ఒక గద్దకు, నక్కకు స్నేహం కుదిరింది. గద్ద చెట్టుమీద గూడు కట్టుకుని ఉంటే, ఆ చెట్టు కింద నివాసం ఏర్పరచుకుని జీవిస్తోంది నక్క.
కొన్నాళ్లకు నక్కకు పిల్ల పుట్టింది. అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను చూపించింది. అయితే ఓరోజు నక్క ఆహారం తెచ్చుకోవడానికి బయటికి వెళ్లింది. అది అదనుగా చూసుకుని, గద్ద నక్కపిల్లను ఎత్తుకుపోయింది. ఆ పిల్లను చంపేసి తన పిల్లలకు పెట్టి, తనూ తింది.
కాసేపటికి తిరిగి వచ్చిన నక్కకు పిల్ల కనిపించలేదు. గద్దను అడిగితే తనకూ తెలియదంది. కానీ గద్ద చేసిన ద్రోహాన్ని నక్క కనిపెట్టింది. అయినా ఏమీ చేయలేక మౌనంగా రోదించింది.
తర్వాతి రోజు తన గూటికి దగ్గర్లో కొంతమంది వ్యక్తులు ఒక గొర్రెను బలిచ్చి, దాన్ని కాల్చడం కనిపించింది గద్దకు. ఎలాగైనా ఒక ముక్కను ఎత్తుకుపోవాలని అనుకుంది. మెల్లగా వెళ్లి కాస్తంత మాంసాన్ని నోట కరచుకుని పెకై గిరింది. వాళ్లెక్కడ పట్టుకుంటారోనని భయపడి గబగబా గూటికి చేరుకుంది.
అయితే మాంసాన్ని దొంగిలించే ప్రయత్నంలో దాని తోకలోని ఒక ఈకకు అంటుకున్న నిప్పు, ఎండుపుల్లలతో నిర్మించిన గూటికి అంటుకుంది. మంటలకు తాళలేక ఇంకా రెక్కలు రాని గద్దపిల్లలు కింద పడిపోయాయి. అది చూసిన నక్క వాటిని తినేసింది. కళ్లముందే పిల్లలు చనిపోవడం చూసిన గద్ద పెద్దగా ఏడ్చింది. ఆ రోజు తాను నక్కకు ద్రోహం చేయకుండా ఉండివుంటే, ఈరోజు అది తన పిల్లల్ని కాపాడేది కదా అని తనలో తానే కుమిలిపోయింది.
నీతి: నమ్మినవాళ్లను మనం బాధపెడితే, చివరకు మనకూ బాధే మిగులుతుంది.
ఒక పొలంలో ఒక చీమ, ఒక మిడత ఉండేవి. చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేలమీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకుని వెళ్లి తన పుట్టలో దాచి పెట్టుకోవడంలో హడావుడిగా ఉండేది.
మిడత మాత్రం హాయిగా, స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ పాటలు పాడుకుంటూ తిరుగుతుండేది. పంటల మీద వాలి, తిన్నంత తిని పాడుచేసినంత పాడు చేసి ఆనందిస్తుండేది.
ఒకరోజు నెమ్మదిగా నేల మీద పాకుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఒక బియ్యపు గింజను లాగలేక లాక్కుంటూ వెళుతున్న చీమను చూసి మిడత పకపక నవ్వసాగింది.
చీమకు కోపం వచ్చి ‘ఓసి పొగరుబోతు మిడతా! ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు?’ అని ప్రశ్నించింది.
అందుకు మిడత ‘‘నిన్ను చూస్తుంటే జాలి వేస్తున్నది. నువ్వెంత, నీ ఆకలి ఎంత? ఎందుకు ఎప్పుడూ ధాన్యం లాక్కువెళ్లి పుట్టలో పెట్టుకుంటూ రోజంతా శ్రమ పడుతుంటావు? నా లాగా హాయిగా పాటలు పాడుకుంటూ తిరగవచ్చు కదా!’ అన్నది.
చీమ ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్లి పోయింది.
కోతలు పూర్తయి పంట అంతా రైతుల ఇళ్లకు వెళ్లిపోయింది.
ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి. తోట అంతా వర్షంతో ముద్దముద్ద అయిపోయింది. మిడతకు ఉండటానికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు.
అప్పుడది చీమ ఇంటికొచ్చి ‘మిత్రమా! వర్షంలో తడిసి పోతున్నాను. ఆకలికి చచ్చిపోతున్నాను. నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వు. నువ్వు దాచుకున్న ఆహారం నాకు కూడా ఇంత పెట్టు’ అన్నది.
చీమ పకపక నవ్వి ‘వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందు జాగ్రత్తగా ఆహారం దాచుకున్నాను. ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లో ఉంటున్నాను’ అని చెప్పి లోపలికి వెళ్లిపోయింది.
నీతి: ముందుచూపు అవసరం.
రాత్రి భోజనాలు చేసి పిల్లలు వచ్చేసరికి సావిత్రమ్మ బామ్మ ఏదో పుస్తకం చదువుకుంటున్నది. పదేళ్ళ రాంబాబు, ‘‘నిన్న మా బాబాయి ఆయన స్నేహితుడితో, ‘కృష్ణమూర్తి తన తెలివితేటలతో పదిమంది కళ్ళూ కప్పుదామనుకున్నాడు. అయినా నిజం నిప్పులాంటిది కదా? వాడికి తగిన శిక్షే పడింది,' అనడం విన్నాను. నిజం నిప్పులాంటిది అంటే ఏమిటి బామ్మా?'' అని అడిగాడు.
బామ్మ వాణ్ణి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని, ‘‘కొందరు గోప్యంగా చెడుపనులు చేస్తూ ఉంటారు. అయితే అది ఎప్పుడో ఒకప్పుడు బయట పడే తీరుతుంది. దీన్నే మీ బాబాయి చెప్పాడు. వెనకటికి రామచంద్రం, జోగినాధం అనే వాళ్ళు ఇలాగే ప్రవర్తించారు. వాళ్ళ కథ చెబుతాను వినండి,'' అంటూ ప్రారంభించింది: గిరిపురం జమీందారు మాధవయ్య దివాణానికి ఒకసారి ఒక యువకుడు వచ్చి, ‘‘అయ్యూ నా పేరు విశ్వనాధం.
నా విద్య పరీక్షించి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే, మీ పేరు చెప్పుకుని బతుకుతాను,'' అన్నాడు. జమీందారు, ‘‘మా దివాణంలో రామచంద్రం, జోగినాధం అని ఇద్దరు పెద్దవాళ్ళు ఏనాటినుంచో పనిచేస్తున్నారు. నువ్వు నెల్లాళ్ళ పాటు వాళ్ళిద్దరి దగ్గరా పనిచెయ్యి. ఆ తర్వాత వాళ్ళు నిన్ను పనిలోకి తీసుకోమంటే, అప్పుడు చూద్దాం,'' అన్నాడు.
తెలివితేటలూ, మాటకారితనమూ కలిగిన విశ్వనాథం ప్రవర్తన, ఆ పెద్దవాళ్ళిద్దరికీ నచ్చింది. ఒక్కొక్క ఆడపిల్లే వున్న ఆ ఇద్దరికీ కూడా, విశ్వనాథాన్ని మంచి చేసుకుని, తమ పిల్లనిచ్చి పెళ్ళి చేద్దామన్న ఆలోచన వచ్చింది. జోగినాధం వీలుదొరికినపుడల్లా విశ్వనాధంతో,‘‘నువ్వా రామచంద్రాన్ని నమ్మకు.
అతడికి జమీందారుకు దొంగ లెక్కలు చెప్పి డబ్బు జేబులో వేసుకునే అలవాటుంది,'' అనేవాడు. ఇక రామచంద్రం విశ్వనాధంతో, ‘‘జోగినాధం చీటికీ మాటికీ ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో రోగం వచ్చిందని కల్లబొల్లి ఏడుపులు ఏడ్చి, జమీందారు దగ్గర డబ్బు గుంజుతూనే ఉంటాడు.
అలాంటి వాడితో జతకట్టావనుకో, నీకూ చెడ్డ పేరు రావడం ఖాయం!'' అంటూ పదే పదే చెబుతూండేవాడు. ఈ పెద్దలు ఒకరిపై ఒకరు చెప్పుకునే చాడీలు వినీవినీ విసిగిపోయిన విశ్వనాధం, వాళ్ళ మాటల్లో వున్న నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నాడు. ఆ ఊరి కరణాన్ని కలుసుకుని పెద్దలు చెబుతూన్న మాటలు చెప్పాడు. అంతా విన్న కరణం, ‘‘ఇద్దరికి ఇద్దరూ మోసగాళ్ళే!
ఆ రామచంద్రం శ్రీరామనవమి ఉత్సవాలకోసం జమీందారిచ్చిన డబ్బులో చాలా భాగం, సొంతం చేసుకున్నాడు. ఇక జోగినాధం-జమీందారు ధర్మసత్రం ఖర్చులకు ఇచ్చే డబ్బులో సగానికి పైగా స్వాహా చేస్తున్నాడు. ఇదంతా, నాకూ, గ్రామ పెద్దలకూ తెలుసు. అయినా జమీందారుకు వాళ్ళంటే ఎక్కడలేని నమ్మకం. అందుకే ఆయనతో అసలు సంగతి చెప్పలేక పోతున్నాం,'' అన్నాడు.
విశ్వనాధం జమీందారును ఏకాంతంలో కలుసుకుని, ఇరవై రోజులుగా రామచంద్రం జోగినాధాల ప్రవర్తన, ఆ ఇద్దరి పట్లా గ్రామ కరణం, పెద్దల అభిప్రాయం ఏమిటో వివరించి, ‘‘తమరు అనుమతిస్తే, వారందరూ ఇప్పుడే వచ్చి దివాణం పెద్దలిద్దరి నిజ స్వరూపమేమిటో, విన్నవించుకోగలరు,'' అన్నాడు. జమీందారు, విశ్వనాధం మాటలకు ఒక్క క్షణం మాటరానట్టు ఉండిపోయి, ‘‘కరణం, ఊరి పెద్దలూ వచ్చి సాక్ష్యం పలకనవసరం లేదు. వాళ్ళ నిజాయితీని నేనెరుగుదును.
నిజం నిప్పులాంటిది కదా! ఎన్నాళ్ళని దాచగలరు? ఈ క్షణం నుంచీ రామచంద్రం, జోగినాథాలతో సహా ఉద్యోగులందరి మీదా అధికారిగా నిన్ను నియమిస్తున్నాను,'' అంటూ విశ్వనాథాన్ని మెచ్చుకున్నాడు. కథ ముగించిన బామ్మ, ‘‘మనం చేసే చెడ్డ పనులు ఎంత రహస్యంగా చేసినా ఎప్పుడో ఒకప్పుడు బయట పడక తప్పదు. కాబట్టి మంచి పనులను చేయడమే అలవాటు చేసుకోవాలి. నిజం నిప్పులాంటిది అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా?'' అన్నది. ‘‘తెలిసింది, బామ్మా,'' అంటూ పిల్లలందరూ ఉత్సాహంగా తలలు ఊపారు.
ఒక ఊరిలో అమృత అనే అమ్మాయి ఉండేది. ఆమె బడికి వెళ్ళే మార్గంలో ఒక చింతచెట్టు ఉంది. దాని కింద కొయ్య బొమ్మలు చేసే ఒక తాత ఉండేవాడు. ఆయన ప్రొద్దున నుండి సాయంత్రం చీకటి పడే వరకు ఎంతో దీక్షగా కొయ్యను చెక్కుతూ రకరకాల జంతువుల బొమ్మలను తయారు చేసేవాడు. అమృత వస్తూ పోతూ కాసేపు అక్కడ ఆగేది. ఆయన చేతిలో రూపు దిద్దుకుంటున్న బొమ్మను ఆసక్తిగా చూసేది.
ఒకరోజు అమృత ఆయనతో ‘‘తాతా నాకో బొమ్మ కావాలి?’’ అని అడిగింది.
‘‘ఏ బొమ్మ కావాలి తల్లీ’’ అని ఆయన అడిగాడు.
తాత దగ్గరున్న బొమ్మల్ని పరికించి చూసింది అమృత. అక్కడ రకరకాల బొమ్మలు ఉన్నాయి. వాటిలో జిరాఫీ, కోతి, పులి, కుందేలు బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. ‘‘నీ దగ్గర ఏనుగు బొమ్మ లేదు. ఒక ఏనుగు బొమ్మ తయారు చేసి పెట్టగలవా?’’ అని అడిగింది.
‘‘తప్పకుండా. మరి దాని ధర యాభై రూపాయలు అవుతుంది. నీ దగ్గర అంత డబ్బు ఉందా?’’ ఆన్నాడాయన.
‘‘కొంత ఉంది తాతయ్యా. మిగిలిన డబ్బును నువ్వు బొమ్మ చేసేలోపుగా కూడబెడతాను’’ అని చెప్పింది అమృత. ఇక ఆరోజు నుండి తండ్రి తన అవసరం కోసం ఇచ్చిన రూపాయి, రెండు రూపాయలను దాచసాగింది. ప్రతిరోజూ బొమ్మలు చేసే తాత దగ్గరకు వెళ్ళి తన బొమ్మ గురించి ఆరా తీసేది. తాత ‘అయిపోవచ్చింది’ అంటూ సమాధానం చెప్పేవాడు. కొన్ని రోజుల తరువాత అమృత దగ్గర యాభై రూపాయలు పోగయ్యాయి. ఆ రోజు అమృత స్కూల్ నుండి ఇంటికి వెళ్ళే సమయంలో తాత ఒక ఏనుగు బొమ్మ పట్టుకుని ఆమె కోసం ఎదురుచూడసాగాడు. అమృత దగ్గరకు రాగానే ‘‘ఇదుగో పాపా, నువ్వు అడిగిన ఏనుగు బొమ్మ’’ అని చూపించాడు.
అమృతకు ఎంతో సంబరం కలిగింది. ఆ ఏనుగును ఆప్యాయంగా చేత్తో తడిమి చూసింది. ‘‘డబ్బు తెచ్చి రేపు తీసుకెళ్తాను తాతా’’ అని చెప్పి ఇంటికి వచ్చేసింది అమృత.
ఆ మరునాడు తాత దగ్గరక వెళ్ళిన అమృత. ‘‘తాతా ఆ బొమ్మను నేను తీసుకోలేను. ఇంకెవరికైనా అమ్మేసుకోగలవా?’’ అని అడిగింది.
‘‘ఏమైంది డబ్బులున్నాయన్నావుగా?’’ అని అడిగాడు తాత.
‘‘అవును తాతా కూడబెట్టాను. కానీ నా స్నేహితురాలు పంకజ స్కూల్ ఫీజు కట్టలేదట. వాళ్ళు చాలా బీదవాళ్లు. ఫీజు కట్టడం లేదని మాస్టార్లు స్కూల్‌కి రావద్దన్నారట. రాత్రి మా ఇంటికి వచ్చి ఏడ్చింది. నేను ఆ డబ్బును పంకజకు ఇవ్వాలనుకుంటున్నా’’ అంది అమృత.
తాత ఆ చిన్నమ్మాయిలో ఉన్న పెద్ద మనసుకు ఆశ్చర్యపోయాడు. ‘‘మరి నీకు ఏనుగు బొమ్మ వద్దా?’’ అన్నాడు తాత.
‘‘వద్దులే తాతా. మళ్లీ ఇంకెప్పుడైనా కొనుక్కుంటాను’’ అని వెళ్ళబోయింది అమృత.
‘‘మీ తాతయ్య నీకు ఈ బొమ్మను బహుమతిగా ఇస్తున్నాడు. తీసుకో తల్లీ’’ అంటూ మొహమాట పడ్తున్న అమృత చేతిలో బలవంతగా ఏనుగు బొమ్మను ఉంచాడు తాత.
ఒక ఊళ్లో నలుగురు స్నేహితులు ఉండేవారు. వాళ్లు ఒక ముని దగ్గరకు వెళ్లి, ఎవ్వరికీ నేర్పని విద్య ఏదైనా నేర్పమని కోరారు. అయితే అటువంటి విద్యలతో ఇబ్బందే తప్ప ఉపయోగం ఉండదని ఆ ముని చెప్పాడు. అయిన్పటికీ నేర్పమని పట్టుపట్టారు ఆ నలుగురు. తప్పేది లేక ముని ఆ నలుగురికీ నాలుగు ప్రత్యేక విద్యలను నేర్పాడు. వారు ఆ విద్యలను నేర్చుకుని, తమ ఊరికి ప్రయాణమయ్యారు.
ఒక అడవిగుండా ప్రయాణిస్తూండగా మార్గమధ్యంలో వాళ్లకి కొన్ని ఎముకలు కనిపించాయి. అవి చూడగానే ఆ నలుగురికీ తమ తమ విద్యలను ప్రదర్శించే అవకాశం దొరికిందనుకుని సంతోషం కలిగింది.
మొదటివాడు ఎముకల వాసన చూసి ‘ఇవి సింహం ఎముకలు’ అన్నాడు.
రెండవవాడు ‘నేను నా విద్యతో వీటన్నిటినీ కలిపి అస్థిపంజరం చేస్తాను’ అని అలాగే చేశాడు.
మూడవవాడు, ‘నా విద్యతో ఈ అస్థిపంజరంపై మాంసాన్ని, చర్మాన్ని తెస్తాను’ అని, మంత్రం చదివి, సింహాన్ని తయారుచేశాడు.
నాలుగవ వాడు ‘ఇప్పుడు నా విద్యను ప్రదర్శిస్తాను చూడండి’ అని మంత్రం చదివి ఆ సింహానికి ప్రాణం పోశాడు. దానికి ప్రాణం వచ్చింది.
వెంటనే సింహం లేచి కూర్చుంది. ఆ నలుగురు తమ తమ విద్యలు విజయవంతమైనందుకు సంతోషించారు. ఇంత మంచి విద్యలని ఇంతకాలం నేర్చుకోకుండా ఉన్నందుకు బాధపడ్డారు. ‘ఇక బయలుదేరదాం’ అనుకుంటూ ఉండగా వాళ్లు ప్రాణం పోసిన సింహం మీదకు దూకడానికి సిద్ధమయ్యింది.
ఎదురుగా ఉన్న నలుగురినీ చూసింది. తమ వల్ల ప్రాణం పోసుకున్న సింహం తమనేమీ చేయదనుకున్నారు నలుగురు స్నేహితులు. కానీ, ఆ సింహం అమాంతం వాళ్లని చంపి, తినేసి తన దారిన తాను వెళ్లిపోయింది.పెద్దల మాట వినాలి. లేకపోతే ఈ నలుగురు స్నేహితులకి జరిగినట్టే నష్టం వాటిల్లుతుంది.
ఒక రాజ్యంలో ఒక ముని ఉండేవాడు. అతడు సర్వజ్ఞాని. జోతిష్యం కూడా బాగా చెప్పేవాడు. అతను చెప్పినవన్నీ నిజం అవుతుండడంతో ఆ రాజ్యంలోని వారందరికీ అతనిపై నమ్మకం కుదిరింది.
అతని ప్రతిభ ఆ నోట ఈ నోట ఆ దేశపు రాజు వరకు పాకింది. ఆ ముని ప్రతిభ ఏమిటో స్వయంగా తెలుసుకుందామనిపించింది రాజుకు. అంతే! వెంటనే తన సైనికులను పంపించి,
ఆ ముని ఎక్కడ ఉన్నా వెదికి తన ముందు ప్రవేశపెట్టమన్నాడు.
రాజాజ్ఞ ప్రకారం బయలుదేరి, ఊళ్లన్నీ వెతుకుతూపోయారు. చిట్టచివరకు ఒకానొక ఊరిలో ముని దొరికాడు. అతనికి రాజాజ్ఞను తెలిపి, తమతో రమ్మన్నారు సైనికులు.
ముందు తటపటాయించినా, రాజాజ్ఞ మీరకూడదని సైనికుల వెంట రాజు దగ్గరికి పయనమయ్యాడు ఆ ముని. రాజు మునిని సగౌరవంగా ఆహ్వానించి, సకల మర్యాదలు చేశాడు. అన్నీ పూర్తయ్యాక,
రాజు ‘‘మునివర్యా! మీ జ్యోతిష్య ప్రతిభ గురించి చాలా విన్నాం. ఇప్పుడు మా భవిష్యత్తు చెప్పాలి’’ అన్నాడు.
ముని ఒక్కక్షణం ఆలోచించి, రాజుగారి భవిష్యత్తు చెప్పడం ప్రారంభించాడు. తన గురించి గొప్పగా చెబుతుంటే రాజు పొంగిపోయి కానుకల మీద కానుకలు కురిపించాడు. కొంతసేపటికి ముని రాజుకు జరగబోయే చెడు చెప్పడం మొదలుపెట్టాడు.
వెంటనే రాజుకు కోపం వచ్చింది, ఆ మునికి ఉరిశిక్ష వేయాలన్నంత ఆవేశం వచ్చింది. ‘తన భవిష్యత్తు ఇంత భయంకరంగా చెబుతాడా?’ అనుకుని, ‘‘నువ్వు తప్పుడు జ్యోతిష్యం చెబుతున్నావు. నీకు నిజంగా జ్యోతిష్యం వస్తే నువ్వెప్పుడు చనిపోతావో చెప్పు’’ అని అడిగాడు.
మునికి రాజు కోపం అర్థమైంది. తనకు రాబోయే అపాయాన్ని కూడా ఊహించాడు. సమయస్ఫూర్తితో నెమ్మదిగా ‘‘మీరు చనిపోయే గంట ముందు నేను చనిపోతాను ప్రభూ’’ అన్నాడు.
ఆ మాటతో రాజుకి కోపం చల్లారిపోయింది. తన తప్పును తెలుసుకుని మునిని గౌరవించి సాగనంపాడు.
ఒకరోజు ఉదయం బీర్బల్ రాజదర్బారుకు వెళ్లేసరికి అందరి ముఖాలూ దిగాలుగా కనిపించాయి. అక్బరు చక్రవర్తి వాళ్లని ఏదో ప్రశ్న అడిగి ఉంటాడనీ, దానికి వాళ్లు సమాధానం చెప్పలేకపోయి ఉంటారనీ అర్థమయ్యింది బీర్బల్‌కి.
అతను నెమ్మదిగా చక్రవర్తి దగ్గరకు వెళ్లి, ‘‘విషయం ఏమిటి జహాపనా?’’ అని అడిగాడు.
‘‘మన రాజ్యంలో విషయాలేవీ మన మంత్రులకి పట్టడం లేదు. ఇలా అయితే మన రాజ్యం నడపలేం’’ అన్నాడు కోపంగా.
‘‘అసలు సంగతేంటి జహాపనా?’’ అని అడిగాడు బీర్బల్.
‘‘మన రాజ్యంలో మొత్తం కాకులెన్ని ఉన్నాయో అని వీళ్లని అడిగితే ముఖాలు వేళ్లాడేసుకుని తెలియదు అంటున్నారు’’ అన్నాడు చక్రవర్తి.
‘‘ఓస్ అంతేనా!’’ అన్నాడు బీర్బల్.
‘‘నీకు తెలుసా?’’ అడిగాడు చక్రవర్తి.
‘‘ఓ! మన రాజ్యంలో మొత్తం నాలుగు లక్షల ఎనభై రెండు వేల నలభై ఆరు కాకులున్నాయి. కావాలంటే లెక్క పెట్టించండి’’ చెప్పాడు బీర్బల్.
‘‘అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు? ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే?’’ అడిగాడు చక్రవర్తి.
మన రాజ్యంలో ఉన్న చుట్టాలని చూడటానికి పక్క రాజ్యాల నుంచి కొన్ని కాకులు వచ్చి ఉంటాయి ప్రభూ!’’
‘‘అలాగా! మరి తక్కువ ఉంటే?’’
‘‘ఉండొచ్చు ప్రభూ! మన కాకులు వాళ్ల చుట్టాలని చూడటానికి పక్క రాజ్యాలకు వెళ్లి ఉండొచ్చు కదా?’’ అన్నాడు బీర్బల్.
ఈ కాకి లెక్కలకు అక్బరు హాయిగా నవ్వుకున్నాడు.
కపిలాపురంలో గోపాలం, గోవిందం అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. గోపాలానికి ధనాశ ఎక్కువ. అతను ఒకసారి గోవిందం దగ్గర పెద్దమొత్తంలో ధనం అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా గోపాలం అతనికి డబ్బు తిరిగి ఇవ్వకపోగా గోవిందం వెళ్లిన ప్రతిసారీ ఏవో అబద్ధాలు కల్పించి చెప్పసాగాడు. ఒకనాడు గోవిందం గోపాలం ఇంటికి వెళ్లి ‘‘నా అప్పు ఎప్పుడు తీరుస్తావు?’’ అని గట్టిగా నిలదీయడంతో గోపాలం కిందపడి గిలగిల కొట్టుకుం టూ అనారోగ్యం ఉన్నట్టు అభినయించసాగాడు.
అంతలో అతని భార్య లోపలి నుంచి వచ్చి ‘‘అయ్యో! అయ్యో! అనారోగ్యంతో బాధపడుతున్న నా భర్తను డబ్బు కోసం పీడిస్తావా?’’ అంటూ శాపనార్థాలు పెట్టసాగింది.
గోవిందం ఇవతలికి రాగానే భార్యభర్తలిద్దరూ ‘బాగా కుదిరింది. ఇక నుంచి గోవిందం ఎప్పుడు వచ్చినా ఇలాగే చేయాలి’ అనుకోవడం అతని చెవినపడింది.
గోవిందం కొంతకాలం తర్వాత మళ్లీ వెళ్లి డబ్బు అడగబోగా, గోపాలం ఈసారి కూడా కిందపడి గిలగిల కొట్టుకోసాగాడు. అతని భార్య గోవిందాన్ని తిట్టడం మొదలుపెట్టింది.
వీళ్ల నాటకాన్ని ఎలాగైనా బయటపెట్టాలనుకున్న గోవిందం ఈ విషయం మొత్తం గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు.
గ్రామాధికారి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ ప్రకారం గోవిందం కొద్దిరోజుల తర్వాత మళ్లీ గోపాలం ఇంటికి వెళ్లి ‘‘నా అప్పు ఎప్పుడు తీరుస్తావు’’ అని అడగటంతో గోపాలం కిందపడి గిలగిల కొట్టుకోసాగాడు.
అప్పుడే లోపలికి వచ్చిన గ్రామాధికారి తన వెంట వచ్చిన గ్రామవైద్యుడికి సైగ చేయడంతో వైద్యుడు గోపాలం నాడిని పరీక్షించి, ‘‘అయ్యా! ఇతని పరిస్థితి ఆఖరి దశలో ఉంది. ఏవైనా ముఖ్యమైన పనులు వుంటే పూర్తి చేయడం మంచిది’’ అన్నాడు.
అంతట గ్రామాధికారి గోపాలం ఇల్లు అతని తదనంతరం అతని భార్యకు చెందాలి. భోషాణం పెట్టెలోని డబ్బు గోవిందం ఇచ్చిన అప్పుకు వడ్డీతో సహా చెల్లించాలి’’ అన్నాడు. గోపాలానికి తగిన శాస్తి జరిగిందని అందరూ సంతోషించారు.
పేదరాశి పెద్దమ్మకు ఒక కూతురు ఉండేది. ఆమె చాలా అందంగా ఉండేది. ఓరోజు పూల కోసం అడవికి వెళ్లింది. ఆమెను ఒక పాము చూసి పెళ్లాడాలనుకుంది. ఆ పిల్లను పట్టుకెళ్లి పుట్టలో దాచేసింది.
'ఏందబ్బా! పిల్ల ఇంకా రాలేదు?' అనుకున్న పెద్దమ్మ అడవంతా వెదికింది. పిల్ల కనబడక వెక్కి వెక్కి ఏడ్చింది. ఆకాశంలో ఎటో వెళ్తున్న పార్వతీ పరమేశ్వరులు ఆ ఏడుపు విని జాలి పడి ప్రత్యక్షమయ్యారు. పెద్దమ్మ గోడంతా విని, 'దిగులుపడకు పెద్దమ్మా! నీకో బుడ్డ మిరపకాయ ఇస్తాం. దీన్ని తిను. బుడ్డ మిరపకాయలాంటి బుడ్డోడు పుడతాడు. వాడి అక్కను వాడే తీసుకొస్తాడు' అని మిరపకాయను ఇచ్చి మాయమైపోయారు.
పెద్దమ్మ ఇంటికి వచ్చి మిరపకాయ తినగానే వెంటనే బుడ్డమిరపకాయ లాంటి బుడ్డోడు పుట్టి, చూస్తుండగానే పెద్దోడై 'అమ్మా! విషయం ఏంటో చెప్పు?' అన్నాడు. పెద్దమ్మ చెప్పింది. వెంటనే వాడు అడవిలోకి వెళ్లి కనిపించిన జంతువునల్లా అడిగాడు.
'బుడ్డోడా! బుడ్డోడా! నీ అక్క ఆ పుట్టలో ఉంది' అని చెప్పింది ఒక చీమ. బుడ్డోడు పుట్టపక్కనే దాక్కున్నాడు. పాము బయటకు వచ్చి అట్టా పోగానే, ఇట్టా లోపలికి దూరాడు. అక్కను తీసుకుని ఇంటికి వచ్చేశాడు.
పాము వచ్చి పుట్టలో పిల్ల కనబడక బుస్సుమంది. పెద్దమ్మ ఇంటికి పోయి చీకటి పడేదాక చావట్లో దాక్కుంది. అందరూ నిద్రపోయాక పిల్లను ఎత్తుకు పోయి పాతాళ లోకంలో దాచింది. తెల్లారి పెద్దమ్మ గొల్లుమంది. బుడ్డోడు వెంటనే బయల్దేరాడు. భూలోకమంతా వెదికి పాతాళానికి పోయాడు. పాము కళ్లలో కారం కొట్టి అక్కను తెచ్చేశాడు.
కొన్నాళ్లకు పాము మళ్లీ వచ్చి పిల్లను తీసుకుపోయి ఈసారి ఆకాశంలో దాచింది. ఆకాశంలో చంద్రుడు ఆమె అందం చూసి ముచ్చటపడ్డాడు. వెంటనే పెళ్లి చేసుకున్నాడు. పాముకి చంద్రుడిపై కోపం వచ్చింది. బుసలు కొడుతూ వచ్చి చంద్రుడిని మింగేసింది. అప్పుడే అక్క కోసం వచ్చిన బుడ్డోడు అది చూశాడు. దాని తోకను పట్టుకుని జాడించేసరికి చంద్రుడు ఊడి పడ్డాడు. వెంటనే పాముని బలం కొద్దీ విసిరేశాడు. అప్పట్నుంచి పాము పాక్కుంటూ రావడం, చంద్రుడిని మింగడం, బుడ్డోడు దాని తోక విదిలించి విసిరేయడం. పాము చంద్రుడిని మింగినప్పుడే మనకి చంద్రగ్రహణం వస్తుంది. వెంటనే బుడ్డోడు తన బావను కాపాడుకుంటాడు.
ఒక కోడి ఉండేది. ఒకనాడు అది గుడ్లు పెట్టింది. కొన్ని రోజులకు అందులోంచి కోడి పిల్లలు వచ్చాయి. అవన్నీ ఒక గూట్లో వెచ్చగా పడుకునేవి.అనుకోకుండా ఒక రోజు కోడి పక్క వూరికి వెళ్లాల్సి వచ్చింది. పిల్లల్ని పిలిచి, 'జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ పూర్తిగా నమ్మకండి. కలిసి కట్టుగా మసులుకోండి' అని చెప్పి వెళ్లింది. కోడి వెళ్లడాన్ని ఓ నక్క చూసింది. ఎలాగైనా రాత్రి వచ్చి వాటిని ఆరగించాలనుకుంది. అది నక్కుతూ నక్కుతూ కోడి పిల్లల దగ్గరకు వచ్చి, 'కోడి కూనలూ! ఈ రాత్రికి మీరు ఎక్కడ పడుకుంటారు?' అని అడిగింది.
'మేమంతా మా అమ్మ చేసిన గూట్లోనే పడుకుంటాం' అన్నాయవి ముక్తకంఠంతో. నక్క సంబరంగా వెళ్లిపోయింది.
అది వెళ్లగానే కోడిపిల్లలు తమలో తాము మాట్లాడుకుంటూ 'అమ్మ ఎవరినీ పూర్తిగా నమ్మవద్దంది కదా? కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి' అనుకున్నాయి. ఆ రాత్రి అవి తమ గూట్లో ముళ్లు పడేసి బయటకి వచ్చేసి పొయ్యిలో పడుకున్నాయి. రాత్రి సద్దుమణిగాక నక్క నెమ్మదిగా వచ్చి గూట్లోకి మొహం పెట్టింది. దాని మూతి నిండా ముళ్లు గుచ్చుకున్నాయి. అది మూలుగుతూ అడవిలోకి పారిపోయింది.
మర్నాడు నక్క మళ్లీ వచ్చి, 'కోడి కూనలూ! ఇవాళ రాత్రి ఎక్కడ పడుకుంటారు?' అని అడిగింది.
'అమ్మ చేసిన పొయ్యిలో పడుకుంటాం' అన్నాయి. నక్క సంగతి తెలిసిన అవి పొయ్యిలో బొగ్గులు పడేసి గడ్డివాములో పడుకున్నాయి. రాత్రి నక్క వచ్చి పొయ్యిలో మూతి పెట్టేసరికి నిప్పులు తగిలి మూతి మాడిపోయింది.
పట్టువదలని నక్క మర్నాడు ఉదయం వచ్చి, 'ఇవాళ ఎక్కడ పడుకుంటారర్రా' అని అడిగింది.
'అదిగో ఆ గడ్డివాములో' అన్నాయి కోడి పిల్లలు. నక్క వెళ్లగానే కోడిపిల్లలు, 'దీని మూతి మీద ముళ్లు గుచ్చుకున్న మచ్చలు, కాలిన గాయాలు ఉన్నాయి. ఇది మనని తిండానికే వస్తోంది. ఇవాళ ఎలాగైనా దీని పీడ వదిలించుకుందాం' అనుకుని కలిసికట్టుగా ఆలోచించి ఉపాయం పన్నాయి.
రాత్రి అవన్నీ అటక మీదకి ఎక్కి నక్క కోసం ఎదురు చూడసాగాయి. నక్క వచ్చి గడ్డివాములో దూరింది. వెంటనే కోడిపిల్లలు గడ్డివాముకు నిప్పు అంటించాయి. ఆ మంటల్లో నక్క మాడి మసైపోయింది. తల్లి కోడి రాగానే పిల్లలు ఇదంతా చెప్పాయి. అది ఆనందంగా వాటిని తన రెక్కల్లో పొదువుకుని, 'ఇంకెప్పుడూ మిమ్మల్ని వదిలి వెళ్లనేం?' అంది. కోడి పిల్లలన్నీ ఆనందంగా కిచకిచలాడాయి.
ముల్లా నస్రుద్దీన్ తన పట్టణంలో ఒక ప్రముఖ వ్యక్తి. చాలామంది తాము కూడా నస్రూలా చతురత, మేధాశక్తి కలిగివుండాలని కోరుకునేవారు. ఒకరోజు కొందరు విద్యార్ధులు నస్రును కలిసి ఇలా అడిగారు, "గురువుగారూ! మేము మీ గురించి చాలా విన్నాం. మీకు ప్రతి ప్రశ్నకూ జవాబు తెలుసని అంతా అనుకుంటారు. మీ చతురత, మేధాశక్తిలో మేము కొంతభాగం సంపాదించుకోగలిగినా చాలు, మమ్మల్ని మీ శిష్యులుగా అంగీకరించండి."
మొదట నస్రు తిరస్కరించాడు. అతనికి చాలా సిగ్గు, అతనొక గురువుగా ఉండటానికి ఇష్టపడలేదు. కాని విద్యార్ధులు ప్రాద్ధేయపడడంవల్ల అతను ఒప్పుకోక తప్పలేదు. నస్రు విద్యార్ధులతో "సరే! నేను మిమ్మల్ని నా శిష్యులుగా అంగీకరిస్తున్నాను, కాని కొన్ని రోజుల వరకే. మీరు ఏమి చేస్తున్నారో చూసి కొన్నిసార్లు ప్రజలు నవ్వుతారు, కాని ప్రతీ పని వెనుక ఒక కచ్చితమైన ఉద్దేశ్యం వుంటుంది." అని చెప్పడంతో విద్యార్ధులు సంతోషించారు.
వారిలో ఒక విద్యార్ధి ఇలా అన్నాడు, "ముల్లాగారూ! ప్రజలు మీలా గొప్ప శక్తులను పొందాలని కోరుకుంటారు. మీరేమైనా శక్తులను పొందారా?
నస్రు నవ్వుతూ, "హా! అవును! నేను చీకటిలో కూడా చూడగలిగే శక్తిని సంపాదించాను", అన్నాడు. విద్యార్ధులు ఆశ్చర్యపోయారు. మరో విద్యార్ధి "గురువుగారూ! మీరు చీకటిలో లాంతరు పట్టుకుని నడవడం నేను చూశాను. మీకు చీకటిలో కనిపించినట్లైతే మీరు అలా ఎందుకు చేస్తారు?" అన్నాడు.
నస్రు నవ్వుతూ, "ఆహ్ ఎందుకంటే ఇతరులు చీకట్లో చూడలేరు కదా! లాంతరు నన్ను ఇతరులు ఢీకొట్టకుండా కాపాడుతుంది" అని చెప్పాడు.
విద్యార్ధులు నవ్వుతూ నస్రు మేథోశక్తి, చతురతను పొగిడారు. కొంత సమయం తర్వాత నస్రు విద్యార్ధులతో "పదండి మిత్రులారా! ఇంటికి వెళ్ళిపోదాం. మీకు ఇంటికెళ్ళడానికి గుర్రాలున్నాయా?" అని ప్రశ్నించాడు.
విద్యార్ధులు, "లేవు గురువుగారూ!" అని బదులిచ్చారు.
దాంతో నస్రు గుర్రం మీదకు ఎక్కి మెల్లగా స్వారీచేస్తుండగా, విద్యార్ధులు నడుస్తూ అతన్ని అనుసరించారు.
కానీ నస్రు తన గుర్రం మీద తల వెనుకకు, వీపు ముందుకు చేసి కూర్చోవడంతో విద్యార్ధులంతా ఆశ్చర్యపోయారు. వీధుల్లో వెళ్తున్న ప్రజలు నస్రును చూసి పగలబడి నవ్వడం మొదలెట్టారు.
ఒక విద్యార్ధి ఉండబట్టలేక కుతూహలంతో "గురువుగారూ! మీరు గుర్రంపై ఎందుకిలా వెనుదిరిగి కూర్చున్నారో కాస్త చెప్తారా? ప్రజలంతా మనల్ని చూసి నవ్వుతున్నారు", అని అడిగాడు. నస్రు, "కూర్చోవడంవల్ల మీకు ఒక పాఠం అబ్బుతుంది. మీరు ఇతరుల పరిహాసాన్ని పరిగణలోకి తీసుకోరాదు మిత్రులారా!" అని బదులిచ్చాడు.
తర్వాత అతనిలా అన్నాడు. "నేను వెనుదిరిగి ఎందుకు కూర్చున్నానంటే నేను మిమ్మల్ని గౌరవిస్తాను కాబట్టి. మీరు నా ముందు నడుస్తూ, నేను మిమ్మల్ని అనుసరిస్తే అది నాకు అగౌరవం. అదే నేను ముందు వెళ్తూ, మీరు నన్ను అనుసరిస్తే అది మీకు అమర్యాద. వెనుదిరిగి స్వారీచెయడమే మనందరికీ గౌరవప్రదమైన పద్ధతి". అది విన్న విద్యార్ధులు చప్పట్లు చరుస్తూ. తమ కొత్త గురువు నస్రుతో నవ్వుతూ ప్రయాణం కొనసాగించారు.
ఒక అడవిలో ఒక ఒంటికన్ను దుప్పి ఉండేది. ఆ దుప్పి కన్ను లేని వైపు నుండి, ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా చూడలేకపోయేది. దానికి వేటగాళ్ల నుండి, క్రూరమృగాల నుండి రక్షణ కావాలి కాబట్టి చాలా ఆలోచించగా దానికి ఒక ఉపాయం తట్టింది. ఆరోజు నుండి అది తన కన్నున్న భాగాన్ని గడ్డివైపు, కన్నులేని భాగాన్ని సముద్రం వైపు ఉంచి మేతమేసేది. సముద్రం వైపు నుండి ఏ విధమైన అపాయాలు రావు అని అనుకునేది ఆ దుప్పి.
కాని ఒక రోజు ఒక వేటగాడు పడవపై ప్రయాణిస్తూ వచ్చాడు. దుప్పిని చూసిన వెంటనే ఆ వేటగాడు తన బాణం సంధించాడు. బాణం దుప్పి కాలిలో గుచ్చుకుంది. బాధతో విలవిల్లాడిపోతూ దుప్పి అక్కడి నుండి ఎలాగో తప్పించుకుని పారిపోగలిగింది.
'నేను గడ్డి వైపు నుండి అపాయం వస్తుందనుకున్నాను. కాని అపాయం రాదు అనుకున్న సముద్రం వైపు నుండే అపాయం వచ్చింది. అడవి జంతువులకు అపాయం అన్ని వైపుల నుండి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి' అని అనుకుంది.
ఆ రోజు నుండి దుప్పి మరింత జాగ్రత్తగా అడవిలో సంచరించడం మొదలు పెట్టింది.
వ్యాపారి ఒకడు రామచిలుకను తెచ్చి పంజరంలో పెట్టాడు. స్వేచ్చగా ఉండే చిలుకకు పంజరంలో వుండటం జైలు శిక్షగా అనిపించింది. ఎలాగయినా సరే ఈ చెరనుండి బయటపడాలని అది నిశ్చయించుకొన్నది. ఆలోచించగా ఆలోచించగా దానికొక ఉపాయం తట్టింది. అది వ్యాపారిని పిలచి నన్నిలా పంజరంలో పెడితే నీకేంటీ లాభం? నన్నొదిలి పెడితే నీకు ఆణిముత్యాలాంటి మూడు నిజాలు చెబుతాను అంది. వ్యాపారి నవ్వి ఊరుకొన్నాడు. మళ్ళీ చిలుకే అంది. మొదటినిజం చెబుతాను అదినీకు నచ్చితే నన్ను డాబాపైకి తీసుకొని వెళ్ళవచ్చు. రెండవ నిజం చెబుతాను. అదికూడా నచ్చితే కొబ్బరిచెట్టుమీద కూర్చోవడనికి నాకు అనుమతి ఇవ్వాలి.
అప్పుడు మూడవ నిజంచెబుతాను. అదికూడా నచ్చితే నాకు స్వేచ్చను ప్రసాదించాలి. సరేనా! అని, వ్యాపారిని అడిగినది. దీనికి వ్యాపారి వప్పుకొన్నాడు. చిలక మొదటినిజం ఇలాచెప్పినది. ఏది పోగొట్టుకొన్నా భవిష్యత్తు మిగిలే ఉంటుంది. ప్రాణంతో సమానమైనది పోయినా దిగులు పడకూడదు. వ్యాపారికి ఈ సలహా నచ్చినది. చిలుకను డాబా మీదుకు వెళ్ళమన్నాడు. రెండవ సలహాగా చిలుక ఇట్లు చెప్పినది. ఏదయినా సరే నీకళ్ళతో నీవు చూచేదాకా నీవు నమ్మద్దు, వ్యాపారికి ఈ సలహా కూడా నచ్చింది. చిలుక కొబ్బరిచెట్టు కొసన కూర్చుంది. మూడవ సలహా చెప్పమని వ్యాపారి అడిగాడు. అప్పుడు చిలుక నాకడుపులో రెండు వైఢూర్యాలున్నాయి. నా కడుపు కోస్తే అవి లభ్యమవుతాయి అంది.
దాంతో వ్యాపారికి కలవరం పట్టుకొంది. అయ్యయ్యో! చిలుకను పట్టుకోలేనే! అనవసరంగా రెండు వైఢూర్యాలూ చెయ్యిజారిపోయే! అని బాధపడ్డాడు. చిలుక అందనంత ఎత్తులో ఉంది. ఎలాగైనా చిలుకను పట్టుకోవాలని వ్యాపారి అనుకొన్నాడు. అప్పటికే వ్యాపారి ధోరణిని గ్రహించిన చిలుక నవ్వుతూ వ్యాపారితో ఇలా చెప్పింది. నీకు రెండు సలహాలు ఇచ్చాను. అయినా నీవు పాటించలేదు. ప్రాణంతో సమానమైనది పోయిన బాధపడకూడదని చెప్పాను. వైఢూర్యాలు పోగొట్టుకుంటున్నానే అని బాధ పడిపోతున్నావు. అలాగే నీకళ్ళతో నీవు చూచే వరకు నమ్మవద్దని చెప్పాను. కానీ నీవు అలా చేయడం లేదు. నా కడుపులో వైఢూర్యాలున్నా యని చెప్పడంతోటే ఒకటే కలవర పడుతున్నావు. నాకడుపులో వైఢూర్యాలు ఎలా ఉంటాయి? ఒకవేళ ఉంటే నేనెలా బ్రతుకుతాను? సలహాలు పాటించనివారికి సలహాలివ్వకూడదని పెద్దలిచ్చిన సలహాను నేను మరచిపోలేను. ఇ ది నా మూడవ సలహా, వస్తాను అంటూ చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది. వ్యాపారి మొహం సిగ్గుతో చిన్నపోయింది.
ఒక అడవిలో నీటి మడుగు ఉండేది. ఆ మడుగులో ఎన్నో జంతువులు ఉండేవి. వాటిలో ఒక చిన్న చేపను మిగతా చేపలే కాకుండా ఇతర జంతువులూ ఆప్యాయంగా చూసుకునేవి. ఆ చేప అన్ని జంతువులతో ప్రేమగా మాట్లాడుతూ, స్నేహంగా ఉండేది.
ఒకరోజు ఆ చేప ఈదుతూ మడుగు ఒడ్డుకు వస్తుంటే ఒక కప్ప చూసింది. కప్ప మడుగుకి కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు. చేపను చూసి కప్ప, "ఏయ్ చేపా! నువ్వెందుకు మడుగు ఒడ్డుకు వస్తున్నావు? ఒడ్డుకు రావాలంటే నా అనుమతి తీసుకోవాలి" అంటూ అరవడం మొదలెట్టింది.
కప్ప మాటలకు చేప ఖంగుతింది. అప్పటివరకు దానితో ఎవరూ అలా మాట్లాడలేదు. అది కప్పను ఏమీ అనకుండా మడుగులోపలికి వెళ్లిపోయింది. అయినా కూడా ఆ కప్ప చేపను వదల్లేదు. మడుగులోకి దూకి చేప వెనకాలే వచ్చింది. "నువ్వొక నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా? నీటిలో నుండి బయటకు వచ్చినట్టు కనీసం కల కూడా కనలేవు. కాని నేను, నీటిలో ఈదగలను, నేలమీద బతకగలను" అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప. చేపమాత్రం ఏమీ మట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కనీసం కప్ప వైపు తిరిగి చూడను కూడా చూడ లేదు. దాంతో కప్పకు కోపమొచ్చింది.
కప్ప తన గొప్పలను ఏకరువు పెడుతూ ఉండిపోయింది. "నువ్వు కనీసం మాట్లాడగలవా? నేను శ్రావ్యంగా పాడగలను కూడా" అంటూ మడుగులో నుంచి ఒడ్డుకు ఎగిరి "బెక బెక" మని అరవడం మొదలెట్టింది. అలాగే చాలాసేపు అరవసాగింది. కప్ప బెకబెకలు పక్కనే ఉన్న పుట్టలో నిద్రపోతున్న పామును నిద్రలేపాయి. తనను నిద్రలేపిందెవరో చూద్దామని కోపంగా పుట్ట బయటకొచ్చిన పాముకు మడుగు ఒడ్డున కప్ప కనబడింది. అంతే ఒక్క ఉదుటున కప్పపై దూకి కప్పను మింగేసింది. చేప చల్లగా నీటిలోకి జారుకుంది.
ఒక గ్రామంలో సోము అనే అమాయకమైన కుర్రాడు ఉండేవాడు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. బోజనానికి మిగతా అవసరాలకు ఇరుగుపొరుగు వాళ్ళు సహాయం చేసేవారు. పాఠశాల చదువు కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాల వల్లే సాధ్యమైంది.
ఒకసారి సోము దగ్గర పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. 'నమ్ముకున్న వారికి దేవుడే సహాయం చేస్తాడని' ఎవరో అనగా ఒకసారి విన్నాడు. దేవుడికి ఉత్తరం రాసి తనకు కాస్త డబ్బు సహాయం చేయమని అడగాలని నిర్ణయించుకున్నాడు.
దేవుడికి ఉత్తరం ఎలా రాస్తే బావుంటుందా అని చాలాసేపు ఆలోచించి చివరకు ఇలా రాశాడు. 'దేవుడా! నాకెవరు లేరు. నేను నిన్నే నమ్ముకున్నాను. దయచేసి నామీద జాలి చూపి పుస్తకాలు కొనుకునేందుకు 100 రూపాయలు పంపించు' ... చిరునామా రాయాల్సిన చోటులో 'దేవుడు, స్వర్గం' అని రాసి పోస్ట్‌బాక్స్‌లో ఆ ఉత్తరం వేశాడు.
పోస్ట్‌మాన్ అన్ని ఉత్తరాలతో పాటు సోము ఉత్తరాన్ని కూడా పోస్టాఫీసుకు తీసుకెళ్ళాడు. అక్కడి పోస్టుక్లర్కు ఆ ఉత్తరంపైన ఉన్న అడ్రసు చూసి ఆశ్చర్యపోయి దాన్ని పోస్టుమాస్టర్‌కు అందించాడు. ఆయన ఆ ఉత్తరం తెరిచి చదివాడు. ఆ ఉత్తరంలోని సున్నితమైన అంశం పోస్టుమాస్టర్ హృదయాన్ని తాకింది. అతను సోముకి 75 రూపాయలు మనియార్డరు పంపించాడు.
నాలుగురోజుల తర్వాత సోము నుండి దేవుడికి మరొక ఉత్తరం వచ్చింది. అందులో... దేవుడా! నువ్వు చాలా గొప్పవాడివి. నా మొర ఇంత త్వరగా ఆలకిస్తావని నేను అనుకోలేదు. అయితే నాకు కేవలం 75 రూపాయలు మాత్రమే లభించాయి. నువ్వు 100 రుపాయలు పంపించి ఉంటావు. కాని పోస్టుమాన్ అందులోంచి 25 రూపాయలు కాజేసి ఉంటాడు పరవాలేదు. అది నీ తప్పు కాదుగా... మరింకేదైనా అవసరం ఏర్పడితే నీకు మళ్ళీ ఉత్తరం రాస్తానూ అని ఉంది. అది చదివిన పో్స్టుమాస్టర్ సోము అమాయకత్వానికి జాలిపడ్డాడు.
కాంభోజనగరంలో విమలుడనేవాడుండేవాడు. ధనవంతుడయిన అతను ఉదారుడే, అతిధిపూజలు చేసేవాడే. కాని అతని భార్య కుటిలమాత్రం పేరుకి తగ్గ స్త్రీ. ఆమె తన యింటికెవరయినా వచ్చి దాహం (మంచి నీళ్ళు) అడిగితే 'నేను విననిదీ, నీకు రానిదీ, భూమిలో లేనిదీ అగు ఒక కథ చెబితే చక్కని చిక్కని మజ్జిగిచ్చి నీ దాహం తీరుస్తాను' అనేది - మంచినీళ్ళివ్వకుండా. ఎవరెంత చిత్రమయిన కథచెప్పినా -'ఓస్ దింతేనా' అని పరిహాసం చేసి దాహమివ్వకుండానే పొమ్మనేది. శాంతుడనే వాడు ఉజ్జయినీ నగరం వాడే. కానీ అతను దేశాటనం చేస్తుండగా అక్కడికి రావడమూ, కుటీలను దాహమడగడమూ ఆమె కథ చెప్పమనగా అతనికి కథ చెప్పడం ఇష్టంలేక మరో యింట దాహం తీర్చుకొని ఉజ్జయినీ తిరిగి వచ్చాక కుటిల విషయం విక్రమార్కుడికి విన్నవించడమూ జరిగింది.
విక్రమార్కుడు శాంతడిని వెంటబెట్టుకొని కాంభోజ నగరం కుటిల, విమలుల యింటి విషయాలన్నీ బాగా తెలుసుకొని విమలుడింటిలో లేని మిట్టమధ్యాహ్నవేళ ఎండలో చెమట కారుతుండగా ఆ యింటి ముందు నిలుచుని కుటిలను దాహమడిగాడు. ఆమె ఎప్పటిలానే నేను విననిది, నీకు రానిది, భూమిలో లేని కథను చెప్పితివా చక్కని మజ్జిగయిస్తాను అంది. దానికి రాజు అమ్మా! నాకపరిమితమగు దాహం వేస్తుంది. అందుకు కారణముంది. నేనీ నగరానికి ప్రవేశిస్తూంటే తోటలో విమలుడను సజ్జనుడున్నాడని విని అక్కడికి వెళ్ళి దాహమడిగితే భార్యతో సరసములాడుటలో మునిగిన అతను నా మాట లక్ష్యము పెట్టలేదు. నేను మళ్ళీ మళ్ళీ దాహం అడిగేసరికి నన్ను కొట్టడానికి వచ్చి నన్ను తరిమి అతను భార్యతో పడమట దిక్కుగా పోయాడు. పరుగెత్తిరావడం వల్ల అలసట ఎక్కువగా ఉంది. దాహం తీరాక నువ్వడిగిన కథ చెబుతాను. అన్నాడు. ఆ మాటలు వింటూనే కుటిల తోక తొక్కిన తాచులా మండిపడుతూ తన భర్త పర స్త్రీతో సరసాలాడుతున్నాడనే కోపంతో అతనిని దండించాలని వెదకుతూ పడమర దిక్కుకు పరుగెత్తింది. కొంతసేపటికి విమలుడు పొలం నుంచి అలసిసొలసి యింటికి వచ్చి భార్య కనబడక వీధి అరుగుమీద కూర్చున్న విక్రమార్కుని 'ఈ యింటామె ఎటు పోయింది?' అని అడిగాడు. 'నేను దాహమడిగాను. కాని ఆమె నా మాటలు వినిపించుకోకుండా ప్రియుడితో సరసాలాడుతూ తూర్పు దిక్కుగా వెళ్ళిపోయింది. మీరయినా నాకు దాహమీయరా?' అన్నాడు. తన భార్య వేరొకరితో పోయినదనే కోపంతో విమలుడామెను దండించాలని వెతుక్కుంటూ తూర్పు దిశగా వేగంగా వెళ్ళిపోయాడు. అంతలో పొరుగూరిలో ఉన్న కూతురికి జబ్బుచేసిందని చూసిరావడానికి వెళ్ళిన విమలుని తల్లి ఊరి చివరి నుంచి తిరిగివచ్చి యింట్లో ఎవరూలేకపోవడం గమనించి వీధి తిన్నెమీదున్న అతన్ని 'ఈ యింటిలో వాళ్ళెక్కడికెళ్ళారు?' అని అడిగింది.
'అమ్మా! ఈ యింటి యజమాని పుత్రుడు హఠాత్తుగా చనిపోగా వానిని పూడ్చి పెట్టడానికి వాళ్ళు ఉత్తర దిశగాపోయారు. అని చెప్పాడు మారువేషంలోని రాజు. ఆవిడ గొల్లుమని ఏడుస్తూ ఉత్తర దిశగా పరుగెత్తింది. ఒకరికి తెలియకుండా ఒకరు యింటినుంచి పోయిన విమలుడు కుటిలా ఒక చోట కలుసుకుని ఒకరినొకరు నిందించుకుంటూ, అసహ్యించుకుంటూ ఏడ్చుకుంటూ ఉండగా విమలుని తల్లి కూడా వారిని చేరుకుంది. ఒక నీటి గుంట ఒడ్డున కూర్చొని ఏడుస్తున్న కొడుకునీ, కోడలినీ చూసి తను కూడా ఏడుస్తూ వారి వద్దకు వెళ్ళగా కూతురు చనిపోయినందుకు కాబోలు ఆవిడ ఏడవసాగిందనుకొని వారు కూడా ఆవిడని పట్టుకొని బిగ్గరగా ఏడవసాగారు. కాని, ఎవరు మాత్రం ఎంత కాలమని ఏడవగలరు? కొంతసేపట్లో వాళ్ళూ ఏడుపాపి ఒకరి విషయం ఒకరు తెలుసుకొని యింటికి బయలుదేరారు. ఈ లోగా విక్రమార్కుడు వాళ్ళింట్లో ప్రవేశించి ఆ యింటి దూలములు, వాసములు, స్థంబములు మొదలగువాని లెక్క రాసుకున్నాడు.
విమలుడు, భార్య, అత్తగారు యింట్లోకి వెళ్ళబోతుంటే వారినడ్డుకొని విక్రమార్కుడు ఈ ఇల్లునాది. మీరెందుకు లోపలికి వెళ్తున్నారు? అని దెబ్బలాడసాగాడు. వాళ్ళు తెల్లపోయారు. 'ఈ ఇల్లు మాది, నీదంటావేం? నడు, వీధిలోకి నడు, పెద్దమనుషుల దగ్గర తేల్చుకుందా, అన్నారు. అతను 'సరే' అని పెద్దమనుషుల దగ్గరకు వచ్చి వీరెవరో నా యింటిలో చొరబడబోవుచున్నారు అని తగవు పెట్టాడు. విమలుడి కుటుంబం పెద్దమనుషులని ఆ యిల్లు మాదని మీరెరుగరా అని అడుగుతుంటే ఈ ఇల్లు వారిదే అయితే ఆ యింటి దూలములు, వాసాలూ ఎన్నో చెప్పమనండి. లేకపోతే నేను చెబుతాను అన్నాడు రాజు. ఇంక వాళ్ళేమీ చెయ్యలేక రాజువేపు ప్రాధేయపడుతూ చూసి మీరెవరో పెద్దమనిషిలాగే ఉన్నారు. ఇలాంటి అన్యాయానికెందుకు పూనుకుంటున్నారు? అన్నారు బతిమాలుతు. అప్పుడు విక్రమార్కుడు అయ్యా! నీ ఇల్లాలు విననిదీ, నాకు రానిదీ, భూమిలోలేనిదీ అయిన కథ చెప్పినవారికి దాహమిస్తానని చెప్పింది. అందుకే నేనీ కథ చెప్పితిని అనగా అతని యుక్తికందరూ మెచ్చుకున్నారు. కుటిలని అందరూ ఎగతాళీ చేశారు. దానితో కుటిల తన కుటిలమార్గాన్ని వదిలి బుద్ది తెచ్చుకొని జీవించడం మొదలుపెట్టింది. రాజు తనతో వచ్చిన శాంతుడికి అనేక విధములయిన కానుకలిచ్చి తన నగరానికి వెళ్ళిపోయాడు.
అనగనగా ఒక అడవిలో ఒక ఆడ కుందేలు, మగకుందేలు నివసించేవి. ఆడకుందేలుకు గర్వం ఎక్కువ. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేది కాదు. పెద్ద జంతువులకి మర్యాద ఇచ్చేది కాదు. తనకన్నా చిన్న ప్రాణులనైతే మరీ చులకనగా చూసేది. మగ కుందేలు మాత్రం ఎంతో మంచిది. 'ఎవరి అవసరం ఎప్పుడు ఎలా పడుతుందో చెప్పలేం, అందరితో మంచిగా ఉండు' అని చెప్పేది. అయినా వినిపించుకునేది కాదు ఆడ కుందేలు.
కుందేళ్లు ఉండే చోటికి దగ్గర్లోనే ఒక సాలెపురుగు తన పరివారంతో జీవిస్తుండేది. దానిది నలుగురికీ సహాయపడే స్వభావం కావటంతో జంతువులన్నీ సాలెపురుగుని ప్రశంసించేవి. దాంతో కుందేలుకు అసూయగా తోచేది. ఎలాగైనా దానికి కీడు చేయాలని చూస్తూ ఉండేది.
ఓసారి ఆడ కుందేలు ఒంటరిగా ఉంది. అది గమనించిన ఓ తోడేలు దాన్ని చంపేయాలని ప్రయత్నించింది. తప్పించుకోడానికి కుందేలు పరుగుతీసింది. తోడేలు తరుముతుంటే మరో మార్గం లేక పాడుబడిన బావిలోకి గెంతింది. ఇదంతా సాలెపురుగు చూసింది. అది వెంటనే తన పరివారంతో అక్కడికి వచ్చి, తోడేలు వచ్చేలోగా బావిమీద చిక్కగా గూడు అల్లేసింది. తర్వాత తన స్నేహితుడైన పిచ్చుకకు చెప్పి ఆకులు, గడ్డి కప్పించేసింది. కుందేలును వెతుక్కుంటూ వచ్చిన తోడేలుకు అది కనిపించకపోవడంతో నిరాశగా వెళ్లిపోయింది. దెబ్బతో కుందేలుకు బుద్ధి వచ్చింది. సాలెపురుగు పట్ల, ఇతర జీవుల పట్ల తన ప్రవర్తనను గుర్తుతెచ్చుకుని సిగ్గుపడింది. సాయం చేసినందుకు వాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది.
అక్బర్ చక్రవర్తి కాలంలో ఒక ముసలావిడ ఉండేది. పాపం ఆవిడకు నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కత్తీ వంటరిగా ఉండేది. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజున ఆవిడకు హజ్ యాత్రకు వెళ్ళాలన్న కోరిక కలిగింది. ఆ సమయంలోనే ఊళ్ళో మరికొందరు కలిసి హజ్ యాత్రకు వెడుతున్నారని ఆవిడకు తెలిసింది. ఇంకేముంది వాళ్ళతో కలిసి యాత్రకు వెడితే బావుంటుందని ఆవిడకు అనిపించింది. సరే వాళ్ళను కలిసి ఇలా తను కూడా యాత్రకు రావాలని అనుకుంటన్నట్టుగా వారితో చెప్పింది. వాళ్ళు సరేనని అన్నారు.
మరి యాత్రకు వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా! అందుకని తన దగ్గర వున్న బంగారు నగలన్నింటిని అమ్మేసింది. నగలు అమ్మగా వచ్చిన డబ్బులో కొంత తన దారి ఖర్చులకు ఉంచుకుంది. మిగిలిన డబ్బులను ఒక సంచిలో వేసి మూట కట్టింది. ఆ సంచిని మైనంతో అతికించేసింది.
ఆవిడ హజ్ యాత్రకు వెడుతోంది కదా! ఆ డబ్బు సంచిని ఎక్కడ ఉంచాలి? ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదు.ఎందుకంటే ఇంట్లో ఆవిడ ఒక్కత్తే ఉంటుందని చెప్పుకున్నాం కదా! మరి ఆవిడ యాత్రకు వెడితే ఇంట్లో ఎవ్వరూ ఉండరు కదా! ఇల్లు తాళం పెట్టి వెడుతూ డబ్బంతా ఇంట్లో పెట్టి వెడితే అలా అని దొంగలకు తెలిస్తే వాళ్ళు ఊరుకోరు కదా! ఇంటికి వేసిన తాళం పగలకొట్టి ఇల్లు దోచుకుంటారు. అందుకని ఇంట్లో అంత డబ్బు పెట్టి యాత్రకు వెళ్ళడం అంత సురక్షితం కాదు అని ఆవిడకు అనిపించింది. పోనీ డబ్బంతా తన వెంట తీసుకుని వెడదామా అంటే వెంట తీసుకుని వెళ్ళడం కూడా మంచిదికాదు. మరి ఏం చేయాలి? ఇలా చాలా సేపు ఆవిడ ఆలోచించింది.
అట్లా ఆలోచించగా ఆలోచించగా ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది.
ఆ ముసలావిడ ఇంటి ప్రక్కన ఒక వ్యక్తి వున్నాడు. అతనిని అందరూ చాలా నిజాయితీ పరుడనీ, మంచివాడని అంటూ ఉంటారు. కాబట్టి అతని దగ్గర తన డబ్బును దాచి పెట్టుకుంటే డబ్బు చాలా సురక్షితంగా ఉంటుంది అని ఆవిడకు అనిపించిది.
ఈ ఆలోచన రావడంతోటే తన డబ్బు సంచిని తీసుకుని అతని దగ్గరకు వెళ్ళింది. అతను ఆవిడను చాలా ఆప్యాయంగా ఆహ్వానించాడు.
"చూడు బాబు! నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి." అని అడిగింది ఆ పెద్దావిడ.
అందుకు అతను " ఏం చేయాలో చెప్పండమ్మ" అన్నాడు. అప్పుడు ఆవిడ తను యాత్రలకు వెడుతున్నట్టు చెప్పింది. తన దగ్గర వున్న నగలను అమ్మగా కొంత డబ్బు వచ్చిందని, అందులో కొంత డబ్బును తనతో తీసుకుని వెడుతున్నానని, మిగతా డబ్బును ఇదిగో ఇలా సంచిలో కట్టి మైనంతో అతికించానని చెప్పింది. నేను యాత్రనుంచి తిరిగి వచ్చే వరకూ ఈ డబ్బుసంచిని నీ దగ్గర ఉంచు. ఒక వేళ నేను యాత్ర నుంచి తిరిగి రాకపోతే అప్పుడు ఈ సొమ్మంతా నీదే అవుతుంది. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఈ డబ్బును ఖర్చు చేసుకోవచ్చు." అని చెప్పింది ఆవిడ.
అందుకు అతను సరేనని అంగీకరించాడు. ఆవిడ డబ్బును తను భద్రంగా దాచి పెడతానని కూడా చెప్పాడు. డబ్బు మూటను అతనికి అప్పగించి ఆ ముసలావిడ నిశ్చింతగా యాత్రకు వెళ్ళింది.
ఈవిధంగా కొన్ని రోజులు గడిచాయి. హజ్ యాత్రకు వెళ్ళిన ఆ పెద్దావిడ మాత్రం తిరిగి రాలేదు. అందరి చేత నిజాయితీ పరుడని పేరు తెచ్చుకున్న అతను ముసలావిడ యాత్ర నుంచి తిరిగి రాకపోయే సరికి ఎంతో సంతోషించాడు. ఇక ఆ డబ్బులు తనవే కదా అని ఆనందపడ్డాడు. అనుకోకుండా అంత డబ్బులు కలిసి వచ్చినందుకు తన అదృష్టానికి పొంగి పోయాడు. ఇక తను స్వేచ్ఛగా ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చని అనుకుంటుండగా యాత్రకు వెళ్ళిన ఆ ముసలావిడ యాత్ర నుంచి తిరిగి వచ్చింది.
ముసలావిడ తను హజ్ యాత్రకు వెడుతూ అతని దగ్గర దాచుకున్న డబ్బు సంచిని ఇవ్వమని అడిగింది.
అందుకు ఆ నిజాయీతీ పరుడు "మీరు యాత్రనుంచి ఇప్పుడే వస్తున్నట్టున్నారు. మీరు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి... నేను స్వయంగా మీ ఇంటికి వచ్చి మీ సంచి మీకు ఇస్తాను" అని చెప్పాడు.
అందుకు ఆ పెద్దావిడ "అయ్యా! ఇన్ని రోజులుగా మీకు ఇచ్చిన శ్రమ చాలదా! ఇంకా మీరు ఇంటి వరకు వచ్చి నా సంచిని నాకు అప్పగించాలా?" అంది.
అందుకు ఆ నిజాయితీ పరుడు "అమ్మా! ఇందులో లేను పడిన శ్రమ ఏమున్నది? మీరు ఆ సంచిని నాకు ఇవ్వగానే దానిని అత్యంత భద్రంగా దాచి పెట్టాను. అక్కడినుంచి తీసుకుని రావడానికి కొద్దిగా సమయం పడుతుంది. అందుకే అన్నాను... మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను ఆ సంచిని తీసుకుని వస్తాను" అని అన్నాడు అతను. ఆ ముసలావిడ అతను చెప్పిన మాటలు నిజమని నమ్మింది. తన ఇంటికి తను వెళ్ళిపోయింది.
అతను చెప్పినట్టుగానే కాసేపటి తర్వాత ముసలావిడ ఇంటికి వెళ్ళాడు. ఆవిడ యాత్రలకు వెడుతూ తన దగ్గర దాచుకున్న సంచిని భద్రంగా ఇచ్చాడు.
తను యాత్ర్రలకు వెడుతూ అతని దగ్గర వదిలి వెళ్ళినప్పుడు సంచి ఎలా ఉందో అలాగే ఉండేసరికి ఆ ముసలావిడ ఎంతో ఆనందించింది. అతని నిజాయితీని మరోసారి అభినందించింది.
అతను వెళ్ళిన తరువాత ఆ ముసలావిడ తన డబ్బు సంచి తెరిచి చూసింది. అంతే ఆ పెద్దావిడకు గుండె ఆగినంత పని అయ్యింది. ఎందుకంటే ఆ ముసలావిడ హజ్ యాత్రకు వెడుతూ తన దగ్గర మిగిలిన బంగారు నాణాలన్నీ ఒక సంచిలో మూట కట్టి ఆ సంచిని మైనంతో అతికించి మరీ అతనికి ఇచ్చింది. తీరా ఇప్పుడు చూస్తే అందులో బంగారు నాణాలకు బదులుగా రాగి నాణాలు వున్నాయి. అవి చూసేసరికి ఆ పెద్దావిడకు గుండె ఆగినంత పని అయ్యింది.
ఆవిడ వెంటనే తను ఎవరి దగ్గరైతే డబ్బు దాచుకుందో అతని దగ్గరకు పరిగెత్తింది. ఆవిడను చూడగానే అతను "చెప్పండమ్మా! మీరు నా దగ్గర దాచుకున్న సంచి భద్రంగా ఉంది కదా!" అని అడిగాడు.
" అవునయ్యా! సంచి మాత్రం చాలా భద్రంగా ఉంది. కాని అందులో ఉండాల్సిన బంగారు నాణాలు లేవు. వాటికి బదులుగా ఇవిగో ఈ రాగి నాణాలు ఉన్నాయి?" అంది ఆవిడ."
"అమ్మా! మీరు చెప్తున్నది నిజమేనా?" అని అడిగాడు.
అవునయ్యా నేను నిజమే చెప్తున్నాను... నువ్వు చాలా నిజాయితీ పరుడవని నమ్మి నాడబ్బు నీ దగ్గర దాచి పెట్టుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నువ్వు ఇలా నన్ను మోసం చేస్తావని నేను అనుకోలేదు. చూడు బాబు! నేను పెద్దదాన్ని... మీ అమ్మలాంటిదాన్ని దయచేసి నాడబ్బులు నాకు ఇవ్వు ఆ డబ్బుతోనే నేను నా మిగతా జీవితం అంతా గడపాలి." అంటూ అతన్ని ప్రాథేయపడింది.
అందుకు అతను ఇలా సమాథానం చెప్పాడు "అమ్మా! మిమ్మల్ని నా తల్లిగా భావించి చెప్తున్నాను... అసలు ఆ సంచిలో ఏం ఉందో నాకు తెలీదు... సరే ఒక సంగతి చెప్పండి... నేను ఇచ్చిన సంచి మీదే కదా!" అని అడిగాడు.
" అవును ఆ సంచి నాదే " అంగీకరించింది ఆ పెద్దావిడ.
"సంచికి ఎక్కడైనా చిల్లు ఉందా!?
"లేదు" అని అంగీకరించింది ఆ ముసలావిడ.
"మరి నన్ను ఎందుకమ్మా అనుమానిస్తున్నారు? మీరు ఆ రోజు హజ్ యాత్రకు వెడుతూ ఏ సంచినైతే నాకు ఇచ్చారో అదే సంచి ఇది అని ఒప్పుకుంటున్నారు కదా! నేను ఆ రోజున సంచిని దాచిపెట్టాను తిరిగి ఈ రోజు మీరు వచ్చి అడిగిన తర్వాత నేను ఆ సంచిని చూస్తున్నాను. ఆ సంచిలో ఏం ఉన్నాయో అందులో మీరేం దాచిపెట్టారో నాకు తెలియదు..." అన్నాడు.
అతను అలా చెప్పాక ఆవిడకు ఏం చేయాలో అర్థం కాలేదు చాలాసేపు అతనిని బ్రతిమాలింది ఆవిడ ఎంత బ్రతిమాలినా అతను మాత్రం తను చేసిన తప్పు ఒప్పుకోలేదు ఆవిడ బంగారు నాణాలు ఆవిడకు తిరిగి ఇవ్వలేదు. ఇక ఆవిడకు ఏం చేయాలో అర్థం కాలేదు. రాజుగారి దగ్గరకు వెళ్ళి మొర పెట్టుకుంది.
అక్బర్ చక్రవర్తి ఆ ముసలావిడ చెప్పినదంతా ఎంతో శ్రద్దగా విన్నాడు. ఆ తరువాత ఆవిడ ఎవరి దగ్గరైతే డబ్బులు దాచి పెట్టుకుందో అతనిని పిలిపించాడు.
అతను రాజుగారి దగ్గరకు రాగానే రాజుగారికి నమస్కారం చేసాడు.
రాజుగారు ముసలావిడను చూపిస్తూ "ఈవిడ నీ దగ్గర డబ్బులు దాచుకుందట నిజమేనా?" అని అడిగాడు రాజుగారు.
"అదంతా నాకు తెలీదు మహారాజా! అసలు జరిగినదేమిటో నేను చెప్తాను... ఈ పెద్దావిడ కొన్ని రోజుల క్రితం నా దగ్గరకు వచ్చింది నేను హజ్ యాత్రకు వెడుతున్నానని చెప్పి ఈ సంచి నా దగ్గర దాచిపెట్టమని అడిగింది. పెద్దావిడ అడిగేసరికి నేను కాదనలేకపోయాను. సరేనని ఆ సంచి తీసుకున్నాను. ఆవిడ యాత్రనుంచి తిరిగి రాగానే ఆవిడ నా దగ్గర దాచిపెట్టుకున్న సంచి ఆవిడకు ఇచ్చేశాను. ఇది మహారాజా! జరిగింది. ఆవిడ నాకు దాచిపెట్టమని ఇచ్చిన సంచిని దాచి పెట్టానే కానీ అందులో ఏం ఉందో నేను చూడలేదు. ఆవిడ ఆ సంచిలో డబ్బులు దాచిపెట్టిందో లేక మరేమైనా దాచి పెట్టిందో నాకు తెలియదు. ఆ సంచిలో ఏం ఉన్నాయో నేను ఆ సంచిని తెరిచి చూడలేదు. తీరా ఇప్పుడు వచ్చి ఆ సంచిలో బంగారు నాణాలు దాచి పెట్టాను. నా బంగారు నాణాలు నాకు ఇవ్వు అంటే నేను ఎక్కడినుంచి తీసుకురాను? నేను ఎంతటి నిజాయితీ పరుడ్నో అందరికీ తెలుసు... ఈ పెద్దావిడ కూడా నేను నిజాయితీ పరుడిని అని నమ్మే కదా ఆవిడ యాత్రలకు వెళ్ళేటప్పుడు ఆ సంచిని నా దగ్గర దాచుకుని వెళ్ళింది. ఇప్పుడు నా నిజాయితీని శంకిస్తే నేను ఏం చేయగలను మహారాజా" అన్నాడు ఆ నిజాయితీ పరుడు.
అక్బర్ చక్రవర్తికి ఏం చేయాలో అర్థం కాలేదు.
ముసలావిడ సంచిలో బంగారు నాణాలు పెట్టి అతనికి ఇచ్చాను అని చెప్తోంది. ఆ నిజాయితీ పరుడేమో ముసలావిడ సంచి ఇచ్చిన మాట వాస్థవమే కానీ అందులో, బంగారు నాణాలు ఉన్నాయో రాళ్ళు ఉన్నాయో నాకు తెలీదు అంటాడు.
ఇద్దరూ నిజమే చెప్తున్నారని అనిపించసాగింది.
అప్పటికి మాత్రం ఇద్దరినీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోమని చెప్పాడు. ఇలాంటి చిక్కు సమస్యలు పరిష్కరించగల సమర్థత ఒక్క బీర్బల్ కు మాత్రమే ఉందని రాజుగారి నమ్మకం. అందుకే వెంటనే బీర్బల్ ను పిలిపించి సమస్య ఏమిటో అతనికి వివరించి చెప్పాడు రాజుగారు.
ఆ ముసలావిడ ఇచ్చిన సంచిని తీసుకుని బీర్బల్ ఇంటికి వెళ్ళాడు. ముసలావిడ సంచి లాంటి సంచి తీసుకుని ఆ సంచులలో తనకు తోచిన వాటితో నింపాడు. ఆ తర్వాత వాటిని మైనంతో అతికించేశాడు. అలా అతికించాక ప్రతి సంచికి చిన్న రంధ్రం చేసాడు. అక్కడితో ఒక పని పూర్తి అయ్యిందని అనుకున్నాడు.
ఢిల్లీ నగరంలో ఉన్న దర్జీలను అందరిని పిలిపించాడు. ఆ చిరుగుల సంచులు ఇచ్చి చిరుగు ఏ మాత్రం కనిపించకుండా కుట్టాలని చెప్పాడు. దర్జీలందరూ బీర్బల్ చెప్పినట్టుగానే చేశారు. వాళ్ళల్లో ఒక్క దర్జీని మాత్రం ఉండమని చెప్పి మిగతావారినందరినీ పంపించేసాడు. ఆ ఒక్క దర్జీ మాత్రం సంచి చిరుగు ఏ మాత్రం కనిపించకుండా కుట్టాడు. సంచి చిరుగు ఏమాత్రం కనిపించకుండా కుట్టినందుకు బీర్బల్ అతనిని ఎంతో మెచ్చుకున్నాడు.
అప్పుడు ముసలావిడ సంచిని ఆ దర్జీకి చూపించాడు. "నీకు ఎప్పుడైనా ఈ సంచిని చూసిన గుర్తు ఉందా?" అని అడిగాడు బీర్బల్.
మొదట ఆ దర్జీ తాను ఎప్పుడూ ఆ సంచిని చూడలేదని చెప్పాడు. అప్పుడు బీర్బల్ అతనిని రాజుగారి దగ్గరకు తీసుకుని వెడతానని బెదిరించేసరికి అప్పుడు నిజం చెప్పాడు.
ఆ ముసలావిడ ఎవరి దగ్గరైతే డబ్బు సంచి దాచుకుందో అతను తన దగ్గరకు వచ్చాడని, సంచి చిరుగు కనిపించకుండా కుట్టాలని చెప్పాడని దర్జీ చెప్పాడు.
"ఇది జరిగి ఎన్ని రోజులు అయ్యిందో చెప్పగలవా" అని అడిగాడు బీర్బల్.
"షుమారు సంవత్సరంన్నర క్రితం అనుకుంటాను నేను ఈ సంచి చిరుగు కుట్టాను అని చెప్పాడు ఆ దర్జీ.
"నువ్వు ఆ సంచిని కుట్టడానికి తీసుకున్నప్పుడు ఆ సంచిలో ఏం ఉన్నాయి?"
"ఆ సంచిలో కొన్ని రాగి నాణాలు మాత్రం ఉన్నాయి" అని చెప్పాడు ఆ దర్జీ.
"సరే రేపు ఈ విషయాన్ని నువ్వు రాజుగారి ఎదుట చెప్పాలి" అని చెప్పాడు బీర్బల్.
రాజుగారి దగ్గర చెప్పాలనేసరికి ఆ దర్జీ అతను భయపడిపోయాడు.
"రాజుగారు నిన్ను ఏమీ అనకుండా నేను చూసుకుంటాను... అయితే ఇప్పుడు నువ్వు నాకు ఏం చెప్పావో అదంతా రేపు రాజుగారి ముందు కూడా చెప్పాలి" అన్నాడు బీర్బల్.
సరేనని అంగీకరించాడు ఆ దర్జీ.
"చివరగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు... ఈ సంచిని కుట్టినందుకు అతను నీకు ఎంత డబ్బు ఇచ్చాడు?"
"రెండు బంగారు నాణాలు ఇచ్చాడు" అని చెప్పాడు ఆ దర్జీవాడు.
"ఇప్పుడు ఆ రెండు బంగారు నాణాలు నీ దగ్గర ఉన్నాయా లేక ఖర్చుపెట్టావా?"
"వాటిల్లో ఒక దానిని ఖర్చుపెట్టాను మరొకటి మాత్రం నా దగ్గరే ఉంది." అని చెప్పాడు ఆ దర్జీవాడు.
ఆ బంగారు నాణాన్ని తీసుకుని రేపు రాజసభకు రావాలని ఆ దర్జీవానికి చెప్పి అతనిని పంపేసాడు.
మరుసటి రోజు ఆ ముసలావిడ, ఆవిడ ఎవరిదగ్గరైతే డబ్బులు దాచుకుందో ఆ నిజాయితీపరుడు, దర్జీ అతను ముగ్గురు కూడా రాజ సభకు హాజరయ్యారు.
ఆ నిజాయితీ పరుడు కోర్టులో దర్జీ వానిని చూసి కొంచెం కంగారు పడ్డాడు.
బీర్బల్ దర్జీ వాని దగ్గర నుంచి బంగారు నాణాన్ని తీసుకుని ఆ ముసలావిడకు ఇచ్చాడు.
"ఈ బంగారు నాణం నాదే మహారాజా! నేను వీటిమీద ఒక గుర్తు కూడా పెట్టుకున్నాను" అంటూ బంగారు నాణం మీద తను పెట్టుకున్న గుర్తును చూపించింది.
బీర్బల్ తన దగ్గర ఉన్న ముసలావిడ సంచిని ఆ దర్జీ వానికి ఇచ్చి "ఈ సంచినేనా నువ్వు సంవత్సరంన్నర క్రితం కుట్టింది" అని అడిగాడు బీర్బల్.
దర్జీ వాడు భయం భయంగా రాజుగారి వంక చూసాడు.
"చెప్పు నీకేం భయం లేదు." అన్నాడు బీర్బల్.
"అవును ఈ సంచినే నేను సంవత్సరంన్నర క్రితం చిరుగు కనిపించకుండా కుట్టాను." అంటూ సంచికి చిరుగు ఎక్కడ ఉందో తాను ఎక్కడ కుట్టాడో కూడా చూపించాడు ఆ దర్జీవాడు.
"ఇప్పుడు చెప్పు ఆ పెద్దావిడ బంగారు నాణాలు నువ్వు దొంగిలించావా! లేదా!? " రాజుగారు కోపంగా అడిగాడు.
నిజాయితీ పరుడని పేరు తెచ్చుకున్న అతను సిగ్గుతో తల దించుకున్నాడు.
ఆ తర్వాత రాజుగారు అతనిని ఖైదు చేసారు. భటులను పంపి అతని ఇల్లునంతా వెతికించారు. అతని ఇంట్లో ముసలావిడ అతని దగ్గర దాచుకున్న బంగారు నాణాలు దొరికాయి. వాటిని ఆ ముసలావిడకు ఇచ్చి పంపించి ఆ పెద్దావిడను మోసం చేద్దామనుకున్న అతనిని ఖైదు చేయించాడు అక్బర్ చక్రవర్తి.
ఆ విధంగా దొంగ దొరికాడు.
మరోసారి బీర్బల్ తెలివి తేటలకు ప్రశంసలు లభించాయి.
విజయేంద్రవర్మ ఆదర్శవంతుడైన రాజు. ప్రతి ఏటా తన పుట్టినరోజు నాడు పేదలందరికీ దానధర్మాలు చేసేవాడు. తన రాజ్యంలో భూమిలేని రైతులకు కొంత భుమినిచ్చి సాగుచేసుకోమనేవాడు. తద్వారా రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలని రాజు భావించేవాడు.
అలా భూమిని పొందిన చంద్రన్న అనే రైతు పొలం దున్నుతుండగా నాగలికి ఏదో తగిలినట్టనిపించింది. అక్కడ తవ్వి చుడగా ఒక బంగారు రోలు, రోకలి దొరికాయి. ఆ రైతు నిజాయితీ గలవాడు. అందుకే ఆ రోలు, రోకలి భూమి యజమాని అయిన రాజుకే చెందాలనుకున్నాడు. అయితే రోలును రాజుకి బహుకరించి, రోకలిని తన కష్టానికి ప్రతిఫలంగా తనవద్దే ఉంచుకోవాలని అనుకున్నాడు. ఆ రైతుకు ఒక కుతురు ఉంది. ఆమె చాలా తెలివైనది. ఆమె తండ్రితో "మీరు రోలు మాత్రమే ఇస్తే రాజు రోకలి ఏదని అడుగుతారు. కాబట్టి రోలు, రోకలి రెండూ ఆయనకు బహుకరించండి" అని చెప్పింది.
కూతురి సలహాను పెడచెవిన పెట్టి చంద్రన్న రోలు మాత్రం తీసుకెళ్ళి రాజుకు బహుకరించాడు. రోలును చుసిన రాజా విజయేంద్రవర్మ రోకలి ఏదని చంద్రన్నను ప్రశ్నించాడు. చంద్రన్న దానికి సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. దాంతో రాజు అతడిని చెరసాలలో బంధించమని సైనికులను ఆదేశించాడు. సైనికులు అతడిని చెరసాలకు తీసుకువెళ్తుండగా, "నా కూతురి సలహా విని ఉంటే నాకీ దుస్ధితి పట్టేది కాదు కదా!" అని అతను ఆ విషయాన్ని రాజుకు చెప్పాడు. రాజు చంద్రన్నను వివరాలనడగగా కూతురి గురించి చెప్పాడు. చంద్రన్న కూతురిని తీసుకురమ్మని సైనికులను ఆజ్ఞాపించాడు రాజు. ఆమె రాజసభలోకి ప్రవేశించి జరిగినదంతా వివరించింది. ఆ అమ్మాయి తెలివితేటలకు ముగ్ధుడైన రాజు ఆమెను తన మంత్రిగా నియమించుకున్నాడు.
ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు అస్సలు కురవలేదు. దానికి తోడు ఎండలేమో మండిపోయాయి. దాంతో బావులలోను, పంపుల్లోను నీళ్ళు ఎండిపోయాయి. ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్ళు బాగా లోపలికి వెళ్ళిపొయాయి.
తెనాలి రామలింగడి ఇల్లు తుంగభద్రానది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్ళు బాగా లోపలికి పోయాయి. దాంతో నీళ్ళు తోడటం చాలా కష్టం అయిపోయింది. నీళ్ళు త్రాగటానికి, స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి ఏదో ఒక విధంగా నీళ్ళు తోడుకోసాగారు. కానీ వాళ్ళింట్లో ఉన్న తోటకి నీళ్ళు పెట్టేదెలా?
తోటకి ఎట్లా నీళ్ళు పెట్టాలా అని తెనాలి రామలింగడు ఆలోచిస్తూ కూర్చున్నాడు. మొక్కలు చూస్తేనా ఎండిపోతున్నాయి. బావిలో నీళ్ళేమో ఎక్కడో అడుగుకి ఉన్నాయి. తోటంతా నీళ్ళు పెట్టాలంటే బోలెడు నీళ్ళు కావాలి. అందుకోసం చాలా మంది కూలీలను పెట్టాలి. వాళ్ళకి బోలెడంత ధనం ఇవ్వాలి. ఇట్లా అలోచించుకుంటూ ఉండగా రామలింగడికి తన ఇంటికి కొంచెం దూరంలో ముగ్గురు మనుషులు నిలబడి ఏదో మాట్లాడుకోవడం కంపించింది.
ఎవరు వాళ్ళు? అనుకుంటూ కాసేపు తన ఆలోచనలను మర్చిపోయి వాళ్ళవంక చూడసాగాడు రామలింగడు వాళ్ళ ముగ్గురూ రామలింగడి ఇంటివైపు చూస్తూ ఏదో మాట్లాడుకోవడం కూడా రామలింగడు గమనించాడు.
'వాళ్ళను చూస్తే దొంగల్లా ఉన్నారు. వాళ్ళ వాలకం చూస్తుంటే ఈ రాత్రికి మా ఇంటికి కన్నం వేసేలా ఉన్నారు. అని అనుకున్నాడు. వెంటనే తన కొడుకుని పిలిచి ఇలా చెప్పాడు "అబ్బాయి ఈ సంవత్సరం వర్షాలు సరిగా కురవకపోవడం వలన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తినడానికి తిండి లేక చేసేందుకు పని దొరకక చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆవిధంగా ఈ రాజ్యంలో దొంగల బెడద ఎక్కువయ్యింది. కాబట్టి మన ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అన్నీ మనం ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేద్దాం. అప్పుడైతే దొంగలకు ఏమాత్రం అనుమానం రాదు. పైగా వాళ్ళు మన ఇంటికి దొంగతనానికి వచ్చినా కూడా వాళ్ళకి మన ఇంట్లో వస్తువులేమి కంపించవు" అన్నాడు.
తెనాలి రామలింగడు ఈ మాటలు కావాలనే గట్టీగా అన్నాడు. తన మాటలు దొంగలకు వినిపించాలనే కొంచెం గట్టిగా అన్నాడు.
రామలింగడు ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. తెనాలి రామలింగడు చెప్పేదంతా దొంగలు విన్నారు. అనుకున్నట్టుగానే ఇంట్లో ఉన్న నగలు, బంగారు నాణాలు వెండి సామాన్లు ఇంకా విలువైనవి ఏవైన ఉంటే అవి అన్నీ తీసుకుని వచ్చి ఓ ట్రంకు పెట్టెలో పెట్టి ఆ పెట్టెను బావిలో పడేసారు.
చాటునుంచి దొంగలు ఇదంతా చూసారు. అంతే ఆ రాత్రికి తెనాలి రామలింగడు ఇంటికి దొంగతనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్నట్టుగానే రాత్రికి ఊరు సద్దుమణిగాక ఆ దొంగలు ముగ్గురు తెనాలి రామలింగడు ఇంటికి వచ్చారు. ఒక్కొక్కరే జాగ్రత్తగా బావిలోకి దిగారు.
బావిలోకి దిగగానే పెట్టె కనిపిస్తున్నది. దానిని తీసుకుని ఎంచక్కా వెళ్ళిపోవచ్చు అని దొంగలు అనుకున్నారు.
కానీ బావిలో అంతా చెత్త, చెదారం నిండి ఉంది. పిచ్చి మొక్కలు, రాళ్ళతో నిండి ఉంది. అందువలన ముందుగా బావిని శుభ్రం చేయాల్సి వచ్చింది. బావిలో పెరిగిన పిచ్చి మొక్కలు పీకేసి, చిన్నచిన్న రాళ్ళు అన్నీ తొలగించేసారు. అప్పటికి కూడా వాళ్ళకు నగలు ఉన్న పెట్టె కంపించలేదు.
"ఇప్పుడేం చేధ్ధాం ?" మిగిలిన ఇద్దరినీ అడిగాడు ఒకదొంగ.
"అసలు నిజంగా వాళ్ళు పెట్టె పడేసారంటావా?" తన సందేహాన్ని వెలిబుచ్చాడు మరొక దొంగ
"ఒరేయ్! మీవన్నీ పిచ్చి అనుమానాలు. వాళ్ళు నగలు ఉన్న పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేయడం మనం చూసాం కదా!
"అవును" అని మిగిలిన ఇద్దరూ అంగీకరించారు.
"మరి అలా అయితే తప్పకుండా ఈ బావిలోనే ఆ నగల పెట్టె ఉండి ఉంటుంది కదా!"
"నిజమే" అన్నారు మిగిలిన ఇద్దరు దొంగలు.
"అలా అయితే ఇలా కబుర్లతో కాలక్షేపం చేసే బదులు వెతుకుదాం. తప్పకుండా మనకు నగలపెట్టి దొరుకుతుంది. మనం ఇలాగే కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటే తెల్లారిపోతుంది. మనందొరికిపోతాం.." అన్నాడు.
"సరే..ఇప్పుడేం చేద్దాం" అడిగాడు ఒక దొంగ.
"పెట్టె చాలా బరువుగా ఉండటం వలన బావి అడుగుకి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి మనం ఇంక బావిలోపల ఉండి చేసేదేం లేదు. పైకి వెళ్ళి నీళ్ళన్నీ తోడి పోద్దాం. నీళ్ళు అన్నీ తోడిపోస్తే పెట్టె ఎక్కడ ఉందో మనకు కనిపిస్తున్నది. అప్పుడు ఆ పెట్టెను తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది" అని సలహా ఇచ్చాడు ఒకదొంగ.
మిగిలిన దొంగలు ఇద్దరూ అందుకు ఒప్పుకున్నారు.
ముగ్గురు దొంగలు బావిలోంచి పైకి వచ్చేసి నీళ్ళు తోడటం మొదలు పెట్టారు. వాళ్ళలా నీళ్ళు తోడి పోస్తుంటే తెనాలి రామలింగడు, ఆయన కొడుకు ఇద్దరూ కలిసి చాటుగా ఉండి మొక్కలకు పాదులు చేసారు.
ఈవిధంగా దొంగలు చాలాసేపు నీళ్ళు తోడుతూనే ఉన్నారు. చివరికి వాళ్ళ శ్రమఫలించింది. బావిలో అట్టడుగున ఉన్న నగలపెట్టె దొంగలకు కంపించింది.
దొంగలలో ఒకడు బావిలో దిగి ఆ నగలపెట్టెకు తాడు కట్టాడు. మిగిలిన దొంగలు ఇద్దరూ పెట్టెను జాగ్రత్తగా పైకి లాగారు. వాళ్ళు నగలపెట్టెను బావిలోంచి పైకి తీయాలన్న ఆ ఖంగారులో, ఆ హడావిడిలో తెల్లారిపోయిన సంగతిని కూడా గమనించలేదు. ఈ లోగా తెనాలి రామలింగడు భటులను పిలిపించి దొంగలను పట్టుకోమని చెప్పాడు. అంతే! వాళ్ళు దొంగలను పట్టుకున్నారు.
చూసారా పిల్లలూ! తెనాలి రామలింగడు ఎంత తెలివి కలవాడో...!?
ఎప్పుడైతే దొంగలు తన ఇంటిని దోచుకోవాలని పథకం వేసుకుంటున్నారని రామలింగడికి అర్థం అయ్యిందో అప్పుడే రామలింగడు ఓ పథకం వేసుకున్నాడు. ఎలాగూ తన తోటకు మనుషులను పెట్టి నీళ్ళు పెట్టించాలనుకున్నాడు కదా! ఆ పనేదో ఈ దొంగలచేతనే చేయిస్తే సరిపోతుంది అని రామలింగడికి అంపించింది.
వెంటనే లోపలికి వెళ్ళి...కొడుకుతో నగలన్నీ ఒక పెట్టెలో పెట్టి బావిలో పడేద్దాం. రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఆ బెడద తగ్గాక బావిలోంచి నగల పెట్టెను తీసుకుందాం అని చెప్పాడు.
నిజంగానే దొంగలు ఆ మాటలు విన్నారు. తెనాలి రామలింగడు ఆయన కొడుకు కలిసి నగల పెట్టెను బావిలో పడేయడం చూసారు. ఆ నగల పెట్టెలో నగలు పెట్టారని దొంగలు అనుకున్నారు. కానీ తెనాలి రామలింగడు ఆ నగల పెట్టెలో దొంగలు అనుకున్నట్టుగా నగలు పెట్టలేదు. చిన్న చిన్న రాళ్ళు పెట్టాడు. కానీ దొంగలు మాత్రం పెట్టెలో నగలు ఉన్నాయని అనుకున్నారు. అందుకే బావిలో దిగి ముందుగా బావిని శుభ్రంచేసారు.
బావిలో ఉన్న నీళ్ళని తోడిపోసారు. ఎంతో కష్టపడి పెట్టెను పైకి తీసారు. ఆ సమయానికల్లా తెల్లారిపోయింది. భటులు వచ్చి దొంగలను పట్టుకున్నారు. ఇదీ జరిగింది...
ఈ సంగతంతా తెనాలి రామలింగడు రాజుగారికి చెప్పాడు.
రాజుగారు ఇదంతా వినగానే ఒక్కసారిగా పెద్దపెట్టున నవ్వేసాడు. "నిజంగా నీ తెలివి తేటలు అమోఘం. నీ ఇంటికి దొంగతనానికి వచ్చిన వాళ్ళతో నువ్వు చెట్లకి నీళ్ళు పెట్టించావా?" అంటూ నవ్వాడు.
తెనాలి రామలింగడు "అవును మహారాజా!" అన్నాడు. దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్న మాట నిజమే. అలా అని అందరూ దొంగతనాలు చేస్తామంటే ఎలా? వాళ్ళకి గుణపాఠం చెప్పేందుకే ఆ విధంగా చేసాను." అని చెప్పాడు.
వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తుండగా బోధిసత్వుడు వైశ్యకులంలో చిన్ని అనే పేరుతో పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన బుద్దిమంతుడే కాకుండా శకునశాస్త్రజ్ఞుడుకూడా.
ఒకనాడాయన రాజుగారి వద్దకు వెళ్తూ తోవలో చచ్చిన ఎలుకని చూసి నక్షత్ర స్థానం గుణించి 'తెలివితేటలు కల యువకుడైతే యీ చచ్చిన ఎలుకని తీసుకుపోయి దీనినే పెట్టుబడిగా వ్యాపారము చేసి వివాహము చేసుకోవచ్చును' అన్నాడు. ఆ మాటలు పేదవాడయిన ఒక మంచి తెలివైన బాలుడు విన్నాడు. చిన్ని శ్రేష్టి తెలిసి తప్పుమాట్లాడడని తలచి ఆ ఎలుకను తీసుకెళ్ళి పిల్లిని పెంచే ఒక కొట్టువానికి కాణికి (కాణి రూపాయలో 64 వ వంతు) అమ్మి దానితో బెల్లంకొని, మంచినీటిని పట్టుకొని అడవి నుంచి పువ్వులు తెచ్చి అమ్మేవారికి చిన్న బెల్లం ముక్కపెట్టి మంచి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళతనికి కొన్ని పూలు ఇచ్చి పోయారు. అతను వాటిని అంగడిలో అమ్మి ఆ డబ్బులతో మరింత బెల్లంకొని మరునాడు కూడా వారికి బెల్లం ముక్క మంచి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళీసారి కొన్ని పూలదండలు, పూలమొక్కలు యిచ్చారు. ఈ ప్రకారంగా అతను ఎనిమిది కార్షాపణములు త్వరగానే సంపాదించాడు. ఇలా ఉండగా ఒకనాడు పెనుగాలి వీచి వానకురిసింది. ఆ గాలికి రాజోద్యానములో ఎండుకొమ్మలు ఆకులు రాలి అక్కడంతా చిందరవందరగా తయారయ్యింది. తోటమాలికి ఏం చేయాలో అర్థంకాలేదు. అదంతా బాగుచేయడం అతనికి తలకిమించినపని. అదిగమనించి యువకుడతనివద్దకు వెళ్ళి రాలిపడిన కర్రలూ కంపా నాకిచ్చేస్తాను అంటే నేను తోట బాగుచేయిస్తాను అన్నాడు. తోటమాలి వెంటనే అంగీకరించాడు.
ఆ యువకుడు పిల్లలాడుకునే చోటుకిపోయి బెల్లం ముక్క పెడతాను అని ఆశచూపి వాళ్ళని తోటలోకి తీసుకుపోయి తుక్కుపోగుచేయించి బయట పోయించాడు. ఆ సమయంలో కుండలని కాల్చేందుకు కర్రలకోసం పోతున్న ఒక కుమ్మరి 26 కార్షాపణములు, కొన్నిచెట్లు యువకుడికిచ్చి ఆ కుప్పని తరలించుకుపోయాడు. అప్పుడా యువకుడికొక ఉపాయంతోచింది. నగరద్వారానికి దగ్గరలో గడ్డికోసుకొని వచ్చేవారికి కుండలతో నీరిచ్చి వారి దాహం తీర్చాడు. నువ్వు మాకు మేలుచేశావు. మేము నీకేంచేయమంటావు? అని అడిగారు. సమయం వచ్చినప్పుడు అడుగుతాను. అప్పుడు మీరు నాకు సాయం చేద్దురుగాని అన్నాడు. ఆ యువకుడు మెల్లగా కొందరు వర్తకులతో స్నేహం చేశాడు. ఒకనాడొక వర్తకుడు రేపు 500 గుర్రాలతో అశ్వవర్తకుడు నగరానికి వస్తాడు. అని యువకుడికి చెప్పాడు. అతను వెంటనే గడ్డి తెచ్చేవాళ్ళ దగ్గరకెళ్ళి రేపు మీరునాకు ఒక్కొక్కరూ ఒక గడ్డిమోపు చొప్పున వెయ్యాలి. నా మోపులమ్ముడయ్యే వరకూ మీరెవరూ మీ గడ్డిమోపులమ్మకూడదు. ఇదే మీరు నాకు చేయవలసిన సాయం అన్నాడు. వాళ్ళంగీకరించారు.
మరునాడు గుర్రాల వర్తకుడు వచ్చాడు. ఆ గుర్రాలకి గడ్డి కావాలి. కాని, ఆ యువకుడి దగ్గర తప్ప నగరంలో మరెక్కడా గడ్డి దొరకలేదు. అందుచేత తన 500 గుర్రాలకి అతనివద్దనున్న 500 గడ్డిమోపులని 1000 నాణాలిచ్చి కొనవలసివచ్చింది. ఇది జరిగిన కొద్ది రోజులకే మరొక వర్తకుడు యువకుడితో 'రేవులోకి ఒక గొప్ప నావ వచ్చింది' అని చెప్పాడు. ఆ మాటలతో యువకుడికొక ఉపాయము తట్టింది. అతను చక్కగా అలంకరించబడిన బండి నొకదానిని గంటకింత అని అద్దెకు తీసుకొని ఒక నావను కొని దగ్గరలో ఒక మంటపం నిర్మించి లోపల తాను కూర్చొని తన పరివారంతో 'బయటినుండి వర్తకులు వచ్చినప్పుడు వరసగా మీ ముగ్గురు వారిని నా దగ్గరకు తీసుకురండి'. అన్నాడు. రేవులోకి నౌక వచ్చిందని విని వారణాసి నుండి 100 మంది వర్తకులు సరుకులు కొనడానికి వచ్చారు. కాని... అంతకు ముందే సరుకంతా యువకుడు నియమించిన ముగ్గురూ వారినతని వద్దకు వెళ్ళబోయారు. యువకుడు నియమించిన ముగ్గురూ వారినతని వద్దకు తీసుకువెళ్ళారు. బేరసారాల పిమ్మట వర్తకులొక్కక్కరూ నౌకలో భాగమునకు వెయ్యిచొప్పున సరుకుకి వెయ్యిచొప్పునా నాణాలిచ్చారు. ఈ విధంగా ఆ యువకుడు రెండు లక్షలతో వారణాసికి తిరిగి వచ్చాడు . మర్నాడతను లక్ష నాణాలతో కృతజ్ఞతలు తెలిపేందుకు చిన్ని శ్రేష్టి వద్దకు వెళ్ళాడు. అప్పుడు శ్రేష్టి 'నాయనా! నీకీ ధనమెలా వచ్చింది?' అని అడిగాడు. మీరిచ్చిన ఉపదేశమువలననే వచ్చింది. ఆరు మాసములలో యిదంతయూ నాకు లభించింది'. అన్నాడు యువకుడు వినయంగా.
వివరంగా చెప్పు అన్నాడు శ్రేష్టి. చచ్చిపోయిన ఎలుక, శ్రేష్టి మాటలు మొదలుకొని జరిగినదంతా వివరంగా చెప్పాడా యువకుడు. అది విన్న శ్రేష్టి ఆనందానికి మేరలేకపోయింది. ఇతన్ని యితరుల చేతిలో పడనివ్వకూడదు అనుకూడదు అనుకున్నాడు. అంతలోనే అతనికి తన పుత్రిక జ్ఞాపకం వచ్చింది. ఆమె పెళ్ళికెదిగి ఉంది. యువకడు అవివాహితుడు, ఇంకేంకావాలి? ఆ శ్రేష్టి అతనికి తన పుత్రికనిచ్చి తొందరలో వివాహం చేసేశాడు. పుత్రికతోపాటు తన సర్వసంపదని అతనికిచ్చాడు. ఆ శ్రేష్టి మరణానంతరం యువకుడు శ్రేష్టి పదవిని పొందాడు.
శ్రీకృష్ణదేవరాయలవారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటి వారినయినా తన తెలివితో ఓడించగలడు. రాజును సంతోషపరచి బహుమతులు ఎన్నో పొందేవాడు. నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి, దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు. రామలింగడికి భోజనం వేళయింది. చేతులు కడుగుకోవడానికి రామలింగడు పెరటిలోకి పోయాడు. అనుకోకుండా అరటిచెట్లు వైపు చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు భార్యను పిలిచి పెద్దగా "ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రోజు నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు వాటిని ఒక సంచిలో మూటకట్టి ఈ బావిలో పడేద్దాం!" అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగడి ఉపాయం ఫలించింది. తరువాత రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు. ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు. ఒక మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిదురపోయేదాకా ఉండి తరువాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటిపడింది. అందరూ నిదుర పోయారు. ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనుక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలసేపు వెతికాడు. నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు. నీరు బయటికి తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు. సరేనని చేద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు. రామలింగడు దొంగలు నీరు తోడి పోయడం చూశాడు. మళ్ళీ ఉపాయం ఆలోచించాడు. చప్పుడు చేయకుండా పెరటి లోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు. వంతులవారీగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కాని అరటి చెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారు జామున కోడికూసే వేళ వరకూ తోడిపోశారు. చివరకు మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా చూస్తూ మూటముడి విప్పారు. అందులో నగలకు బదులు నల్ల రాళ్ళు ఉన్నవి. దొంగలకు నోట మాట రాలేదు.
రామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది. సిగ్గుతో తలవంచుకొని పారిపోయారు. ఇంతకాలం తమను మించినవారులేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతోమందిని దోచుకోగలిగారు. కాని రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేక పోయారు. తెలివిగ రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు.
బీర్బల్ శాకాహారి. మద్యమూ, మాంసమూ ముట్టుకోడు. ఒకరోజు అక్బర్ చక్రవర్తి బీర్బల్‌కు ఒక కోడిని బహుమతినివ్వాలన్న కోరిక కలిగింది. ఆ రోజు దర్బార్‌లో అందరి ముందు " బీర్బల్ నీకు ఒక బహుమతి ఇస్తాను. అది తినదగినదే. మరి నీవు తింటావా? " అని అడిగాడు.
'చక్రవర్తి ఏ ప్రశ్న వేసినా అందులో ఏదో మర్మం దాగి వుంటుంది. ఈసారి తనను ఎందులోనో ఇరికించాలనుకుంటున్నారు ' అని ఒక్కక్షణం ఆలోచించి బీర్బల్ " ప్రభువుల వారు ఏమిచ్చినా వద్దనకుండా తీసుకోవడం సేవకుడి ధర్మం " అన్నాడు. " తీసుకోవడం కాదయ్యా. తింటావా, లేదా? బాగా ఆలోచించి చెప్పు. తరువాత కాదంటే నాకు చాలా కోపం వస్తుంది సుమా! " అన్నాడు అక్బర్.
"అన్నమాట మీదే నిలబడతాను ప్రభూ! మీరేదిచ్చినా ఎలాగైనా తింటాను " బదులిచ్చాడు బీర్బల్. అక్బర్ వెంటనే సేవకుని చేత కోడిని తెప్పించాడు. " ఈ కోడిని నువ్వు తింటావా? "బీర్బల్‌ని అడిగాడు అక్బర్. తప్పకుండా ప్రభూ! మీకు ముందే సెలవిచ్చాను ఎలాగైనా తింటానని " అన్నాడు బీర్బల్. అక్బర్‌తో పాటు సభలో వున్న వారంతా ఆశ్చర్యపోయారు. " నువ్వు శాకాహారివి కదా!కోడినెలా తింటావు? " అన్నాడు అక్బర్.
"అవును ప్రభూ నేను శాకాహారినే. నేను కోడిని కోసుకుని తినను, అమ్ముకుని తింటాను. ముందే చెప్పాను కదు ప్రభూ ఎలాగైనా తింటానని " ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు బీర్బల్.ఆయన మాటలు విని చక్రవర్తితో పాటు ఆ సభలోని వారంతా గట్టిగా నవ్వారు.
వేసవి సెలవులు వచ్చాయి. రాము పదవ తరగతి పరీక్షలు రాశాడు. రామూ నాన్నగారికి పల్లెలో ఉద్యోగం. అందుచేత అందరూ ఆ పల్లెలోనే ఉంటున్నారు. తెలంగాణాలోని ఒక చోటు వారికి వాన నీరే ఆధారం. నీరు తెచ్చుకోవడానికి రెండు మైళ్ళు పోవాలి. అక్కడ ఒక చెరువు ఉంది. ఆ నీరు తెచ్చుకుని వాడుకోవాలి. బిందె అయిదు రూపాయలకు నీరు కొనుక్కోవాలి. ఈ బాధలన్నీ కళ్ళారా చూస్తున్నాడు రాము. ఏదైనా చేయాలి? అనుకున్నాడు. రామూ మామయ్య ఇంజనీరు. ఆయన పట్నంలో ఉంటాడు. శెలవులకు మామయ్య దగ్గరకు వెళ్ళాడు. తమ ఊరి సమస్య చెప్పాడు. రామూ మామయ్య బాగా ఆలోచించాడు. ఒక ఉపాయం చెప్పాడు. రామూ సంతోషంగా తిరిగి వచ్చాడు. ఊరివారు అందరికీ మంచినీరు కావాలి. ఓపిక ఉన్నవారు రెండు మైళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. డబ్బులు ఉన్నవాళ్ళు నీరు కొనుక్కుంటారు. మరి ఓపిక, డబ్బూ లేని వారు ఏం చేయాలి? దాహంతో చావవలసిందేనా! రామూ స్నేహితులు అందరినీ ఈ ప్రశ్న కలచివేసింది. వారు కూడా ఏదైనా చేయాలి అనుకున్నారు. సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. వారం శ్రమ పడితే ఊరి ఇబ్బంది తీరుతుంది. రామూ మామయ్య చెప్పినది స్నేహితులతో చెప్పాడు రాము.
ఊరికి మధ్యలో చింతల తోపు ఉంది. అక్కడ బావి తవ్వితే నీరు పడుతుంది. ఇది ఇంజనీరు మామయ్య చెప్పిన మాట. అయితే బావి ఎవరు తవ్వుతారు? పెద్ద బావి తవ్వడానికి బోలేడు డబ్బు కావాలి. అంత డబ్బు ఎవరు ఇస్తారు? రాము, స్నేహితులు ప్రతి ఇంటికి వెళ్ళారు. ఊరి సమస్య అందరికీ తెలిసినదే! సహాయం అడిగారు. డబ్బు రూపంగా ఇవ్వవచ్చు. శ్రమదానం చేయవచ్చు. ఎవరు ఎలా అయినా బావి తవ్వకానికి సహాయపడాలి. పిల్లలను చూసి పెద్దవాళ్ళకు ఊపు వచ్చింది. ఊరివారు అందరూ ఒక చోట చేరారు. ఈ సమస్యకు జవాబు చెప్పాలని అనుకున్నారు. అందరూ చందాల రూపంలో డబ్బు పోగు చేశారు. డబ్బు ఇవ్వలేని వారు పలుగు - పార చేతబట్టారు. బావి తవ్వడానికి ముహూర్తం పెట్టారు. అందరూ ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పంతులుగారు కొబ్బరి కాయ కొట్టారు. బావితవ్వడం పనులు మొదలు అయ్యాయి. పెద్దవాళ్ళు పలుగు పారలతో తవ్వుతున్నారు. రాము, రాము స్నేహితులు తట్టలతో మట్టిమోశారు. అందరూ పాటలు పాడుతూ పని చేస్తున్నారు. ఆడవారు పని చేసేవారికి అన్నీ అందిస్తున్నారు. అందరికీ పులిహార పొట్లాలు, పెరుగు అన్నం యిచ్చారు. అందరూ మధ్యాహ్నానికి ఇంత ఎంగిలి పడ్డారు. బీద గొప్ప తేడాలేదు. కులం మతం పట్టింపు లేదు. అందరూ చేయి చేయి కలిపారు. బావి తవ్వకం జోరుగా సాగుతోంది. రాము ఎంతో సంతోషించాడు. పట్నం నుండి ఇంజనీరు మామయ్య వచ్చాడు. ఎన్ని అడుగులు తవ్వితే నీరు పడుతుందో చెప్పాడు. మూడు రోజులలో బావి తవ్వకం పూర్తి అయింది. జలజలమంటూ నీటి ఊట ఉబికి వచ్చింది.
ఊరివారి ఆనందానికి హద్దులు లేవు. ఎగిరి గంతులు వేస్తూ పండుగ చేసుకున్నారు. బావి నీరు కొబ్బరి నీరులాగా తియ్యగా ఉంది. బీడు నేలలో తియ్యని నీరు పడటం అబ్బురం! చకచకా బావి చుట్టూ రాతి గోడలు కట్టారు. మరి వారం రోజులలో పనులూ పూర్తి అయ్యాయి. పంచాయితీ ప్రెసిడెంటుగారు వచ్చారు. బావిని ఊరికి అంకితం చేశారు. ఆయన బావి తవ్వకం కథ విన్నారు. రామూని, అతని స్నేహితులనూ అభినందించారు. ఊరికి ఉపకారం ఇంత చిన్న పిల్లలు చేశారు. బావి తవ్వకంలో పది మంది పిల్లలు పని చేశారు. వాళ్ళకి ఈ సంవత్సరం ఖర్చు అంతా పంచాయితీ భరిస్తుంది. వాళ్ళ చదువు, బట్టలూ అన్నీ పంచాయితీ చూస్తుంది. ఆ విధంగా ప్రెసిడెంటుగారు హామీయిచ్చారు. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు.
పద్మకు మొదటినుంచీ కాకంటే అసహ్యం. దానికితోడు ఈ మధ్యనే ఎంతో ఇష్టంగా తింటున్న ఐస్‌క్రీమ్ కప్పును కాస్తా కాకి ముక్కున కరుచుకుని వెళ్లినప్పటినుంచి దానికి కోపం కూడా తోడైంది.
ఓ రోజున వాళ్ల ఇంటిలో పెట్టిన మందు తిని ఓ ఎలుక చచ్చింది. పనిపిల్ల దాని తోకకి పురికొస కట్టి ఈడ్చుకెళ్లి పెరట్లో పారేస్తుంటే కంపరంగా చూసింది పద్మ. రెండురోజులకి అది కుళ్లి, కంపు కొట్టసాగింది. దీనికితోడు పొరుగింటి వాళ్ల కోళ్లు చెత్తకుప్పను కెలికి మెతుకులు పోసి పోయాయి. ఆ మెతుకులకి పట్టిన చీమలు ఇంటినిండా పుట్టలు పెట్టాయి. అది చూసి పద్మ వాళ్లమ్మ... 'కాకులు ఏమై పోయాయబ్బా!' అని అనుకోవడం విని 'అమ్మకు ఆ దిక్కుమాలిన కాకులతో ఏం పనో!' అని విసుక్కుంది.
ఆ రోజు స్కూల్లో టీచర్ పాఠం చెబుతూ, కాకులు, గద్దలు, రాబందుల వంటి ప్రాణులు చచ్చిన పక్షులు, జంతువుల కళేబరాలను తింటూ పర్యావరణ పరిశుభ్రతకు చేస్తున్న కృషి గురించి వివరిస్తుంటే నోరు వెళ్లబెట్టుకుని మరీ వింది పద్మ. అప్పుడర్థమైంది పద్మకు పొద్దున అమ్మ కాకిని ఎందుకు తల్చుకుందో!
సాయంత్రం బడినుంచి ఇంటికి వచ్చి, పెరట్లోకెళ్లి కాళ్లూ చేతులూ కడుక్కుంటుంటే కావు కావుమంటూ అంట్ల గిన్నెల దగ్గర పడిన మెతుకులను ఏరుకుతింటున్న కాకుల గుంపు కంటపడింది. బడిలో టీచర్ చెప్పిన పాఠం గుర్తొచ్చింది. దాంతో ఎప్పటిలా వాటిని అదిలించడానికి బదులు ఇంట్లోకెళ్లి గిన్నెలో మిగిలిన అన్నం మెతుకులను వాటి ముందు పోసింది. అంతేకాదు, వాటికోసం ఓ మగ్గులో నీళ్లు పెట్టి, అవి ఆ మెతుకులేరుకు తిని, ఆ నీళ్లు తాగుతుంటే అపురూపంగా చూసింది.
అనగనగా ఓ కాకి. అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికొచ్చేది. అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన బడలికతో పశువులపాక ముందు గడ్డిని నెమరేస్తుండేది. రెండూ కలసి కష్టసుఖాలు కలబోసుకునేవి.
ఓ రోజు ఎద్దును చూసి కాకి "మిత్రమా! నువ్వెంత వెర్రిదానివి! ఆ రైతు చూడు, నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకిరీ చేయించుకుని సాయంత్రానికి నాలుగు గడ్డిపరకలు, కాస్త కుడితి నీ ముఖాన పడేసి చేతులు దులుపుకుంటున్నాడు. నువ్వేమో దానికే పొంగిపోయి, ఒళ్లంతా హూనం చేసుకుంటున్నావు. నీ గిట్టలన్నీ అరిగిపోయాయి. మెడ ఒరుసుకుపోయి మచ్చలు పడ్డాయి. అదే నేను చూడు! నాకు నచ్చిన ఆహారం కనిపించగానే టక్కున ముక్కున కరుచుకుపోతాను. అది ఎవరిదైనా లెక్కపెట్టను. అందులో ఎంత మజా ఉందో నీకేం తెలుసు? చౌర్యం ఒక కళ. అది ఎంత సంతోషం కలిగిస్తుందో తెలుసా! ఇకనైనా నిజం గ్రహించు! నీ బంధనాలు తెంచుకో! పచ్చిక బయళ్లలో హాయిగా స్వేచ్చగా విహరించు" అంటూ హితబోధ చేసింది.
అంతా విన్న ఎద్దు "మిత్రమా! నీవనుకుంటున్నట్లు నేనేమీ విచారంగా లేను. నా కష్టంతో ఒక రైతు కుటుంబానికి సేవ చేయడమే గాక ఎంతో మంది ప్రజల ఆకలి తీరుస్తున్నాననే సంతృప్తి ఉంది. అది నాకు సంతోషాన్ని, బలాన్ని ఇస్తోంది. కాబట్టి నీ సలహాను పాటించలేకపోతున్నందుకు క్షమించు" అని తాపీగా చెప్పింది.
ఆ మాటలతో కాకికి కళ్లు తెరుచుకున్నాయి. తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది.
ఆ మండలంలో అదే పెద్ద ఊరు. పూర్తిగా పట్టణం అనలేం, అలాగని పల్లెటూరు కాదు. మధ్యస్తంగా ఉంటుంది. ఆ ఊరిలో హైస్కూలు ఉంది, లైబ్రరీ ఉంది, రెండు మూడు ఆఫీసులూ వున్నాయి. భాస్కర్ పంచాయితీ ఆఫీసు గుమస్తా. ఆయన దగ్గర తెలుసుకోదగ్గ విశేషాలేమీ లేవు గానీ, అతని భార్య శారద గురించి మాత్రం వివరంగానే చెప్పుకోవాలి. మంచి భక్తిగలది. ముఖ్యమైన దేవాలయాల్లో నిత్యం పూజలు, అభిషేకాలు చేయిస్తూ వుంటుంది. పిల్లలలో ఎవరికి జబ్బు చేసినా తాను ఉపవాసాలుంటుంది. ప్రతి శుక్రవారం పేదలకు పైసలు పంచుతుంది. కాషాయ రంగు దుస్తుల్లో ఎవరు కనిపించినా మహాసాధువని గౌరవించి భక్తితో సత్కరిస్తుంది. ఏ గుడిలో భజన జరిగినా ఆవిడ ముందుంటుంది. భక్తి గీతాలు కమ్మగా పాడుతుంది. చీరలు నగలు కొనడంలో ఎంత ఖర్చయినా వెనుకాడదు. వాళ్ళాయన శ్రీపతి నెలనెలా జీతం తెచ్చి ఆమె చేతికిస్తాడు. మిగిలిన ఇంటి బాధ్యతలన్నీ ఆమెవే. శారదంటే ఆ వూళ్ళోనేకాదు చుట్టుపక్కల అమ్మలక్కలకు బాగా తెలుసు. ఆ రోజు అమావాస్య ఆదివారం, మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో వయస్సులో ఉన్న ఒకావిడొచ్చింది. "ఏమండీ మీ యింటికి గడ్డం మీసాలున్న నడివయస్సులో వున్న సాధువుగారేమయినా వచ్చినట్లు చూశారా మీరు?" అంది.
"సాధువుగారా! ఎవరూ రాలేదండీ!" కూర్చొండి అని చెప్పి ఎంతో గౌరవంగా మాట్లాడి వరండాలో కుర్చీ వేసింది శారద. ఫరవాలేదు వెళతానండి. "ఆయన్ని గురించి మీకు రెండు మాటలు చెప్పాలి" అందామె. "చెప్పండి" అంది శారద ఆతృతగా. ఆయన దేవుడు లాంటివాడు. దెయ్యాల్ని భూతాల్ని వదలగొడతాడు. మనలో మనకు తెలియని పెద్ద రోగాల గురించి ఇట్టే చెప్పేస్తాడు. ఇంటి దోషాల గురించి, మనకు సంభవించే ముప్పు గురించి ముందుగా చెప్తాడు. ఏ వ్యాపారం చేస్తే లాభసాటిగా ఉంటుందో ఎక్కడ పొలం కొంటే అధికంగా పండుతాయో చెప్తారు. మాకు, మా చుట్టాలలో కొందరికి, మరి కొందరు తెలిసిన వారికి చెప్పారు. రాబోయే ప్రమాదాల గురించి ముందుగా చెప్పి కాపాడాడని వివరాలు గడగడ చెప్పింది. ఈలోగా వస్తారేమో అటు హైస్కూలు వైపుగా వెళ్ళివస్తానండీ అని గబగబా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన పావుగంటకి ఆయన రానేవచ్చారు. శారదకు చాలా ఆనందం కలిగింది. ఎంతో ఆదరంగా ఆయన్ని లోనికి ఆహ్వానించింది. "తల్లీ నేను మీ ఇంటికొచ్చిన కారణం ఓ ముఖ్య విషయం చెప్పి పోదామని" అన్నాడు స్వామీజీ. "చెప్పండి స్వామీ"అంది. "మీ ఆయనికి ప్రాణగండం ఉంది అదీ ఒక్క వారంలోగానే" అన్నాడు. "అమ్మో ప్రాణగండమే" అని ఆవిడ నిలువెల్లా వణికి పోయింది.
"మరేం కంగారు పడకండి దానికి శాంతి చేయాలి." "ఏం చేద్దాం చెప్పండి స్వామీ" అంది. ఇంతలో ఆమె మరలా వచ్చి మీ కోసమే వెతుకుతున్నాను స్వామి అంటూ వచ్చింది. ఆమె రాక అతనికి మరికొంత ఆనందాన్నిచ్చినట్లు కనిపించాడు. ముగ్గురు చాప మీద కూర్చున్నారు. ఇవ్వాళ అమావాస్య ఆదివారం కొద్ది నిముషాల్లో మనం కాళీ మాతకి పూజలు చేయాలి. అప్పుడుగాని ఆయనకి ప్రాణగండం తప్పదు."ఇప్పుడేంకావాలో త్వరగా చెప్పండి" స్వామీ. ముందు కర్పూరం, పటికబెల్లం, కొబ్బరికాయ తెప్పించండి మిగిలినవి ధూపదీప నైవేద్యాలు నా దగ్గరున్నాయి. అన్నారు. ఫరవాలేదు డబ్బివ్వండి నేను తెచ్చిపెడతాను" ఎంతో సహాయకారిగా అంది ఆ వచ్చినావిడ. వెంటనే శారద లోపలకెళ్ళి బీరువాలోంచి డబ్బు తెచ్చి ఇచ్చింది. ఆమె వేగంగా వెళ్ళిపోయింది. స్వామీజీ పూజకు అన్నీ సిద్దం చేస్తున్నారు. శారదని కాళ్ళూ, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కొని రమ్మన్నారు. ఆమె అలా చేసి వచ్చింది. ఈలోగా ఆమె కూడా కావలసినవి తీసుకువచ్చింది. ముగ్గురు కాళీమాత బొమ్మ దగ్గరగా కూర్చున్నారు.
స్వామీజీ మూడు నిముషాలలో మూడు నాలుగు మంత్రాలు చదివాడు. అగరొత్తులు వెలిగించాడు. మీ నగలు ఒకసారివ్వండి కాళీమాత దగ్గరుంచి ధూపం వేసి తిరిగి తీసుకుందురుగాని అన్నాడు. ఆమె తన మెడలోని నానుతాడు, చంద్రహారం, నల్లపూసలు, గొలుసు, చేతిగాజులు రెండు ఆనందంగా తీసిచ్చింది.స్వామిజీ వాటిని అందుకున్నాడు. ఓ తెల్లని గుడ్డలో చుట్టి కాళీమాత ఫొటో ముందు ఉంచాడు. ఆ తరువాత తన దగ్గరున్న సంచిలోంచి మూడు పటిక బిళ్ళల్లాంటివి తీశాడు. ఒకటి తనునోట్లో వేసుకున్నాడు. ఇంకొకటి వచ్చినావిడకి ఇచ్చాడు. మరొకటి శారదకిచ్చాడు. అమె దాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంది. వెంటనే స్పృహ లేకుండా పడిపోయింది. శారదకు మెలకువ వచ్చి చూసేసరికి ఏముంది! స్వామిజీ లేడు, ఆమె లేదు, నగలూ లేవు. సర్వం దోపిడీ జరిగింది. ఆ తరువాత ఏడ్పులు పెడబొబ్బలు. జనం చేరారు. తన నమ్మకం నవ్వులపాలై కన్నీళ్ళు మిగిలాయి.
ఒక వర్తకుడు జాతరలో తన సరుకునంతా అమ్మి బాగా సొమ్ము చేసుకున్నాడు. సంచులన్నీ డబ్బులతో బరువెక్కిపోయాయి. జాతర ముగిసిన తర్వాత చీకటి పడకముందే ఇల్లు చేరాలని నిశ్చయించుకున్నాడు.
మధ్యాహ్నమంతా ఒక పట్టణంలో విశ్రాంతి తీసుకున్నాడు. అతనింక బయల్దేరాలనుకునే సమయానికి అతని పనివాడు వర్తకుడి గుర్రాన్ని వెంటబెట్టుకు వచ్చి "అయ్యా! గుర్రం ఎడమ గిట్టలో ఒక మేకు ఉండిపోయింది. ఇప్పుడేం చేద్దాం! అని అడిగాడు. దానికా వర్తకుడు "ఉండనివ్వరా, ఏం కాదులే!" అని జవాబిచ్చి ఊరుకోకుండా "నేను ఇంకా ఆరుమైళ్ళ దూరం వెళ్ళాలి, నేను కొంచెం తొందరగా ఉన్నాను. నాగుర్రానికి నన్ను సవ్యంగా ఇల్లు చేర్చే సత్తా ఉంది" అన్నాడు.
సాయంత్రం వేళ అతను ఒక సత్రం దగ్గర మళ్ళీవచ్చి "అయ్యా! గుర్రం ఎడమ గిట్టకున్న నాడా ఊడిపోయింది. నేను దాన్ని కంసాలి వద్దకు తీసుకెళ్ళాలా?" అని అడిగాడు.
"దాన్నలాగే ఉండనివ్వరా బాబూ! నా గుర్రం మరో రెండు మైళ్ళు నన్ను మోయ లేదా? నేను కాస్త తొందరలో ఉన్నాను కదా?" అని బదులిచ్చాడు వర్తకుడు.
అలాగే వర్తకుడు ప్రయాణం సాగించాడు. కాని కొద్ది దూరం ప్రయాణించాక గుర్రం కుంటడం మొదలెట్టింది. మెల్లిగా కుంటడం మొదలెట్టి ఒక దగ్గర కూలబడిపోయింది. హఠాత్తుగా కూలబడిపోవడం వల్ల గుర్రం కాలు విరిగిపోయింది. అంతే! వర్తకుడు బిత్తరపోయాడు. గుర్రాన్ని అక్కడే వదిలేసి, సంచులన్నీ మోసుకుంటూ, రొప్పుతూ నడుస్తూ ఇల్లు చేరాడు.
వర్తకుడు తన పనివాడి మాట విని గుర్రానికి గిట్టలకు నాడాలు వేయించినట్లయితే వర్తకుడికి బాధలు తప్పేవి కదా! సమయస్పూర్తితో మెలుగుతూ, చెయాల్సిన పనిని తగిన సమయంలో పూర్తిచేస్తే ఎలాంటి ఆపదలూ, ఇబ్బందులూ ఉండవు.
మీ పనిపై మనసు లగ్నం చేయండి. అలా చేయడం వల్ల అన్ని పనులూ అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఇలా చేయడం వలన అద్భుతాలు చేయడం ఏమంత కష్టంకాదు.
ఒకసారి గంగాధరం, దశరధం అనే బాటసారులు ప్రయాణం చేస్తూ, చీకటి పడేసరికి ఒక అన్నసత్రంలో భోజనం చేసి పడుకున్నారు. వారిద్దరివీ వేర్వేరు ఊళ్లు, పరిచయస్ధులు కుడా కారు. గంగాధరం చెవులకు బంగారు పోగులున్నాయి. సత్రంలోకి వచ్చినప్పటి నుండి దశరధం దృష్టి గంగాధరం బంగారుపోగులపైనే ఉంది. ఎలాగైనా వాటిని కాజేయాలని గంగాధరంతో స్నేహం నటించి అతని పక్కనే పడుకున్నాడు దశరధం.
ప్రయాణ బడలిక వల్ల గంగాధరానికి గాఢంగా నిద్రపట్టింది. బాటసారులంతా గుర్రు పెట్టి నిద్రపోతున్న సమయంలో దశరధం, కుడి చెయ్యి తలకింద పెట్టుకుని నిద్రపోతున్న గంగాధరం ఎడమచెవిపోగును జాగ్రత్తగా కాజేశాడు. అతను ఎటూ కదలకుండా అలాగే పడి ఉండటం వల్ల కుడిచెవిపోగు కాజేయలేకపోయాడు.
తెల్లవారాక తన ముఖం చూసుకున్న గంగాధరానికి ఎడమచెవిపోగు లేకపోవడం కనిపించింది. పక్కనే ఉన్న దశరధం కుడిచెవికి తన ఎడమపోగు ఉండడం చూసి, "నీవు నా చెవి పోగు దొంగిలించావు కదా! నా చెవిపోగు నాకిచ్చేయి." అన్నాడు గంగాధరం కోపంగా. దశరధం మరింత కోపంగా, "ఏం మాట్లాడుతున్నావ్? నువ్వే నా చెవిపోగు తీసుకుని ఎక్కువగా మాట్లాడుతావా?" అంటూ గంగాధరం పైపైకి ఎగిరాడు.
కొంతసేపు వాదులాట తర్వాత గంగాధరం, దశరధం న్యాయాధిపతి సమక్షానికి వెళ్లారు. వాళ్లిద్దరి వాదన విన్న న్యాయాధిపతి "మీరిద్దరూ రాత్రి ఎలా పడుకున్నారో, ఇక్కడ నేలమీద అలా పడుకుని చూపించండి" అన్నాడు న్యాయాధిపతి. వారికేమి అర్ధంకాక అలాగే పడుకున్నారు. న్యాయాధిపతి వారిద్దరినీ సమీపించి పరీక్షించి చూశాడు. అంతే దొంగెవరో ఆయనకు అర్ధమైపోయింది.
వెంటనే దశరధాన్ని చూస్తూ "నీ చెవిపోగు గంగాధరం కాజేశాడన్నావుగా! అది ఏ చెవిపోగు "అడిగాడు న్యాయాధిపతి. తాను దొంగిలించిన చెవిపోగు కుడిచెవికి పెట్టుకుని ఉన్నాడు కాబట్టి గంగాధరం కాజేసింది ఎడమచెవిపోగని చెప్పాడు దశరధం. "దొంగ దొరికాడు. దశరధం! నేరం నువ్వే చేశావు. కుడి చెయ్యి తలకింద పెట్టుకుని పక్కకు తిరిగి నిద్రపోతున్న గంగాధరం ఎడమచెవిపోగు నువ్వే కాజేసి, అతనిపై నేరం మోపుతున్నావు. నిజం ఎప్పటికీ దాగదు" అని గంగాధరానికి చెవిపోగు ఇప్పించి దశరధానికి ఆరునెలల జైలుశిక్ష విధించాడు న్యాయాధిపతి.
పూర్వం ఒకసారి ఇద్దరు మిత్రులు వ్యాపార నిమిత్తం కాలినడకన ఒక ఊరు నుండి మరొక ఊరుకు ప్రయాణం సాగిస్తున్నారు. ఒక గ్రామానికి చేరుకోగానే వారికి చాలా ఆకలి వేసింది. వెంటనే వారు సత్రం ఎక్కడుందో కనుక్కొని అక్కడికి వెళ్ళారు. శాంతమ్మ అనే వంటావిడ సమయం కాని సమయంలో వచ్చినందుకు వారిపై విసుక్కోకుండా వేడివేడి అన్నం వండి పెట్టింది. బాగా ఆకలితో ఉండటంతో స్నేహితులిద్దరు కడుపారా తృప్తిగా భుజించారు.
"నీ రుణం తీర్చుకోలేం. ఇంద ఈ డబ్బులు ఉంచు" అని ఇవ్వబోయారు. "అయ్యో డబ్బులు వద్దు నాయనా... ఆకలి వేసిన వారికి అన్నం పెడితే పుణ్యం వస్తుంది. అయినా ఇది ఉచిత సత్రం. ఒక దాత ఆధ్వర్యంలో ఈ సత్రం నడుస్తుంది." అని చెప్పింది అవ్వ.
తరువాత మాటల సందర్భంలో ఆమె తనకు నడుం నొప్పి ఉందని, ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదని ఏదైనా చిట్కా ఉంటే చెప్పమని అడిగింది.
ఆ స్నేహితులిద్దరిలో కాశీనాథ్ అనేవాడు అందరితో వేళాకోళాలు ఆడుతూ ఉంటాడు. మరొక స్నేహితుడు వారిస్తున్నా వినకుండా "అవ్వా నడుముకు తాడు కట్టుకుని నీ పెరట్లో ఉన్న ఏదైనా చెట్టు కొమ్మకి వేలాడి పదిసార్లు అటూ ఇటూ ఊగు. అప్పుడు కూడా నీ నడుము నొప్పి తగ్గకుంటే మా ఊరురా" అని అతని పేరు ఊరు చిరునామా చెప్పాడు.
"పాపం ఎందుకలా అబద్ధం చెప్పావు? అమాయకురాలైన అవ్వను ఆటపట్టించడం సరికాదు" అంటూ కాశీనాథ్‌ను చివాట్లు పెట్టాడు స్నేహితుడు.
"ఏదో తమాషాకి అలా చెప్పాను లేరా... ఆమెకు ఆ మాత్రం తెలీదా? తనంతట తానుగా తాడు కట్టుకుని ఊగలేదు. ఎవరినైనా సహాయం అడిగితే వారు ఆమెతో పాటు మనల్ని కూడా చివాట్లేస్తారు" అని అన్నాడు కాశీనాథ్.
కొంతకాలం గడిచింది. ఈ సంఘటన గురించి స్నేహితులిద్దరూ మర్చిపోయారు. ఒక రోజు కొందరు వ్యక్తులు కాశీనాథ్‌ను వెతుక్కుంటూ ఆ ఊరు వచ్చారు.
"నేనే కాశీనాథ్‌ని. ఏంటి విషయం?" అని అడిగాడు. "అయ్యా మేము శాంతమ్మ అనే ధనవంతురాలు పంపించగా వచ్చాం. మీరేదో చిట్కా చెప్పారట కదా! అది బాగా పనిచేసిందని చెప్పమంది. అంతేకాదు చింతచెట్టు కొమ్మ విరగడంతో అక్కడ ఆమె పూర్వికులు దాచిన బంగారు కాసులు బయటపడ్డాయని, ఎప్పుడైనా అటువైపు రావడం జరిగితే ఆమె తప్పకుండా కలుసుకోమని చెప్పింది" అని అన్నారు.
వారు చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన కాశీనాథ్ ముందువెనుకలు ఆలోచించకుండా వెంటనే ఆ ఊరు వెళ్ళాడు. వేళాకోళానికి చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన శాంతమ్మ కాశీనాథ్ చెప్పినట్లు చేసి నడుము విరగ్గొట్టుకోవడంతో సత్రం కాస్తా మూత పడింది. జరిగింది తెలుసుకున్న గ్రామ ప్రజలు తెలివిగా కాశీనాథ్‌ను తమ ఊరికి రప్పించి దేహశుద్ధి చేసి పంపించారు. చావుతప్పి కన్ను లొట్టపోయినంత పని అయి కాశీనాథ్ ఇంకెప్పుడు అలాంటి పనులు చేయనని లెంపలేసుకున్నాడు.
మిన్నూ బయటికి వెళ్తుండగా దారిలో ఒక చిన్న మూతి గల జాడి కనిపించింది. జాడీలో ఏముందో తెలుసుకుందామని మిన్నూ దాని దగ్గరకు వెళ్లాడు. 'అబ్బ! నాకిష్టమైన పల్లెలున్నాయే' సంతోషంగా అనుకున్నాడు.
మిన్నూ జాడీ లోపల చేయి పెట్టాడు. పిడికిలి నిండా పల్లీలు పట్టుకున్నాడు. ఆ తరువాత చేయి బయటికి తీయడానికి ప్రయత్నించాడు. మిన్నూ పిడికిలి బిగించడంతో చిన్నదైన జాడీ మూతిలోంచి ఎంత ప్రయత్నించినా చేయి బయటకు రాలేదు.
దాంతో ఏడవటం మొదలుపెట్టాడు. ఇదంతా గమనిస్తున్న ఒక పెద్దాయన మిన్నూ దగ్గరకు వచ్చాడు. "కంగారు పడకు బాబు, ఊరుకో! నేను చెప్పినట్టు చేస్తే నీ చేయి బయటకు వస్తుంది. అలాగే పల్లీలు కూడా వస్తాయి" అన్నాడు.
"అవునా? అయితే వెంటనే చెప్పండి" అని అడిగాడు మిన్నూ.
"చూడు బాబూ! నువ్వు ఒకేసారి మొత్తం కావాలనుకుంటే నీకు దొరకవు. కొంచెం కొంచెం పట్టుకుని తీస్తే నీకు నెమ్మదిగా అన్నీ దొరుకుతాయి. ఒకసారి ప్రయత్నించు!" అన్నాడాయన.
వెంటనే మిన్నూ పిడికిలి నిండా ఉన్న పల్లీలను వదిలేసి కొన్నింటిని పట్టుకున్నాడు. ఈసారి చేయి తేలికగా బయటకు వచ్చింది. ఆ విధంగానే పల్లీలు బయటికి తీయడం మొదలెట్టాడు. కొంత సమయం పట్టినప్పటికీ పల్లీలన్ని బయటికొచ్చేస్తాయి. పెద్దాయనకు ధన్యవాదాలు తెలిపి మిన్నూ సంతోషంగా పల్లీలు తింటూ వెళ్లిపోయాడు.
గోవిందప్ప కోనేట్లో కోటి రకాల కప్పలు ఉన్నాయి. బావురు కప్పలు, పచ్చ కప్పలు, వాన కప్పలు, గోండ్రు కప్పలు, చిరు కప్పలు ఇలా ఎన్నెన్నో రకాలు. అవన్నీ కలిసిమెలిసి బ్రతుకుతున్నాయి. ఎండా, వానా తేడా లేకుండా ఎరపొరుపులు రాకుండా ఎల్లకాలం చల్లగా జీవిస్తున్నాయి. చీకూచింతా లేకుండా హాయిగా కాలక్షేపం చేస్తున్నాయి.
కోనేటికి నాలుగు వైపులా రాతిమెట్లున్నాయి. సాయంత్రమయ్యే సరికి నగరంలో వాళ్ళంతా మెట్ల మీదకి చేరుకునేవాళ్ళు వెన్నెల రాత్రిళ్ళలో ఆ మెట్ల మీదే గడిపేవాళ్ళు. వాళ్ళు చేసే చర్చలు, వాదనలు కప్పలు వింటూ వుండేవి. రానురాను మనుషుల పద్ధతులన్నీ కప్పలకు అంటుకున్నాయి. కొంత కాలానికి కప్పలు సరికొత్త విషయం ఒకటి తెలిసింది. మనుషులు తమను పాలించడానికి ఒక 'రాజు' ని ఎన్నుకున్నారట! ఈ వార్త విన్నాక మనుషులకే రాజు అవసమైనప్పుడు తమకు మాత్రం ఎందుకవసరం లేదు? తమకూ ఓ రాజు కావాలి! అనే ఆలోచన రేకేత్తింది కప్పలకు. సూర్యుణ్ణి ప్రార్థించాయి కప్పలు. సూర్యుడు వచ్చాడు. 'ఏం కవాలి?' అనడిగాడు.
'మాకో రాజుని ఇవ్వు దేవా!' అనడిగాయి కప్పలు. 'ఇప్పుడు హాయిగానే ఉన్నారుగా! ఇంకా రాజెందుకు?' మనుషులకే రాజు ఉన్నప్పుడు మాకు మాత్రం ఉండొద్దా? అన్నాయి కప్పలు. 'పోనీ, మీలోనే ఒకరిని ఎంచుకోరాదూ?' అన్నాడు సూర్యుడు. 'ఉహు, మాకు కొత్త రాజే కావాలి!' అన్నాయి కప్పలు.
వాటి అమాయకత్వానికి సూర్యుడికి జాలి పుట్టింది. వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ పెద్ద జీలగబెండును కోనేట్లో వేశాడు. ఒకటి రెండు రోజులు జీలగబెండుకి దూరంగా వున్నాయి కప్పలు. బెదురు తీరాక బెండు మీదకి గెంతాయి. ఎలా గెంతినా బెండు ఉలుకూ పలుకూ లేదు. తనివితీరా గెంతి గెంతి 'ఇస్! రాజంటే ఇంతేనా?' అని అనుకున్నాయి. వాటికి నచ్చలేదు. మళ్ళా సూర్యుణ్ణి వేడుకున్నాయి వచ్చాడు. 'దేవా! మాకీ చచ్చురాజు పనికిరాడు. మరో కొత్త రాజుని ఇవ్వు అన్నాయి కప్పలు. 'మీది అమాయకత్వమో, మూర్ఖత్వమో తెలీకుండా వుంది. పోనీ, హాయిగా ఆడుకుంటారు కదా అని బెండుని ఇస్తే, కాదు కూడదంటున్నారు. అన్నాడు మందలింపుగా సూర్యుడు.
'ఇంతకన్నా మంచి రాజుని ఇవ్వు దేవా!' అన్నాయి కప్పలు. సూర్యుడు చాలా ఆలోచించాడు. కప్పల మీదనున్న జాలి వల్ల సూర్యుడు చంద్రుణ్ణి ఇచ్చాడు. కప్పలు కోరినప్పుడల్లా చంద్రుడు వచ్చేవాడు. ఆడుకొనేవాడు. కలిసిమెలసి తిరిగేవాడు. చల్లగా పండువెన్నెల ఇచ్చేవాడు. తినగా తినగా గారెలు చేదైనట్టుగా హాయిగా చల్లగా వున్న చంద్రుడంటే కప్పలకు అట్టే సంతృప్తి కలగలేదు. గొణుక్కుని మళ్ళా సూర్యుడిని ప్రార్థించాయి.
'ఎందుకు?' అనడిగాడు సూర్యుడు. 'ఎంతసేపూ పనికిమాలిన వాళ్ళనే రాజుగా యిస్తున్నావు దేవా! కాస్త కరుకైన వాళ్ళని యివ్వు అన్నాయి కప్పలు. 'మీరు మూర్ఖులు' రాజుని ఎవరూ కోరుకోరు. నేను మీకు స్నేహితుల్ని యిచ్చాను. ఐనా ఏం లాభం? వాళ్ళ మంచి చేదయిందీ అన్నాడు సూర్యుడు. 'ఏమైనా సరే, మాకు రాజు కావాలి! అని ఉబలాట పడ్డాయి కప్పలు. సూర్యుడికి విసుగెత్తింది. అనుభవిస్తే కాని తెలియదు అని అనుకున్నాడు. కొల్లేటి కొంగని రాజుగా యిచ్చి వెళ్ళిపోయాడు. జీలగబెండు, చంద్రుడులాగా కాకుండా నిబ్బరంగా గట్టుమీద కూచుంది. కొల్లేటి కొంగ బెట్టుగా ఉంది. ఇదంతా కప్పలకు గొప్ప లక్షణంగా కనిపించింది.
ఓహొ కొంగరాజా! నువ్వు చాలా గొప్పవాడివి. ఇంతకు ముందున్న రాజులు ఉత్త చచ్చు దద్దమ్మలు. నీ ఠీవి, గంబీరత అద్భుతం! మాకు అన్ని విధాలా నచ్చావు. చంద్రాయుధంలాంటి నీ ముక్కు ఒక్కటి చాలు మమ్ముల్ని పరిపాలించడానికి అన్నాయి కప్పలు. కొంగ ఏమీ మాట్లాడలేదు. కోనేటివైపు చూస్తూ కూచుంది. కప్పల పొగడ్త విని ఆనందించినట్టు తోచింది. ఆ మర్నాటినించి కొంగ ఒక్కొక్క కప్పను తినేయడం మొదలు పెట్టింది. కొద్దిరోజుల్లో కప్పలకు విషయం అర్థమయ్యింది. ఏ ముక్కును పొగిడాయే ఆ ముక్కే మృత్యువయింది. రోజురోజుకి కప్పల కుటుంబాలు నశించిపోయాయి. 'ఓ సూర్యుడా! మాకు రాజు వద్దూ, గీజూవద్దు! ఈ బాధల్ని తప్పించు' అని ఏడ్చాయి కప్పలు. కాని సూర్యుడు మళ్ళా కనబడలేదు. కొల్లేటి కొంగ రాజరికం పోనూలేదు.
రామాపురం అనే గ్రామంలో శివశర్మ అనే బ్ర్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఆ చుట్టుప్రక్కల ఉన్న నాలుగైదు గ్రామాలకు పురోహితుడు. ఒకనాడు పొరుగున ఉన్న కృష్ణాపురంలో వ్రతం చేయించటానికి బయలుదేరాడు. రామాపురం నుంచి కృష్ణాపురం వెళ్ళటానికి మధ్యలో రెండు మైళ్ళ దూరం అడవిని దాటి చేరుకోవాలి. ఆ అడవిలో కౄర జంతువులు లేకపోవటం వల్ల రామాపురం గ్రామస్థులు భయం లేకుండా అడవిని దాటి వెళ్ళేవారు. శివశర్మ అడవిలో నడుస్తుండగా అతనికి ఒక చెరువు గట్టు మీద దర్భలు చేతిలో పట్టుకుని కూర్చున్న పెద్దపులి కనిపించింది. దానిని చూడగానే శివశర్మ గుండెల్లో రాయి పడింది. భగవంతుడా! 'ఈ అడవిలో కౄర జంతువులు ఉండవు కదాని ఒంటరిగా బయలుదేరాను... ఇప్పుడు ఈ పెద్దపులి కనిపించింది. దీని బారి నుంచి నన్ను నువ్వే కాపాడాలి' మనసులో దేవుడిని తలచుకుంటూ అనుకున్నాడు. ఆ సమయంలోనే ఆ పెద్దపులి శివశర్మను చూడనే చూసింది. శివశర్మ కాళ్ళు చేతులు భయంతో వణికాయి. ఓ! బ్ర్రాహ్మణుడా నన్ను చూసి భయపడకు. కౄర జంతువయినా... ఇప్పుడు మాంసాహారిని కాదు... ఇప్పటిదాకా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని భగవంతుడిని ప్రార్దించాను... దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ కంకణం ఎవరికైనా దానం చేస్తే నా పాపాలు పోతాయని చెప్పాడు. అందుకే నువ్వు ఈ కంకణం తీసుకో అంటూ తన చేతిలో ఉన్న కంకణాన్ని శివశర్మకు చూపించింది. అది నవరత్నాలు పొదిగిన బంగారు కంకణం. చెట్ల ఆకుల్లోంచి పడుతున్న సుర్యుడి వెలుగుకి ధగధగా మెరుస్తోంది. దాన్నిచూడగానే శివశర్మ మనసులో ఆశ పుట్టింది .
నువ్వు పులివి, కౄర జంతువువి కూడా. నీ మాటలను నేను ఎలా నమ్మాలి. భలేవాడివే నువ్వు! నేను నిజంగా కౄర జంతువునే అయితే నువ్వు కనిపించగానే నిన్ను చంపి నీ మాంసంతో విందు చేసుకునే దానిని, కానీ ఈ బంగారు కంకణం తీసుకుపో అంటూ ఎందుకు చెప్పేదానిని అంది పెద్దపులి. శివశర్మ ఆ మాటలకు తృప్తి పడ్డాడు, నిజమే... పులి కౄర జంతువే కనుక అయితే అది కనిపించగానే తను పారిపోయినా వెంటాడి చంపి ఉండేది. అలా చెయ్యలేదు కనుక ఇది పాపాల నుండి విముక్తి కోసం తాపత్రయం పడుతూ ఉండి ఉంటుంది. శివశర్మ మనసులో భయం పోయి ఆ బంగారు కంకణం ఇటు విసురు, అది తీసుకుని నిన్ను ఆశీర్వదించి నా దారిన నేను పోతాను. నీకు పాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. దానికి ఆ పెద్దపులి నవ్వి భలే బ్రాహ్మ ణుడివయ్యా నువ్వు... శాస్త్రాలు చదివావు అని అందరికీ చెబుతావు... నువ్వు మాత్రం వాటిని పాటించవా... ఏదన్నా దానం తీసుకునేటప్పుడు స్నానం చేసి ఆ దానం తీసుకోవాలి కదా..! అందుకే నేను దానం తీసుకునేవాళ్ళకి శ్రమ లేకుండా ఈ చెరువు ప్రక్కన కుర్చున్నాను. నువ్వు స్నానం చేసివచ్చి ఈ బంగారు కంకణం నా దగ్గర నుంచి దానంగా తీసుకుని నన్ను ఆశీర్వదించు అంది.
శివశర్మ ఆ మాటకి సరే! అలాగే అంటూ స్నానం చెయ్యటానికి చెరువులోకి దిగబోయాడు మెత్తగా ఉన్నచెరువు గట్టున బురదనేలలోనడుంవరకు దిగబడిపోయాడు అతను. అది చూసిన పులి అయ్యయ్యో ! బురదలో దిగబడి పోయావా..? ఉండు రక్షిస్తాను అంటూ తన కూర్చన్న చోటు నుంచి తాపీగా లేచి వచ్చి ఒడ్డున నిల్చుని శివశర్మ కంఠం దొరకపుచ్చకుని అతన్ని చంపి మాంసంతో విందు చేసుకుంది.
చూశారా..! దురాశ దు:ఖానికి చేటు. బంగారు కంకణానికి ఆశపడి శివశర్మ పులిచేతిలో ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అందుకే ఎదుటివాళ్ళు చూపించే కానుకలకు ఎప్పుడూ ఆశపడరాదు. ఎవ్వరూ విలువైన వస్తువులను ఉచితంగా ఇవ్వరు అన్న సంగతి తెలుసుకుని దురాశకు పోరాదు.
అనగనగా అవంతీపురం సమీపములో గల గ్రామములో ఒక ముసలి అవ్వ, మనుమడు ఉన్నారు. అవ్వ అమాయకురాలు. ఇరుగు పొరుగు అవ్వకి మాయమాటలు చెప్పి ఉప్పు, పప్పు తీసుకువెళ్ళేవారు. అవ్వను సుఖపెడదామంటే అవ్వచేసే పనికి మనుమడికి కోపం వచ్చేది. పై పెచ్చు గుట్టుగా సంసారము చేయాలని తెలియదు అనేది. ఒక రోజున అవ్వ ఇల్లు ఊడుస్తూ ఉంటే చిన్న తాళము చెవి దొరికింది. అది తన మనుమడి పెట్టెదని తీసి పెట్టె తాళము తీసి పెట్టెలోపల డబ్బు చూసి అందరిని పిలిచి చెప్పింది. ఆ మాటలు చాటుగా ఉన్న దొంగలు విని హడావుడిగా వచ్చి మీ మనుమడు చెట్టు మీదనుంచి పడిపోయాడు. దెబ్బలు తగిలాయి. డబ్బు తీసుకొని రమ్మన్నాడని చెపితే తీసుకొని వాళ్లమాటలు నిజమేనని నమ్మి ఆ డబ్బులు ఇచ్చింది అవ్వ. ఆధనము తీసుకొని వాళ్ళు పారిపోయారు. అవ్వ ఏడుస్తూ గుమ్మంలో చతికిలపడింది.
కొంతసేపు గడిచేసరికి మనుమడు సరుకులు తీసుకొని వచ్చాడు. అప్పుడే దెబ్బలు తగ్గిపోయాయా? అని అవ్వ అడిగేసరికి అవ్వ చెప్పిన మాటలు వల్ల అంతా తెలిసి నా కష్టార్జితము మట్టి పాలు చేశావు గదే! ఇంకా కాస్త కూడబెట్టి పట్టణంలో వ్యాపారము చేద్దామనుకున్నాను. నాకు ఆ రాత లేదే. మళ్ళీ నా కంటికి కనిపించకు, వెళ్ళిపో అని అన్నము తినకుండా వెళ్ళిపోయాడు. మనుమడి మాటలకు అవ్వకు పట్టరాని దుఃఖము కలిగి అడవిలోకి వెళ్ళి పిశాచాల బారిన పడి మరణించాలని బయలుదేరి వెళ్ళి చింతచెట్టు దగ్గర కూర్చొని పిశాచాలు పిశాచాలు రండి అంటూ అరిచింది. రెండు తెల్లని పిశాచాలు వచ్చి మమ్మల్ని ఎందుకు పిలిచావు అంటూ అడిగాయి. అవ్వ వాటిని చూసి భయపడక విషయమంతా చెప్పి నా మనుమడిచే అంత మాటలు అనిపించుకున్నాక ఎందుకు బ్రతకాలి నన్ను చంపేయండి అంది.
పిశాచాలు కూడబలుక్కొని అది కుర్రదొంగలపని అని గ్రహించి అవ్వా నీ మనుమడి ధనము నీ చేతికి తిరిగి వస్తే ఇంటికి వెళతావా? లేక చచ్చిపోతావా? అని అడిగాయి. ధనము దొరికితే ఇంటికి వెళ్తానంటే సరే మా వెంటరా అని కుర్రదొంగల వద్దకు తీసుకువెళ్ళి బయట ఉండమని చెప్పాయి. లోపల అందమయిన అమ్మాయిని వాళ్ళిద్దరూ ఏడిపించటం గమనించి ఆ అమ్మాయిలో ప్రవేశించి నేను పిశాచాల పెద్దమ్మ పెంపుడు కూతుర్ని. మీ సంగతి చెప్తా అంటూ ఇద్దర్నీ చావబాదింది. దాంతో వాళ్ళిద్దరూ పారిపోవడానికి ప్రయత్నించగా రెండో దయ్యము పిశాచము ఆవహించి వున్న దయ్యం కాళ్ళ దగ్గర పడేసింది. దాంతో హడలెత్తిన దొంగలతో అవ్వను మోసం చేసి ధనము తీసుకున్నది మీరేనా అని అనగా మేమే అంటూ ఆ ధనమును అక్కడ పడేసి పారిపోయారు. వాళ్ళు వెళ్ళగానే అవ్వ లోపలికి వచ్చింది. అవ్వా! నీ డబ్బు తీసుకో. అని ఈ అమ్మాయి మంచిది. సవతి తల్లి బాధలు పడలేక వచ్చి వీరి బారిన పడింది. నీ మనుమడికి ఇచ్చి వివాహం చేసి సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యమయ్యాయి.
అవ్వ ధనముతో పాటు అందగత్తెలాంటి అమ్మాయిని తీసుకురావడం చూసిన మనుమడు అవ్వా ఎవరు ఈమె అన్నాడు. నీ భార్య నీ ధనము ఇదుగోరా అంటూ జరిగిన విషయము చెప్పింది. మంచి ముహూర్తం చూసి వారి వివాహం జరిపించింది. వారు సుఖంగా జీవనంసాగిస్తున్నారు.
అది దట్టమైన పచ్చని అడవి. ఒక దుప్పి దాని పిల్ల దుప్పితోపాటు గడ్డిమేస్తూ అడవంతా తిరుగుతోంది. అడవిలో పరిసరాలు చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్నాయి.
హఠాత్తుగా ఆ దుప్పులకు వేటకుక్కలు మొరుగుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం దూరం నుంచే వినిపిస్తున్నా తల్లి దుప్పిలో విపరీతమైన అలజడి ప్రారంభమైంది. వేటకుక్కలు ఎటునుంచి వస్తున్నాయో, వాటి అరుపులు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయో అర్ధంకాక అటూ ఇటూ చూస్తూ కలవరపడింది.
తల్లిని చూసి విషయం అర్ధం కాని దుప్పిపిల్ల " అమ్మా! వేటకుక్కల కంటే పెద్దగా ఉన్నావు కదా. మరి వాటిని చూసి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు వాటికంటే వేగంగా పరుగెత్తుతావు. నీకు కొమ్ములు కూడా ఉన్నాయి. వాటితో ఆ వేటకుక్కలను తరిమికొట్టచ్చు" అని అంది.
దుప్పిపిల్ల మాటలకు తల్లి, "అవును, నిజమే," అంటూ కుక్కల అరుపులు విన్న వెంటనే పారిపోవడం ప్రారంభించింది. తల్లి ప్రవర్తన అర్ధంకాని దుప్పిపిల్ల కూడా తల్లి వెంటే పరిగెత్తింది.
ఆధారము: రమేష్ బాబు, టీచర్, పశ్చిమ గోదావరి
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
చాలా సంవత్సరాల క్రితం తక్షిల అనే ఊరిలో చాణక్య అనబడ...
ఈ పేజి లో తెనాలి రామకృష్ణ కథలు అందుబాటులో ఉంటాయి.....
అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు వుండేవారు. ఆయనికి చుట్...
ఈ పేజి లో పంచతంత్ర కథలు అందుబాటులో ఉంటాయి...