పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సీతాఫలంలో ప్రవర్ధనం

సీతాఫలం ప్రవర్ధనం చేసే విధానం, సమయం, మొక్కలు నాటే పద్దతిని గురించి తెలుసుకోవడం ముఖ్యం.

సీతాఫలం అధిక పోషక విలువలు కలిగినటువంటి, తక్కువ వర్షపాతం గల మెట్ట భూముల్లో సాగుచేసే పంట. ఉత్పత్తి పరంగా చూసుకుంటే మహారాష్ట్ర (59.33 టన్నులు) మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రం 9.49 టన్నుల ఉత్పత్తితో 6వ స్థానంలో ఉంది. తెలంగాణలో ఈ సీతాఫలం సాగుకు అదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలు అనుకూలం. ఈ పండ్లలో అధికంగా కార్బోహైడ్రేట్స్, విటమిన్-సి, విటమిన్-ఎ ఉంటాయి. ఇంకా ఈ పండు అధిక పొటాషియం, మెగ్నిషియంలను కలిగి ఉండి, గుండె సంబంధి వ్యాధులనుండి కాపాడుతాయి. ఈ పండ్లని తీసుకోవడం ద్వారా కంటికి, అజీర్తి సమస్యలకు, రక్తహీనత ఉన్నవారికి, బరువు పెరగాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటి ఆకులు, గింజలలో అనోసిన్ అనే ఆల్కలాయిడ్ ఉండడం వలన చేదు గుణం కలిగి ఉంటుంది. గింజల నుండి 27-30 శాతం దాకా నూనె లభిస్తుంది. ఈ నూనెను సబ్బు, పెయింటింగ్ పరిశ్రమల్లో వాడతారు.

ప్రవర్ధనం

ఈ సీతాఫలం సంతతికి చెందిన పండ్లు చాలా రకాలు ఉంటాయి. వాటిలో అనోనా స్వామోసా (సీతాఫలం) ఎక్కువ ప్రసిద్ది చెందినది. సీతాఫలం పంట అధిక నీటి ఎద్దడిని కూడా తట్టుకుని లాభాలను ఇస్తుంది. దీనికి ఎక్కువగా కోత పరిజ్ఞానం కానీ, కోత అనంతరం పరిజ్ఞానం అవసరం లేదు. వీటిని పశువులు తినవు కాబట్టి, వీటికి రైతులు నీటి సాగు ఎక్కువగా లేని మెట్ట ప్రాంతాలలో వేసుకుంటే నేల సారవంతం పెరిగి, లాభాలను పొందవచ్చు. రైతులు నీటి సదుపాయం ఉన్న ప్రాంతాలలో అయితే అంతర పంటలుగా కూరగాయలను సాగుచేసుకోవడం వల్ల అదనపు ఆదాయాన్ని గడించవచ్చు.

ఇటీవల కాలంలో రైతులు సీతాఫలాన్ని సాగుచేయడానికి మక్కువ చూపుతున్నారు. కావున రైతులు వీటి ప్రవర్ధనం చేసే విధానం, సమయం, మొక్కలు నాటే పద్దతిని గురించి తెలుసుకోవడం ముఖ్యం. దీనివల్ల రైతులకు సాగుచేయడం, సులభతరం అవుతుంది. సీతాఫలాన్ని శాఖీయ పద్దతి ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఈ శాఖీయ పద్ధతిలో ముఖ్యంగా వినీర్ గ్రాఫ్టింగ్ పద్దతిని వినియోగించి అంటు మొక్కలను తయారు చేస్తారు. సీతాఫలాన్ని విత్తనం ద్వారా నేరుగా ప్రవర్ధనం చేయవచ్చు. కానీ, శాఖీయ పద్దతిని అవలంబించటం ద్వారా తల్లి మొక్కలను పోలిన మొక్కలను పొందవచ్చు. సీతాఫలం మనకు అక్టోబరు - నవంబరు, మాసంలో లభిస్తుంది. ఈ కాలంలో విత్తనాలు పండ్ల నుండి సేకరించి, ఫిబ్రవరి మాసం వరకు విత్తడానికి భద్రపరచుకోవాలి. ఈ గింజలను ఏ రకం నుండి అయినా సేకరించుకోవచ్చు.

సీతాఫలాన్ని వినీర్ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా అంటుకట్టుట

 1. వేరుమూలాన్ని పెంచడం
 2. సయాను పుల్ల ఎంపిక
 3. అంటు కట్టే విధానం

వేరు మూలాన్ని పెంచడం

 • సీతాఫలం నుండి సేకరించిన గింజలను ఫిబ్రవరి మాసంలో విత్తుకోవాలి.
 • గింజలను విత్తడానికి ముందుగా రెండు రోజులు నీటిలో నానబెట్టాలి. ఇలా చయడం వల్ల త్వరగా మొలకెత్తడమే కాక, మొలక శాతం కూడా పెరుగుతుంది.
 • గింజలను విత్తడానికి 1.2 మీ. వెడల్పు, 5 మీ. పొడవు గల మడులను తయారు చేసుకోవాలి. ఒక్కొక్క మడికి 10 గంపల పశువుల ఎరువు, 1 కిలో సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రా, ఫాలిడాల్ పొడిని వేసి నేలలో బాగా కలుపుకోవాలి.
 • ఈ మడులలో 40 సెం.మీ. దూరం రెండు వరుసల మధ్య ఉండేలా చూసుకుని గింజలను విత్తుకోవాలి. విత్తిన వెంటనే మట్టిని కప్పి రోస్ కాన్తో నీరు పోయాలి.
 • గింజలు మొలకెత్తే వరకు నీటి తడులు ఇవ్వాలి. 21 రోజులలో మొలకలు వస్తాయి.
 • ఈ మొలకలను పాలిథీన్ సంచులలో జూన్-జూలై మాసాల్లో వేరు దెబ్బతినకుండా నాటుకోవాలి.
 • 300 గేజు మందం, 5X7 అంగుళాల సైజుగల పాలిథీన్ సంచులు, మొలకలు నాటుకోవడానికి అనుకూలం.
 • ఈ సంచులను పాటింగ్ విక్టర్ (మట్టి మిశ్రమం)తో నింపుకోవాలి. మట్టి మిశ్రమం - 5 భాగాలున్న ఎర్రమన్ను, 3 భాగాలు మాగిన పశువుల ఎరువు, ఒక భాగం ఇసుక.
 • ఒక కిలో మిశ్రమానికి 100 గ్రా. వేపపిండిని కూడా కలపడం ద్వారా చెదపురుగును నివారించవచ్చు. సంచుల అడుగు భాగాన మురుగు నీరు పోయేందుకు వీలుగా రెండు రంధ్రాలు చేసుకుని మొక్కలు నాటి నీటిలో ఉంచుకోవాలి.
 • ఈ విధంగా మొలకలను జూన్-జూలై మాసంలో నాటుకుని, ఫిబ్రవరి మాసంలో అంటు కట్టుకోవాలి.

సయాను పుల్ల ఎంపిక

 • సయాను పుల్లను అంటుకట్టే ముందు కావాల్సిన రకం నుండి నేరుగా ఎంపిక చేసుకోవచ్చు. (ఆకులు వాటంతట అవే రాలిపోతాయి. కావున ప్రిక్యూరింగ్ అవసరం ఉండదు)
 • 0.5-0.75 సెం.మీ. మందం కలిగి, బాగా కళ్ళు ఉబ్బి ఉన్న సయాను పుల్లను ఎన్నుకుని 15-20 సెం.మీ. పొడవు ఉండేలా కత్తిరించుకోవాలి.
 • 6 నెలల సయాను పుల్ల, సంవత్సరం వయస్సు గల వేరు మూలం అంటుకట్టడానికి అనుకూలం.

అంటుకట్టే విధానం

 • వినీర్ పద్ధతి ద్వారా అంటు కట్టడం వల్ల అధిక ఫలసాయం పొందవచ్చు. ఫిబ్రవరి రెండోవారం నుండి మార్చి రెండో వారం వరకు అంటు కట్టుకోవడానికి అనుకూలం.
 • వేరుమూలం మీద ఉన్న ఆకులను తుంచివేసి, 5-10 సెం.మీ. ఎత్తులో పై బెరడు కొంత కణజాలంతో కలిసి వచ్చేలా 0.2 సెం.మీ. పొడవు కత్తిరించుకోవాలి. ఇంకోవైపు వ్యతిరేక దిశలో మొదటి కత్తిరింపుతో కలిసేలా చిన్నకత్తిరింపు (0.5 సెం.మీ.) ఇవ్వాలి.
 • అదే విధంగా సయాను పుల్ల మీద ఒకవైపు 3-5 సెం.మీ. పొడవు 0.2 సెం.మీ. తోలుతో కత్తిరించుకోవాలి. రెండవ వైపు సయాను పుల్ల మొదలులో చిన్న కత్తిరింపు ఇవ్వడం వల్ల సయాను పుల్ల మొదలు సన్నగా తయారై (వెడ్జ్ షేప్), అప్పటికి సిద్ధం చేసిన వేరు మూలంలో అమర్చడానికి అనువుగా ఉంటుంది.
 • ఈ విధంగా తయారు చేసిన సయాను పుల్లను వేరుమూలం కత్తిరింపులో ఒదిగేటట్లు చేయాలి. 30 సెం.మీ. పొడవు, 2 సెం.మీ. వెడల్పు, 150 గేజు మందంగల రిబ్బనుతో రెండింటిని కలిపి గట్టిగా చుట్టి కట్టాలి.
 • అంటు కట్టిన వెంటనే మొక్కలకు నీరు పెట్టాలి. జాయింట్ తడవకుండా జాగ్రత్త పడాలి.
 • ఈ విధంగా అంటుకట్టిన సయాను పుల్ల 15 రోజులలో చిగురిస్తూ ఒక కొమ్మ వచ్చాక వేరు మూలాన్ని జాయింట్ నుండి 5 సెం.మీ. పైభాగంలో కత్తిరించివేయాలి. ఈ విధంగా తయారు చేసిన అంటు మొక్కలు జూలైలో పొలంలో నాటుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.
 • అంటుకట్టిన 50-60 రోజులలో పాలిథీన్ తో రిబ్బను తీసివేయాలి. నర్సరీలో రసాయనిక ఎరువులు వాడరాదు.

మొక్కలు నాటడం

 • ముందుగా తయారు చేసుకున్న పొలంలో 60x60X60 సెం.మీ. గుంతలను 5x5 మీ. దూరంలో (ఎకరానికి 160 గుంతలు) తీసుకోవాలి. ప్రతీ గుంతకు 20 కిలోల పశువుల ఎరువు, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్; 100 గ్రా. ఫాలిడాల్ పొడి, పైమట్టితో బాగా కలిపి గుంతలను నింపుకోవాలి.
 • వర్షాకాలం ప్రారంభంలో వినీర్ అంట్లను నాటుకోవాలి. అంటు భాగం 10-20 సెం.మీ. ఎత్తులో ఉండేలా చూసుకొని, గుంతకు మధ్య భాగంలో నాటుకోవాలి.
 • అంటుకట్టిన మొక్కలు ఫల పరిశోధనా స్థానం (సంగారెడ్డి)లో రైతులకు జూలై నుండి అందుబాటులో ఉంటాయి. ఒక్కో మొక్క వేల రూ. 30/-.
2.97058823529
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు