హోమ్ / వ్యవసాయం / మత్స్య సంపద / కార్ప్ ఫ్రై చేపలు, పిల్లచేపల వ్యాపారం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కార్ప్ ఫ్రై చేపలు, పిల్లచేపల వ్యాపారం

కోరుకున్న చేప జాతి పిల్లచేపలు (విత్తనాలు),కావలసిన సమయంలో, కావలసిన పరిమాణంలో దొరకడం అనేది చేపల పెంపకంలో సత్ఫలితం సాధించడానికి ఒక కీలకాంశం.గత కొన్ని సంవత్సరాలుగా, కార్ప్ చేపల గుడ్ల విషయంలో, వాటిని పొదిగే వసతుల (నర్సరి) విషయంలో చెప్పుకోదగిన పురోగతి సాధించినప్పటికి ; అవసరమైన సైజు చేపల విషయంలో ఇప్పటికీ కొరత వుంది. ఇందులో కార్ఫ్ ప్రై చేపలు, పిల్ల చేపల వ్యాపారం గురించి వివరించజం జరిగింది.

కోరుకున్న చేప జాతి పిల్లచేపలు (విత్తనాలు),కావలసిన సమయంలో, కావలసిన పరిమాణంలో దొరకడం అనేది చేపల పెంపకంలో సత్ఫలితం సాధించడానికి ఒక కీలకాంశం.గత కొన్ని సంవత్సరాలుగా, కార్ప్ చేపల గుడ్ల విషయంలో, వాటిని పొదిగే వసతుల (నర్సరి) విషయంలో చెప్పుకోదగిన పురోగతి సాధించినప్పటికి ; అవసరమైన సైజు చేపల విషయంలో ఇప్పటికీ కొరత వుంది.చేప గుడ్లు పొదిగి, పిల్లలై, కేవలం 72-96 గంటల వయసులో అప్పుడప్పుడే ఆహారం తీసుకోవడానికి అలవాటుపడే,(స్వాన్) దశనుంచి, 15-20 రోజుల వయసు వచ్చేంత వరకు,అంటే,25-30 మిల్లీమీటర్ల సైజు వచ్చే వరకు (ఫ్రై దశ) నర్సరీలలో పెంచుతారు.ఆ తర్వాత ఈ ఫ్రైలను, దాదాపు 100 మిల్లీమీటర్ల సైజుకు (ఫింగర్‌లింగ్స్ దశ)ఎదిగేంతవరకు మరో చెరువులో పెంచుతారు.

చేపపిల్లల చెరువుల నిర్వహణ / (యాజమాన్యం)

0.02 హెక్టేర్ల వెడల్పు, 1.0-1.5 మీటర్ల లోతు కలిగి, 0.5 హెక్టేర్ల విస్తీర్ణం వుండే చిన్న నీటి వనరులు చిరుచేపల వాణిజ్య ఉత్పత్తికి అనువుగా వుంటాయి.చేపపిల్లలను పెంచే నర్సరీలలో, నీరు బయటకు పంపే కాల్వ వున్న, కాల్వలేని మట్టి చెరువులు; సిమెంటు తొట్లు వంటి వివిధ రకాలు వున్నాయి. చిరుచేపల (ఫ్రై) పెంపకంలో ఈ క్రింద పేర్కొన్న వివిధ చర్యలను చేపట్టవలసి వుంటుంది.

చేపపిల్లలను వదలడానికి ముందు చెరువును సిద్ధం చేసుకోవడం

నీటిలో పెరిగే మొక్కలు, గడ్డీ గాదం తొలగింపు: చేపల చెరువులలో మొక్కలు, గడ్డీ గాదం మరీ ఎక్కువగా పెరగడం వాంఛనీయం కాదు. చెరువులోని పోషకాలు వాటికి ఆహారంగా మారడంవల్ల చెరువు ఉత్పాదకత దెబ్బతింటుంది. పరాన్నజీవులు, కలుపు చేపలు పెరగడానికి ఈ మొక్కలు, గడ్డి దోహదం చేస్తాయి.ఫలితంగా, చేపపిల్లల కదలికలకు, వలవేయడానికి తగినంత జాగాలేకుండా పోతుంది.

పరాన్నజీవుల, కలుపు చేపల నిర్మూలన:: చెరువులలో వుండే పరాన్న జీవులైనటువంటి కలుపు చేపలు మరియు పాములు, తాబేళ్ళు, కప్పలు, నీటి పక్షులు, చేపలను మింగే ఆటర్స్ వంటి జీవులు చేపపిల్లలకు అవసరమైన జాగా విషయంలో, అవి పీల్చుకోవలసిన ఆక్సిజన్ విషయంలో వాటికి పోటీ రావడమే కాకుండా ; వాటి మనుగడకే ముప్పుగా పరిణమిస్తాయి.ఈ రకమైన హానికర జలచరాల బెడద వదిలించుకోవడానికి, చేపపిల్లలను వదలడానికి ముందు చెరువులోని నీటిని తొలగించి , చెరువును ఎండనివ్వడమో; లేదా తగిన, హానికర జలచర సంహారకాలను (పిసిసైడ్స్) వాడడమో చేయాలి.చేప పిల్లలను వదలడానికి మూడువారాల ముందు చేపల చెరువులో మహువా (ఇప్ప) నూనె గింజల చెక్కను హెక్టారుకు 2,500 కేజీ చొప్పున వేయడం మరొక పద్ధతి.
ఈ నూనె చెక్క హానికర జలచర సంహారిణిగా పనిచేయడమేకాకుండా, చెరువులో కుళ్ళి,సేంద్రియ ఎరువుగామారి, చెరువు సహజ ఉత్పాదకత పెరగడానికికూడా దోహదం చేస్తుంది.వాణిజ్య పరంగా వాడే బ్లీచింగ్ పౌడరును (30 % క్లోరిన్) హెక్టేరు విస్తీర్ణం, మీటరులోతు చెరువుకు 350 కిలోగ్రాముల పరిమాణంలో వాడితేకూడా హానికర జలచరాలను నిర్మూలించవచ్చు.చెరువులో బ్లీచింగ్ పౌడర్ వేయడానికి 18-24 గంటలముందు పైన పేర్కొన్న పరిమాణపు చెరువుకు 100 కిలోల యూరియా వేస్తే, బ్లీచింగ్ పౌడర్ పైన చెప్పిన పరిమాణంలో సగమే సరిపోతుంది.

చెరువు సారాన్ని పెంచడం :

చేపపిల్లల పెంపకానికి ఉపయోగించే చెరువులో (కల్చర్ పాండ్స్) తగిన ఎరువులు వేసి, చెరువు సారాన్ని పెంచడంవల్ల, చెరువులో ఉత్పత్తీయ్యే ప్లాంక్టన్లు (ఆహారంగా ఉపయోగపడే ఆర్గానిజమ్స్), చేపపిల్లలకు ఎంతైనా మంచి సహజసిద్ధమైన ఆహారం. చేప విత్తనాల ఉత్పత్తికి ఉపయోగించాలనుకునే చెరువులో ముందుగా హానికర జీవులను నిర్మూలించిన తర్వాత,ఆ నేలలోని ఉదజనసూచికను బట్టి, ఆ చెరువును సున్నంతో అలకాలి. సున్నం వేసిన తర్వాత, ఆవుపేడ, కోళ్ళ విసర్జితాలవంటి సేంద్రియ ఎరువులనుకాని, లేదా రసాయనిక ఎరువులనుకాని, లేదా రెండురకాల ఎరువులనైనా ఒకదాని తర్వాత మరొకటి వేయాలి.
కాబట్టి మొట్టమొదటి నీటిలో పెరిగే కలుపును తీసివేయాలి. సాధారణంగా నర్సరీలు మరియు చేపలు పెంచే కుంటలు చిన్నగా మరియు లోతు తక్కువగా ఉంటాయి. కనుక వీటిలో చేతితోనే కలుపును తీసివేయాలి. పెద్ద చెరువులలో యాంత్రిక, రసాయన మరియు జీవ పద్ధతుల ద్వారా వీటిని నివారించవచ్చు.
చెరువులో ఆశించిన విధంగా ప్లాంక్టన్ల ఉత్పత్తికి, హెక్టేరు చెరువుకు 750 కిలోల వేరుశనగ చెక్క,200 కిలోల ఆవుపేడ, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ మిశ్రమం ఎంతో బాగా పనిచేస్తుందని తేలింది. చేపపిల్లలను వదలడానికి 2-3 రోజుల ముందు, పైన పేర్కొన్న పరిమాణంలో సగం మిశ్రమాన్ని తీసుకుని,తగినంత నీటితో కలిపి, గట్టి పేస్ట్‌లాగా తయారుచేసి,చెరువు అంతటా వెదజల్లాలి. చెరువులోని ప్లాంక్టన్ల స్థాయినిబట్టి, మిగతా మిశ్రమాన్ని, రెండుమూడు దఫాలుగా వేయవచ్చు.

నీటి పురుగుల నియంత్రణ

నీటిలో వుండే పురుగులు, వాటి సంతానం నర్సరీలలో పెరిగే చిరుచేపలతో ఆహారానికి పోటీపడతాయి; ఇంతేకాదు, భారీ మొత్తంలో అవి చనిపోవడానికి కారణమవుతాయి. సబ్బు నీటి ద్రావణంతో సులువుగా, సమర్ధవంతంగా ఈ పురుగులను చంపివేయవచ్చు. హెక్టేరుకు 56 కిలోల వంతున ఏదైనా చౌకరకం వంటనూనెకు, దాని బరువులో 3 వవంతు ఏదైనా చౌక రకం సబ్బుపొడిని కలిపి నీటిపురుగులను చంపే ఈ సబ్బు ద్రావణం తయారుచేయవచ్చు. సబ్బు ద్రావణానికి బదులుగా, హెక్టేరు విస్తీర్ణంకలిగిన చేపలచెరువుకు 100-200 లీటర్ల కిరోసిన్ లేదా 75 లీటర్ల డీజిల్‌కు 560 మిల్లీలీటర్ల లిక్విడ్ సోప్ లేదా 2-3 కిలోల డిటర్జంట్ పొడిని కలిపిన మిశ్రమాన్నికూడా వాడవచ్చు.

నర్సరీలలోకి చిరుచేపలను వదలడం

గ్రుడ్ల నుండి పగిలిన చేపపిల్లలను (స్పాన్) మూడురోజుల తర్వాత నర్సరీ చెరువుకు మార్చుతారు. కొత్త వాతావరణానికి అలవాటుపడడానికి సిద్ధంచేసి, నర్సరీ చెరువులోకి ఉదయంపూట వదలడం మంచిది. మట్టి చెరువులో అయితే, హెక్టేరు విస్తీర్ణానికి 3-5 మిలియన్ చేపపిల్లలను వదలవచ్చునని , సిమెంటు చెరువులలో అయితే మరింత దట్టంగా, 10-20 మిలియన్ల చేపపిల్లలవరకు వదలవచ్చునన్నది నిపుణుల సిఫారసు. నర్సరీలలో సాధారణంగా, ఒకేరకం కార్ప్‌జాతి చేపపిల్లలను వదలాలని సిఫారసుచేయబడినది.

చేపపిల్లలను వదిలిన తర్వాత చెరువు నిర్వహణ

ముందు చెప్పిన విధంగా, 15 రోజుల పెంపకం దశ (కల్చర్)లో, 2-3 సార్లు ఎరువులు చల్లాలి. బాగా మెత్తగా పొడిచేసిన వేరుశనగ చెక్కకు, అంతే బరువుగల వరి తౌడునుకలిపి , ఆ మిశ్రమాన్ని నర్సరీ చేపపిల్లలకు అదనపు ఆహారంగా ఇవ్వవలసివుంటుంది. ఈ అదనపు ఆహారాన్ని , మొదటి ఐదురోజులపాటు మిలియన్ చేపపిల్లలకు రోజుకు 6 కిలోల వంతున , మిగతా రోజులలో రోజుకు 12 కిలోల వంతున; రెండు సమాన విడతలుగా వేయాలి. నర్సరీ నిర్వహణలో శాస్త్రీయమైన పద్ధతులను అనుసరించడం ద్వారా, చెరువులో వదిలిన చేపపిల్లలలో 40-60 % బతికి, ఆశించేరీతిలో , 15 రోజులకు 20-25 మిల్లీమీటర్ల సైజుకు పెరుగుతాయి. చేపపిల్లలను నర్సరీలలో పెంచే కాలాన్ని 15 రోజులకు పరిమితం చేసినందువల్ల, ఒకే చెరువును మరిన్నిసార్లు నర్సరీగా ఉపయోగించవచ్చు. మట్టి చెరువు అయితే, కనీసం 2-3 సార్లు; సిమెంటు చెరువు అయితే 4-5 సార్లు వినియోగించవచ్చు.

చేపలను, పిల్లచేప పెంచేచెరువుల నిర్వహణ

నర్సరీలతో పోలిస్తే, చిరుచేపలను(ఫ్రై), వేలెడంత చేపలను పెంచే చెరువులు పెద్దగా వుంటాయి. ఈ చెరువు 0.2 హెక్టేర్ల విస్తీర్ణం వరకు వుంటే మంచిది.ఈ చెరువుల నిర్వహణకు సంబంధించిన వివిధ చర్యలను ఈ కింద పేర్కొనడం జరిగింది.

చేపపిల్లలను వదలడానికి ముందు చెరువును సిద్ధం చేయడం నీటి మొక్కలను, నాచు మొదలైనవాటిని తొలగించే పద్ధతులు మరియు పరాన్నజీవులను,కలుపు చేపలను నిర్మూలించే పద్ధతులు నర్సరీలలో అనుసరించిన మాదిరిగానే వుంటాయి.అయితే, చేపలు,పిల్లచేప పెంచే చెరువులలో నీటి పురుగుల నిర్మూలన చర్యలు చేపట్టవలసిన అవసరం మాత్రం వుండదు. చెరువులో సేంద్రియ ఎరువులను, సేంద్రియేతర ఎరువులను వేయాలి.ఇవి ఏ పరిమాణంలో వేయాలనేది, హానికర జలచరాల నిర్మూలనకోసం మనం ఏ విషపదార్ధాన్ని ఉపయోగించామనేదానిపై ఆధారపడి వుంటుంది.విషపదార్ధంగా మహువా నూనె చెక్కను ఉపయోగిస్తే,వేయవలసిన ఆవుపేడ పరిమాణం హెక్టేరుకు 5 టన్నులకు తగ్గుతుంది.కాని, మిగతా విషపదార్ధాలేవీ ఎరువుగా ఉపయోగపడలేవుకాబట్టి, హెక్టేరుకు 10 టన్నుల ఆవుపేడ వేయవలసివస్తుంది.వేయవలసిన మొత్తం ఆవుపేడలో మూడవవంతును చిరుచేపలను వదలడానికి 15 రోజులముందే చెరువును సిద్ధంచేసే ప్రకియలోభాగంగా వాడవలసివుంటే,మిగిలిన ఆవుపేడను 15 రోజులకొక విడతగా వేయాలి. సేంద్రియేతర ఎరువులుగా, హెక్టేరుకు సంవత్సరానికి 200 కిలోల యూరియాను, 300 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్‌ను విడతలుగా వేయాలి

చేపలను (ఫ్రై)చెరువులో వదలడం

చెరువులో చిరుచేపలను ఎన్నిటిని వదలాలనేది ముఖ్యంగా, చెరువు ఉత్పాదక స్థాయి మీద, ఆ తర్వాత ఎలాంటి నిర్వహణ పద్ధతులను అనుసరిస్తామనేదానిమీద అధారపడి వుంటుంది.సాధారణంగా,హెక్టేరు విస్తీర్ణానికి 0.1-0.3 మిలియన్ల ఫ్రైలను వదలాలన్నది నిపుణుల సూచన. నర్సరీలలో ఒకేజాతి చేపలను వదలాలన్న పరిమితి వుండగా, చిరుచేపలపెంపకం చెరువులలో వివిధ రకాల కార్ప్ జాతులను వదలవచ్చును.

చేపలను వదిలిన తర్వాత చెరువుల నిర్వహణ

పిల్లచేప 5-10 % పోషకాహారం ఇవ్వవలసివుంటుంది.చాలాసందర్భాలలో అదనపు ఆహరంగా, వేరుశనగ చెక్క, వరితౌడు మిశ్రమాన్ని మాత్రమే, బరువులో చెరి సమానంగా, వాడాలన్న పరిమితి వుండగా,దాణాలోని పోషక శక్తిని పెంచడానికి సాంప్రదాయేతర పదార్ధాలనుకూడా వాడవచ్చు. గ్రాస్ కార్ప్ చిరుచేపల విషయంలో, వోల్ఫియా, లెమ్నా, స్పిరోడేలా వంటి డక్‌వీడ్స్‌ను వేయాలి.ముందే చెప్పినట్టు, చెరువులో ఎప్పుడూ 1.5 మీటర్ల లోతున నీరు వుండేలా చూడడం; దఫాలు, దఫాలుగా ఎరువు వేయడం చెరువు నిర్వహణలో పాటించవలసిన ఇతర చర్యలు. చిరుచేపల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులను పాటించడంవల్ల, పిల్లచేప 70-90 % బతికి, 80-100 మిల్లీమీటర్ల సైజుకు, 8-10 గ్రాముల బరువుకు పెరుగుతాయి.

ఫ్రై పెంపకం ఆర్ధికాంశాలు

క్ర.సం

అంశం

విలువ రూ.

I

వ్యయం

 

చర వ్యయం

 

1

చెరువు లీజు వెల

5,000

2

బ్లీచింగ్ పౌడర్ (10 పిపిఎం క్లోరైడ్) / ఇతర విషపదార్ధాలు

2,500

3

సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు

8,000

4

స్పాన్ (మిలియన్‌కు 5,000 రూపాయల వంతున 5 మిలియన్లు

25,000

5

అదనపు దాణా కేజి 10రూ. చోప్పున 750 కేజీలు

7,500

6

చెరువు నిర్వహణకు, చేపలుపట్టడానికి కూలీల  ఖర్చు
( పనిదినానికి 50 రూపాయల వంతున, 100పని దినాలు )

5,000

7

ఇతర ఖర్చులు

5,000

 

చర వ్యయం మొత్తం

58,000

బి

మొత్తం వ్యయం

 

1

చర వ్యయం

58,000

2

చర వ్యయంపై వడ్డీ (సంవర్సరానికి 15 % వంతున ఒక నెలకు)

0.725

 

మొత్తం వ్యయం

58,725  (59,000)

II

స్థూలాదాయం

 

 

ఫ్రై అమ్మకాలవల్ల వచ్చే రాబడి (లక్ష ఫ్రై రూ.7,000 వంతున 15 లక్షల ఫ్రై)

1,05.000

III

నికర ఆదాయం (స్థూల ఆదాయం-మొత్తం వ్యయం)

46,000

వానా కాలంలో ,(జూన్- ఆగస్టు నెలల మధ్య), చెరువునుంచి రెండు పంటలు తీయవచ్చు. ఆ విధంగా, ఒక హెక్టేరు చెరువునుంచి రెండు పంటల ద్వారావచ్చే మొత్తం నికర ఆదాయం రూ. 92,000.

ఫింగర్‌లింగ్స్ పెంపకం ఆర్ధికాంశాలు

క్ర.సం

అంశం

విలువ రూ.

I

వ్యయం

 

చర వ్యయం

 

1

చెరువు లీజు వెల

10,000

2

బ్లీచింగ్ పౌడర్ (10 పిపిఎం క్లోరైడ్) / ఇతర విషపదార్ధాలు

2,500

3

సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు

3,500

4

ఫ్రై ( లక్ష ఫ్రై 7,000 వంతున 3 లక్షల ఫ్రై)

21,000

5

అదనపు దాణా (టన్ను 7000 రూపాయల వంతున 5 టన్నులు)

35,000

6

చెరువు నిర్వహణకు, చేపలుపట్టడానికి కూలీల  ఖర్చు
( పనిదినానికి 50 రూపాయల వంతున, 100పని దినాలు )

5,000

7

ఇతర ఖర్చులు

3,000

 

చర వ్యయం మొత్తం

80,000

బి

మొత్తం వ్యయం

 

1

చర వ్యయం

80,000

2

చర వ్యయంపై వడ్డీ (సంవర్సరానికి 15 % వంతున ఒక నెలకు)

3,000

 

మొత్తం వ్యయం

83,000

II

స్థూలాదాయం

 

ఫింగర్‌లింగ్స్ అమ్మకాలవల్ల వచ్చే రాబడి
( 1000ఫింగర్‌లింగ్స్ రూ.500 వంతున 2.1 లక్షల ఫింగర్‌లింగ్స్ )

1,05,000

III

నికర ఆదాయం (స్థూల ఆదాయం-మొత్తం వ్యయం)

22,000

ఆధారము: మంచినీటి చేపల పెంపక కేంద్రీయ సంస్థ , భువనేశ్వర్ , ఒరిస్సా

3.01018573996
కొడాలి శ్రీదేవి Aug 08, 2016 03:44 PM

ప్లాస్టిక్ తొట్టె లో చేపల పెంపకం చేయవచ్చా?

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు