హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / వరిలో నాణ్యమైన హైబ్రిడ్ విత్తనోత్పత్తికి ఆచరించాల్సిన పద్ధతులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వరిలో నాణ్యమైన హైబ్రిడ్ విత్తనోత్పత్తికి ఆచరించాల్సిన పద్ధతులు

వరిలో నాణ్యమైన హైబ్రిడ్ విత్తనోత్పత్తికి ఆచరించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో రైతు సోదరులు యాసంగిలో మొక్కజొన్న, వరి పంటల హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేపడుతున్నారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం చేత రైతులు సంకర విత్తనోత్పత్తికి మొగ్గు చూపుతూ, అధిక లాభాలను గడిస్తున్నారు. ప్రస్తుతం వరి సంకర విత్తనోత్పత్తి క్షేత్రాలు నాటిన 15-20 రోజుల దశలో ఉన్నాయి. ఈ దశలో ఈ కింద తెలిపిన అంశాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా అధిక దిగుబడులతో పాటు నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా జన్యు స్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత కలిగిన విత్తనాలను ఉత్పత్తి చేయవచ్చు.

పూత సమయాన్ని గుర్తించడం, పూత సమన్వయం:

ఆడ, మగ రకాల పంట కాలంలో తేడాని బట్టి విత్తనాలను వేరువేరు సమయాల్లో విత్తినప్పటికీ, వాతావరణ మార్పులు, చలి ప్రభావం, అవలంబించే సాగు పద్ధతులలో తేడాల వలన ఆడ, మగ రకాల మధ్య పూత సమన్వయం కోల్పోవచ్చు. పూత సమయంలో సమన్వయం లేకపోవడం చేత హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. వరిలో ప్రధానంగా వెన్ను, కంకులు ఏర్పడే దశలను బట్టి పూత కాలాన్ని నిర్ధారించవచ్చు. చాలా రకాలలో కంకులు ఏర్పడే తొలిదశ నుండి 30 రోజుల తర్వాత పూత వస్తుంది.

వరిలో వెన్ను ఏర్పడే దశను గుర్తించాలంటే బాగా పొడవుగా పెరిగిన తల్లి పిలకలను గుర్తించి, కాండం వేరు కలిసే భాగం దగ్గర కత్తిరించాలి. కాండాన్ని నిలువుగా అడుగుభాగం నుండి పిలక పై భాగం వరకు కత్తిరించి, కణుపు పైభాగాన్ని విప్పి కంకి వృద్ధిని గమనించవచ్చు. ఈ విధంగా కంకి ఏర్పడే దశలను గమనించి ఆడ, మగ మొక్కలలో పూత సమయంలో వ్యత్యాసాన్ని బట్టి పూత సమన్వయానికి కింది చర్యలు చేపట్టాలి. లేదంటే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. ఆడ మగ వరుసల మధ్య పూత సమన్వయానికి ఈ కింది తెలిపిన చర్యలు చేపట్టాలి.

  • ఆడ/మగ మొక్కలను ఆలస్యంగా పుష్పించేటట్లు చేయాలంటే ఒక లీటరు నీటికి 20 గ్రా. యూరియాను కలిపి ముందుగా పుష్పించే అవకాశం ఉన్న మొక్కలపై పిచికారీ చేయాలి.
  • అదే విధంగా ముందుగా పూత రావడానికి 1 శాతం ఫాస్పేట్ ఎరువును (ఒక లీటరు నీటికి 10 గ్రా. చొప్పున) పిచికారీ చేసుకోవాలి.
  • మగ వరుసలలో పూత ఆలస్యంగా అయినప్పుడు పూత త్వరగా రావడానికి పొలంలో నీరు నిండుగా ఉంచాలి.
  • ఆడ, మగ సాళ్ళలో పూత సమయంలో తేడా బాగా ఎక్కువగా ఉంటే ముందుగా వచ్చిన కంకులను పీకి వేయడం వలన ఆలస్యంగా వచ్చే కంకులతో పూత సమన్వయం చేయవచ్చు.

జిబ్బరిల్లిక్ ఆమ్లం పిచికారీ:

ఆడ మొక్కలనుండి వెన్ను పోటాకు నుండి పూర్తిగా బయటకు రావడానికి, పువ్వు నుండి కీలాగ్రం ఎక్కువగా బయటకు రావడానికి, పువ్వు ఎక్కువ సమయం విప్పారి ఉండటానికి జిబ్బరిల్లిక్ ఆమ్లాన్ని రెండు సార్లు ఆడ మొక్కల వరుసల పై అంటే మొదటిగా 5-10 శాతం వెన్నులు బయటకు వచ్చిన దశలో (12 గ్రా. / ఎకరాకు) తర్వాత 35-40 శాతం వెన్నులు వెలువడిన దశలో (8 గ్రా. / ఎకరాకు) రెండవ దఫాగా పిచికారీ చేసుకోవాలి. ఈ మందు నీటిలో కరగదు కావున 1 గ్రా. పొడిని 25 మి.లీ. 70 శాతం ఆల్కహాల్ లో మందు ద్రావణం తయారు చేసి 15 లీటర్ల నీటిలో కలిపి వాడాలి.

పరపరాగ సంపర్కం పెంపొందించే చర్యలు:

వరి స్వపరాగ సంపర్కం కల మొక్క కావున హైబ్రిడ్ విత్తనోత్పత్తికి పరపరాగ సంపర్కం పెంపొందించే చర్యలు చేపట్టాలి. అందుబాటులో ఉన్న వివిధ పద్ధతులను పోల్చినప్పుడు కర్రలతో మగ మొక్కలను ఊపడం లేదా మగ మొక్కల వరుసల పై తాడు లాగటం అనేవి రైతు స్థాయిలో చేయడానికి అనువుగా ఉంటాయి. ఈ పద్ధతిలో ఏదో ఒక దానిని పొలంలో 30-40 శాతం వెన్నులు బయటకు వచ్చినప్పుడు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 30 నిమిషాల వ్యవధిలో రోజుకు 3-4 సార్లు 7 నుండి 10 రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి. తద్వారా పరపరాగ సంపర్కం బాగా జరిగి అధికంగా విత్తనాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.

కేళీల ఏరివేత:

వరి సంకర విత్తనాలలో జన్యు స్వచ్ఛతను పెంపొందించాలంటే తగినంత వేర్పాటు (ఐసోలేషన్) కలిపించడంతో పాటు కేళీలు బెరకులను వివిధ దశలలో గుర్తించి తీసివేయాలి. వరిలో ప్రధానంగా 3 సార్లు అంటే శాఖీయ దశలో మొక్కల ఎత్తు, ఆకుల బాహ్య లక్షణాలు, పిలకల సంఖ్య తదితర లక్షణాలను గమనించి బెరకులను తీసివేయాలి. పూత దశలో పంట కాలంలో తేడా, వెన్ను బయటకు వచ్చే విధానం, వెన్ను లక్షణాలు, పుప్పొడి, కీలాగ్రపు రంగు అంశాలను నిశితంగా పరిశీలించి, కేళీలు ఏరివేయాలి. అదే విధంగా పక్వ దశలో ప్రధానంగా ఆడ వెక్కలలో గింజ శాతం, గింజ పరిమాణం, ఆకారం, రంగు తదితర లక్షణాలను గుర్తించి బెరకులను ఏరివేయాలి. వీటితో పాటుగా ఆడ వరుసలలో ఉన్న మగ మొక్కలను, మగ వరుసలలో ఉన్న ఆడ మొక్కలను గుర్తించి తీసివేయాలి. ఈ కేళీల ఏరివేత కార్యక్రమాన్ని రైతులు - నిరంతరంగా అన్ని దశలలో సమర్ధవంతంగా చేపడితే మంచి నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చు.

హైబ్రిడ్ విత్తనోత్పత్తికి సాధారణ వరి పంటకు పాటించే కలుపు, పోషక, నీటి యాజమాన్యంతో పాటు పంట తెగుళ్ళ బారిన పడకుండా తగిన సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా ప్రధాన తెగులైన అగ్గితెగులు, ఎండాకు తెగులు, పాము పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు ఆశించిన పంట నుండి విత్తనాలను సేకరించకూడదు.

పంటకోత:

వెన్నులో 90 శాతం గింజలు పక్వానికి వచ్చినప్పుడు పంట కోత చేపట్టాలి. కోత సమయంలో కొన్ని జాగ్రత్తలు అంటే ముందుగా మగ వరుసలను కోసి వేరు చేసుకోవడం, తర్వాత ఆడ వరుసలను జాగ్రత్తగా పరిశీలించి మగ మొక్కలు లేవని నిర్ధారించిన తరువాతే కోసి ప్రత్యేకంగా నూర్పిడి చేసి గింజలను శుభ్రపరిచి, గింజలలో తేమశాతం 12-13 శాతం వచ్చే వరకు నీడలో ఆరబెట్టి కొత్త గోనె సంచులలో నిల్వ చేసుకోవాలి.

పైన తెలిపిన సాంకేతిక అంశాలపై రైతులు అవగాహన కల్పించుకొని ఆచరించినట్లయితే మంచి నాణ్యమైన హైబ్రిడ్ విత్తనాలను ఉత్పత్తి చేసి మంచి లాభాలను పొందవచ్చు.

3.01152737752
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు