অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఇ-పాలనా లో ఉపయోగపడే సమాచారం-1

ఇ-పాలనా లో ఉపయోగపడే సమాచారం-1

బ్యాంకులు అందిస్తున్న వివిధ రకాల పొదుపు ఖాతాలు

నగదు లావాదేవీలు నిర్వహించడానికి మనం బ్యాంకుకు వెళుతుంటాం. ఐతే బ్యాంకులో వివిధ రకాలైన బ్యాంకు ఖాతాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా కస్టమర్ వయసు, సంపాదనను బట్టి బ్యాంకులో వివిధ రకాలైన ఖాతాల ఓపెన్ చేయిస్తుంటారు.

* సీనియర్ సిటిజన్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్

పేరులోనే ఈ ఖాతా ఎవరికోసమో తెలుస్తుంది. 60 సంవత్సరాలు పైబడిన వారికోసం ప్రత్యేకంగా ఈ ఖాతాను బ్యాంకులు అందిస్తున్నాయి. ఈ ఖాతా వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్‌కు ప్రభుత్వ బ్యాంకులు అధిక వడ్డీని అందిస్తున్నాయి.

* మహిళా పొదుపు ఖాతాలు

మహిళల కోసం ప్రత్యేంగా కొన్ని బ్యాంకులు ఈ ఖాతాలను అందిస్తున్నాయి. మహిళల ఆర్థిక అవసరాలు, పెట్టుబడి మరియు జీవనశైలి అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు ఈ ఖాతాలను ప్రవేశపెట్టాయి. ఈ పొదుపు ఖాతాలకు కొన్ని బ్యాంకులు ఆకర్షణీయమైన ప్రయోజనాలు అధిక ఉపసంహరణ పరిమితి అందిస్తున్నాయి.

* సాధారణ సేవింగ్ అకౌంట్స్

సాధారణ పొదుపు ఖాతా ఎవరైనా తెరవవచ్చు. ఈ ఖాతాల్లో క్వార్టర్లీకి కొంత మొత్తం నిల్వ ఉంచాల్సి ఉంటుంది. అలా నిర్వహించిన పక్షంలో బ్యాంకులు పెనాల్టీ వసూలు చేసే అవకాశం ఉంది.
సాధారణ పొదుపు ఖాతా లావాదేవీల పుస్తకం, నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, పుస్తకం సౌకర్యం మరియు డెబిట్ కార్డులు లాంటి లక్షణాలను అందిస్తుంది.

* నో ఫ్రిల్ సేవింగ్ అకౌంట్స్

నో ఫ్రిల్ సేవింగ్స్ ఖాతా కలిగిన వ్యక్తులు కనీస బ్యాలెన్స్ ప్రమాణం లేదా చాలా తక్కువ కనీస బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. భారతదేశం యొక్క రిజర్వ్ బ్యాంక్ సూచన ప్రకారం ఎక్కువ మంది చేరుకోవడానికి దీన్ని ప్రవేశపెట్టారు. అయితే, నో ఫ్రిల్ ఖాతా నిర్దిష్ట పరిమితులతో బ్యాంకు నుండి బ్యాంకు మారుతుంటుంది.

* స్టూడెంట్ సేవింగ్స్ ఖాతా

కేవలం కొన్ని బ్యాంకులు మాత్రమే ఈ స్టూడెంట్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నాయి. ఈ ఖాతా కనీస బ్యాలెన్స్ లేదా చాలా తక్కువ సంతులనంతో నిర్వహించాల్సి ఉంటుంది.

* ఎన్నారై కోసం ప్రత్యేక అకౌంట్స్

ఎన్నారైల కోసం ప్రత్యేకించి కొన్ని బ్యాంకులు ఖాతాలను అందిస్తున్నాయి. అవేంటో చూద్దాం.

* ఎన్ఆర్ఈ సేవింగ్స్ అకౌంట్

ఈ ఖాతాలో రూపాయి తెగలతో నిర్వహించబడుతుంది. భారత జాతీయతను దృష్టిలో పెట్టుకుని వ్యక్తులు అందించిన సమాచారం మేరకు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పేర్లతో ఖాతాలో ఓపెన్ చేయవచ్చు.

* ఎన్ఆర్ఓ సేవింగ్స్ అకౌంట్

ఎన్ఆర్ఓ పొదుపు ఖాతాలు కరెంట్, సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు అనుసంధానం చేయబడి రూపాయి తెగలతో నిర్వహించబడుతుంది. ఈ ఖాతాను నివాసితులు సంయుక్తంగా నిర్వహించవచ్చు. భారత్‌లో నివసిస్తున్న వారు కూడా ఈ ఎన్ఆర్ఓ సేవింగ్స్ అకౌంట్‌లోకి నగదును బదిలీ చేయవచ్చు.

బ్యాంకు మిత్ర ఎవరు? ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకు ఎలా సాయం చేస్తారు?

ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్ ధన్ యోజన పథకం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 'బ్యాంకు మిత్ర' పనిచేస్తున్నారు. బ్యాంకు సేవలు లేని గ్రామాల్లో బ్యాంకుల గురించి ప్రజలకు తెలియజేసే ఏజెంటే 'బ్యాంకు మిత్ర'. బ్యాంకులు, ఏటీఎమ్‌లు లేని ప్రాంతాల్లో వీరి చేస్తున్న కృషి అభినందనీయం.

జన్ ధన్ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను చేర్చించడంలో వీరి కృషి అమోఘం. బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు గాను ప్రజల వద్ద నుంచి డాక్యుమెంట్స్ తీసుకుని వాటిని సరైనవిగా ధృవీకరించుకుని బ్యాంకుల్లో ఇస్తుంటారు.

బ్యాంకుల్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో, అప్లికేషన్స్ ఎలా నింపాలో కస్టమర్లకు తెలియపరుస్తుంటారు. ప్రజలకు బ్యాంకు ఖాతాల్లో నగదు ఏవిధంగా డిపాజిట్ చేయాలి, ఏవిధంగా నగదు విత్ డ్రా తీసుకోవాలి లాంటి విషయాలు చెప్తుంటారు.

వీటితో పాటు భారత్‌లో బ్యాంకింగ్ అనుభవం లేనటువంటి ప్రజలకు, బ్యాంకులకు మధ్య అనుసంధాన కర్తగా ఈ బ్యాంక్ మిత్ర పనిచేస్తుంటారు. బ్యాంకుకు సంబంధించిన విషయాలు, నియమాలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు.

'బ్యాంకు మిత్ర' గా ఎవరు కాగలరు?

బ్యాంకు లావాదేవీల గురించి తెలిసిన వారిని బ్యాంకు మిత్రగా తీసుకుంటారు. సాధారణంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగులు, చిన్న మొత్తాల పొదుపు సంస్ధలకు చెందిన ఉద్యోగులు బ్యాంకు మిత్రగా ఉండేందుకు అర్హులు.

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం గురించి:

భారతదేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బ్యాంకింగ్ రంగం సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధాని నరేంద్రమోడీ "ప్రధానమంత్రి జన్ ధన్ యోజన" (పీఎంజేడీవై) పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా బ్యాంకు ఖాతా తెరవడం వల్ల రుణాలు, కాల పరిమితి డిపాజిట్ల వంటి సౌకర్యాలు పొందవచ్చు.

ఈ పథకం ద్వారా కనీస మొత్తం డిపాజిట్ చేయనవసరం లేకుండానే ఖాతాలను తెరవచ్చు. ఖాతా తెరిచిన ఆరు నెలల పాటు సక్రమంగా నడిపితే బ్యాంకు ఒక వెయ్యి రూపాయల పరిమితితో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించడం తోపాటు రుణ పరిమితిని రూ. 5వేల వరకు పెంచుతారు. ఖాతాను తెరిచిన 42 రోజుల నుంచి లక్ష రూపా యల బీమా సౌకర్యం కల్పించనున్నారు.

బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేస్తారు. తద్వారా లబ్ధిదారులకు వంటగ్యాస్, వృద్ధాప్య పింఛన్, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.

డిపాజిట్లు: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌... ఏది ఉత్తమం?

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డి), రికరింగ్‌ డిపాజిట్లు (ఆర్‌డి) ఈ రెండు డిపాజిట్లు కూడా పెట్టుబడులకు రక్షణ కల్పించి స్థిరమైన రాబడులను కస్టమర్లకు అందిస్తాయి. లిక్విడిటీ అవకాశాలు ఈ రెండిట్లోనూ సమానంగా ఉంటాయి. ఈ డిపాజిట్లపై రుణం తీసుకోవచ్చు లేదా మెచ్యూరిటీ కంటే ముందే కొంత డబ్బును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.

విత్‌డ్రా చేసుకునే సందర్భంలో కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రాబడుల పరంగా చూస్తే రెండు డిపాజిట్లు పోల్చితే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మొదటి స్ధానం లభిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో మొత్తం డబ్బుని ఒకేసారి డిపాజిట్ చేస్తాం. అందుకే మొదటి నెల నుంచి వచ్చే వడ్డీ గరిష్ట స్ధాయిలో ఉంటుంది.

ఇక రికరింగ్ డిపాజిట్లు అంటే నెల నెల కొంత డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. వడ్డీలో తేడాలుంటాయి. నెల నెల వచ్చే వడ్డీలో కూడా మారుతుంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి జత చేరడంతో రాబడులు ఎక్కువగా ఉంటాయి.

ఇక రికరింగ్ డిపాటిట్ పెట్టుబడులపై పెట్టుబడిదారుడు చక్రవడ్డీని పూర్తిస్దాయిలో పొందలేడు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కాల పరిమితి ఎంత ఎక్కువగా ఉంటే అన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఈ రెండు డిపాజిట్లపై వచ్చే వడ్డీకి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ద్వారా ఒక ఏడాదిలో అందే వడ్డీ రాబడులు రూ. 10,000కు మించితే బ్యాంకు టిడిఎస్‌ రూపంలో పన్ను వసూలు చేస్తుంది. చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేయాలనుకుంటే రికరింగ్‌ డిపాజిట్‌ ఉత్తమం. అలా కాకుండా ఒకేసారి ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేయాలనుకునే వారికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చక్కగా ఉంటుంది.

క్రెడిట్ కార్డు వరమా, శాపమా?

'క్రెడిట్ కార్డు' ప్రస్తుతం ఈ పేరు వినని వారున్నారంటే హాస్యస్పదం. క్రెడిట్ కార్డు ఉంటే క్యాష్ ఉన్నట్లే. ఈరోజుల్లో క్యాష్ ని తమ వెంట తీసుకెళ్లడం కంటే క్రెడిట్ కార్డు ఉంటే చాలు అనుకునే వారే ఎక్కువ. అంతే కాదు క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత చాలా మంది విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు కూడా. కొన్ని సందర్బాల్లో క్రెడిట్ కార్డు వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి.

క్రెడిట్ స్కోరు పెంచుకోవచ్చు

క్రెడిట్ కార్డుతో ఏదైనా లావాదేవీలు జరిపినప్పుడు స్కోరు వస్తుంది. ఈ క్రెడిట్ స్కోరు వల్ల బ్యాంకుల్లో లోన్స్ త్వరితగతిన పొందే అవకాశం ఉంది.

క్రెడిట్ కార్డు వల్ల డిస్కౌంట్స్ పొందే అవకాశం

ఆన్ లైన్ ద్వారా షాపింగ్ చేసేవారికి క్రెడిట్ కార్డు చాలా ఉపయోగం. చాలా తక్కువ ధరకే ఉత్పత్తులు లభించడంతో పాటు, ఎక్కువ డిస్కౌంట్స్ పొందే అవకాశం ఉంది.

మెడికల్ సహాయం

మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో హాస్పిటల్స్ బిల్లు నిమిత్తం ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం ఉంటుంది. ఇటువంటి సందర్బాల్లో ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకెళ్లే అవసరం లేకుండా క్రెడిట్ కార్డు ఉపయోగించవచ్చు. సాధారణంగా క్రెడిట్ కార్డుల్లో ఎక్కువ మొత్తంలో డబ్బు అందుబాటులో ఉంటుంది. ఈ సందర్బంలో క్రెడిట్ కార్డు ఓ వరం.

సులభంగా ఈఎమ్ఐలు చెల్లించవచ్చు

సాధారణంగా చాలా మందికి షాపింగ్ చేయడంతోపాటు, మార్కెట్లోకి వచ్చిన కొత్త వస్తువులను కొనేటటువంటి అలవాటు ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించకుండా సులభ వాయిదా పద్దతుల ద్వారా చెల్లించే వెసులుబాటు ఉంది.

అతి తక్కువ సమయంలో పర్సనల్ లోన్

క్రెడిట్ కార్డుల ద్వారా అతి తక్కువ సమయంలో పర్సనల్ లోన్ సౌకర్యాన్ని అన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. ఈ పర్సనల్ లోన్ కి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. తక్కువ సమయంలో లోన్ పొందడానికి ఇదొక సులభ మార్గం.

డిమ్యాట్ ఎకౌంట్‌‌ను ఓపెన్ చెయ్యడం ఎలా..?

డిమ్యాట్ ఎకౌంట్ అంటే ఏమిటీ..? దానిని ఓపెన్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే తప్పనిసరిగా డిమ్యాట్ ఎకౌంట్ అవసరం. షేర్లు మరియు సెక్యూరిటీస్ (డెబించర్స్, బాండ్స్) మొదలగున వాటిని విక్రయించడానికి డిమ్యాట్ ఎకౌంట్ తప్పనిసరి. డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చేసేందుకు వినియోగదారులు ఎటువంటి స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏమిటంటే డిమ్యాట్ ఎకౌంట్‌లో మీ సెక్యూరిటీస్ జీరోగా కూడా కలిగి ఉండవచ్చు.

సాధారణంగా స్టాక్ మార్కెట్లలో షేర్లు, సెక్యూరిటీస్ ఒక ఎకౌంట్ నుండి ఇంకొక ఎకౌంట్‌కి బదిలీ చేయడం తాత్కాలికం. మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని ఉంటే డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చెయ్యడం ఇప్పుడు చాలా సులభం. డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చెయ్యడం ఎలాగో చూద్దాం.మీరు ఎందుకు డిమ్యాట్ ఎకౌంట్‌ను కలిగి ఉండాలి..?

సెబి మార్గదర్శకాల ప్రకారం - డిమెటరియలైజ్డ్ రూపంలో తప్ప ఏ రూపంలో విక్రయించకూడదు. అందువల్ల మీరు స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా వాటాల క్రయవిక్రయాలు జరపాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఒక డిమ్యాట్ ఎకౌంట్‌ను కలిగి ఉండాలి.

డిమ్యాట్ ఎకౌంట్ ఎలా పని చేస్తుంది: మీరు వాటాలను కొనుగోలు చేసినప్పుడు, బ్రోకర్ మీ వాటాల హోల్డింగ్స్‌ ఈ డిమ్యాట్ ఎకౌంట్ క్రెడిట్లు ప్రకటనలో ప్రతిఫలిస్తాయి. మీరు ఇంటర్నెట్ ఫ్లాట్ ఫామ్ ఆధారంగా ట్రేడింగ్‌ను నిర్వహిస్తున్నారు కాబట్టి ఆన్ లైన్‌లో మీ హోల్టింగ్స్‌ను చూడొచ్చు. మీరు ఎప్పుడైనా వాటాలను అమ్మదలిస్తే, వివిధ స్టాక్ వివరాలు నింపి డెలివరీ సూచనల నోటుని మీ బ్రోకర్‌కు ఇవ్వాలి. మీ ఖాతా వాటాలను డెబిట్ చేసిన తర్వాత అప్పుడు మీరు అమ్మిన వాటాలకు డబ్బు చెల్లిస్తారు. అదే మీరు ఆన్ లైన్‌లో ఇంటర్నెట్ ద్వారా ట్రేడింగ్ నిర్వహిస్తుంటే వాటంతటవే షేర్స్ డెబిట్ అయి, మీ ఖాతాల్లో డబ్బు క్రెడిట్ అవుతుంది.

డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చెయ్యడం వల్ల ఉపయోగాలు:

  • భౌతిక రూపాలలో వాటాలను ఉంచాల్సిన అవసరం లేదు
  • వాటాలలో ఒక వాటా క్రయవిక్రయాలు జరపవచ్చు
  • బదిలీ సంఖ్యపై స్టాంపు డ్యూటీ లేదు బదిలీ దస్తావేజు అవసరం లేదు.

మొదటగా నగదు నిల్వల భాగస్వాములను సందర్శించండి

నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ లేదా సెంట్రల్ డిపాజిటరీ ద్వారా జాబితాలో రిజిస్టరైన నగదు నిల్వల భాగస్వాములను సందర్శించండి. బ్రోకింగ్ సంస్థలు మరియు బ్యాంకులు చాలా సౌకర్యాలు డిమ్యాట్ ఖాతా తెరవడానికి అందిస్తున్నాయి. భారతదేశంలో మొత్తం రెండు డిపాజిటరీస్ ఉన్నాయి. అవి ఒకటి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ (NSDL), రెండవది సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (CDSL).

కావాల్సిన డాక్యుమెంట్స్

డాక్యుమెంట్స్‌గా ఐడెంటిటీ కార్డు, పుట్టినరోజు ధృవపత్రం, నివాస స్దల పత్రం, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఎలక్షన్ కార్డు మొదలగునవి.

అగ్రిమెంట్

డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చేసే ముందు నగదు నిల్వల భాగస్వామికి, ఇన్వెస్టర్‌కి మధ్య ఒప్పంద జరుగుతుంది.

పాన్ కార్డు తప్పనిసరి

సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) నిబంధనల ప్రకారం డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చేసేందుకు పాన్ కార్డు తప్పనిసరి.

బివో ఐడి (BO ID)

డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు బివో ఐడి (ప్రయోజనకరమైన యజమాని గుర్తింపు) నెంబర్‌ను పొందుతారు. ఈ నెంబర్‌ని ఉపయోగించి షేర్లు, సెక్యూరిటీస్ మొదలగున వాటిని మీరు బదలాయించుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో డూప్లికేట్ ఆధార్ కార్డు పొందడం ఎలా?

ఆధార్‌కార్డు పోయిందని చింతిస్తున్నారా... ఇక పోయినదాని గురించి బయపడవలసిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో తీసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇటీవల కాలంలో బ్యాంకు ఖాతాలకు సైతం ఆధార్‌ను అనుసంధానం చేశారు. దీంతో ప్రతి ఒక్కరికి అవసరమైన నేపథ్యంలో ప్రతి మండల కేంద్రంలో మీ సేవా కేంద్రాల్లో శాశ్వత ఆధార్ కేంద్రాలను నెలకొల్పి ఆధార్ నమోదు చేసి కార్డులను అందజేస్తోంది.

ప్రస్తుతం ప్రభుత్వం అందజేస్తున్న పథకాలైన పక్కాగృహాలు, పింఛన్లు, రుణమాఫీ, రేషన్‌కార్డుతో పాటు నివాస, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు వంటివి సైతం పొందేందుకు ఆధార్‌కార్డు తప్పనిసరి అన్నారు. దీంతో ప్రభుత్వం అన్నింటికీ ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేశారు.

ఇప్పటికే ఆధార్‌కార్డు పొందినటువంటివారు పొరపాటున ఎక్కడైన పోగొట్టుకున్నా చిరిగిపోయినా కనీసం కార్డునెంబర్ తెలియకపోయినప్పటికీ ఆన్‌లైన్ ద్వారా తిరిగి పొందే అవకాశం ఉంది. ఆధార్ కార్డు పోగొట్టుకోన్నప్పుడు తర్వాతి ప్రత్యామ్నాయం నమోదు సంఖ్య, మీ నమోదు సంఖ్య మీ దగ్గర ఉన్నట్లయితే సులభంగా ఆధార్ కార్డు తిరిగి పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో మీ నమోదు సంఖ్య, మొబైల్ నెంబర్ మొదలగు వివరాలను ఇవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నమోదు సంఖ్య, మొబైల్ నెంబర్ మొదలగు వివరాలను కూడా పోగొట్టుకొంటే , ఆధార్ కార్డు రిజిస్టర్ కేంద్రం దగ్గరకు వెళ్లి మీ పేరు, చిరునామాతో వెతికి పొందవచ్చు.

ఆన్ లైన్‌లో నకిలీ ఆధార్ కార్డు లేదా పొగొట్టుకున్న ఆధార్ కార్డు కోసం ఈ పద్ధతిని అనుసరించండి.

* ఆధార్ డౌన్‌లోడ్ చేయదలచుకున్నవారు గెట్ ఈ-ఆధార్‌పై క్లిక్ చేయాలి. వెంటనే ఈ-ఆధార్‌తో కూడిన పేజీ ఓపెన్ అవుతుంది.

* అక్కడ కనిపించే వివరాలను నమోదు చేసి మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, గెట్ వన్ టైమ్ పాస్‌వర్డ్ అని ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

* కొన్ని సెకన్ల తర్వాత మొబైల్ నంబర్‌కు ఆరు అంకెల తో కూడిన ఓటీపీ పాస్‌వర్డ్ మెసేజీ రూపంలో వస్తుంది. ఆ నెంబర్‌ను ఎంటర్ ఓటీపీ అనే బాక్సులో నమోదు చేసి వాల్యూడేగట్ అండ్ డౌన్‌లోడ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

* అనంతరం డౌన్‌లోడ్‌తో కూడిన ఫైల్ కనిపిస్తుంది. అందులో ఓపెన్, సేవ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. కావలసిన వారు సేవ్ ఆప్షన్‌ను క్లిక్ చేసిన వెంటనే పాస్‌వర్డ్ అడుగుతుంది.

* అక్కడ మీ పోస్టల్ పిన్‌కోడ్‌ను ఎంటర్ చేసి ఓకే చేసిన వెంటనే మీ ఆధార్‌కార్డు కనిపిస్తుంది. ఆధార్‌కార్డుతో అవసరమైన పనిని చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు.

టాక్స్ సేవింగ్ పథకాలు అంటే ఏమిటి?

టాక్స్ సేవింగ్ పథకాలు అనగా పన్ను రాయితీలను కల్పిస్తూ మదుపరుల నుండి పెట్టుబడులను ఆహ్వానించేవి అన్నమాట. 1961వ సంవత్సరంలో ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న కొన్ని ప్రత్యేక అధికరణలకు లోబడి ఈ పన్ను రాయితీలను ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాలలో ప్రభుత్వం పన్ను రాయితీలు మదుపరులకు కల్పించడానికి అనుమతినిచ్చింది.

ఉదాహరణకు ఈక్విటీ జోడిత సేవింగ్స్ స్కీములు లాంటివి. పొదుపు పథకాల మ్యూచువల్ ఫండ్స్ కు పన్ను రాయితీలు కల్పిస్తూ ప్రారంభించిన పెన్షన్ పథకాలు కూడా ఇలాంటివే. ఈ పథకాలు అభివృద్ధి సాధన మరియు ఈక్విటిల్లో మదుపుకు ప్రాబల్యం కల్పిస్తూ ఉండేవిగా ఉంటాయి. ఈ పథకాల అభివృద్ధి అవకాశాలతో పాటు రిస్కును కూడుకున్న ఈక్విటీ ఆధారిత పథకాల మాదిరే ఉంటాయి.

u/c 80C క్రింద టాక్స్ సేవింగ్ పథకాలు:

స్థిర ఆదాయపు పథకాలు:

  • PF
  • PPF
  • NSC
  • 5 Year Tax saving Bank FD
  • Senior Citizen Saving Scheme 2004
  • NHB Suvriddhi బాండ్స్

మార్కెట్ ఆధారిత పథకాలు:

  • ELSS Mutual Funds
  • ULIP
  • Pension Fund
  • New Pension Scheme
  • Life Insurance ప్రీమియం

వ్యయ పథకాలు:

  • Tuition Fees
  • Stamp Duty & Registration Charges
  • Home Loan Principal repayment
The Table At A Glance
Savings Scheme Maximum Limit
Life Insurance Premiums No limit
Recognised Provident Fund No limit
Family Pension Scheme Within prescribed limits
16-yr Public Provident Fund Rs. 60,000 p.a.
10/15-yr Unit Linked Insurance Plan Rs. 75,000 target amount
10/15-yr Dhanaraksha Rs. 75,000 target amount
National Savings Certificate - VIII No limit
National Housing Bank No limit
National Savings Scheme-92 No limit
Jeevan Dhara/Jeevan Akshay of LIC No limit
Equity-Linked Tax-Saving Schemes Rs. 10,000
Retirement Benefit Plan of UTI No Limit

యులిప్ అంటే ఏమిటి.. దాని లాభ నష్టాలు..!

యులిప్ అంటే లింక్ చేయబడిన యూనిట్ బీమా పధకం. యులిప్ అనేది జీవిత బీమా పాలసీ. క్యాపిటల్ మార్కెట్ (మదుపులతో కూడిన మార్కెట్ షేర్లు, స్టాక్ మార్కెట్)లు ఈ యులిప్ పథకంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. అంతే కాకుండా మదుపుదారులకు యులిప్‌ అనేవి బీమాతోపాటు పెట్టుబడి ప్రయోజనాలు కూడా పొందడానికి ఒక మార్గం. దీనితో పాటు లింక్ చేయబడిన యూనిట్ బీమా పాలసీలలో మదుపు చేసేటప్పుడు మదుపరులు తమ మదుపుపై వచ్చే నష్టాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. యులిప్‌ పనితీరు విలక్షణమైనది.

మదుపు లక్ష్యాలు కలిగిన ఫండ్స్‌ను మదుపరులకు తగిన రీతిలో ఎన్నో ఇన్సూరెన్స్ సంస్దలు అందిస్తున్నాయి. ఈ ఇన్సూరెన్స్ సంస్దలు అందించేటటువంటి ఫండ్స్ కాలపరిమితో కూడుకున్నవి మరియు నష్టాలను కూడా భరించాల్సి ఉంటుంది. ఉదాహారణకు ఒక పాలసీదారు కొంత సొమ్మును కొన్ని సంవత్సరాలపాటు దీనిపై వెచ్చించాడని అనుకుందాం. అతని సొమ్మును, సంభవింపబోయే నష్టాన్ని అతను తట్టుకోగలిగే స్థాయి ఆధారంగా ఈక్విటీలుగా, రుణాలుగా రెండింటిపైనా పెట్టుబడి చేస్తారు. ఇందులో అనేక పథకాలు ఉంటాయి. కొన్ని పథకాల్లో పాలసీదారులకు, వారు పాలసీ పాలసీ కాలం ముగిసేవరకూ జీవించి ఉన్నట్లయితే నిర్దిష్ట మొత్తంలో సొమ్మును హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఐతే ప్రీమియం మొత్తాలు చాలా అధికంగా ఉంటాయి.

ఉదా: 30 సంతవ్సరాల వయసు కలిగిన వ్యక్తి రూ 10 లక్షల మొత్తాన్ని హామీ ఇచ్చే 20 సంవత్సరాల యులిప్‌ను కొనుగోలు చేసినట్లేతే అతను చెల్లించాల్సిన ప్రీమియం రూ. 25,000 నుండి గరిష్టంగా రూ. 2 లక్షల వరకూ ఉండవచ్చు. (హామీ ఇవ్వబడిన మొత్తం అనేది ప్రీమియంకు ఐదు రెట్లు). కాగా, మరోవైపు బీమాలో అత్యంత స్వచ్ఛంగా భావింపబడే టర్మ్‌ ప్లాన్లో ఇందుకు అయ్యే వ్యయం కేవలం రూ. 3,370 మాత్రమే. ఇందులో ఒక సమస్య ఉంది.

బీమా చేసిన వ్యక్తి జీవించి ఉన్నట్లయితే, టర్మ్‌ ప్లాన్‌లో చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని రూ. 67,400 (3,370 × 20 సంవత్సరాలు) కోల్పోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత రుణాల దృష్ట్యా చూస్తే, ఆ తేడా సొమ్ము రూ. 21,630 (రూ. 25,000 - రూ. 3,370) మదుపు చేసినట్లయితే 8 శాతం ఆదాయాన్ని అందించే ఏ పథకంలో అయినా రాబడి అదే విధంగా రూ. 9.8 లక్షలు వరకూ ఉంటుంది. అందులో కూడా మొత్తం టర్మ్‌ ప్లాన్ సొమ్ము రూ. 67,400 కోల్పోవాల్సి ఉంటుంది. యులిప్‌ అనేది మార్కెట్‌తో ముడిపడి ఉన్నందున, ఈ ప్రయోజనాన్ని దెబ్బతీస్తుంది. ప్రయోజ నాన్ని అందిచాల్సిన సమయంలో మార్కెట్లో ఉండే అనిశ్చిత పరిస్థితులు ఇందుకు కారణం.

యులిప్‌ పథకం వల్ల లాభాలు:

'లాక్‌-ఇన్‌' పిరియడ్‌ కారణంగా స్టాక్స్‌ను కలిగి ఉండేందుకు ఫండ్‌ నిర్వాహకులకు ఎక్కువ కాలం లభిస్తుంది. యులిప్‌ ద్వారా వచ్చే రాబడికి పూర్తి మినహాయింపులు వర్తిస్తాయి. ఒక సంవత్సర కాలంలో 100 శాతం రుణాలు-ఈక్విటీ స్కీములకు మారేందుకు నాలుగు సార్లు ఉచితం.

యులిప్‌ పథకం వల్ల నష్టాలు:

ప్రీమియం కేటాయింపు ఛార్జీలు, పాలసీ అడ్మినిస్ట్రేషన్‌ ఛార్జీలు, మోర్టాలిటీ రేటు వంటి వాటికి అయ్యేటటువంటి వ్యయం అధికం. నాక్‌-ఆఫ్‌ యూనిట్స్‌ వ్యయం ముందుగానే చెల్లించాల్సి రావడం.

సరైన ఇన్సూరెన్స్ పథకం ఎంచుకోవడం ఎలా..?

మనిషికి జీవితా బీమా అవసరం. ఐతే మనం తీసుకునే జీవితబీమా మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో ఆలోచించాలి. మన దేశంలో చాలా కంపెనీలు జీవితబీమాలను అందిస్తున్నాయి. ఐతే మనం
ఎంచుకునే జీవితబీమా ఖచ్చితమైనదిగా ఉండాలి. అసలు మనం ఏ అవసరం కోసం జీవితబీమా తీసుకుంటున్నాం, ఎంత వరకూ రిస్క్ తీసుకోగలం అన్న అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి. ఎటువంటి జీవితబీమా ఎంచుకుంటే మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందో చూద్దాం.

మార్కెట్లో ప్రస్తుతం యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రాడక్ట్స్ (యులిప్స్), సాంప్రదాయ పథకాలు, టర్మ్ ప్లాన్లు అంటూ వివిధ రకాల జీవితబీమా పథకాలు ఉన్నాయి. మీరు కేవలం బీమా ప్రయోజనమే కావాలనుకుంటే టర్మ్ ప్లాన్లు తీసుకోవచ్చు. ఇలా కాకుండా రాబడులను కావాలనుకుంటే యులిప్స్ లేదా సంప్రదాయ పాలసీలను ఎంచుకోవచ్చు.

యులిప్స్ అంటే ఏమిటి:

పాలసీదారు కట్టే ప్రీమియాలను మార్కెట్ సాధనాలైన (షేరు మార్కెట్లు)ల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ రాబడులను అందించేందుకు ఉద్దేశించినవి యులిప్స్. ఐతే, ఈ రాబడులనేవి మార్కెట్స్ హెచ్చుతగ్గులతో ఆధారపడి ఉంటాయి కనుక ఆ మేరకు అధిక రిస్కులు కూడా ఉంటాయి. మనం కట్టే ప్రీమియాలను ఫండ్ హౌసులు ఏయే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయో కూడా తెలుసుకునే వీలుంటుంది. యులిప్స్ పథకాలు పాలసీదారుకు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందిస్తాయి. వీటిని తీసుకున్నప్పుడు మధ్యలోనే వైదొలగకుండా పూర్తికాలం పాలసీని కొనసాగిస్తే పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు.

సంప్రదాయ పథకాలు అంటే ఏమిటి:

రిస్క్ సామర్థ్యం తక్కువగా ఉన్నవారు ఈ తరహా పథకాలు ఎంచుకోవచ్చు. వీటిలో యులిప్స్ కన్నా బీమా రూపంలో లభించే మొత్తం ఎక్కువగా ఉంటుంది. పాలసీ వ్యవధిలో పెట్టుబడులు తక్కువగా ఉంటాయి.

టర్మ్ ప్లాన్స్ పథకాలు అంటే ఏమిటి:

ఇతరత్రా రాబడులతో పని లేకుండా పూర్తిగా బీమా రక్షణ కోసమే పాలసీలు తీసుకోవాలనుకునే వారికి ఇవి అనువైనవి. వీటిపై రాబడులు ఉండవు కాబట్టి మిగతా పథకాలతో పోలిస్తే ఇవి చాలా చౌకగా లభిస్తాయి. తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజి పొందవచ్చు.

ఎల్‌ఐసీ నుంచి కొత్త సూక్ష్మ బీమా పథకం 'భాగ్య లక్ష్మి'

పేద ప్రజల పట్ల తన నిబద్ధతను కొనసాగింపుగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) సోమవారం కొత్త సూక్ష్మ బీమా పథకం 'భాగ్య లక్ష్మి' ప్రారంభించింది. పాలసీ కాలపరిమితి కంటే రెండు సంవత్సరాల తక్కువ ప్రీమియం చెల్లించడం ఈ పాలసీలోని ప్రధాన ఆకర్షణ.

7 సంవత్సరాల నుంచి 15 ఏళ్ల కాలపరిమితిలో భాగ్యలక్ష్మి పథకం లభిస్తోంది. ప్రీమియం చెల్లింపు అనుమతించదగిన రీతులు నెలవారీ జీతం ద్వారా లేదా... త్రైమాసిక, వార్షిక, అర్ధ వార్షికంగా ఉన్నాయి. అయితే, రెండు క్యాలెండర్ నెలల కాలంలో 60 రోజుల కంటే తక్కువ చెల్లింపులకు అనుమతించబడదు.

18 నుంచి 55 ఏళ్ల లోపు వారు ఈ పాలసీని తీసుకునేందుకు అర్హులు. కనీస బీమా రక్షణ మొత్తం రూ. 20,000, గరిష్ట బీమా మొత్తం రూ. 50,000గా నిర్ణయించడం జరిగింది. పాలసీ కాలపరిమితి తర్వాత చెల్లించిన ప్రీమియానికి 110 శాతం గ్యారంటీగా ఇవ్వనున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఆధారము: తెలుగు.గుడ్ రిటర్న్స్.ఇన్

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate