పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

అలసంద

అలసందలు మన రాష్ట్రంలో వర్షాధారంగా వర్షాలు అలస్యమైనప్పుడు, పంటల సరళిలో మిగులు తేమను ఉపయోగించుకొని కూడా పండిస్తుంటారు.

అలసందలు మన రాష్ట్రంలో వర్షాధారంగా వర్షాలు అలస్యమైనప్పుడు, పంటల సరళిలో మిగులు తేమను ఉపయోగించుకొని కూడా పండిస్తుంటారు. అలసందలు ఎక్కువగా వేడిమితో కూడిన వాతావరణంలో 20-30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు కల్గి వుందినచో బాగా వచ్చును. అధిక వర్షపాతాన్ని మరియు అధిక చలిని తట్టుకోదు.

నేలలు

అలసనందలు వివిధ నెలలలో పండే గుణమున్నపకి, తేమను పట్టి ఉంచే గుణము కలిగి మురుగు నీరు నిల్వని మధ్యస్థ, చల్కా నేలలు, ఎర్ర భూములు మరియు నల్లరేగడి భూములు అనుకూలం.

పంటకాలం / అనువైన సమయం

అలసందలు వర్షధారంగా ఖరీఫ్ లో, మిగులు తేమ ఆధారంగా లేట్ ఖరిఫ్ లో, నీటి పారుదల క్రింద రబీలో మరియు వేసవిలో కూడా పండించవచ్చును. ఖరీఫ్ లో జూలై; ఖరీఫ్ లో ఆలస్యంగా విత్తినప్పుడు సెప్టెంబర్; రబీలో నీటిపారుదల క్రింద అక్టోబర్-నవంబర్ విత్తుకోవచ్చు. వేసవిలో ఫెబ్రవరి లో విత్తుకోవచ్చు.

విత్తన మోతాదు / ఎకరానికి

విత్తనం లేదా పచ్చికాయ కోత కోసం విత్తినప్పుడు 8-10 కిలోలు, పశుగ్రాసం లేదా పచ్చిరొట్టకై విత్తినప్పుడు 12-14 కిలోల విత్తనం వాడాలి.

రకాలు

రకం ఋతువు / పంటకాలం (రోజుల్లో) దిగుబడి (క్వి/ఎ) లక్షణాలు
జి.సి – 3 90-95 4-5 స్వల్పకాలిక కలిగిన రకం, గుబురు రకం, పల్లాకు తెగులును తట్టుకోనును.
వి – 240 90-100 5-6 ముఖ్యమైన తెగుళ్ళను తట్టుకోనును. పశుగ్రాసానికి అనుకూలం, ముదురు ఎరుపు రంగు కలిగిన గింజలు.
సి. – 152 105-110 3-4 అంతరపంటగా మరియు పండ్ల తోటలకి అనువైనది. లావైన తెలుపు రంగు గింజలను కలిగి ఉంటుంది.
కో – 4 90-100 3-4 నల్లని గింజలు కలిగి, విత్తనానికి, పశుగ్రాసానికి అనుకూలమైన రకం.
 • ఆయా ప్రాంతాలలో బాగా దిగుబదినిచ్చే లోకల్ రకాలను ఎన్నుకొని కూడా విత్తుకోవచ్చును.

విత్తనశుద్ధి

ప్రతి కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్ లేదా కాప్టాన్ లేదా 2.0 గ్రా.ల. మాంకోజెబ్ తో విత్తనశుద్ధి చేసుకొని విత్తుకోనవలేయును. తద్వారా భూమి మరియు విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళ బారి నుండి తొలి దశలో పంటను కాపాడుకోవచ్చును. ఆఖరుగా విత్తేముందు విత్తనానికి రైజోబియం కల్చర్ పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఎండు తెగులు సమస్యాత్మక ప్రాంతాలలో ట్రైకోడెర్మ విరిడి 8 గ్రా. ప్రతి కిలో విత్తనానికి పట్టించి విత్తవలయును.

విత్తే దూరం

గుబురు రకాలు సాలుకు సాలుకు మధ్య 30 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. బాగా కొమ్మలు వేసేవి మరియు తీగ రకాలు – సాళ్ళ మధ్య 45-60 సెం.మీ. మొక్కల మధ్య 15 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి.

మొక్కల సాంద్రత/ఎకరానికి

గుబురు రకాలు : 1,33,333; తీగ రకాలు: 44,444 – 59,259 విత్తు పధ్ధతి : విత్తే ముందు నేలలో తేమను బట్టి అవసరం మేరకు తడిపి నాగలి లేదా కల్టివేటర్ తో ఒక్కసారి ఆ తర్వాత గొర్రు తొలి దుక్కి తయారుచేసుకొని తగు పదనులో విత్తాలి. నాగలి, కల్టివేటర్, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ లేదా గోర్రుతో ఎదబెట్టి సాళ్ళ పద్ధతిలో విత్తుకోవాలి.

అంతర పంటలు / పంటలు సరళి

వేరుశనగ + అలసందలు

మినుము/పెసర + అలసందలు

నువ్వులు + అలసందలు

రబీ కంది + అలసందలు

రబీ వేరుశనగ + అలసందలు

వేరుశనగ - అలసందలు

మినుము / పెసర - అలసందలు

మొక్కజొన్న - అలసందలు

సమగ్ర ఎరువుల యాజమాన్యం

సేంద్రియ ఎరువులు

చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మోళ్ళను రోటావేటర్ తో భూమిలో కలియదున్నాలి.

జీవన ఎరువులు

రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించి ఉపయోగించవలెను 100 మి.లీ. నీటిలో 10 గ్రా. ల. పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడెర్ ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలెను. చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రా. రైజోబియం కల్చర్ పొడిని కలిపి బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించవలెను. ఈ పక్రియను పాలిథీన్ సంచులను ఉపయోగించి చేసుకోవలెను. రైజోబియం పట్టించిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

ఎకరాకు 2 కిలోల ఫాస్పోబాక్టీరియాను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కిలో గాని, విత్తనం విత్తేటప్పుడు గాని సాళ్ళల్లో పడేటట్లు వేసుకొనవలెను. ఈ ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరమును లభ్యమగు రూపంలోకి మార్చి మొక్కలకు అందుబాటులోకి తెచ్చును.

రసాయనిక ఎరువులు

8 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం ప్రతి ఎకరానికి అందించాలి అనగా 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కిలో వేయాలి.రసాయనిక ఎరువులు వేసేటప్పుడు భూసార పరీక్షను అనుసరించి సిఫారసు మేరకు వాడాలి.

సమగ్ర కలుపు యాజమాన్యం

పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్లు నీటిలో కలిపి విత్తన వెంటనే గాని లేదా మరుసటి రోజు గాని పిచికారి చేయాలి.

అంతరకృషి

విత్తన 25-30 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. అవసరాన్ని బట్టి సాళ్ళ మధ్య నాగలి లేదా దంతే తొలి కలుపు నివారించాలి.మొక్కల మధ్య కలుపును మనుషుల ద్వారా తీయించి ఆ తర్వాత బోదె ఎక్కించినచో ఉపయోగకరంగా వుండును.

నీటి యాజమాన్యం

ఖరిఫ్ లో సాధారణంగా వర్షాధారంగా పండిస్తారు. ఆ తర్వాత మిగులు తేమ ఆధారంగా పండిస్తారు. రబీలో నీటి పారుదల క్రింద కీలక దశలో 3-4 తడులిచ్చి పండిస్తారు. సాధారణంగా బెట్టను బాగా తట్టుకొనే పంట అయినప్పటికీ దాదాపుగా 250-300 మి.మీ. నీరు అవసరముంటుంది. కీలక దశలైన మొగ్గ, పిందే, కాయ తయారుగు దశలలో నీరు అందించాలి. తప్పనిసరి పరిస్థితులలో బెట్ట పరిస్థితులు నెలకొన్నచో 2 శాతం యూరియా లేదా 2% డి.ఎ.పి. ద్రావణం పిచికారి చేసినచో ఉపయోగకరంగా ఉండును. నీటి ఆదా కోసం స్ప్రింక్లర్ లేదా వర్షపుగన్ ద్వారా కూడా అందించవచ్చును. నిండు పూత సమయంలో తప్ప మిగతా సమయంలో పై పద్ధతుల ద్వారా నీరు అందించవచ్చు.

సమగ్ర సస్యరక్షణ

అలసందలో ఆకుమచ్చ తెగులు, ఎండు తెగులు, బూడిద తెగులు మరియు పల్లాకు తెగులు ఆశించును. పురుగులలో గొంగళి పురుగు, పచ్చ దోమ, తెల్లదోమ మరియు కాయ తొలుచు పురుగు ఆశించి నష్టపరుస్తుంది. వీటి నివారణ చర్యలు పెసర, మినుములో సూచించిన విధంగా పాటించవలెను.

పంట కోత

అలసందలు పచ్చి కాయలకు మరియు విత్తనం కోసం పండిస్తుంటారు. పచ్చి కాయల కోసం పండించ నప్పుడు 45 రోజుల నుండి కాయలు కోతకు సిద్ధంగా వుంటాయి. పచ్చి కాయల నార ఎక్కువగా తయారవకముందే కోసినచో నాణ్యత కలిగి కూరగాయాలుగా ఎక్కువ గిరాకి వుండును. ప్రతి రెండు మూడు రోజులకు కోయవచ్చును. సుమారు 30-40 క్వింటాళ్ళు ప్రతి ఎకరానికి పచ్చి కాయల దిగుబడినిచ్చును.

విత్తనంగా పండిచినప్పుడు రకం యొక్క కాలాన్ని బట్టి 80 -100 రోజులకు కాయలు తయారగును. ఆకుపచ్చని రంగు నుండి పసుపు రంగుకు క్రమేపి ఎండు గడ్డి రంగుకు మారి ఎండిపోవును. ఆకులు కూడా క్రమేపి హరితాన్ని కోలోయి క్రింద ఆకులు రాలిపోవును. 80-90% వరకు కాయలు తయారైన తర్వాత కొడవలితో మొక్క మొదలు వరకు కోయవలెను. పొడి వాతావరణంలో పంటను కోసినచో పంట నాణ్యత బాగా వుండును.

కోతానంతర జాగ్రత్తలు

కోసిన పంటను 3-4 రోజుల వరకు పంట చేనులో గాని లేదా కల్లెంపై ఎండనిచ్చి ఆ తర్వాత కర్రలతో కొట్టిగాని, పశువులతో తొక్కించి లేదా ట్రాక్టర్ తో తొక్కించి లేదా ఆల్ క్రాప్ త్రేషర్ ను ఉపయోగించి నూర్పిడి చేయాలి.

నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరచి, 2-3 రోజులు బాగా ఎండనిచ్చి గింజలలో తేమ 9 శాతం కన్నా మించకుండా చూసుకొని నిల్వచేయవలెను.

బాగా ఎండిన గింజలు (8-9 తేమ శాతం) బిన్స్ లో గాని, గొనె సంచులో గాని, పాలిథీన్ సంచులలో గాని నిల్వ చేయవచ్చును. నిల్వ చేసే ముందు సాధనాలను(గోనె సంచులు) శుభ్రపర్చుకోవాలి. గోనె సంచులను 10 శాతం వేప ద్రావణం పిచికారి చేసి వాడుకోవాలి లేదా 5% వేప కషాయంలో ముంచి ఆరబెట్టిన గోనె సంచులను వాడాలి లేదా సంచులపై మలాధియాన్ 10 మి.లీ. లేదా డెల్టామెత్రిన్ 2 మి.లీ. లేదా డైక్లోరోవాస్ (0.05%) ఒక మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి తరువాత ఆరబెట్టి నిల్వ ఉంచుకోవాలి.

బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన క్రింద 20 మి.లీ. మలాధియాన్ ద్రావణం లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలం నిల్వ చేసినప్పుడు ఎప్పటికప్పుడు గమనించి అవసరం మేరకు అప్పుడప్పుడు ఎండబెట్టి నిల్వ చేయాలి.

గృహ అవసరాలకై కొద్ది మొత్తంలో నిల్వ చేసేటప్పుడు వంటనూనెలు లేదా ఆముదం నూనె లేదా వేప నూనె ప్రతి కిలో గింజలకు 5.0 మి.లీ. చొప్పున కలిపి నిల్వ చేసనచో నిల్వలో పురుగుల వలన నష్టం జరుగకుండా నివారించవచ్చును. గ్రుడ్లు పోదగకుండా నివారించబడి, లార్వా గింజలలోకి చొరబడక ముందే చనిపోవడానికి దోహదపడును.

ముఖ్య సూచనలు

 1. ఆయా ప్రాంతానికి అనువైన అధిక దిగుబడినిచ్చు రకాలను ఎన్నుకొని సాగుచేయాలి.
 2. వర్షాధారంగా/మిగులు తేమ ఆధారంగా పండించినప్పుడు సకాలంలో అంతరకృషి చేసి బోదె ఎక్కించి వర్షపు నీరు యింకింపచేసినచో అధిక దిగబడికి దోహదపడును.
 3. నీటి పారుదల క్రింద, స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక రకాలను, మిగులు తేమ ఆధారంగా సాగుచేసేటప్పుడు స్వల్పకాలిక గుబురు రకాలను సగుచేయాలి.
 4. సాళ పధ్ధతి అవలంభించవలెను.
 5. విధిగా విత్తనశుద్ది చేసి విత్తుకోనవలెను.
 6. విత్తిన 25-30 రోజుల వరకు కలుపు లేకుండా జగ్రత్తపడవలెను.
 7. అవసరం మేరకు కీలక దశల్లో నీటి తడులు ఇవ్వవలెను. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు.
 8. ఎట్టి పరిస్దితులలో పొలంలో నీరు నిల్వకుండా జాగ్రత్తపడాలి.
 9. బెట్ట పరిస్థితులలో కీలక దశలో 2% యూరియా, 2% డి.ఎ.పి. ద్రావణం పిచికారి చేసినచో దిగుబడి పెరుగును.
 10. రసం పీల్చే పురుగులైన తామర పురుగు, తెల్లదోమ మరియు పెనుబంకలను సకాలంలో అదుపు చేయాలి.
 11. సకాలంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి శనగపచ్చ పురుగును మరియు మారుకా మచ్చల పురుగును నివారించావలేను.
 12. విత్తడం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంభించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగును.

విత్తనోత్పత్తి

ఉలవలలో విత్తనోత్పత్తికి సూచించిన 7 మరియు 13 అంశాలు తప్ప అన్ని పాటించాలి. వాటితో పాటు ఈ క్రింది వాటిని ఆచరించాలి.

 1. ఎకరానికి ఆరు కిలోల విత్తనం వాడి విధిగా విత్తనశుద్ధి చేసి వరుసలలో విత్తవలెను.
 2. బెరుకులు మూల విత్తనానికి 0.10 శాతం మరియు ధృవీకరణ విత్తనానికి 0.20 శాతం మించకుండా చూడాలి.
 3. పరిపక్వ దశకు చేరినప్పుడే (కాయలు పూర్తిగా నలుపు రంగుకు మారతాయి) పైరును కోసి, ప్రత్యేకముగా నూర్చి, సూచించిన తేమ శాతం వచ్చే వరకు ఎండ బెట్టాలి. కోత సమయంలో గాని, కల్లెంలో గాని తగు వేర్పాటు దూరాన్ని పాటించి కల్తిలకు తావు లేకుండా చూడాలి.

విత్తన నాణ్యతా ప్రమాణాలు

క్రమ సంఖ్య ప్రమాణాలు మూల విత్తనం సర్టిఫైడ్ విత్తనం
1. విత్తన భౌతిక స్వచ్ఛత 98% 98%
2. భౌతిక ఇతర పదార్థాలు (అత్యధికంగా) 2% 2%
3. ఇతర పంటల విత్తనాలు (అత్యధికంగా) - 10(కిలో విత్తనానికి)
4. కలుపు మొక్కల విత్తనాలు (అత్యధికంగా) - 10(కిలో విత్తనానికి)
5. ఇతర గుర్తించదగిన రకాలు (అత్యధికంగా) 5(కిలో విత్తనానికి) 10(కిలో విత్తనానికి)
6. మొలక శాతం 75 75
7. తేమ శాతం 9 9

ఆధారం: వ్యవసాయ పంచాంగం

3.00421940928
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు