పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సంకర జాతి గడ్డి జొన్న

సంకర జాతి గడ్డి జొన్న సాగు గురించి తెలుసుకుందాం.

గ్రామాలలో పశువులకు తిరగడానికి, పచ్చిమేతకు భూములు కరువయిన రోజులు, మరొదిక్కు కానరాని పశుసంతతి. ఉత్తర భారతంలోని చాలా రాష్ట్రాల్లో ఉన్న పశుసంతతికి కావాల్సిన పచ్చిమేకు ఈనాడు ప్రధానమైనది సంకర జాతి గడ్డి జొన్న సాగు. గత 35 సంవత్సరాలుగా రాష్ట్రంలోని ఆర్మూర్ చుట్టూరా ఉన్న 14 మండలాల్లో ఈ పంట 60 వేల ఎకరాల్లో సాగు అవుతోంది. జగిత్యాల, మెట్పల్లి, నిర్మల్ ప్రాంతాలలో పదివేల ఎకరాలు కలుపుకొని మొత్తం సుమారు 70 వేల ఎకరాల్లో సాగుస్తున్నారు. పండిన విత్తనాలను రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్, బీహార్, ఢిల్లీ ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారు. ప్రత్యేకించి ఆర్మూర్ దగ్గరలోని అంకాపూర్లో 30 వరకు విత్తనశుద్ధి (సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు) కేంద్రాలు ఉన్నాయంటే ఈ ప్రాంతం ఈ పంట సాగుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో తెలుస్తుంది. ఇక్కడి ఎర్ర చల్కా నేలలు, అనుకూలమైన వాతావరణం, బోరు బావుల కింద నీటి వసతి బాగా ఉండటం వలన వివిధ కంపెనీల వారు విత్తనోత్పత్తికి సుముఖంగా ఉండడం గమనించవలసిన అంశం, పూర్తిగా ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంలోనే గడ్డిజొన్న పంట సాగు వ్యవస్థ ఇమిడి ఉంది. మూల విత్తనాలను అందించే వారు ఎక్కడో ఉన్న గ్రామాలలో కంపెనీల వారికి రైతులకు మధ్య ఆర్గనైజర్ల ద్వారా లావాదేవీలు నడుస్తాయి.

రకాలు

తెల్లవి, ఎర్రని రెండు రకాలు.

విత్తే సమయం

వానాకాలంలో సోయాపంట కోతల తరువాత సెప్టెంబరు రెండవ వారం మొదలు కొని విత్తుతారు. దీనినే మాఘీ సీజను అంటారు.

దుక్కి ఎరువుల వాడకం

రెండు సార్లు మెత్తటి దుక్కి వచ్చేంత వరకు ట్రాక్టర్తో దుక్కి చేస్తారు. దుక్కిలో 26 కిలోల వరకు భాస్వరం, 14 కిలోల వరకు పొటాష్ 16 కిలోల వరకు నత్రజని వచ్చేటట్లు ఎరువులను వేస్తారు. సాధ్యమైనంత వరకు 12-12-16 అనే ఎరువును 75 కిలోలు వేయడం అలవాటు. పైపాటుగా విత్తిన 25 రోజులకు 50 కిలోల యూరియా వేసి నీటి తడులనిస్తారు

విత్తన మోతాదు

ఎకరంలో 750 గ్రా. వరకు మగ విత్తనాలు, 4 కిలోల ఆడవిత్తనాన్ని ఉపయోగిస్తారు.

విత్తే విధానం

ఒకసాలు మగ వరుస ఉంటే 10 వరుసలు ఆడ విత్తనం వరుసలు లేదా రెండు వరుసలు మగ విత్తితే 20 వరుసలు ఆడ విత్తనాన్ని నాగటి సాలులో కూలీలచే విత్తడం ఆనవాయితీ,

సాలుకు సాలుకు మధ్య 40 సెం.మీ. సాలులో మొక్కల మధ్య 10 నుండి 15 సెం.మీ. ఎడం ఉండేటట్లు విత్తుతారు.

విత్తనశుద్ధి

కం పెనీల వారు ముందుగానే థైరమ్తో కిలో విత్తనానికి 3 గ్రా. చొప్పున పట్టించి విత్తనశుద్ధి చేస్తారు.

నీటి తడులు

సుమారు వారం రోజుల కొకసారి నీటి తడులను ఇస్తారు. సాలులో చిన్నపాటి పాదులు ఉంటాయి. గనక తేలికగా నీరు సమతలంగా మొక్కలకు అందుతుంది. సుమారు 20 వేల ఎకరాల్లో బిందు స్వేదం ద్వారా నీరందించడం హర్షించదగ్గ విషయం.

కలుపు నివారణ

వాస్తవంగా కలుపు సమస్య చాలా తక్కువ. ఆడవారు పొద్దస్తమానం భూమిని శుభ్రంగా ఉంచడానికి పడే శ్రమ అబ్బుర పరిచే విషయం అయినా విత్తిన మూడు రోజుల లోపల అట్రజిన్ 700 గ్రా. ఎకరంలో 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేస్తారు.

సస్యరక్షణ

కాండం తొలిచే పురుగు, కంకి నల్లి ఆశిస్తుంటాయి.

తొలి దశలో మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిఫైరిఫాస్లలో ఏదైనా ఒకటి 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పంట పెరిగిన తరువాత కంకినల్లి ఆశించి నష్టం జరుగుతోంది. దీని నివారణకు కేవలం ఫోరేట్ 10 జి, గుళికలు 3 కిలోలు ఉదయం పూట చల్లడం వలన ఈ పురుగు చనిపోయి ముద్దలు ముద్దలుగా పడిపోతుంది. పంట బాగా ఎత్తు పెరిగి ఉండటం వలన పిచికారీ చేయడం సాధ్యం కాదు,

బంకకారు తెగులు: ముఖ్యంగా ఈ తెగులు, వాతావరణంలో తీవ్రమార్పులు రావడం వలన పుష్పించే దశలో ఆకాశం మేఘావృతం కావడం, చల్లని తేమతో కూడిన వాతావరణం అనుకూలం అని చెప్పవచ్చు. తెగులు సోకిన కంకుల నుండి తెల్లని లేదా గులాబీ రంగుతో కూడిన తియ్యటి జిగురు వంటి ద్రవం కారుతుంది. దానిపై కొన్ని శిలీంధ్రాలు పెరగటం వలన కంకులు అనగా గింజలు నల్లగా మారతాయి. ఈ తెగులు వలన దిగుబడులు తగ్గడమే కాక విత్తన నాణ్యత లోపిస్తుంది.

నివారణ: విధిగా ముందుగానే విత్తనశుద్ధి చేయాలి. పంట పై మాంకోజెబ్ + కార్బండిజమ్ మందులతో సస్యరక్షణ చేయాలి. పూత దశలో వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.

కోతలు, దిగుబడులు

యంత్రాల సహాయంతో, కూలీలచే కోత, నూర్పిడి చేస్తారు. దిగుబడి విషయంలో ఎర్ర జొన్న రకం కంటే తెల్లజొన్న దిగుబడి ఎక్కువగా ఉంటుంది. మగ వరుసలను ముందుగానే కోసి పశువులకు వేయడం గానీ మార్కెట్లో అమ్మివేయడం చేస్తారు. తయారయిన సంకరజాతి ఆడ విత్తనాన్ని గోనె సంచులలో నింపి కంపెనీ వారికి ఇస్తారు. ఎకరంలో 15-20 క్వింటాళ్ళ వరకు దిగుబడి వస్తుంది,

కొన్ని సీజన్లలో 2500 నుండి 3000 రూపాయలకు క్వింటాలు ధర ఇస్తే అప్పుడప్పుడు మార్కెట్ డిమాండ్ లేదనే మిషతో 2000 రూపాయలకు మించదు. ఒక్కోసారి ప్రైవేటు కంపెనీల వారు సిండికేట్గా మారి ధరను తమ నియంత్రణలో ఉంచుకోవడం వలన రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారు. ముందుగా చట్టపరంగా కంపెనీలు, రైతుల మధ్య ఎలాంటి అధికారిక ఒప్పంద పత్రాలు ఉండనందున రైతులు నష్టాల పాలవడం తరచూ జరుగుతున్నదే. ఈ ప్రాంతంలో పండిన పంట ఉత్పత్తులు పశుసంవర్ధకశాఖ ద్వారా పాడి అవసరాలకు మన ప్రభుత్వం కొని, రాయితీపై పాడి రైతులకు అందచేస్తే రవాణా ఖర్చులు తగ్గి తక్కువ ధరలకు రైతులకు పశుగ్రాస విత్తనాలను అందించిన వారవుతారు. అంతేకాక రైతులకు మంచి ధర వచ్చి లాభాల బాటలో ఉండటమే కాక కంపెనీల వారు ఇబ్బందులకు గురికాకుండా ఉంటారు.

ఆధారం: ఆరుట్ల లక్ష్మీపతి, వ్యవసాయ విస్రరణ అధికారి, నిజామాబాద్.

3.02272727273
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు