অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సమీకృత మత్స్య అభివృద్ధి పథకము (ఐ.ఎఫ్.డి.ఎస్) అమలుకు మార్గదర్శకాలు

సమీకృత మత్స్య అభివృద్ధి పథకము (ఐ.ఎఫ్.డి.ఎస్) అమలుకు మార్గదర్శకాలు

సమీకృతమత్స్య అభివృద్ధి పథకము (ఐ.ఎఫ్.డి.ఎస్) నకు ఆర్ధిక సహాయం

తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధి కొరకు జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్.సీ.డీ.సీ) న్యూ ఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య (టి.ఎస్.ఎఫ్.కాఫ్) హైదరాబాదుకు రూ 1000/- కోట్ల ఆర్షిక సహాయం మంజూరు చేసింది. ఈ పధకము క్రింద తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలలో వున్న ప్రాథమిక మత్స్య సహకార సంఘాల సభ్యులు (పి.ఎఫ్.సి.ఎస్), మహిళామత్స్య సహకార సంఘాల సభ్యులు (పి.ఎఫ్.డబ్లు.సి.ఎస్), మత్స్య మార్కెటింగు సంఘాల సభ్యులు, జిల్లా మత్స్య సహకార సంఘాలు మరియు తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య ప్రయోజనం పొందుతారు.

సమీకృత మత్స్య అభివృద్ధి పథకము (ఐ.ఎఫ్.డి.ఎస్) ఉద్దేశ్యాలు

ఈక్రింది ప్రధాన ఉద్దేశ్యాలతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకము అమలు చేయబడుతుంది.

  • ఏడాది పొడవునా చేపలు పట్టుకోను కార్యక్రమాల నిర్వాహణ మరియు తెలంగాణలో ఏడాది పొడవునా స్థానిక చేపల లభ్యత.
  • చేపల పెంపకానికి అనువైన చిన్న, మధ్య, మరియు భారీ తరహ నీటి వనరులలో పూర్తి స్థాయి సమర్థ్యంతో చేపలను పెంచడం.
  • రొయ్యల సాగు ( ప్రాన్ కల్చర్), చెరువులలో చేపల సాగు (పాండ్ కల్చర్), పంజరాలలో చేపల సాగు ( కేజ్ కల్చర్), మొదలగు విభిన్న పద్ధతులను పరిచయం చేయడం ద్వారా చేపల పెంపక కార్యక్రమాలను విస్తృతం చేయడం.
  • చేపల వేటలో వున్న ప్రతీ మత్స్యకారునికి మెరుగైన జీవనోపాధి మరియు ఆదాయాలలో వృద్ధి లభించడం.
  • చేపల రంగం లో ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంపొందించుటకు అవసరమైన వనరులతో అనుసంధానము చేయడము ద్వారా సుస్థిరతను మరియు విత్తన చేపల ఉత్పత్తి లో స్వయం సమృద్ధిని సాధించడం

పథకం యొక్క ప్రధాన అంశాలు

3.1 తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య (టి.ఎస్.ఎఫ్.కాఫ్ మరియు అనుభంద సహకార సంఘాల వారు మత్స్యశాఖ సమన్వయంతో పథకాన్ని అమలు చేస్తారు.

3.2 పథకం పరిధిలోకి చేపల ఉత్పత్తిని పెంచడం, చేపవిత్తనాల ఉత్పత్తికి, చేపల ప్రాసెసింగ్ మరియు మార్కెటింగు కు అవసరమైన మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయడం మరియు శిక్షితులైన, నైపుణ్యం కలిగిన మనవ వనరులను అభివృద్ధి చేయడం.

3.3 ఆయా విభాగాన్ని భటి పథకం యొక్క ప్రయోజనాలను, సంఘం సభ్యునిగా, సంఘంలోని గ్రూపుసభ్యులుగాను, సంఘంగా, జిల్లా మత్స్య సహకార సంఘంగా కూడా పొందవచ్చును.

3.4 చేపల రిటైల్ మార్కెట్లు, లాండింగ్ సెంటర్లు, శిక్షణాకేంద్రాలు, పంజరాలలో చేపల పెంపకం వంటి 100% గ్రాంటు పొందే కొన్ని విభాగాలలో యూనిట్ వ్యయం మరియు డిజైను అంశాలలో అవసరానికనుగుణంగా మార్పులకు అవకాశం ఇవ్వబడినది.

3.5 లబ్దిదారుల వాటా మరియు రాయితీ వున్న రెండు అంశాలలో ప్రతిపాదన యొక్క సాంకేతిక మరియు ఆర్ధిక ఆచరనీయతను మరియు లబ్దిదారుని వాటా చెల్లించే సామర్ధ్యాన్ని దృష్టిలో వుంచుకొని ప్రాజెక్టుని చేపడతారు.

పథకం అమలుకు పరిపాలన అమరిక

పథకాన్ని అమలు చేయడానికి ఈ క్రింద చూపిన పరిపాలన అమరికను ఏర్పాటు చేయవలసి ఉంటుంది

4.1 అన్ని జిల్లాలలోను జిల్లా మత్స్యశాఖ అధికారులను జిల్లా మేనేజర్ గా నియమించుట

ఐ.ఎఫ్.డి పథకాన్ని జిల్లాలో అమలుచేయడానికి జిల్లా మత్స్యశాఖ అధికారులు టి.ఎస్.ఎఫ్.కాఫ్ యొక్క జిల్లా మేనేజర్లు గా నియమించబడతారు. ఐ ఎఫ్ డి ఎస్ అమలుకు మత్స్యశాఖ క్షేత్రస్థాయి సిబ్బందిని కేటాయిస్తుంది. వీరికి అదనంగా, టి.ఎస్.ఎఫ్.కాఫ్ జిల్లాకు ఒక డేటా ఎంట్రీ ఆపరేటరును, ఒక కంప్యూటరును ఏర్పాటు చేస్తుంది. పథకం అమలుకు అవసరమయ్యే పరిపాలన వ్యయాన్ని ఇందుకొరకు కేటాయించిన ప్రాజెక్టు నిధుల నుంచి భరిస్తారు.

4.2 కమిటీల ఏర్పాటు

ఐ.ఎఫ్.డి పథకాన్ని అమలు చేయుటకు జిల్లస్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోను రెండు కమిటీలు వుంటాయి.

4.2.1 జిల్లాస్థాయి ఎంపిక కమిటీ (డి.ఎల్.ఎస్.సి)

అ. జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఈ క్రింది వారితో ఏర్పడుతుంది.

  1. జిల్లా కల్లెక్టరు- చైర్ పర్సన్
  2. జాయింటు కల్లెక్టరు- ఉప ఛైర్ పర్సన్
  3. జిల్లా వెటర్నరీ మరియు పశుసంవర్థక శాఖ అధికారిడి.వి.ఏ హెచ్ ఓ) లేదా జిల్లా కల్లెక్టరు చే నియమిచబడిన ఒక సీనియర్ అధికారి సభ్యులు
  4. సంబంధిత జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు / పర్సన్- ఇన్- ఛార్జి – సభ్యులు.
  5. జిల్లా మేనేజర్/ మత్స్యశాఖ అధికారి-మెంబర్ కన్వీనర్.

ఆ. జిల్లాస్థాయి ఎంపిక కమిటీ యొక్క బాధ్యతలు, విధులు

  • జిల్లామేనేజరు అన్ని అంశాలకు అర్హతలను బట్టి సంఘం సభ్యులు లేదా సభ్యుల గ్రూపు నుంచి, సంఘం నుంచి, జిల్లా మత్స్య సహకార సంఘం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
  • ఆఫ్ లైన్లో దరఖాస్తులు వచ్చిన సందర్భంలో ఆయా దరఖాస్తులలోని సమాచారాన్ని ఇ-లాఫ్ లో నమోదు చేసి ఆన్ లైన్ చేస్తారు.
  • జిల్లా మేనేజరు జిల్లాస్థాయిలో వచ్చిన దరఖాస్తులను అంశాల వారీగా అర్హతలను పరిశీలిస్తారు.
  • అర్హత కలిగిన లబ్దిదారున్ని జిల్లాస్థాయి కమిటీ ఆమోదిస్తుంది; జిల్లాస్థాయిలో మంజూరు చేయడానికి అవకాశం ఉన్న అంశాలకు చెందిన దరఖాస్తులకు జిల్లాకలెక్టరు పరిపాలన అనుమతులను జారీచేస్తారు.
  • రాష్ట్రస్థాయిలో మంజూరు చేయవలసిన అంశాలకు చెందిన దరఖాస్తులను జిల్లాస్థాయిలోని జిల్లా కమిటీ తనిఖీచేసి, అన్ని అర్హతలు ఉన్న దరఖాస్తులను ఆమోదం కోసం రాష్ట్రస్థాయి కి పంపుతుంది.
  • అర్హతగల దరఖాస్తుల సంఖ్య జిల్లాకు కేటాయించిన లక్ష్యం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు తగిన నిర్ణయం కొరకు జిల్లా కమిటీ తరుపున జిల్లా మేనేజరు టి.ఎస్.ఎఫ్.కాఫ్, హైదరాబాద్ ను తగిన నిర్ణయం కొరకు లిఖిత పూర్వకంగా నివేదించాలి.
  • జిల్లా స్థాయిలో ఆమోదించే అన్ని అంశాల పై (చేపపిల్లల విడుదలకు సంబంధించిన అంశాలను మినహాయించి) పూర్తి అధికారం జిల్లాస్థాయి కమిటీకే ఉంటుంది.
  • జిల్లాకు అవసరమైన నిధులకై జిల్లా మేనేజరు క్రమం తప్పకుండా టి.ఎస్.ఎఫ్.కాఫ్ కు తెలియజేయాలి.

4.2.2 రాష్ట్రస్థాయి ఎంపిక కమిటీ (ఎస్.ఎల్.ఎస్.సి):

అ. రాష్ట్రస్థాయి ఎంపిక కమిటీ ఈ క్రింది వారితో ఏర్పడుతుంది.

  1. కమీషనర్, మత్స్యశాఖ - చైర్ పర్సన్
  2. డైరెక్టరు, రాష్ట్ర వెటర్నరీ మరియు పశుసంవర్థకశాఖ లేదా వారి నామినీ సభ్యులు.
  3. మేనేజింగ్ డైరెక్టర్, టి.ఎస్.ఎఫ్.కాఫ్ - సభ్యులు
  4. సంయుక్త/ఉపసంచాలకులు (మంచినీటి సంక్షేమ/ ప్రణాళిక), మత్స్యశాఖసభ్యులు
  5. జనరల్ మేనేజరు, టి.ఎస్.ఎఫ్.కాఫ్ - మెంబెర్ కన్వీనర్

ఆ. రాష్ట్రస్థాయి ఎంపిక కమిటీ యొక్క వీధులు - బాధ్యతలు

  1. రాష్ట్రస్థాయిలో ఆమోదించాల్సిన అంశాలకు చెందిన దరకాస్తులను, జిల్లాస్థాయి ఎంపిక కమిటీ నుండి టి.ఎస్.ఎఫ్.కాఫ్ స్వీకరించి పరిశీలిస్తుంది.
  2. కేటాయింపులను, సాంకేతిక అంశాలను, నిధుల లభ్యతను బట్టి రాష్ట్ర స్థాయి కమిటీ దరఖాస్తులను ఆమోదిస్తుంది మరియు తగిన చర్యలు చేపడుతుంది.
  3. రాష్ట్రస్థాయి ఎంపిక కమిటీ ఆమోదించిన లబ్దిదారులకు టి.ఎస్.ఎఫ్.కాఫ్ మేనేజింగు డైరెక్టరు పరిపాలన అనుమతులను జారీచేస్తారు.
  4. అర్హతగల దరఖాస్తుల సంఖ్య జిల్లాకు కేటాయించిన లక్ష్యం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, టి.ఎస్.ఎఫ్.కాఫ్ జిల్లా కమిటీ యొక్క నివేదికలను స్వీకరించి తగిన నిర్ణయము కై రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీకి పంపుతుంది. అట్టి దరఖాస్తులపై తీసుకున్న నిర్ణయాన్ని టి.ఎస్.ఎఫ్.కాఫ్ జిల్లా కమిటీకి తెలియజేస్తుంది.

5. సభ్యుల/ సభ్య సంఘాల యొక్క సాధారణ అర్హతా ప్రమాణాలు

5.1 ప్రాథమిక మత్స సహకార సంఘాల సభ్యులు/సభ్యసంఘాలు, పథకం క్రింద లబ్దిపొందేందుకు అర్హులు.

5.2 సభ్యుల వయస్సు 18సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వుండాలి.

5.3 వార్షిక సంవత్సరం 2018-2019 లో పథకం నుంచి లబ్దిపొందాలనుకొనే సభ్యసంఘాలు, 2016-17 సం. వరకూ ఆడిట్ పూర్తిచేసుకొని ఉండాలి. అయితే 2017 ఏప్రిల్ తర్వాత రిజిస్టరు చేసుకున్న సంఘాలకు కానీ, సంఘ నియంత్రణలోని కారణాల వల్ల ఆడిట్ పూర్తికానీ సంఘాలకు ఆడిట్ నిబంధన వర్తించదు. వ్యక్తిగతంగా మరియు గ్రూపుగా దరఖాస్తు చేసేవారికి, సంఘం ఆడిట్ తో సంబంధం లేదు.

5.4 వ్యక్తిగత లబ్దిదారు దరఖాస్తు చేసిన అంశానికే అంతకు ముందు వేరే పథకాల (నీలి విప్లవం, మత్స్యా భివృద్ధి (రాష్ట్ర సాధారణ ప్రణాళిక), ఎన్.ఎఫ్.డి.బి, ఆర్.కే.వి.వై తదితరాలు) ద్వారా రాయితీ పొందినట్లయితే ఐ.ఎఫ్.డి పథకం 2018-19 సం. నందు అట్టి అంశం క్రింద లబ్ది పొందేందుకు అనర్హులు (వలలు, క్రాఫ్టులకు మినహాయింపు ఇవ్వబడినది)

5.5 పథకం యొక్క వివిధ అంశాల నుంచి లబ్దిపొందేందుకు అవసరమైన లబ్దిదారుల వాటాను చెల్లించేందుకు సభ్యులు/ గ్రూపులు/సభ్యసంఘాలు సిద్ధంగా ఉండాలి.

5.6 సంఘాలకు ఆస్తులను సమకూర్చే సందర్భాలలో సంఘం యొక్క మహాజనసభ లేదా కార్యవర్గం తీర్మానం ఇవ్వాలి (పథకం క్రింద లబ్ధిపొందుటకు సంఘాలు దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది) మరియు ఆస్తులను సంఘ సభ్యులందరి ప్రయోజనాల కోసం వినియోగిస్తామని కూడా హామీ ఇవ్వాలి.

5.7 సభ్యసంఘం ప్రభుత్వ బకాయిల ఎగవేతదారు (ఉదా: లీజు మొత్తం, చేపపిల్లలకై చెల్లించాల్సిన మొత్తం) అయి ఉండరాదు మరియు ఎటువంటి నిధుల దుర్వినియోగానికీ పాల్పడి ఉండరాదు.

5.8 మత్స్య పరిశ్రమకు చెందిన ఆధునిక పద్ధతులను నేర్పేందుకు, ప్రస్తుత పద్ధతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం/ టి.ఎస్.ఎఫ్.కాఫ్ నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు హాజరయ్యేందుకు సభ్యులు సంసిద్ధంగా ఉండాలి.

5.9 పథకం అమలులో సభ్యులు కానీ, సభ్య సంఘాలు కానీ ఎలాంటి అక్రమాలకు, మోసాలకు పాల్పడినట్లైతే అట్టి వారిపై ప్రస్తుతం అమలులో ఉన్న సహకారచట్ట నియమనిబంధనల ప్రకారం తీసుకొనే చర్యలకు బాధ్యులవుతారు.

లబ్ధిదారుల ఎంపిక పద్ధతి

6.1 ఐఎఫ్డీఎస్ పథకం యొక్క వివిధ అంశాలు, అర్హతలు తదితర వివరాల పై మత్స్యకార సామాజికవర్గాలలో సభ్యులందరికీ తెలిసేలా వివిధ ప్రచార పద్ధతుల ద్వారా జిల్లా అధికారులు విస్తృతమైన ప్రచారం చేయాలి. మత్స్య సహకార సంఘాల సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి మరియు పథకం క్రింద వివిధ అంశాలను తెలియజేస్తూ కరపత్రాలను మరియు దరఖాస్తులను వివిధ స్థాయిలలో పంపిణీ చేయాలి.

6.2. లబ్దిదారు దరఖాస్తును పూర్తి చేసి జిల్లా మేనేజర్ కు సమర్పించాలి. మీ- సేవ కేంద్రం నుండి కానీ, ఏదైనా ఇంటర్ నెట్ కేంద్రం ద్వారా కానీ లేదా స్వంతం గా ఇలాబ్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చును. కొత్త చేపల చెరువుల నిర్మాణం, రీ సర్క్యులేటరీ ఆక్వాకల్చర్, అలంకరణ చేపల యూనిట్ల నిర్మాణం, చేప విత్తనాల హాచరీస్ నిర్మాణం, విత్తన చేపల పెంపకం యూనిట్లు, ఐస్ప్లాంట్ల నిర్మాణం, చిన్నస్థాయి చేపల దాణా మిల్లుల ఏర్పాటు, వలలు/ పుట్టి తయారీ యూనిట్, చేపల ప్రోసెసింగు యూనిట్ వంటి భూమి ఆధారిత అంశాలన్నిటికీ ఆఫ్ లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పుడు భూమి కి సంభందించిన దస్తావేజులు/ పట్టా పాసుపుస్తకాలు లేదా కౌలు వోప్పంద పత్రాల ప్రతులను దరఖాస్తు తో పాటు నేరుగా జిల్లా మేనేజరుకు సమర్పించాలి.

6.3 ఆన్ లైన్లో దరఖాస్తులు సమర్పించిన దరఖాస్తుదారులు, తమ దరఖాస్తును ప్రింట తీసుకొని ఫొటోలు, అవసరమైన ఇతర పత్రాలతో పాటు తనిఖీ సమయంలో సమర్పించాలి.

6.4 ఒక వ్యక్తిగత లబ్దిదారుడు ఒకటో కేటగిరీ క్రింద (ద్విచక్ర వాహనంతో చేపల అమ్మకం యూనిట్, వలలు, కాపులు, ప్లాస్టిక్ చేపల క్రేట్లు, పోర్టబుల్ చేపల అమ్మకం కియోస్కు) 4 లేదా అంతకన్నా తక్కువ అంశాలకు దరఖాస్తు చేసుకొనవలెను రెండవ కేటగిరీ లోని అంశాలలో (లగేజీ ఆటోతో చేపల అమ్మకం యూనిట్, కొత్త చేపల చెరువుల నిర్మాణం తదితరాలు) ఒకదానికి మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను.

6.5 వ్యక్తిగత యూనిట్టు కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి, గ్రూపు యూనిట్లు కోసం దరఖాస్తు చేసుకోను గ్రూపులో సభ్యుడు గాను ఉండవచ్చును. ఇదే నియమం సంఘం తరుపున దరఖాస్తు చేసుకొనే యూనిట్లకు కూడా వర్తిస్తుంది. ఒక గ్రూపు కానీ, ఒక సంఘం కానీ ఏదో ఒక అంశమునకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి (ఈ నిబంధన లబ్ధిదారుల వాటా చెల్లించాల్సిన అంశాలకు మాత్రమే వర్తిస్తుంది. 100% రాయితీ గల అంశాలకు వర్తించదు).

6.6 జిల్లా మేనేజరు వచ్చిన దరఖాస్తుల యొక్క అర్హతలను పరిశీలించి తగిన అర్హతలున్న వాటిని జిల్లాస్థాయి ఎంపిక కమిటీకి సమర్పించాలి.

6.7. ఒక జిల్లాలో ఒక అంశానికి కేటాయించిన యూనిట్ల సంఖ్య కన్నా అర్హతగల దరఖాస్తుల సంఖ్య తక్కువగా లేదా సమానంగా ఉన్నట్లైతే, వచ్చిన అర్హతగల దరఖాస్తులన్నీ ఆమోదం కొరకు పరిగణించబడతాయి. అర్హతగల దరఖాస్తుల సంఖ్య, కేటాయించిన యూనిట్ల సంఖ్య కన్నా ఎక్కువ ఉన్నట్లైతే , తగిన నిర్ణయం కొరకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ (డి.ఎల్.ఎస్.సి) తరుపున జిల్లా మేనేజరు రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ (టి ఎస్ ఎఫ్ కాఫ్ కు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేయాలి.

6.8 జిల్లా స్థాయిలో ఆమోదించాల్సిన అంశాలకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశాక, వారికి ఆమోదం, పరిపాలన అనుమతిని జారీచేయాలి.

6.9 రాష్ట్రస్థాయిలో ఆమోదం పొందవలసిన దరఖాస్తులను జిల్లా స్థాయి ఎంపిక కమిటీ తనిఖీ చేసి, అర్హత గల దరఖాస్తులను ఆమోదం మరియు పరిపాలన అనుమతి కొరకు రాష్ట్రస్థాయికి పంపాలి.

6.10 జిల్లా స్థాయి ఎంపిక కమిటీ సిఫార్సు చేసిన ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి ఎంపిక కమిటీ పరిసీలిస్తుంది. జనరల్ మేనేజర్, టి.ఎస్.ఎఫ్.కాఫ్ అట్టి ప్రతిపాదనలను జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నుంచి స్వీకరించాక, వాటిని తనిఖీ చేసి అర్హతగల దరఖాస్తులను ఆమోదించుటకు రాష్ట్రస్థాయి ఎంపిక కమిటీ సమావేశాన్ని నిర్వహించాలి. మేనేజింగ్ డైరెక్టర్, టి.ఎస్.ఎఫ్.కాఫ్ ఆమోదం పొందిన దరఖాస్తులకు పరిపాలన మంజూరీ జారి చేసి అమలుకై సంబంధిత జిల్లాలకు పంపాలి.

కొనుగోళ్లు మరియు నిధుల విడుదల

7.1 జిల్లా మేనేజరు మరియు జిల్లా కలెక్టరు సంయుక్తంగా నిర్వహించేలా పథకానికి ఒక జాయింట్ అకౌంటును తెరవాలి. మొదట్లో పథకాలకు సంబంధించిన పనులను తక్షణం ప్రారంభించేందుకు కొంత నిధులు జాయింట్ అకౌంట్ కు బదిలీ చేయబడతాయి. ఆ నీధులలో 80 శాతాన్ని వినియోగించిన తర్వాత అవసరాన్ని బట్టి నిధులు విడుదల చేయాలని కోరుతూ టి.ఎస్.ఎఫ్.కాఫ్ కు విజ్ఞప్తి చేయాలి.

7.2 వివిధ అంశాలకు కొనుగోళ్ల విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది:

a. లబ్ధిదారునికి వ్యక్తిగత యూనిట్ల సరఫరా:

  1. ఎంపిక చేసిన లబ్దిదారులకు యూనిట్ వ్యయం, రాయితీ లభిదారుల చెల్లించాల్లిన వాటా వివరాలు, గుర్తింపు పొందిన విక్రయ సంస్థల వివరాలు, ఆమోదము పొందిన వస్తువులు మరియు వాటి నిర్థారిత ధరల వివరాలను తెలియజేయాలి. లబ్దిదారు ఆ జాబితా నుండి తమకు నచ్చిన వస్తువులను ఎంపిక చేసుకొని, ఎంపిక పత్రం ద్వారా జిల్లా మేనేజరుకు తెలుపుతూ, తాము చెల్లించాల్సిన వాటా సొమ్మును డిమాండు డ్రాప్టు రూపంలో చెల్లించాలి. జిల్లా మేనేజరు డిమాండు డ్రాప్టు ముట్టినట్లు రశీదు జారీ చేయాలి మరియు దీనికి సంబంధించి ఒక రిజిష్టరును నిర్వహించాలి.
  2. పుట్టి, తెప్పలను సరఫరా చేయుటకు విక్రయదారుల గుర్తింపు ప్రక్రియ జిల్లా స్థాయి నందు చేపట్టవలెను. ఇతర వ్యక్తిగత యూనిట్లకు విక్రయదారుల ఎంపిక రాష్ట్రస్థాయిలో టెండరు విధానంలో ఖరారు చేయాలి.
  3. ఇన్సులేటడ్ ఐస్ బాక్సులకు ఎంపెడా(సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి ప్రాధికార సంస్థ) ఎంపిక చేసిన ఏజన్సీలను, నిర్థారిత ధరలను వినియోగించుకోవాలి.
  4. లబ్ధిదారులు తాము ఎంచుకున్న యూనిట్లు కై తమ వాటాను చెల్లించిన తర్వాత జిల్లా మేనేజర్ గుర్తింపు పొందిన విక్రయ సంస్ధ/ఎంపిక చేసుకున్న విక్రయదారుకు ఆర్డర్ ఇవ్వాలి.
  5. జిల్లా కలెక్టర్ యూనిట్ యొక్క మొత్తం వ్యయము (లబ్దిదారుని వాటా, రాయితీ కలిపి) గుర్తింపు పొందిన విక్రయ సంస్థకు / ఎంపిక చేసిన విక్రయదారుకు యూనిట్ ఒక్క అసలు వ్యయమును బట్టి నిర్దేశించిన రాయితీ ని మించకుండా విడుదల చేయుటకు అనుమతి ఇవ్వాలి. యూనిట్లు వాస్తవ ధర నిర్ధారిత ధర కన్నా ఎక్కువ ఉన్నట్లైతే, అదనపు మొత్తాన్ని లబ్దిదారే భరించాలి.
  6. యూనిట్లను అధీక్రుత సరఫరాదారుల నుంచి కొనుగోలు చేసి లబ్దిదారులకు పంపిణీ చేయాలి.
  7. ద్విచక్రవాహనంతో చేపల అమ్మకం యూనిట్లు, లగేజీ ఆటోతో చేపల అమ్మకం యూనిట్లు, సంచార చేపల అమ్మకం యూనిట్లకు, పరిశుభ్ర చేపల రవాణా వాహనానికి, ఇన్సులేటెడ్ ట్రక్కులకు కావాలసిన పరికరాలు ఉదా: కత్తులు, తొట్టెలు, ఆక్సిజన్ సిలిండర్లు మొదలగునవి లబ్దిదారుడు తన అవసరానికి అనుగుణంగా కొనుగోలు చేసి వాటి బిల్లులు సమర్పించి, అర్హతను బట్టి రాయితీ పొందవచ్చును.

b. ప్రభుత్వం ద్వారా భవనాలు, మౌలిక సౌకర్యాల నిర్మాణం

మార్కెట్లు, లాండింగ్ సెంటర్లు, చేపల విత్తన క్షేత్రాలు తదితరాలను నిర్ధారిత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం జరిపేందుకు జిల్లాస్థాయి ఎంపిక కమిటీ ఒక అమలు సంస్థను నియమించాలి. నిధులను పని యొక్క ప్రగతిని బట్టి దశల వారీగా అమలు సంస్థకు విడుదల చేయాలి.

c. లబ్దిదారుని ద్వారా భవనాలు, మౌలిక వసతుల నిర్మాణం

  1. లబ్దిదారు దరఖాస్తుతో పాటు సంబంధిత భూమి దస్తావేజుల ప్రతిని జిల్లామేనేజరుకు స్వయంగా సమర్పించాలి. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకొన్నప్పుడు, ఫొటో మరియు సంబంధిత భూమి దస్తావేజులను పరిశీలన సమయంలో సమర్పించాలి. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్), లే అవుట్, డీయలసీ అనుమతి తదితరాలను యూనిట్ మంజూరు ఉత్తర్వులు అందుకున్న 30 రోజులలోగా సమర్పించాలి.
  2. భూమి లీజుకు తీసుకున్న పక్షంలో కనీసం 5 సంవత్సరాలకు కౌలు ఒప్పందం చేయించుకోని ఉండాలి.
  3. లబ్ధిదారులు బ్యాంకు నందు పొదుపు ఖాతా తెరిచి ఖాతా వివరాలు దరకాస్తు తో పాటు సమర్పించాలి. (గ్రూపు లబ్ధిదారులకు సమిష్టి ఖాతా, ప్రస్తుతమున్న బ్యాంకు ఖాతాను వ్యక్తిగత/ సంఘం జిల్లా మత్స్య సహకార సంఘం వినియోగించుకోవచ్చు).
  4. జిల్లా మేనేజరు తనిఖీ చేసే సమయంలో భూమికి సంబంధించిన అసలు డాక్యుమెంట్లు (ధృవ పత్రాల ఒరిజినళ్లు) చూపించాలి. అర్హతగల లబ్దిదారులకు ఆమోదం తెలిపి, మంజూరు పత్రాలు జారీ చేయాలి. పరిపాలన అనుమతులు జారీ చేశాక ఇతర తగిన ధ్రువపత్రాల సమర్పించాలి. ఆ తరువాత లబ్దిదారులు నిర్మాణ పని ప్రారంభించి 50% వరకూ పని పూర్తి చేసిన తర్వాత రాయితీ మొత్తంలో 50% నకై దరఖాస్తు చేసుకోవాలి.
  5. రాయితీ మొత్తాన్ని ఆన్ లైన్ పద్ధతిలో పని ప్రగతిని బట్టి రెండు వాయిదాలుగా విడుదల చేయాలి. (మొదటి వాయిదాగా 50% రాయితీ సొమ్ము 50% పని పూర్తయిన తర్వాత, మిగిలిన 50% మొత్తం పని పూర్తయిన తర్వాత).
  6. జిల్లా కలెక్టరు ఎంపిక చేసిన ఏదైనా ఇంజినీరింగ్ శాఖ వారు పనుల ప్రగతిని నమోదు చేయాలి. తర్వాత పనులకు చెల్లింపు చేసే ముందు, జిల్లా మేనేజరు ప్రత్యక్షంగా పనులను తనిఖీ చేయాలి.

ఐఎఫ్డీఎస్ పథకం అమలుకు ప్రచారం

టి.ఎస్.ఎఫ్.కాఫ్ మరియు జిల్లా స్థాయిలో జిల్లా యంత్రాంగం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల సహకారం తో ఐఎఫ్డీయెస్ పథకం అంశాలు, దరఖాస్తుకు అర్హతలు, లబ్ధిదారుల ఎంపిక విధానం, యూనిట్ వ్యయం, రాయితీ, దరఖాస్తు చేసే విధానం తదితర అంశాలపై విస్తృత ప్రచారం ప్రచారం చేయాలి. బ్రోచర్లు, కరపత్రాల ముద్రణ, అవగాహనా సదస్సుల నిర్వాహణ, ప్రాథమిక శిక్షణా శిభిరాలు, క్షేత్ర సందర్శనలకు కావాల్సిన నిధులు జిల్లాలకు అందజేయబడతాయి.

పర్యవేక్షణ

9.1. రాష్ట్రస్థాయిలో మేనేజింగు డైరెక్టరు, టి.ఎస్.ఎఫ్.కాఫ్ పథకానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ సమన్వయం మరియు పర్యవేక్షణ నిర్వహిస్తారు.

9.2. పథకం యొక్క ప్రగతిని మరియు అమలునూ పర్యవేక్షించడానికి రాబోయే కాలంలో యాజమాన్య సమాచార వ్యవస్థ (MIS) ను ఏర్పాటు చేస్తారు.

9.3. పారదర్శకత, జవాబుదారీతనము మరియు జగురుకతతో పథకం అమలుచేసేందుకు అవసరమైన చర్యలన్నీ జిల్లాస్థాయిలో తీసుకోనబడతాయి.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate