పోషక విలువలు సమృద్ది గా, సమతుల్యత కలిగిన రసభరిత పచ్చని మొక్కలు, వాటి ఆకులను “ పచ్చి రొట్ట ఎరువులు” అంటారు.
పచ్చి రొట్ట ఎరువులను భూమికి రెండు విధాలుగా అందించవచ్చు
1. హరిత మొక్కల ఎరువులు (green manuring in-situ)
2.హరిత ఆకు ఎరువులు (green leaf manuring)
పొలంలో పంట లేనప్పుడు, లేదా రెండు పంటల మధ్య కాల వ్యవధిలో తక్కువ కాలం లో ఎక్కువ రొట్ట ఇచ్చే మొక్కలను పెంచి, వాటిని నేలలో కలియ దున్నడం ద్వారా నేలకు పోషకాలు అందించడం
హరిత మొక్కల పైరుకు ఉండవలసిన లక్షణాలు
- తక్కువ రోజుల్లో బాగా పెరిగి ఎక్కువ పచ్చి రొట్టను ఇచ్చేలా ఉండాలి.
- అన్ని రకాల నేలల్లో పెరగాలి
- పచ్చి రొట్ట లో పీచు శాతం తక్కువగా ఉంది ఎక్కువ ఆకు కలిగి రసభరితంగా ఉండాలి.
- నేలలో కలియదున్నినపుడు త్వరగా కుళ్ళి భూమిలో కలిసేటట్లు ఉండాలి.
- పచ్చి రొట్ట పంటల వేర్లు భూమిలో లోతుగా పోయేటట్లు ఉండాలి.
- త్వరగా పెరిగి కలుపు పెరుగుదలను అరికట్టేది గా ఉండాలి.
- పప్పు జాతికి చెందిన పచ్చి రొట్ట అయితే గాలిలో నత్రజనిని స్థిరీకరించి నేల సారాన్ని పెంచుతుంది.
పచ్చి రొట్ట ఎరువులకు వాడే మొక్కలు
- జనుము
- జీలుగ
- సీమ జీలుగ
- పిల్లి పెసర
- నీలి
- అడవి నీలి (వెంపలి)
హరిత మొక్కల ఎరువుల వల్ల లాభాలు
- నేల భౌతిక స్థితి (నేల ఆకృతి) మెరుగుపడి, భూమి గుల్లగా మారి నేలలోనికి నీరు ఇంకే గుణం పెరుగుతుంది.
- నేలలో సేంద్రియ పదార్ధం వేయడం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెంది , జీవ రసాయనిక చర్యల వలన నేల సారం పెరగడమే కాక, నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుని ఉత్పాదకత సామర్ద్యాన్ని పెంచుకుంటుంది.
- నేలలో క్లిష్ట (లభ్యం కాని) రూపం లో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపం లోకి మారుస్తాయి. (మినిరలైజేషన్)
- భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగపడతాయి.
- కలుపు మొక్కలు పెరగకుండా నివారించ వచ్చు.
- జీలుగ, సీమ జీలుగ వంటి హరిత పైరులు వేసినపుడు వాటి వ్రేళ్ళు ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల భూమి లోపలి పొరలలో నిక్షిప్తమైన అనేక పోషకాలను వెలికి తెచ్చి లభ్య రూపం లో పంటలకు అందిస్తాయి.
- పప్పు జాతి హరిత పంటల వలన రైజోబియం అనే బాక్టీరియా గాలిలో నత్రజనిని వ్రేళ్ళ బోడిపెలలో ఎకరానికి 25 నుండి 50 కిలోల నత్రజనిని స్థిరీకరిస్తాయి
- చౌడు భూముల పునరుద్ధరణకు ఉపయోగపడతాయి.(జీలుగ, సీమ జీలుగ)
- భాస్వరం, గంధకం వంటి పోషకాల లభ్యత గణనీయంగా ఉంటుంది.
- సూక్ష్మ పోషకాలను చిలేట్లు (chelated forms) గా మార్చి పంట మొక్కలకు అందేటట్లు చేస్తాయి.
- పచ్చి రొట్ట పైర్లు ఎరువులు గానే కాకుండా పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయి ఉదా: జనుము, పిల్లిపెసర
పచ్చి రొట్ట ఎరువుల సాగు లో అవరోధాలు
- పచ్చి రొట్ట ఎరువు వేసిన తర్వాత నేలలో వేసి కలియ దున్నడానికి సుమారు 60 రోజుల వ్యవది కావాలి. దీని వలన పంటల ప్రణాళిక వేసుకోవడం ఇబ్బందికరం గా ఉంటుంది.
- ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చి రొట్ట ని ఇవ్వాలంటే తేమ అవసరమవుతుంది. అన్ని ప్రాంతాలలో నీటి లభ్యత ఉండదు.
- పశు గ్రాస లక్షణాలు ఉన్న పచ్చి రొట్ట ఎరువులకు (జనుము , పిల్లి పెసర ) పశువుల బెడద ఎక్కువగా ఉంటుంది.
- వీటిని ఆశించే చీడ పీడలు తరువాత సాగు చేసే పంటకు నష్టం కలిగించ వచ్చు.
- పచ్చి రొట్ట విత్తనాల గిరాకీ ఎప్పుడూ ఒకేలాగ ఉండదు. అందువల్ల వర్తకులు వీటిని అందుబాటులో ఉంచడానికి ఇష్ట పడరు .
పచ్చి రొట్ట ఎరువుల సాగులో మెళకువలు
- ప్రధాన పంట కోయగానే నేలలో మిగిలిన తేమ ను సద్వినియోగ పరచుకొని పచ్చి రొట్ట ఎరువులు విత్తుకోవాలి. ( ఉదా: వరి కోసే ముందు జనుము లేదా పిల్లి పెసర జల్లి వెంటనే వరి కోస్తారు.)
- తేమ చాలని ప్రాంతాల్లో వేసవిలో దుక్కి దున్ని తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి(వరి సాగు చేయు ప్రాంతాల్లో)
- నీటి వసతిగల ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం లాభదాయకం.
- వరి చెరకు పంటల సరళిలో రెండు పంటల మధ్య కాల వ్యవధిలో విత్తుకొని కలియ దున్నవచ్చు (చెరకు -ఫిబ్రవరి, వరి- జూన్)
- పసుపు, కంద, చెరకు వంటి పంటల వరుసల మధ్య పచ్చి రొట్ట పెంచి పూత సమయం లో కలియ దున్నవచ్చు.
సాధారణం గా పచ్చి రొట్ట పైర్లు చల్లుకునేటప్పుడు అధిక మోతాదు విత్తనం ఉపయోగించిన మొక్కలు తక్కువ ఎత్తు పెరిగి రసవంతం గా ఉంటాయి. లేనిచో జీలుగ వంటి పచ్చి రొట్ట ఎరువులు మొక్క ఎత్తు పెరిగి కాండం లో పీచు ఏర్పడి చివకడానికి ఎక్కువ సమయం తీసుకొంటుంది.
పచ్చి రొట్ట పంటల గుణ గణాలు
జీలుగ, సీమ జీలుగ
క్షార గుణం గల భూములు అంటే చౌడు భూముల్లో, వరి పండించే భూముల్లో వేస్తారు. ఎకరానికి 10 నుండి 12 కిలోల విత్తనం ఇసుక తో కలిపి చల్లడం వల్ల పొలం అంతా సమంగా పడుతుంది. దీనిని పూతదశలో కలియ దున్నడం వలన ఎకరానికి 9 నుండి 10 టన్నుల పచ్చి రొట్ట లభిస్తుంది
కట్టె జనుము
అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. పచ్చి రొట్ట గా, పశువుల మేతగా ఉపయోగించ వచ్చు. ఎకరానికి 12 నుండి 15 కిలోల విత్తనం చల్లుకోవాలి. ఎకరానికి 5 నుండి 6 టన్నుల పచ్చి రొట్ట లభిస్తుంది
పిల్లి పెసర
దీనిని తేలిక మరియు బరువైన నేలల్లో సాగు చేయవచ్చు. చౌడు భూముల్లో సాగుకు పనికి రాదు. ఎకరానికి 6 నుండి 8 కిలోల విత్తనం అవసరం. ఎకరానికి 3 నుండి 4 టన్నుల పచ్చి రొట్ట లభిస్తుంది
నీలి, వెంపలి
ఇవి చాలా ప్రదేశాల్లో కలుపు మొక్కలుగా కనపడతాయి. వీటిని పచ్చి రొట్ట ఎరువులు గా వాడుకోవచ్చు . ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనం సరిపోతుంది. అన్ని రకాల నేలల్లో వేసుకోవచ్చు
పచ్చి రొట్ట ఎరువులు ఏ సమయం లో కలియదున్నాలి?
పూత దశకు రాగానే నేలలో కలియ దున్నిన అత్యధిక పరిమాణాలలో నేలకు పోషకాలు అందుతాయి
ఆదారము : పోర్టల్ విషయ రచన సభ్యులు