పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కరివేపాకు పెంపకం

కరివేపాకు సాగు విధానము చీడపీడల నివారణ

రైతులు కొద్దిపాటి శ్రమ, మేలైన యాజమాన్య పద్ధతులతో కొన్ని రకాల వాణిజ్య పంటల్ని సాగు చేస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇలాంటి పంటల్లో కరివేపాకు ఒకటి. ఈ పంట నమ్మకమైన దిగుబడుల్ని, ఆదాయాన్ని అందిస్తుంది. కరివేపాకు తోటలో పప్పుధాన్యాలు, ఆకుకూరల్ని అంతరపంటలుగా సాగు చేసి అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. కరివేపాకును నీటి పారుదల కింద, నీరు లేనప్పుడు మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా సాగు చేయవచ్చు. ఇది బహు వార్షిక కూరగాయ పంట. కరివేపాకు మొక్కలకు అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్, అతి తక్కువగా 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వరకూ అనువైన వాతావరణంగా చెప్పొచ్చు.

నేలలు-రకాలు

కరివేపాకు పైరు అధిక నీటిని తట్టుకోలేదు. అందువల్ల పొలంలో మురుగు నీటి పారుదల సౌకర్యం తప్పనిసరి. ఏ మాత్రం తేమ నిలవని తేలికపాటి గరప నేలలు, నీరు నిలిచే నల్లరేగడి నేలలు ఈ పంటకు పనికిరావు. దీని సాగుకు ఎర్ర గరప నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. కరివేపాకు సాగుకు డీడబ్ల్యూడీ-1, 2 రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ రెండు రకాలూ మంచి సువాసన కలిగి ఉంటాయి. డీడబ్ల్యూడీ-1లో నూనె శాతం 5.22%, డీడబ్ల్యూడీ-2లో 4.09%ఉంటుంది. డీడబ్ల్యూడీ-1 రకం చలిని తట్టుకోలేదు. శీతాకాలంలో పైరు ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఇక డీడబ్ల్యూడీ-2 రకం చలి తీవ్రతను కొంత వరకూ తట్టుకుంటుంది. డీడబ్ల్యూడీ-1 రకం కంటే ఎక్కువ దిగుబడి ఇస్తుంది.

ఎలా సాగు చేయాలి?

కరివేపాకు సాగుకు జూన్ నుంచి ఆగస్ట్ వరకూ అనుకూలంగా ఉంటుంది. కరివేపాకు పంటను ఎక్కువగా విత్తనం ద్వారా సాగు చేస్తారు. కొందరు రైతులు ముందుగా నారు పోసి మొక్కలు పెరిగాక ప్రధాన పొలంలో నాటు తారు. ఈ పద్ధతిలో కరివేపాకును సాగు చేయాలనుకుంటే ముందుగా చిన్న చిన్న పాలిథిన్ సంచుల్లో ఇసుక, మట్టి, బాగా చివికిన పశువుల ఎరువును 1:1:1 నిష్పత్తిలో వేయాలి. వాటిలో విత్తనాలు వేసి మొక్కల్ని పెంచాలి. సంచుల్లోని మట్టిపై రోజుకు రెండుసార్లు నీళ్లు చల్లుతూ ఉండాలి. విత్తనాలు మొలకెత్తడానికి మూడు నాలుగు వారాల సమయం పడుతుంది. మూడు నెలల వయసున్న మొక్కల్ని ప్రధాన పొలంలో నాటుకోవాలి.

ఇక నేరుగా విత్తనాలు విత్తే వారు ముందుగా పొలాన్ని లోతుగా దున్నాలి. చివరి దుక్కిలో ఎకరానికి 10-12 టన్నుల పశువుల ఎరువుతో పాటు 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. ఆ తర్వాత గుంటక తోలి భూమిని చదును చేయాలి. తర్వాత సాళ్లలో విత్తుకోవాలి లేదా విత్తనాలు పొలం అంతటా సమానంగా పడేలా వెదజల్లాలి. విత్తనం కోసం చెట్ల నుంచి సేకరించిన పండ్లను మర్నాడే విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తితే మొలక శాతం తగ్గుతుంది. ఎకరానికి 200 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తనాలు విత్తిన తర్వాత గుంటక తోలి నీరు పెట్టాలి.

పెద్ద మొక్కల చుట్టూ వచ్చే పిలకల్ని తీసి కూడా నాటుకోవచ్చు. ఇందుకోసం తల్లి మొక్క దగ్గర వేరు నుంచి వచ్చే పిలకల్ని వేరుతో సహా తీసి వెంటనే నాటాలి. అయితే ఈ పద్ధతిలో కరివేపాకు సాగు చేయాలనుకుంటే వర్షాకాలంలో మాత్రమే మొక్కలు నాటాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి.

తోటలో మొక్కలు ఒక మీటరు ఎత్తు పెరిగిన తర్వాత మొక్క చివర్లను తుంచాలి. ఇలా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మొక్కలు గుబురుగా పెరుగుతాయి. పంట కోసిన తర్వాత ప్రతిసారీ 50 కిలోల నత్రజని, 50 కిలోల పొటాష్ అందించే ఎరువులు వేస్తూ ఉండాలి.

కోత - ఆ తర్వాత

విత్తనాలు విత్తిన 9-10 నెలలకు పంట కోతకు వస్తుంది. అయితే మొదటి కోతలో కరివేపాకు దిగుబడి, ఆదాయం చాలా తక్కువగా ఉంటాయి. ఎకరానికి 800 నుంచి వెయ్యి కిలోల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రతి మూడు నాలుగు నెలలకు ఒక కోత తీసుకోవచ్చు. రెండో సంవత్సరంలో ఎకరానికి రెండు వేల నుంచి మూడు వేల కిలోల దిగుబడి వస్తుంది. అనంతరం ప్రతి కోతకు దిగుబడి పెరుగుతూ ఉంటుంది. మూడో సంవత్సరంలో ఎకరానికి 8-10 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది.

కరివేపాకు కోసిన తర్వాత ప్రతిసారీ పొలంలోని కలుపు మొక్కల్ని తొలగించాలి. పైన తెలిపిన విధంగా నత్రజని, మ్యురేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేసి నీరు పెట్టాలి. డ్రిప్ ద్వారా సాగు చేసినట్లయితే పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో నీరు, ఎరువులు అందించవచ్చు. తద్వారా దిగుబడుల్ని 15-20 శాతం పెంచుకోవచ్చు.
జయంత్ రెడ్డి, బీఎస్సీ అగ్రికల్చర్
హైదరాబాద్

ఈ చీడపీడలతో జాగ్రత్త

కరివేపాకు పంటను గొంగళి పురుగులు, పొలుసు పురుగులు, ఆకుమచ్చ తెగులు ఎక్కువగా నష్టపరుస్తాయి. గొంగళి పురుగులు ఆకుల్ని తింటాయి. వీటి నివారణకు లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున మలాథియాన్ కలిపి పిచికారీ చేయాలి. పొలుసు పురుగులు కాండం పైన చేరి రసాన్ని పీలుస్తాయి. దీంతో మొక్క పెరుగుదల తగ్గుతుంది. ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున డైమిథోయేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. మందు పిచికారీ చేసిన 15 రోజుల తర్వాత ఆకులు కోయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కార్బండజిమ్ కలిపి పిచికారీ చేయాలి.

ఆధారము: రైతు బ్లాగ్

3.00348432056
B.purusotham Jan 14, 2020 06:33 AM

Vitanalu akada sales చేయిస్తారు

ప్రవీణ్ May 26, 2018 06:12 PM

Sir, మా చెట్టు కు కాండాం యొక్క చర్మం పురుగు తిని వేస్తున్నాయి...కొమ్మలు ఎండి పోతుంది.....ఏమైనా ప్రకృతి సిద్ధంగా మందులు ఉన్నాయా

సురేంద్ర నాథ్ రెడ్డి గండ్ర Nov 28, 2017 08:26 PM

ఈ పంటను మనము ఎక్కడ అమ్ము కోయాలి , కొనుగోలు చేసే సంస్థలు చిరునామా తెలుపగలరు

venu Sep 14, 2015 11:40 AM

దీనికి మార్కెట్ ఎక్కడవుంటుంది , ప్రైస్ ఎలావుంటుంది

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు