অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పొగాకు లద్దె పురుగు ఆశించే వివిధ పంటలు – సస్యరక్షణ చర్యలు

ఖరిఫ్, రబీ పంట కాలాల్లో పండించే వివిధ పంటలైన పత్తి, వేరుశనగ, ఆముదం, పొగాకు, కంది, పెసర, మినుము అలాగే కూరగాయ పంటలైన టమాట, వంగ, బెండ, మిరప లాంటి ఎన్నో పంటలను ఆశించి నష్టపరుస్తుంది.pogakupurugu.jpg

దీని రెక్కలు లేత గోధుమ రంగులో ఉండి ముందు రెక్కల మచ్చలు కలిగి ఉంటాయి. తల్లి పురుగులు ఆకుల పై వందల కొద్ది గుడ్లను గుంపులో పెట్టి వాటిపై గోధుమ వర్ణం గల నూగుతో కప్పుతాయి. ఒక్కొక్క తల్లి పురుగు తన జీవిత కాలంలో 1000కి పైగా గుడ్లను పెడుతుంది. 4-5 రోజుల్లో గుడ్లు పొదిగి చిన్న గొంగళి పురుగులుగా మారతాయి. బాగా ఎదిగిన గొంగళి పురుగుకింది భాగం లేత గోధుమ రంగు కలిగి మెడ మీద ప్రముఖ్యంగా కనిపించే నల్లటి మచ్చలతో శరీరమంతా సన్నని లేత రంగు గీతాలు కలిగి ఉంటాయి. కోశస్ధ దశ మొక్కలకు దగ్గరగా భూమిలో గడుపుతుంది.

నష్టపరిచే విధానం

తొలి దశలో చిన్న గొంగళి పురుగులు ఆకుల మీద పత్రహరిత పదార్దాన్ని గీకి జల్లెడ ఆకులుగా తయారు చేస్తాయి. పెద్ద పురుగులు ఆకులను కొరికి తిని, ఈ నేలను మాత్రం మిగులుస్తాయి. పూత, మొగ్గలు, కాయలను ఆశించి లోపల పదార్దాలను తిని నష్టపరుస్తాయి. ఎదిగిన గొంగళి పరుగులు పగలంతా నేలమీద చెత్త కింద కానీ, మట్టి పెళ్ళల కింద కానీ, నేర్రేలలో కానీ దాగి రాత్రులందు పైరునాశించి విపరీతంగా నష్టపరుస్తాయి. రైతులు మొదటిగా గుడ్ల సముదాయాలను, ఆపైన జల్లేడాకులను, చిన్న చిన్న గొంగళి పురుగుల గుంపులను బట్టి పరుగు ఉనికిని గమనించవచ్చు. ఉధృతి ఎక్కవగా ఉన్నప్పుడు ఈనెలు మాత్రమే ఉన్న ఆకులను, చెట్ల మొదళ్ళలో పగటి పూట దాగి ఉన్న నును పైన పెద్ద పెద్ద గొంగళి పురుగులను బట్టి దీని ఉనికిని గమనించవచ్చు. దీని జీవిత చక్రం 30-40 రోజుల్లో పూర్తవుతుంది. ఒక సంవత్సరంలో దాదాపు 7-8 తరాలను పూర్తి చేస్తుంది. ఈ పురుగును సమగ్ర సస్యరక్షణ ద్వారా నివారించుకోవచ్చు.

సమగ్ర సస్యరక్షణ

కీటక సంహారానికి వాడుతున్న విశాపూరిత మందులను క్రమబద్దం చేసి వాటితో పురుగులను అదుపులో పెట్టడానికి మనకు అందుబాట్టులో ఆచరణ సాధ్యమైన వివిధ ప్రక్రియలను జోడించి ప్రకృతిలోని జీవుల సమతుల్యాన్ని కాపాడుకోవడానికి దోహదకారి అయ్యే పధాకాన్ని సమీకృత సస్యరక్షణ లేక సస్యరక్షణ అంటారు.

పొగాకు లద్దె పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు

  • వేసవిలో లోతుగా దుక్కులు దున్నడం వల్ల భూమిలో విశ్రాంతి దశలో ఉన్న పురుగులు కోశాస్తదశలను అదుపులో ఉంచవచు.
  • రైతులందరూ సమిష్టిగా ఒకేసారి విత్తుకోవడం పూర్తి చేయాలి.
  • నత్రజని ఎరువులను అతిగా వాడరాదు. సిఫారుసు చేయబడిన మోతాదులో ఎరువులను వాడాలీ.
  • పంట మార్పిడి విధానాన్ని పాటించాలి.
  • ఎర పంటలుగా లద్దె పురుగుకు 100 ఆముదం మొక్కలు ఒక ఎకరా చేనులో అక్కడక్కడ వేసినట్లయితె ఆ పురుగులు పెట్టిన గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులను గమనిస్తూ ఏరివేసి నాశనం చేయాలి.
  • ఎకరానికి 4-5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. వీటిని ప్రతి 50 మీ. దూరానికి ఒకటి చొప్పున మొక్కల కంటే ఒక అడుగు ఎత్తులో అమర్చాలి. లింగాకర్షక బుట్టలలోని మందుని ప్రతి 20 రోజులకొకసారి మార్చాలి.
  • పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి ఎకరాకు 15-20 పక్షి స్దావరాలను ఏర్పాటు చేయాలి.
  • గుడ్ల సముదాయాలు, పిల్ల లద్దె పురుగులు ఆకుల అడుగు భాగాలలో గుంపులుగా ఉంటాయి కాబట్టి వాటిని ఆకులతో సహా ఏరి నాశనం చేయాలి.
  • మొక్కల దశను బట్టి గుడ్లను, తొలిదశలో పిల్ల పురుగులను నివారంచడానికి 5 శాతం వేప గింజల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. దీనివల్ల తల్లి పురుగులు మొక్కల పై తక్కువ గుడ్లు పెడతాయి.
  • తొలిదశ పిల్ల పురుగులను అదుపులో ఉంచడానికి ఎన్.పి.వి ద్రావణాన్ని 500 ఎల్.ఇ. చొప్పున కిలో బెల్లం, శండోవిట్ కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. ఈ రోగం వచ్చిన పురుగులు కొమ్మకు వేలాడి చనిపోతాయి.
  • రేకల పురుగు ఉనికిని గమనించిన వెంటనే లేదా విత్తినం 40-50 రోజులలో హెక్టారుకు 1,50,000 చొప్పున వారానికి ఒకసారి ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్లను రెండు లేదా మూడు సార్లు వదలాలి.
  • లద్దె పురుగులు ఒక పంట పొలం నుంచి మరో పంట పొలానికి రాత్రి సమయంలో వలస పోతాయి. కనుక పొలం చుట్టూ ఒక లోతు నాగలి చాలు కందకం చేసి అందులో ఫాలిడాల్ పొడిని చల్లాలి. ప్రతి 70 మీ. చాలుకు 1 కిలో పొడి మందును వాడాలి.
  • ప్రకృతిలో మిత్ర పురుగులను పంట పెరుగుదలకు హానిచేసే పురుగుల ఆర్ధిక నష్టపరిమితి స్ధాయిని దృష్టిలో ఉంచుకొని మిగిలిన అన్ని పద్ధతుల ద్వారా పురుగులను అదుపులో ఉంచలెకపొయినప్పుడు మాత్రమే పురుగు మందులు పిచికారి చేయాలి.
  • పురుగు మధ్యస్ధ దశలో ఉన్నప్పుడు క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ లేదా ధయోడికార్బ్ 1.5 గ్రా. లేదా నోవాల్యురాన్ 1 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  • 50 శాతం పంటలో నష్టం గమనించినట్లయితే స్ప్రేనోశాడ్ 0.3 మి.లీ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రా. లేదా లూఫెన్యూరాన్ 1 మి. లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  • ఎదిగిన లద్దె పురుగు నివారణకు 5 కిలోల తవుడు 0.5 కిలోల బెల్లం, 0.5 లీటరు మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిఫైరిఫాస్ లో తగినంత నీళ్ళు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్కల మొదళ్ళ దగ్గర సాయంత్రం చల్లుకోవాలి.
  • విషపు ఎర తయారు చేసుకోలేని పక్షంలో క్లోరాన్ ట్రానిలీప్రోల్ 0.3 మి.లీ లేదా ఫ్ల్యూబెండియమైడ 0.2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసి పెద్ద పురుగులను నివారించుకోవచ్చు.
  • పొలంలో కింద పడినటువంటి ఎండు ఆకులను తీసి కాల్చివేయాలి. పురుగు ఉనికి గమనిస్తూ ఎప్పటికప్పుడు పైన చెప్పిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటిస్తూ తేలివిగా వ్యవసాయం చేస్తే రైతులు ఖర్చు తగ్గించుకొని, అధిక దిగుబడులు సాధించడం తో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate