অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వినియోగదారుల హక్కుల రక్షణ

వినియోగదారుల హక్కుల రక్షణ

చారిత్రక ప్రాముఖ్యం

భారతదేశం 1989 నుంచి మార్చి నెల 15వ తేదీ నాడు జాతీయ వినియోగదారుల దినాన్ని పాటిస్తూ వస్తోంది. ఈ రోజుకు చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉంది. 1962 మార్చి 15వ తేదీ నాడు అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించడం జరిగింది. ఆ సందర్భంగా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ ప్రసంగిస్తూ ‘‘వినియోగదారుకు నాసిరకం ఉత్పత్తులను ఇచ్చినట్లయితే, ధరలు మరీ ప్రియంగా ఉంటే, ఔషధాలు సురక్షితంగా లేకపోతే లేదా గుణహీనంగా ఉంటే, వినియోగదారు పూర్తి సమాచారం తెలుసుకోకుండా ఏదైనా వస్తువును కొనుగోలుకు ఎంపిక చేసుకొంటే- అటువంటప్పుడు డాలర్ తన విలువను కోల్పోయినట్లవుతుంది. వినియోగదారు ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు; దేశ ప్రయోజనం దెబ్బతింటుంది కూడా’’ అన్నారు. ఆ రోజున యుఎస్ కాంగ్రెస్ లో కెన్నెడీ చేసిన ప్రసంగం యొక్క ప్రాముఖ్యాన్ని, తత్ఫలితంగా రూపొందిన శాసనాన్ని పరిగణనలోకి తీసుకొన్న కన్జ్యూమర్స్ ఇంటర్ నేషనల్ (సిఐ) 1983 నుంచి ప్రతి సంవత్సరం మార్చి నెలలో 15వ తేదీని ‘ప్రపంచ వినియోగదారు హక్కుల రక్షణ దినం’గా పాటించాలంటూ 1982లో ఒక నిర్ణయం తీసుకుంది. ప్రగతిశీల శాసనాలను ప్రవేశపెట్టడంలో భారతదేశం ఎన్నడూ వెనుకంజ వేయలేదు; ఓటు వేసే హక్కును మహిళలకు ఇచ్చిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశాలలో భారతదేశం కూడా ఒకటిగా ఉంది. గాంధీ గారు ‘‘మన వాకిట్లోలోకి విచ్చేసే వినియోగదారు ఒక ముఖ్యమైన సందర్శకుడు. అతడు మన మీద ఆధారపడి లేడు. మనం ఆయన మీద ఆధారపడి ఉన్నాం. మన పనిలో అతడు ఒక అంతరాయం కాదు; మన పని యొక్క ఉద్దేశమే అతడు. ఆయనకు సేవ చేయడం ద్వారా మనం అతడికి ఏదో మేలు చేస్తున్నట్లు కాదు; తనకు సేవ చేసే అవకాశాన్ని మనకు కల్పించడం ద్వారా అతడు మనకు మేలు చేస్తున్నాడు’’ అని చెప్పారు.

వినియోగదారుకున్న హక్కులలో ఆరోగ్యదాయకమైన ఆహారం ఒక హక్కుగా 2015 సంవత్సరంలో ప్రపంచ వినియోగదారు హక్కుల దినం (డబ్ల్యుసిఆర్ డి) సందర్భంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగానే వినియోగదారులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడంలో వారికి తోడ్పడాలని కన్జ్యూమర్స్ ఇంటర్ నేషనల్ నిర్ణయించింది. వినియోగదారులందరూ కేవలం ఆహార హక్కును మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందే హక్కును కూడా కలిగివున్నారు. అన్ని దేశాలు కట్టుబడి ఉండగల ఏదైనా ఒక ఒడంబడిక అనేది వినియోగదారులందరికీ ఆరోగ్యవంతమైన ఆహారం సులువుగా లభించే ఏర్పాటు చేయగలగడంతో పాటు మరింత సమానత్వంతో కూడిన, నిలకడ కలిగిన ఆహార వ్యవస్థకు పూచీపడగలుగుతుంది. ఆహారంతో ముడిపడి ఉండే వ్యాధులు.. స్థూల కాయం, మధుమేహం, గుండె జబ్బు, ఇంకా కొన్ని క్యాన్సర్ లు.. ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో ప్రజారోగ్య సంక్షోభాన్ని సూచించేవే. పొగ తాగడం వల్ల శరీరంపై పడే ప్రతికూల ప్రభావం కన్నా సరైన రీతిలో లేని ఆహారాన్ని తీసుకోవడమనేది ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావమే అధికం. స్థూలకాయులు ప్రపంచ జిడిపి పై చూపుతున్న ప్రభావం యుద్ధ వ్యయం, తుపాకుల హింస, ఉగ్రవాదం వంటివి చూపుతున్న ప్రభావంతో సమానమైందిగా ఉంటోందంటే దీని తీవ్రతను గ్రహించవచ్చును. అనారోగ్యానికి దారితీసే, తక్కువ ధరలకు దొరికే ఆహార పదార్థాలు, బడా అంతర్జాతీయ ఆహార కంపెనీల మార్కెటింగ్ పద్ధతులు, వినియోగదారులకు సరి అయిన సమాచారం అందుబాటులో లేకపోవడం.. ఇవి అన్నీ కలిసి ఆరోగ్యప్రదమైన ఆహారాన్ని ఎంచుకోవడాన్ని కష్టతరంగా మార్చివేస్తున్నాయి. మనుషుల ఒళ్లు పెరిగిపోతుండడానికి, ఆహార సంబంధిత వ్యాధులకు మూలకారణంగా నిలుస్తున్న అంశాలకు సంబంధించి అంతర్జాతీయ ఏకాభిప్రాయం విస్తృత‌మవుతున్నప్పటికీ, పారిశ్రామిక రంగం వైపు నుంచి వస్తున్న ప్రతిస్పందన ఆశించిన స్థాయిలో లేదు.

వినియోగదారు హక్కులు

వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనే హక్కు ను కలిగి ఉండటమే వినియోగదారుల యొక్క హక్కు అని అర్థం. వ్యాపారంలోని అనుచిత పద్ధతుల బారిన పడకుండా వినియోగదారును కాపాడవలసివుంటుంది. ఈ హక్కులను గురించి వినియోగదారులు తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది. వినియోగదారు హక్కులను రక్షించేందుకు భారతదేశంలో బలమైన, స్పష్టమైన చట్టాలు ఉన్నా, దేశంలోని వినియోగదారుల వాస్తవ దురవస్థ అత్యంత నిరుత్సాహకరంగా ఉంది. వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి అమలవుతున్న వివిధ చట్టాలలో 1986 సంవత్సరంలో వచ్చిన వినియోగదారు రక్షణ చట్టం అత్యంత ముఖ్యమైన చట్టం. ఈ చట్టం ప్రకారం, ప్రతి ఒక్కరు.. వ్యక్తులు, సంస్థ, హిందూ అవిభాజ్య కుటుంబం, కంపెనీ.. వస్తువులను, సేవలను కొనుగోలు చేసేందుకు తమ వినియోగదారు హక్కులను ఉపయోగించే హక్కును కలిగివున్నారు. ఒక వినియోగదారుగా తన మౌలిక హక్కులను గురించి, న్యాయస్థానాలను గురించి, హక్కుల అతిక్రమణ తదుపరి అమలు కావలసిన విధానాలను గురించి కూడా తెలుసుకోవలసివుంది. వినియోగదారు రక్షణ చట్టం, 1986

దేశంలోని వినియోగదారు రక్షణ/వినియోగదారు ఉద్యమంలో అత్యంత ముఖ్యమనదగిన మైలురాళ్లలో ఒకటి వినియోగదారు రక్షణ చట్టం, 1986 కు శాసనరూపాన్ని ఇవ్వడం. వినియోగదారుల కోసం మూడు అంచెలతో కూడిన క్వాసి-జ్యుడీషియల్ కన్జ్యూమర్ డిస్ ప్యూట్ రిడ్రెసల్ మెషినరీని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారు హక్కులను ఉత్తమమైన రీతిలో కాపాడడం కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. ఫిర్యాదుల పరిష్కారాన్ని కోరే హక్కు 1986 లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ (సిఒపిఆర్ఎ) ఆమోదం పొందేందుకు కారణమైంది. దీనిని వినియోగదారుల హక్కుల పత్రం (మాగ్నా కార్టా) గా నిర్వచించడం జరిగింది. అయితే ఇది ఈ హక్కుల లోని ఆరు హక్కులను మాత్రమే గుర్తించింది. అవి.. (1). భద్రత; (2). సమాచారం; (3). ఇష్టం; (4). ప్రాతినిధ్యం; (5). సరిదిద్దడం మరియు (6). వినియోగదారు చైతన్యం. వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడం కోసమే 90 - 150 రోజుల పరిమిత వ్యవధిలో న్యాయనిర్ణయం చేయడానికి/ మధ్యవర్తిత్వం వహించడానికి క్వాసి-జ్యుడీషియల్ కోర్టుల వ్యవస్థకు వీలు కల్పించి విప్లవాత్మకమనదగిన న్యాయ సంబంధ సంస్కరణలను తీసుకురావడంలో సిఒపిఆర్ఎ సఫలమైంది. మౌలిక అవసరాలకు సంబంధించిన హక్కులను, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని సిఒపిఆర్ఎ ద్వారా ఆవిష్కరించడం కుదరలేదు. ఎందుకంటే, ఇవి పేదల మరియు అట్టడుగు వర్గాల ప్రజల ఆకాంక్షలకు ప్రతీకలు కావడం ఒక కారణం కాగా, ధర చెల్లించితే మార్కెట్ లో దొరికే సరుకులు, సేవలకు సంబంధించిన అంశం కాకపోవడం మరొక కారణం. అయితే ఇవి అభివృద్ధి చెందిన ,అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజా ఆందోళనలకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం 1986 సంవత్సర వినియోగదారు రక్ష‌ణ చట్టానికి శాసన రూపం కల్పించినప్పటికీ, ఆ చట్టం యొక్క ముఖ్యో ద్దేశమైన తక్కువ ఖర్చులో, సులభమైన రీతిలో, సత్వర న్యాయాన్ని అందించడం అనే పరమార్థం ఇప్పటికీ సరిగా నెరవేరలేదు. ఈ సమస్యను చక్కదిద్దడానికి వినియోగదారు రక్ష‌ణ చట్టానికి సవరణను ప్రతిపాదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 1986 సంవత్సర వినియోగదారు రక్ష‌ణ చట్టంలోని 30వ సెక్ష‌న్ - 1వ సబ్ సెక్ష‌న్ లకు అనుసరణగా కేంద్ర ప్రభుత్వం 1987వ సంవత్సర వినియోగదారు రక్ష‌ణ నియమావళిని జారీ చేసింది. ఈ నియమావళిలో ఉన్న ముఖ్యమైన నిబంధనలలో - కేంద్ర వినియోగదారు రక్ష‌ణ మండలి, కార్యాచరణ ఏర్పాటు (రూల్ 3); బృందాల‌ ఏర్పాటు, జిల్లా వేదికకు ఫిర్యాదులు దాఖలు చేయడానికి రుసుమును నిర్దేశించడం (రూల్ 9ఎ); జాతీయ సంఘం, రాష్ట్ర సంఘం మరియు జిల్లా వేదికలకు అదనపు అధికారాలు ధారాదత్తం చేయడం (రూల్ 10) - వంటివి ఉన్నాయి. నిత్యావసర వస్తువులు వినియోగదారులకు సులువుగా అందేటట్లుగా చూడటానికీ, అన్యాయం చేయడానికి వెనుకాడని వ్యాపార వర్గాల దోపిడీ నుంచి వినియోగదారులను రక్ష‌ించటానికీ 1955 సంవత్సర నిత్యవసర వస్తువుల చట్టం ఉండనే ఉంది. నిత్యావసరాలుగా ప్రకటించిన సరుకుల ఉత్పత్తి, పంపిణీ, ధరల ఖరారులకు సంబంధించి అవలంబించవలసిన విధి విధానాలను ఈ చట్టం నిర్దేశిస్తుంది. అంతేకాకుండా ఆయా సరుకులు న్యాయమైన ధరలలో లభ్యమవుతూ, ప్రజలందరికీ సమానంగా పంపిణీ అయ్యేలా వాటి నిల్వల నిర్వహణ, లేదా సరుకుల సరఫరాలను పెంచడం వంటివి ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

వినియోగదారు వివాదాల పరిష్కార సంస్థలు

వినియోగదారులకు తక్కువ ఖర్చులో, ఇబ్బందులకు తావు లేని రీతిలో, శీఘ్రంగా ఫిర్యాదులను పరిష్కరించే వెసులుబాటు కల్పించాలనే సంకల్పంతో దేశవ్యాప్తంగా వేరు వేరు స్థాయిలలో వినియోగదారు వేదికలను నెలకొల్పడం జరిగింది. వినియోగదారు రక్షణ చట్టంలోని 9వ సెక్షన్ మూడు అంచెల వివాద పరిష్కార సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. అవి ఏమేమిటంటే.. ఎ) కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం. ఈ కోర్టునే జాతీయ సంఘంగా వ్యవహరిస్తారు. బి) కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే రాష్ట్ర వినియోగదారు పరిష్కార సంఘం. ఈ కోర్టునే రాష్ట్ర సంఘంగా కూడా వ్యవహరిస్తారు. సి) రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసే వినియోగదారు వివాదాల పరిష్కార వేదిక. ఈ కోర్టునే డిస్ట్రిక్ట్ ఫోరమ్ గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఏజెన్సీలన్నీ వాటి స్వభావం మరియు అధికారాల పరంగా క్వాసీ- జ్యుడీషియల్ యంత్రాంగంగా పని చేస్తాయి.

వినియోగదారుకు రక్షణ అందించడం

వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులు, అందుకొనే సేవల విషయంలో వారి హక్కులను కాపాడే సాంఘిక, ఆర్థిక ఉద్యమమే వినియోగదారు ఉద్యమం అని చెప్పాలి. వినియోగదారు రక్షణ చట్టాన్ని ఆచరణలో పెట్టే బాధ్యతను వినియోగదారు వ్యవహారాల విభాగానికి అప్పగించారు. వినియోగదారులకు తగిన న్యాయం అందించడానికి కన్జ్యూ మర్ ఫోరా ను స్థాపించి వాటిని బలోపేతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలను ఈ విభాగం చేపడుతుంది. జమ్ము & కశ్మీర్ ఈ విషయంలో తన సొంత శాసనాన్ని రూపొందించుకొంది. వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రభుత్వేర సంస్థలతో సంప్రదింపులు జరపడం కూడా వినియోగదారు రక్షణ పరిధిలోకే వస్తుంది. వినియోగదారులకు వారి హక్కులను, బాధ్యతలను తెలియజేయడం, వారి హక్కులను వారు ఉపయోగించుకొనేటట్లుగా వారిలో ప్రేరణను కలిగించడం, వారు కొనే వస్తువులు, సేవల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీకి తావు ఇవ్వకపోవడం, ఏదైనా వివాదం ఏర్పడితే సంబంధిత వినియోగదారు వేదికను ఆశ్రయించడం వంటివన్నీ వినియోగదారు రక్షణ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.

వినియోగదారు రక్షణ మండలులు

1986 సంవత్సర వినియోగదారు రక్షణ చట్టం ఒక "కేంద్ర వినియోగదారు రక్షణ మండలి"ని ఏర్పాటుచేయాలని చెబుతోంది. ఈ మండలి వినియోగదారు హక్కులను కాపాడే అంశంలో వినియోగదారు వ్యవహారాల విభాగానికి సిఫార్సులు చేసే ఒక సలహా సంఘంగా పని చేస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలలోను వినియోగదారుల రక్షణ మండలిని ఏర్పాటుచేయాలని కూడా ఈ చట్టం సూచిస్తోంది.

నిత్యావసర వస్తువులు న్యాయమైన ధరలలో, మరీ ముఖ్యంగా నగరాలలోని మురికివాడలు, మారుమూల పల్లెలు, చేరుకోవడం కష్ట సాధ్యమైన ప్రాంతాలతో పాటు, పర్వత ప్రాంతాల నివాసులకు పంపిణీ అయ్యేటట్లు చూడటంలో వినియోగదారు సహకార సంఘాలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. దళారీ వ్యవస్థను నివారించి వినియోగదారులకు వారికీ రోజువారీ అవసరమయ్యే వస్తువులను సమంజసమైన ధరలకు అందించేటట్లు చూడటం ఈ సంఘాల పని. వినియోగదారులకు అవసరమైన సరుకుల ధరలు పెరగకుండా నివారించడంలో ఈ సంఘాలు సహకరిస్తున్న కారణంగా ఈ సంఘాలకు ప్రభుత్వం నుంచి తగిన తోడ్పాటు అందుతోంది. వినియోగదారు సహకార సంఘాలు మొత్తం 4 అంచెలలో - ప్రైమరీ స్టోర్స్, హోల్ సేల్ / సెంట్రల్ స్టోర్స్, స్టేట్ కన్జ్యూ మర్ కో ఆపరేటివ్ ఫెడరేషన్స్ మరియు ద నేషనల్ కన్జ్యూ మర్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ - లుగా స్థాపించబడ్డాయి.

వినియోగదారు ఫిర్యాదుల పరిష్కార విభాగం (సిజిఆర్ సి)

వినియోగదారులు అందించే ఫిర్యాదులను పరిష్కరించడానికి 2002లో కన్జ్యూ మర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ (సిజిఆర్ సి)ను ఏర్పాటుచేశారు. ఉత్పత్తులకు అధిక ధరలను వసూలు చేయడం, లోపం గల వస్తువులను విక్రయించడానికి, ప్రధాన మంత్రి కార్యాలయానికి, కేబినెట్ సెక్రటరీకి అందే ఫిర్యాదులను, వార్తా పత్రికలలో అచ్చయ్యే ఫిర్యాదులను ఈ విభాగం పరిశీలిస్తుంది. దీనికి తోడు, వేరు వేరు రాష్ట్రాలలో, జిల్లాలలో పరిశీలనకు వచ్చిన కేసుల పరిష్కారంలో ఏవైనా జాప్యాలు జరిగితే వాటి విషయంలో తగిన చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా ఫిర్యాదుదారులకు సంతృప్తి కలిగించేటట్లుగా వాటిని చక్కబెట్టడంలో తోడ్పడుతుంది.

వినియోగదారు సంక్షేమ నిధి

వినియోగదారు సంక్షేమ నిధిని ఏర్పాటుచేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం సిద్ధించేలా 1944 సంవత్సర సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్ ను 1991లో సవరించడం జరిగింది. తయారీదారు సంస్థలకు వాపసు చేయడానికి వీలులేని సొమ్ము, వంటి వాటిని ఈ నిధికి జమ చేస్తారు. వినియోగదారుల సంక్షేమాన్ని పరిరక్షించడానికి, ఈ అంశంలో వినియోగదారులలో అవగాహనను పెంపొందించడానికి దేశంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో వినియోగదారు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తగిన ఆర్థిక సహాయాన్ని అందించాలనే ధ్యేయంతో 1992లో వినియోగదారు సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. ఈ నిధిని రెవెన్యూ విభాగం 1944 సంవత్సర సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్ లో భాగంగా ఏర్పాటుచేసింది. వినియోగదారు వ్యవహారాల విభాగం ఈ నిధిని నిర్వహిస్తోంది.

భారత ప్రమాణాల మండలి (బిఐఎస్)

1986 భారత ప్రమాణాల మండలి చట్టంలో భాగంగా ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్)ను నెలకొల్పారు. 1947లో పని చేయడం ప్రారంభించిన ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్ స్టిట్యూషన్ (ఐఎస్ఐ) యొక్క ఆస్తులను, అప్పులను స్వాధీనం చేసుకొంది. దీని కింద 5 ప్రాంతీయ కార్యాలయాలు, 32 శాఖా కార్యాలయాలు, 8 ప్రయోగశాలలు పని చేస్తున్నాయి. ప్రమాణాల రూపకల్పన, ప్రొడక్ట్ సర్టిఫికేషన్, మేనేజ్ మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ మరియు హాల్ మార్కింగ్.. ఈ కీలక కార్యకలాపాలలో బ్యూరో నిలకడైన పురోగతిని సాధించింది. వినియోగదారుల అవసరాలను నెరవేర్చే రీతిలో వస్తువులు, సేవల నాణ్యతను పరిరక్షించడం బిఐఎస్ కు నిర్దేశించిన విధి. పరిశ్రమ మరియు వ్యాపార వర్గాలు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకొనే విధంగా తగిన జాగ్రత్తలను సూచించడం కూడా బిఐఎస్ విధులలో మరొకటి. స్వర్ణా భరణాలకు హాల్ మార్కింగ్ పథకాన్ని 2000 సంవత్సరం ఏప్రిల్ లో ప్రవేశపెట్టారు. బంగారు నగల స్వచ్ఛతను గురించి వినియోగదారులకు థర్డ్ పార్టీ అస్యూరెన్స్ ను అందించి వినియోగదారు ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఆ తరువాత వెండి నగల హాల్ మార్కింగ్ పథకాన్ని 2005 అక్టోబరులో ఆరంభించారు.

నేషనల్ టెస్ట్ హౌస్

వినియోగదారుల వ్యవహారాల శాఖ యొక్క పరిపాలనా నియంత్రణా ఆధీనం లో నేషనల్ టెస్ట్ హౌస్ (ఎన్ టి హెచ్ ) ఉంటుంది. ఇది దేశంలోని ఒక ప్రముఖ వైజ్నానిక సంస్థ. 1921 వ సంవత్సరంలో అప్పటి రైల్వే బోర్డు కింద తిరిగి ఏర్పాటు చేయబడింది. అప్పటి నుండి టెస్టింగ్ రంగంలో జాతీయ ప్రాముఖ్యత కల ఒక ప్రయోగశాలగా విస్తరించింది. వివిధ ఇంజనీరింగ్ వస్తుసామగ్రి మరియు పూర్తి కాబడిన ఉత్పత్తుల గణింపు మరియు నాణ్యతలపై యంత్రణను కలిగి ఉంటుంది. వివిధ తరహాల పరిశ్రమలతో అనుసంధానించబడిన టెక్నాలజీ, వాణిజ్యం, వర్తకం మరియు ప్రామాణీకరణలతో ఇది చురుకుగా పాలుపంచుకుంది. ఇది దేశీయ పరిశ్రమల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. పారిశ్రామిక పరిశోధన మరియు పూర్తయిన వస్తువుల తయారీల మధ్య ఒక దృఢమైన అనుసంధకర్తగా పనిచేస్తూ నాణ్యతా నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధాన శాస్త్రీయ మరియు సాంకేతిక సేవలే గాక ఇతర అనుబంధ సేవలలో ఎన్ టి హెచ్ టెస్టింగ్ ను నిర్వహిస్తుంది. మందులు మినహా పారిశ్రామిక మరియు దాదాపు అన్ని రకాల వినియోగ ఉత్పత్తుల నాణ్యత ను నిర్ధారించడం, నాణ్యత ను నిశ్చయపరచడానికి , జాతీయ/అంతర్జాతీయ లేదా వినియోగదారుని ప్రామాణికతకు, స్పష్టీకరణకు అనుగుణంగా ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి టెస్టింగ్ సర్టిఫికెట్ ను జారీ చేయడం ద్వారా సేవలను అందిస్తుంది.

వినియోగదారుని అవగాహనా కార్యక్రమం

ఒక సుశిక్షితుడైన వినియోగదారుడు ఒక సాధికారిత గల వినియోగదారుడు. ఒక శిక్షితుడైన వినియోగదారుడు దోపిడి నుండి తనను మాత్రమే కాకుండా ప్రేరణాత్మక సామర్ధ్యాన్ని కలిగి ఉంటాడు. సేవల రంగాలలో పారదర్శకతను , జవాబుదారీతనాన్ని కలిగిఉంటాడు. వినియోగదారుని జాగృతపరచడం ముఖ్యమైనదిగా ప్రభుత్వం గుర్తించి 'వినియోగదారుని విద్య, వినియోగదారుని రక్షణ , వినియోగదారుని అవగాహన లకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. భారతదేశం వినియోగదారుల రక్షణ కోసం ప్రగతిశీల చట్టాన్ని ప్రవేశపెడుతూ ముందంజలో ఉంది. జాగో గ్రాహక్ జాగో - వినియోగదారుని విద్య మరియు అవగాహన వైపు ఒక ముందడుగు: గత 4 సంవత్సరాలలో చేపట్టిన ప్రచార ఫలితంగా ఈ 'జాగో గ్రాహక్ జాగో' నినాదం ఇప్పుడు ఒక ఇంటి పేరుగా మారిపోయింది. 11వ పంచవర్ష ప్రణాళికలో వినియోగదారుని అవగాహనను పెంచే అవసరాన్ని నొక్కి చెబుతూ ప్రభుత్వం నిధులను వెచ్చించి సామాన్యుడికి ఒక వినియోగదారునిగా తన హక్కులను తెలియజేయడానికి ప్రయత్నించడం జరిగింది. వినియోగదారుల అవగాహన పథకంలో భాగంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. దేశంలో వినియోగదారుల అవగాహనా పథకం లో భాగంగా, వినియోగదారుల అవగాహనకై ప్రభుత్వం అనేక కార్యకలాపాలు మరియు పథకాలు చేపట్టడం జరిగింది. వినియోగదారుల అవగాహన మరియు రక్షణ కై బడ్జెట్ లో నిధుల కేటాయింపును పెంచడం ఒక ముఖ్యమైన అంశం. 11వ పంచవర్ష ప్రణాళిక మొత్తం కేటాయింపులను గణనీయంగా సవరించి, 409 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. వినియోగదారుల అవగాహన కోసం ఇంటర్నెట్ వాడకం: మనది ఒక యువ వనరులుగల భారతదేశం. దేశంలో 70 శాతం కన్నా ఎక్కువ జనాభా 35 సంవత్సరాల కన్న తక్కువ వయస్సు గల యువతతో నిండినది. యువకులు ఇంటర్నెట్ ను వివిధ ప్రయోజనాలకు పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. వీరే ప్రధాన వినియోగదారులు కూడా అయ్యారు. దీనిని గ్రహించి, ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా వినియోగదారుల అవగాహనను వ్యాప్తి చేయడాన్ని ఒక ప్రధాన కార్యక్రమంగా చేపట్టడం జరిగింది. అన్నీ ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అన్ని ముద్రణా ప్రకటనలు కూడా అంతర్జాలం డబల్యూ‌డబల్యూ‌డబల్యూ.ఎఫ్ సి ఎ ఎం ఐ ఎన్ . ఎన్ ఐ సి .ఐ ఎన్ (www.fcamin.nic.in) లో అప్ లోడ్ చేసారు. వినియోగదారు హక్కుల కోసం ప్రసార మాధ్యమాలలో ప్రచారం అవసరం. అవసరమైన అన్ని ప్రసార మాధ్యమాల ద్వారా విశాలమైన భారతదేశంలోని వినియోగదారులకు చేరేందుకు గాను దూరదర్శన్, అల్ ఇండియా రేడియో , ఎఫ్ఎమ్ స్టేషన్లు, వార్తాపత్రికలతో సహా ప్రింట్ మీడియా, ప్రకటనలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో వీడియో స్పాట్ లను ప్రసారం చేయడం ద్వారా , మేఘదూత్ పోస్ట్ కార్డులు, ఇంటర్నెట్, బాహ్య ప్రచారసాధనాలు, సంప్రదాయ ప్రచారసాధనాలు (ఎగ్జిబిషన్లు / వాణిజ్య ప్రదర్శనలు ,కరపత్రాలు మొదలైనవి) మరియు ఇంటరెక్టివ్ సీరియళ్లను తెలివిగా ఉపయోగించుకోవాలి.

జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్

వినియోగదారుల ఫిర్యాదు లకు స్పందించడానికి ఢిల్లీ విశ్వవిద్యాలయంచే నిర్వహించబడుతున్న, జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ ను టోల్ ఫ్రీ సంఖ్య 1800-11-4000 ను వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రారంభించింది. అన్ని పని దినాలలో (సోమవారం నుండి శనివారం వరకు) ఉదయం 9 గంటల 30 నిముషాలనుండి సాయంత్రం 5 గంటల 30 నిముషాల వరకు టోల్ ఫ్రీ నెంబర్ సౌకర్యాన్ని వినియోగదారులు వినియోగించుకోవచ్చు. అలాగే సాధారణ కాల్ ధరలు వర్తించే హెల్ప్లైన్ 011-27662955-58 కూడా నిర్వహించబడుతుంది.

ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా మార్చి 15 వ తేదీని జరుపుకుంటున్నాం.

ఈ వ్యాసం రాసిన వారు : డాక్టర్ పి.జె. సుధాకర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్, ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో, హైదరాబాద్

ఆధారము: PIB© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate