పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సుబాబుల్ పెంపకం

సుబాబుల్ సాగువిధానము సస్యరక్షణ

సుబాబుల్

సుబాబుల్ వృక్ష శాస్త్రీయ నామం Leucaena leucocephala. చిన్న మిమొసాయిడ్ చెట్టు రకానికి చెందిన దీని మూలాలు దక్షిణ మెక్సికో మరియు ఉత్తర మధ్య అమెరికా (బెలిజ్ మరియు గ్వాటెమాల) కు సంబంధించినవి. కానీ ఈ చెట్టు ఇప్పుడు అన్ని ఉష్ణమండల ప్రాంతాలలో సహజసిద్ధంగా పెరుగుతుంది. దీనిని ఆంగ్లంలో white leadtree, jumbay, and white popinac అంటారు. ఈ పేర్లను తెలుపు రంగు తల అనే అర్థాల నిచ్చే గ్రీకు పదాల నుండి స్వీకరించారు. ఈ చెట్టుకి పూసే పువ్వులు తెల్లని కేశరములతో తల వలె గుండ్రంగా ఉంటాయి. దీనిని వంటచెరకుగా, నారగా మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు. ఇది అతిత్వరగా పెరిగే బహువార్షిక మొక్క. దీనికలప పనిముట్లకు మరియు కాగితపు గుజ్జు లాంటి అవసరాలను తీర్చగలదు. విత్తనాలలో 24 శాతం మాంసకృత్తులు కల్గి ఉంటాయి. విత్తనాలు సులభంగా మొలకెత్తుతాయి. వర్షాభావ పరిస్థితుల్లో కూడా బాగా పెరుగుతుంది. గాలిలో ఉన్న నత్రజనిని ఉపయోగించుకునే శక్తిగల బాక్టీరియాను వేరుబుడిపెలందు కలిగి ఉంటుంది. ఎక్కువసార్లు పిలకపంట తీసుకోవచ్చు. ఉష్ణమండలాల్లో బాగా పెరుగుతుంది. వర్షపాతం 600-1700 మీ.మీ. ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది.

నేలలు

అన్నిరకాల తటస్థ నేలల్లో పెరుగుతుంది. క్షార మరియు ఆమ్ల నేలల్లో పెరగదు. లోతైన, సారవంతమైన మరియు ఎక్కువ తేమ లభ్యమయ్యే నేలలు అనుకూలమైనవి. బంజరు భూముల్లోను, చెరువు గట్లపైన, పశువుల తాకిడి లేని కాలువ గట్లపైన, పొలాల గట్లపైన పెంచవచ్చు. అటవీ వ్యవసాయంగా పంటపొలాల్లో కూడా పెంచవచ్చు.

నారు మొక్కల పెంపకం

రెండు సంవత్సరములు ఆపై బడిన చెట్ల నుండి విత్తనాలను సేకరించాలి. ఒక కిలోకు 16వేల నుండి 20వేల విత్తనాలుంటాయి. విత్తన శుద్ధికి గాను ఈ విత్తనాలను సుమారు 30 డిగ్రీల సెల్సియస్ వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచి, తీసిన విత్తనాన్ని చల్లని నీటిలో 12 గంటలు నానబెట్టి విత్తుకోవాలి. విత్తన శుద్ధి తర్వాత నారుమళ్ళలో నేరుగా విత్తడానికి వరుసల మధ్య 20 సెంటీమీటర్ల వరుసలో 4 సెంటీమీటర్ల దూరంలో 1.5 సెంటీమీటర్ల లోతుగా విత్తనాలు విత్తుకోవచ్చు. లేదా 22 * 10 సెంటీమీటర్ల పాలిథీన్ సంచుల్లో పేడ, ఎరువులను కలిపిన మట్టిని నింపి ఒక సంచికి 2 విత్తనాలు చొప్పున విత్తుకోవాలి. ఈ విత్తనాలను మార్చి, ఏప్రిల్‍లో విత్తినట్లయితే జూలైకల్లా మొక్కలు నాటటానికి తయారవుతాయి.

నాటే పద్ధతి

వేసవిలో 30 * 30 * 45 ఘ.సెం.మీ. పరిమాణం గల గుంతలను త్రవ్వితే నేల గుల్లబారి మొక్క నాటటానికి అనువుగా ఉంటుంది. వర్షాకాల ప్రారంభంలోనే మట్టి నింపిన గుంతల్లోను, సంచుల్లోను మొక్కలను నాటాలి. మొక్కల మధ్య దూరం 2 * 2 మీటర్లు గాని, 2 * 3 మీటర్లు గాని ఉంచాలి. ఎకరాకు 666 నుండి 1000 మొక్కల వరకు నాటుకోవచ్చు.

అంతర కృషి

మొదటి సంవత్సరం మొక్కల మధ్య అంతర సాగు చేయాలి.

అంతర పంటలు

మొదటి సంవత్సరం పప్పుదినుసు జాతి పైర్లను లాభసాటిగా పెంచుకోవచ్చు. రెండవ సంవత్సరం నుండి పశుగ్రాస పైర్లను పెంచుకోవచ్చు.

యాజమాన్య పద్ధతులు

కలుపు నివారణ మొదటి 2 సంవత్సరముల వరకు చేయాలి. అవసరాన్ని బట్టి 2 నుంచి 5 సంవత్సరాల మధ్య చెట్లను నరకవచ్చు. వంటచెరుకు కయితే 2 నుంచి 3 సంవత్సరముల మధ్య నరకవచ్చు. పశుగ్రాసానికయితే ప్రతి 2 నుంచి 3 నెలలకు 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తులో నరకాలి. కాగితపు గుజ్జుకయితే 4 నుంచి 5 సంవత్సరముల మధ్య నరకవచ్చు. చెట్ల ప్రక్క కొమ్మలను ఎప్పటికప్పుడు నరికి చెట్లు ఎత్తుగా పెరిగేటట్లు చేస్తే 10 నుంచి 15 సంవత్సరముల వరకు కలప ఉత్పత్తి అవుతుంది.

దిగుబడి

సుబాబుల్ 6 సంవత్సరములలో 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వర్షాధార ప్రాంతాల్లో సాధారణంగా కలప దిగుబడి ఎకరాకు సంవత్సరానికి 4 నుంచి 8 ఘ.మీ. వస్తుంది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో 2 నుంచి 3 రెట్లు అధికంగా కలప దిగుబడి వస్తుంది. పశుగ్రాసం ఎకరాకు వర్షాధార ప్రాంతాల్లో 5 నుంచి 10 టన్నులు, నీటివసతి ఉన్న ప్రాంతాల్లో 32 నుంచి 36 టన్నులు వస్తుంది.

లాభాలు

కలప గట్టిగా, నాణ్యంగా ఉంటుంది. భవన నిర్మాణానికి, ఫర్నీచర్ తయారీకి ఉపయోగపడుతుంది. గుంజలు, కంచె స్థంభాలుగా ఉపయోగపడతాయి.

పశువుల మేత, వంట చెరకు

కొమ్మలు వంటచెరుకుగా పనికివస్తాయి. ఆకులు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి. మొక్కలను 8 మీటర్ల ఎడంగా రెండు ఉమ్మడి వరుసల్లో (వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు) నాటి, వాటిని భూమి నుండి 30 సెంటీమీటర్ల ఎత్తుకు కొస్తే ఎకరాకు 0.8 టన్నుల వరకు ఎండుమేత, అర టన్ను వంట చెరుకు లభిస్తాయి.

పచ్చి రొట్ట

సుబాబుల్‍ను పచ్చిరొట్టగా ఉపయోగిస్తే ఖరీదైన నత్రజని ఎరువులపై ఆధారపడటం తగ్గించవచ్చు. పచ్చిరొట్టగా ఉపయోగిస్తే ఎకరాకు 8 నుంచి 12 కిలోల నత్రజని లభిస్తుంది. అంతరపంటగా నత్రజని అవసరాన్ని 50 శాతం తగ్గించవచ్చు.

కాగితం గుజ్జు

కాగితం తయారీకి కావలసిన శ్రేష్ఠమైన గుజ్జు సుబాబుల్ నుండి లభిస్తుంది.

సమస్యలు - పరిష్కారం

పశుగ్రాసానికి పనికి వస్తుంది కనుక మొదటి సంవత్సరంలో మొక్కలను పశువులు, మేకల బారి నుండి కాపాడాలి. లేత ఆకుల్లో మైమోసిన్ అనేది ఎక్కువగా ఉండటం వలన సుబాబుల్ అకులను వేరే పశుగ్రాసంతో కలిపి మేపుకోవాలి. ఈ చెట్లకు సహజ పునరుత్పత్తి ఎక్కువగా ఉండటం వలన చివరకు కలుపు మొక్కలుగా మిగలవచ్చు. దీన్ని నివారించడానికి తరచు అంతరకృషి చేయాలి.

ఆధారము: వికిపీడియా

3.00173010381
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు