2009 సంవత్సరంలో కేంద్రం ఆధార్ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశంలో ప్రతి ఒక్కరికీ ఒకేరకమైన గుర్తింపు వ్యవస్థను నెలకొల్పేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. ఆధార్ అంటే యూఐడీఏఐ జారీ చేసే 12 అంకెల సంఖ్య. మొదట దశలో ఆధార్ తెచ్చుకోవాలంటే చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. తర్వాత నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా దీన్ని సులభతరం చేశారు. ఈ క్రమంలో వివిధ రకాల సేవలను పౌరులు అందుకోవాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తున్నారు. దీంతో పాటు వివిధ చోట్ల వ్యక్తిగత, చిరునామా గుర్తింపుగా ఉపయోగపడుతుంది. ఈ మధ్య డ్రైవింగ్ లైసెన్సు, మధ్యాహ్న భోజనానికి సైతం ఆధార్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఏయే సందర్భాల్లో ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిందో తెలుసుకుందాం.
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో ఒకే పేరుతో అనేక డ్రైవింగ్ లైసెన్సులు పొందేవారిపై చర్యల కోసం కేంద్రం ‘ఆధార్'ను తప్పనిసరి చేయనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా డ్రైవింగ్ లైసెన్సులు కోసం దరఖాస్తు చేసుకునేవారితోపాటు రెన్యువల్ చేయించుకునేవారు సైతం ఆధార్ వివరాలను సమర్పించాలి. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో లోపాల వల్ల ఒకే వ్యక్తి వేర్వేరు ప్రాంతాలు లేదా రాష్ట్రాల నుంచి డ్రైవింగ్ లైసెన్సులను పొందే పరిస్థితి ఉంది. ఆధార్ సంఖ్యను తప్పనిసరి చేస్తే రెండో సారి ఎక్కడ దరఖాస్తు చేసుకున్నా వెంటనే పట్టుబడిపోతారు. ఈ ఏడాది అక్టోబరు నెల నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
పాస్‌పోర్టు దరఖాస్తు సమయంలో ఆధార్ పాస్‌పోర్టు దరఖాస్తు సమయంలో ఆధార్ పాస్ పోర్టు జారీల విషయంలో జరుగుతున్న ఆలస్యాన్ని అధిగమించడానికి ప్రభుత్వం, ఇంటిలిజెన్స్ బ్యూరో విభాగంతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధార్ కార్డుని తప్పనిసరి చేసింది. ఈ తాజా ఫార్మెట్‌లో దరఖాస్తుదారు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. గుర్తింపు మరియు చిరునామా కింద ఆధార్ కార్డు తప్పనిసరి. దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో దరఖాస్తుదారు అపాయింట్మెంట్ పొందుతారు. మరొక ఏడు రోజుల్లో, పాస్ పోర్ట్‌ని ప్రాసెస్ చేసి మీరు ఇచ్చిన అడ్రస్ కు పంపించేస్తారు. ఆ తర్వాత పోలీసు ధృవీకరణ కోసం ఇంటికి వస్తారు. నేరపరమైన చిక్కులు లేనివారికి ఆధార్ తో వెంటనే పాస్ పోర్టు వచ్చేస్తోంది.
మొబైల్ సిమ్‌లకూ ఇప్పటికే మొబైల్ వాడుతున్నవారితో పాటు, ఇకపై కొత్త సిమ్ తీసుకునేవారికి సైతం ఇప్పటి నుంచి ఆధార్ తప్పనిసరి. ఆధార్ ఆధారిత వెరిఫికేషన్‌ను పాత వారందరికి కేంద్రం తప్పనిసరి చేసింది.
పౌరపంపిణీ పథకం కింద రేషన్ పొందేందుకు మాత్రమే ఆధార్ కార్డుల వినియోగాన్ని కేంద్రం ఆధార్‌ను తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఆహార, వినియోగదారు వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికీ ఆధార్ లేనివారికి జూన్ 30 లోగా దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఇచ్చారు.
మధ్యాహ్న భోజనానికి దాదాపు దేశంలో 10 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన మధ్యాహ్న భోజన పథకానికి లబ్దిదారులుగా ఉన్నారు. వీరికి సైతం జులై 1 నుంచి ఆధార్‌ను తప్పనిసరిచేసింది కేంద్రం. ఈ మేరకు జులై లోగా అందరూ ఆధార్ వివరాలను పాఠశాలల్లో సమర్పించేందుకు వీలుగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జూన్ 30 వరకూ గడువు ఇచ్చారు.
ఆదాయపు పన్ను వ్యక్తులంతా ఆధార్‌ను పాన్(శాశ్వత ఖాతా సంఖ్య)కు అనుసంధానించడం మంచిది. ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో పాన్, అనుసంధానం జరిగి ఉంటే మీరు ఐటీఆర్Vను ప్రింట్ తీసి పంపాల్సిన అవసరం ఉండదు. దీంతో పన్ను రిటర్నుల ప్రక్రియ త్వరితగతిన పూర్తవడంతో పాటు మీ ఖాతాలో డబ్బు త్వరగా జమవుతుంది
బ్యాంకింగ్ బ్యాంకింగ్ బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ వ్యక్తిగత, చిరునామా గుర్తింపుగా ఉపయోగపడుతుంది. ఆధార్ ఉంటే చాలు ఇక ఏ ఇతర గుర్తింపు పత్రాలు అవసరం లేదు. ఒక్కోసారి ఈ ఆధార్‌ను సైతం బ్యాంకులు అంగీకరించే అవకాశం ఉంది. అయితే బ్యాంకు ఖాతాలకు పాన్ మాత్రం తప్పనిసరి.
డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పెన్షనర్లు బ్యాంకులో ఆధార్ నంబరు ఇస్తే వారి ప్రక్రియ మరింత సులువవుతుంది. తమకు చెల్లింపు జరిగే బ్యాంకు శాఖకు వెళ్లి ఆధార్, బ్యాంకు పాస్‌బుక్ నకళ్లు ఇచ్చి అనుసంధానం ప్రక్రియను పూర్తిచేయాలి. దీంతో ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (జీవన్ ప్రమాణ్)ను సులువుగా పొందవచ్చు. దీంతో ప్రతి ఏడాది బ్యాంకుకు వెళ్లాల్సిన అవస్థ తప్పుతుంది.
మ్యూచువల్ ఫండ్స్ యూఐడీఏఐ జారీ చేసిన ఆధార్ లెటర్, ఈ-ఆధార్‌ను ప్రామాణికమైనదిగా అంగీకరించాలని సెబీ, ఐఆర్‌డీఏ చాలాకాలం కిందటే నిర్ణయించాయి. దీంతో మీకు గుర్తింపు పత్రాల బాధ తప్పుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలన్నా, బీమా తీసుకునేందుకు ఈ-ఆధార్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కేవైసీ కోసం అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.
నెలవారీ పింఛను పింఛను అక్రమంగా పొందుతున్న వారిని ఏరివేసేందుకు కేంద్రం కొత్తగా ఆధార్ మార్గాన్ని ఎంచుకుంది. ప్రతి నెలా పింఛను అందుకునేందుకు పింఛనుదార్లు ఆదార్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ విత్‌డ్రాయల్‌ను ఆన్‌లైన్ ద్వారా చేసుకునేందుకు ఆధార్ సంఖ్యను పీఎఫ్ ఖాతాతో అనుసంధానించాలి. విత్‌డ్రాయల్స్‌ను వేగవంతం చేసేందుకు చాలా కంపెనీలు ఆధార్, పీఎఫ్ అనుసంధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. పీఎఫ్-యూఏఎన్ ఖాతాకు ఆధార్ అనుసంధానం చేస్తే పీఎఫ్ బదిలీ, విత్‌డ్రాయల్స్ సులువుగా జరిగేందుకు వీలు కలుగుతుంది.
డిజిటల్ లాకర్ డిజిటల్ లాకర్ ద్వారా మీ ముఖ్యమైన సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో భద్రపరుచుకోవచ్చు. దీనికి మీ వద్దే డిజిటల్ కీ (కోడ్) ఉంటుంది. ఇది బ్యాంకు ఏటీఎమ్ పిన్‌లాగే పనిచేస్తుంది. దీనిలో భద్రపరిచిన పత్రాలకు ఈ-సైన్ చేసి సమర్పించడం ద్వారా సమయం ఆదా చేసుకోవచ్చు.
ఉపకార వేతనాలు విద్యార్థులకు సకాలంలో ఉపకార వేతనాలు అందించేందుకు, ప్రభుత్వ వ్యవస్థలో ఎదురవుతున్న చిన్న చిన్న అవాంతరాలను తొలగించేందుకు విద్యార్థుల ఉపకార వేతనాలను సైతం ఆధార్‌తో అనుసంధానించారు. అంటే ప్రతి విద్యార్థి కళాశాలలో, వారు చదివే విద్యాలయాల్లో బ్యాంకు ఖాతాతో పాటు ఆధార్ సంఖ్యను ఇవ్వాలి. తమ బ్యాంకు శాఖకు వెళ్లి ఖాతాను ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసేలా చూసుకోవాలి.
గ్యాస్ సబ్సిడీ ఎల్పీజీ వంటగ్యాస్ సబ్సిడీ పొందేందుకు ఆధార్‌కార్డు తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు ఆధార్ లేనివారు ఇకనుంచి విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ చట్టం ప్రకారం ఈ నిబంధన గతేడాది నుంచి అమలవుతోంది. ప్రస్తుతం సంవత్సరానికి 14.2 కిలోల సిలిండర్లు 12 వరకు సబ్సిడీ కింద సరఫరా చేస్తున్నారు. వీటి సబ్సిడీని ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) కింద నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇకపై ఉచిత గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ తప్పనిసరి.
ఆధారం : పోర్టల్ సభ్యలు
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/21/2020