অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వరి విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వరి విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పెరుగుతున్న దేశ జనాభా ఒకవైపు, తరుగుతున్న సహజ వనరులు మరో వైపు ఇలాంటి పరిస్థితుల్లో ఆహార భద్రతను, కల్పించాలంటే ప్రస్తుతం ఉన్న సగటు ఉత్పాదకతను అధికం చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో వరి ప్రధాన ఆహార పంట. మన దేశంలో 58 శాతం వరి నీటి పారుదల కింద సాగవుతుంది. వరి సాగవుతున్న భూమిలోను, ఉత్పత్తిలోను అగ్రస్థానంలో ఉంది. 42.41 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో 35.29 శాతాన్ని అక్రమిస్తోందని అంచనాలు తెలుపుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రం వరి ఉత్పత్తి చేయడంలో ముఖ్యభూమిక పోషిస్తోంది. 20.08 లక్షల హెక్టార్లలో సాగవుతూ 66.31 లక్షల టన్నుల (2013-14) ఉత్పత్తి అవుతుంది. హెక్టారుకు 3.8 టన్నుల ఉత్పాదకతతో పంజాబ్ తర్వాత 2వ స్థానంలో ఉంది.

వరి దిగుబడిని ప్రభావితం చేసే వివిధ అంశాల్లో మొదటిది. నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించడం, నాణ్యమైన విత్తనం అంటే కనీసం ప్రమాణాలను అనుసరించి, అధిక జన్యు స్వచ్ఛత, అధిక మొలకశాతం, అతి తక్కువ జడ పదార్థం, తక్కువ సంఖ్యలో కలుపు ఇతర పంటల విత్తనాలను కలిగి తెగుళ్ళ బారిన పడనటువంటి విత్తనం. నాణ్యత లేని విత్తనాలు వాడటం వల్ల బెరుకుటు రావడం, చీడపీడలు ఆశించడం, పంట దిగుబడిలో నాణ్యత లేకపోవడం, దిగుబడి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కాబట్టి విత్తనోత్పత్తి కలీల నుండి నివారించి జన్యు స్వచ్ఛతను కాపాడటం ద్వారా నాణ్యమైన విత్తనాన్ని పొందుటకు రైతులు కొన్ని మెళకువలు పాటించాలి.

సాధారంగా గింజ గట్టిపడే దశలో పొడి వాతావరణం ఉండే ప్రదేశాలలో విత్తనోత్పత్తికి చాలా అనుకూలం. అందువలన రబీ పంటకాలంలో పండించిన విత్తనాలకు నాణ్యత బాగా ఉంటుంది. వరి స్వపరాగసంపర్కం సిద్ధించుకునే మొక్క కాబట్టి చాలా తక్కువ శ్రమతో నాణ్యమైన విత్తనాన్ని పండించుకునే వీలుంది. ఈ విధంగా పండించిన విత్తనాలను తమ పంటకు వాడుకోవడమే కాకుండా ఇతర రైతులకు కూడా అందించి నాణ్యమైన పంటకు తద్వారా అధిక దిగుబడులకు దోహదపడవచ్చు.

వరి విత్తనోత్పత్తిలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు

విత్తనోత్పత్తికి పొలాన్ని ఎన్నుకోవడం

  • విత్తనోత్పత్తి సారవంతమైన, మంచి నీటి వసతి ఉన్న పొలాల్లోనే చేపట్టాలి. లేనిచో విత్తన నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది.
  • సాధారణంగా అంతకు ముందు పంటకాలంలో వరి పంటను పండించని పొలాన్ని ఎన్నుకోవాలి. ఎందుకంటే ఆ పంట నుండి రాలి మొలచిన మొక్కలతో విత్తనపు పంటలో బెరకులు వచ్చి విత్తనం స్వచ్చత కోల్పోతుంది.
  • విత్తనోత్పత్తి చేపట్టే పొలం చుటూ అదే పంటకి చెందిన వేరే రకం ఉంటే కనీసం 3 మీటర్ల దూరం పాటించాలి. ఇలా ఉండడం వల్ల ఇతర వరి రకాల పుప్పొడి విత్తనోత్పత్తి పంటపై పడి జన్యు స్వచ్చత పాడవకుండా ఉంటుంది.

విత్తనం

పండించాలనుకున్న వరి రకం నాణ్యమైన బ్రీడరు లేదా ఫౌండేషన్ విత్తనాన్ని ఏదైన పరిశోధన స్థానం నుండి లేదా ధృవీకరించిన సంస్థ ద్వారా సేకరించాలి.

విత్తన మోతాదు

ఎకరాకు సన్నగింజ రకాలైతే 6 కిలోలు, దొడుగింజ రకాలకు 10 కిలోలు సరిపోతుంది. సేకరించిన విత్తనాలను మంచినీటితో బాగా కడిగి విత్తుకోవాలి.

విత్తనశుద్ధి

విత్తనాలను తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. 1 కిలో విత్తనానికి 3 గ్రా. కార్భండిజమ్ మందును కలుపుకోవాలి. లేదా దుంవ నారుమళ్ళయితే 1 లీటరు నీటికి 1 గ్రా. కార్భండిజమ్ కలిపిన నీటిలో 24 గంటలు నానబెట్టి, మండెకట్టి నారుమడిలో వేసుకోవాలి.

నారుమడి తయారీ

నారుమడిని పోసేటప్పుడు నేలను బాగా దున్ని కలుపు లేకుండా చేసి, నారు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.

నారుమడిలో పశువుల ఎరువు, పచ్చిరొట్ట పైర్లు పెంచి భూమిలో కలియదున్నాలి. దుక్కిలో సిఫారుసు చేసిన నత్రజనిలో సగం, మొత్తం భాస్వరం, పొటాష్లను వేసిన తరువాత రెండో సగం నత్రజనిని 12-15 రోజుల మధ్య పైపాటుగా వేయాలి.

విత్తడం

  • మొలకెత్తిన విత్తనాలను పలుచగా (1 సెంటుకు 4 కిలోల చొప్పున) సమానంగా చల్లుకోవాలి.
  • నారులో ఊద లేదా తుంగ ఇతర కలుపు మొక్కలు ఉన్నట్లయితే 2 మి.లీ. సైహలోఫాప్ బ్యూటైల్ ఒక లీటరు నీటిలో కలిపి నీరు తీసివేసి పిచికారీ చేయాలి.
  • ఖరీఫ్లో 20-25 రోజులకు, రబీలో 25-35 రోజులకు నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి.

ప్రధాన పొలం తయారీ

  • ఖరీఫ్ పంటకాలానికి ఎకరానికి 40 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 క్రిలోల పొటాష్ ఎరువులు, రబీ పంట కాలంలో 75 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ ఎరువులు అవసరమవుతాయి.
  • ఈ మధ్యకాలంలో జింకు ధాతులోప లక్షణాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎకరానికి 20 కిలోల జింకును ఆఖరి దుక్కిలో తప్పనిసరిగా వేసుకోవాలి. జింకును ఇతర ఎరువులు ముఖ్యంగా భాస్వరంకు సంబంధించిన ఎరువులతో కలిపి వేయకూడదు.
  • అంకురం ఏర్పడే దశలో పొటాష్ ఎరువును తప్పనిసరిగా వేసుకోవాలి.
  • పొటాష్ పోషకం వల్ల గింజ బాగా కట్టడం, తాలు శాతం తగ్గడం, రోగ నిరోధక శక్తి పొందటం వంటి మంచి లక్షణాలు ఉంటాయి.

నాటడం

  • కుదురుకు 1 లేదా 2 పిలకలు మాత్రమే ఉండే విధంగా ఎడంగా నాటాలి. దీర్ఘకాలిక రకాలైతే చ.మీ.కి 33 కుదుర్లు, స్వల్పకాలిక రకాలైతే 44 కుదురు ఉండేలా చూడాలి.
  • ప్రతి 2 మీటర్లకు ఒక అడుగు దూరం కాలి బాటలు వదులుకోవాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు బాగా తగిలి దోమ ఉధృతి తగ్గుతుంది.

కలుపు యాజమాన్యం

  • పైరు నాటిన 40 రోజుల వరకు, పొలంలో కలుపు లేకుండా చూడాలి. కలుపు ఉండడం వలన దిగుబడి తగ్గటమే కాకుండా కలుపు గింజల వల్ల విత్తనాల నాణ్యత తగ్గుతుంది.
  • కలుపు నివారణకు నాటిన 3-5 రోజుల వ్యవధిలో ప్రిటిల్లాక్లోర్ 500 మి.లీ. లేదా ఆక్సాడయార్డిల్ 35 గ్రా. /ఎకరానికి 20 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. కలుపు ముందు వేసేటప్పుడు నీరుండాలి. కలుపు మందు వేసిన తరువాత 2-3 రోజుల వరకు పొలంలో నీరు ఇంకే వరకు నీరు పెట్టకూడదు.
  • నీటి యాజమాన్యం

    విత్తన పంటకు మామూలు వాణిజ్య పంట వలె నీటి యాజమాన్యం పాటించాలి. కీలక దశలైన అంకురం ఏర్పడుట, పూత దశ, గింజ పాలుపోసుకునే దశ, గింజ గట్టిపడే దశలేలో నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలి లేని పక్షంలో తాలు గింజలు, విరుగుళ్ళు ఏర్పడతాయి.

సస్యరక్షణ

  • చీడపీడలు, తెగుళ్ళు సోకిన పంటనుండి వచ్చిన విత్తనాలను సేకరించినట్లయితే తరువాత పంటకు ఆ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది.
  • అగ్గి తెగులు సోకినప్పుడు టైసైక్లోజోల్ 75 శాతం 0.6 గ్రా. లేదా 1.25 మి.లీ. టిబుకోనజోల్ మందును కలిపి పిచికారీ చేయాలి.
  • పాముపొడ తెగులు కాండం కుళ్ళు తెగుళ్ళు ఆశించినప్పుడు లీటరు నీటికి 2 మి.లీ. వాలిడామైసిన్ లేదా 2 మి.లీ. హెక్సాకొనజోల్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి
  • మానిపండు తెగులు ఆశిస్తే గింజ నాణ్యతతో పాటు శుభ్రత కోల్పోతుంది. దీని నివారణకు ప్రాపికొనజోల్ 1 మి.లీ. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి వెన్నులు పైకి వచ్చే దశలో ఒకసారి, వారం రోజుల తరువాత రెండవ సారి పిచికారీ చేయాలి.

కేశీల ఏరివేత

విత్తనోత్పత్తి చేపట్టే రకానికి ఉండవలసిన లక్షణాలకు భిన్నమైన లక్షణాలు గల మొక్కలను బెరకులు లేదా కేబీలు అంటారు. కేబీలు ఉండడం వల్ల పంట సమానత్వాన్ని కోల్పోవడమే కాక జన్యు స్వచ్చత లోపించి దిగుబడులు తగ్గి, ధాన్యానికి ధర పలకదు. ఈ కేశీల ఏరివేత ముఖ్యంగా 3 దశల్లో చేపట్టాలి. ఎ) పైరు దుబ్బు చేసే సమయం, బి) పూత దశ, సి) గింజ గట్టిపడినప్పుడు

పైరు దుబ్బు చేసే సమయం

మనం సాగుచేసిన రకం భౌతిక లక్షణాలు బట్టి, అంటే పైరు ఎత్తు, ఆకు రంగు, దుబ్బు చేసే గుణం మొదలగు లక్షణాలకు భిన్నంగా, పొట్టిగా లేదా పొడుగుగా, ఆకు రంగులో మార్చు ఇతరత్రా భౌతికంగా వేరుగా ఉండే మొక్కలను పూర్తిగా వేర్లతో సహా తీసివేయాలి. పూత దశ : ఈ సమయంలో ముందుగా పూతకు వచ్చేవి, పాటాకు అమరికలో వ్యత్యాసాలున్న మొక్కలు పూర్తిగా తీసివేయాలి.

గింజ గట్టిపడే దశ

వెన్ను లక్షణాలు, గింజ రంగు, ఆకారం, పరిమాణం మొదలగు లక్షణాల్లో తేడా ఉన్న మొక్కలను సమూలంగా తీసివేయాలి.

పంట కోత

  • వరి కోత కోసినప్పుడు వెన్నులో సుమారు 80 శాతం గింజలు పండినప్పుడే కోత కోయాలి. పక్వానికి రాకముందు కోస్తే విత్తనం మొలకెత్తే స్వభావం దెబ్బతింటుంది.
  • వరి కోసినప్పుడు, నూర్పిడి సమయాల్లో యాంత్రిక కల్లీ అనగా యంత్రాల ద్వారాగాని, పనిముట్ల ద్వారాగానీ, ఇతర రకాల గింజలు కలవకుండా జాగ్రత్త వహించాలి. నూర్పిడి యంత్రాల ద్వారా విత్తన కలీ జరుగుతుంది. కావున ఎలాంటి పరిస్థితుల్లోను విత్తనోత్పత్తి చేలలో యంత్రాలను వాడరాదు.

విత్తన నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • గింజలో తేమశాతం 13 శాతానికి చేరుకునేవరకు బాగా ఎండలో ఎండబెట్టాలి.
  • ఎక్కువ తేమ శాతం ఉన్న గింజలకు పురుగుపట్టి, విత్తనం చెడిపోతుంది. ముఖ్యంగా పంటకోత, నూర్పిడి, ఆరబెట్టే సమయంలో ఇతర వరి రకాల గింజలలో కలవకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలి
  • శుభ్రపరచిన, ఆరబెట్టిన విత్తనాలను కొత్తగోనె సంచులలో నిలువ చేసుకోవాలి. విత్తనాలు నిలువ చేసే ప్రాంతం పొడిగా, చల్లగా, శుభ్రమైనదిగా ఉండాలి. ఈ రకంగా పండించినటువంటి విత్తనాలు మంచి నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉండడమే కాకుండా స్థిరమైన దిగుబడులకు దోహద పడతాయి.

ఈ విధంగా రైతులు కొన్ని మెళకువలు పాటించి నాణ్యమైన విత్తనాలను పండించుకొని విత్తన ఖర్చును తగ్గించుకోవడం, ముఖ్యంగా నాణ్యత లేని విత్తనాల బారినపడకుండా ఉండడం, పండించిన విత్తనాలను తోటి రైతులకు అందించి లాభం పొందటమే కాకుండా నాణ్యమైన అధిక వరి దిగుబడులను సహాయపడే అవకాశం పొందవచ్చు.

ఆధారం : పాడి పంటలు & మాస్ పత్రికలు

చివరిసారిగా మార్పు చేయబడిన : 4/12/2022



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate