పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మునగ పంటలో చీడపురుగులు – నివారణ

మునగ పంటలో చీడపురుగుల నివారణ గురించి తెలుసుకుందాం.

ఒకప్పుడు పెరటి తోటల్లో పెంచబడి, ప్రస్తుతం వాణిజ్య పరంగా పండించబడుతున్న కూరగాయ పంటలలో మునగ కూడా ఒకటి. దక్షిణ భారత దేశంలో పండించబడే బహువార్షిక కూరగాయ పంటలలో మునగ కూడా ముఖ్యమైనది. ఈ పంట అధిక చలిని తట్టుకోలేదు. అన్ని రకాల నేలలు అనుకూలం. అధిక సేంద్రియ పదార్థాలతో కూడిన ఇసుక నేలలు శ్రేష్టమైనవి. ఉదజని సూచిక 6–7.5 మధ్యన ఉంటే మంచిది. దేశవాళీ రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. మన రాష్ట్రంలో జాఫ్నా, పి.కె. ఎం-1 రకాలు ఎక్కువగా సాగుబడిలో ఉన్నాయి. కొన్ని రకాల చీడ పురుగులు ఈ మునగ పంటను ఆశించి నష్టాన్ని కలిగిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి, వాటి నివారణ పద్ధతులు.

గొంగళి పురుగు

ఈ పురుగు అన్ని ప్రాంతాలకు విస్తరించి నష్టం కలిగిస్తుంది. మునగ పంటనాశించే పురుగులలో ఇది చాలా ముఖ్యమైనది. రెక్కల పురుగు లేత పసుపు రంగులో ఉండే రెక్కలను కలిగి ఉంటుంది. తల్లి రెక్కల పురుగు మునగ లేత భాగాల పైన గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి 5 నుండి 7 రోజులలో పిల్ల పురుగులు బయటికి వస్తాయి.

గొంగళి పురుగులు (పిల్ల పురుగులు) మసక గోధుమ రంగులో ఉండి, దట్టమైన తెల్లని వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి. ఈ గొంగళి పురుగులు (లార్వాలు/పిల్ల పురుగులు) పగటి సమయంలో సమూహాలుగా చెట్టు కాండం పైకి చేరతాయి. రాత్రి వేళల్లో ఈ గొంగళి పురుగులు ఆకులను తింటూ బెరడును కూడా గీకుతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే చెట్లు మోడులాగా అవుతాయి. ఈ పురుగు భూమిలోపల కోశస్థ దశను గడుపుతుంది.

ఈ పురుగు నివారణకి, తల్లి రెక్కల పురుగు పెట్టిన గుడ్ల సముదాయాలను, గొంగళి పురుగు సమూహాలను ఏరి నాశనం చేయాలి. కాగడాల లాంటి చిన్న మండలతో చెట్టు బెరడు మీద గుంపులుగా ఉన్న గొంగళి పురుగులను నాశనం చేయాలి. క్వినాల్ ఫాస్ 2 మి.లీ. లేదా మిథైల్ డెమటాన్ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి ఈ పురుగును నివారించవచ్చు.

మునగ మొగ్గ తొలిచే పురుగు

తల్లి రెక్కల పురుగు పూ మొగ్గలపై గుడ్లని గుంపులుగా పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన చిన్న లార్వాలు మొగ్గలోనికి తొలిచి, లేత కణజాలాన్ని తింటాయి. ఈ పురుగు ఆశించిన పూ మొగ్గలు విచ్చుకోక, రాలిపోతాయి. కోశస్థ దశని భూమిలో గడుపుతుంది.

ఈ పురుగు అంత ఎక్కువగా మన దక్షిణ భారత దేశంలో అగుపించదు. ఒకవేళ ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే నివారణకి డైక్లోరోవాస్ 1 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

కాయతొలిచే ఈగ

ఇవి ఈగ జాతికి చెందిన పురుగులు. ఇవి పూత దశలో ఆశిస్తాయి. పిల్ల పురుగులు పిందె దశలో కాయలోనికి ప్రవేశించి లోపలి పదార్థాన్ని తిని నాశనం చేస్తాయి. అందువలన మునగ కాయుల ఆకారం మారిపోయి వంకరగా తయారవుతాయి. దీని నివారణకు పూత దశలో ఫాసలోన్ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి, పిందె దశలో లీటరు నీటికి డైక్లోరోవాస్తు 1 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి తగ్గినట్లయితే మరోసారి 25 రోజులకు పిచికారీ చేయాలి.

ఆకు తినే పురుగు

ఈ పురుగుల ఉధృతి దక్షిణ భారత దేశంలో అప్పుడప్పుడు కనిపిస్తుంది. దీని ఉధృతి డిసెంబర్ - జనవరి, మార్చి - ఏప్రిల్ నెలల్లో కనిపిస్తుంది. దీని పిల్ల పురుగులు (లార్వాలు) ఆకుపచ్చ రంగులో ఉండి ఆకులను తింటూ నష్టాన్ని కలిగిస్తాయి. తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే క్వినాల్ ఫాస్ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి నష్టాన్ని అరికట్టవచ్చు.

ఆధారం: ఆర్. శ్రావణ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్; కె. గోపాలకృష్ణమూర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్; జె. రాజేందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్; డా. జె. భార్గవి, అసిస్టెంట్ ప్రొఫెసర్; వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా.

2.9970845481
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు