జీవితకాలం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవనం సాగించాలంటే ప్రతి ఒక్కరికీ డబ్బు ప్రధాన అవసరం. అది వయసులో ఉన్నపుడే, సంపాదిస్తున్న రోజుల్లోనే నాలుగురాళ్లు వెనకేసుకుంటే భవిష్యత్ అవసరాలు తీరుతాయి. పెరుగుతున్న ఖర్చులు కుటుంబ పోషణకే సరిపోతున్న నేటి రోజుల్లో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చిన్నమెుత్తాలు రేపటి అవసరాలకు పనికొస్తాయి. దీంతో చాలామంది తమ సంపాదనలో కొంత మెుత్తాన్ని దాచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో తొమ్మిది శాతం వడ్డీ లభిస్తుంది. కనీసం వెయ్యి రూపాయలతో ఈ పథకంలో చేరవచ్చు. వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా మూడులక్షల రూపాయాలు, జాయింట్‌గా అయితే ఆరు లక్షల రూపాయల వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు. ఏడాది తరువాత పెట్టుబడిని ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఏడాది తరువాత పెట్టుబడి ఉపసంహరించుకుంటే డిపాజిట్ సొమ్ములో ఐదు శాతం తగ్గించి ఇస్తారు. మూడేళ్ల తరువాత అయితే ఎలాంటి కోత లేకుండా డిపాజిట్ సొమ్మును తిరిగి ఇస్తారు. చివరిదాకా డిపాజిట్ ఖాతాలో ఉంచితే వడ్డీతోపాటు పది శాతం బోనస్‌గా లభిస్తుంది. గడువుకు ముందే తీసుకుంటే బోనస్ ఉండదు. సెక్షన్ 80ఎల్ కింద ఈ పథకంలో ఉంచిన పెట్టుబడి పై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. రిటైర్డ్ ఉద్యోగులకు, పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్న వారికి ఇది అనుకూలమైన పధకంగా చెప్పవచ్చు. అదేవిధంగా పెద్ద మొత్తంలో పొదుపుచేసి ప్రతి నెలా రాబడి అందుకోవాలని భావించే వారితోపాటు పెన్షన్ సదుపాయంలేని వారికి ఇది అనుకూలమైన పథకం.
ఈ పథకంలో రూ.100 కనిష్ట మొత్తం పొదుపు చేయవచ్చు. గరిష్ట పరిమితి అంటూ లేదు. సాధారణ పరిస్థితులలో గడువుకు ముందే పెట్టుబడి ఉపసంహరించే అవకాశం లేదు. ఖాతాదారుని మరణం సంభవించిన పరిస్థితిలో గడువుకు ముందే ఖాతాను మూసివేయడానికి అవకాశం ఉంది. పొదుపు చేసిన అసలు పై రిబేటు, వడ్డీ పై పన్ను మినహాయింపు ఉంటుంది. అధిక రాబడి ఆశించే వారికి ఇది అనుకూలమైన పధకం. పన్ను రాయితీలు కూడా ఉంటాయి.
బహుళ ప్రజాదరణ పొందిన ఈ పథకంలో ఉంచిన పెట్టుబడులు ఏడేళ్ల 8నెలలకు రెట్టింపు అవుతాయి. వంద రూపాయల కనీస పరిమితితో ఎంతైనా ఈ పథకంలో పెట్టుబడిగా పెట్టవచ్చు. కిసాన్ వికాస పత్రాలు కొన్న రెండున్నరేళ్ల తరువాత వెనక్కి తీసుకోవచ్చు. ఇందులో ఉంచిన పెట్టుబడుల పై పన్ను లాభం లేదు. స్వల్ప మొత్తంలో ఎక్కువ కాలం పెట్టుబడులు కొనసాగించాలనుకునేవారికి, పన్ను వర్తించే ఆదాయంలేని పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కిసాన్ వికాసపత్రాలు అనుకూలమైనవని చెప్పవచ్చు.
టైమ్ డిపాజిట్ పథకంలో పొదుపు చేసిన పెట్టుబడుల పై మొదటి సంవత్సరం 7.25శాతం, రెండో ఏడాది 7.5శాతం, మూడో ఏడాది 8.25 శాతం, అయిదో ఏడాది 8.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో ఉంచే పెట్టుబడుల గడువు 2, 3, 5 సంవత్సరాలు. పెట్టుబడి పరిమితి కనీసం రూ.50. గరిష్ట పరిమితి లేదు. టైమ్ డిపాజిట్ ఖాతాలను ఏడాది తరువాత కొంత డిస్కౌంట్‌తో మూసివేయవచ్చు. ఏడాదిలోపు మూసివేసే డిపాజిట్లపై ఎలాంటి వడ్డీని చెల్లించడం జరగదు. నిబంధనల మేరకు వడ్డీ పై ఆదాయపు పన్ను ఉండదు. చిన్న మొత్తాలను పొదుపు చేసే వారికి, స్థిర ఆదాయం ఉన్నవారికి ఈ పథకం అనుకూలం.
సేవింగ్స్ ఖాతా సాధారణ బ్యాంకు ఖాతా లాంటిది. ఇందులో వ్యక్తిగత, జాయింట్ గ్రూప్ ఖాతాలకు 3.5శాతం వడ్డీ లభిస్తుంది. కనీసం 20 రూపాయలతో ఖాతాను ప్రారంభించవచ్చు. గరిష్టంగా లక్ష రూపాయలు, జాయింట్ ఖాతాలో 2లక్షల దాకా పెట్టుబడులు ఉంచుకోవచ్చు. ఈ పథకంలో ఉంచిన పెట్టుబడి పై వచ్చే వడ్డీ పై ఎలాంటి పన్ను ఉండదు. అంటే పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుందన్న మాట. దాదాపుగా ఇది బ్యాంకు ఖాతాను పోలి ఉంటుంది. కాబట్టి సేవింగ్స్ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలనుకునే అన్ని వర్గాలవారికి ఇది అనుకూలమైన పధకం.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు