অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వేసవి నువ్వు సాగు విత్తనోత్పత్తిలో మెళకువలు

మన రాష్ట్రంలో వేసవిలో నువ్వు పంటను కరీంనగర్, జగిత్యాల, అదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలలో ప్రధానంగా సాగు చేస్తున్నారు. పసుపు, మిరప, పత్తి పండించిన నేలలో కూడా పంట తీసిన తరువాత రెండవ పంటగా నువ్వు పంట వేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. డ్రిప్ పద్ధతిలో నువ్వు సాగువలన అధిక దిగుబడులు సాధించవచ్చు. నువ్వు పంట ఉత్తర తెలంగాణ మండల జిల్లాలలో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. అధిక దిగుబడులనిచ్చే శ్వేతాథిల్, హిమ వంటి మేలైన తెల్లగింజ రకాలు రైతులకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస, జగిత్యాలలో అందుబాటులో ఉన్నాయి.

నువ్వు పంట వాణిజ్య పరంగా పండించడంలో ఉత్తర తెలంగాణ మండల రైతులకు ఎంతో ప్రావీణ్యం ఉందని చెప్పాలి. కాని విత్తన పంటను పండించడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే జన్యుస్వచ్ఛత కలిగిన నాణ్యమైన విత్తనాన్ని పొందడానికి వీలుంటుంది.

రైతులు ప్రధానంగా చేయవలసిన ముఖ్య జాగ్రత్తలు:

అనువైన రకాలు

రైతులు అధిక దిగుబడి సాధించాలంటే అనువైన మంచి విత్తన రకాల ఎంపిక చాలా అవసరం. ఇందుకుగాను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస, జగిత్యాల నుండి విడుదల చేసిన తెల్లనువ్వు రకాలు రాజేశ్వరి, శ్వేతాథిల్, హిమ వేసవి కాలంలో విత్తుకోవటానికి అనుకూలంగా ఉంటాయి.

  • రాజేశ్వరి: ఈ రకం 1988లో విడుదలైనది. దిగుబడి - వేసవిలో 800 కి / హె. గింజ రకం - తెల్లగింజ రకం, కాలపరిమితి - వేసవి 85-90 రోజులు, నూనెశాతం - 50%
  • ప్రత్యేక లక్షణాలు: వెర్రి తెగులు, కాండం కుళ్ళు, బూడిద తెగుళ్ళను కొంత వరకు తట్టుకొంటుంది.

  • శ్వేతాథిల్ (జే.సి.యస్ 96): ఈ రకం 1996లో విడుదలైంది. దిగుబడి - వేసవిలో 950-1000 కి/హె. గింజ రకం - తెల్లగింజరకం, కాలపరిమితి - వేసవి 90 రోజులు. నూనెశాతం - 46-48%
  • ప్రత్యేక లక్షణాలు: కాండంకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకొంటుంది. ఎగుమతి ప్రాధాన్యత కలదు.

  • హిమ (జె.సి.యస్.9426): ఈ రకం 2006లో విడుదలైనది. దిగుబడి - వేసవిలో 1000-1050 కి/హె. గింజరకం - తెల్లగింజ రకం, కాయలు పొడుగ్గా ఉంటాయి. కాలపరిమితి - వేసవిలో 80-85 రోజులు, నూనె శాతం - 46-48%.
  • ప్రత్యేక లక్షణాలు: వెర్రితెగులును కొంత వరకు తట్టుకొంటుంది. ఎగుమతి ప్రాధాన్యత కలదు.

నేలలు/నేల తయారీ

చదునుగా ఉన్న భూమిని 2-4 సార్లు పొడి దుక్కి చేసి విత్తటానికి తయారు చేయాలి. పొడిదుక్కిలో విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. నీటి వసతి ఉన్న పొలాలను ఎంచుకోవడం వల్ల పంట వివిధ కీలక దశలలో పంటను బెట్టకు గురికాకుండా చూడవచ్చు.

విత్తన సేకరణ

విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనాస్థానాలు/ తెలంగాణ సీడ్స్/ ఎన్.ఎన్.సి/ నమ్మకమైన విత్తన రైతుల నుండి మాత్రమే సేకరించాలి. విత్తన మొలకశాతం కనీసం 80 శాతానికి పైగా వుండాలి.

విత్తే సమయం

వేసవిలో (జనవరి రెండవపక్షం నుండి నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు) విత్తుకోవచ్చును.

విత్తన మోతాదు

ఎకరాకు 2 కిలోల విత్తనం అవసరం.

విత్తే పద్దతి

ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి మూడింతల పొడి ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెం.మీ. , మొక్కల మధ్య 15 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. రైతుస్థాయిలో పొడిదుక్కిలో విత్తనాన్ని సమంగా చల్లుకుని గుంటుక నడపడం ఆనవాయితీ.

విత్తనశుద్ధి

నేల నుండి సంక్రమించే తెగుళ్ళను నివారించడానికి కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ కలిపి విత్తనశుద్ధి చేయాలి. పంట తొలి దశలో రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడడానికి ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్. ఎస్. కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.

ఎరువులు

రైతులకు అందుబాటులో ఉంటే సేంద్రియ ఎరువుల రూపంలో బాగా మాగిన 4 టన్నుల పశువుల ఎరువు లేదా 1 టన్ను వర్మీకంపోస్టు లేదా 1 టన్ను గొర్రెల ఎరువు లేదా 1 టన్ను కోళ్ళ ఎరువు వేసి కలియదున్నాలి. సేంద్రియ ఎరువులు వాడటం వలన మంచి విత్తన దిగుబడి సాధించే అవకాశం ఉంది.

ప్రధాన పోషకాలైన యూరియా 18 కిలోలు, సింగిల్ సూపర్ పాస్ఫేట్ 50 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ వ పొటాష్ 15 కిలోలను సూటి ఎరువుల రూపంలో వే ఎకరాకు చివరి దుక్కిలో వేసి కలియదున్నాలి. విత్తి 30 రోజుల తర్వాత మరో 18 కిలోల యూరియా పైపాటుగా వేయాలి.

కలుపు నివారణ, అంతరకృషి

పెండిమిథాలిన్ 30% లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటరు చొప్పున ఏదైన ఒక కలుపు మందును విత్తిన వెంటనే గాని మరుసటి రోజునగాని పిచికారీ చేయాలి. విత్తిన 15-20 రోజులలోపు అదనపు మొక్కలను తొలిగించి పలుచన చేయాలి. విత్తిన 25-30 రోజుల తర్వాత ఒకసారి మనుషులతో కలుపుతీసి గొప్పు తవ్వించడం వలన కలుపు మొక్కలు నశించడమేగాక భూమి గుల్లబారీ ఎక్కువ తేమ భూమిలో నిలువ ఉంటుంది. తద్వారా పంట త్వరగా బెట్టకి గురికాకుండా చూడవచ్చును. పంటను వరుసల్లో విత్తినట్లయితే కలుపుతీయడానికి అనుకూలంగా ఉంటుంది.

నీటి యాజమాన్యం

విత్తనాలు మొలకెత్తడానికి నేలలో సరియైన తేమ అవసరం. అలాలేని పక్షంలో విత్తిన వెంటనే అదేరోజు నీటి తడిని ఇవ్వాలి లేని ఎడల మొలకశాతం తగ్గుతుంది.

వర్షాధారంగా విత్తే భూముల్లో వర్షాల వలన నేల గట్టిబారే సమస్య ఉంటుంది. ఈవిధంగా పై పొర గట్టిపడినపుడు మొలక బయటకు రాక వాడిపోతుంది. కావున విత్తిన 4వ రోజు తేలికపాటి నీటితడి ఇస్తే మంచి మొలకశాతం వస్తుంది.

విత్తిన 12-15 రోజులకు నీటితడి తప్పక ఇవ్వాలి. పంట చివరి వరకు 10-12 రోజుల వ్యవధితో నీటితడులు ఇవ్వాలి. విత్తిన 30 రోజులకు మొదటి కలుపు తీసిన తర్వాత నీటితడి పెట్టుకోవాలి. విత్తిన తర్వాత 35-40 రోజుల నుండి 65-70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. ఎందుకంటే ఈ సమయంలో పూత, కాతతో పాటు గింజలు నిండటం జరుగుతుంది.

కల్తీలను నివారించడం: క్రితం వేసిన పంట నువ్వు అయి ఉండరాదు. ఒక వేళ నువ్వు పంట అయితే ఆ పంట తీసిన తరువాత పొలానికి నీరు పెట్టి భూమి మీద రాలిన విత్తనాలను మొలకెత్తేలా చేసి బాగా దున్ని నాశనం చేయాలి. ఇతర రకాల నుండి విత్తన పంట రకాన్ని అన్ని వైపులా 200 మీటర్ల దూరంగా ఉండేలా చూసుకోవాలి.

కత్తీ మొక్కలను పంట పెరిగే దశ (ఆకు ఆకారం, ఎత్తు, ఆకురంగు), పూతదశ (పూతరంగు), కాయ దశలలో (కాయ ఆకారం, కాయ అమరిక, కాయ పరిమాణం, కాయ మీద నూగు) గుర్తించి ఏరివేయాలి. కోత, నూర్పిడి తర్వాత వ్యాధి సోకిన గింజలు, బెరకు గింజలు వేరుచేయాలి. గింజ ఆకారం, పరిమాణం, రంగు లక్షణాలతో బెరకులను తీసివేయాలి.

పంటకోత, నూర్పిడి

నువ్వులలో నాణ్యమైన, అధిక మొలకశాతం కలిగిన విత్తనాన్ని పొందాలంటే పంటను సకాలంలో కోయాలి. విత్తనపంటను సరైన పక్వదశలో కోసినట్లైతే నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు. ముందుగా లేదా ఆలస్యంగా కోయటం, కోసిన తర్వాత ఎక్కువ రోజులు ఎండనివ్వకూడదు. పంటలో 75-80% కాయలు లేతపసుపురంగుకి మారి కింది 1-2 కాయలు కొంచెం పగిలి ఉండాలి. కాయల్లో తేమ 50-60%, విత్తనాలలో తేమ 25-30% ఉండాలి. కోత ఆలస్యమైతే కాయలు పగిలి విత్తనాలు రాలిపోయి దిగుబడి తగ్గుతుంది. మొక్కలను కోసి పైకి కాయలు ఉండేలాగా తిప్పి నిలబెట్టాలి. ఇలా చేయటం వలన పూర్తిగా పక్వం కాని కాయలు కూడా పక్వానికి వస్తాయి. ఈ విధంగా 5-7 రోజులు ఉంచితే తేమ - 15-18% వరకు తగ్గుతుంది. పంటను నూర్చే ఆ సమయంలో విత్తన కవచం దెబ్బతినకూడదు, తద్వారా విత్తన మొలకశాతం అతి త్వరగా కోల్పోయే అవకాశముంది. నూర్చేటపుడు కల్లం దగ్గర వేరేరకం విత్తనాలతో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనం ఎండబెట్టే సమయంలో నేరుగా సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే ఆవేడికి విత్తనపొర దెబ్బతింటుంది.

విత్తన నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తలు

విత్తనం నిల్వచేసే గోదాములు భూమి నుండి కనీసం ఒకమీటరు ఎత్తులో ఉండి కేవలం ఒకే ఒక ద్వారాన్ని కలిగి ఉండాలి. గోదాములలో కొత్త విత్తనాలను నిల్వచేసే ముందు అందులోనున్న పాత విత్తన సంచులను, పురుగు ఆశించిన విత్తనాలను తీసివేసి గోదాములను శుభ్రపరచాలి. గోదాము గోడలు, గచ్చుపై ఎలాంటి పగుళ్ళు ఉండకూడదు. ఇవి క్రిమికీటకాలకు ఆవాసయోగ్యమైన, విత్తన నాణ్యత తగ్గటానికి కారణమవుతాయి. అందువలన విత్తన నిల్వ చేసేముందు ఎలుక కన్నములను, పగుళ్ళను సిమెంట్తో మూసివేసి గోదాము గోడలకు సున్నం వేయాలి. అలాగే వర్షం, అధిక తేమకు అభేధ్యంగా ఉండాలి. నూర్పిడి తరువాత సాధ్యమైనంతవరకు బెరకు, వ్యాధి సోకిన, రంగుమారిన గింజలు, ఇతర పదార్థాలు ఏరివేయాలి. గోదాములలోని ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, వేడిగాలి బయటకు వెళ్ళడానికి గాలి పంకాలను (ఎగ్జాస్ట్ పంకాలు) బిగించి, పక్షులులోనికి రాకుండా వాటిని జాలీలతో కప్పి ఉంచాలి. నిల్వలో పురుగు రాకుండా 3 మి.లీ మలాథియాన్ ఒక లీటరు నీటికి కలిపి గోదాముగోడలు, గచ్చు బాగా తడిచేటట్లు రెండు వారాలకు ఒకసారి పిచికారీ చేయాలి. విత్తనాలను సాధ్యమైనంత వరకు కొత్త గోనెసంచులలోనే కి నిల్వచేయాలి. విత్తనాలను గోదాము లోపల నేలపై కాకుండా చెక్క బల్లల పై 5-7 వరుసలకు విత్తన నిల్వ కాలంలో తరుచుగా విత్తన పరీక్ష చేసుకుంటూ విత్తన నాణ్యత సరిచూసుకోవాలి.

చీడపీడల యాజమాన్యం

  • గడ్డిచిలుక, గొంగళిపురుగులు: విత్తిన 20 రోజుల లోపు గడ్డిచిలుక, గొంగళిపురుగులు మొలకెత్తే మొక్కల మొదళ్ళను/మొగిని కొట్టివేయడం వలన మొక్క ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. గడ్డిచిలుక నివారణకు రక్షకపంటగా జొన్న వేయటం తో పాటు గట్లు/పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. ఉధృతి ఎక్కువైన పరిస్థితులలో 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లేదా 2.0 మి.లీ. ప్రొఫెనోఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గొంగళిపురుగు నివారణకు పెసరను ఎరపంటగా వేయడంతోపాటు ఎక్కువ ఉధృతి గమనించినట్లైతే 1.0 గ్రా. థయోడికార్డ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  • రసంపీల్చేపురుగులు: విత్తిన 20-25 రోజుల దశలో పంటను రసంపీల్చేపురుగులు (తామరపురుగులు, పేనుబంక ఆకునల్లి, ) ఆశిస్తాయి. వీటి వలన ఆకులు ముందుగా ముడుచుకుపోయి, పాలిపోయి తర్వాత దశలో ఎండిపోతాయి. తామరపురుగులు, పేనుబంక నివారణకు లీటరు నీటికి 1.6 మి. లీ. మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మి.లీ. డైమిథోయేట్ లేదా 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్, ఆకు నల్లి నివారణకు 2.0 డైమిథోయేట్ లేదా 5.0 మి.లీ. డైకోఫాల్ కలిపి పిచికారీ చేయాలి.
  • ఆకుగూడుపురుగు, కాయతొలుచు పురుగు: ఆకుగూడు పురుగు ఆకులతో గూడు కట్టి పచ్చని పదార్థాన్ని గీకి తినడం వలన ఆకులు ఎండిపొతాయి, మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పువ్వులను, కాయల్లోని లేతగింజలను తింటాయి. వీటి నివారణకు 2.0 మి.లీ. క్వినాల్ ఫాస్ లేదా 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

తెగుళ్లు

  • బూడిద తెగులు: వాతావరణంలో ఎక్కువ చలి వలన పంటకి బూడిదతెగులు ఎక్కువగా ఆశించే ఆస్కారం ఉంటుంది. ఈ తెగులు వల్ల ఆకులు, కాయలపై బూడిద రంగు పదార్థం ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోతుంది. తద్వారా మొక్కల ఎదుగుదల తగ్గటం మాత్రమే కాకుండా దిగుబడితో పాటుగా గింజనాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ తెగులు నివారణకి లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1.0 గ్రా. కార్బండిజిమ్ లేదా 1.0 గ్రా. మైక్లోబుటానిల్ కలిపి పిచికారీ చేయాలి.
  • అల్టర్నేరియా, సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు: అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, పంట విత్తిన 20-25 రోజుల తర్వాత ఆకుల పై వలయాకారపు గోధుమరంగు మచ్చలు ఏర్పడటం ద్వారా మొదలవుతుంది. ఈ మచ్చలు మొదట కింది ఆకుల పైన ఏర్పడి లేత ఆకులకి వ్యాపించడమే కాకుండా కాండం పైన కూడా కన్పిస్తాయి. సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు వలన ఆకుల అడుగు భాగంలో తుప్పురంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఒక దానితో ఒకటి కలిసిపోయి ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు 1 గ్రా. కార్బండిజిమ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.
  • వెర్రితెగులు: సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటలో, పూత సమయంలో వెర్రితెగులు (ఫిల్లోడి) ఎక్కువగా వస్తుంది. మొక్కల్లోని ఆకులు చిన్నవిగా మారి పూత ఏర్పడదు. ఈతెగులు మైకోప్లాస్మా ద్వారా సంభవించి పచ్చదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. అందువల్ల వెర్రితెగులు సోకిన మొక్కలని పీకి కాల్చివేయాలి., పచ్చదోమను అరికట్టడానికి 1.5 మి.లీ. మిథైల్ డెమెటాన్ లేదా 2.0 మి.లీ. డైమిథోయేట్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రాజేశ్వరి, హిమ రకాలు ఈ తెగులును కొంతవరకు తట్టుకుంటాయి.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate