పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మల్బరీ సాగు, పట్టు పరుగుల పెంపకం

ప్రకృతి సిద్ధముగా లభించే పట్టు నాలుగు రకములు. ‘మల్బరీ’ , ‘మూగ’ , ‘ఇరి’ మరియు ‘దసళీ’ పట్టు. వీటిలో మల్బరీ పట్టుకు ప్రేత్యేకమైన స్ధానం కలదు.

ప్రకృతి సిద్ధముగా లభించే పట్టు నాలుగు రకములు. ‘మల్బరీ’ , ‘మూగ’ , ‘ఇరి’ మరియు ‘దసళీ’ పట్టు. వీటిలో మల్బరీ పట్టుకు ప్రేత్యేకమైన స్ధానం కలదు. మన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ మరియు జగిత్యాల జిల్లాలు మల్బరిని విరివిగా సాగు చేస్తూ, మల్బరీ పట్టు ఉత్పత్తిలో ప్రాముఖ స్ధానం పోషిస్తూన్నాయి. దసళీ పట్టు (టస్సార్) కరీంనగర్ మరియు ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ‘మూగ’ మరియు ‘ఇరి’ పట్టున ఈశాన్య రాష్ట్రాలలో విరివిగా సాగు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టు ఉత్పత్తి పెంచే ఉద్దేశ్యంతో బైవోల్టయిన్ క్లస్టర్ లను ఏర్పాటు చేసింది. పట్టు రైతులను పోత్సహించే ఉద్దేశ్యముతో వివిధ రకములైన సబ్సిడీలను రేరింగు గది నిర్మించుటకు పరికరములకు మరియు మొక్కలపై అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకంగా రూ. 75/కిలో బైవోల్టయిన్ పట్టు గుళ్ళకు రైతులకు అదనముగా అందజేయుచున్నారు. గత సంవత్సరం భారతదేశం 2800 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని పట్టు ఉత్పత్తులపై గడించింది .

మల్బరీ పట్టు ముఖ్యముగా రెండు దశలు ఉంటాయి

1) మల్బరీ సాగు 2) పట్టు పురుగుల పెంపకం.

‘మల్బరీ’ సాగు

మల్బరీ సాగును ‘మోరి కల్చర్’ అంటారు. మల్బరీ బహువార్షిక పంట. ఒక్కసారి నాటిన మొక్క నుండి సుమారు 10-15 సం. వరకు ఆకును దిగుబడిగా పొందవచ్చును.

మల్బరీ ప్రత్యుత్పత్తి ముఖ్యముగా రెండు రకాలు

విత్తనం నుండి వచ్చే మొక్కలు

మల్బరీ పండ్లను ఎండబెట్టి వచ్చే విత్తనం ద్వారా వచ్చే మొక్కలు. ఈ విధమైన ప్రత్యుత్పత్తికి ఎక్కువ సమయం పడుతుంది.

శాఖియముగా (కట్టింగ్స్) ద్వారా వచ్చే మొక్కలు

శాఖీయ ప్రత్యుత్పత్తి (కట్టింగ్స్) ద్వారా మొక్కలను పెంచే విధానం అత్యుత్తమమైనది. ఈ విధానములో ఎక్కువ సమయంలో నాణ్యమైన ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేయవచ్చును.

శాఖీయ పధ్ధతి (కట్టింగ్స్) ఎంపిక

మొక్కల కొమ్మలు పెన్సిల్ మందము మరియు సుమారు 8-10 నెలల వయస్సు కలిగిన వాటిని 3-4 మొగ్గలు ఉండే విధముగా కత్తిరించుకోవలెను. నర్సరిలో పెట్టునపుడు రెండు మొగ్గలు భూమి లోపల మరియు 2 మొగ్గలు పైకి కనబడునట్లుగా నాటుకోనవలెను. సుమారు 2-3 నెలల తర్వాత పెరిగిన మొక్కలు పొలంలో నటుకోనడానికి సరిపడ ఆరోగ్యమును సంతరించుకొంటాయి. మొక్కలు నర్సరిలో ఉన్నప్పుడు అవసరమైన మేరకు నీటిని తడులుగా పెట్టుకోవాలి.

నేలలు

ఎటువంటి నేలలోనైన ‘మల్బరీ’ సాగు చేయవచ్చును. నల్లరేగడి లేదా తేలికపాటి ఇసుక నేలలైతే శ్రేయస్కరం. నేల స్వభావాన్ని బట్టి మల్బరీ ఆకు దిగుమతి మరియు పట్టు గుళ్ళు (కాకూన్) బరువు ఆధారపడి ఉంటుంది. తటస్ద నేలలు ఉదజని సూచిక 6.2 – 6.8 గల నేలలు శ్రేయస్కరం. ఒక వేళ నేలలు క్షార స్వభావం కలిగి ఉంటె జిప్సమ్ లేదా సల్ఫర్ వేసి వాటిని తటస్ధ స్ధితికి తీసుకు రావాలి.

నేల తయారీ

మొక్కలు నాటే ముందు 1-2 సార్లు దున్నాలి. తరువాత బోదెలు వేసుకోవాలి. పశువుల ఎరువు 10-20 ట/ఎకరాకు వేసినట్లయితే మంచి దిగుబడి పొందవచ్చును.

శీతోష్ణస్ధితి

సముద్ర మట్టమునకు 600 – 700 మి.మీ. పైన కూడా మల్బరీని సాగు చేయవచ్చును. మధ్యస్ధ వర్షపాతం 600-2500 మి.లీ. 24-28 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం 65-80% మరియు 9-13 గం/రోజుకు కాంతి గంటలు సరిపోతాయి.

నాటే కాలం

నీటి వసతి ఉన్న, లేకున్నా ఋతుపవన వర్షాల తర్వాత నాటడం ఉత్తమమైన పధ్ధతి. మొక్కలను ఉత్తరం – దక్షిణం లేదా తూర్పు – పడమర దిశలో నాటుకోవాలి.

నాటే పద్ధతులు

బోదెల పధ్ధతి (రో - సిస్టమ్)

నీటి వసతి వున్న ప్రాంతాలలో ఈ పధ్ధతి పాటిస్తారు. 60 సెం.మీ. సాళ్ళ మధ్య మరియు 60 సెం.మీ. మొక్కల మధ్య ఎడం ఉండేటట్లు మొక్కను బోదె పై నుండి 1/3 ప్రాంతంలో నాటుకోవాలి.

గుంతల పధ్ధతి (హిట్ సిస్టిమ్)

నీటి వసతి లేని ప్రాంతాలలో ఈ పద్ధతిని అనుసరిస్తారు. ఈ పద్ధతిలో 40 x 40 x 40 సెం.మీ. గుంతలు తీసి దాంట్లో మూడు మొక్కలను త్రిభుజాకారంలో నాటుకోవాలి. గుంతలను బాగా చివికిన పోశువుల ఎరువులో కలిపిన మట్టితో నింపడం వలన మొక్కలు బాగా ఎదిగి, దిగుబడి బాగా వస్తుంది.

‘కోలార్’ పధ్ధతి

బోదెల పద్ధతిలో కొద్ది మార్పులు చేయడం వలన ‘కోలార్’ పద్ధతి వచ్చింది. ఈ పద్ధతిలో సాళ్ళ దూరం 10-15 సెం.మీ పాటిస్తారు. ఈ పద్ధతిని కర్ణాటకలో ‘కోలార్’ అను ప్రాంతంలో విరివిగా అనుసరిస్తారు .

జోడు వరుసల/జోడు సాళ్ళ పధ్ధతి

నారు మొక్కలను జోడి వరుసల విధానంలో (5+3) x 2 అడుగుల స్ధలవకశంతో నాటుకోవాలి. ఈ పద్ధతిలో యంత్రికరణ ద్వారా అంతర కృషి చేయడం సులువుగా వుంటుంది. నిటివసతి వున్న చోట ఈ పద్ధతిని విరివిగా అవలంభిస్తారు.

‘కోలార్’ పధ్ధతి

బోదెల పద్ధతిలో కొద్ది మార్పులు చేయడం వలన ‘కోలార్’ పధ్ధతి వచ్చింది. ఈ పద్ధతిలో సాళ్ళ మధ్య దూరం 30-45 సెం. మీ. మరియు మొక్కల మధ్య దూరం 10-15 సెం.మీ పాటిస్తారు. ఈ పద్ధతిని కర్ణాటకలో ‘కోలార్’ అను ప్రాంతంలో విరివిగా అనుసరిస్తారు.

జోడు వరుసల/జోడు సాళ్ళ పధ్ధతి

నారు మొక్కలను జోడి వరుసల విధానంలో (5+3) x 2 అడుగుల స్ధలవకశంతో నాటుకోవాలి. ఈ పద్ధతిలో యాంత్రికరణ ద్వారా అంతరకృషి చేయడం సులువుగా వుంటుంది. నిటివసతి వున్న చోట ఈ పద్ధతిని విరివిగా అవలంభిస్తున్నారు.

మల్బరీ వృక్షాల పధ్ధతి

ఉష్ణ ప్రదేశాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా వుండే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో మరియు ఎగుడు దిగుడు ప్రాంతాలలో ఈ పద్ధతి అవలంభించడం శ్రేయస్కరం. ఈ పద్ధతిలో మల్బరిని పొదలుగా కాకుండా 4-5 అడుగుల ఎత్తు పెంచి, ఆ ఎత్తులో కొమ్మలు పెరిగేలా శిక్షణ ఇచ్చి, ఆ కొమ్మలతో పట్టు పురుగుల పెంపకము చేపట్టుట. నారుముడిలో 10-12 నెలల వయస్సు గల 5-6 అడుగుల ఎత్తు గల నారు మొక్కలతో తోట నాటాలి. 8*8 అడుగుల స్ధలవాకాశములో నాటుకోవాలి. నాటిన తర్వాత 3 అడుగుల ఎత్తులో కత్తిరించి కొమ్మలు పెరిగేలా జాగ్రత్త వహించాలి. ఈ పద్ధతిలో మల్బరీ మొక్కలు పెంచినపుడు వేర్లు నేల లోపలి పొరల్లోకి చొచ్చుకొని పోవడం వలన నీటిని సంగ్రశించే శక్తి పెరిగి, నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. ఈ పద్ధతిలో మొక్కలను చిన్న వృక్షాలుగా పెంచటం వలన కంచెలు వేసి పశువుల నుంచి రక్షించవలసిన అవసరముండదు కావున బీడు భూముల్లో కూడా సాగు చేయవచ్చును. ఈ పద్ధతిలో ట్రాక్టర్ లేదా పవర్ టిల్లర్ తో పూర్తిగా అంతర కృషి నిర్వహించావచ్చును. భూసార పరిరక్షణకు పచ్చిరోట్ట ఎరువు పంటలు, అంతర పంటలుగా వేరుశనగ, శనగ, పాలకూర మొదలైన ఆకు కూరలను సాగు చేసుకోవచ్చును.

ముఖ్యమైన మల్బరీ రకాలు

నీటి వసతి వున్న ప్రాంతాలకు అనుకూలమైన రకాలు

వి1 : తెలంగాణలో ఎక్కువ విస్తిర్ణంలో వున్న రకము. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎకరాకు 24 టన్నులు / ఎకరాకు / సం. దిగుబడి వస్తుంది.

ఎస్36 : కొమ్మలు నిటారుగా పెరిగి, ముదురు ఆకు పచ్చరంగు కల్గిన ఆకులు ఉంటాయి. ఎకరాకు 16 ట/ఎ/సం. దిగుబడి వస్తుంది.

ఎస్30 : ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో పడవ ఆకారంలో మెరుస్తూ ఉంటాయి. ఆకులు చాకి మరియు పెద్ద పురుగుల పెంపకానికి అనువైనవి. దిగుబడి 16 ట/ఎ/సం. వస్తుంది.

ఆర్.ఎఫ్.ఎస్-175 : ఎక్కువ తేమ శాతం కల్గి, ఎక్కువ సమయం తేమను నిల్పుకునే శక్తి రకము. దిగుబడి 18 ట/ఎ/సం. వస్తుంది.

నీటి వసతి లేని ప్రాంతాలకు అనుకూలమైన రకాలు

ఎమ్.జి.ఎస్.-2

2015 సంవత్సరములో విడుదలైన నూతన వంగడము. ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న రకము. దిగుబడి 22.7 ట/ఎ/సం. వస్తుంది.

అనంత

ఆకుపచ్చ రంగు కల్గిన ఆకులు, చాకి మరియు పెద్ద దశ పురుగుల పెంపకానికి అనుకూలం. దిగుబడి 24 ట/ఎ/సం. వస్తుంది.

ఎస్-13 : దశినా భారతదేశ సమాషాతోష్ణ మండల పరిస్ధితులు అనుగుణంగా ఎర్రనేలలకు తగినది. దిగుబడి ఒక ఎకరానికి 5.2-6.4 టన్నులు/ఎకరాకు/సం. వస్తుంది.

ఆర్.సి-1: నీటి లభ్యత సిఫారను మేతదులో 50 శాతము తక్కువైనా తట్టుకోగల రకము. షిపారసు మేతదులో 50 శాతం వరకు ఎరువులు తగ్గించిన కూడా తట్టుకొని 9-10 టన్నుల ఆకూ దిగుబడిని ఒక ఎకరాణికిస్తుంది.

ఆర్.సి-2 : తక్కువ నీటి వసతి గల ప్రాంతాలకు అనువైనది ఆకు దిగుబడి 8- 9 టన్నులు/ఎకరాకు/సం. వస్తుంది.

ప్రత్యెక పరిస్దితులకు అనువైన రకాలు

సహన

నీడను తట్టుకునే రకము. కొబ్బరి తోటల్లో అంతర పంటగా పండించావచ్చును. దిగుబడి 10-12 ట/ఎ/సం. వస్తుంది

ఎ.ఆర్-12 : ఎక్కువ క్షార స్వభావం కల్గిన నెలలకు (ఉదజని సూచి – 9.5 వరకు) అనుకూలమైన రకము. దిగుబడి 10 ట/ఎ/సం. వస్తుంది.

జి-2 : చాకీ పౌరుగుల పెంపకానికి అనువైన రకము. కొమ్మ కత్తిరింపు జరిపిన వెంటనే చిగురిస్తుంది. దిగుబడి 15 ట/ఎ/సం. వస్తుంది.

జి-4 : దశినా భారత దేశ రాష్ట్రాలకి సిపారేసు చేయబడిన వంగడం, ఆకులూ ముదురు ఆకు పచ్చరంగులో, ఉపరితలం అలలుగా ఉంటాయి. ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. ఆకు దిగుబడి 26 ట/ఎ/సం. వస్తుంది.

మైసూర్ -5 : వివిధ రకాల వాతావరణ పరిస్దితులను తట్టుకునే రకము. 70% తేమ, 18% ప్రోటిను మరియు 20% పిండి పదార్ధాలు కల్గిన రకము. దిగుబడి 12-14 ట/ఎ/సం. వస్తుంది

నీటి యాజమాన్య పద్ధతులు

కాలువల పధ్ధతి (బర్రోమెధడ్)

కాలువలో నీరు పరిచినపుడు రెండు బోదెలు తడిచి మొక్కలకు నీరు అందించవచ్చును. వర్షాకాలంలో, ఈ కలువలే నీటిని తీసివేయటానికి కూడా ఉపయోగపడుతాయి. నీటి వసతి ఉన్న చోట ఈ పద్ధతిని అనుసరిస్తారు.

బిందు సేద్యము (డ్రిప్ ఇరిగేషన్)

నీటి వసతి తక్కువగా వున్నచోట ఈ పధ్ధతి ఉపయోగపడుతుంది. మొదట ఖర్చు ఎక్కువైనా నీటి ఎద్దడి ప్రాంతాలలో బహుళ ప్రయోజనకారిగా వుంటుంది.

భుసార పరిరక్షణ

పశువుల ఎరువు 8 టన్నులు / ఎకరాకు (6 ట్రాక్టర్లు). సంవత్సరానికి 4 విడతలుగా వేయాలి. అదే చాకి తోట అయితే 16 టన్నులు వేయాలి.

రసాయనిక ఎరువులు

నారు మొక్కలు నాటిన 30 రోజుల తర్వాత ఎకరాకు నత్రజని : భాస్వరము : పోటాష్ – 20:20:20 కేజీలు ఇవ్వడం శ్రేష్ఠము.

నిటివసతి ఉన్న చోట : (కేజీ/ఎ/సం.)

 • నత్రజని : భాస్వరం : పోటాష్ 120:48:48
 • మొదటి సారి ఆకు కోసిన తర్వాత 24:24:24
 • రెండవ సారి ఆకు కోసిన తర్వాత 24:0:0
 • మూడవ సారి ఆకు కోసిన తర్వాత 24:0:0నాలుగవ సారి ఆకు కోసిన తర్వాత 24:0:0
 • నాలుగవ సారి ఆకు కోసిన తర్వాత 24:0:0
 • ఐదవ సారి ఆకు కోసిన తర్వాత 24:0:0

నిటివసతి లేని చోట : (కేజీ/ఎ/సం.)

 • నత్రజని : భాస్వరం : పోటాష్ 40:20:20
 • జూన్ – ఆగష్టు – 20:20:20
 • సెప్టెంబర్ – నవంబర్ – 20:0:0

గమనిక

రసాయనిక ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ వుండాలి. నత్రజని కొరకు యూరియాను వేయడం మంచిది కాదు. దీని వలన క్షారగునమున్న నేలల్లో ఎక్కువ నత్రజని నష్టం జరుగుతుంది. తక్కువ మినరలైజేషన్ ఉంటుంది. అందుచేత అమ్మోనియం సల్ఫేట్ రూపంలో ఇచ్చిన ఎడల దీనిలో ఆమ్ల గుణం వల్ల భూమి యొక్క ఉదజని సూచిక తగుతుంది.

జీవన ఎరువులు

నత్రజనిని స్దిరికరించు అజటోబాక్టీరియా, అజోస్పైరిల్లం లను ఎకరానికి 80 కిలోలు/సం. వాడిన మంచి దిగుబడులు పొందవచ్చును. నీటిని ప్రతి పంటకి 1.6 కేజీలు 50 కిలోల మగ్గిన పశువుల ఎరువులో కలీపి తోట కత్తిరించిన 20-25 రోజుల తరువాత వేయాలి. దీని వలన రసాయనిక ఎరువుల మోతాదును 20-30 శాతము వరకు తగ్గించుకోవచ్చును .

వర్మి కంపోస్టు

ఒక టన్ను వర్మి కంపోస్టులో 15-30 కిలోల నత్రజని, 10-20 కిలోల భాస్వరము, 11-18 కిలోల పోటాష్ లభిస్తుంది. సుక్ష్మపోషకాలైన ఇనుము, మాంగనీసు, రాగి, బోరాన్ మరియు ద్వితీయ పోషకాలు – గంధకము, కాల్షియం, మేగ్నిషియం తగు మోతాదులో లాభిస్తాయి. వర్మి కంపోస్ట్ 1-1.5 టన్నుల ఎకరాకు వేయడం మంచిది. వేసినట్లయితే నాణ్యమైన ఆకును, గూళ్ళలోని పట్టు శాతమును మరియు దిగుబడిని పెంచుతాయి...

అంతర పంటల

పచ్చి రొట్ట పైర్లను అంతర పంటలుగా పెంచటం మంచిది. 70-90 రోజులలో పంటకు వచ్చే జీలుగ, పెసర, జనుము మొదలగునవి పెంచి దుక్కిలో దున్నాలి. దీని వలన భూమిలో నత్రజని శాతము పెరుగుతుంది. కలుపు మొక్కలు నివారించవచ్చును. మల్బరీలో సమగ్ర పోషణ మరియు సస్యరక్షణ అవసరం.

కొమ్మలు కత్తిరించే విధానము (ప్రూనింగ్)

కొమ్మలు కత్తిరించేతపుడు ప్రతి మొక్కకు బలమైన కాండం దానిపై మూడు బలమైన కొమ్మలను ఉంచి భూమి నుంచి 20 సెం. మీ. ఉండేలా కత్తిరించిన ఎడల తోటలో గాలి, మేలుతురు అధికంగా లభించి మొక్క ఆరోగ్యంగా పెరుగుతూ నాణ్యమైన ఆకును ఇవ్వగలుగుతుంది.

మల్బరీని ఆశించే పురుగులు – నివారణ

 • బిహారి గొంగళి పురుగు : అన్ని కాలాల్లోనూ ఆశిస్తుంది. ఆకుల పత్రహరితాన్ని గోకి తినటం వలన ఆకులు ఎండిపోయినట్లుగా అనిపిస్తాయి. వేసవి దుక్కి దున్నట వలన కోశస్ద దశలను పక్షులు ఏరుకొని తింటాయి.
 • పిండినల్లి (టుక్రా వ్యాధి) : అన్ని కాలాల్లోనూ ఆశిస్తుంది. ఆకులు ముడుచుకొని గిడసబారి పోతాయి. పిండినల్లి పిల్లలు మొదలు పై తిరుగుతూ కనిపిస్తాయి. నివారణకు క్రిప్టోలీమస్ మాంట్రిజరి బదినికలను ఎకరాకు 250 వదలి పెట్టాలి. డైక్లోరోవాస్ / మిధైల్ డేమటాన్ / మోనోక్రోటోఫాస్ 0.2% ను 0.5% సబ్బు ద్రావణంలో కలిపి 10-12 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
 • తామర పురుగు : అన్ని కాలాల్లోనూ ఆశిస్తుంది. లేత ఆకులు వాడాలి రాలి పోతాయి. ఆకులపై చారలు ఏర్పడతాయి. స్కోలియోత్రిప్న్ ఇండికస్ అనే తామర పురుగులను వదిలిపెట్టాలి. నివారణకు డైక్లోరోవాస్ 0.2% / డైమిధోయేట్ 0.01% పిచికారి చేయాలి. పిచికారి చేయబడిన తరువాత ఆకులను 3/15 రోజుల తరువాత కోయాలి.
 • నల్లి : అన్ని కాలాల్లోనూ ఆశిస్తుంది మరియు ముఖ్యముగా మార్చి – ఏప్రిల్ నెలల్లో ఎక్కువగా ఆశిస్తుంది. ఆకులు వడలి ఎండిపోతాయి. ఆకుల పై పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడతాయి. మల్బరీ కట్టింగ్స్ ను 0.1% మోనోక్రోటోఫాస్ లో నాన పెట్టాలి. ఫాసలోన్ 0.5% పిచికారి చేయాలి.

తెగుళ్ళు – నివారణ

 • ఆకుముడత : అన్ని కాలాల్లోనూ వస్తుంది. కొమ్మల చివరలు, ఆకులు ముడతలు పడి ఆకుపచ్చ రంగులలోకి మారి, పెరుగుదల తగ్గుతుంది. నివారణకు వ్యాధి గ్రస్దమైన భాగాలను తొలగించి కాల్చి వేయాలి. 0.5% శాతము సబ్బు నీటిలో 0.2% డిడివిపి ద్రావాణాన్ని తయారు చేసుకొని పిచికారి చేయాలి.
 • ఆకుచుట్టు రోగము : సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వస్తుంది. అగ్ర భాగంలోని ఆకులు చుట్టుకోంటూ అతుక్కొని ఉండి పోతాయి. మొక్కలు పెరగవు. నివారణకు 0.5 శాతము సబ్బు నీటిలో 0.076 డిడివిపి ద్రావణాన్ని (1 మి.లీ లీటరు నీటికి) తయారు చేసుకొని పిచికారి చేయాలి.
 • గమనిక : పిచికారి చేసిన 17-20 రోజుల తరువాతనే ఆకును కోయవలయును.

 • వేరు కుళ్ళు రోగము : అన్ని కాలాల్లోనూ వస్తుంది. ఆకులు వడలుతూ రాలి పోతుంటాయి. వేళ్ళు కుళ్లిపోయి మొక్క చచ్చిపోతుంది. రోగ లక్షణాలు కనిపించిన వెంటనే ప్రతి మొక్కకు 5-10 గ్రా. ‘మాంకోజేబ్’ మొక్క మొదట్లో వేయాలి. వ్యాధిగ్రస్ధమైన మొక్కలను తీసి చేయాలి. బయో ఫంగిసైడ్ 1 కేజిని 50 కేజీల పశువుల ఎరువులో కలిపి 30 శాతం తేమ ఉండేలా నీరు చల్లి 7 రోజులు నీడలో ఉంచాలి. ఈ మిశామాన్ని అర కిలో చొప్పున వ్యాధి సోకిన మొక్కల వేర్ల దగ్గర 6 అంగుశాల గుంట తీసి మిశ్రమాన్ని వేసి కప్పి పెట్టాలి.
 • వేరు కాంతి రోగము : అన్ని కాలాల్లో వస్తుంది. వేర్లపై కాంతులు ఏర్పడి మొక్క పెరుగుదల మందకొడిగా వుతుంది. దీని నివారణకు ఒక ఎకరానికి 400 కేజీల వేప పిండిని సంవత్సరమునకు 4 దఫాలుగా వేయాలి. పశువుల ఎరువు ఎక్కువ మోతాదులో వాడాలి. ‘నిమహారి’ బయోనిమాటిసైడ్ 80 శాతము వరకు రోగాన్ని పెరుగుతుంది. 4 కేజీల ‘నిమాహారిని’ 40 కిలోల పశువుల ఎరువు లేదా కంపోస్టుతో బాగా మిశ్రమము చేయవలెను. మొక్కలకు వేరు దగ్గరగా 15 సెం.మీ. లోతులో ఈ మిశ్రమమును వేసి మట్టితో కప్పి చేయవలెను. తర్వత వెంటనే నీరు పెట్టాలి. 70-80 రోజుల తర్వాత రెండవ సారి మరలా మిశ్రమాన్ని చేయవలెను.
 • ఆకు మచ్చ తెగులు : వర్షాకాలంలో వస్తుంది. ఆకు పై మొదటి మచ్చలు ఏర్పడి అకులోని తేమ తగ్గి పోతుంది. దీని ఒక లీటరు నీటికి 2గ్రా. కార్బండాజిమ్ కలిపి 200 నుండి 250 లీ. ద్రావణాన్ని తయారు చేసుకొని 1 ఎకరాకు పిచికారి చేసుకోవాలి.
 • బూడిద తెగులు : చలికాలంలో (సెప్టెంబర్ - జనవరి) ఆకు అడుగు భాగాన తెల్లని బూడిద రంగు మచ్చలు ఏర్పడుతాయి. ఆకులు పెళుసుగా మారి పెరగక నేల రాలుతాయి. మొక్కల మధ్య స్ధలం ఎక్కువగా ఉంచాలి. బూడిద తెగులు నివారణకు 0.2% కార్బొండాజిమ్ / డైనోకాప్ (2గ్రా./లీ) ఎకరాకు 200 లీ. మిశ్రమాన్ని ఆకు అడుగు భాగంలో పిచికారి చేయాలి.
 • గమనిక : 15 రోజుల తరువాత ఆకులను కోయాలి.

పట్టు పురుగుల పెంపకం

మల్బరీ తోటను రెండు, మూడు భాగాలుగా విభజించి సంవత్సరమునకు 10-11 పంటలు తీసుకోవచ్చును.

పెంపకపు గది :

మల్బరీ తోట విస్తీర్ణము

(ఎకరాలు)

పంటకు పెట్టు గ్రుడ్ల సంఖ్య

(DFL)

రేరింగ్ గది వైశాల్యం

(చ. అడుగులలో)

1-2

2-5

>6

150-200

250-400

500-900

750-800

1000-1200

1500-2500

రోగ నిరోధక చర్యలు (డిస్ఇన్ఫెక్షన్)

 • ప్రతి పంట తీసిన తరువాత మరియు పంట పెట్టె ముందు విధిగా రోగ నిరోధక చర్యలు చేపట్టాలి.
 • 0.2 శాతము ‘సెరిఫిట్’ ద్రావణం గత సంవత్సరంలో మార్కెట్ లోకి వచ్చినది.
 • 2-4 శాతము బ్లీచింగ్ పౌడరు గల 0.3 శాతము సున్నపు పొడి ద్రావణం.
 • 2-5 శాతము శానిటేక్ ద్రావణం గల 0.5 శాతము సున్నపు పొడి ద్రావణం.
 • 2-5 శాతము శక్తి ద్రావణం

పైన తెల్పిన వివిధ ద్రవనములతో డిస్ ఇన్ ఫెక్షన్ చేసుకొనవచ్చును.

గమనిక

గది యొక్క ప్రతి చదరపు అడుగు విస్తీర్ణానికి 160-200 మి.లీ. ద్రావణంను విధిగా పిచికారి చేయాలి.

రేరింగ్ చేయునపుడు గది వెలుపల చుట్టూ 3 అడుగులు 2 శాతము బ్లీచింగ్ పౌడరును 0.3 శాతము సున్నపు పొడిలో కలిపి ప్రతి 3 లేదా 4 రోజులకు ఒకసారి చల్లుకోవాలి.

పట్టు గ్రుడ్లు పొందిగించుట

పట్టు గ్రుడ్లకు 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత 85-90 శాతము తేమ కలిగిన వాతావరణంను కల్పించాలి.

బ్లాక్ బాక్సింగ్

గ్రుడ్లపై చుక్కలు (7-8 రోజు) వచ్చిన తరువాత నల్ల బట్టను కప్పి వెలుతురూ తగులకుండా 36-48 గంటల పాటు ఉంచి 9-10వ రోజు సూర్యోదయాన్ని, వెలుతురును చూపించిన 90-95 శాతము గ్రుడ్లు నుండి ఒకేసారి పురుగులు బయటకు వస్తాయి.

చాకి పురుగుల పెంపకం

మొదటి రెండు దశల పురుగుల పెంపకమును ‘చాకీ రేరింగ్’ అంటారు. ఈ దశలో పురుగులకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ దశలో పురుగులు అధిక ఉష్ణోగ్రత మరియు అధిక తేమ శాతం గల వాతావరణం పరిస్ధితులలో ఆరోగ్యంగాను బలిష్టంగాను పెరుగుతాయి. మొదటి రెండు దశలలో పురుగులకు చిన్న గదులలో 28-29 డిగ్రీ సెం.గ్రే ఉష్ణోగ్రత 85-90 శాతం తేమ కల్పించాలి. పోషక మిలువలు గలిగిన మంచి నవ నవ లాడే ఆకులను మాత్రమే (1-4వ ఆకు వరకు) చాకీ పురుగులకు చేయాలి. చాకీ పురుగులకు వేసే ఆకులో 80 శాతము పై బడి తేమ శాతము ఉండేటట్లుగా చూసుకోవాలి. పురుగులు జ్వరానికి వెళ్ళేటప్పుడు ఆఖరి మేత తరువాత సున్నంను బెడ్ పై చల్లిన ఎడల బెడ్ ను పొడిగా ఉంచుతుంది (అకులోని తేమను పిల్చి అరిపోయేల చేస్తుంది).

చాకీలో యాజమాన్యం (100 గ్రుడ్లకు DFL)
దశ అనువైన ఉష్ణోగ్రత తేమ శాతం కావలసిన ఆకు మోతాదు (కేజీలు ) పెరుగుటకు రోజులు జ్వరములో ఉండే సమయము (గంటలు)
1. 27-28o C 85-90 4-6 (సిబి) - (బివి) 3-3 20-24
2. 27-28o C 85-90 11-16 (సిబి) - (బివి) 2-2 20-24

బెడ్ డిసిన్ఫెక్టేంట్స్

శక్తి, విజేత, సంజీవని, అంకుర్ సెరిఫిట్

 • పురుగులు జ్వరాన్నుంచి వచ్చిన తరువాత ఆకు వేసేందుకు ఒక గంట ముందు చదరపు అడుగు స్ధలములో 3-5 గ్రా. పౌడర్ ను పలుచని బట్టలో పురుగుల చర్మం తడిసేతట్లుగా చల్లాలి.
 • చల్లిన గంట తరువతనే ఆకు వేయాలి.
 • పట్టు పురుగులకు వచ్చే గ్రసరి మరియు ఫ్లాచరి వ్యాధుల నుండి రక్షించేందుకు అభయ పౌడర్ ను ద్రవణంగా తయారు చేసుకొని ఆకుతో కలిపి పురుగులకు ఇవ్వాలి.
 • రెండవ జ్వరములో పురుగులను పెంపక గృహములోని పడకల పైకి చేర్చవలెను.

పెద్ద పరుగుల పెంపకము

మూడవ దశ నుండి ఐదవ దశ వరకు పురుగులను పెద్ద పురుగుల పెంపకము అంటారు. ఈ దశలో పురుగులను చేట్టితో తాకకుండా కొమ్మ మేత పద్ధతి అనుసరించి పరుగులను పడకల పైకి చేర్చుతారు. కొమ్మ మేత పధ్ధతి ద్వారా 50 శాతము కులిలను, 20 శాతము ఆకును తగ్గించుకోవచ్చును. తక్కువ సార్లు పురుగులను తాకడం వలన వ్యాధులను అరికట్టవచును. ఆకు కొమ్మ మీద ఉన్నందుకు ఎక్కువ సేపు వాడిపోకుండా నాణ్యంగా ఉంటుంది. పురుగుల పడకలను కేవలం ఒకసారి మాత్రమే (4వ జ్వరం) లేచిన తర్వాత శుభ్రపరిస్తే చాలు. పురుగులు జ్వరం పోయేటప్పుడు మాత్రమే కాక ప్రతిరోజూ సున్నపు పొడిని బెడ్ పై పలుచని బట్టతో చల్లాలి. దీని వలన పడకలు ఎల్లప్పుడూ పొడిగానూ, శుభ్రంగానూ ఉంటాయి. పడకల వెడల్పు 5-5.5 అడుగులు మించ కుండా పైకి 5 వరుసలు మాత్రమే గదిలో ఏర్పాటు చేసుకొంటే అన్ని అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. పడకల మధ్య కనీసం 1.5 అడుగులు దూరం ఉండేటట్లు చూసుకోవాలి.

పెద్ద పురుగుల యాజమాన్యం

దశఅనువైన ఉష్ణోగ్రతతేమ శాతంకొమ్మ పధ్ధతి సిబి – బి.విఇవ్వవలసిన స్ధలవాకాశం(చ.అ)పెరుగుటకు తీసుకొనే రోజులుజ్వరములో ఉండే సమయం (గంటలు)
3 26-27 75-80 115-140 65-190 3-31/2 25
4 25-26 70-80 325-460 190-350 31/2-4 24-36
5 24-25 70-75 2400-2890 350-700 6-8 స్పిన్నింగ్

బెడ్ డిసిఇన్ఫెక్టెంట్స్

శక్తి, విజేత, సంజీవని, అంకుర్, సేరిఫెట్

100 గ్రుడ్లకు వాడవలసిన మోతాదు

 • 3వ జ్వరం నుండి లేచిన తర్వాత – 745 గ్రా.
 • 4వ జ్వరం నుండి లేచిన తర్వాత – 1750 గ్రా.
 • 5వ జ్వరం నుండి లేచిన తర్వాత – 3500 గ్రా.

4వ జ్వరము నుండి లేచిన తరువాత 6-8 రోజులకు పురుగులు పరిపక్వతకు వస్తాయి. శిరిరం పాక్షికంగా పారదర్శకంగా ఉంటుంది. ఈ సమయములో పురుగులను ఏరి చంద్రికల పై వేయాలి. చంద్రికల పై పురుగులను క్రమబద్దంగా వేయాలి. గాలి ప్రసరణ సమృద్ధిగా వచ్చే ప్రత్యెక గది కాని, వరండా కాని అనుకూలంగా ఉంటుంది.

ప్లాస్టిక్ నేత్రికలు

పట్టు పురుగుల పడకలపై ఉంచి సహజంగా గుళ్ళు అల్లుతకు బాగుంటాయి. దీనిలో ఉన్న గడులు క్రమబద్దంగా లేకపోతె గూళ్ళ నాణ్యత తగ్గుతుంది.

గూళ్ళను విడిపించుట

గుళ్ళు అల్లడం మొదలు పెట్టిన రోజు నుండి సి.బి (క్రాస్ బ్రీడ్) అయితే 5వ రోజు, బి.వి (బైవోల్టయిన్) అయితే 6వ రోజు విడిపించడం మంచిది. గూళ్ళను విడిపించిన తరువాత మంచి గూళ్ళ నుండి చెడు గూళ్ళను / డబల్ కాకూన్స్ వేరు చేసి అమ్మకానికి మార్కెట్ కు తరలించాలి. గాలి బాగా ప్రసరించే గొనె/నూలు సంచులు గాని, నైలాన్ వలలల్లో గాని ఉంచి చల్లని వేళల్లో మాత్రమే రవాణా చేయాలి.

మార్కెటింగ్ వివరాలు

పట్టు గూళ్ళను ప్రభుత్వం పట్టు గూళ్ళ విక్రయ కేంద్రములందు అమ్మటం మంచిది.

ప్రభుత్వ పట్టు గూళ్ళ విక్రయ కేంద్రము

తిరుమలగిరి సికింద్రాబాద్, హైదరాబాద్, జనగాం

పట్టు పురుగును ఆశించే పురుగులు – యాజమాన్యం

“ఊజి” ఈగ

ఈ ఈగను ‘ఇండియన్ ఊజి ఈగ’ అని కూడా పిలుస్తారు. ఇది అన్ని రకముల పట్టు పురుగులను టస్సార్, ఎరి మరియు మూగ పట్టు పురుగులను కూడా ఆశిస్తుంది. ఇది అంతర్గత పరాన్నజీవ. మన దేశంలో మొదటగా కర్ణాటకలో ఈ ఈగను 1982 లో గుర్తించారు. ఈ ఈగ వలన పట్టు దిగుబడి చాలా వరకు తగ్గుతుంది. వర్షాకాలంలో ఎక్కువగా, వేసవి కాలంలో తక్కువగా ఆశిస్తుంది.

ఈ ఈగ 4వ/5వ దశ పురుగుల పై 2-3 గ్రుడ్లను పెడుతుంది. గ్రుడ్లు పొదిగి వచ్చిన మ్యాగట్స్ పట్టు పురుగు లోపలికి ప్రవేశించి, లోపల గల క్రొవ్వును తిని పెరుగుతాయి. ఫలితంగా మిరప గింజ ఆకారంలో గల మచ్చలు పురుగుకు ఇరువైపులా ఏర్పడుతాయి. బాగా ఎదిగిన మ్యాగట్స్ లార్వాను చిల్చుకొని బయటకు వచ్చి ఫ్యుపా దశ, కోశస్ధ దశకు చేరుకుంటాయి. ఊజి ఈగ ఆశించిన పట్టు గూళ్ళ నుండి పట్టు ఉత్పత్తి కాదు.

యాజమాన్యం

40 – 70 మేష్ తెరలను ఉపయోగించి ఈ ఈగను రేరింగ్ గదిలోకి రాకుండా నిరోధించవచ్చును. చైనా మట్టిని పలుచని గుడ్డను ఉపయోగించి 3 గ్రా./ 4గ్రా./చ. అడుగు పురుగుల గుళ్ళు కట్టేటప్పుడు ఉపయోగించి ఈ ఈగను సమర్ధవంతంగా అరికట్టవచ్చును. ఊజి ఈగ ఆశించిన పురుగులను ఏరి నాశనం చేయడం ఊజి ఈగ మ్యాగట్స్, కోశస్ద దశలను ఏరి నాశనం చేయాలి. డైఫ్ల్యుబెంజురాన్ (డిమిలిన్ 25 డబ్ల్యుపి) మరియు చైనా మట్టి (1:9) మూడవ దశ పురుగులపై చల్లి ఈ ఈగను సమర్ధవంతంగా అరికట్టవచ్చును.

డెర్మిస్టెడ్ పెంకు పురుగు

పట్టు గుళ్ళు నిల్వ వుంచిన ప్రదేశంలో ఈ డేర్మిస్టేడ్ పెంకు పురుగు రంధ్రాలు చేసి లోపల గల క్షోశస్ధ దశలను తింటాయి.

యాజమాన్యం

రేరింగ్ గది మరియు గూళ్ళు భద్రపరిచే గదులను శుభ్రపరచాలి. పాడయిన గూళ్ళను ఎక్కవ రోజులు నిల్వ చేయరాదు. గూళ్ళను భద్రపరిచే గదిని మిధైల్ బ్రోమైడ్ (0.5కి/283 మీ.2) తో ఒక రోజు మొత్తం ఫ్యుమిగేట్ చేయవలెను. మిధైల్ బ్రోమైడ్ లేని యెడల క్లోరోపిక్రిన్ అదే మోతాదులో ఉపయోగించాలి.

నల్లి

నల్లి పురుగులు పట్టు పురుగును అన్ని దశలలో ఆశిస్తాయి. నల్లి పురుగులు ఆశించిన పురుగుల పై నల్లని మచ్చలు ఏర్పడతాయి. నల్లి పురుగులు ఆశించిన పురుగులు మల విసర్జన చేయలేక మలము ఆ పురుగుల పాయవుకు అతుక్కోని వుంటుంది. నల్లి పురుగుల పాయువుకు అతుక్కొని వుంటుంది. నల్లి ఆశించిన పురుగులు పచ్చని ద్రావణాన్ని వాంతి చేసుకుని మరణిస్తాయి.

యాజమాన్యం

వరి గడ్డిని గూళ్ళు భద్రపరిచే గదికి వీలైనంత దూరంగా వుంచాలి. రేరింగ్ గదిని, పై కప్పును సల్ఫర్ గాని, డైకోఫాల్ ను గాని ఉపయోగించి పిచికారి చేసుకోవాలి.

చీమలు

చీమలు పురుగులను ఆశించి పట్టి చంపి వేస్తాయి. చీమలు ఎక్కకుండా రేరింగు స్టాండు కాళ్ళు పాత్రలో వుంచి నిళ్ళు పోసినట్లయితే చీమలు ఎక్కువు. వీటినే చీమల బావులు అంటారు.

పట్టు పురుగుల వ్యాధులు – యాజమాన్యం

పెబ్రైయిన్

ఈ వ్యాధి ప్రొటోజువాన్ పరాన్నజీవి “నాసిమ బాంబోసిస్” వలన వ్యాపిస్తుంది. ఈ వ్యాధిని “మిరియాల” వ్యాధి అంటారు. ఈ వ్యాధి ఆశించిన పురుగులో మొదట్లో ఎటువంటి లక్షణాలు కనుపించవు. వ్యాధి ముదిరిన తర్వాత మాత్రం పురుగులు ఆహారాన్ని తినవు మరియు కదలికలు కూడా తగ్గిపోతాయి. చివరగా ‘మిరియాల’ లాగ నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ వ్యాధి ఒక తరం నుండి ఇంకొక తరానికి వ్యాపిస్తుంది.

యాజమాన్యం

పట్టు గ్రుడ్లను 2% ఫార్మాలిన్ లో ముంచి కొన్ని నిమిషాల తర్వాత కడగవలెను. రేరింగ్ గదిని డిస్ఇన్ఫెక్షన్ చేసిన యెడల వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు.

శిలీంధ్ర వ్యాధులు (సున్న కట్టు రోగము)

“బవేరియా బసియానా” వైట్ మస్కరిడైన్, “ఆస్పర్ జిల్లస్ ఫ్లావస్” బ్రౌన్ మాస్కరిడైన్ శిలింద్రా వ్యాధులు వచ్చినప్పుడు పురుగుల పై చమురు మచ్చులు ఏర్పడతాయి. పురుగులు ఆహారాన్ని తీసుకోకుండా, కదలకుండా వుంటాయి. పురుగులు మరణించిన తర్వాత శరీరం గట్టిగా తయారవుతుంది.

యాజమాన్యం

డిసిన్ ఫెక్షన్ కొరకు 2% ఫార్మాలీన్ లేదా 5% బ్లీచింగ్ పౌడర్ తో రేరింగ్ గదిని కడగాలి. సున్నపు పొడిని బెడ్ పై చల్లి తేమను తగ్గించాలి. పార్మాలీన్ 0.4% 1వ, 2వ దశ పురుగుల పై మరియు 0.5%, 0.6%, 0.8% 3వ, 4వ దశ పురుగుల పై పిచికారి చేయాలి.

పాలు కారు రోగము (గ్రసరీ)

పట్టు పురుగులను పెంచే గృహములో అనుకూల వాతావరణ పరిస్ధితులు లేక పోవుట వలన సోకుతుంది. వ్యాధి సోకిన పురుగుల నుండి తెల్లని పాల వంటి ద్రవం కారుతుంది. అందువలన ఈ వ్యాధిని పాలు కారు రోగం అని కూడా అంటారు. రోగం ముదిరితే పట్టు పురుగులు తట్టల అంచుల పై తిరుగుతాయి.

యాజమాన్యం

అనుకూల ఉష్ణోగ్రత మరియు గాలిలో తేమ కల్పించడం, పుష్టికరమైన ఆకు వేయటం, తట్టలలో పురుగులకు సరైన స్ధలావాకాశమును కల్పించడం, వ్యాధి సోకిన పురుగులను కాల్చి వేయటం, రేషమ్ కిట్ ఔషదాన్ని (2గ్రా./చ. అడుగు) పురుగుల పై చల్లటం వలన ఈ వ్యాధిని నిరోధించవచ్చును.

నచ్చు రోగము (ప్లాచరీ)

వడలిపోయిన, పండుబారిన ఆకు వేయటం వలన ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి సోకిన పురుగులు ఆకు మేయవు. పురుగులు చర్మం నల్లగా మారుతాయి. రోగాగ్రస్తమైన పురుగుల పై నూనె మచ్చలు ఏర్పడతాయి.

యాజమాన్యం

వ్యాధి సోకిన పురుగులను ఎప్పటికప్పుడు ఏరి వేయాలి. బెడ్ డిస్ఇన్ఫెక్టెంట్ ను దశల వారిగా తగిన మోతాదులో వాడాలి. మోతాదుకు మించిన ఆకును వేయరాదు.

ఆధారం : వ్యవసాయ పంచాంగం

3.02729044834
M Santhosh Kumar Feb 12, 2020 12:21 PM

Sericulture metireal please give me sir

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు