హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / భూసారం కొరకు వేసవిలో దుక్కులు ,భూసార పరీక్షలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భూసారం కొరకు వేసవిలో దుక్కులు ,భూసార పరీక్షలు

వేసవిలో దుక్కులు,వేపగింజల సస్యరక్షణ

వేసవిదుక్కలు చేసుకుందాం

చీడపీడలను నివారించడంలో, పంటల సమగ్ర సస్యరక్షణలో రసాయన పద్ధతులు, ఇతర సంక్లిష్ట పద్ధతులకన్నా భౌతికపద్ధతులు, యాంత్రిక పద్ధతులు, సాగు పద్ధతుల్లో మార్పులు అనేవి ముందుగా ఆచరించదగ్గవి, తప్పక ఆచరించాల్సినవి. అయితే సాంప్రదాయకంగా ఖరీఫ్ లేదా రబీ పంటకోత తర్వాత మళ్ళీ వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలెయ్యడం జరుగుతోంది. దుక్కి చేయకుండా భూమిని ఖాళీగా వదిలెయ్యడం వలన కలుపు మొక్కలు పెరిగి భూమిలో నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమిలో సత్తువ లేకుండా చేస్తున్నాయి. దీనివల్ల భూసారం తగ్గిపోవడమేకాకుండా, భూమిలోని లోతైన పొరలనుండి నీరు పైకి పీల్చుకోబడి ఆవిరై పోతోంది. అందువల్ల పంట కోసిన వెంటనే తగినంత తేమ ఉన్నప్పుడు వాలుకు అడ్డంగా లోతైన దుక్కులు దున్నుకోవాలి. సాధారణంగా వేసవి నెలల్లో అడపాదడపా కురిసే వానలను సద్వినియోగం చేసుకొని మాగాణి, మెట్ట, బీడుభూములను దున్నుకోవాలి. వీటినే వేసవి దుక్కులు అంటారు. వేసవి దుక్కులు లోతుగా వాలుకు అడ్డంగా దున్నుకోవాలి. లేకపోతే నేల కోతకు గురౌతుంది. సారవంతమైన మట్టి కొటుకుపోతుంది. అడ్డంగా దున్నుకుంటే భూమికి తేమను నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. వేసవి లోతు దుక్కలవలన భూమిలోని లోతైన పొరలనుండి నీరు ఆవిరైపోకుండా ఉంటుంది.

పంటలు లేనప్పుడు పంటలపై చీడపీడలు కలిగించే పరుగుల, తెగుళ్ళకు చెందిన వివిధ దశలు భూమిలో నిద్రావస్థలో ఉంటాయి. వేసవి దుక్కుల వలన భూమిలోనుండి అవి బైటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. బయటపడిన ఫ్యూపాలను, గుడ్లను, పక్షులు తిని నాశనం చేస్తాయి. ఇలా పలువిధాల మేలుకలగడమేగాక భూమి గుల్లబారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. అందువల్ల అప్రమత్తంగా ఉండి వేసవి జల్లులను ఆసరా చేసుకొని వేసవి దుక్కులు చేపడదాం.

భూసార పరీక్షలు - వేపగింజల సేకరణ

పంటలకు కావాల్సిన వివిధ పోషకాలు సహజ సిద్ధంగా కొంతవరకు భూమిలో ఉంటాయి. అయితే ఉన్న మోతాదు స్థాయి, లభ్యతస్థాయి బట్టి అవి పంటకు ఉపయోగపడతాయి. అలాగే ఈ పోషకాలు పంటలకు దొరకడం అనేది నేల భౌతిక, రసాయనిక లక్షణాలు, సూక్ష్మజీవుల చర్య, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. భూసార పరీక్ష వలన నేలలో ఏఏ పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఉవ యోగవడుతుంది. సాంప్రదాయకంగా రైతులు భూమికి బలం పెంచే రకరకాల పద్ధతులు పాటించేవారు. ఆధునిక కాలంలో అటువంటి ఆచరణ తగ్గిపోతోంది. గతంలో పశువుల ఎరువు వేయడం, మిశ్రమ పంటలు ఒకే చేనులో పండించడం, జనుము, మినుము, పెసర మొదలైన పంటలను భూమిలోకి దున్ని వేయడం, చేరువులో మట్టి తెచ్చుకొని పొలంలో వేసుకోవడం, గొర్రెల మందలు, పశువుల మందలు కట్టడం, భూమికి బలం ఇచ్చే కంది, మినుము, గడ్డి నువ్వులు మొదలైన పంటలు వేయడం, కానుగ, జిల్లేడు, మోత్కు వాయిలి వంటి చెట్ల ఆకులను భూముల్లో తొక్కడం, పంటమార్పిడి పద్ధతులు ఆచరించడం వంటి అనేక చర్యలవలన నేల సారాన్ని కాపాడుకోవడం సాధ్యమయ్యేది. అలాగే పోషకాల సమతుల్యత దెబ్బతినకుండా మట్టి ఆరోగ్యంగా ఉండేది.

ప్రస్తుతం రసాయన పద్ధతులపై విపరీతంగా ఆధారపడడం వలన భూమిలో ఉండే సూక్ష్మజీవులే కాక అనేక రకాల జీవాలు తగ్గిపోయి భూమి రానురాను నిర్జీవం అవుతోంది. అయితే ఇప్పుడిప్పుడే రైతాంగం మళ్ళీ సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి సారించడం చాలా మంచి పరిణామం. భూసార పరీక్ష వలన పొలంలోని పోషకపదార్ధాల స్థాయిని తెలుసుకోవచ్చు. భూమి భౌతిక రసాయన స్థితిని బట్టి ఆ భూములు ఏఏ అనుగుణంగా పంటలు పండించడానికి ఉంటాయో తెలుసుకోవచ్చు. మట్టి పరీక్ష ఫలితాలను బట్టి ఏ పంటకు ఏఏ ఎరువులు ఎంత మోతాదులో ఏ రూపంలో, ఎప్పుడు వాడాలో తెలుసుకోవచ్చు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మట్టిని పరీక్షించుకొని, భూసారంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఎరువులను వినియోగించుకోవడం మంచిది. దీనివలన అనవసర ఎరువుల వినియోగాన్ని నిలువరించడమే కాక ఖర్చును తగ్గించుకోవచ్చు. పంటలను చీడపీడల నుంచి కాపాడుకోవచ్చు. అన్నింటిని మించి ఆరోగ్యకరమైన మట్టిని, వ్యవసాయాన్ని భవిష్యత్తరాలకు మిగల్చవచ్చు.

నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక అంశమైతే, సస్యరక్షణలో వేపగింజలను విరివిగా వినియోగించడం మరొక మేలైన అంశం. ముందు చూపుతో రైతులు వేపగింజలను రసాయన పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా సేకరించుకొని భద్రపరచుకుంటే పంటలపై వచ్చే చాలా కీటకాలను నిరోధించడానికి వేపగింజల కషాయాన్ని ఉపయోగించుకోవచ్చు. మరి ఆ దిశగా మన రైతాంగం కృషిచేస్తారని ఆశిసూ....

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

3.03424657534
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు