రైతుకు శ్రమ తగ్గేలా, నాణ్యమైన పప్పు దినుసులను పొందేలా పలు ప్రయోజనాలు గల చిన్న మిల్లును ఐఐపీఆర్ (భారత పప్పుధాన్యాల పరిశోధన కేంద్రం) మినీ దాల్ మిల్‌ను రూపొందించింది. రైతులు తాము పండించిన పప్పుధాన్యాలను మరపట్టించి పప్పులుగా మార్చి అమ్ముకోవటం ద్వారా అధిక లాభాలను పొందవచ్చు. ఈ చిన్ని మిల్లును రైతులే ఇంటివద్ద లేదా చిన్న గదిలో ఏర్పాటు చేసుకొని పప్పులను మరపట్టించి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చుకొని అమ్ముకోవచ్చు. అన్ని రకాల పప్పు ధాన్యాలను దీని ద్వారా మరపట్టవచ్చు. 2 హెచ్. పీ. సింగిల్ ఫేజ్ మోటార్‌తో ఇది నడుస్తుంది. గంటకు 75 - 125 కిలోల పప్పుగింజలను మరపట్టే సామర్థ్యం దీని సొంతం. దీని ధర రూ. 80 వేలు. ఇది పరిమాణంలో చాలా చిన్నది.
ఇందులో రబ్బరు డిస్క్‌లను వాడటం వల్ల ఇతర మిల్లుల కన్నా 5-10 శాతం అధికంగా పప్పులను పొందవచ్చు. ఇందులో ఉన్న మరో అదనపు ప్రయోజనం.. రబ్బరు డిస్క్‌ల స్థానంలో స్టీల్ డిస్క్‌లను అమర్చుకోవటం ద్వారా పశువుల దాణాకు కూడా ఉపయోగపడేలా పప్పులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. వీటిని ప్యాకింగ్ చేసి స్థానికంగాను, అవకాశాన్ని బట్టి పట్టణాల్లోను విక్రయించవచ్చు. దీనిలో పప్పులు నునుపుదనం వచ్చి ఆకర్షణీయంగా కనపడేందుకు పాలిష్ వేసే ఏర్పాటు లేకపోవటం వల్ల వినియోగదారుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పప్పుధాన్యపు పంటలను అధికంగా సాగు చేసే ప్రాంతాల్లోని రైతులకు ఈ మిల్లు చాలా ఉపయోగకరం. ప్రస్తుతం 75 శాతం పప్పుధాన్యాలను మరపట్టే పరిశ్రమ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగ యువకులు, ఔత్సాహికులు, రైతులు ఈ మిల్లును ఏర్పాటు చేసుకోవటం ద్వారా స్వయం ఉపాధి పొంద వచ్చు. మరో ముగ్గురికి ఉపాధి లభిస్తుంది. ఇతర రైతుల పప్పుధాన్యాలను మరపట్టడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.
వివరాలకు దుష్యంత్ శర్మ: 98391 15497- భారత్ హెవీ మెషీన్స్ కాన్పూర్ వారిని సంప్రదించవచ్చు
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు