హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / మొక్కజొన్నలో హైబ్రిడ్ విత్తనోత్పత్తి
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మొక్కజొన్నలో హైబ్రిడ్ విత్తనోత్పత్తి

మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనోత్పత్తి విధానము

mokkajonnaభారతదేశంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 9.30 మిలియన్ల హెక్టార్లు, దీని ఉత్పత్తి 28.70 మిలియన్ టన్నులు. సరాసరి దిగుబడి ఒక హెక్షారుకు 2557 కిలోలు (2015-16). మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఈ పంట విస్తీర్ణం సుమారు 8 లక్షల హెక్టార్లు, మన దేశంలో సగటున 40-50 శాతం మొక్క జొన్న విస్తీర్ణంలో మాత్రమే హైబ్రిడ్ రకాలను సాగు చేస్తున్నారు. మిగతా విస్తీర్ణంలో కాంపోజిట్ మిశ్రమ రకాలు, స్థానిక రకాలను సాగు చేస్తున్నారు. మన రాష్ట్రాలలో మాత్రం పూర్తి విస్తీర్ణంలో హైబ్రిడ్ రకాలే సాగులో ఉన్నాయి. హైబ్రిడ్ రకాలు కాంపోజిట్ రకాలకన్నా 30-40 శాతం అధిక దిగుబడి నివ్వడమే కాక చీడపీడలను తట్టుకొనే శక్తి కలిగి ఉంటాయి. ఒకేసారి కోతకు వస్తాయి.

దేశంలోని మొత్తం మొక్కజొన్న విస్తీర్ణంలో సాగు చేయడానికి సుమారు రెండు లక్షల టన్నులు హైబ్రిడ్ విత్తనాలు అవసరమవుతాయి. ప్రస్తుతం మన దేశ అవసరాల కొరకు సరిపడే 8 లక్షల క్వింటాళ్ళ హైబ్రిడ్ విత్తనానికై వివిధ విత్తన కంపెనీలు ముఖ్యంగా మన రాష్ట్రంలో, కర్ణాటకలో విత్తనోత్పత్తిని చేపడుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపు 40,000 హెక్టార్లలో రబీలో విత్తనోత్పత్తి చేపడుతున్నారు. మన రాష్ట్రాలలో మొక్కజొన్న విత్తనోత్పత్తి అధిక విస్తీర్ణంలో చేపట్టడానికి ఈ కింది కారణాలు పేర్కొనవచ్చు.

 • తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరం వివిధ విత్తన కంపెనీలకు నిలయంగా ఉంది.
 • తెలుగు రాష్ట్ర వాతావరణ పరిస్థితులు విత్తనోత్పత్తికి అత్యంత అనుకూలంగా ఉన్నాయి.
 • విత్తనోత్పత్తిలో తెలుగు రాష్ట్రాల రైతులు అనుభవం కలిగి ఉన్నారు.
 • విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి.
 • నీటి వసతి కలిగిన భూములు ఉన్నాయి.

గడిచిన దశాబ్ద కాలం నుండి మన దేశంలో ఏక సంకరణ హైబ్రిడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో మొక్కజొన్న హైబ్రిడ్ల సాగు విస్తీర్ణంలో ఏక సంకరణ హైబ్రిడ్లు 20-30 శాతం సాగు చేస్తున్నారు. మున్ముందు ఈ విస్తీర్ణం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే భవిష్యత్తులో 100 శాతం విత్తన మార్పిడి రేటుతో (100 ఎస్.ఆర్.ఆర్) భారతదేశంలోని 100 శాతం మొక్కజొన్న విస్తీర్ణతలో హైబ్రిడ్లను సాగు చేయవలసిన అవసరం ఉంది.

మొక్కజొన్న విత్తనోత్పత్తిలో ఇతర మొక్కజొన్న పంటల నుండి అంతర దూరం / అంతర సమయం పాటించుట మగ, అడ వరుసల సరైన నిష్పత్తిని ఖచ్చితంగా పాటించడం, సమకాలీకరణం, కేబీలు / బెరుకులు తీసివేయడం, ఆడ వరుసలలోని జల్లులను (డీటాసలింగ్) తీసివేయడం చాలా ముఖ్యమైన ప్రక్రియలు.

కేళీలు / బెరకులు తీసివేయటం

 • మొక్కజొన్నలో అధికంగా పరపరాగ సంపర్కం జరుగుతుంది కనుక పరాగ సంపర్కం జరగడానికి ముందుగానే వేరే మొక్కలను (బెరకులను) గుర్తించి తీసివేయాలి.
 • ఈ ప్రక్రియ ఆడ, మగ వరుసలు రెండింటిలోను సమర్థవంతంగా చేపట్టాలి.
 • శాఖీయ దశలో మొక్కల ఎత్తు, కాండం రంగు, ఆకుల లక్షణాలు, ధృఢత్వం మొదలైన వాటిని గమనించి, పూత ప్రారంభదశలలో జల్లు, మగ పుష్పాల లక్షణాలను గమనించి కేబీలను తీసివేయాలి.
 • పూత వచ్చి పరపరాగ సంపర్కం జరిగిన తర్వాత మగ వరుసలలోని మొక్కలను పూర్తిగా తీసివేస్తే ఆడ వరుసలలోని మొక్కలకు గాలి వెలుతురు, అధిక పోషకాలు అంది విత్తన దిగుబడులు పెరుగుతాయి.

డీటాసిలింగ్ / ఆడ వరుసలలో మగ పుష్పగుచ్చాలను (జల్లులను) తీసివేయడం

 • మొక్కజొన్న విత్తనోత్పత్తిలో ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. దీనినే డీటాసిలింగ్ అంటారు. ఆడ వరుసలలో ఉన్న ప్రతి మొక్కలోని మగ పుష్పగుచ్చాన్ని మొవ్వ నుండి బయటికి వచ్చిన వెంటనే సంపూర్ణంగా తీసివేయాలి.
 • ఎడమ చేతితో పొట్ట ఆకు (బూట్ లీఫ్) కింది భాగంలో కాండాన్ని కుదురుగా కుడిచేతితో జల్లు మొత్తాన్ని బిగించి ఉదుటుగా ఒకేసారి జల్లు మొత్తం బయటికి వచ్చేలా లాగాలి.
 • ఈ ప్రక్రియలో ఆకులు విరచటం, ఆకులు, కాండం నష్ట పరచటం చేయరాదు. జల్లు పూర్తి భాగాన్ని తీసివేయాలి.
 • ప్రతి మొక్క ప్రతి వరుసలలో ఈ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలి.
 • ఈ ప్రక్రియకు సుమారు 10 నుండి 15 రోజుల సమయం పట్టవచ్చు. ఇలా తీసివేసిన జల్లులను పశువులకు మేతగా కూడా వాడవచ్చు.
 • ఈ ప్రక్రియను మగ వరుసలలో ఎట్టి వరిస్థితులలోను పొరపాటున కూడా చేయకూడదు.
 • అందుకై మగ వరుసలను వెదురు బద్ద /కర్రలను నాటి గుర్తు పెట్టుకోవాలి.

పంట కోత

పంట పక్వ దశను (కండెపై పొరలు ఎండడం, గింజ గట్టిపడుట, గింజ అడుగు భాగంలో నల్లని చార ఏర్పడటం) గమనించి కండెల కోతకు చేపట్టాలి. ముందుగా మగ వరుసలలోని కండెలను కోసి, వేరుగా ఉంచి తర్వాత మగ వరుసలలోని చొప్పను కూడా కోయాలి. మగ కండెల కోత అయిన 2-3 రోజుల తర్వాత ఆడ వరుసలలోని కండెలను గమనించి గింజలలో 20-25 శాతం తేమ ఉన్నప్పుడు కోసి, నీడలో ఆరబెట్టాలి. తెగులు సోకిన, విత్తన కండెలకు భిన్న లక్షణాలు కలిగిన కండెలను ఏరి వేయాలి. కండెలు బాగా ఎండి గింజలలో తేమ 15శాతం ఉన్నప్పుడు నూర్పిడి చేయాలి. తదుపరి విత్తనాలను 12 శాతం వచ్చే వరకు ఎండనివ్వాలి.

గ్రేడింగ్, ప్యాకింగ్

గింజలను ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా పరిమాణాన్ని బట్టి గ్రేడింగ్ చేసి శుభ్రమైన సంచులలో ప్యాకింగ్ చేసుకోవాలి. నిల్వ చేయడం మంచి గాలి, వెలుతురు, అనువైన ఉష్ణోగ్రత గల ప్రాంతాలలో విత్తనం నిల్వ చేసుకోవాలి. నిల్వలో గింజలకు తేమ తగలకుండా, ఎలుకలు, పురుగులు, శిలీంద్రాలు మొదలగునవి ఆశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన చర్యలు చేపట్టినట్లయితే విత్తన నాణ్యత, మొలకెత్తే శాతం తగ్గకుండా జాగ్రత్త పడవచ్చు.

ఈ విధంగా మొక్కజొన్న విత్తనోత్పత్తిలో మెళకువలను శాస్రవేత్తల సలహాలు, సూచనలను పాటించినట్లయితే ఆశించిన మేరకు అధిక దిగుబడులను పొంది నికర ఆదాయం సాధించవచ్చు.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

2.99270072993
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు