నాడెప్ కంపోస్టు నారాయణ దియోరావ్ పండరిపాండే పేరు మీద వచ్చినది. ఈ నాడెప్ కంపోస్టు తయారీవలన వ్యవసాయ వ్యర్థపదార్థములన్ని ఉపయోగకరమైన కంపోస్టుగా తయారగుటే గాక గ్రామ పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి.
ఈ నాడేప్ పద్దతి ఒక్కటే గాలి తగులు పధ్ధతిలో (Aerobic) ఈ వ్యర్థపదార్థముల తయరయ్యే కంపోస్టు ఇది సాధారణ కంపోస్టుకంటే మూడింతలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.
కావలసిన పదార్థములు
నాడెప్ కంపోస్టు గుంత
4.5 x 1.5x1.05 మీటర్లు
వ్యవసాయ వ్యర్థ పదార్థములు
1500 కిలోలు
ఆవు పేడ
8 – 10 తట్టలు
మట్టి
120 తట్టలు
నీరు
1500 – 2000 లీటర్లు
నాడెప్ గుంత తయారీ:
ముందుగా గుంతకు ఎంచుకున్న స్థలము కొంచెము మెరక ప్రదేశములో నీరు నిల్వ ఉండకుండ ఉండేలా చూడాలి.
ఇటుకలు, మట్టి, సిమెంటుతో 4.5 మీ పొడవు, 1.5 మీ వెడల్పు 1.05 మీ ఎత్తుగల గుంతను నిర్మించాలి.
గుంతను కట్టునపుడు సరిపడినన్ని 12.5x10సెం.మీ పరిమాణము గల రంధ్రములను గోడలలో ఉండేలా కట్టాలి.
గోడల క్రింద వరుసలన్నీ మట్టితో కట్టాలి.
పైన రెండు వరుసలు మాత్రము సిమెంటుతో కట్టాలి.
గుంతను నింపుట:
చిక్కని ఆవుపేడ కలిపిన నీళ్ళను గుంత లోపలి గోడలకు, గుంత అడుగు భాగములోను చల్లాలి.
చిన్నగా కత్తిరించిన వ్యర్థ పదార్థములు, ఆకులు, గడ్డి, వేళ్ళు మరియు ఇతర వ్యవసాయ మిగులు పదార్థములతో 15 సెం.మీ. ఎత్తులో గుంతలో ఒక పొరలాగా వేయాలి. (ప్లాస్టిక్ , గాజు, రాళ్ళు, రేకులు, రబ్బరు లేకుండా చూడాలి).
4 కిలోల ఆవుపేడను 125 లీటర్ల నీటితో కలిపి ‘ఎ’ పొరమీద చల్లాలి లేదా గోబర్ గ్యాస్ నుండి వచ్చు పేడను (Slurry) కూడా వాడవచ్చు.
50 నుండి 60 కిలోలు ఎండబెట్టి జల్లించిన మట్టిని ‘బి’ పొరమీద వేయాలి.
పైన చెప్పిన ఎ,బి,సిపొరలన్నీ కలిపి ఒక యూనిట్ అవుతుంది.
అలాంటి యూనిట్ లతో గుంత అంచుల పైకి 50 సెం.మీ.ఎత్తు వచ్చువరకు వేస్తూపోవాలి.
ఈ గుంతను 24-48 గంటల లోపు ఒకే దఫాలో నింపాలి. లేనిచో కంపోస్టులో నాణ్యత లోపిస్తుంది.