অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పసుపు

పసుపు

సుగంధ ద్రవ్య పంటలలో భారతదేశంలో పసుపు పంట ప్రధానమైనది. మన దేశములో సగానికి సగం పసుపు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో ఉత్పత్తి అవుతుంది. పసుపు దుంపల్లోని పసుపు పచ్చదనము (కర్కుమిన్) మరియు సుగంధతైలము (2.6%) వలన దీనిని ఆహార పదార్ధాలకు రంగు, రుచి, సువాసనల కొరకు ఔషదాలలో, చర్మ సౌందర్యానికి మరియు రంగుల పరిశ్రమలలో వాడుతారు.

నేలలు

బలమైన నేలలు పసుపు పండిచడానికి అనుకూలము. నీరు బాగా ఇంకే గరపనేలలు, ఉదజని సూచిక 6-7.5 మధ్య ఉండి సేంద్రియ పదార్దం బాగా ఉన్న భూములను పసుపు పంటకు అనుకూలము. పసుపు పంట నీటి ముంపును తట్టుకోలేదు. ఉప్పునేలలు, క్షారనేలలు పనికిరావు.

అనుకూల సమయం/ విత్తుకునే సమయం

రకాలు కాలపరిమితి (నెలలు) విత్తుకునే సమయం
స్వల్పకాలిక 6-7 మే చివరి వారం
మధ్యకాలిక 8 జూన్ 1 నుండి జూన్ 15 వరకు
దీర్ఘకాలిక 9 జూన్ 15 నుండి జూన్ 30 వరకు

రకాలు

దుగ్గిరాల (ఎరుపు, తెలుపు), మైదుకూరు, టేకూరిపేట, అర్మూర్, సేలమ్, రంగా, రశ్మి, రోమ, సురోమ, ఐ.ఐ.ఎస్.ఆర్, ప్రభ, ప్రతిభ, అలెప్పి, సుప్రీమ్, కేదారమ్, సుగుణ, సుదర్శన, ఏసీసీ 79, యాండీహెచ్ 96, ప్రగతి 48, రాజేంద్ర సోనాలి, రాజేంద్ర సోనియా, కస్తూరి పసుపు ముఖ్యమైనవి.

విత్తన మోతాదు

తల్లి దుంపలు – 100 కిలోలు/ఎకరానికి

పిల్ల దుంపలు – 800 – 1000 కిలోలు/ఎకరానికి

ఒంటి కన్ను ముచ్చెల వాడకం

 • సాధారణంగా రైతులు ఎకరాకు 10 క్వింటాళ్ళ వరకు విత్తనాన్ని వాడుతాన్నారు.
 • బలమైన కొమ్మలే ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో దొడ్డు విత్తనాన్ని/ పెద్ద కొమ్మలను అలాగే వేస్తుండడం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది.
 • ఇలా కాకుండా పెద్ద కొమ్ములను కణువుల వద్ద ముక్కలుగా కోసి ఒంటి కన్ను ముచ్చెలను బోదెలకు ఒక వైపున మొక్కజొన్నలో మిశ్రమ పంటగా విత్తుకోవాలి.
 • దీనివల్ల ప్రతి కణువు గల ముచ్చె ఒక మొక్కగా మారి ఎకరాకు 2 క్వింటాళ్ళ విత్తనం ఆదా అవుతుంది.

ప్రొట్రేలలో:

విత్తనము తక్కువగా ఉన్నప్పుడు ఒక కణువు లెదా రెండు కణువుల కొమ్మలు ప్రోట్రేలలో ప్రవర్ధనం ద్వారా విత్తనరేటును తగ్గించుకోవచ్చు

విత్తనశుద్ధి

విత్తిన దుంపలని మాంకోజెబ్ 2 గ్రా. (లేదా) కార్బండాజిమ్ 1 గ్రా. (లేదా) రిడోమిల్ 2 గ్రా. చొప్పున ఒక లీటరు నీటికి (లేదా) ఏదేని ఒక శీలింధ్రనాశని మందులో మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ / లీటరు, లేదా క్లోరిఫైరిఫాస్ 2 మి.లీ/ లీటరు, (లేదా) ఇమిడాక్లోప్రిడ్ 1 మి.లీ/ 3 లీటర్ల నీటికి కలిపిన ద్రావణంలో 30 నిమిషాలు నానబెట్టాలి. తరువాత నీడలో ఆరబెట్టి వెంటనే విత్తుకోవాలి. దీని వల్ల శీలింధ్రాలు మరియు పురుగుల బారి నుండి రక్షణ కల్పించాలి.

విత్తే దూరము మరియు విత్తు పద్ధతి

బోదె సాళ్ళ పద్ధతి

ఈ పద్దతిలో 45 సెం.మీ ఉండే బోదెలను తయారు చేసుకొని, బొదెల మీద 20 సెం.మీ. దూరంలో నాటుకోవాలి (45 x 20 సెం.మీ)

ఎత్తు మడుల పద్ధతి

 • బెడ్ పొడువు : అనసరం మేరకు
 • బెడ్ వెడల్పు : 90 సెం.మీ.
 • బెడ్ ఎత్తు : 20 – 30 సెం.మీ.
 • బెడ్ల మధ్య కాలువ వెడల్పు : 30 సెం.మీ.
 • బెడ్ మీద : రెండు వరసల మధ్య దూరం: 45 సెం.మీ.
 • రెండు మొక్కల మధ్య దూరం : 22.5 సెం.మీ.

ఎత్తు మడుమలు చేసుకొని బిందు సేద్య పద్దతి (డ్రిప్పు) ద్వారా నీరు అందించేట్లయితే దుంపలు బాగా ఊరడమే కాకుండా, దుంప కుళ్ళను తగ్గించుకోవచ్చును.

అంతర పంటలు

పసుపులో మొక్కజొన్న అంతరపంటగా వేస్తారు. రెండు సాళ్ళ పసుపుకు ఒక సాలు మొక్కజొన్న వేయాలి. అదే విధంగా 10 – 12 పసుపు సాళ్ళకు 1 వరుస ఆముదమును కూడా వేసుకోవచ్చును. మామిడి తోటలలో (చిన్నగా ఉన్నప్పుడు) కూడ అంతరపంటగా వేసుకోవచ్చును.

పంటమార్పిడి

మొక్కజొన్న, సోయాచిక్కుడు వంటి పంటలతో పంటమార్పిడి చేయాలి. పసుపు వేసిన పొలంలో పెండు సంవత్సరాల వరకు అదే పంట వేయకూడదు.

ఎరువులు

రైతులు అధిక మోతాదులో పశువుల ఎరువు లేదా చెరువు మట్టి వేయడం వల్ల నేలలో తేమ శాతం పెరిగి దుంపకుళ్ళు ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సిఫారసు చేసిన మేరకే సేంద్రీయ ఎరువులను వేసుకోవాలి. నాణ్యమైన వేపపిండిని తప్పకుండా వేసుకోవాలి.

ఒక ఎకరా పసుపు ఏక పంటకు, మొక్కజొన్నతో అంతరపంటగా వేసినప్పుడు ఏ ఎరువులు ఎంత మొతాదులో వేయాలో క్రింది పట్టితలో సూచించబడమైనది.

వేయవలసిన సమయం ఎరువులు ఏక పంటగా మొక్కజొన్న అంతరపంటగా
ఆఖరి దుక్కిలో ఫశువుల ఎరువు 10 టన్నులు 10 టన్నులు
వేప పిండి 200 కిలోలు 250 కిలోలు
జింక్ సల్ఫేట్ 10 కిలోలు 20 కిలోలు
20 కిలోలు 150 కిలోలు 300 కిలోలు
మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 25 కిలోలు 60 కిలోలు
40 రోజులకు వేప పిండి 200 కిలోలు 250 కిలోలు
యూరియా 50 కిలోలు 90 కిలోలు
80 రోజులకు యూరియా 50 కిలోలు 90 కిలోలు
పొటాష్ 25 కిలోలు 30 కిలోలు
120 రోజులకు యూరియా 50 కిలోలు 90 కిలోలు
పొటాష్ 25 కిలోలు 30 కిలోలు

ఎరువులను వేసేటప్పుడు మొక్కలపై పడకుండా, మొక్కలకు 10 నుండి 15 సెం.మీ. దూరంలో వేయాలి.

ఫర్టిగేషన్

సాధారణ పద్దతితో పోలిస్తే ఫర్టిగేషన్ వల్ల అధిక దిగుబడితో పాటు, ఎరువులు కూడా ఆదా అవుతాయి. అందువల్ల డ్రిప్ ఫర్టిగేషన్ ఆచరించినట్లయితే నీటిని, ఎరువులను ఆదా చేసుకోవడమే కాకుండా దుంపకుళ్ళను తగ్గించుకోవచ్చును.

ఒక హెక్టారుకి సిఫారసు చేసిన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను మూడు రోజులకి ఒకసారి ఫర్టిగేషన్ ద్వారా అందించాలి. సిఫారసు చేసిన 75% భాస్వరం ఆఖరి దుక్కిలో వేయాలి.

సంప్రదాయ రసాయనిక ఎరువులే కాకుండా నీటిలో సులువుగా కరిగే 19:19:19, 20:20:20, 14:35:14, 28:28:0 వంటి ఎరువులు కూడా ఉపయోగించవచ్చు.

పోషకధాతు లోపాలు ముఖ్య గుర్తింపు లక్షణాలు లోప సవరణ చర్యలు
పొటాష్ ఆకులు పాలిపోయి ఎండిపోతాయి. మల్టి-కె 10 గ్రా. లీటరు నీటికి కలిపి 15 రోజులు వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
ఇనుము ఈనెల మధ్య భాగము తెల్లగా మారడం ఫెరస్ సల్ఫేట్ 5 గ్రా. (లేదా) అన్నభేది 10 గ్రా. మరియు 1 గ్రా. నిమ్మఉప్పు కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చెయాలి.
జింకు ఈనెల మధ్య భాగం లేత ఆకుపచ్చ లేక పసిమి రంగుకు మారడం 20 కిలోల జింకు భూమిలో వెసుకోవాలి. 5 గ్రా. ల జింకు సల్ఫేట్ 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చెయాలి.

సమగ్ర కలుపు యాజమాన్యం

 • పసుపును కలుపు తీయవలసిన కీలక సమయం విత్తిన 90 రోజుల వరకు.

పసుపును ఏక పంటగా సాగు చేస్తున్నప్పుడు

 • పసుపు విత్తిన వెంటనే లేదా 2,3 రోజులలో ఎకరానికి 250 మి.లీ. ఆక్సిఫ్లోరోఫెన్ లేదా 1.3 - 1.6 లీటర్ల పెండిమిథాలిన్ లేదా 1.5 – 2 లీ. అలాక్లోర్ లేదా 1 కిలో అట్రజిన్ చొప్పున ఏదో ఒకదానిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
 • ఏదైన కారణం చేత పై మందులలో ఏదో ఒక దానిని వాడకపోతే, పసుపు విత్తిన 7 – 10 రోజులలో కలుపు విపరీతంగా వస్తుంది. కాని పసుపు అప్పటికి ఇంకా మొలకెత్తదు. ఈ సమయంలో కలుపు నివారణకు ఎకరానికి 1 లీ. పారక్వాచ్ లేదా 1 లీ. గ్లైఫోసేట్ లలో ఏదో ఒకదానిని 200 లీటర్ల నీటితో కలిపి పిచికారి చేయాలి.
 • పసుపు విత్తిన నెల తరువాత నుండి కలుపు ఉధృతిని బట్టి పంట కాలంలో 3 – 4 సార్లు (విత్తిన 60, 90, 120, 150 రోజులకు) కలుపు తీయాలి.
 • గుడ్డిజాతి మొక్కలు ఎక్కువగా ఉంటే వాటి నిర్మూలనకు ఎకరానికి 400 మీ.లీ. క్వినాల్ఫాస్ ఇథైల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

పసుపులో మొక్కజొన్నను అంతరపంటగా సాగు చేసినప్పుడు

 • పసుపు, మొక్కజొన్న విత్తిన వెంటనే లేదా 2,3 రోజులలో ఎకరానికి 1.3 – 1.6 లీ. పెండిమిధాలిన్ ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
 • మొక్కజొన్న మొలకెత్తిన తరువాత దశలో, రెండు పైర్లకు ఇబ్బంది లేకుండా కలుపును నిర్మూలించే మందులు ప్రస్తుతానికి అందుబాటులో లేవు.

నీటి యాజమాన్యం

తెలంగాణలో పసుపు పంటని నీటి వసతి కింద సాగు చేయాలి. దుంపలు నాటిన వెంటనే ఒక నీటి తడిని తప్పని సరిగా ఇవ్వాలి. మొలక వచ్చే వరకు 4 నుండి 6 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. మొలక వచ్చే వరకు 4 నుండి 6 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. భూభౌతిక మరియు వాతావరణ పరిస్థితులను గమనించి బరువైన నేలల్లో 10 – 20 సార్లు, తేలుకపాటి నేలల్లో 20 – 25 సార్లు తడి ఇవ్వాలి, దుంరకుళ్ళు ఆశించినప్పుడు నీటి తడుల మధ్య వ్యవధిని పెంచాలి. దుంపలు పక్వానికి వచ్చే సమయంలో ఎక్కువ తడులివ్వాలి. బిందు సేద్యం ద్వారా ఎక్కువ దిగుబడిని సాధించవచ్చును.

సమగ్ర సస్యరక్షణ

ప్రతి సంవత్సరం రైతులు ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందువల్ల అధిక దిగుబడుల కొరకు పంటను ఆశించే చీడపీడలు, తెగుళ్ళను సకాలంలో గుర్తించి సరైన సస్యరక్షణ చర్యలు చేవడితే నాణ్యమైన, అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది.

1. అల్లిక రెక్కనల్లి :

కారణాలు :

 • ఎక్కువ నీడ, తక్కువ గాలి, వెలుతురు ఉండడం.
 • పైరులో సూక్ష్మ వాతావరణం పొడిగా, చల్లగా ఉండటం,
 • పొలంలే పరిశుభ్రత పాటించకపోవడం.

లక్షణాలు:

 • ఆకుల ఆడుగుభాగంలో తల్లి, పిల్ల పురుగులు ఉండి రసం పీల్చడం వల్ల ఆకు పైభాగాన తెల్లని మచ్చలు ఏర్పడతాయి.
 • మొక్క పేలవంగా కనిపిస్తుంది. నల్లి ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులు ఎండిపోతాయి.

నివారణ:

 • విత్తనాన్ని సరైన సాంద్రతలో నాటి మొక్కలకు గాలి, వెలుతురు ప్రసరించేటట్లు చూడాలి.
 • వేపపిండిన పైపాటు ఎరువుగా వేయాలి.
 • పైరుపై పురుగులను గమనించగానే లీటరు నీటికి 1.6 మి.లీ. ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ. ల డైమిధోయేట్ ను కలిపి పైరుపై పిచికారి చేయాలి.

2. ఎర్రనల్లి (పొగచూరు తెగులు) :

లక్షణాలు :

 • పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల ఆడుగు భాగాన గుంపులు, గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి, మొక్కలు ఎండిపోతాయి.

నివారణ :

 • ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి 3 గ్రా. ల నీటిలో కరిగే గంధకం లేదా 5 మి.లీ. డైకోఫాల్ మరియు 1 మి.లీ. సబ్బునీరు (సాండోవిట్) కలిపి ఆకుల ఆడుగుభాగం తడిచేటట్లు పిచికారి చేయాలి,

3. పొలుసు పురుగు (స్కేల్స్) :

లక్షణాలు :

 • ఇవి తెల్లని చుక్కలవలె దుంపల మీద కనిపిస్తాయి. విత్తనం నిల్వ చేసినప్పుడు కొమ్మల నుండి రసాన్ని పీల్చి వడలిపోయేటట్లు చేస్తాయి.
 • విత్తనం కొరకు నిల్వ చేసే పసుపు కొమ్మలను లీటరు నీటికి 5 మి.లీ. మాలాథయాన్ మందు కలిపిన ద్రావణంలో 30 నిమిషాలు ఉంచి, బయటకు తీసి, ఆరబెట్టి నిల్వ చేసుకుంటే పొలుసు పురుగులు ఆశించవు.

4. దుంప తొలుచు ఈగ :

కారణాలు :

 • చీడపీడలు, తెగులు ఆశించిన తోట నుండి విత్తనం ఎన్నుకోవడం.
 • విత్తనశుద్ధి చేయకపోవడం.
 • పుసుపు తరువాత పసుపు పంట సాగూ చేయటం.
 • తక్కువ ఉష్ణోగ్రత, గాలిలో తేమ ఎక్కువ ఉండటం, తేమ నిల్వ ఉండే పల్లపు భూముల్లో సాగుచేయటం.
 • ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆకాశం మేఘావృతమై చెదురు మదురుగా వర్షాలు పడటం.

నష్టపరిచే విధానం :

 • అక్టోబర్ నెల నుండి పంట చివరి వరకు దుంపతొలుచు ఈగ సమస్య ఉంటుంది.
 • చిన్నవిగా, నల్లగా ఉండే ఈగలు మొక్కల మొదళ్ళ పైనుండి లోపలికి చేరి గుడ్లు పెడతాయి.
 • గుడ్ల నుండి బయటకి వచ్చే పిల్ల పురుగులు తెల్లగా బియ్యం గింజల మాదిరిగా ఉంటాయి.
 • ఇవి భూమిలోని దుంపల్లోకి చొచ్చుకుపోయి లోపలి కణజాలాన్ని తింటాయి.

లక్షణాలు :

 • దుంప తొలుచు ఈగ ఆశించిన మొక్క సుడి ఆకు, దాని దగ్గపలో ఉన్న లేత ఆకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి.
 • మొవ్వు లాగితే సులభంగా ఊడి వస్తుంది.
 • దుంపలో కణజాలం దెబ్బతింటుంది.
 • పుచ్చు ఆశించిన దుంపలను వండితే తొర్ర మాదిరి కనిపిస్తుంది.
 • మొక్క ఎదుగుదల నిలిచిపోయి, దిగుబడి 45-50 శాతం తగ్గుతుంది. నాణ్యత కూడా తగ్గుతుంది.

నివారణ :

 • విత్తనశుద్ధి : దుంపలను విత్తే ముందు లీటరు నీటికి 2 మి.లీ. డైమిథోయేట్ లేదా 2 మి.లీ. ప్రోఫెలోఫాస్ లేదా 3 మి.లీ. మలాథియాన్ కలిపిన ద్రావణంలో దుంపల్ని నానబెట్టి తరువాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
 • సమతుల ఎరువులను వాడాలి.
 • మురుగునీరు పోయే సౌకర్యం కల్పించాలి. మొక్కల మధ్య నీరు నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
 • పైరుపై దుంప పుచ్చు లక్షణాలు కనిపించిన వెంటనే ఎకరానికి 100 కిలోల వెపపిండిని మొక్కల మధ్య వేయాలి. ఇది దుంప పుచ్చు కలిగించే ఈగను దగ్గరకు రానీయదు, సత్తువగా కూడా పనిచేస్తుంది.
 • వేపపిండి లేకపోతే ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3జి గుళికలను అంతే పరిమాణం కలిగిన ఇసికలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి.

5. వేరు నులి పురుగులు :

కారణాలు :

 • పుచ్చు ఉన్న తోట నుంచి విత్తనం ఎన్నుకోవడం.
 • పసుపులో అంతరపంటగా పోలనేసి కుటుంబానికి చెందిన మిరప, టమాటో, వంగ పైర్లను సాగుచేయడం.
 • మురుగునీరు పోయే అవకాశం లేకపోవడం.
 • పంటమార్పిడి చేయకపోవడం. సేంద్రియ ఎరువులు వేయకపోవడం.

నష్టపరిచే తీరు :

నులి పురుగులు చేసిన గాయాల ద్వారా నేలలోని వ్యాది కారకాలు వేర్లలోకి ప్రవేశిస్తాయి. తద్వారా వేర్లు ఉబ్బిపోయి, కణుతులు కలిగి ఉంటాయి.

లక్షణాలు :

 • ఆకులు పాలిపోయి, మొక్కలు బలహీనంగా, పొట్టిగా ఉంటాయి.
 • నులిపురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే దుగుబడులు గణనీయంగా తగ్గుతాయి.

నివారణ :

 • చీడపీడలు, తెగుళ్ళు ఆశించని ఆరోగ్యమైన విత్తనాన్ని ఉపయోగించాలి.
 • పసుపులో అంతరపంటగా బంతిని చేసుకోవాలి.
 • పచ్చిఆకులు లేదా ఎండిన ఆకులతో మల్చింగ్ చేసుకోవాలి.
 • పచ్చిఆకులు లేదా ఎండిన ఆకులతో మల్చింగ్ చేసుకోవాలి.

6. కాండం తొలుచు పురుగు : ఇది ఆశించినప్పుడు ఆకులపై వరుసలలో ఉండే రంధ్రాలు ఏర్పరుస్తాయి. దీని వల్ల దిగుబడి పై పెద్దగా ప్రభావం లేకపోయిన దీని నివారణకు లీటరు నీటికి 1.6 మి.లీ. మొనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ. క్వినాల్ఫాస్ కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ళు :

1. దుంప, వేరుకుళ్ళు తెగులు :

 • దీనిని కొమ్మ కుళ్ళు, అడుగు రోగం అని కూడా అంటారు. ఈ తెగులు సోకితే నష్టం అధికంగా ఉంటుంది. దిగుబడి 50-60 శాతం తగ్గుతుంది.
 • జులైలో మొదలై అక్టోబర్, నవంబర్ లో తీవ్రమౌతుంది.

కారణాలు :

 • తెగులు ఆశించిన పొలం నుండి విత్తనం వాడటం.
 • విత్తనశుద్ధి చేయకపోవడం. విత్తిన పసుపుకు లోతుగా నాటడం.
 • మురుగు నీరు పోయే పౌకర్యంలేని నేలల్లో సాగుచేయటం.
 • ఎడతెరిపి లేని వర్షాలు కురిసి మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండటం.
 • పొటాష్ మరియు వేపపిండి ఎరువులను సక్రమంగా వాడకపోవడం.

లక్షణాలు :

 • పొలంలో అక్కడక్కడ మొక్కలు ఎదగడం లేక, ఆకులు పసుపు రంగుకు మారి వాడిపోయినట్లు ఉంటాయి.
 • మొక్కల్లో తొలుత ముదురు ఆకులు (పైనుండి 3వ ఆకు) వాడిపోయి, గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. తరువాత మొక్క పైభాగాన ఉన్న లేత ఆకులను ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
 • పొలంలో తెగులు సుడులు సుడులుగా కనిపిస్తుంది.
 • మొక్క కాండంపై నీటిలో తడిసిన మాదిరి మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు తరువాత గోధుమ రంగుకు మారుతాయి.
 • వేర్లు నల్లబడి కుళ్ళిపోతాయి. తెగులు సోకిన మొక్కకు వేర్లు, కొమ్మలు మళ్ళీ పుట్టవు.
 • దుంపలు, కొమ్మలు కుళ్ళి మెత్తబడిపోతాయి. వాటి నుండి చెడువాసన వస్తుంది. లోపల పసుపు రంగుకు బదులు మట్టిరంగు ఉంటుంది. ఈ తెగులు తల్లి దుంపలనుండి పిల్ల దుంపలకు వ్యాపిస్తుంది.
 • పసుపు దిగుబడి, నాణ్యత తగ్గుతుంది.
 • తెగులు సోకిన మొక్కలను పీకితే కొమ్మలతో పాటు తేలికగా వస్తాయి.

నివారణ :

 • తెగులును తట్టుకునే రకాలను సాగుచేసుకోవాలి (సుగుణ, సుదర్శణ, ప్రతిభ).
 • చీడపీడలు, తెగులు సోకని పొలం నుండి విత్తనాన్ని సేకరించి వాడాలి.
 • విత్తనశుద్ధి : ముందుగా లీటరు నీటికి 3 గ్రా. మెటలాక్సిల్ + 2 మి.లీ మోనోక్రోటోఫాస్, లేదా 3 గ్రా. మాంకోజెబ్ + 2 మి.లీ. మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో కొమ్మలను 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తరువాత నీటిని మార్చి లీటరు నీటికి 10 గ్రా. ట్రైకోడర్మా విరిడి కలిపి, ఆ ద్రావణంలో 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తరువాత బయటకు తీసి నీడలో ఆరబెట్టి పోలంలో విత్తుకోవాలి.
 • ఎకరానికి 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని 10 కిలోల వెపపిండి, 90 కిలోల పశువుల ఎరువులో కలిపి వారం రోజుల పాటు అనువైన పరిస్థితిలో వృద్ధి చేసి ఆఖరి దుక్కిలో లేదా విత్తిన నెల రోజులకు నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లాలి.
 • ఏటా ఒకే నేలలో వరుసగా పసుపు వెయరాదు. జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, వరి లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి.
 • పసుపు విత్తిన తరువాత నేలపై పచ్చి ఆకులతో లేదా ఎండు ఆకులతో మల్చింగ్ చేస్తే తెగులు ఉధృతిని కొంత వరకు తగ్గిచవచ్చు.
 • వర్షాలు కురిసినప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
 • పైరుపై తెగులు లక్షణాలు గమనించిన వెంటనే లీటరు నీటికి 1 గ్రా. మెటలాక్సిల్ + మాంకోజెబ్ లేదా 2 గ్రా. కాప్టాన్ లేదా 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ ను కలిపి తెగులు సోకిన మొక్కల మరియు వాటిచుట్టు ఉన్న మొక్కల మొదళ్ళు తడిచేలా పోయాలి.
 • తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరానికి 10 కిలోల ఫారేట్ 10జి గుళికలు, 1 కిలో సైమాక్సోనిల్ + మాంకోజెబ్ పోడి మరియు తగినంత యూరియా (10 – 20 కిలోలు) కలుపుకొని పొలం అంతటా చల్లుకోవాలి.

2. తాటాకు మచ్చ తెగులు:

దీనిని పక్షి, బెబ్బల, మర్రి ఆకు తెగులు అని కూడా అంటారు. సెప్టెంబర్ నుండి ఈ తెగులు కనబడుతుంది.

కారణాలు:

 • ఈ తెగులు విత్తనం, గాలి, వర్షం, పంట అవశేషాల ద్వారా వ్యాప్సి చెందుతుంది.
 • ఈదురు గాలులతో కూడిన వర్షాలు, గాలిలో ఎక్కువ తేమ, తక్కువ ఉష్ణోగ్రత ఉండడం.
 • తెగులు సోకిన పొలం నుండి విత్తనం వాడటం, విత్తనశుద్ధి చేయకపోవడం.
 • పంట అవశేషాలు పొలంలో, పొలం చుట్టు ఉండడం.

లక్షణాలు:

 • ఆకులపై అండాకారపు పెద్ద పెద్ద మచ్చలు అక్కడక్కడ ఏర్పడుతాయి. మచ్చలు ముదురు గోధుమ రంగులో ఉండి మచ్చ చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది.
 • తరువాత ఈ మచ్చులు క్రమేపి పెద్దవై కలిసిపోయి ఆకు మొత్తం వ్యాపించి ఎండిపోతాయి.
 • ఆకు కాడపై మచ్చలు ఏర్పడి ఆకు క్రిందికి వాలుతుంది.
 • తెగులు తీవ్రమైతే మొక్కల్లో ఎదుగుదల, దిగుబడి, నాణ్యత తగ్గుతాయి.

నివారణ:

 • తెగులు సోకని పొలం నుండి మంచి విత్తనాన్ని ఎన్నుకోవాలి.
 • విత్తనశుద్ధి : లీటరు నీటికి 3 గ్రా. మాంకోజెబ్ + 2 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 3 గ్రా. మెటలాక్సిల్ + 2 మి.లీ. మోనోక్రోటోఫాస్ మందు కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 30 నిమిషాలు నానబెట్టి, తరువాత బయటకు తీసి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
 • తెగులుతో మచ్చలు ఉన్న, ఎండిన ఆకులను తొలగించి కాల్చివేయాలి.
 • వెంటనే లీటరు నీటికి 1 గ్రా. కార్బండాజిమ్ లేదా 1 గ్రా. ధయోఫానేట్ మిథైల్ లేదా 2 గ్రా. కార్బండాజిమ్ + మాంకోజెబ్ కలిపి ఉన్న మందు లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ మరియు 0.5 మి.లీ. సబ్బునీరు కలిపి 15 రోజుల వ్యవధిలో సెప్టెంబర్ నుండి 3-4 సార్లు పిచికారి చేయాలి.

3. ఆకుమచ్చ తెగులు:

ఈ తెగులు పెట చివరి దశలో అంటే నవంబర్, డిసెంబర్ మాసాలలో ఎక్కువగా కనబడుతుంది.

కారణాలు:

 • గాలిలో ఎక్కువ తేమ, తక్కువ ఉష్ణోగ్రత ఉండటం. పంటలో సూక్ష్మ వాతావరణం ఎక్కువ తేమగా ఉండటం.
 • పంట అవశేషాలు పోలంలో, పోలం చుట్టూ ఉండటం.

లక్షణాలు:

 • మొదట ఆకులపై చిన్న చిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడతాయి. క్రమేపి ఇవి చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు మారుతాయి.
 • తెగులు తీవ్రమైతే మచ్చలు ఎక్కువై ఆకు మాడిపోతుంది.
 • దుంపలు, కొమ్మలు ఎదుగుదల తగ్గి దిగుబడి, నాణ్యత తగ్గిపోతాయి.

నివారణ:

 • విత్తనశుద్ధి చేయాలి. తెగులుతో మచ్చలు ఉన్న, ఎండిన ఆకులను తొలగించి రాల్చి వేయాలి.
 • తాటాకు మచ్చ తెగులు నివారణకు సూచించిన మందులతో పాటు లీటరు నీటికి 1 మి.లీ ప్రొపికొనజోల్ కలిపి 15 రోజుల వ్యవధిలో 2-2 సార్లు పిచికారి చేయాలి.

పసుపు కోత, తవ్వకం

సాగుచేసే రకాన్ని బట్టి పసుపు పంట కాలం 7-9 నెలలు ఉంటుంది. పంట పక్వానికి వచ్చినప్పుడే కోత కోయడం ప్రారంభించాలి. పక్వదశకు రాకముందే పంట కోత చేపడితే దిగుబడి తగ్గడంతో పాటు, కుర్కుమిన్ శాతం కూడా తక్కువగా ఉండడం వల్ల నాణ్యత లోపిస్తుంది. కోంత మంది రైతు సోదరులు పసుపు తరువాత సజ్జ, నువ్వు, టమాట సాగుచేయాలనే ఉద్దేశంతో పంటకాలం పూర్తికాకముందే తవ్వకాలు ప్రారంభిస్తున్నారు. ఈ పద్దతి సరైనది కాదు, పంటకాలం పూర్తి అయినప్పుడు మొక్కల ఆకులు పాలిపోయి, తరువాత ఎండిపోయి నేలపై పడిపోతాయి. ఈ దశలో దుంపలను, కొమ్మలను తవ్వి తీయాలి.

పసుపు తవ్వే 2 రోజుల ముందు మొక్క ఆకులు, కాండాలను భూమట్టానికి కోసివేయాలి. తరువాత తేలికపాటి నీటి తడిని ఇచ్చి, 2 రోజుల తరువాత పసుపు తవ్వకం ప్రారంభించాలి. భూమిలో మిగిలిపోయిన దుంపలను నాగలితో దున్ని ఏరివేయాలి. తరువాత పసుపు దుంపలకు అంటివున్న మట్టిని తొలిగించి శుభ్రపరచాలి.

పంటకోత సమయంలో కొమ్మలకు ఏ విధమైన దెబ్బ తగలకుండా జాగ్రత్త పడాలి. శుభ్రపరచిన తల్లి, పిల్ల దుంపలను వేరుచేయాలి. వీటితో పాటు దుంప పుచ్చు/కుళ్ళు ఆశించిన దుంపలు, కొమ్మలు కూడా వేరుచేయాలి.

పసుపు ఉడకబెట్టడం

పసుపు కోత తరువాత చర్యల్లో అతి ప్రధానమైనది, అత్యంత శ్రమతో పాటు ఇబ్బందికరమైనది ఉడకబెట్టడమే. తవ్విక 2-3 రోజుల్లోపల ఉడికించాలి. దీనివల్ల మంచి నాణ్యతతో పాటు రికవరీ అధికంగా ఉంటుంది. ఆలస్యంగా ఇడకబెట్టడం వల్ల రికవరీతో పాటు నాణ్యత తగ్గుతుంది. ఉడకబెట్టేటప్పుడు దుంపలను, కొమ్మలను వేరుగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టడం ద్వారా పసుపు దుంపలు, కొమ్మల్లో ఉన్న పిండి పదార్ధం గట్టిబడి రంగు సమానంగా అభివృద్ధి చెందుతుంది. ఉడకబెట్టడం వల్ల పచ్చివాసన పోయి, పసుపుకుండే ప్రత్యేకమైన సువాసన దుంపలేదా కమ్మలోని భాగమంతటికి వస్తుంది. ఉడకబెట్టడం వల్ల పసుపు ఆరడానికి పట్టే సమయం తగ్గుతుంది. పసుపు ఎక్కువగా ఉడకబెడితే దుంపలు పెలుసుగా ఉండి ఆరడానికి పట్టే సమయం తగ్గుతుంది. పసుపు ఎక్కువగా ఉడకబెడితే ఆరిన తరువాత రంగు చేడిపోతుంది. పసుపు తక్కువగా ఉడకబెడితే దుంపలు పెళుసుగా ఉండి, ఎండబెట్టి మెరుగు పట్టేటప్పుడు ముక్కలు విరిగిపోతాయి. గతంలో కడాయిలలో పసుపు ఉడకబెట్టడం, ఈ విధానంలో చాలా సమస్యలు ఉండటం నల్ల ఇటీవల కాలంలో రైతులు స్టీమ్ బాయిలర్లను వినియేగిస్తున్నారు. స్టీమ్ బాయిలర్ లో ట్రాక్టర్ పై 4 డ్రమ్ములు అమర్చబడి ఉంటాయి. కరెంట్ ద్వారా లేదా డీజిల్ ద్వారా లేదా కట్టెల ద్వారా మధ్య ఉండే ఆవిరి ఉత్పత్తి చేసే యూనిట్ లో వేడి ఆవిరి ఉత్పత్తి చేయబడుతుంది. ఈ ఆవిరికి తగిన వీడనం వద్ద 4 డ్రమ్ముల్లోకి వాల్వుల ద్వారా పంపడం ద్వారా పసుపు ఉడకబెట్టడం జరుగుతుంది. అన్ని డ్రమ్ములకు వేడి సమానంగా ఉండేలా ఆవిరిని వదలాలి. ఈ విధానంలో గంటకు 1 టన్ను పచ్చి పసుపును ఉడకబెట్టవచ్చును. స్టీమ్ బాయిలర్లను ఉపయోగించడం వల్ల నీటి ఆవిరితో, తక్కువ సమయంలో ఎక్కువ పసుపును ఉడికించడమే కాకుండా మంచి, నాణ్యతతో కూడిన పసుపు పొందవచ్చు.

పసుపు ఆరబెట్టడం

ఉడకబెట్టిన పసుపును చదునైన, శుభ్రమైన నేల లేదా టార్పాలిన్ షీట్ లేదా సిమెంట్ ప్లాట్ఫారంపై కుప్పగా పోయాలి. 24 గంటల తరువాత 2,3 అంగుళాల మందం ఉండేలా పరచాలి. పలుచగా పరిస్తే ఎండిన పసుపు రంగు చెడిపోతుంది. పసుపును అప్పుడప్పుడు తిరగబెట్టాలి. మధ్వాహ్నం పూట తిరగబెడితే సమానంగా ఎండుతాయి. ఒక క్రమ పద్దతిలో ఆరబెట్టడం అన్నది జరగాలంటే పసుపును, దుంపలను, కొమ్మలను రాత్రిపూట కుప్పగా చేసి, వాటిని కప్పివేసి ఉంచాలి. మరల ఉదయం పూట నేర్పాలి. కొమ్మలను విరిస్తే కంచు శబ్దంతో విరిగే దశ వరకు ఎండబెట్టాలి. దుంపలు లేదా కొమ్మల్లో తేమ 8 శాతం వరకు వచ్చేదాక ఎండబెట్టాలి. ఈ స్థితి రావడానికి సాధారణంగా 18-20 రోజులు పడుతుంది. పసుపు ఆరబెట్టినప్పుడు వర్షానికి తడువరాదు. ఉడికిన పసుపు రంగు కోల్పోయి నారింజ రంగు వస్తుంది. కాబట్టి అకస్మాత్తుగా కురిసే వర్షాలకు పసుపు తడువకుండా, పాలిధీన్ షీట్లు లేదా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలి. మంచు ఎక్కువగా పడేచోట రాత్రివేళల్లో పసుపును కప్పడం మంచిది. ఎండిన పసుపు వచ్చి పసుపులో సుమారు 20 శాతం తూకముంటుంది.

పసుపు పాలిషింగ్

ఎండిన పసుపు దుంపలు, కొమ్ములు గరుకుగా, పొలుసులు, చిన్న చిన్న వేర్లు కలిగి ఉంటాయి. ఆకర్షణీయంగా ఉండవు. ఒక డ్రమ్ముకు నడుమ ఇరుసు పెట్టి, దాని పక్కల జల్లెడగా తయారు చేయించి, పసుపును అందులో పోసి ఇరుసును తిప్పితే - డ్రమ్ము తిరుగుతుంది. డ్రమ్ము పక్క భాగాలలో ఇనుప మెష్ అమర్చి ఉండడం వలన ఒక దానికొకటి రాసుకొని పసుపు మెరుగు పెట్టబడుతుంది. ప్రస్తుతం మనుషులచే నడిపేవిగాక ఐదు హార్స్ పవర్ విద్యుత్ శక్తితో నడిచేవి లేదా ట్రాక్టర్ కు అమర్చి తిప్పిగానీ పాలిష్ యంత్రాలు విరివిగా వాడుకలోకి వచ్చాయి. మెరుగు పెట్టేటప్పుడు దుంపలు, కొమ్ములు ఆకర్షణీయంగా ఉండేందుకు కృత్రిమ రంగులు వాడరాదు.

పసుపు గ్రేడింగ్

ఎండిన పసుపును దుంపలు, కొమ్ములను సైజును బట్టి వేరువేరుగా గ్రేడింగ్ చేయాలి. మెరుగు పెట్టిన కొమ్ములను ప్యాకింగ్ చేయాలి. దీనికోసం శుభ్రమైన గోనె సంచులను వాడాలి. తేమ తగలకుండా నిల్వ చేయాలి. నిల్వ చేసే సంచుల అడుగు భాగాన చాపలు, వరిపొట్టు పరచాలి. కలపతో తయారు చేసిన బల్లలపై నిల్వ చేయడం, కోల్డ్ స్టోరేజిలలో నిలువ చేయడం శ్రేయస్కరం.

విత్తిన పసుపు ఎంపిక మరియు నిల్వ

 • పసుపును నష్టపరిచే వేరుకుళ్ళు, దుంప కుళ్ళు, ఆకుమచ్చ తెగులు విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతాయి.
 • కాబట్టి విత్తన ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటే విత్తనం ద్వారా వ్యాప్తి తెగుళ్ళు అరికట్టి అధిక దిగుబడులు పొంజవచ్చు.
 • విత్తనాన్ని చీడపీడలు, తెగుళ్ళు పొకినటువంటి ఆరోగ్యవంతమైన మొక్కుల నుండి ఎంపిక చేసుకోవాలి.
 • శుభ్రమైన, గాయాలు లేని, 40-50 గ్రా. బరువు ఉన్న కొమ్మలను, దుంపలను విత్తనంగా ఎంపిక చేసుకోవాలి.
 • పసుపు విత్తనాన్ని చెట్ల నీడనిగాని, కొట్టాలు, పాకల్లో చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి.
 • ఎటువంటి పరిస్థితులలోను ఆరుబయట ఎండ తగిలే చోట విత్తనాన్ని నిల్వ చేయరాదు.
 • విత్తిన నిల్వకు ఎంపిక చేసిన ప్రదేశాన్ని చదును చేసి 6 అంగుళాల మందంతో ఇసుక పరచాలి. తరువాత ఇసుకపై కొంచెం నీరు చిలకరించాలి.

నిల్వలో విత్తనశుద్ధి

 • ఎంపిక చేసుకున్న విత్తన పసుపుకు, కిలో విత్తనానికి 3 గ్రా. మాంకోజెబ్ లేదా 1 గ్రా. మెటలాక్సిల్ + 2 గ్రా. మాంకోజెబ్ చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి.
 • విత్తనశుద్ధి చేసిన పసుపును ఇసుకపై శంకాకారంలో కుప్పగా పోయాలి.
 • కుప్ప మీద వేపాకు, వరిగడ్డి కప్పాలి. ఏ పరిస్థితుల్లోనూ కోసిన పసుపు ఆకులను విత్తవ పసుపుపై కప్పకూడదు.
 • ఇలాంటి జాగ్రత్తలతో నిల్వ చేసిన విత్తన పసుపుకు తొలకరి వర్షాల సమయంలో మొలకలు వచ్చి విత్తుకోవడానికి అనువుగా ఉంటాయి.

పసుపుకు నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు

 • మెత్తం కీటక అవశేషాల సంఖ్య : 3
 • క్షీరదాల విసర్జన పదార్ధాలు : 5 మి.గ్రా. /పౌను
 • ఇతర విసర్జన పదార్ధాలు : 5 మి.గ్రా. /పౌను
 • శీలింధ్రాల బరువు శాతం : 3
 • కీటకాల బరువు శాతం : 2.5
 • ఇతర వ్యర్థ పదార్ధల బరువు శాతం : 0.5

అదిలాబాద్ జిల్లాలో ప్రత్తి మరియు సోయాబీన్ చేసుకున్న పంటలు ఖరీఫ్లో ఎక్కువ మొత్తంలో సాగు చేయబడతాయి.

జిల్లలో సాగు చేయుచున్న పసుపు సమాంతర మడి పద్ధతి, బోదెలు సాళ్ల పద్ధతుల్లో సాగు చేయబడుతుండటం సూచించిన మేరకు ఎరువులను బిందు సేద్య పద్ధతిలో వలన దుంపకుళ్ళు తెగులు ఆశించడం మరియు దుంప తగ్గిపోవడం గమనించడం జరిగినది. గత కొంత కాలముగా జిల్లాలో నల్లరేగడి భూములలో కూడ పసుపును సాగు చేస్తున్నారు. 2016 సంవత్సరములో అదిలాబాద్ జిల్లా ధనోరా గ్రామానికి యాదవ్ అనే రైతు పసుపు సాగును ఎతు వుడుల వద్దతి మరియు బిందు సేద్యములో కృషి విజన కేంద్రం, అదిలాబాద్ వారి సూచనలతో సాగు చేయడం జరిగినది. ఈ పద్ధతిలో రైతు ఒక మీటరు వెడల్పు, 20 సెం.మీ.ల ఎత్తు మరియు మడికి. మడికి మద్య 30 సెం.మీ ఎడం ఉండేటట్లు ఎత్తు మడులు తయారు చేయడం జరిగినది.

విత్తనం నాటేటప్పడు లీటరు నీటికి 3 గ్రా. ల రిడోమిల్ మరియు 3 మి.లీ. ల మలాథియాన్ కలిపిన ద్రావణంలో కొమ్మలను 30 నిమిషాలు ఉంచి తీసి నీడలో ఆరబెట్టి సిద్ధం చేసుకున్న ఎత్తు మదుల పైన వారసుల మద్య 30 సెం. మీ. మరియు దుంపకు మద్య 15 సెం.మీ దూరంలో జంట వరుసల పద్ధతిలో నాటడం జరిగినది.

సూచించిన మేరకు ఎరువులను బిందు సేద్య పద్ధతిలో పంట చివరి వరకు ఇవ్వడం జరిగినది. ఈ పద్ధతి ద్వారా 100 క్వింటాళ్ళు ఒక హెక్షారుకు ఎండు పసుపు దిగుబడి సాధించడం జరిగినది. సాధారణ పద్ధతిలో 65 క్వింటాళ్ళు ఒక హెక్షారుకు మాత్రమే దిగుబడి వచ్చినది. ఎత్తుమడి మరియు బిందు సేద్య పద్దతిలో సాగు చేయడం ద్వారా 54% ఆధికదిగుబడి సాధించడం జరిగినది.

రైతు ఎతుమడి మరియు బిందు సేద్య పద్దతి ద్వారా సాగు చేయడం ద్వారా 100 క్వింటాళ్ళు/ హెక్టారు దిగుబడి రాగా, అతను ఒక క్వింటా పసుపును 7,000 రూపాయల చొప్పును జరిగినది. రైతుకు వచ్చిన మొత్తం’ ఆదాయం 7,00,000 రూపాయలుకాగా, అతని సాగుకు అయిన ఖర్చు 2,39,188 అయ్యింది. రైతుకు హెక్టారుకు 4,60,862 రూపాయల నికర ఆదాయం వచ్చింది.

ప్రస్తుతం తెలంగాణాలోని నిజామాబాదు, మెదక్, కరీంనగర్, వరంగల్ కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సాగు చేస్తున్న పనుపు పంటను వివిధ పరుగులు, తెగుళ్ళ ఆశించి తీవ్రంగా నష్టవరుస్తాయి. అందువల్ల పంటను ఆశించే పరుగులు. తెగుళ్ళను సకాలంలో గుర్తించి సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చు.

ఈ దశలో పంటను ఆశించే మరుగులు. తెగుళ్ళ ఆశించడానికి గల కారణాలు, వాటి లక్షణాలు. నివారణ మార్గాలను గురించి తెలుసుకుందాం.

1.అల్లిక రెక్క నల్లి

కారణాలు : ఆకాశం ఎక్కువగా మేఘాలతో నిండి ఉండటం. ఎక్కువ నీడ, తక్కువ గాలి, వెలుతురు ఉండటం. పైరులో నూక్ష్యవాతావరణం పొడిగా, చల్లగా ఉండటం.

లక్షణాలు : ఆకుల అడుగుభాగంలో తల్లి, పిల్ల పరుగులు రనం పీల్చడం వల్ల ఆకుపై భాగాన తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. నల్లి ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులు ఎండిపోతాయి.

నివారణ : వేప పిండిని ఎకరాకు 250 కిలోలు పైపాటుగా వేసుకోవాలి. ఈ పరుగులను గమనించగానే లీటరు నీటికి 1.6 మోనోక్రోటో ఫాస్ లేదా 2 మి.లీల డైమిధోయేట్ ను కలిపి పైరుపై పిలికారి చేయాలి.

2.ఎర్ర నల్లి (పొగ చూరు తెగులు)

దీనిని పక్షి కన్ను తెగులు, మర్రి ఆకు తెగులు అని కూడా అంటారు. సెప్టెంబరు మాసం మండి ఈ తెగులు కనబడుతుంది.

లక్షణాలు : పిల్ల. తల్లి పరుగులు ఆకుల అడుగు భాగాన, గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి. మొక్కలు ఎండిపోతాయి.

నివారణ : లీటరు నీటికి 3 గ్రా.ల నీటిలో కరిగే గంధకం లేదా 5 మి.లీ. డైకోపాల్తో పాటు 1 మి.లీ. సాండోవెట్ లేదా సబ్బపాడి కలిపి ఆకుల అడుగు భాగం తడిచేటట్లు పిచికారీ చేయాలి.

3.దుంప తొలుచు ఈగ

కారణాలు : తక్కువ ఉష్ణోగ్రత, గాలిలో తేమ ఎక్కువగా ఉండటం సెప్టెంబరు. అక్టోబరు మాసాలలో ఆకాశం మేఘావృతమై చెదురు ముదురుగా వరాలు పడటం.

లక్షణాలు : మొక్క సుడి ఆకు, దాని దగ్గరలో ఉన్న లేత ఆకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. మొవ్వ లాగితే నులభంగా ఊడి వస్తుంది. దుంపలో కణజాలం దెబ్బ తింటుంది. మొక్క ఎదుగుదల నిలిచి పోయి, దిగుబడి 45-50 శాతం తగ్గుతుంది.

నివారణ : పైరుపై దుంప వచ్చు లక్షణాలు కనిపించిన వెంటనే ఎకరాకు 250 కిలోల వేప పిండిని మొక్కల మొదళ్ళ చుట్టు తడిగా ఉన్న నేలపై చల్లాలి.

4.వేరు నులి పురుగులు

కారణాలు : పసుపులో అంతర పంటగా మిరప, టమోట. వంగ వంటి పైర్తను సాగు చేయడం మురుగు నీరు పోయే అవకాశం లేకపోవడం, వంట మార్పిడి చేయక పోవడం, సేంద్రీయ ఎరువులు వేయకపోవడం.

లక్షణాలు : ఆకులు పాలిపోయి. మొక్కలు బలహీనంగా, పొద్దిగా ఉంటాయి. నులిపురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే వేర్తు ఉబ్బిపోయి, కణుతులు కలిగి ఉంటాయి.

వివారణ : అంతర పంటగా బంతిని వేసుకోవాలి. ఎకరాకు 10 కిలోల కార్బోప్యూరాన్ 3 జి గుళికలను వేసుకోవాలి.

5.కాండం తొలుచు పరుగు:

లక్షణాలు: ఆకులపై వరుసలో ఉండే రంద్రాలు కన్పిస్తాయి.

నివారణ : లీటరు నీటికి 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారి చేయాలి.

ఆశించే తెగుళ్ళు

1. దుంప, వేరు కుళ్ళ తెగులు: దీనిని అడుగు రోగం, కొమ్మకుకళ్ళు అని కూడా అంటారు. ఈ తెగులు వల్ల 50-60 శాతం దిగుబడి తగ్గుతుంది.

కారణాలు : ఎడ తెరపి లేకుండా వర్షాలు కురిసి మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండటం, పొటాష్, వేపపిండి ఎరువులను సక్రమంగా వాడకపోవడం.

లక్షణాలు : మొక్కల్లో తొలుత ముదురు ఆకులు వాడిపోయి, గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. తరువాత మొక్కపై భాగం ఉన్న లేత ఆకులకు ఈ వ్యాపిస్తుంది. పాలంలో తెగులు మడులుగా కనిపిస్తుంది. వేర్లు నల్లబడి కుళ్ళిపోతాయి. తెగులు సోకిన మొక్కకు వేర్తు, కొమ్మలు మరలా పట్టవు. దుంపలు, కొమ్మలు కుళ్ళి మెత్తబడిపోతాయి. వాటి నుండి చెడువానన వస్తుంది. తెగులు పాకిన మొక్కలను పీకితే కొమ్మలతో పాటు తేలికగా వస్తాయి.

నివారణ: వర్షాలు కురిసినప్పడు పాలంలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. లీటరు వీటికి 1 గ్రా. మెటలాక్సిల్ లేదా 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్లను కలిపి తెగులు పోకిన మొక్కల చుట్టు మొదళ్ళు తడిచేలా పోయాలి.

2. తాటాకు మచ్చ తెగులు: దీనిని పక్షి కన్ను తెగులు, మర్రి ఆకు తెగులు అని కూడా అంటారు. సెప్టెంబరు మాసం మండి ఈ తెగులు కనబడుతుంది.

లక్షణాలు : ఆకులపై అండాకారవు పెద్దపెద్ద మచ్చలు అక్కడక్కడా ఏర్పడుతాయి. మచ్చలు ముదురు గోధుమ రంగులో ఉండి మచ్చ చుట్టు పసువు రంగు వలయం ఉంటుంది. ఆకు కాడపై మచ్చలు ఏర్పడి ఆకు కిందికి వాలుతుంది.

నివారణ : మచ్చలు ఉన్న ఎండిన ఆకులను తొలగించి కాల్చి వేయాలి. లీటరు వీటికి 1 గ్రా. కార్భండాజిమ్ లేదా 1గ్రా. ధయోఫాసేట్ మిధైల్ లేదా 2.5 గ్రా. మాంకోజేబ్ మరియు అర మి.లీ. నబ్బ నీరు కలిపి 15 రోజుల వ్యవధిలో సెప్టెంబరు నుండి 3 సార్లు పిచికారి చేయాలి.

3. అకుమచ్చ తెగులు: ఈ తెగులు పంట చివరి దశలో అంటే నవంబరు, డిసెంబరు మాసాలలో అధికంగా కనబడుతుంది.

లక్షణాలు : మొదట ఆకులపై చిన్న చిన్న పనుపు రంగు చుక్కలు ఏర్పడతాయి. క్రమేపీ ఇవి చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలుగా మారతాయి. తెగులు తీవ్రమైతే మచ్చలు ఎక్కువై ఆకు మాడిపోతుంది. దుంపలు, కొమ్మలు ఎదుగుదల తగ్గి దిగుబడి, నాణ్యత తగ్గిపోతాయి.

నివారణ : 1 మి.లీ. ప్రాపికొనజోల్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ మరియు 0.5 మి.లీ. సబ్బు నీరు కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పైరుపై పిలికారి చేయాలి.

ఇతర వివరములకు సంప్రదించవలసిన ఫ్రాన్ నెం 9441168156

పసుపు సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామ: ప్రొఫెసర్ & యూనివర్సిటీ హెడ్, ఉద్యాన విభాగము, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్. ఫోన్ నెం. 9391248462

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate