు శుభ్రమైన ప్లాస్టిక్ షీటును ఉపయోగించుట మంచిది.
 • ఈ విధంగా సేకరించిన మట్టిని బాగా నీడలో గాలికి ఆరిన తరువాత మంచి ప్లాస్టిక్ బ్యాగులో గాని, గుడ్డసంచిలో గాని నింపి, తమకు సమీపంలోని వ్యవసాయ శాఖకు సంభందించిన భూసార పరీక్షా కేంద్రానికి ఈ క్రింది సమాచారంలో పంపాలి.
  1. పైతు పేరు, సర్వే నెంబరు, గ్రామం, మండలం
  2. కావలసిన పరీక్ష (భూసార చౌడు పండ్లతోట ఎంపికకు)
  3. ఇంతకు మునుపు పంట, దానికి వాడిన ఎరువులు
  4. వేయబోవు పంట
 • సాధారణంగా రైతులు కాగితంలో పైన తెలిపిన విషయాలు వ్రాసి మట్టి నమూనాతో పాటు సంచిలో వేసి, భూసార పరీక్ష కేంద్రానికి పంపుతుంటారు. దీనితోపాటు, మరొక కాగితంపై ఇదే విషయాలు వ్రాసి పైన జత చేసి పంపితే బాగుటుంది. వివరాలను వ్రాయటానికి పెన్సిల్ ఉపయోగిస్తే మేలు.

భూసార పరీక్ష విశ్లేషణ ద్వారా ఎరువుల సిఫార్సు

భూసార పరీక్షల తరువాత అందిన సారాంశ పత్రాన్ని విశ్లేషించి సిఫార్సు ఎరువుల మొతాదును కనుగొనవచ్చును. సాధారణంగా ఈ మోతాదును సారాంశ పత్రములోనే పొందుపరిచి ఉంటుంది. రైతాంగం లేక అధికారులు తమకు ఈ సారంశ పత్రాన్ని క్రింద విధంగా విశ్లేషిచవచ్చును.

ఉదజని సూచిక

దీని పరిమాణము 8.5 కాని అంతకన్నా ఎక్కువ ఉన్నచో పరీక్షించిన నేల చౌడుకు గురైనట్లుగా భావించాలి. ఇటువంటి పరిస్థితులలో ప్రత్యేకముగా అదే పొలం మట్టి నమూనాను చౌడు కోసం ప్రత్యేకంగా పరీక్షకావించి “జిప్సం”ను వాడవలసి ఉంటుంది.

లవణ సూచిక

దీని యొక్క సంఖ్య 4 కు మించినప్పుడు, చౌడు నేలలుగా భావించాలి. ఇటువంటి నేలల్లో చౌడు యాజమాన్య పద్దతులు పాటించాలి.

కొన్ని సందర్భాల్లో ఉదజని సూచిక 8.5 కన్నా, లవణ సాంద్రత 4 కన్నా ఎక్కువగా ఉంటే పొలమును నల్లకారు చౌడు భూమిగా పరిగణించి దానికి సంబంధించిన యాజమాన్య పద్దతులను పాటించాలి.

సేంద్రీయ కర్బనము

ఇది సాధారణముగా 0-0.5 కన్నా తక్కువగా లేక 1.0 శాతం వరకు ఉంటుంది. రాష్ట్రంలో అన్ని నేలలు అటువంటి పరిస్థితి కలిగి ఉన్నందున రైతాంగం తప్పని సరిగా తమ పంటలకు సేంద్రీయ ఎరువులను (పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, కంపోస్టు, వర్మి కంపోస్టు, పచ్చిరొట్ట చెక్క పిండి మొదలగునవి) ధారాళముగా క్రమం తప్పకుండా వాడాలి.

లభ్య నత్రజని

ఇది పరీక్ష కావింపబడిన మట్టి నమూనాలలో ఎకరానికి 112 కిలోలు కన్నా తక్కువగా ఉన్నప్పుడు పంటలో సిఫారసు మోతాదు యూరియా కన్నా 25 నుండి 30 శాతం అధికంగా వాడాలి. ఈ లభ్య నత్రజని ఎకరానికి 112 నుండి 224 కిలోలు ఉన్నప్పుడు, సిఫారసు యూరియాను మాత్రమే వాడాలి. అన్ని పరిస్థితులలో సిఫారసు మోత్తం నత్రజనిని పంటకాలంలో 3 నుండి 4 దఫాలుగా వాడాలి.

లభ్య భాస్వరము (P2O5)

మట్టి నమూనా పరీక్షలో దీని విలువ ఎకరానికి 10 కిలోల వరకు ఉన్నప్పుడు సిఫారసు చేసిన భాస్వరము మోతాదును 25 నుండి 356 శాతం పెంచి వాడాలి. లభ్య భాస్వరము ఎకరానికి 24 కిలోల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు సిఫారసు చేసిన మోతాదులో 25 నుండి 30 శాతం భాస్వరము ఎరువును తగ్గించి వాడాలి. ఎకరానికి 11 నుండి 24 కిలోల లభ్య భాస్వరము ఉన్న నేలల్లో సిఫారసు చేసిన ఎరువు మోతాదునే వాడాలి. అన్ని సందర్భాల్లోను సిఫారసు చేసిన భాస్వరము ఆఖరి దుక్కిలో మాత్రమే వేయాలి. పై పాటుగా భాస్వరము ఎరువులను వాడరాదు.

లభ్య పొటాషియం(K2O)

మట్టి నమూనా పరీక్షలలో దీన విలువ ఎకరానికి 58 కిలోల కన్నా చక్కువగా ఉంటే సిఫారసు చేసిన పొటాఫ్ ఎరువు కన్నా 25 నుండి 30 శాతం ఎక్కువగా వాడాలి. అదే విధముగా లభ్య పొటాషియం ఎకరానికి 136 కిలోల కన్నా ఎక్కువగా ఉంటే సుఫారసు మోతాదులో 25 నుండి 30 శాతం తక్కువ వేసి వాడాలి. అదే 58 నుండి 136 కిలోల లభ్య పొటాషియం ఎకరానికి ఉండే సిఫారసు చేసిన మోతాదును మాత్రమే వాడాలి.

లభ్య గంధకం

మట్టి పరీక్ష సారాంశ పత్రములో దీని విలువ 10 మి.గ్రా/గ్రా. లేక తక్కువ లేక లోపం అని సూచించినప్పుడు పంటకు సిఫారసు చేసిన జిప్సం ను ఆఖిరి దుక్కిలో వేసి పంటకు అందించాలి.

లభ్య సూక్ష్మపోషకాలు

సాధారణముగా జింకు మరియు బోరాన్ లేపాలు మట్టి నమూనా విశ్లేషణ పత్రంలో ప్రాముఖ్యమైన సూక్ష్మపోషకాలు. జింకు మోతాదు మట్టిలో 0.6 మి.గ్రా/గ్రా. మరియు బోరాన్ 0.52 మి.గ్రా/గ్రా. కాని అంతకన్నా తక్కువగా కాని ఉన్నప్పుడు లేక సంబంధిత పోషకాన్ని తక్కువ లోపం అని పేర్కొన్నప్పుడు సిఫారసు చేసిన సంబంధిత ఎరువులను వాడాలి.

సిఫారసు లభ్య నత్రజని విలువ ఎకరాకి లభ్య భాస్వరం విలువ ఎకరాకి లభ్య పొటాషియం విలువ ఎకరాకి
1. మొతాదు కన్నా 25-30% ఎక్కువ <112 <11 <58
2. సిఫారసు మొతాదు మాత్రమే 112 - 224 11 - 24 58 - 136
3. మోతాదు కన్నా 25-30% తక్కువ >224 >24 >136

సాగునీటి పరీక్ష

ఇంతకు పూర్వం సాగునీటి యొక్క నాణ్యతపై ఎక్కువ అనుమానాలు లేక రైతులు నిర్భయంగా వాడుతుండేవారు. కాని పెరుగుతున్న నీటి కొరత వలన భూమిలోని ఎక్కువ లోతు లోని పొకల నుండి నీటిని తోడుట వలన (బోర్డు) ఎక్కువ లవణాలు నేల ఉపరితలంపై చేరి పంట ఎదుగుదలకు హాని కారకమౌవుతున్నది. దీని వలన పంటలు సరిగ్గా ఎదగక పోవటమే కాకుండా, నేలలు కూడా బాగుచేసేందుకు వీలుపడని రీతిలో చెడిపోయేందుకు ఆస్కారమున్నది. ఇటువంటి ప్రతికుల పరిస్థితులు ఏర్పడకుండా, క్రొత్తగా త్రవ్విన బోరు బావుల నీరును, నర్సరీల కొరకు వేరే ప్రాంతం నుండి తప్పించి వాడే నీటిని మొదట పరీక్ష చేసి ఆ తరువాత వాడుకోవటం మంచిది.

 • సాగునీటి పరీక్ష కొరకు పొలంలోని బోరు బావి నీటిని పంపులో సుమారు 20-30ని. బయటకు వదిలిపెట్టిన తర్వాత మంచి ప్లాస్టిక్ సీసాలో సుమారు 500 మి.లీ.(అర లీటరు) తీసి సమీప భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. వీలైనంత వరకు గజు సీసా కంటే ప్లాస్టిక్ సీసా వాడటం శ్రేయస్కరం. మందు సీసాలను, టానిక్ సీసాలను వాడరాదు. నీటి నమూనాను తీసి సీసాను అదే నీటిలో 3-4 సార్లు కడిగి, ఆ తురవాత నీటి నమూనాతో నింపుకోవాలి. సీసా మూతలో గాలి లేకుండా నీటిలో పూర్తిగా నింపాలి.
 • కాలువలు లేదా చెరువుల నుండి నమూనా నీటిని తీసేటప్పుడు ఒక పెద్ద కర్రకు చిన్న బకెట్ ను కట్టి ఒడడ్కు దూరంగా నీటిని తీయాలి. ఆ నీటిలో సీసాను 2-3 సార్లు కడిగి, ఆ తరువాత నమూనాతో నింపాలి.
 • ఒక్కొక్కసారి పరిశ్రమల నుండి మదిలి పెట్టబడిన నీటిని కూడా పరీక్ష చేయవలసి వస్తుంది. అటువంటి సందర్భాలలో ఆ నీరు పొలంలో మొదట ప్రవేశించే స్థలం వద్ద నీటి నమూనా తీయాలి. అలాగే వీలయితే అదే నీరు పరిశ్రమ ఆవరణం నుండి బయటకు వచ్చిన ప్రాంతం నుండి కూడ నమూనాను తీసి పరీక్ష కోసము పంపితే, రెండింటి నీటి నాణ్యత పోలిక లేక వ్యత్యాసాన్ని గమనించవచ్చు.
 • సాగునీటి నాణ్యత పరీక్ష కొరకు నమూనాను వంటనే దగ్గరలోని సమీప భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. నమూనాతో పాటు రైతు పేరు, సర్వే నెంబరు, బోరు లేక కాలువ వివరాలు, గ్రామం, మండలం తదితర విషయాలు తెలియజేయాలి.

పంట మొక్కలు / పండ్ల చెట్ల ఆకుల నమూనా పరీక్ష

కొన్ని పరిస్థితులలో ముఖ్యంగా పండ్ల తోటల్లో చెట్లు కొన్ని సంవత్సరాల తరువాత భూమి అడుగు పొరలలోని ప్రతికుల పరిస్థితుల వలన గాని, భూమి నిస్సారమవటం వలన గాని పోషక పదార్థముల లోప లక్షణాలు చూపిస్తాయి. ఇటువంటి పందర్భాల్లో నేల ఉపరితల పొరల మట్టి కన్నా, చెట్ల యొక్క భాగాలను, ముఖ్యంగా ఆకులను పరీక్ష చేసి పోషక పదార్ధాల లోపాలను సవరించుకోవచ్చు. క1న్ని పరిస్థితుల్లో సాధారణ వార్షిక పంటలలో కూడా పంట నాటిన తరువాత పోషక పదార్ధాలు, ముఖ్యంగా సూక్ష్మపోషక పదార్దల లోపాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితుల్లో పంట యొక్క భాగాలను పరీక్ష చేయించి తదనుగుణంగా చర్యలు తీసుకొని మంచ దిగుబడి మరియు నాణ్యత తగ్గకుండా చేయికోవచ్చు.

 • పంట యొక్క ఆకులు మరియు పండ్ల చెట్ల ఆకులలో ఏవైనా లోపాలున్నట్లు సందేహం కలిగినప్పుడు ముఖ్యంగా అవి పెరగకుండా, చిన్నవిగా, పసుపు రంగుగా లేక ఎర్రగా మారుతున్నట్లయితే వెంటనే పరీక్ష చేయించాలి. అయితే ఈ చిన్న కీటకాలు లేదా రోగం వలన వచ్చనవి కావని నిరాధారణ చేసుకున్న తరువాతే మొక్క / చెట్టు ఆకులను పోక పదార్ధ లోపాల కొరకు పరీక్ష చేయించాలి. ఇటువంటి పరీక్ష కొరకు, ఏ పంటలో ఏ భాగాన్ని పరీక్షకు పంపాలో పట్టికలో యివ్వబడింది. నిర్ధిష్టమైన సంఖ్య లేనప్పటికి, పరిస్థితులకనుగుణంగా ఒక ఎకరాలో సందేహాస్పదముగా ఉన్న 8-10 చోట్ల ఆకులను సేకరించి నమూనాగా పంపాలి.
 • నమూనా కొరకు తీయవలసిన పంట ఆకులను శుభ్రమైన చేతులతో త్రుంచి / తీసి మంచి నీటిలో బాగా కడిగి ఆరబెట్టి మంచి కాగితపు సంచిల్లో వేసి కావలసిన సమాచారాన్ని (రైతు పేరు, పంట పేరు, గ్రామం, మండలం తదితర వివరాలు పొందుపరచి) ప్రయోగశాలకు పంపాలి.
 • ఈ పరీక్షలకు 4-5 రోజుల్లో పూర్తి చేయించుకునే ఏర్పాటు చేసుకోవాలి.
 • ప్రస్తుతం ఈ పరీక్షలను ద్రాక్ష, అరటి మరియు ఎగుమతికి అనువైన పండ్లతోటల్లో పాటిస్తున్నారు. ఈ పరీక్షల కొరకు ప్రత్యేక సదుపాయాలు కలిగిన ప్రయోజనాలు కలిగిన ప్రయోగశాలలు కావలసిఉన్నందున ఇప్పుడుప్పుడే ఇవి ప్రాచూర్యంలోకి వస్తున్నవి.
పంట పేరు పరీక్ష కొరకు సేకరించాల్సిన భాగం
మామిడి పూర్తిగా తయారైన క్రొత్త ఆకు
చినీ, నిమ్మ పూర్తిగా తయారైన క్రొత్త ఆకు (కొమ్మ చివరన)
అరటి పై నుండి 3 వ ఆకు (ఈనె తీసివేసి)
ద్రాక్ష 5వ ఆకు తొడిమ
వరి పై నుండి 3వ ఆకు
చెఱకు పై నుండి 3 నుండి 5వ ఆకు
ప్రత్తి పై నుండి 3వ ఆకు

పరీక్ష ఫలితాలు విశ్లేషణ

సాగు నీటి, పంట ఆకుల పరీక్షా ఫలితాలను విశ్లేషించేందుకు పరీక్షలు జరిపిన చోట ఉన్న అధికారుల సహాయం తీసుకోవాలి. ఫలితాలు పోస్టు ద్వారా వస్తే, సమీపంలో ఉన్న వ్యవసాయశాఖ అధికారులను గాని వ్యవసాయ పరిశోధన స్థానాల్లోని సంబంధిత శాస్త్రవేత్తలను సంప్రదించాలి. తదనుగుణంగా చర్యలు తక్షణం తీసుకోవాలి.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు