పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సకశేరుక చీడల యాజమాన్యం

మన దేశములో వ్యవసాయ పంటల్లో కీటకాలు, తెగుళ్ళు, కలుపు మొక్కలు మరియు పక్షుల వలన నష్టం కలుగుతుంది.

మన దేశములో వ్యవసాయ పంటల్లో కీటకాలు, తెగుళ్ళు, కలుపు మొక్కలు మరియు పక్షుల వలన నష్టం కలుగుతుంది. ఈ మధ్య కాలంలో క్షీరదాలైన ఎలుకలు, జింకలు, మనుపోతులు, అడవి పందులు మొదలగునవి వాటి వలన కూడా చెప్పుకోదగిన నష్టం వాటిల్లుతున్నది. విత్తనం నాటిన మొదలు మొలకెత్తి పక్వానికి వచ్చే వరకు వివిధ దశలలో పై జంతు జాతుల వలన నష్టం వాటిల్లుతున్నది. వన్య జీవుల ఆవాస ప్రాతాలైన అడవులు తగ్గిపోవుట వలన, ఆహార కొరత ఏర్పడి, వన్య జీవులు సమీపంలోని వ్యవసాయ పంటలపై బాడిచేస్తున్నాయి. ముఖ్యంగా అడవి పందులకు అటవీ ప్రాతాలలో ఆహారం లభించక పంటపొలాలపై దాడిచేసి నష్టం కలుగజేస్తున్నాయి. అదే విధంగా వాటిని వేటాడి చంవే జంతువులు (పులులు, సింహాలు, చిరుతలు) అంతరించిపోవడం వలన అడవి పందుల సంఖ్య గణనీయంగా పరిగింది. తత్ఫలితంగా పంట నష్టం కూడా అధికమయింది. అడవి పందులకు వాసన గ్రహించే శక్తి అమోఘం, అందువలన అవి దూరం నుండే ఆహార పంటలైన వరి, మొక్కజొన్న, జొన్న, ప్రొద్దుతిరుగుడు, వేరుశనగ మొదలగు పంటలలో విత్తనం నాటినప్పటినుండి వివిధ దశలలో నష్టం కలుగజేయుచున్నాయి. వివిధ ఫల జాతికి మరియు కూరగాయలకు చెందిన పంటలలో వేర్వేరు దశలలో నష్టం కలుగజేస్తున్నాయి.

వ్యవసాయ రంగంలో వివిధ జంతు జాతుల యాజమాన్య పద్దతులనుసరించి మేలు చేయు జంతుజాతుల సంరక్షణ, హానికారక జ్తుజాతుల నియంత్రణల ద్వారా పంట దిగుబడిని పెంచే క్రమంలో రైతులకు అత్యాధునిక యాజమాన్య పద్దతులను రూపొందించే ప్రధాన లక్ష్యంతో ఏర్పాటైన “అఖిన భారత సకశేరక చీడల యాజమాన్య (వ్యవసాయ పక్షి పరిశోధనా శాస్త్ర) విభాగం” పంటలకు ప్రధానంగా నష్టం కలిగించే జీవులైన పక్షులు, రోజెంట్స్ (కొరికి తినే ఎలుక జాతి జంతువులు), అడవి పందులు దలగు వాటి మేలైన యాజమాన్య పద్దతులను రూపోందించింది. ఆయా పద్దతులను రైతులకు అందుబాటులోకి తెచ్చి పంట నష్టం తగ్గించే దిశగా తీవ్రంగా కృషి చేయుచున్నాయి.

ఆహారపు అలవాట్లు

అడవి పందులు మిశ్రమ భక్షకులు శాఖాహారంలో ప్రధానంగా పంట మొక్కల వేర్లు, దుంపలు, వివిధ రకాల గ్రుడ్లను తింటాయి. మాంపాహారంలో కీటకాలు, పాములు, కుళ్ళిన జంతు కళేభరాలను భూజిస్తాయి. అడవి పందుల ఆహార సేకరణ ఎక్కువగా ప్రాతఃకాల సంనయంలో ఉంటుంది. గుంపులుగా బయలుదేరి దాడిచేస్తాయి. ఒక్కో గుంపులో సుమారు 15 – 35 వరకు అడవి పందులుంటాయి. అదేవిధంగా రాత్రివేళల్లో కూడా పంటపొలాలపై దాడి చేస్తాయి. వీటికి వినికిడి శక్తి మరియు మాతిరం క్షీణించి ఉంటాయి.

వివిధ పంటలపై అడవిపందుల దాడి వలన వాటిల్లుతున్న నష్టాలను నివారించడానికి క్రింద సూచించిన వివిధ యాజమాన్య పద్దతులు ఉపయోగ పడతాయి.

భౌతికంగా ఏర్పాటు చేయు ప్రహారీలు

ఇనుప ముళ్ళ తీగె కంచె (బార్బడ్ వైర్ ఫైన్స్)

పంట పొలం గట్టు వెంబడి ఒక అడుగు దూరంలో ముళ్ళను కలిగి ఉన్న ఇనుప తీగను పంట పొలం చుట్టూ కర్రల సహాయంతో ఒక అడుగు ఎత్తులో 3 వరుసలలో బిగించి కట్టినట్లయితే అడవిపందుల రాకను ఈ ముళ్ళకంచె నిరోధిస్తుంది. ఇనుప ముళ్ళ తీగె కంచెను ఒక ఎకరా పొలం చుట్టూ నిర్మాణానికి అయ్యే ఖర్చు వివరాలు : ఒక కిలో ముళ్ళ తీగ పొడవు 27 అడుగులు మరియు వెల రూ. 52/-, ఒక ఎకరా పొలానికి ఒక వరుసకి 836 అడుగులకు గాను సుమారు రూ. 1,610/- అదే మూడు వరుసలకు కలిపి రూ. 4,830/-, కూలీలకు అయ్యే ఖర్చు రూ. 1,000/-, మొత్తం ఒక ఎకరానికి అయ్యే ఖర్చు సుమారుగా రూ. 6,000/-.

వలయాకార ముళ్ళ కంచె పద్దతి (రేజర్ ఫెన్స్)

ఈ పద్దతిలో వలయాకారంలో ఉన్న ఇనుప కంచెను పొలం గట్ల వెంబడి పంటకు రండు నుండి మూడు అడుగుల ఎత్తు, ఒక అడుగు దూరము నుండి అమర్చినట్లయితే అడవిపందులు ఈ కంచెకు ఉండే చిన్న పదునైన బ్లేడ్ల వంటి నిర్మానాలు అడవిపందుల దేహానికి తీవ్రమైన గాయాలను కలుగజేయును. గాయాలతో అవి అరుస్తూ పారిపోయినప్పుడు మిగితా పందులు ఏదో ఆపద వున్నదని బయపడి వెనుకకు వెళ్ళిపోతాయి. ఈ పద్దతి చాలా సమర్థవంతంగా అడవి పందులను ఎదుర్కొంటుంది.

ఈ వలయాకార రక్షణ కంచె అడవి పందుల రాకను సమర్థవంతంగా నిరోధిస్తుంది. వలయాకార రక్షణ కంచెను ఒక ఎకరం పొలం చుట్టూ నిర్మించడానికి అయ్యే ఖర్చు వివరాలు (సుమారుగా) : ఒక ఎకరానికి చుట్టు ఏర్పాటు చేయవలసిన వలయాకార రక్షణ కంచె చుట్ట వెల రూ. 18,000/-, ఒక వరుసలో వలయాకార రక్షణ కంచె బిగించుటకు కర్రలు మరియు కూలీలకు అయ్యే ఖర్చు రూ. 1,000/-, మొత్తం ఎకరానికి అయ్యే ఖర్చు రూ. 19,000/- నుండి రూ. 20,000/-.

ఇనుప వల కంచె (చైన్లింక్ ఫైన్స్)

పంట పొలం నుండి ఒక అడుగు దూరంలో, ఇనుప వల కంచెను 3 అడుగుల ఎత్తు వరకు ఏర్పాటుచేయడం ద్వారా ఇది సమర్థవంతంగా అడవిపందుల ప్రవేశాన్ని నిరోధిస్తుంది.

ఇనుప వల కంచెను ఒక ఎకరా పొలం చుట్టు నిర్మించడానికి అయ్యే ఖర్చు వివరాలు (సుమారుగా) ఇనుప వల కంచె చుట్టు వెల రూ. 10,020/- నుండి రూ. 12,500/-, భూమి నుండి 3 అడుగుల ఎత్తు వరకు ఇనుప వలను బిగించుటకు కర్రలు మరియు కూలీలకు అయ్యే ఖర్చు రూ. 1,000/-, మొత్తం ఒక ఎకరానికి ఇనుప వలను బిగించడానికి అయ్యే ఖర్చు సుమారుగా రూ. 12,500/- నుండి రూ. 13,500/-

సౌర శక్తి కంచె (సోలార్ ఫెల్స్)

సోలార్ ఫలకాల ద్వారా 12 వోల్టుల విద్యూత్ ఉత్పత్తి చేయబడి కంచెలాగా ఏర్పాటు చేసిన వైర్ల ద్వారా ప్రసారం జరుగుతుంది. అడవి పందులు ఈ సోలార్ కంచెను పొరపాటున తగినట్లయితే స్వల్పంగా షాక్ కు గురై అరుస్తూ పంట పొలాల నుండి పారిపోటాయి. మిగితా పందులు కూడా ఏదో ఆపద ఉన్నదని దూరం నుండే పారిపోతాయి. సౌరశక్తి కంచెను పంట చుట్టూ 3 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయడం ద్వారా అవి సమర్థవంతంగా అడవి పందుల ప్రవేశాన్ని నిరోధిస్తుంది. సౌరశక్తి కంచెను ఒక ఎకరానికి పొలం చుట్టూ నిర్మించడానికి అయ్యే ఖర్చు సుమారుగా రూ. 90,000/- నుండి రూ.1,10,000/-.

కందకము త్రుప్పు పద్దతి

పంట పొలం చుట్టూ ఒక అడుగు దూరంలో గట్ల వెంబడి మూడు అడుగుల వెడల్పు పెండు అడుగుల లోతైన కందకాలను (ట్రెంచెస్ ను) ఏర్పాటు చేసినట్లయితే అడవిపందులు నివారణ మాత్రమే కాకుండా వప్శాభావ ప్రాంతాలలో నేలలోని తేమను వృధ్ధి చేయటానికి, ఒక పొలం నుండి ఇంకో పొలంనకు పోకే పురుగుల తాకిడిని తగ్గించడానికి కూడా తోడ్పడును.

పొలం చుట్టూ 3 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు కండకాన్ని త్రవ్వడానికి అయ్యే ఖర్చు వివరాలు: కంజకాన్ని తీయడానికి (జె.సి.బి ద్వారా) గంటకు వెల రూ.500/- చొప్పున ఒక ఎకరా పొలానికి 15 గంటలు పడుతుంది. దానికి గాను అయ్యే ఖర్చు సుమారుగా రూ. 7,500/-.

వల పద్దతి

100 మి.మీ.ల గుళ్ళు కలిగిన హెటి.డి.పి.ఇ (HDPE) నైలాన్ నిర్మితమైన వల 6 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది మరియు తేలికగా ఉండి ధృడంగా ఉంటుంది. పంట పొలం చుట్టూ 3 మీ. ఒకటి చొప్పున ధృడమైన వెదురు బొంగులు / సర్వి దుంగలు భూమి నుండి 3 అడుగుల ఎత్తు ఉండేటట్లు బిగుతుగా పొతుకోవాలి. నైలాన్ అంచు గళ్ళ నుండి జి.ఐ వైర్ ను చొప్పించి కర్ర దుంగలపై అంచుకు బిగుతుగా కట్టుకుంటూ చివర వరకు లాగి కట్టవలెను. అదేవిధంగా భూమిపై దిగువన కర్ర మొదటి భాగాలతో కూడా మరొక జి.ఐ వైరును బిగుతుగా లాగి కట్టవలెను. మరింత పటిష్టతకు మధ్యభాగంలో కూడా ఒక వరుస జి.ఐ వైరును కట్టుకోవచ్చు. మిగిలిన 3 అడుగుల నైలాన్ వలను భూమిపై సమాంతరంగా పరిచి బిగుతుగా లాగి ఏటవాలుగ కర్ర పెగ్గులను పాతుకోవాలి. ఈ విధంగా అమర్చిన నైలాన్ వల పంట పొలం చుట్టూ ఒక గోడ వలె కనిపిస్తుంది. రాత్రి సమయంలో పంట పొలాల పైకి దాడి చేసే అడవి పందులు, కుగేళ్ళు మరియు ఇతర జంతువులు పొలం సమీపానికి వచ్చి వలపై అడుగువేయగానె వాటి కాలి గిట్టలు వలలో చిక్కుకొని అవి భయపడి వెనుదిగురుతాయి. వాటి అరుపు (ఆర్తనాదం) లతో మిగితా గుంపు కూడా పారిపోతుంది. ఈ విధంగా నైలాన్ వల పద్దతి సమర్థవంతంగా పనిచేస్తుంది. సుమారు 70-80 శాతం పంటలకు రక్షణ కలుగజేస్తుంది.

నైలాన్ వల పద్దతి ఒక సంవత్సరము పాటు మన్నిక ఉంటుంది. ఎక్కడైనా వల పాడైనట్లయితే అక్కడ క్రొత్త వలను అమర్చుకోవచ్చు మరియు జి.ఐ వైరు, మరల కొనవలసిన అవసరం ఉండదు. ఈ పద్దతి పంట పొలం చుట్టూ గోడవలె ఉంటూ పంటను రక్షిస్తుంది. ఒక ఎకరాకు వల పద్దతిని ఆమలు చేయడానికి అయ్యే ఖర్చు సుమారు రూ.2,600/-.

జీవకంచెలు

పొలం చుట్టూ కుసుమ పంటను 4 వరుసల్లా నాటడం

వేరుశనగ పంట పొలాల చుట్టూ 4 నుండి 5 వరుసలు కసుమ పంటను దగ్గరగా (30 x 15 సెం.మీ.) వేసినచో వాటికి సన్నని ముళ్ళు ఉండటం అడవి పందులు వచ్చి ముట్టెతో భూమిని త్రవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఆ ముళ్ళు ముట్టెపై చక్మానికి గుచ్చుకొని తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. మరియు కుసుమ పంట వాసన, వేరుశనగ పంట వాసన కన్నా ఘాటుగా ఉండి సులభఁగా వ్యాపిస్తుంది. అందువల్ల దూరంలో ఉన్న పందులు వేరుశనగ వాసనను పసిగట్టలేక, లోపలికి చొచ్చుకొని పోవడానికి విముఖత చూపుతాయి. కుసుమ పంట వలన రైతులకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది.

పొలం చుట్టూ ఆముదపు పంటను 4 వరుసల్లో నాటడం

మొక్కజొన్న పంట పొలాల చుట్టూ 4 నుండి 5 వరుసలు ఆముదపు పంటను దగ్గరగా వేసినచో (45 x 30 సెం.మీ.) మొక్కజొన్న వాసనను పసిగట్టలేక, లోపలికి చొచ్చుకొని పోవడానికి విముఖత చూపుతాయి. ఆముదపు పంటను అడవి పందులు తినడానికి ఇష్టపడవు. ఫలితంగా పంట రక్షింపబడుతుంది. ఇదే విధంగా రైతులకు ఆముదము ద్వారా ఆదాయం సమకూరుతుంది.

పొలం చుట్టూ అల్లం మరియు పసుపు పంటను సాగు చేయడం

అల్లం (35 x 20 సెం.మీ.ల ఎడం), పసుపు (45 x 20 సెం.మీ.ల ఎడం) పంటలను పొలం చుట్టూ దగ్గర దగ్గరగా నాటడం వలన ప్రభాస పంట వాసన అడవి పందులు గుర్తించలేవు మరియు అల్లం/పసుపు పంటలు అడవి పందులకు రుచించవు. తత్ఫలితంగా ప్రధాన పంట రక్షించబడుతుంది. ఈ పంటల ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది.

వాక్కాయ చెట్టును పొలం చుట్టూ నాటడం

వాక్కాయ చెట్లను గట్ల వెంబడి పెంచటమూ మూలాన వాటి పదునైన ముళ్ళ వలన అడవిపందుల దేహం గాయపడి అడవి పందులు అరుస్తూ పారిపోతాయి. వాక్కాయ గింజలను చింతపండుకు ప్రత్యూమ్నాయంగా ఉపయోగిస్తారు. వాక్కాయ ఉత్పత్తులకు మార్కెట్ లో అధిక ప్రాముఖ్యత ఉండటం వలన ఈ ఉత్పత్తుల ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది.

రసాయనిక పద్దతిలు

ఫోరేట్ గుళికల పద్దతి

200 గ్రా. ఫోరేట్ గుళికలు / ధిమ్మెట్ గుళికలు ఒక కిలో ఇసుకలో కలిపి గుడ్డ సంచిలో కాని ప్లాస్టిక్ సంచిలో కాని మూటగా కట్టి, చిన్న రంధ్రాలు చేసి పంట చుట్టూ ఒక అడుగు దూరంలో 3 మీ.కు. ఒకటి చొప్పున కర్రలు పాతి 60 – 100 సెం.మీ.ల ఎత్తులో ఈ సంచులను వాటికి కట్టాలి. గాలి ద్వార ఫోరేట్ / ధిమ్మెట్ గుళికల వాసన పంట వాసన కన్నా ఘాటుగా ఉండి సలభంగా వ్యాపించి, పందులను పంట వాసన పసిగట్టకుండా చేయడం వలన పందులు దూరం నుండే వెనుకకు వెళ్ళిపోతాయి. తద్వారా పందుల బెడద గణనీయంగా తగ్గుతుంది.

క్రుళ్ళిన కోడి గ్రుడ్ల ద్రావణఁ పంట పొలం చుట్టూ పిచికారి చేయు పద్దతి

క్రుళ్ళిన లేదా మామూలు కోడి గ్రుడ్లను సేకరించి ద్రావణాన్ని తయారుచేసుకోవాలి. ఈ ద్రావణం 25 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పంట పొలం చుట్టూ ఒక అడుగు వెడల్పులో చదును చేసిన తడి భూమిపై పిచికారి చేసుకోవాలి. ఈ విధఁగా చేయడం ద్వారా ఘాటైన వాసన వెలుపడుతుంది.

ఈ వాసన పంట వాసన కంటె ఘాటుగా ఉండి సులభంగా వ్యాప్తించి పందులను పంట వాసన పసిగట్టకుండా చేయడం వలన పందులు దూరం నుంచే వెనకకు వెళ్ళిపోతాయి. అందువల్ల అవి పంట పొలాలవైపు రావడానికి సముఖత చూపవు. వాసన ఎక్కువ రోజులు వ్యాపించి ఉండాలంటే 10 రోజులకు ఒకమారు 60-70 లీ.ల. నీటికి 40-50 కోడి గ్రుడ్లు కలిపి తరుచుగా పిచికారి చేసుకోవాలి.

ఈ కోడి గుడ్ల ద్రావణఁ పర్యావరణానికి హాని చేయదు మరియు పంట పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ పద్దతికి అయ్యే ఖర్చు ఒక ఎకరానికి సుమారుగా రూ.300/-.

గంధకం + పందిక్రొవ్వు నూనె మిశ్రమాన్ని 3 వరుసల కొబ్బరి తాడుకు పూయడం

పందిక్రొవ్వు నూనె సేకరించి దానికి తగినంత గంధకపు పొడిని కలిపి, మిశ్రమంగా తయారు చేసి ఉంచుకోవాలి. పంట పొలం చుట్టూ 3 మీ.ల ఎడంతో కర్ర దుంగలు పాతుకోవాలి. ఈ కర్ర దుంగలకు కొబ్బరితాడును భూమికి ఒక అడుగు ఎత్తులో మొదలుకొని 3 వపుసలు బిగుతుగా లాగి కట్టుకోవాలి. ఇలా కట్టిన త్రాడుకు మందుగా తయారు చేసుకున్న పందిక్రొవ్వు మరియు గంధకము మిశ్రమాన్ని దట్టంగా పూయాలి.

ఈ మిశ్రమం నుండి వెలువడు ఘాటైన వాసనలు చాలా రోజుల వరకు ఉండి రాత్రి వేళల్లో సంచరించు అడవి పందులకు ఇబ్బందులు కలుగజేయును. ఆవాస పరిది గల జంతుజాతులు ఒక జంతువు వున్న పరిధి లోనికి వేరొక జంతువు రాదు. అందువల్ల ఇక్కడ వేరొక పందుల సమూహం ఉన్నదని వాసన ద్వారా పసిగట్టి పందులు దూరం నుండే వెనుకకు వెళ్ళిపోతాయి. వాసన ఎక్కువ రొజులు వ్యాపించి ఉండాలంటే 10 రొజులకు ఒక మారు మిశ్రమ ద్రావణాన్ని తాడుకు పూయాలి. తత్ఫలితంగా పందులు పంట పొలాల సమీపం నుండి దూరంగా వెళ్ళిపోయి రక్షించబడుతాయి.

జీవ ఆర్తనాద పద్దతి

అజవి పందుల ఆర్తనాదాలు మరియు అడవి పందులను వేటాడే జంతువులైన సింహాలు, పులులు, చిరుతలు, అడవి కుక్కలు, నక్కలు మరియు తోడేళ్ళు మొదలగునవి వేటాడుతున్నప్పుడు చేయు భయంకరమైన గ్రాండ్రింపు శబ్దాలను ప్రత్యక్షంగా రికార్డ్ చేసి సునిశితమైన స్పీకర్ల ద్వారా పంట సమీప ప్రాతం నుండి ప్రసారం చేసినట్లయితే అడవి పందులు తీవ్ర భయాందోలనకు గురై పంట పొలాల నుండి దూరంగా పారిపోతాయి. ఈ ఆర్తనాద యంత్రం విద్యూత్ / సోలార్ ఫలకల ద్వారా పనిచేయును. ఈ యంత్రం ద్వారా వెలువడు గాండ్రింపు శబ్దాలు 10-12 ఎకరాల వరకు విస్తరించును. ఈ యంత్రం ఖరీదు రూ.25,000/-.

సాంప్రదాయ పద్దతులు

వెంట్రుకలు వెదజల్లు పద్దతి

క్షౌరశాలతో దొరికే వ్యర్థమైన వెంట్రుకలను సేకరించి పంట పొలాల గట్ల చుట్టూ ఒక అడుగు వెడల్పు ప్రాంతాన్ని చదునుచేసి వెంట్రుకలను పల్చగా చల్లాలి. అడవిపందుల నేలను త్రవ్వే అలవాటు, వాసన చూసే అలవాటు ప్రకారం అవి నేల మీద తమ ముట్టె భాగాన్ని ఉంచి గాలి పీల్చడం వలన ఈ వెంట్రుకలు వాటి ముక్కులోనికి ప్రవేశించి శ్వాసపరంగా తీవ్ర ఇబ్బందికి గురై తిరిగి వెనుకకు వెళ్ళిపోతాయి. తద్వారా పంటలు రక్షింపబడుతాయి.

చీరల పద్దతి

పంట పొలాల చుట్టూ కర్రలను పాతి, పాత చీరలను గోడల వలె కట్టినట్టయితే, అడవి పందులు రాత్రి సమయాల్లో దాడిచేసినప్పుడు ఆ చీరల స్పర్శతో మనుషులు ఉన్నట్లుగా భ్రమపడి అరుస్తూ దూరంగా పారిపోతాయి. ఆ శబ్దాలను విన్న మిగితా పందులు భయపడి దూరం నుండే వెనుదిరుగుతాయి. ఫలితంగా పంటలు రక్షింపబడుతాయి.

వన్యప్రాణి సంరక్షణా చట్టం, జీవవైవిధ్య సంరక్షణా చట్టం ప్రకారం వన్యప్రాణులను వేటాడుట నేరం కాబట్టి నష్టతీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వీటిని అదుపు చేయుటకు గాను , ప్రభుత్వం, అటవీశాఖ ఆద్వర్యంలో నష్టపరిహారం చెల్లించడం మరియు పంటనష్ట తీవ్రత హెచ్చిన పరిస్తితుల్లో, అటవీశాఖాధికారుల అనుమతితో వేటాడాలి.

పక్షుల నియంత్రణా పద్దతులు

రిబ్బన్ పద్దతి

పంట ఎత్తు కంటే ఒక అడుగు ఎత్తు గల రెండు కర్రలను ఉత్తర, దక్షిణ దిశలలో పాతుకోవాలి. ఒక ప్రక్క ఎరుపు రంగు మరొక ప్రక్క తెలుపు రంగు కలిగి అర అంగుళం వెడల్పు 30 అడుగుల పొడవు గల రిబ్బన్ 3 లేదా 4 మెలికలను త్రిప్పి కర్రలను 10 మీ. దూరంలో నాటి కట్టవలెను. పక్షుల ఉధృతి ఎక్కువగా ఉన్న ఎడల కర్రల మధ్య దూరము 5 మీ. తగ్గించి కట్టవలెను. సూర్యరశ్మి రిబ్బన్ పైబడి ధగధగ మెరుస్తూ గాలి వీచినప్పు ఒకరకమైన శబ్దము చేస్తూ పంట దశ పక్షుల కంటపడకుండా చేస్తుంది. రిబ్బన్ పద్దతిలో అన్ని రకములైన ఆహార ధాన్యాల, పప్పు ధాన్యాలు, నూనెగిందల పంటలు మరియు పండ్ల తోటలను పక్షుల బారి నుండి కాపాడవచ్చును.

ఆకుచుట్టు పద్దతి

మొక్కజొన్న ఆకులను, గింజలు పాలుపోసుకొనె దశలో కంకి చుట్టూ చుట్టి పక్షుల దృష్టిని మరల్పవచ్చును. గట్ల నుండి 3 లేదా 4 వరుసల వరకు ఆకులను చుట్టి పక్షుల దృష్టిని మరల్చి పంటలను రక్షించవచ్చును. తక్కువ విస్తీర్ణము కలిగిన పంటలను ఇది అనువైన పద్దతి.

వేపగింజల కషాయం పిచికారి పద్దతి

వేపగింజల కషాయం తయారీ: తగిన మొత్తంలో వేపగింజలను సేకరించి ఎండబెట్టుకోవలను. గింజలు బాగా ఎండిన తరువాత గింజలపై పొట్టును వేరు చేసి గింజలను తిరిగి ఒక రోజు ఎండబెట్ట వలెను. తరువాత ఈ గింజలను బాగా పొడిగా చేసి తడిలేని డబ్బాలలో పోసి నిల్వ ఉంచుకోవాలి. వేప కషాయం పిచికారి చేయడానికి, దానికి ముందు రోజు ఈ గింజల పొడిని ఒక పలుచని గుడ్డలో కట్టి, ఒక పాత్రలో తగినంత నీటిని తీసుకొని గింజల పొడి ఉన్న మూట ఆ నీటిలో మునుగునట్లు ఉంచినట్లైతే రాత్రి సమయం మొత్తం ఆ పొడి నాని చక్కటి కషాయం తయారవుతుంది. మరుసటి రోజు ఉదయం ఆ మూటను పాత్రలో నీటిలో గట్టిగా పండి పిప్పిని వడపోసి ఆ కషాయాన్ని తయారుచేసుకోవాలి. ఆ రకంగా తయారుచేసిన వేపగింజల కషాయాన్ని 20 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పంటపైన పిచికారి చేసినచో పక్షులు గింజలను తినడానికి విముఖత చూపుతాయి. ఫలితంగా పక్షుల బారి నుండి పంటను సమర్థవంతంగా కాపాడుకోవచ్చును. ఈ పద్దతి ద్వారా 7 నుండి 1 రొజుల వరకు పక్షులు పంటను నష్టపరచకుండా కాపాడవచ్చు.

కోడి గ్రుడ్డు ద్రావణం పిచికారి

కుళ్ళిన కోడి గ్రుడ్లను సేకరించి వాటిని పగులగొట్టి ద్వారణాన్ని వేరుపరచాలి. ఈ ద్రావణాన్ని 25 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి గింజ పాలుపోసుకొనే దశలో పంటపై పిచికారి చేసినట్లయితే ఆ వాసనలు పక్షులకు తీవ్రమైన చిరాకును కలుగజేస్తాయి. మరియు గింజలు రుచింపవు. అందువలన అవి పంట పొలాల వైపునకు రాకుండా దూరంగా పారిపోతాయి. దీని ద్వారా వచ్చే వాసన సుమారు 10-15 రోజుల వరకు పనిచేసి పక్షులను రాకుండా చేస్తుంది. అవసరమైనచో రెండవ విడుత కూడా పిచికారి వేసుకోవచ్చు.

ఈ పద్దతికయ్యే ఖర్చు అతి స్వల్పం. ఒక ఎకరాకు 25 గ్రుడ్లు అవసరం అవుతాయి. గ్రుడ్లు ఒక్కింటికి రూ.3/- చొప్పున 25 x 3 = 75/- , ఒక కూలిమనిషి ఒక్కరోజుకు రూ. 150/- మొత్తం ఒక పొలానికి అయ్యే ఖర్చు రూ. 225/-.

వ్యవసాయ పంటలలో నెమళ్ళ యాజమాన్యం

ఆహారాధారపు పంటలైన వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, నూనెగింజలైన ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, కుసుమ, వలిశెలు మొదలగునవే కాక ఫలజాతికి చెందిన జామ, దానిమ్మ, సపోట, ద్రాక్ష మరియు కూరగాయలైన టమాట, బెండకాయలు, కాలిఫ్లవర్, క్యాబేజి, వంకాయ, బీరకాయ, దోసె మొదలగు పంటలలో విత్తనం విత్తిన దశ నుండి పంట కాపుకు వచ్చే సమయం వరకు నెమళ్ళ వలన తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ నష్టం తీవ్రతను తగ్గించడానికి కొబ్బరిత్రాచు / పురిక్రొసత్రాడును విత్తనం విత్తే దశలో పొలానికి 4 వైపుల కర్రలను పాతు భూమికి ఒక అడుగు ఎత్తులో పంటకు పైన అడ్డు, నిలువు వపుసల్లో ఒక మీటరు మధ్య ఎడంగా ఖాలీ ఉంచుకొని కట్టినట్టైతే, పంటల మీదకి ఎగురుతూ వచ్చే నెమళ్ళ భయాదోళనకు గురై ఆర్తనాదాలు చేయుచూ దూరంగా ఎగిరిపోతాయి. గింజ పాలుపోసుకొనె దశలో, ఫలాలు పక్వదశలో, పంట గుట్టు వెంబడి భూమి నుండి ఒక అడుగు ఎత్తులో 3 వరుసలు పంట చుట్టూ కట్టినట్టైతే నెమళ్ళ బెడదను సమర్థవంతంగా అరికట్టవచ్చు.

పెద్ద కమతాల్లో ఒకే పంటను వేయు విధానం

ఈ పద్దతిలో ఒకే రకమైన పంటను అనగా జొన్న, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు పంటలను ఏదైనా ఒక దానిని మాత్రమే పెద్ద కమతాలలో (20 ఎకరాలలో) పండించినట్లైతే పక్షుల వలన వాటిల్లే నష్టాన్ని చాలా వరకు అరికట్టవచ్చు. వివిధ గింజలను తినే పక్షుల పంటల అంచుల వెంబడి మాత్రమే నష్టాన్ని కలిగిస్తాయి. ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న పంట పొలాలపైకి పక్షుల దాడి చేయునప్పుడు అంచుల వెంబడి వివిధ సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే దాదాపుగా పంట మొత్తాన్ని రక్షించుకోవచ్చు. పక్షుల బెడదను అరికట్టడానికి ఈ పద్దతి అత్యంత సమర్ధవంతమైనది మరియు స్వల్ప మొతాదు సస్యరక్షణ చర్యలు మాత్రమే చేపట్టవలసి ఉంటుంది. కావున రైతులకు ఈ పద్దతి ఆమోద యోగ్యమైనది.

ఆర్తనాద పద్దతి

పంటలను నష్టపరుచు వవిధ పక్షుల ఆర్తనాదాలను మరియు పంటకు నష్టం చేయు పక్షుల మీద దాడి చేయు పక్షుల యొక్క అరుపులను సేకరించి క్రమపద్దతిలో రికార్డ్ చేసి నిర్ణిత శబ్దోత్పత్తి యంత్రాలను ఉపయోగించి పంట పొలాలకు సమీప ప్రాంతం నుండి ఆర్తనాదాలను ఉత్పత్తి చేయవలెను. అప్పుడు పంటను నష్టం చేయు పక్షులు బెదిరి ఆపద ఉన్నదని భ్రాంతికి గురై పంట పొలాల నుండి దూరంగా పారిపోతాయి. ఈ పద్దతిలో ఉపయోగించే యంత్రం ఖరీదు సుమారు రూ.20,000/- (సోలార్ ప్లేట్లతో), విద్యూత్ సరఫరాతో పనిచేయు యంత్రం ఖరీదు రూ.15,000/- . ఈ యంత్రం సుమారుగా 4-5 ఎకరాల విస్తీర్ణం గల పంట పొలాలకు సమర్థవంతంగా పనిచేయుచున్నదని ప్రయోగ పూర్వకంగా ఋజువు పరచడమైనది.

ప్రత్యామ్నాయ ఆహార సరఫరా పద్దతి

వివిధ వ్యవసాయ పంట పొలాల సమీపంలో ఆవాస ప్రాంతాలలో వృధాగా ఉన్న భూములలో మరియు పొలం గట్ల వెంబడి వివిధ పక్షులను ఆకర్షించును. ఫలితంగా పంటలపై పక్షుల దాడి తగ్గి అధిక పరిమాణఁలో పంట నష్టం తగ్గుతుంది. మరియు అటవీ జాతి ఫలసాయం వలన రైతులను అదనపు ఆదాయం సమకూరుతుంది. ముఖ్యంగా అటవిజాతి పండ్ల చెట్లు సీమచింత, మొదుగ, రావి, మర్రి, వర్కి, కుల్మకాయలు, మొర్రి, తునికి, జీడిపండ్లు, రేగి, చింత, వెలగ, ఊదుగ మెదలగునవి.

సమగ్ర సస్యరక్షణ

పంటలకు హానిచేయు వివిధ పక్షులను అరికట్టుటకు గల పద్దతులు సమగ్రంగా అమలు పరిచినట్లయితే ఒక్కొక్క పద్దతిలో వచ్చే పలితాలు సంయుక్తంగా వచ్చి పంట నష్టం సమర్థవంతంగా అరికట్టబడును.

వివిధ సమగ్ర సస్యరక్షణ పద్దతులు

మొరుపు రిబ్బన్ + ఆకుచుట్టు పద్దతి

మొక్కజొన్న పంటలో గింజ పాలుపోసుకొనె దశలో రామచిలుకలు, గోరింకలు, కాకులు, పావురాలు, గువ్వలు మరియు ఇతర పక్షులు తీవ్రంగా దాడిచేస్తాయి. ఈ దశలో మొక్కజొన్న కండపై అంచు నుండి నూగు రావడంతో పక్షులు ఆకర్షించబడి గింజలను తింటాయి. ఈ దశలో నూగు బయటకు కనిపించకుండా కండెకు చుట్టూ ఉన్న ఆకులను కండె చుట్టూ కప్పినట్లయితే అది పక్షులు గమనించలేవు. ఫలితంగా పంట నష్టం తగ్గుతుంది. ఊ పద్దతితో పాటు రిబ్బన్ లను పంటకు ఒక అడుగు ఎత్తులో ఉత్తర, దక్షిణ దశలో మెలత్రిప్పి కట్టినట్లైతే సూర్యరశ్మిలో మెరుపు రిబ్బన్లు తళుక్కున మెరవడం వలన మరియు గాలి వీచివప్పుడు శబ్దం ఉత్పత్తి కావడం వలన పక్షులు బెదిరి దూరంగా పారిపోతాయి.

మెరువు రిబ్బన్ + కుళ్ళిన కోడిగ్రుడ్డు మిశ్రమం పిచికారి

జొన్న మరియు ప్రొద్దుతిరుగుడు మరియు సజ్జ పంటలలో పంటకు ఒక అడుగు ఎత్తులో ఉత్తర, దక్షిన దిశలో రిబ్బన్ కటట్న తరువాత కుళ్ళిన కోడిగ్రుడ్లు ద్రావణాన్ని ఒక లీటరు నీటికి 20 మి.లీ.ల మోతాదులో కలుపుకొని కంకులపైన పిచికారి చేయవలెను. ఈ పద్దతిలో పంటలను వివిధ హానిచేయు పక్షుల బెడద నుంచి సమర్థవంతంగా రక్షించవచ్చు.

మెరుపు రిబ్బన్ + ఆర్తనాద పద్దతి

మొక్కజొన్న, జొన్న, ప్రొద్దుతిరుగుడు, చిరుధాన్య పంటలు, నూనెగింజలు మొదలగు పంటలలో మెరుపు రిబ్బన్లను పంటకు ఒక అడుగు ఎత్తులో ఉత్తర, దక్షిణ దిశలో మెల త్రిప్పి కట్టినట్లయితే సూర్యరశ్మి రిబ్బన్లపై పడి తళతళమని మెరుస్తాయి. ఈ మెరుపుల వల్ల పక్షుల కంటికి తీవ్ర అసౌకర్యము కలిగి పంట పొలాల నుండి దూరంగా పారిపోతాయి. ఈ రిబ్బన్లతో పాటు ఆర్తనాద శబ్దాలనుత్పత్తి చేయు యంత్రాన్ని పంట మధ్యలో అమర్చినచ్లయితే దాని నుండి ఆర్తనాద శబ్దోత్పత్తికి జరిగి మెపురు రిబ్బన్ ల మెరుపులు, ఆర్తనాద శబ్దాలు ఒకే సమయంలో ఉత్పత్తి కావడం వలన పక్షులు తీవ్ర భయాందోళనకు గురై పంట పొలాల నుండి దూరంగా పారిపోతాయి.

పైన సూచించిన పద్దతులు సంయుక్తంగా అమలుచేసినప్పుడు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఫలితంగా పంట నష్టం గణనీయంగా తగ్గించబడుతుంది.

పంటలకు మేలు చేయు పక్షులు

వివిధ దశలలో పంటలను నష్టపరుచు పురుగులను పక్షులు తిని రైతులకు మేలు చేస్తాయి. తెల్ల కొంగలు, మంగలిపిట్ట, గోరింక, పాలపిట్ట, చిన్న పసిరిక, మాల కాకి, కిరీటం పిట్ట మరియు వసరిక పిట్ట పొలం దున్ను సమయంలో భూమి నుండి బయటకు వచ్చిన పురుగులను ఏరుకొని తినుట వలన పురుగుల ఉధృతి సుమారు 63 శాతం తగ్గుతుంది. ప్రత్తి, కంది పెంటలను నాశనము చేయు శనగపచ్చ పురుగు మరియు పొగాకులద్దె పురుగులను 40 నుండి 60 శాతం వరకు తిని పంటలను కాపాడుతాయి. ఒక కొంగ 20 నిమిషాలలో 50 పురుగులను తింటుంది. ఈ విధంగా వివిధ పూల, పండ్ల వృక్షాలను కూడా పొలం గట్ల చుట్టూ పెంచినట్లయితే మేలు చేయు పక్షులకు ఆవాస ప్రాతాలుగా మారి పంటలను ఆశించు కీటకాలను అదుపులో ఉంచుతాయి.

వివిధ పంటలలో సమగ్ర ఎలుకల నివారణ

భారత దేశంలో సుమారు 13 ఎలుకల జాతులు వివిధ పంటలలో నష్టం కలుగజేస్తాయి. తెలంగాణాలో 3 ఎలుక జాతులు నష్టాన్ని కలుగజేస్తుంది. రాట్టస్ రాట్టస్ (ఎలుక) పండ్ల జాతి వృక్షాలలో, మస్ బుడగ నీటి పారుదల క్రింద సాగు చేసే ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా బండికూట ఇండికా (పందికొక్కు) కనిపిస్తుంది.

యాజమాన్య పద్దతులు

ఎలుకల నివారణ చేపట్టేముందు ఎలుకల కనీస అవసరాలైన ఆహారం, నీరును దృష్టిలో పెట్టుకొని వాటికి అవకాశం లేకుండా నివారణ పద్దతులను రూపొందించి సకాలంలో అందుబాటులో ఉన్న అన్ని పద్దతులను సాముహికంగా అవలంభించాలి. ఎలుకలు ఒక పొలం నుండి వేరొక పొలంలోకి వెళతాయి. కాబట్టి రైతులు అందరూ కలిపి సమిష్టిగా ఎలుకల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించాలి.

ముందుగా ఎలుకల కన్నాల సంఖ్యను లెక్కించి వాటి ఆధారంగా నివారణ చర్యలు చేపట్టాలి.

కన్నాల సంఖ్య

నష్ట తీవ్రత

25 కంటె తక్కువ

తక్కువ

25 నుండి 50

మధ్యస్థం

50 కంటె ఎక్కువ

ఎక్కువ

ఈ క్రింది పద్దతులు పాటించి ఎలుకలను నివారించవచ్చు

  1. పొలంలో ఉన్న కలుపు మొక్కలు తొలిగించడం ద్వారా వాటికి ప్రత్యామ్నాయ ఆహారం దొరకకుండా చేయవచ్చు.
  2. సరైన నీటి యాజమాన్య పద్దతులు పాటించాలి.
  3. వేసవి లోతు దుక్కులు చేయుట, నాము ఇతర గడ్డి జాతులను కాల్చివేయాలి.
  4. కాల్వ గట్ల మీద ఉండే పాదులను తొలిగించడం ద్వారా ఎలుకలు దాగడానికి అనువైన ప్రదేశాలకు నిరోధించవచ్చు.
  5. వరిలో అయితే గట్ల పరిమాణం మరియు గట్ల సంఖ్యను తగ్గించాలి.

ఎర బుట్టల ద్వారా

ఇది చాలా పాత పద్దతి అయినప్పటికి చాలా ప్రాచుర్యంలో ఉఁది. ఎలుకలను పట్టుకునే ఎర బుట్టలను ఎకరానికి 20 చొప్పున పెట్టినచో వలసలు వచ్చే మరియు పోయే ఎలుకలను సమర్థవంతంగా నివారించవచ్చు.

దూమధీకరణం (పొగబారించటం)

బొరియలోని ఎలుకలను పొగబారించుట ద్వారా నివారించవచ్చు. దీనిలోని ప్రధాన సూత్రం బొరియలను పొగతో నింపడం ద్వారా లోపల ఉన్న ఎలుకలు ఉపిరి అందక మరణిస్తాయి. దీని కోసం బర్రోఫ్యూమిగేటర్ అనే పరికరాన్ని రూపొందించారు. ఈ ఫ్యూమిగేటర్ ను గడ్డితో నింపి నిప్పు పెట్టవలెను. ఈ విధంగా రెండు మూడు నిమిషాలు ఎలుక బొరియలలోకి పొగ ఉదర పెట్టినట్టయితే ఎలుకలు ఊపిరాడక చనిపోతాయి.

రసాయనిక పద్దతులు

కేవలం సాగు పద్దతులు, ఎర బుట్టల ద్వారా ఎలుకల నివారణ సాధ్యపడదు. వీటితో పాటు నిర్ధేశిక రసాయనాలు ఉపయోగించడం ద్వారా ఎలుకలను సమర్థవంతంగా నివారించవచ్చు.

మార్కెట్లో మనకు బ్రొమడయోలోన్, జింక్ ఫాస్ఫైడ్ రసాయానాలు లభ్యమవుతున్నాయి.

బ్రొమడయోలోన్

ఈ రసాయానంను వాడేటప్పుడు విషం కలుపని ఎర ద్వారా ఎలుకలు మచ్చిక చేసుకోనవసరం లేదు. ముందుగా 960 గ్రా. నూకలు, 2 గ్రా. నూనె మరియు 2 గ్రా. బ్రొమడయోలోన్ (0.05%) మందును కలిపి ఎరను తయారుచేసుకోవాలి. ఈ ఎరను 10-15 గ్రా. పొట్లాలుగా కట్టి కన్నంలో ఒకటి చొప్పున పెట్టాలి.

జింక్ ఫాస్ఫైడ్ ఎర

ఎలుకల ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఎరను ఉపయోగించాలి. దీనికి ముందుగా విషఁలేని ఎరను 980 గ్రా. నూకలు మరియు 2 గ్రా. నూనెను కలిపి తయారుచేసుకోవాలి. ఈ విధంగా తయారుచేసిన మిశ్రమంను 20 గ్రా. పొట్లాలుగా కట్టి కన్నానికి ఒకటి చొప్పున పెట్టి రెండు రోజులు ఎలుకలను మన్నిక చేసుకోవాలి. మూడవ రోజు జింక్ ఫాస్ఫైడ్ ఎరను 960 గ్రా. నూకలు, 2 గ్రా. నూనె మరియు 2 గ్రా. జింక్ ఫాస్ఫైడ్ మందును కలిపి తయారు చేసుకోవాలి. ఈ ఎరను 10 గ్రా. పొట్లాలుగా కట్టి కన్నంలో ఒకటి చొప్పున వేయాలి.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

2.99235181644
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు