অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నువ్వులు

తెలంగాణాలో నువ్వుల పంట సుమారుగా 25,000 – 30,000 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నది.

ఖరిఫ్ లో వర్షాలు ఆలస్యంగా కురిసినప్పుడు, కేవలం ఒక పంట మాత్రమే సాగు చేసుకొనే పరిస్దితులలో నువ్వులు ఒక మంచి ప్రత్యామాయ పంటగా ఆగష్టు రెండవ పక్షం వరకు విత్తుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. అలాగే ఆలస్యంగా వేసిన ఖరిఫ్ పంటల తర్వాత రెండవ పంటగా జనవరి, ఫెబ్రవరి మాసాల్లో విత్తుకొని అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లభాన్నీ అర్జించేయకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్ లో వర్షాధారంగా పండించిన దాని కంటే వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపిడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి, అధిక దిగుబడులు పొందవచ్చు.

నేలలు

మురుగు నీరు నిలువని తేలికైన నేలలు శేష్ఠం. నీరు నిలిచే ఆమ్ల, క్షార గుణాలు కల నేలలు పనికిరావు.

నేల తయారీ

నేలను 2-4 సార్లు మెత్తగా దున్ని రెండు సార్లు గుంటకు తోలి చదును చేయాలి.

విత్తనం, విత్తే పద్ధతి

ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి మూడింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెం.మీ. (12 అంగుళాలు) మరియు మొక్కల మధ్య 15 సెం.మీ (6 అంగుళాలు) దూరం ఉండేలా విత్తుకోవాలి

విత్తే సమయం

ఖరిఫ్ కు ముందు లేట్ ఖరీఫ్ వేసవి
మే రెండవ పక్షం లోపు ఆగష్టు రెండవ పక్షం జనవరి రెండవ పక్షం నుండి ఫెబ్రవరి మొదటి పక్షం.

రకాలు

రకం విత్తే సమయం పంటకాలం (రొజుల్లో) దిగుబడి (కిలోలు ఎకరాకి) గుణగాణాలు
శ్వేత లేట్ ఖరీఫ్ వేసవి 85-90 250-450 తెల్ల గింజ రకం. వేసవిలో అధిక దిగుబడి నిస్తుంది. కాండం కుళ్ళును తట్టుకుంటుంది.
హిమ (జె.సి యెస్.9426) ఖరీఫ్/వేసవి 80-85 250-280, 400-450 స్వల్పకాలిక తెల్ల గింజ రకము. వెర్రి తెగులును తట్టుకుంటుంది. ఎగుమతి ప్రాధాన్యత కలదు.
రాజేశ్వరి లేట్ ఖరిఫ్ వేసవి 80-90 200-300 తెల్ల గింజ రకం. కాండం కుళ్ళు, బూడిద తెగుళ్ళను తట్టుకుంటుంది.
చందన ఖరీఫ్/వేసవి 80-85 250-480 గోధుమ రంగు విత్తనం అన్ని కాలాలకు అనుకూలం. వెర్రి తెగులును తట్టుకుంటుంది.
ఎలమంచిలి,66 (శారద) ఖరీఫ్/వేసవి 75-80 350 లేత గోధుమ రంగు విత్తనం. అకుమచ్చ తెగులును తట్టుకుంటుంది.
గౌరీ ఖరీఫ్ 90 250-300 ముదురు గోధుమ రంగు విత్తనం. కోడు ఈగను కొంత వరకు తట్టుకుంటుంది.

విత్తనశుద్ది

కిలో విత్తనానికి 3 గ్రా. మంకోజేబ్ తో విత్తనశుద్ధి చేయాలి. పంట తొలిదశలో రసం పిల్చే పురుగుల బారి నుండి కాపాడడానికి ఇమిడాక్లోప్రిడ్ 2.0 మి.లీ. కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి.

ఎరువులు

ఖరీఫ్ లో ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశుపుల ఎరువు, 16 కిలోల నత్రజని, 8 కిలోల పోటాష్ మరియు 8 కిలోల భాస్వరన్నిచ్చే ఎరువులు వేసుకోవాలి. విత్తన 30 రోజుల తర్వాత మరో 18 కిలోల యూరియా అందజేయాలి. వేసవిలో వీటితో పాటు 8 కిలోల నత్రజనిని (15-18 కిలోల యూరియా) అధనంగా పై పాటుగా వేసుకోవాలి.

నీటి యాజమాన్యం (వేసవి)

విత్తిన వెంటనే పలుచటి తడి ఇవ్వాలి. పూత, కాయ అభివృద్ధి మరియు గింజ కట్టు దశల్లో తడులు ఇవ్వాలి. నువ్వులు సాగు చేసే నేలలో తేమ ఎక్కువ ఉన్న పరిస్థితులలో మొక్కల శాఖీయోత్పత్తి మాత్రమే జరిగి ఆకులు, కొమ్మలు ఎక్కువగా వచ్చి పూత మరియు కాయ రాకుండా నిలిచిపోవటం జరుగుతుంది. కావున ఈ పంట సాగు చేసేటప్పుడు ఎక్కువ మోతాదులో నీరు అందజేయకూడదు.

కలుపు నివారణ, అంతరకృషి

పెండిమిథాలిన్ 30% ఎకరాకు లీటరు చొప్పున విత్తన వెంటనే గాని మరుసటి రోజుగాని పిచికారి చేసుకోవాలి. మొక్కలు మొలచిన 15 రోజులకు అధనపు మొక్కలను తీసివేయాలి. విత్తిన 20, 25 రోజులప్పుడు గోర్రుతో అంతరకృషి చేసుకోవాలి.

సస్యరక్షణ

పురుగులు

రసం పీల్చే పురుగులు (తామర పురుగులు, పచ్చదోమ): పిల్ల, తల్లి పురుగులు ఆకులు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చి వేస్తాయి. పురుగులు ఆశించిన ఆకులు ముందుగ పాలిపోయి, తర్వాత దశలో ఎండిపోతాయి. తెల్లనల్లి ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈనెలు పొడువుగా సాగి క్రింది వైపుకు ముడుచుకొనిపొయి, దోనె ఆకారంగా మారి పాలిపోతాయి.

నివారణ : మొనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిధోయేట్ 2 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసికోవాలి. తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

అకుముడత మరియు కాయ తొలుచు పురుగు : తొలిదశలో చిన్న గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు కట్టి లోపలి నుండి ఆకుల్లోని పచ్చని పదార్దాన్ని గోకి తినుట వలన ఆకులు ఎండిపోతాయి. పురుగులు ఎదిగిన కొలది ఎక్కువ ఆకులను కలిపి గూడుగా చేసుకొని ఆకులను తింటాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను, కాయల్లోని లేత గింజలను తింటూ పంటకు నష్టం చేస్తాయి.

నివారణ : మొనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

కోడుఈగ : చిన్న పురుగులు లేత మొగ్గు పూత తినివేయటం వలన మొగ్గల పువ్వుగా, కాయలుగా ఏర్పడక గింజ కట్టక తాలు కాయలు ఏర్పడతాయి. ఆశించన మొగ్గ మరియు పూత వాడి రాలిపోతుంది.

నివారణ : పురుగు ఆశించిన మొగ్గల్ని మరియు తాలు కాయల్ని ఏరి నాశనం చేయాలి. మొగ్గ దశలో మొనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్ 75 యెస్.పి 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

బీహారి గొంగళి పురుగు : తొలిదశలో చిన్న గొంగళి పురుగులు గుంపులుగా ఆకులలోని పత్రహరితాన్ని గోకి తిని జల్లెడాకులుగా చేస్తాయి. ఎదిగిన గొంగళి పురుగులు ఇతర మొక్కల పైకి ప్రాకుతూ మొగ్గలకు, పువ్వులకు మరియు కాయలకు రంధ్రాలను చేస్తూ విత్తనాలను తినివేస్తాయి.

నివారణ : పంటలో గ్రుడ్లు లేక గొంగళి పురుగులను గమనించిన వెంటనే ఆకులతో సహా తీసివేసి నాశనం చేయాలి. క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 75 యస్.పి 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

తెగుళ్ళు

వేరుకుళ్ళు, కండంకుళ్ళు తెగులు : కాండం మీద నల్లని చారలేర్పడుతాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కన్పిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్ళిపోతాయి. ఎండు తెగులు సోకిన కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంధ్ర బిజాల సముదాయం కనిపిస్తుంది. తెగులు కల్గించే శిలీంధ్రం భూమిలోను, విత్తనాలు మరియు పంట అవశేషాల పై జీవిస్తుంది. పంట మార్పిడి తప్పకుండా చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రా. కప్టాన్ లేదా కార్బండాజిమ్ కలిపి విత్తనశుద్ది చేసుకోవాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మాంకోజేబ్ 3 గ్రా. లీటరు నిల్తికి కలిపి పిచికారి చేసుకోవాలి.

అకుమచ్చ (ఆల్టర్నేరియా)తెగులు : మొక్క ఎదిగే దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. ఆకులపై, కాండము మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. ముదురు గోధుమ రంగు కలిగినటువంటి చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఆకు అంత వ్యాపించి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. కిలో విత్తనాలకు 3 గ్రా. కార్బండాజిమ్ కలిపి విత్తనశుద్ది చేసుకోవాలి. పంట దశలో కార్బండాజిమ్ 1 గ్రా. లేదా మాంకోజేబ్ 2.5 గ్రా. లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసుకోవాలి.

వెర్రి తెగులు (ఫిల్లోడి) : ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది. సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటలో ఎక్కువగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలన్ని ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడువు. మొక్కల ఎదుగుదల తగ్గి పైభాగంలో చిన్న చిన్న ఆకులు గుబురుగా ఉండి వెర్రితల మాదిరిగా ఉంటుంది. తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టాలి. పైరుపై మిథైల్ డేమటాన్ 2 మి.లీ. లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి దీపపు పురుగులను అరికట్టాలి.

బూడిద తెగులు : లేత ఆకుల పై తెల్లని బూడిద పొడి మచ్చలు ఏర్పడుతాయి. తెగులు ఆశించిన ఆకులు మాడి రాలి పొతాయి. నీటిలో కరిగే గంధకపు పొడి 3 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.

పంటకోత

ఆకులు పసుపు రంగుకు మారి రాలటం ప్రారంభమైనపుడు, 75% కాయలు లేత పసుపు వర్ణానికి వచ్చినపుడు పైరు కోయాలి. కోసిన పంటను కట్టులుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టేలతో కొట్టి నూర్పడి చేయాలి.

నిల్వ చేయటం

గింజల్లో తేమ 8 శాతానికి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టాలి. గోనె సంచుల్లో నిల్వ చేయాలి. నిల్వ ఉంచిన సంచులపై మలాథియాన్ పొడిని చల్లాలీ. పురుగు పట్టకుండా అపుడప్పుడు ఎండతో ఆరబెట్టాలి.

ఎగుమతి ప్రాధాన్యత

తెల్ల నువ్వుల రకాలకు, పొట్టు తొలగించిన నువ్వుల పప్పుకు ఎగుమతి ప్రాధాన్యత కలదు. ఒకే పరిమాణం గల నాణ్యమైన విత్తనం, పురుగు మందుల అవశేషాలు లేనిదిగా ఉన్న ఎడల ఎగుమతికి అనుకూలం.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate