హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో ప్లాస్టిక్ వినియోగం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో ప్లాస్టిక్ వినియోగం

రైతులలో మంచి అవగాహన కలిగి, ప్లాస్టిక్ పరికరాల వాడుక రోజు రోజుకు పెరగుతున్నది.

వ్యవసాయ మరియు ఉద్యానవన రంగాల్లో ప్లాస్టిక్ పరికరాల వినియోగ ఆవశ్యకత మన దేశంలో 1970వ దశకం నుండి ప్రారంభమైంది. ఇవి ఇనుము, ఉక్కు మొదలైన పరికరాలతో పోలిస్తే తేలికగా ఉండి, తక్కువ ధరకు లభిస్తున్నందువల్ల మరియు వాటి నిర్వహణ కూడా సులభంగా ఉండడం వల్ల రైతులలో మంచి అవగాహన కలిగి, వీటి వాడుక రోజు రోజుకు పెరగుతున్నది. ప్రపంచ వాణిజ్య సరళీకృత విధానాలననుసరించి వివిధ దేశాలతో పోటి ఎదుర్కోవాలంటే మనము కూడా అధిక పంటల దిగుబడులతో పాటు మంచి నాణ్యత గల ఉత్పత్తులను పండించాల్సిన అవసరము ఎంతో ఉంది. దీనికి గాను పై రెండు రంగాల్లో ప్లాస్టిక్ వాడుక ఎంతో ప్రచుర్యము పొందింది.

వీటి వలన నీటి ఆదాతోపాటు, నేలలో తేమ అవిరికకుండా చూసి, నాణ్యమైన అధిక ఉత్పత్తులను పొందవచ్చు మరియు పంటలకు అనుకూలంగా లేని వాతావరణ పరిస్దితులలో కూడ పంటలను పండించవచ్చు. ఇంకా పంట నిల్వకు కూడా వీటి పాత్ర ఎంతో ఉంది. కనుక ఈ క్రింద పేర్కొన్న ప్లాస్టిక్ పరికరాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండడమే కాకుండా మానవుని దైనందిన జీవితావసరాలకు ఎంతో తోడ్పాటు అవుతున్నవి.

సుక్ష్మసాగునీటికి తోడ్పడే బిందు మరియు తుంపర సేద్యం పరికరాలు, ప్లాస్టిక్ మల్చింగ్ కు వాడే షీట్లు, హరితగృహాలకు మరియు లోటన్నెల్స్ కు వాడే పైకప్పుషీట్లు, షెడ్ నెల0020ట్లు మరియు వడగండ్లను నిరోధించే వలలు, చెఱవులు, కుంటలు మరియు కాలువలకు అడుగున పరిచే అగ్రిఫిల్ములు, నీటిపారుదలకు ఉపయోగించే పైపులు, గొట్టపు భావుల కేసింగ్ పైపులు, సస్యరక్షణ పరికరాలు, ప్లాస్టిక్ ఇతి తోట్టెలు , గాదెలు, పులకుండీలు, ఎరువుల సంచులు, నర్సరీ మొక్కల కవర్లు, పాలు, కూరగాయలు మరియు పండ్లు ప్యాకింగ్ సంచులు మొదలైనవి.

వ్యవసాయ మరియు ఉద్యానవన సేద్యం విభాగాల్లో ప్లాస్టిక్, బిందు మరియు తుంపర సేద్యాలతో పాటు, మల్చింగ్, హరిత గృహాలు మరియు కుంటలు, కాలువలకు లైనింగ్ చేసే అగ్రిఫిల్ములు ఎంతో ముఖ్యపాత్ర వహిస్తూన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మల్చింగ్

మొక్కల చుట్టూ ఉండే వేర్ల భాగాన్ని ఏవేని పదార్దాలతో కప్పి ఉంచడాన్ని “మల్చింగ్” అంటారు. ప్లాస్టిక్ షిటుతో మొక్క చుట్టూరా కప్పి ఉంచడాన్ని “ప్లాస్టిక్ మల్చింగ్” అని అంటారు.

కావున మల్చింగ్ ఆరుతడి పంటకు చాలా అనుకూలంగా ఉంటుంది. మల్చిషీట్లు అతినీలలోహిత మరియు పరారుణ కిరణాలకు తట్టుకునే విధంగా రసాయనశుద్ది ద్వారా తయారుచేయడం వల్ల నీటి మన్నిక కనీసం 3 (మూడు) సంవత్సరాల వరకు ఉంటుంది. ప్లాస్టిక్ మల్చిషీట్లు వివిధ రంగుల్లో లభిస్తాయి. ఉదా : నలుపు, తెలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపుపచ్చ, వెండి రంగు మరియు రెండు వైపులా వేర్వేరు రంగు గలవి కూడా లభిస్తాయి. ఉదా : నలుపు తెలుపు, నలుపు పసుపు మరియు నలుపు వెండి రంగు గలవి.

ప్లాస్టిక్ మల్చిషీట్లు వివిధ మండములలో లభిస్తాయి. ఈ షేట్లను మైక్రాన్లలోగాని గేజిలలోగాని కొలుస్తారు. ఒక మైక్రాను మందము నాలుగు గేజిలకు సమానము. మల్చిషీట్లు 7 నుండి 200 మైక్రాన్ల మందంలో 1.5 నుండి 4.0 మీటర్ల వెడల్పులో చుట్టల రూపంలో లభిస్తాయి. వీటి ధర ఒక కిలో సుమారు రూ. 175/- వరక ఉంటుంది . షిట్టు విస్తర్ణం దాని మందం పై ఆధారపడి ఉంటుంది. ఉదా : 25 మైక్రాన్ల మందం కల్గిన షీటు ఒక కిలోకు 43 చ. మీ. విస్తర్ణం కలిగి ఉంటుంది. కావున రైతులు వివిధ పంటలకు సరిపోవు మందాన్ని ఖచ్చితమైన విస్తర్ణం మేరకే వాడాల్సి ఉంటుంది.

పంటకాలాన్ని బట్టి వివిధ మందంగల మల్చిషీటు వాడుతారు. ఏ ఏ రకం పంటలకు ఎంత మందంగల మల్చిషీటు వేయాలో ఈ క్రింద పట్టికలో తెల్పడమైనది.

మల్చిషీటు మందం (మైక్రాన్లలో) పంట రకము
7 వేరుశనగ
15-25 అన్ని రకాల కూరగాయలు, స్ట్రాబెర్రీ, ఘగర్ బీట్ (3-4 నెలల వ్యవధిలోపు పంటలు)
50 పూలు మరియు పండ్ల మొక్కలు (10-12 నెలల వ్యవధి కలిగినది)
100 దీర్ఘకాలపు పంటలు (12 నేలలకున్న ఎక్కువ వ్యవధి కలిగినవి)
150-200 నేల సోలరైజేశాషన్ కొరకు (పారదర్మక ఫిల్మ్)

అలాగే పంట దశను బట్టి మల్చిషిటు చేసే విస్తర్ణం ఆధారపడి ఉంటుంది. దానిని ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

పంట దశ మల్చి వేయవలసిన విస్తర్ణం (%)
తొలిదశలో ఉన్న పండ్ల మొక్కలు (మామిడి, జామ, నిమ్మ మొ.) 20
మధ్యస్ద దశలో ఉన్న పూలు, పండ్ల తోటలు 40
కూరగాయలు, స్ట్రాబెర్రీ, బొప్పాయి, మల్బరీ మొ. 60
పూర్తిగా పెరిగిన పండ్లతోటలు 70-80

మల్చిషీటు మందాన్ని బట్టి ఒక హెక్టారుకు (2.5 ఎకరాలకు) కావలసిన షీటు పరిమాణాన్ని (కిలోలలో) ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చును. తద్వారా మల్చిషీటు వృధా కాకుండా ఖచ్చితంగా వేయడానికి రైతులకు వీలవుతుంది.

మల్చిషీటు మందం (మైక్రాన్లలో) మల్చిషేటు వేసే విస్తర్ణం (%) 25 50 100 200
మల్చి వేయడానికి కావలసిన షీటు పరిమాణం (కిలోలలో)
20 48 96 192 384
40 96 192 384 768
60 144 288 576 1152
80 192 384 768 1536
100 240 480 960 1920

ప్లాస్టిక్ మల్చింగ్ – లాభాలు

 • నీటి ఆదా : మొక్క చుట్టూ భూమిలో ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించాడంవల్ల వివిధ కాల పరిమితులు గల పంటలకు 30-40% వరకు నీటి ఆదా అవుతుంది. ఇంకా దీనిని బిందు సేద్యం పద్ధతిలో కలిపి వాడితే అదనంగా 20% నీరు ఆదా అవుతుంది. తద్వారా పంటలకు 2-3 నీటి తడులు ఆదా అవుతాయి. మెట్ట ప్రాంతాలో పంటలకి ఇది ఎంతో మేలు చేస్తుంది.
 • కలుపు నివారణ : సుర్యరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడం వల్ల కిరణజన్య సంయోగక్రియ జరుగక సుమారు 85% వరకు కలుపు నివారణ అవుతుంది.
 • మట్టికోత నివారణ :వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించడం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిక్షించవచ్చు.
 • నేల ఉష్ణోగ్రత నియంత్రణ :మొక్క చుట్టూ సూక్ష్మవాతావరణ పరిస్దితులను కలుగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వార నేలలో ఉండే సుక్ష్మజీవుల చర్య అధికమై నేల నిర్మాణాన్ని వృద్ది చేస్తూ మొక్కలకు అన్ని పోషక పదార్దాలు అందేలా చేస్తుంది.
 • భూమిలోని చీడపీడల నివారణ : పారదర్మక (transparent) ఫిల్మును వేసవిలో భూమిపై పరచి సూర్యరశ్మినిలోనికి ప్రసరింపజేసి భూమిలోని క్రిమి కిటకాదులను, తెగుళ్ళును నివారిస్తుంది. ఈ ప్రక్రియను “నేల సోలరైజేషన్” (soil solarization) అని అంటారు.
 • ఎరువులు మరియు క్రిమిసంహారక మందుల ఆదా :ఎరువు నష్టాన్ని తగ్గిస్తుంది. కలుపు నివారణ, చీడపీడల నివారణ వల్ల వాటి మందుల వాడకాన్ని తగ్గించవచ్చు.
 • నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు :మొక్కలకు వాటి జీవిత కాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్ధితులు కలగటం వలన పంట ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు (20-50%) పొందవచ్చు.
 • అధికంగా పోషకాల లభ్యత : భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండటం వల్ల, నేల గుల్లబారి వేరు వ్యవస్ధ బాగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల నీరు, ఎరువులు భూమిలోపలి పొరలలో నుండి కూడా మొక్కలకు అధికంగా లభ్యమవుతాయి.

మల్చివేసే విధానం

మొక్కలను ఇరువైపులా (కూరగాయలు) లేక చుట్టురా (పూలు, పండ్ల యోక్కలు) 5-10 సెం. మీ. లోతో గాడి చేయాలి. మల్చిశీటును కావాల్సిన సైజులో కత్తిరించుకోవాలి. ఈ షీటును ప్రతి వరుసలో లేక చెట్టు దగ్గర మరీ వదులుగా లేక బిగువుగా లేకుండా కప్పి అన్ని చివరలను గాడిలోకి పోయేటట్లు చేసి మట్టితో కప్పాలి. ఈ ప్రక్రియను “యాంకరింగ్” అని అంటారు. దీని వల్ల మల్చిషీటు గాలికి చెదిరిపోకుండా ఉంటుంది.

మల్చివేసే విధానం : రెండు రకాలు

ఎ) విత్తుటకు ముందుగా మల్చివేసే విధానం : మొక్కకు మొక్కకుమరియు వరుసకు వరుసకు గల దూరాన్ని బట్టి ముందే షీటు పై రంధ్రాలు చేయాలి (ప్రస్తుతుం రంధ్రాలుగల షీట్లు కూడా లభ్యమవుతున్నాయి.) ఈ శీట్లను ప్రతి వరుస మిదపైనతెల్పిన విధంగా పరచి “యాంకరంగ్” చేయాలి. రంధ్రాల గుండా ఒక్కోక్క విత్తనం వేసి మట్టితో కప్పాలి. ఆ తర్వాత నీరు కట్టాలి. ఈ విధంగా చేయడంవల్ల సుమారు 20-25% విత్తనాలు కూడా ఆదా అవుతాయి. మార్కెట్ లో నేలపై బెడ్ ను తయారు చేసి దాని పై మల్చిషీట్ ను కప్పే ట్రాక్టరు తో నడిచే పరికరాలు లభ్యమవుతున్నాయి.

బి) నాటిన పైరుకు మల్చివేసే విధానం : మొక్కల చుట్టూ అనుకూలంగా మల్చిషీటును ముందుగా తగిన సైజులో కత్తిరించుకోవాలి. ఆ తర్వాత మల్చిషీటు పై మొక్కల దగ్గర చిన్న చిన్న రంద్రాలు చేసి వాటిని తొడిగి, అన్ని చివరలనూ ‘యాంకరింగ్’ చేయాలి.

హరితగృహాలు (గ్రీన్ హౌస్)

పంటలు సాగు చేయడానికి సరిపడే విస్తర్ణంలో సపోర్టింగ్ స్ట్రక్చరుపై పారదర్మక పదార్ధంతో (షీట్లతో) (200 మైక్రాన్లు లేక 800 గేజి UV stabilized film) కప్పబడి లోపలి వాతావరణ పరిస్ధితులను కొద్దిగా గాని, పూర్తిగా గాని నియంత్రించి మొక్కలకు అనుకూల వాతావరణ పరిస్దితులను ఏర్పటు చేయడానికి నిర్మించిన కట్టడాలను “హరిత గృహాలు” లేదా “గ్రీన్ హౌస్” లు అంటారు.

హరిత గృహాలు – ఉపయోగాలు

ప్రతికూల వాతావరణ పరిస్ధితులలో కూడా మొక్కలకు కావలసిన వాతావరణ పరిస్ధితులను కల్గించి,సంవత్సరం పొడవునా పంటలు పండించవచ్చు. తద్వారా పంట దిగుబడులు బయటి ప్రాంతం కంటే చాలా ఎక్కువగా (3-4 రెట్లు) ఉంటాయి. అధిక విలువగల (వాణిజ్య) పంటలపై ఔషధ, సుగంధ, పూలు మరియు కూరగాయలు మొదలైనవి పండించి నాణ్యమైన అధిక దిగుబడులు పొందడంవల్ల ఎక్కువ విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. తక్కువ సమయంలో తక్కువ విస్తర్ణంలో, ఎక్కువ మొక్కలను అంట్లను ఉత్పత్తి చేయవచ్చు. టిష్యూకల్చర్ ద్వారా ఉత్పత్తి చేసిన మొక్కలను ధృడపరచడానికి గ్రీన్ హౌస్ లు చాలా కానుకులంగా ఉంటాయి మరియు మొక్కల పెరుగుదల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అరుదుగా లభించే మొక్కలను సాగుచేయవచ్చు. వరి, ఇతర కూరగాయల నారు మొక్కలను వీటిలో పెంచడంవల్ల నారు తొందరగా పెరిగి (సుమారు 7-10 రోజుల ముందుగా) ముందుగా నటుకోనవచ్చు. తద్వారా ప్రధాన పొలములో పండించినప్పుడు రెండు నీటి తడులు ఆదా చేసుకోవడంతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చు. హరితగృహాలలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగి తద్వారా కిరణజన్య సంయోగ క్రియ పెరిగి పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులు ఇస్తారు.

హరిత గృహాలు – రకాలు

నిర్మాణ ఖర్చు మరియు వాతావరణ నియంత్రణ పరికరాల అమరిక ఆధారంగా ఇవి మూడు రకాలు

1.తక్కువ ధరది (చ.మీ.కు రూ. 1060/-): సహజ పద్ధతులు (వెంటిలేటర్లు, ప్రక్కపరదాలు) ద్వారా వాతావరణాన్ని కొంతవరకు నియంత్రించవచ్చు.

2. మధ్యస్ధ ధరది (చ.మీ.కు రూ. 1650/-): ఎయిర్కూలర్స్, మిస్టింగ్ మరియు ఫాగర్స్ ను ఉపయోగంచి పాక్షికంగా వాతావరణాన్ని నియంత్రించవచ్చు.

3.ఎక్కువ ధరది (చ.మీ.కు రూ. 10,000/-): వీటిలో అన్ని వాతావరణ నియంత్రణ పరికరాలు కంప్యుటరీకరణతో అనుసంధానించబడి ఉంటాయి. అన్ని వాతావరణ పరిస్దితులు (గాలిలో తేమ, ఉష్ణోగ్రత, కార్బన్ డైఆక్సైడ్ మొ.) అనుకూలంగా నియంత్రించవచ్చు.

హరిత గృహాలు – నిర్మాణం

హరిత గృహనిర్మాణంలో ముఖ్యంగా నాలుగు భాగాలున్నాయి.

 1. సపోర్టింగ్ స్ట్రక్చరు
 2. పై కప్పు (క్లాడింగ్)
 3. వాతావరణ నియంత్రణ పరికరాలు
 4. నీటిపారుదల పరికరాలు/పద్ధతి

1. సపోర్టింగ్ స్ట్రక్చరు : దీనికి వెదురు, సరుగుడు, ఇనుము, ఉక్కు, జి.ఐ., యం.యస్. మరియు అల్యూమీనియం పైపులు వాడుతారు. ఇందులో హూప్స్, ఫౌండేషన్ పైపులు, ఎండ్ ఫ్రేములు, లెటరల్ సపోర్టు, రిడ్జిలైన్ మెకానిజం, పాలిగ్రిప్ అసెంబ్లీ మొ. ఉంటాయి. ఇవి హరిత గృహాల ఆకారాన్ని నిర్దారిస్తుంది. ఉదా :గోతిక్,గౌబుల్, క్విన్సెట్, సాటూత్, ఆర్చ్ రూఫ్ మరియు లీన్ లు రకాలు.

2. పై కప్పు : సపోర్టింగ్ స్ట్రక్చరు పైనా, ఇరువైపులు, ముందు మరియు వెనుక వాడే పారదర్శకమైన 200 మైక్రాన్ల మందం కల్గి అతినీలలోహిత మరియు పరాఋణ కిరణాలకు తట్టుకోగల పాలిధిలీన్ షీట్లను “పై కప్పు” లేదా “క్లాడింగ్” అంటారు. దీని ద్వారా 80-85% సూర్యరశ్మి లోనికి ప్రసరించడంతో పాటు గాలి, వర్షంవల్ల మొక్కలపై ఏర్పడే ప్రతికూల పరిస్ధితులను తొలగించవచ్చు.

3. వాతావరణ నియంత్రణ పరికరాలు : హరిత గృహాలతో మొక్కలకు అనుకూల వాతావరణ పరిస్ధితులను కల్గించడానికి ముఖ్యంగా షెడ్ నెట్స్ (25-90% నిదనిచ్చేవి), మిస్ట్ లు, ఫాగర్లు, వెంటిలేటర్లు (40-60%) లైట్లు మరియు ఫాన్లు మొ. ఏర్పాటు చేస్తారు.

4. నీటి పారుదల పధ్ధత : సాధారణంగా హరితగృహాలలో మొక్కలకు బయటి కంటే తక్కువ నీరు సరిపోతుంది. ఎందుకంటే మొక్కలు మరియు నేల నుండి ఆవిరి రూపంలో జరిగే నీటి నష్టం చాలా తక్కువ. సుక్ష్మ నీటిపారుదల పద్ధతులైన బిందు మరియు మినీ స్ప్రింక్లర్ల ద్వారా నీరు కటడం చాలా అనుకూలం. ఈ పద్ధతిలో మొక్కలకు నీటితోపాటు ఎరువులను మరియు సుక్ష్మపోషక పదార్దాలను”ఫర్టిగేషన్” అనే ప్రక్రియ ద్వారా అందించవచ్చు. దీనివల్ల కూలీల ఖర్చు తగ్గడంతోపాటు ఎరువులు వృధాకాకుండా సమర్ధవంతంగా వినియోగింప బడతాయి.

హరితగృహ నిర్మాణంలో పాటించాల్సిన మెళకువలు

అతినీలలోహిత్ మరియు పరాబుణ కిరణాలను తట్టుకునే మంచి పారదర్మకత (85% వరకు సూర్యరశ్మిని లోనికి పంపగల) కల్గిన 200 మైక్రాన్ల (800 గేజి) షీటునే తప్పని సరిగా పైకప్పుకు వాడాలి. ఒంటరిగా (single span) నిర్మించే హరితగృహాలను ఏ దిశలోనైనా నిరిమిచవచ్చు. ఒకటి కంటే ఎక్కువగా కలిపి నిర్మించేటప్పుడు గట్టార్ సహాయంతో ఒకదానినొకటి కలపాలి. నీటి దిశ మాత్రము తప్పనిసరిగా “ఉత్తర - దక్షిణ” దిక్కులో ఉండేటట్లు నిర్మంచాలి. దగ్గరలో పెద్ద, పెద్ద చెట్లుగాని, గుట్టలు/కొండలుగాని ఉండరాదు. రసాయనిక పదార్దాలను గాలిలోకి వెదజల్లే పరిశ్రమలకు వీటిని దగ్గరగా నిర్మించరాదు.

హరితగృహాల్లో వాడే మట్టి మిశ్రమం లేక సబ్ స్ట్రేట్ క్రింది లక్షణాలు కలిగి ఉండాలి.

 • విత్తనం మొలచి మొక్క నిలబడడానికి కావలసిన ఆధారం ఇవ్వగలగాలి.
 • మొక్కలకు అందే రూపంలో నీరు నిల్వ ఉంచగలగాలి.
 • మొక్కలకు కావలసిన అన్ని పోషకాలను నిలుపుకునే శక్తి ఉండాలి.
 • గాలి మార్గాలు ఎక్కువగా ఉండాలి.
 • ఉదజని సూచిక (pH) 5.5-7.0 మధ్యలో ఉండాలి మరియు లవణాలు (EC) సాంద్రత 2-10 millimohs/cm ఉండాలి.
 • పోషక అయానుల మార్పిడి సామర్ధ్యం (CEC) 50-200 milliequalents/100 ఉండాలి.

మట్టి మిశ్రమంలో శీలీంద్రాలు, ఫంగస్ సంబంధిత హానికర సుక్ష్మజీవులు, కీటకాలు వాటి గుడ్లు, లార్వాలు మొ. ఉంటాయి. పంట వేసేముందు వాటిని నిర్మూలించాలి. దీనికి క్రింద తెల్పిన ఏవేని పద్ధతులతో మట్టిని శుద్ధిచేయాలి.

1.నీటి ఆవిరితో శుద్ధి చేయుట : మట్టి మిశ్రమంలో తగినంత తేమ ఉండేటట్లు చూసి 710 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండే నీటి ఆవిరిని 30 నిమిషాలపాటు పంపాలి. ఆ తర్వాత బెడ్స్ తయారుచేసుకోవాలి.

2.రాసాయనాలతో శుద్ధి చేయుట : మిధైల్ బ్రోమైడ్ (4%) క్లోరోపి క్రిన్ లేక వాపమ్ (vapam) మొ. రసాయనాలలో ఏదేని ఒక దానితో శుద్ధిచేయాలి.

3. ఫ్యుమిగేషన్ (పొగ పారించడం) : తయారుచేసుకున్న మట్టి మిశ్రమంలో రోగకారకాలైన శీలింద్రాలు, క్రిమి కీటకాలు, నులి పురుగులను పూర్తిగా అరికట్టుటకు మట్టి మిశ్రమాన్ని ఫార్మాల్ది హైడ్ మందు ద్రావణం తయారు చేసుకొని (5lt/200lt water) ముందుగా మట్టి మిశ్రమాన్ని నీటితో తడిపి తరువాత మందు ద్రావణాన్ని మట్టి పై పిచికారి చేయాలి. తర్వాత నల్లని ఫాలిఫిల్మ్ కాగితాన్ని బెడ్ లపై కప్పి 4-7 రోజులు పాలిహౌస్ లు మూసి వుంచాలి. ఈ విధంగా చేసిన తరువాత వారం రోజుల తర్వాత మొక్కలు నాటుకోవాలి. లేకుంటే మందు ద్రావణం వలన మొక్కలు చనిపొయే అవకాశం ఎక్కవగా వుంది.

హరితగృహాల్లో ఉపయోగించే సాగునీరు ఈ క్రింది లక్షణాలు కలిగి ఉండాల

హరిత గృహాల్లో పంటల అధిక దిగుబడికి, నాణ్యత చాలా ముఖ్యం. ఉదజని సూచిక, లవణ పరిమాణం, కారిన్యం, క్షారత్వం మొదలగునవి వివిధ రకాల పోషకాలు, రసాయన ఎరువులు, పురుగు మందుల కరుగుదల శాతం ప్రభావం చూపుతాయి.

అంశాలు గరిష్ట స్ధాయి కనిష్ట స్ధాయి
pH ఉదజని సూచిక - 5-7
EC (విద్యుత్ వాహకత)(dSm) 0.75 0
1. నరుమడికి 1.25 0
2. మొక్కల పెరుగుదలకు
సోడియం సారూప్య నిష్పత్తి (SAR)
1.హరితగృహాల్లో 4 0-3
2. నారుముడికి 6
మి.గ్రా / లీటరు నీటికి
క్షారత్వం 200 0-100హరితగృహాల్లో
0-140 నారు పెరుగుదల
బైకార్బోనేట్ (HCO3) 150 30-50
కాల్షియం (Ca) 120 40-120
మేగ్నిషియం (Mg) 24 6-24
ఇనుము (Fe) 5 1-2
మాంగనీస్ (Mn) 2 0.2-0.7
మాలిబ్దీనమ్ (MO) 0.07 0.02-0.05
ఫ్లోరైడ్ (F) 1 0
సల్ఫేట్ (SO4) 240 24-240
క్లోరైడ్ (CI) 140 0-50
సోడియం (Na) 50 0-30
అల్యూమినియం (AI) 5 0-5
నైట్రేట్ (NO3-N) 50 0-10
ఫాస్పరస్ (PO4-P) 5 0-1
పొటాషియం (K) 10 1-10
కారిన్యం 200

20-150

నీటిలో పూర్తిగా కరిగిన ఘన పదార్దాలు (మి.గ్రా/లీటరు నీటికి)
1. హరితగృహాల్లో 800 0-192
2. నారు మొక్కల పెరుగుదలకు 960

హరితగృహాలు – వాతావరణం

హరితగృహాలలో సాధారణంగా ఉష్ణోగ్రత బయటికన్నా 3-100 C (సెల్సియుస్) ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో అయితే మొక్కల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. వేసవిలో షెడ్ నెట్స్ (50% వరకు) వాడటంవల్ల, మిస్ట్ లు, బిందు సేద్యం/మినీస్ప్రింక్లర్ల ద్వారా ఉష్ణోగ్రతను కొంతవరకు తగ్గించవచ్చు. రసాయనిక లేపనం ద్వారా కూడ పైకప్పు పై పుతపూసి లోపలి ఉష్ణోగ్రతను కొంతవరకు తగ్గించవచ్చు.

సాధారణంగా పూలు, కూరగాయల పెరుగుదలకు మరియు నాణ్యత పెంపొందించుటకు ఉపయోగకరమైన సగటు పగటి మరియు రాత్రి ఉష్ణోగ్రతలు వరుసగా 26-300 సెల్సియస్, 15-180 సెల్సియస్. హరిత గృహాల్లోపలి ఉష్ణోగ్రత 40 సెల్సియస్ కంటే ఎక్కువ అవుతుంది, కావున వెంటిలేటర్లు, ఫాగర్స్ మరియు ఫ్యాన్ & ఫ్యాడ్స్ ద్వారా ఉష్ణోగ్రత తగ్గించి అదుపు చేయవచ్చు.

బొగ్గుపులును వాయువు (కార్బన్ డైఆక్సైడ్) (CO2) పరిమాణం 300-1000 పి.పి.యం., సూర్యరశ్మి 250-450 మైక్రో మోల్స్/చ.మీ./సె. ఉండేటట్లు చూడాలి. (టమాట, వంగ మరియు గులాబిక మాత్రము 450-750 మైక్రోమోల్స్/చ.మీ./సె. ఉండాలి).

హరితగృహాలకు వివిధ పంటలకు ఈ క్రింద తెల్పిన వాతావరణం పరిస్థితులకు చాలా అనుకూలము.

పంట పగటి ఉష్ణోగ్రత (సెల్సియస్) రాత్రి ఉష్ణోగ్రత (సెల్సియస్) గాలిలో తేమ (%)
కూరగాయలు / పండ్లు
టమాట 21-28 15-20 60-65
సిమ్లామిర్చి 22-23 18-19 70-75
వంగ 22-27 17-22 50-65
దోస 20-25 18-20 70-90
ఖర్బూజ 20-25 18-20 70-75
పుచ్చకాయ 21-23 15-18 70-80
సమ్మర్స్క్యాష్ 20-25 16-18 70-75
లేట్యుస్ 21-22 18-20 65-70
స్ట్రాబెర్రి 21-22 17-19 60-65
పంట పగటి ఉష్ణోగ్రత (సెల్సియస్) రాత్రి ఉష్ణోగ్రత (సెల్సియస్) గాలిలో తేమ (%)
పూలు
చేమంతి 18-20 16-17 68-70
గులాబీ 21-27 16-17 60-62
కార్నేషన్ 16-19 12-13 70-72
జెర్బెరా 20-24 13-15 65-70
గ్లాడియోలస్ 16-20 10-12 70-75
పోయిన్ సెట్టియా 20-21 10-12 65-70
జెరేనియం 20-21 17-18 65-70

ప్లాస్టిక్ టన్నెల్స్

సుమారు 5 అడుగుల ఎత్తు కలిగి 40-150 మైక్రాన్ల మందంగల పారదర్మక ఫిల్ము (అతినీలలోహిత కిరణాలకు తట్టుకొనే ఫిల్మ్) తో కప్పబడి గుడిసె ఆకారంలో నిర్మించిన పొడవాటి (4-5 మీ.) కట్టడాలను “ప్లాస్టిక్ టన్నెల్స్” అంటారు. పాలిటనెల్స్ ను చలి ఎక్కవుగా ఉన్న ప్రాంతాలలో కూరగాయలు, ఆకుకూరలు, పులా మొక్కలు, వరి నారు మొ. వాటిని వేసవికాలంలో కూడా పైకప్పుకు అక్కడక్కడ 1-5 సెం.మీ. రంధ్రాలు చేసి ఉష్ణోగ్రత తగ్గించి పై పంటలు పండించివచ్చు. కొన్ని ప్రాంతాలలో హూప్స్ లేకుండా ప్లాస్టిక్ షీటును వరసలుగా ఉన్న మొక్కల పై కప్పటంద్వారా పంటలను క్రిమికీటకాదులు, చలి మొ. వాటి బారి నుండి కాపాడవచ్చు. ఈ పద్ధతిని “ప్లోటింగ్ కవరు పద్ధతి” అని అంటారు.

నిర్మాణం

గుడిసె ఆకారంలో కనిపించే ఈ పొడవాటి కట్టడాలను నిర్మించుటకు సపోర్టు కొరకు వెదురు బద్దలను లేదా ప్లాస్టిక్ పైపులను లేదా ఇనుప చువ్వలను (5 మి.మీ. వ్యాసం) ఉపయోగించి హూప్స్ తయారు చేస్తారు.

హూప్స్ ఎత్తు వెడల్పు మనం పండించే పాటలకు అనుకూలంగా ఉండాలి. వంకరంగా వంచిన చువ్వలను లేదా పైపులను సమ దూరంలో భూమిలోకి పాతి, పైన ప్లాస్టిక్ షీటును పరచి కప్పగా ఏర్పాటు చేస్తారు.

టన్నెల్స్ ఏర్పాటు చేయక ముందే భూమిని ఎత్తైన మడులు (బెడ్స్) గా తయారు చేసుకోవాలి. తరువాత బిందు సేద్యం పరికరాలను అమర్చుకోవాలి. నీరు, పోషక పదార్దాలు సూక్ష్మధాతు పోషకాలు మొదలైనవి ఫర్టిగేషన్ ద్వారా అందజేయవచ్చు.

ఉపయోగాలు

 • ఆరోగ్యకరమైన నారును మొక్కలను అనుకున్న సమయం కంటే ముందుగానే పొందవచ్చు.
 • విత్తనం మొలకశాతం పెరుగుతుంది.
 • అధిక వర్షం, మంచు, వేగంగా వీచే గాలి నుండి పంటను రక్షించవచ్చు.
 • చీడపీడల నుండి పంటను రక్షించవచ్చు.
 • వాణిజ్యాపరంగా నర్సరీలు స్ధాపించుటకు ఉపయోగకరంగా ఉంటుంది.
 • అతి చల్లని రాత్రి ఉష్ణోగ్రత నుండి పంటను సంరక్షించవచ్చు.
 • కార్బన్ డై యాక్సైడ్ పరిమాణాన్ని పెంచి, కిరణజన్య సంయోగ క్రియ పెంచి అధిక దిగుబడులకు సహకరిస్తుంది.
 • పంట నాణ్యత పరిమాణాలను పెంచవచ్చు.
 • కోరుకున్న పంటను అననుకూల పరిస్దితులలో కూడా పొందవచ్చు.
 • మార్కెట్ కి పంట సమయం కన్నా ముందుగానే చేర్చి అధిక మార్కెట్ ధరను పొందవచ్చు.

నిర్మాణ ఖర్చు – ప్రభుత్వ రాయితి

టన్నెల్స్ నిర్మించుటకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. వీటిని ఎంత సులువుగా నిర్మించావచ్చునో అంతే సులువుగా విడదీయవచ్చు. వేరొక చోటుకు మార్చుకోవచ్చును.

నిర్మాణ ఖర్చు రూ. 60/- ఒక చ. మీకు అవుతుంది. ఇందులో 50% శాతం సబ్సిడీ మన రాష్ట్రంMIDH (Mission for Integrated development of Horticulture)ద్వారా అందిస్తుంది.

పాలి తెన్నేల్స్ లో సాగు ఆధునిక సాంకేతిక సాగు పద్ధతిలో అధిక ఉత్పత్తులను, అధిక దిగుబడులను సాధించుటకు వీలవుతుంది.

షెడ్నెట్ గృహాలు (Shadenet houses)

హరితగృహాల పై వేసే పాలిధీన్ షీట్లకు బదులు నైలాన్ తో చేయబడిన వలను పైకప్పుగా ఉపయోగించిన వాటిని “షేడ్ నెట్ గృహాలు” అంటారు. పైకప్పు మినహా ఇవి అన్ని విధాల హరితగృహాలను పోలి ఉంటాయి. ఇవి మొక్కలను “ఆగ్రోషేడ్ నెట్” అంటారు. ఈ ఆగ్రోషేడ్ నెట్స్ వివిధ పరిమాణాలలో నిదనిచ్చే విధంగా మార్కెట్లలో లభ్యమగును. ఇవి 3 మీ. వెడల్పుతో వివిధ రంగులలో అనగా నలుపు, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ మరియు వీటి మిశ్రమంతో 25%, 35%, 50%, 75% మరియు 90% నిడనిచ్చేవిగా దొరుకుతాయి. ఏ ఏ షేడ్నెట్స్ ఏ ఏ పంటలకు అనుకూలంగా ఉంటాయో ఈ క్రింది పట్టిక ద్వారా తెలుస్తుంది.

పంట నిదనిచ్చే ఆగ్రోషేడ్ నెట్స్ (%)
అంటు మొక్కలు, చేమంతి 90
నర్సరీ మొక్కలు, జెర్బెరా, ఆంధూరియం, సుగంధ ద్రవ్యాలు, అలంకరణ మొక్కలు 75
గులాబీ, ఆకు కూరలు, స్ట్రోబెర్రీ, లిల్లీ, కట్ఫ్లవర్లు వేసవిలో 50
వేసవిలో కూరగాయలు 35

ఆగ్రోషేడ్ నెట్స్ నిర్మాణం ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో చేయరాదు. అంతేకాక అధిక వేడి వలన వ్యాకోచం కొరకు 2-5% ఎక్కువ మార్జిన్ ఉండేటట్లు జాగ్రత్త పడాలి. పాలిక్లిప్పుల మధ్య ఉండవలసిన సాధారణ దూరం 30-40 సెం. మీ. ఉండాలి. నిదనిచ్చే శాతాన్ని అనుసరించి ఒక చ.మీ.కు రూ. 25/- వరకు ఉంటుంది. షేడ్నెట్స్ నిర్మాణ ఖర్చు హూప్స్ రకాలను బట్టి ఒక చ.మీ.కు రూ. 710/- వరకు ఉంటుంది. టిష్యూకల్చర్ ద్వారా హరిత గృహాలలో ఉత్పతి అయిన అంటు మొక్కలను దృడ పరచడానికి ఈ షెడ్ నెట్స్ ఎంతో ఉపయోగపడతాయి.

షేడ్ నెట్ గృహాల ఉపయోగాలు

 1. వేసవిలో అధిక దిగుబడులను పొందవచ్చును.
 2. తక్కువ సమయంలో అంటు మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు.
 3. నాణ్యమైన పూలు, అలంకరణ మొక్కలు, సుగంధ ద్రవ్య మొక్కలు మరియు కూరగాయలను ఉత్పత్తి చేయవచ్చు.
 4. కీటకాల నుండి సంరక్షణ
 5. వర్మికంపోస్టు తయారికి కావలసిన అనుకూల పరిస్దితులను కలిగిస్తుంది.
 6. టిష్యూకల్చర్ మొక్కలను దృఢపరచడానికి
 7. ప్రకృతి అవరోధాలనుండి మొక్కలను కాపాడవచ్చును.

ఆగ్రోషేడ్ నెట్ లు వివిధ రంగులలో లభిస్తాయి. ప్రస్తుతం అందుబాటులో వున్న రంగులు తెలుపు, నలుపు, ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ రంగులు మరియు మిశ్రమ రంగులు.

ఆకుపచ్చ : మొక్కలతో కిరణజన్య సంయోగక్రియను పెంచుతుంది.

నలుపు : నర్సరీ మొక్కలను పెంచుటకు ఉపయోగపడును.

ఆకుపచ్చ x నలుపు : ద్రాక్ష మొక్కలను నీడనిచ్చుట మరియు ద్రాక్ష వళ్ళను ఎండబెట్టుకు ఉపయోగపడుతుంది.

తెలుపు xనలుపు : అలంకరణ మొక్కలలో కిరణజన్య సంయోగక్రియను పెంచి మొక్కల అభివృద్దికి తోడ్పడుతుంది.

కిటక నిరోధక వలలు (Insect Nets)

ఇవి ఇంచుమించు మనం వాడే దోమ తెరలలాంటి వలలు. ఇవి కూడా నైలాన్ తో చేయబడి వివిధ రంగులలో ఉంటాయి. వీటిలో కూడా అతినీలలోహిత కిరణాల నుండి (UV rays) పాడవకుండా ఉండే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి 20-60 నెంబరు వలలుగా లభించును. ఈ వలలను షేడ్ నెట్ స్ధానంలో హరిత గృహాల పై కప్పులుగా వాడవచ్చు. వీటిని “కిటక నిరోధక నెట్ గృహాలు” అని అంటారు. ఇవి కొంత వరకు నీడను కల్పించుటయేకాక పంటలను ఆశించు చాలా రకాల క్రిమికీటకాదుల నుండి మరియు తెగుళ్ళ నుండి రక్షణ కల్పిస్తాయి.

వ్యవసాయ కుంటలకు, చెరువులకు ప్లాస్టిక్ షీటు (అగ్రిఫిల్మ్) ను అడుగు భాగంలో పరుచుట

నీటిని నిలువ చేయడానికి సహజంగా కాని, మానవ నిర్మితంగా కాని చేసినటువంటి కట్టడాలను నీటి కుంటలు అని అంటారు. ఇవి సహజంగా సరస్సులకంటేచిన్నవిగా ఉంటాయి. కుంటలకు నీరు వర్షాధారంగా కాని, బావలు మరియు కాలువల ద్వారా అందించి నిలువ చేయవచ్చు. నీటిలో సున్నిత దశలో (Critical Stages) జీవనాధార తడులుగా ఇచ్చి పంటలను రక్షిస్తారు. కాని ఇలా కుంటలలో నిల్వ చేసిన నీరు నేల రకాలను బట్టి భూమిలో పలు గరిష్టంగా జరుగుతుంది. దీనిని నివారించుటకు కుంటలను ఎటుకలతో గాని, పలుకలు లేదా సిమెంట్ తో కం లైనింగ్ వేయడం జరుగుతుంది. దీని వల్ల ఖర్చు అధికమై పూర్తి కాలం మన్నిక జరుగదు.

వ్యవసాయరంగంలోప్లాస్టిక్వాడుకపెరిగినతర్వాతవ్యవసాయకుంటలకుకూడాప్లాస్టిక్షీటు (దీనినే అగ్రిఫిల్మ్ అని కూడా అంటారు) తో లైనింగ్ చేసి నీటి ఇంకిపోయే నష్టాన్ని 98-100% వరకు అరికట్టవచ్చు. ఈ ఫిల్ము నల్లని లేక నీలం రంగులో 300 మైక్రాన్లు (1200 గేజీల) మందం కలది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది 7 నుండి 9 మీటర్ల వేడుల్పుతో లభిస్తుంది. ఒక కిలో 250 మైక్రాన్ల ఫిల్ము 4.2 చ.మీ విస్తర్ణం కలిగి ఉంటుంది. దీని ధర ఒక చదరపు మిటరుకి రూ. 65 నుంచి రూ. 110 వరకు ఉంటుంది. అగ్రిఫిల్ముతో లైనింగ్ చేసిన కుంటలు సుమారు 10 సం. వరకు మన్నిక కలిగి ఉంటాయి. అయితే కుంటలలో పశువులు, ఇతర జంతువులు వెళ్ళకుండా (fencing) ఏర్పాటు చేసుకుంటే ఇంకా మన్నిక చాలా రోజులు ఉంటుంది. వీటి నిర్మాణ ఖర్చు సిమెంటు లైనింగ్ తో పోలిస్తే 1/3 వంతు మాత్రమే వుంటుంది.

కుంటల రకాలు

కుంటల సైజు మరియు లోతు మన అవసరాలకు తగినట్లుగా చేసుకోవాలి అంటే 1. వ్యవసాయానికి అవసరపడే కుంటలు పెద్ద సైజులో వెడల్పుగా 3-5 అడుగుల లోతు ఉండాలి (సామూహికంగా ఏర్పాటు చేసుకునే కుంటల లోతు 12-15 అడుగులలో ఉండాలి).

2. చేపల పెంపకానికైతే చిన్న సైజులో, లోతుగా (12-15 అడుగులు) ఉండాలి.

కుంటలను చతురస్రము, దీర్ఘచతురస్రము, గుండ్రగా, అండాకారంగా రకరకాల సైజులో మనకు అనుకూలంగా నిర్మించుకోవచ్చు.

కుంటలకు అగ్రిఫిల్ముతో లైనింగ్ చేయుట వలన కలిగే లాభాలు

 • నీటిని భూమిలోకి ఇంకడాన్ని 100% తగ్గిస్తుంది. తద్వారా నిల్వ చేసిన నీరు కుంటలలో రోజులు నిలువ ఉంటుంది.
 • ఈ నీటిని పంటల సున్నిత దశల్లో తక్కువ కాల పరిమితి గల పంటలకు మరియు ఆఫ్ సిజన్ లో పండించే
 • పంటలకు చాలా లాభం.
 • ఇసుకతో కూడిన గరపనేల ప్రాంతాలలో ఇవి చాలా ఉపయోగం.
 • తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నిక కలిగి అధిక నీటిని నిలువ చేస్తుంది.
 • నీటి ఎద్దడి సమయంలో కుంటల క్రింద అన్ని రకాల నార్లు పెంచుకోవచ్చు.
 • కుంటలలో చేపలు రొయ్యులు పెంచుకోవచ్చు.
 • అనుకున్న రీతిలో వాడుకోవచ్చు.
 • ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటుంది.
 • నిర్వహణ ఖర్చు చాలా తక్కువ
 • అధిక ఉష్ణోగ్రతలకు నిరోధం కల్గి ఉంటుంది.
 • ఎక్కువ సాగు గుణం ఉండటం వల్ల అధిక నీటి వత్తిడిని తట్టుకుంటుంది.
 • త్వరగా మరియ సులభంగా నిర్మించవచ్చు.
 • నీటితో తక్కువ నిరోధం కలిగి ఉంటుంది (Low co-efficient of friction)
 • దీనివల్ల వాతావరణ కాలుష్యం ఉండదు (UV treatmental friendly) అని అంటారు.

అగ్రిఫిల్మ్తో లైనింగ్ వేసే విధానము

దీనిలో ముందుగా కుంటను మనకు అనుకూల సైజులో నిర్మించాలి. కుంటలోతు మరియు వాలు తలంల నిష్పత్తి 1:2:5 ఉండేటట్లు చూడాలి. కుంట అడుగు భాగం మరియు నలువైపులా చదును (smooth) గా చేసి సన్నటి ఇసుక సుమారు 5 సెం.మీ మందం పరచాలి. దీనిపై అగ్రిఫిల్మును బిగుతుగా, అడుగు భాగం నుండి పైకి పరచుకుంటూ రావాలి. కుంటా పైన నలువైపులా 30 x 30 సెం. మీ. గడిచేసి ఫిల్ము చివరలను గడిలోకి వేపి మట్టితో కప్పాలి. ఈ విధంగా చేయడాన్ని “యాంకరింగ్” అని అంటాము. కుంటల సైజు పెద్దదిగా ఉన్నప్పుడు అగ్రిఫిల్మును ‘హెట్సీలింగ్’ అనే పద్ధతి ద్వారా అతికించి వాడాలి.

కుంటల నిర్వహణ

 1. కుంటలకు నీటిని సరఫరా చేసే కాలువ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి.
 2. కుంటలపై చెట్టు మొలవకుండా మరియు మట్టి కోత కాకుండా చూడాలి .
 3. కుంతలలోకి జంతువులు మొ. రాకుండా చుట్టూ కంచే వేస్తే ఎక్కువ కాలం మన్నిక కల్గి ఉంటుంది.
 4. కుంతలలోని నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేటట్లు చూడాలి.

పంట కాలువలకు కూడా అగ్రిఫిల్ముతో లైనింగ్ చేస్తే నీరు భూమిలోకి ఇంకిపోకుండా సుమారు 20-30% నీరు ఆదా అవుతుంది.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే రాయితీ వివరాలు

క్ర.సం విషయము రాయితీ వివరాలు లభిదారుడు పాందే విస్తర్ణం
1. పాలిహౌస్ (హరిత గృహాలు) 75% సబ్సిడీ (డ్రోప్ ఇరిగేష్ న్ మరియి ఫాగర్స్ తో కలిపి) ఎకరాకు రూ. 25.32 లక్షలు మించకుండా, రైతుకు 200 చ. మీ. నుండి 3 ఎకరాల వరకు పొందవచ్చు.
2. సూక్ష్మ సేద్యము ఎస్.సి/ఎస్.టి రైతులకు – 100% బి.సి, చిన్న, సన్నకారు రైతులకు – 90% ఇతరులకు – 80% రాయితీ ఐదు హెక్టార్లు (12.5 ఎకరములు)
3. షెడ్ నెట్ (35% వదులు షేడ్ నెట్) 50% రాయితీ రూ. 12.50/చ.మీ. ఒక హెక్టారు (2.5 ఎకరాలు)
4. మల్చింగ్ 50% గరిష్టంగా హెక్టారుకు 16000/- ఒక్కో రైతుకు 2 హెక్టార్ల (5 ఎకరాలు) వరకు రాయితీ ఇవ్వబడును.
5. నీటి కుంటలు 50% సబ్సిడీ, గరిష్టంగా 1,00,000/- వరకు ఒక ఎకరాకు రాయితీ ఇవ్వబడును. గరిష్ట పరిమితి రైతుకు 2.5 ఎకరాల వరకు రాయితీ ఇవ్వబడును.
6. ప్రొట్రేలు (నర్సరీ పెంపకానికి) 50% రాయితీ ఒక ట్రేకి రూ. 7.50 మించకుండా ఇవ్వబడును. గరిష్టంగా ఒక్క రైతు 200 ట్రేలు పొందవచ్చును.

ఆధారం : వ్యవసాయ పంచాంగం

3.00763358779
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు