పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వేసవి పంటలతో మంచి ఆదాయం

వేసవిలో తీగ,దుంపజాతి మరియు ఆకుకూర పంటలసాగు

ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వేసవిలో వీచే పొడి గాలులు, పెరిగే ఉష్ణోగ్రతలు, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. దీని వల్ల దిగుబడులు తగ్గి రాబోయే కాలంలో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నీటి వసతి ఉన్న రైతులు వేసవి సీజన్‌లో కూరగాయ పంటలు సాగు చేసి మంచి ఆదాయం పొందవచ్చునని నల్లగొండ ప్రాంతీయ ఉద్యానవన శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి సూచిస్తున్నారు. ఆ వివరాలు..

ఈ పంటలు వేసుకోవచ్చు

వేసవిలో తీగ జాతి కూరగాయలైన కాకర, బీర, బెండ, ఆనప, దోస, దొండ, పొట్ల, దుం ప జాతి కూరగాయలైన చేమ, కంద, ముల్లంగితో పాటు టమాటా, ఆకుకూర పంటల్ని వేసుకోవచ్చు. సాధారణంగా వర్షాకాలంలో పండించే వంగ, గోరుచిక్కుడు, బెండ, మిరప వంటి పంటల్ని కూడా సాగు చేసుకోవచ్చు. వ్యవసాయాధికారులు, ఉద్యాన అధికారుల సూచనల మేరకు ఆయా ప్రాంతాలకు అనువైన రకాల్ని ఎంపిక చేసుకోవాలి.

ఇలా వేసుకోవాలి

వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉం టాయి. ఎండ వేడికి నారు వడలి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మొక్కల్ని సాధ్యమైనంత వరకూ సాయంకాలం వేళ నాటుకోవాలి. విత్తనాలు నేరుగా విత్తేటట్లయితే విత్తిన వెంటనే నీరు కట్టి, ఆ తర్వాత విత్తనాలు మొలకెత్తే వరకూ మూడు నాలుగు రోజులకు ఒకసారి తడి అందించాలి. వేసవిలో మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది. కనుక విత్తనాల్ని దగ్గర దగ్గరగా వేసుకోవాలి.

టమాటా వేసే వారు వరుసలు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల చొప్పున దూరాన్ని పాటించాలి. ఎకరానికి 250 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. వంగ వేసే వారు వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం (ఎకరానికి 350 గ్రాముల విత్తనాలు) ఉండేలా నాటాలి. బెండ వేయాలనుకుంటే 45-20 సెంటీమీటర్లు (ఎకరానికి ఆరు కిలోల విత్తనాలు), పచ్చి మిరపకు 45-45 సెంటీమీటర్లు (600 గ్రాములు), గోరుచిక్కుడుకు 50-20 సెంటీమీటర్లు (నాలుగు కిలోలు), బీర, దోసకు 100-50 సెంటీమీటర్లు (బీర అయితే రెండు కిలోలు, దోస అయితే 1.5 కిలోలు), కాకరకు 150-50 సెంటీమీటర్ల (రెండు కిలోల విత్తనాలు) దూరాన్ని పాటించాలి. ఆనప వేసే వారు వరుసల మధ్య 300 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 100 సెంటీమీటర్ల దూరం ఉండేలా (ఎకరానికి 2.5-3.0 కిలోల విత్తనాలు) మొక్కలు నాటుకోవాలి.

బిందుసేద్యం-మల్చింగ్ మేలు

వేసవి కూరగాయ పంటలకు బిందుసేద్యం ద్వారా నీరందిస్తే మంచిది. దీనివల్ల ప్రతి రోజూ అవసరమైన మేరకు నీటిని అందించవచ్చు. మామూలు పద్ధతిలో అయితే అయిదు నుండి ఏడు రోజుల వ్యవధి ఇస్తూ నీటి తడులు ఇవ్వాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకునేందుకు వీలుగా కూరగాయ పంటల సాళ్లలో ప్లాస్టిక్ షీట్లు కప్పాలి. దీనివల్ల భూమి వేడెక్కదు. భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కలుపు మొక్కలు పెరిగే అవకాశం కూడా ఉండదు. డ్రిప్ లాటరల్ పైపుల్ని షీట్ల కింద ఏర్పాటు చేసుకోవాలి. టమాటా పంటను షేడ్‌నెట్ కింద పండించడం మంచిది.

ఫర్టిగేషన్ ద్వారా ఎరువులు:

ఫర్టిగేషన్ (నీటిని అందించే పైపుల ద్వారా) పద్ధతిలో ఎరువుల్ని అందిస్తే మొక్కలు క్రమ పద్ధతిలో, ఏపుగా పెరుగుతాయి. సాధారణ పద్ధతిలో అయితే మొక్కల మొదళ్ల దగ్గర ఎరువు వేసినప్పుడు తగినంత నీటిని అందించాల్సి ఉంటుంది. లేకుంటే మొక్కలు మాడిపోతాయి. స్థానిక వ్యవసాయాధికారుల సలహా మేరకు ఎరువులు వేసుకోవాలి.

పూత-పిందె రాలకుండా...

వేసవి కూరగాయ పంటల్లో పూత, పిందె రాలకుండా ఉండాలంటే వ్యవసాయాధికారుల సూచనల మేరకు హార్మోన్ మందుల్ని పిచికారీ చేసుకోవాలి. లీటరు నీటికి మూడు గ్రాముల బోరాక్స్ కలిపి (ఎకరానికి 200-250 లీటర్ల ద్రావణం) పిచికారీ చేస్తే కాయలు పగలకుండా ఉంటాయి. ఆకులు పల్లాకు రంగులోకి మారితే లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి.

ఉద్యానవన శాఖ సబ్సిడీ

ఉద్యానవన శాఖ వేసవిలో 50 శాతం సబ్సిడీపై రైతు కోరుకున్న బ్రాండెడ్ కంపెనీల విత్తనాల్ని పంపిణీ చేస్తోంది. అలాగే మల్చింగ్‌కు వాడే ప్లాస్టిక్ షీట్ల కొనుగోలుకు కూడా యాభై శాతం సబ్సిడీతో ఎకరానికి నాలుగు వేల రూపాయలు అందిస్తోంది. తీగ జాతి కూరగాయల సాగుకు ఎకరం భూమిలో పందిళ్లు వేసుకొంటే 50 శాతం సబ్సిడీ కింద 60 వేల రూపాయలు అందిస్తోంది.

చీడపీడల నివారణ కోసం...

వేసవిలో కూరగాయ పంటల్ని వివిధ రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. పంట కోత దశలో ఉన్నప్పుడు పురుగు మందుల్ని విచక్షణారహితంగా వాడకూడ దు. సిఫార్సు చేసిన మోతాదులోనే పిచికారీ చేయాలి. బెండలో ఎర్రనల్లి నివారణకు లీట రు నీటికి అయిదు మిల్లీలీటర్ల చొప్పున డైకోఫాల్ కలిపి పిచికారీ చేయాలి. వంగ, బెండ పంటల్లో పచ్చదోమ, తెల్లదోమ నివారణకు లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున మెటాసిస్టాక్/డైమిథోయేట్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. సొర, బీర, దొండ, దోస జాతి కూరగాయల్లో కాయ తొలుచు పురుగుల నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము కార్బరిల్ + రెండు మిల్లీలీటర్ల ఎండోసల్ఫాన్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

ఆధారము: రైతు బ్లాగ్

3.00686498856
వంకుడొత్ కేశవరావు Jun 11, 2018 12:34 PM

మొక్క జొన్న లోని మెలకువలు మరియు జిడిమొక్కల పెంపకం గురించి వివరాలు మరియు టేకు మొక్కలు ను ఉద్యానవన శాఖ ద్వారా తీసుకున్నాం వాటికి జాగ్రత్తగా పెంచుతున్నాము వాటికి డబ్బులు వస్తాయన్నారు రావడంలేదు ఏంచేయాలి ఎలా సార్

Anonymous Jul 21, 2017 07:58 PM

బెండా మరియు వంగ మిరప
మంచి సరయన విత్తనాలు సూచిండి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు