అనగనగా ఒక రాజు. అతని దగ్గర బాగా డబ్బుంది. దాచడం కోసం ఒక శిల్పిని పిలిచి, రహస్య ధనాగారం ఏర్పాటు చేయించాడు. దానికున్న రహస్యద్వారం కూడా ఇతరులకు తెలియనివ్వలేదు. దీనిని నిర్మించిన శిల్పి మాత్రం తక్కువ వాడా? పిసినారి రాజుకు తగ్గవాడే! రాజుకు తెలీయకుండా గోడకు అమర్చిన రాతి పలకల్లో ఇంకో రహస్య మార్గం ఏర్పాటు చేసి, పోయే ముందు కొడుకులిద్దరికీ దాని సంగతి చెప్పి కన్ను మూశాడు. డబ్బు కావలసినప్పుడు. వాళ్ళిద్దరూ, ఆ మార్గం వాడుకొనేవారు. అసలే పీనాసి రాజు. రోజూ డబ్బును తనివి తీరా చూచుకొనే గుణం ఉండడంవలన ధనం మాయం కావడం గమనించాడు.
రాజు కత్తెర బోను ఏర్పాటు చేశాడు. ఎప్పటిలానే వచ్చిన ఇద్దరిలో ఒకడు దానిలో చిక్కుకున్నాడు. తనను గుర్తుపట్టే స్థితి రాకూడదని, అన్నచేత తన తల నరికించేసుకున్నాడు బోనులో ఇరుక్కున్నవాడు. తల ఇంటికి తీసుకెళ్ళాడు సోదరుడు. రాజు తెలివితక్కువ వాడా? ఈ పని ఇద్దరు చేశారని గ్రహించేశాడు. దొరికిన మొడెం కోటగుమ్మానికి వ్రేలాడ దీయించి, కాపలా వాళ్ళకి చెప్పాడు. అది చూసి ఎవరయినా తీసుకుపోదామని ప్రయత్నిస్తే పట్టుకోమని. తల్లిపోరు పడలేక, తల నరికిన వాడు, నేర్పుగా కాపలా వాళ్ళకి సారా పోసి, మత్తులో ముంచి, మొండెం దించుకొని ఇంటికి పట్టుకుపోయాడు.
అతడు అసాధ్యుడని రాజుకు అర్థమైపోయింది. తన కూతురు అందాలరాశిని ఎరగా వేశాడీసారి. అతి దారుణమైన పని, నేర్పుతో కూడిన సాహస కార్యం చేసిన వాడినే ఆమె పెళ్ళాడబోతున్నట్టు ప్రకటించింది. తన వాళ్ళ తల నరికిన సంగతీ, మొండెం మాయం చేసిన సంగతీ చెప్పి పెళ్ళడమన్నాడు బ్రతికి ఉన్న సోదరుడు. ఆమె అతన్ని గుర్తించి, కాపలా వాళ్ళకు పట్టివ్వబోయేలోగా గమ్మత్తుగా తప్పించుకున్నాడు. ఇలాటి అసాధ్యడు అల్లుడయితే దిగుల్లేదు అనుకున్న రాజు, అసలు ఖజానా దొంగను శిక్షించే ప్రసక్తి లేదన్నాడు. అప్పుడు బైటపడ్డాడు సోదరుడు. నిన్ను ఇప్పుడు నరికేస్తే నీకు దిక్కెవరు? అడిగాడు రాజు. తమరు మారాజులు కనుక అడిగే దమ్ములు ఎవరికీ లేవు. కాని మీరు ఆడిన మాట తప్పితే, రేపు పరలోకంలో అల్లాకు జవాబు చెప్పుకోవలసి వస్తుంది. అన్నాడా చిన్నవాడు. అతడి ధైర్యానికి మెచ్చి, రాజు తన కూతుర్నిచ్చి పెళ్ళి చేశాడు. అంతే కాదు! అర్థరాజ్యం కూడా కానుకగా ఇచ్చాడు.
ఒక గ్రామంలో సోము అనే అమాయకమైన కుర్రాడు ఉండేవాడు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. బోజనానికి మిగతా అవసరాలకు ఇరుగుపొరుగు వాళ్ళు సహాయం చేసేవారు. పాఠశాల చదువు కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాల వల్లే సాధ్యమైంది.
ఒకసారి సోము దగ్గర పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. 'నమ్ముకున్న వారికి దేవుడే సహాయం చేస్తాడని' ఎవరో అనగా ఒకసారి విన్నాడు. దేవుడికి ఉత్తరం రాసి తనకు కాస్త డబ్బు సహాయం చేయమని అడగాలని నిర్ణయించుకున్నాడు.
దేవుడికి ఉత్తరం ఎలా రాస్తే బావుంటుందా అని చాలాసేపు ఆలోచించి చివరకు ఇలా రాశాడు. 'దేవుడా! నాకెవరు లేరు. నేను నిన్నే నమ్ముకున్నాను. దయచేసి నామీద జాలి చూపి పుస్తకాలు కొనుకునేందుకు 100 రూపాయలు పంపించు' ... చిరునామా రాయాల్సిన చోటులో 'దేవుడు, స్వర్గం' అని రాసి పోస్ట్‌బాక్స్‌లో ఆ ఉత్తరం వేశాడు.
పోస్ట్‌మాన్ అన్ని ఉత్తరాలతో పాటు సోము ఉత్తరాన్ని కూడా పోస్టాఫీసుకు తీసుకెళ్ళాడు. అక్కడి పోస్టుక్లర్కు ఆ ఉత్తరంపైన ఉన్న అడ్రసు చూసి ఆశ్చర్యపోయి దాన్ని పోస్టుమాస్టర్‌కు అందించాడు. ఆయన ఆ ఉత్తరం తెరిచి చదివాడు. ఆ ఉత్తరంలోని సున్నితమైన అంశం పోస్టుమాస్టర్ హృదయాన్ని తాకింది. అతను సోముకి 75 రూపాయలు మనియార్డరు పంపించాడు.
నాలుగురోజుల తర్వాత సోము నుండి దేవుడికి మరొక ఉత్తరం వచ్చింది. అందులో... దేవుడా! నువ్వు చాలా గొప్పవాడివి. నా మొర ఇంత త్వరగా ఆలకిస్తావని నేను అనుకోలేదు. అయితే నాకు కేవలం 75 రూపాయలు మాత్రమే లభించాయి. నువ్వు 100 రుపాయలు పంపించి ఉంటావు. కాని పోస్టుమాన్ అందులోంచి 25 రూపాయలు కాజేసి ఉంటాడు పరవాలేదు. అది నీ తప్పు కాదుగా... మరింకేదైనా అవసరం ఏర్పడితే నీకు మళ్ళీ ఉత్తరం రాస్తానూ అని ఉంది. అది చదివిన పో్స్టుమాస్టర్ సోము అమాయకత్వానికి జాలిపడ్డాడు.
"మన నగరంలో ఎంతమంది గుడ్డివారున్నారు" అని ఒకరోజు అక్బరు దర్బారులో ప్రశ్నించాడు. ఎవరు జవాబు చెప్పలేకపోయారు. అక్బర్ బీర్బల్ వైపు చూశాడు. ఏదో ఒక సమాధానం బీర్బల్ కు చెప్పక తప్పుతుందా!
ఆ మరునాడు బీర్బల్ చక్రవర్తి కోటకు దగ్గరలో జనసంచారం ఎక్కువగా ఉన్నచోట చిన్న చొప్పుల దుకాణం పెట్టి అందులో ఒక చొప్పుల జత కుడుతూ కూర్చున్నాడు. కొద్ది దూరంలో బీర్బల్ నియమించిన పనివారు కాగితం, కలం పట్టుకుని నిలబడి ఉన్నారు.
"ఆయన చేస్తున్న పనిని చూసి చాలామంది బీర్బల్ గారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?" అని అడగసాగారు. అలా అడిగిన వారి పేర్లను బీర్బల్ సేవకులు కాగితంలో వ్రాసుకుంటున్నారు.
సాయంకాలం చక్రవర్తి విహారానికి బయలుదేరాడు. బీర్బల్ కూర్చున్న చోటు వైపు వచ్చారు. బీర్బల్ ను చూసి అక్బర్ కూడా అందరిలాగే అదే ప్రశ్న వేశాడు. "చెప్పులు కుడుతున్నాను ప్రభూ" అని బీర్బల్ సమాధానం చెప్తుండగానే, సేవకులు రాస్తున్న జాబితాలో అక్బర్ చక్రవర్తి పేరు కూడా చేరింది .
మరునాడు బీర్బల్ దర్బారులో చక్రవర్తికి.
గుడ్డి వారి జాబితాను సమర్పించాడు. ఆ జాబితా తీసుకుని ఆసక్తిగా పరీశీలించాడు చక్రవర్తి. అందులో చివరన తన పేరు చూడగానే ఉలిక్కిపడ్డాడు. ఇదేమిటి బీర్బల్? ఇందులో నా పేరు కూడా ఉంది. నేను గుడ్డివాడినా?" అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అక్బరు.
బీర్బల్ చేతులు జోడించి "ప్రభువులవారు నన్ను మన్నించాలి. కొందరు పుట్టుకతో గుడ్డివారయితే, మరి కొందరు చూపు ఉండి కూడా గుడ్డివారే. నిన్న నేను చేస్తున్న పని స్పష్టంగా కనబడుతోంది అయినా 'ఏం చేస్తున్నారని'? అందరూ నన్ను ప్రశ్నించారు. చివరకు ప్రభువులవారు కూడా. మరి ఇలాంటి వారు గుడ్డివారే కదా ప్రభూ!" అన్నాడు బీర్బల్.
తను అడిగిన ప్రశ్నకు జవాబు మరొక కోణంలో సరదాగా చూపించిన బీర్బల్ యుక్తికి ముసిముసిగా నవ్వుకున్నాడు అక్బరు చక్రవర్తి.
స్వర్ణపురంలో నారాయణరెడ్డి, శ్రీనివాస్, చలపతి, రఘుపతి అనే మిత్రులుండేవారు. వారి ముగ్గురిదీ ఒకటే ఊరు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. అంచేత వారు చాలా స్నేహంగా ఉండేవారు. నారాయణరెడ్డి పట్నం చేరి వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. తన ఆలోచన మిత్రులకు చెప్పాడు. ఏ బిజినెస్ లాభసాటిగా ఉంటుందో, ఏ బిజినెస్ ప్రారంభిస్తే మంచిదో వివరించి చెప్పి, తోచిన సలహాలిచ్చి, నీవు వ్యాపారంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. అన్నారు మిత్రులు. నాకు రావలసిన డబ్బు మొత్తం బ్యాంకు నుండి డ్రా చేసి ఇంట్లో వుంచాను. ఉదయమే పట్నం వెళ్ళీ వ్యాపారానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి అన్నాడు నారాయణరెడ్డి. మిత్రులు కొంతసేపు మాట్లాడి ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు.
ఆ రోజు రాత్రి నారాయణరెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు సర్వం దోచుకెళ్ళారు. విచారంగా వున్న మిత్రుడ్ని ధైర్యంగా వుండమని చెప్పి ఓదార్చి వెళ్ళిపోయారు మిత్రులుముగ్గురూ! శ్రీనివాస్ మాత్రం ఇంటికెళ్ళి ఐదువందల రూపాయలు డబ్బు తీసుకొని వచ్చి పట్నం వెళ్ళి పోలీస్ రిపోర్టు ఇద్దాం . అవసరానికి ఈ డబ్బు వుంచు అని నారాయణరెడ్డికి ఇవ్వబోయాడు.
డబ్బు తీసుకోవడానికి నారాయణరెడ్డి నిరాకరిస్తే, కష్టంలో వున్నప్పుడు సహాయపడకుంటే స్నేహానికి అర్థం లేదురా! నీవు కష్టంలో వున్నావని నిన్ను వదిలివెళ్ళే స్వార్థపరుడ్నికాదు అంటూ బలవంతంగా డబ్బు చేతిలో పెట్టాడు శ్రీనివాస్. శ్రీనివాస్ రోజూ మిత్రుని కలిసి ధైర్యం చెప్పేవాడు. డబ్బిచ్చేవాడు. దొంగతనం జరిగినప్పటి నుండి చలపతి, రఘుపతి తప్పించుకుని తిరగసాగారు. ఇల్లు తప్ప అంతా పోగొట్టుకున్నాడు. తమను ఎక్కడ డబ్బు సాయం అడుగుతాడో అని రావడం మానివేశారు. మిత్రులలో వచ్చిన మార్పు చూసిన నారాయణ రెడ్డికి "ఎప్పుడు సంపదే కలిగిన అప్పుడు బంధువులు వత్తురది వెంట్లన్నన తెప్పలుగ చెరువులు నిండిన కప్పలు పదివేలు చేరు సుమతీ" అన్న సుమతీ శతకంలో ఎప్పుడో చదువుకున్న పద్యం గుర్తుకువచ్చింది. ఓ రోజు నారాయణరెడ్డి శ్రీనివాస్‌ను కలిసి శ్రీనివాస్ తనకు ఇచ్చిన డబ్బు వాపసు ఇచ్చి నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా వుందిరా! కష్టాలలో కూడా విడవక నీలా తోడుగా వున్నవాడే నిజమైన మిత్రుడు. చలపతి, రఘుపతి నా దగ్గరకు రావటంలేదు. పట్నంలో నేను ప్రారంభించబోయే వ్యాపారానికి సహాయపడే మిత్రుడు కావాలి. మీలో నిజమైన మిత్రుడెవరో తెలుసుకోవడానికిదొంగతనం జరిగినట్లు నాటకమాడాను. పట్నంలో ప్రారంభించబోయే వ్యాపారానికి నీవు సహాయంగా వుండు. వచ్చిన లాభం సమంగా పంచుకుందాం అన్నాడు.
స్వచ్ఛమైన స్నేహంతో మిత్రులిద్దరూ కలిసి ప్రెండ్స్ అండ్ కో అనే పేరుతో వ్యాపారం ప్రారంభించి అనతికాలంలోనే మంచిపేరు డబ్బు సంపాదించారు. కొంత కాలానికి చలపతి, రఘుపతి యిద్దరూ ఉద్యోగాలు దొరక్క, ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయి ఉద్యోగాన్వేషణలో పట్నం చేరారు. అక్కడ నారాయణరెడ్డి, శ్రీనివాస్‌లు ప్రారంభించిన ప్రెండ్స్ అండ్ కో గురించి గొప్పగా విని ఉద్యోగం కోసం వెళ్ళారు. అక్కడకి వెళ్ళిన తరువాత గాని వాళ్ళకి తెలియలేదు. ఆ కంపెనీ తమ మిత్రుడు నారాయణరెడ్డిదేనని. మిత్రుల పరిస్థితిని అర్థం చేసుకొని పాత విషయాలు మరచిపోయి వారిద్దరికీ ఉద్యోగాలు యిచ్చారు నారాయణరెడ్డి, శ్రీనివాస్‌లు.
అనగనగా ఒక మేక దాని యజమానికి ఆ మేక అంటే ఎంతో ఇష్టం. ఆ మేకకు కృష్ణుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు ఆ యజమాని. ఒక రోజు . . . మిగతా మేకలతో కలిసి కృష్ణుడుని కూడా అడవికి మేతకు తీసుకుని వెళ్లాడు. కృష్ణుడు మేకల మందతో కలిసి అడవిలో బాగా ఆడుకుంది. కడుపునిండా గడ్డి, ఆకులు అలములు తిన్నది. ఆ రోజు దానికి చాలా ఆనందంగా ఉంది. ఉరుకులు పరుగులు పెడుతూ అడవి అంతా తిరిగిన ఆ మేకపిల్ల అందరికన్నా ముందు వెళ్లాలన్న ఉత్సాహంతో మందనుంచి తప్పిపోయింది. చాలాసేపు అడవి అంతా తిరిగింది. ఎంతసేపు తిరిగినా అది మేకల మందను చేరుకోలేకపోయింది. అప్పటికే చీకటి పడిపోవడంతో ఇక చేసేదేం లేక ఎటు పోవాలో తెలీక ఒక గుహ కనబడితే ఆ గుహ లోపలికి పోయి పడుకుంది.
కొంతసేపటికి ఏదో అలికిడి వినిపిస్తే కృష్ణుడికి మెలకువ వచ్చి లేచింది. ఆ గుహలో నివాసం ఉంటున్న సింహం దాని వేట ముగించి సుష్టుగా భోజనం చేసినట్టుంది. త్రేంచుకుంటూ వచ్చింది. సింహం గురించి ఇంతకుముందు వినడమే తప్ప కృష్ణుడు దానిని ఎప్పుడూ చూడలేదు. అలాంటిది సింహాన్ని చూడగానే మేకపోతుకు గుండెలు దడదడలాడాయి. కానీ తను భయపడినట్టు కనిపిస్తే సింహం తనను వదిలి పెట్టదు అని కృష్ణుడికి అర్ధం అయ్యింది. సింహం కూడా మేకపోతును చూసి భయపడింది. చీకటిలో మేకపోతు కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. పెద్ద గడ్డము, కొమ్ములు, ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి కూడా భయం వేసింది. ఈ వింత జంతువు బహుశా నన్ను చంపడానికే వచ్చినట్టుంది. అందుకే ఇక్కడకు వచ్చి నాకోసం ఎదురు చూస్తోంది అని అనుకుంది.
చీకటిలో తనను చూసి ఏదో వింత జంతువు అని సింహం అనుకుంటుందని అందుకే భయపడిందని మేకపోతుకు అర్ధం అయ్యింది. అది అలా తనను చూసి భయపడుతూ ఉండగానే దాన్ని ఇంకా భయపెట్టాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని మేకపోతు నిర్ణయించుకుంది. కానీ ఈ చీకటిలో ఎలా తప్పించుకోవడం? ఒక వేళ తప్పించుకుని వెళ్ళినా ఈ చీకటిలో ఈ అడవిలో ఎక్కడికని వెళుతుంది? కాబట్టి ఎలాగోఅలా తెల్లవారుఝాముదాకా ఇక్కడే ఉండి ఆ తర్వాత తప్పించుకోవాలి అని అనుకుని మేకపోతు గంభీరంగా అలాగే కూర్చుండిపోయింది. మరోపక్క సింహం కూడా అలాగే అనుకుంది. తెల్లవారితే ఆ వింత జంతువు ఏదో తెలుసుకోవచ్చు. ఒకవేళ అది నాకన్నా బలవంతురాలైతే దానితో స్నేహం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ జంతువు తనకన్నా బలహీనురాలైతే దానిని సంహరించవచ్చు ఏదైనా తెల్లారే వరకు ఇలా మౌనంగా ఉండకతప్పదు అని సింహం అనుకుంది.
మేకపోతు, సింహం రెండూ కూడా నిద్రపోకుండా రాత్రంతా ఒకదానినొకటి గమనిస్తూ కూర్చున్నాయి. తెల్లవారుతుండగా మేకపోతు ధైర్యం తెచ్చుకుంది. అప్పుడే సింహాన్ని గమనిస్తున్నట్టుగా "ఏయ్ ఎవరు నువ్వు?" అని గద్దించింది. సింహంకు ఇంకా బెదురుపోలేదు. "నేను సింహాన్ని . . . మృగరాజును. నేనే ఈ అడవికి రాజును." అంది భయం భయంగా."నువ్వు ఈ అడవికి రాజువా!? చాలా విచిత్రంగా ఉంది. ఇంత బక్కపలచగా ఉన్నావు. నువ్వు ఈ అడవికి రాజువేంటి? అంటే ఈ అడవిలో మిగతా జంతువులు నీకన్నా బలహీనంగా ఉంటాయన్నమాట. సరే ఏది ఏమైనా నా అదృష్టం పండింది. నేను ఇంతవరకు లెక్కలేనన్ని పులులను, వెయ్యి వరకు ఏనుగులను చంపాను. అది కూడా నా వాడి కొమ్ములతో ఒక్క సింహాన్ని మినహా అన్ని జంతువులను నా కొమ్ములతో ఒక్క కుమ్ము కుమ్మి చంపేసాను. సింహాన్ని కూడా చంపితే నా దీక్ష పూర్తి అవుతుంది. సింహాన్ని చంపేవరకు ఈ గడ్డం తీయనని నేను ప్రతిఙ్ఞ పూనాను. నేటితో నా దీక్ష పూర్తి అయినట్టే" అంటూ సింహం మీదకు ఒక్క దూకు దూకింది.
అంతే సింహం పెద్దగా అరుస్తూ ఆ గుహలోంచి బయటకు పరుగు తీసింది. మేకపోతు సూర్యోదయం అయ్యేవరకు ఆ గుహలోనే ఉండి సూర్యోదయం అయ్యాక అడవిలోకి వెళ్ళింది. అప్పటికే దాని యజమాని వెతుక్కుంటూ అటువైపుగా వచ్చాడు. కృష్ణుడు యజమానిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యజమాని దానిని చూసి చాలా సంబరపడ్డాడు. "నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావో అని నేను ఎంత ఖంగారుపడ్డానో తెలుసా? రాత్రంతా ఇంటికి రాకపోతే అడవిలో తప్పిపోయి తిరుగుతున్నావో లేక ఏ జంతువుకైనా ఆహారమయిపోయావో అని భయపడ్డాను. పోన్లే నువ్వు క్షేమంగా ఉన్నావు కదా నాకు అదే చాలు". అని అంటూ కృష్ణుడ్ని దగ్గరకు తీసుకున్నాడు.
ఒక అడవి దగ్గరలో ఒక మహిళ ఉండేది. ఆవిడ పేరు ధర్మావతి. ఆమె వుంటున్న ఊరికి ఒక ఋషి వచ్చాడు. చాలామంది ఋషి వద్దకు వెళ్ళి సలహాలు పొదుతున్నారు. ఈ సంగతి ధర్మావతి కూడా విన్నది. ధర్మావతి కొన్ని కష్టాలు వున్నాయి. ఆ ఋషి దగ్గరకు వెళ్ళి సలహా తీసుకోవాలి. ఆయన దగ్గర కొన్ని శక్తులు కూడా వున్నాయి. పొరుగువారు చెప్పగా విన్నది. కొంత కాలంగా ఆమె భర్తలో ఏదో మార్పు వచ్చింది. ధర్మావతి భత్ర యుద్దంలో పని చేసి వచ్చాడు. మూడు సంవత్సరాలు భార్యకు దూరంగా వున్నాడు. ఆ తరువాత తిరిగి వచ్చాడు ఆమె భర్త. అప్పతి నుండీ అతనిలో ఏదో తేడా వచ్చింది. ఆమెతో సరిగా మాటలాడటంలేదు. భార్యమీద యిది వరకు ప్రేమ చూపడం లేదు. ఇది ధర్మావతిని ఎంతో బాధించింది. తన భర్త ప్రేమ పొదడానికి ఏదైనా చిట్కా కావాలి. అందుకోసం ఆమె ఋషి వద్దకు వచ్చింది. వినయ విధేయతలతో చేతులు జోడించింది. నమస్కారం స్వామీజీ! నా పేరు ధర్మావతి. నాభర్త నాతో ప్రేమగా వుండటంలేదు. నా భర్త నాతో మునుపటిలాగా ప్రేమగా వుండాలి. అందుకు ఏదైనా ఉపాయం చెప్పండి అని వేడుంది. ఋషి ఆలోచించాడు. నీ భర్త యిది వరకులా నీతో ప్రేమగా వుండాలి. నేను ఒక మందు తయారు చేసి యిస్తాను. ఆ మందు అతని చేత తినిపించు. కొద్ది రోజులలో అతను నీకు దగ్గర అవుతాడు. నిన్ను గౌరవంగా చూసుకుంటాడు. నీ మీద ప్రేమను చూపుతాడు. నిన్ను వదిలి వుండలేదు అన్నాడు. ధర్మావతి సంతోషించింది. 'ధన్యవాదాలు స్వామీ' అంది. అయితే ఒక యిబ్బంది వుంది. ఆ మందుకు అన్నీ వున్నాయి. ఒక దినుసు తక్కువ అయింది. మరి ఆ దినుసు నీవు తీసుకు రాగలవా? అన్నారు స్వామీజీ. అలాగే స్వామీ. నా భర్తకోసం ప్రాణాలకు తెగిస్తాను. ఆ దినుసును తెస్తాను అంది. అప్పుడు ఆ ఋషి యిలా అన్నాడు. అది పెద్ద పులి మీసం. అది నువ్వు తీసుకు రాగలిగితే చక్కని మందు తయారవుతుంది. నీ భర్తలో మంచి మార్పు వస్తుంది. అలాగే స్వామీ. మీరు చెప్పిన విధంగానే చేస్తాను. నా ప్రాణాలకు తెగించి అయినా పెద్దపులి మీసం తెస్తాను.
పులి ధర్మావతిని చూస్తూనే గాండ్రించింది. భయంతో గజగజ వణికి పోయింది ధర్మావతి. అయినా గుండెదిటవు చేసుకొని నిలబడింది. అలా కాసేపు నిలబడి తన యింటికి తిరిగి వెళ్ళింది. మరుసటి రోజు తిరిగి అడవికి వెళ్ళింది. అక్కడ ఇంకోచోట నిలబడింది. పులి మళ్ళి గట్టిగా గాండ్రించింది. ధర్మావతి అలాగే నిలబడింది. ఇలా కొన్ని రోజులు జరిగాయి. రోజులు గడిచే కొద్దీ ధర్మావతిని చూసి పులి అరవడం మానుకుంది. ఆతర్వాత కొన్ని పిండి వంటలు వండి పులికి పెట్టింది. ధర్మావతి వండిన వంటకాలు రుచి చూసింది పులి. ఆవురు ఆవురు మంటూ తిన్నది. నాలుకతో మూతి తుడుచుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. ఇంకొన్ని నాళ్ళకు పులి బాగా అలవాటు అయింది. ఇప్పుడూ ధర్మావతి ముట్టుకున్నా పులి ఏమీ అనడం లేదు. చివరికి ఒక రోజు ఆ పులిని నిమురుతూ వుంది ధర్మావతి. అదను చూసి పులి మీసం పీకింది. పులి మూలిగిందేగానీ ఏమీ అనలేదు. ధర్మావతి పర్గుపరుగున వచ్చింది. పులి మీసం తీసుకొని ముని వద్దకు వచ్చింది. స్వామీ ఎంతో శ్రమ పడి పులి మీసం స్మపాదించాను తీసుకోండి అన్నది ధర్మావతి. ఋషి ఆమె యిచ్చిన పులి మీసాన్ని అందుకుని మంటలో పడవేశాడు. ధర్మావతి ఆశ్చర్యపోయింద్ది. అయ్యో స్వామీ! యిలా చేశారేంటి? అని తెగ గాధపడింది. అప్పుడు ఋషి యిలా అన్నాడు. అమ్మా ధర్మావతీ నీకు ఏ మందుతోనూ పనిలేదు. నువ్వు నాకు ఓక సంగతి చెప్పు. పులిని నువ్వు ఎలా లొంగదీసుకున్నావు? ప్రేమ, ఆప్యాయతలతో! అవునా? ఎంతో కౄరమైన జంతువునే లొంగదీసుకున్నావు. అంతటృఇ ఓర్పుగల నీవు నీ భర్తను లొంగదీసుకోలేవా? ఇదే ప్రేమ, అనురాగం నీ భర్తపై చూపించు. సహనంతో అతనిని నీ వైపుకు మళ్ళించుకో. నీ ప్రేమను పంచి, అతని ప్రేమను పొందు. అని చెప్పాడు ఋషి. ధర్మావతికి కళ్ళు తెరచుకున్నాయి. ధైర్యంగా యింటికి వెళ్ళింది. భర్తలో మార్పు తెచ్చింది. అతని నుండి వెనకటి ప్రేమను పొందింది.
ఏలూరు పట్టణములో నరేష్ అనే అతడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి తల్లి, తండ్రి, భార్య, ఒక కుమార్తె ఉన్నారు. సంపాదన చాలక అవస్థలు పడుతుండేవారు. తల్లికి అనారోగ్యంగా ఉండేది, తండ్రి సంపాదన అంతంతమాత్రమే. అయినా నీతి తప్పక వచ్చే సంపాదనతో తృప్తిగా జీవిస్తున్నారు. ఒక రోజున ఇద్దరు దంపతులు అతని ఆటోలో అశోక్‌నగర్‌కి స్టేషన్ నుండి ఎక్కారు. వారు ధనవంతులు. నగలుగల బ్యాగ్ ఆటో వెనుక భాగములో పెట్టి దిగిపోయారు. ఇంటికి వచ్చి భోజనము చేస్తుండగా కూతురు ఆటో ఎక్కి ఆడుకుంటూ ఆ బ్యాగ్‌ను చూసి ఇంటిలోకి తెచ్చింది. బ్యాగ్‌లో తినే ఆహారపదార్థములేమైనా వున్నాయేమో అని జిప్ వూడదీసి చూస్తే దాంట్లో బంగారు ఆభరణాలు, డబ్బు వున్నాయి. వెంటనే తల్లిదండ్రులకి చెప్పింది.
నరేష్ వెంటనే భోజనము ముగించుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి బ్యాగ్ విషయము చెప్పి, వారి ఇంటి గుర్తులు చెప్పాడు. పోలీస్ వారితో కలిసి ఆ ఇంటికి వెళ్ళి విషయము చెప్పగా, వారు బ్యాగ్ తమదేనని ప్రయాణ బడలికలో గమనించలేదని చెప్పి, ఆటో డ్రైవర్ నిజాయితీకి సంతసించి పదివేల రూపాయలు ఇచ్చి, తమ పిల్లల్ని రోజూ ఆటోలో స్కూల్ కి తీసుకొని వెళితే నెలకు 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ విధంగా చేసి తన సంపాదన పెంచుకున్నాడు. అంతేగాక ఆ వీధిలోని పిల్లల్ని తీసుకెళ్ళి తన సంపాదన పెంచుకొని తన తల్లి ఆరోగ్యము బాగు చేయించుకొని సుఖముగా ఉన్నాడు.
ఒకరోజు నస్రుద్దీన్ ఒక కొత్త తలపాగా తీసుకుని రాజు దగ్గరికి వచ్చాడు.
"రాజా ఈ తలపాగా మీరు కొంటారని తీసుకువచ్చాను" అన్నాడు.
"అలాగా! దీని ఖరీదు ఎంత?" అన్నాడు రాజు.
"వెయ్యి వరహాలు రాజా" అన్నాడు నస్రు. ఇంతలో రాజు పక్కనే ఉన్న మంత్రి ఒకరు "రాజా! ఈ నస్రుద్దీన్ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. ఈ తలపాగా అంత ఖరీదు చెయ్యదు." అని చెవిలో చెప్పాడు.
మంత్రి చెప్పింది నిజమే అనిపించింది రాజుకి. అయినా తలపాగా నచ్చడంతో, "నస్రుద్దీన్! ఈ తలపాగాకి అంత విలువ లేనట్టుందే. ఎందుకంత ధర?" అని అడిగాడు.
"రాజా! దీన్ని చూడగానే ఇది అత్యంత గొప్పవాళ్ల తలపైనే ఉండే తలపాగా అనిపించింది. అంత గొప్పవాళ్లు ఎవరా అని ఆలోచిస్తే నాకు మీరు తప్ప మరెవరూ లేరనిపించింది. అందుకే బేరం కూడా చేయకుండా వెయ్యి వరహాలు పెట్టి కొన్నాను రాజా!" అన్నాడు నస్రు.
నస్రు మాటలకి రాజు పొంగిపోయాడు. వెంటనే వెయ్యి వరహాలిప్పించి, ఆ తలపాగా తీసుకున్నాడు.
వరహాలు తీసుకుని వెళ్తున్న నస్రుకి బయట మంత్రి కనిపించాడు. అతని దగ్గరకి వెళ్లి, మంత్రిగారూ! మీకు తలపాగా గొప్పదనం తెలుసు, కాని నాకు రాజుగారి బలహీనత తెలుసు" అని నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.
శ్రీకృష్ణదేవరాయలు అయిదు వందల ఏళ్ల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో, కావ్య రచనలో అంత నేర్పరి. ఈయనకు "సాహితీ సమరాంగణ చక్రవర్తి" అనే బిరుదు ఉండేది. అముక్తమాల్యద, రాయలు రచించిన గొప్ప కావ్యం. రాయల దగ్గర ఎనిమిది మంది గొప్ప కవులుండేవారు. వారిని 'అష్టదిగ్గజాలు' అని పిలిచేవారు. అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన, రామభద్రుడు, ధూర్జటి, భట్టుమూర్తి, పింగళి సూరన, మాదయగారి మల్లన, తెనాలి రామకృష్ణుడు రాయల అస్థానకవి దిగ్గజాలు. ఆయన సభకు "భువన విజయం" అని పేరు.
ఒకసారి రాయల దగ్గరకు ఒక మహా పండితుడు వచ్చాడు. అతడు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ సమస్య ఏమిటంటే రాయల సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి. రాయలవారు తన కవిదిగ్గజాలను ఈ సమస్య విడగొట్టమని కోరాడు.
మొదట 'ఆంధ్రకవితాపితామహుడని పేరు పొందిన పెద్దన కవి లేచి, తనకు వచ్చిన భాషలలో అతనితో సంభాషించి, వాదించి కూడా, అతని భాష తేల్చుకోలేక పోయాడు. తరువాత ఆరుగురూ అంతే. చివరికి తెనాలి రామకృష్ణుని వంతు వచ్చింది. ధారాళంగా భాషలన్నీ వల్లె వేస్తున్న ఆ పండితుని దగ్గరకు వెళ్ళాడు. ఎంతో సేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేక పోయాడు. ఓటమి తప్పదని రాయలు భావించాడు. ఆ ఉద్ధండ పండితుడు కూడా ఉప్పొంగిపోతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా తెనాలి కవి ఆ పండితుని కాలును గట్టిగా తొక్కాడు. ఆ బాధ భరించలేక పండితుడు 'అమ్మా' అన్నాడు. అంతే! " నీ మాతృభాష తెలుగు పండితోత్తమా!" అని తేల్చేశాడు తెనాలి రామకృష్ణుడు. పండితుడు ఒప్పుకోక తప్పలేదు. రాయల ఆనందానికి అంతులేదు. శభాష్! వికటకవీ అని రామకృష్ణుని మెచ్చుకొని బహుమానంగా సువర్ణహారం ఇచ్చాడు.
మాతృభాష గొప్పతనం అదే. ఆనందంలో కాని విషాదంలో కాని మన నోటి నుండి వెలువడేది మన మాతృభాషే. కన్నతల్లిలా, మాతృభూమిలా, మాతృభాష మధురమైనది, మరపురానిది.
ఒకరోజు దర్బారులొ అతిముఖ్యమైన పనులు ఏమీ లేకపొవడంతో అక్బర్ చక్రవర్తి చాలా కులాసాగా ఉన్నాడు. ఎవరూ చడీచప్పుడూ చేయకుండా అక్బరు ఏదైన మాట్లాడితే జవాబు ఇవ్వాలనుకుని ఆయన వైపు చూస్తూ కూర్చున్నారు. అక్బరుకు ఆరోజు, సభ చాలా చప్పగా జీవం లేనట్లు అనిపించింది. అందుకే ఆయన కొంచెం సేపు ఆలోచించి, భటుల చేత ఒక తివాచీ, ఒక రూపాయల పళ్ళెం తెప్పించాడు. ఒక ప్రక్క రూపాయల పళ్ళెం ఉంచి దాని ముందు తివాచీ పరచమని ఆజ్ఞాపించాడు. తరువాత అందరినీ కలియజూస్తూ ఈ రూపాయల పళ్ళెం మీ కోసమే తెప్పించాను. ఐతే ఎవరు తెలివిగా, యుక్తిగా ఆలోచించగలరో వారికి ఈ పళ్ళెం బహుమానంగా దొరుకుతుంది. ఈ తివాచీని తొక్కకుండ, అటు ప్రక్కలకి వెల్లకుండా ఆ పళ్ళెంని తెచ్చుకొండి. మీరు వెళ్ళాల్సిన దారి తివాచీ పరచిన వైపే" అని చెప్పాడు.
'ఎటూ వెళ్ళకూడదట. తివాచీని తొక్కకుండా దాటాలిట. ఇది సాధ్యం అయ్యే పనేనా?' అన్న సందేహంతో ఎవరూ ముందుకు రాలేదు.
"ఏం బీర్బల్ నీకు కూడా ఈ పని సాధ్యం కాదా?" నవ్వుతూ ప్రశ్నించాడు అక్బరు.
"ఎందుకు కాదు ప్రభూ! ఇక్కడున్న వారికి అవకాశం ఇవ్వాలని ఆగాను. వెంటనే ఆ పని చేస్తే ఎవరికో వచ్చే బహుమతి నేను కొట్టేసినట్టవుతుంది. ఇప్పుడు మీరు ఆజ్ఞ ఇస్తే వెళ్ళి తెచ్చుకుంటాను" అని అన్నాడు వినయంగా బీర్బలు.
"ఆలస్యం ఎందుకు? వెళ్ళితీసుకో"అనుమతి ఇచ్చాడు అక్బర్. బీర్బల్ వెంటనే తీవాచీని చుట్టుకుంటూ వెళ్ళి, రుపాయలపళ్ళెం తీసుకున్నాడు.తిరిగి తివాచీని పరుచుకుంటూ వెనక్కివచ్చాడు.బీర్బల్ యుక్తిని అక్బరు చక్రవర్తే కాదు,ఆయనంటే ఆసూయపడే రాజోద్యోగులు కూడ మెచ్చుకున్నారు.
రామయ్యది వెంకటాపురం. భూస్వామి భూపతి దగ్గర పాలేరుగా పని చేస్తున్నాడు. మంచి పనిమంతుడు. నమ్మకస్తుడు. అందుకే అతనంటే భూపతికి ప్రత్యేకమైన అభిమానం.
నమ్మకంగా వుంటూ, ఇంటిని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే మనిషి వుంటే పంపించమని పట్నంలో వ్యాపారం చేస్తున్న భూపతి కొడుకు మహేష్ ఉత్తరం రాశాడు. ఆ పనికి రామయ్యే సరైనవాడని భూపతికి తెలుసు. అదే మాట రామయ్యతో అన్నాడు. ముందూ వెనుక ఎవరూ లేకపోవడంతో రామయ్య కూడా అంగీకరించాడు. అలా రామయ్య వెంకటాపురం వదిలి హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. ప్రశాంతమైన పల్లె వాతావరణానికి అలవాటుపడిన రామయ్యకు రణగొణ ధ్వనుల మధ్య జీవించడం కొంచెం కష్టంగానే ఉంది. అయినా అలాగే సర్దుకుపోతున్నాడు.
భూపతి కొడుకు రాహుల్, కోడలు రమ్య, వాళ్లిద్దరూ వారి వారి పనుల్లో బిజీగా ఉంటారు. పిల్లలు వంశీ, వసుధ. వంశీ ఆరవ తరగతి చదువుతున్నాడు. వసుధ నాలుగవ తరగతి. పొద్దున్నే తొమ్మిది గంటలకల్లా ఎటు వాళ్లు అటు వెళ్లిపోతారు.
రమ్యకు ఇంటి పనుల్లో సాయం చేయడం, బజారుకెళ్లి కావాల్సిన సరుకులు తీసుకురావడం, పిల్లలకు కావాల్సినవి అమర్చడం, ఇంటిని కనిపెట్టుకొని వుండడం.. ఇది రామయ్య దినచర్య. రామయ్యకు వెంకటాపురంలోకంటే ఇక్కడే పని తక్కువగా ఉంది. కాకపోతే ఒక్కటే చిక్కు. కాయకష్టానికి అలవాటుపడిన మనిషిని ఖాళీగా వుండమంటే ఉండలేడు. ఇప్పుడు రామయ్య పరిస్ధితీ అదే.
ఓ రోజు ఏ కారణం చేతనో ట్యూషన్ మాష్టారు రాలేదు. పిల్లలకు కావాల్సినంత తీరుబడి దొరికింది. ఆ బజారులోని తోటి పిల్లలందర్నీ పోగు చేశారు. వాళ్లతో ఇంట్లోనే ఆటలు మొదలుపెట్టారు. రామయ్య కూడా వాళ్లతో కలిసిపోయాడు. కాసేపటికి వర్షం మొదలయ్యింది. డాబా మీద కురిసిన వాన నీళ్లు కాలువలా పెరట్లో నుండి పోతున్నాయి. రామయ్యకు ఓ ఆలోచన వచ్చింది.
"వంశీ బాబూ! నీకి కాగితాలతో పడవలు తయారుచేయడం వచ్చా?" అడిగాడు రామయ్య .
"రాదు. ఏం?"
"మేం చిన్నప్పుడు కాగితాలతో పడవలు తయారుచేసి వాన నీళ్లల్లో వదిలేవాళ్లం. మునగకుండా ఎవరి పడవ ఎక్కువ దూరం వెళ్తుందో వాళ్లు గెలిచినట్టు. ఆ ఆట భలే సరదాగా ఉంటుంది" చెప్పాడు రామయ్య.
"అయితే త్వరగా వెళ్లి కాగితాలు తీసుకురా తాతా..." అంది వసుధ.
"కాగితాలు నాన్నగారి గదిలో ఉంటాయి" వెంటనే అందుకున్నాడు వంశీ.
రామయ్య రాహుల్ గదిలోకి వెళ్లాడు. అక్కడ తెల్ల కాగితాలు, రాసిన కాగితాలు విడివిడిగా ఉన్నాయి. తెల్ల కాగితాలైతే రాసుకోవచ్చు. అదే వాడిన కాగితాలు తీసుకున్నా ఫర్వాలేదు ' అనుకున్నాడు రామయ్య రాసిన కాగితాలు తీసుకొని పిల్లల దగ్గరకొచ్చాడు. వాటితో పడవలు తయారుచేసి, పిల్లలకిచ్చాడు. వాళ్లు వాటిని నీళ్లల్లో వదులుతూ ఆనందించారు. కాసేపటి తర్వాత వర్షం ఆగిపోయింది. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. పిల్లలు అన్నం తిని, నిద్రపోయారు. రాత్రి తొమ్మిది గంటలకు భార్యాభర్తలిద్దరూ ఇంటికొచ్చారు. వచ్చీరాగానే రాహుల్ తన గదిలోకి వెళ్లాడు. ఏవో ముఖ్యమైన కాగితాల కోసం చాలాసేపు వెతికాడు. ఎంత వెతికినా అవి కనిపించలేదు.
రామయ్యను పిలిచి, "టేబుల్ మీద నేను కొన్ని ముఖ్యమైన కాగితాలు పెట్టాను. అవేమైనా చూశావా?" అని అడిగాడు రాహుల్.
"నల్ల సిరాతో ఏదో రాసి ఉంది. అవేనా బాబుగారూ?" అడిగాడు రామయ్య.
"అవును. అవే...ఎక్కడ పెట్టావు?" ఆతృతగా అడిగాడు రాహుల్.
"అవి పనికిరాని కాగితాలు అనుకొని..."
"అనుకొని... నీళ్లు నమలడం మాని ఏం చేశావో చెప్పు" కోపంగా అన్నాడు రాహుల్.
"ఇందాక పిల్లలకు పడవలు చేసిచ్చాను" భయం భయంగా చెప్పాడు రామయ్య.
"అసలు వాటి జోలికెందుకువెళ్లావు? పక్కన అన్ని తెల్లకాగితాలు ఉన్నాయి. అవి తీసుకోవచ్చుగా. అయినా పాత న్యూస్ పేపర్లతో పడవలు చెయ్యోచ్చు కదా. అసలు ఆ పేపర్ల విలువేంటో తెలుసా నీకు?" ఆవేశంగా అన్నాడు రాహుల్.
రామయ్య దిగాలుగా ముఖం పెట్టి. "అయ్యా! నాకు చదువురాదు. అందుకే వాటి మీద ఏం రాసి వుందో తెలీలేదు. తెలిస్తే... వాటితో పడవలు చేసేవాణ్ణే కాదు. క్షమించండి" అన్నాడు.
"ఎలా క్షమించమంటావు? అవేమైనా పాతిక రూపాయలు పెడ్తే వచ్చే కాగితాలనుకున్నావా? కొత్తగా తీసుకున్న ఉద్యోగులతో కుదుర్చుకున్న ఒప్పందం కాగితాలు" అరిచాడు రాహుల్. రాహుల్ అరుపుల విన్న రమ్య ఆ గదిలోకి వచ్చింది.
విషయాన్ని గ్రహించి, "ఊరుకో రాహుల్. అంత ముఖ్యమైన కాగితాలను నిర్లక్ష్యంగా టేబుల్ మీద పడేసి వెళ్లిపోవడం నీ తప్పు. అవి మామూలు కాగితాలు అనుకొని రామయ్య పడవలు చేసి ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయింది. మళ్లీ వాళ్లతో అగ్రిమెంట్ రాయించుకుంటే సరిపోతుంది" అంటూ సర్ధిచెప్పింది.
రామయ్యవైపు తిరిగి, "రామయ్య... నువ్వు వెళ్లి భోం చేసి పడుకో" అని చెప్పింది. రామయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు.
మర్నాడు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు రామయ్య కోసం ఓ ప్యాకెట్ తీసుకొచ్చింది రమ్య. అందులో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిని అయోమయంగా చూశాడు రామయ్య.
"ఇవి నీ కోసమే రామయ్య రేపటి నుండి నువ్వు కూడా చదువుకోవాలి. పిల్లలతోపాటు నీక్కూడా ట్యూషన్ మాష్టారే చదువు చెప్తారు. మరి శ్రద్ధగా చదువుకుంటావు కదూ" అంది రమ్య.
రామయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తాను చేసిన తప్పు గుర్తొచ్చింది. ఇకమీదట అలాంటి తప్పు చేయకుండా వుండాలంటే చదువుకోవడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నాడు.
ఒకప్పుడు విజయభట్ అనే రాజగురువు వుండేవాడు. ఆ ఆస్థానంలో పన్నెండు అగ్రహారాలు వుండేవి. అందులో సురేంధ్రనగర్ అగ్రహారంలో భట్ నివసించేవాడు. ఆస్థానమంతా అర్జున్ సింగ్, సాబర్ సింగ్, అనబడే అన్నదమ్ముల ఆధీనంలో వుండేది. ఇందులో అర్జున్ సింగ్ యోగ్యుడు, బుద్దిమంతుడు, ఈ విషయం రాజగురువు భట్‌కు బాగా తెలుసు. కొన్నాళ్ళకు ఆ అన్నదమ్ములు విడిపోవాలని నిశ్చయించుకొన్నారు. అయితే సురేంధ్రనగర్ అగ్రహారం కోసం ఇద్దరూ వాదులాడుకోవడం ప్రారంభించారు. ఈ విషయం రాజగురువుదాకా వెళ్ళింది. ఆయన ఆ అన్నదమ్ముల వద్దకు వచ్చాడు. వారు గురువును చూచి ఎంతో గౌరవంగా పిలిచారు. తమ సమస్యను తీర్చ వలసిందిగా కోరారు. అప్పుడు రాజగురువు వారికొక కధ చెప్పాడు.
పూర్వము ఒకప్పుడు ఒక మహర్షి వుండేవాడు. ఆయనవద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. విధ్యాభాసం పూర్తయ్యాక వారు గురువును సెలవు కోరారు. అప్పుడు గురువు ఇద్దరికీ పిడికెడు విభూతి ఇచ్చి వెళ్ళి సుఖంగా వుండమని దీవించాడు. అందులో ఒకడు విభూతిని ఎంతో భక్తితో స్వీకరించి తినివేశాడు. మరొకడు చిన్నచూపుతో దాన్ని పారవేశాడు. విభూతిని స్వీకరించినవాడికి సకల విధ్యలు అబ్బినాయి. అన్ని వేళలలో నిష్ణాతుడయ్యాడు. రెండవ వాడు మాత్రం మందబుద్దితో తిరిగి వచ్చి గురువును తూలనాడాడు. రాజగురువు పై కధ చెప్పి నా తీర్పువిన్నాక రెండవ శిష్యునివలే తనను నిదించకూడదని అన్నాడు. అందుకు వారు అంగీకరించారు. సమస్యను రేపు పరిష్కరిస్తానని రాజగురువు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి కధలో మొదటి శిష్యుడు చేసినట్లు చేయవలసిందిగా అర్జున్ కు రాజగురువు రహస్యంగా వర్తమానం పంపాడు. సురేంధ్రనగర్ అర్జున్ సింగ్ ఆధీనంలోకి రావాలన్నదే రాజగురువు ఆశ కూడ.
మరుసటి నాడు రాజ గురువు రెండు చీటీలను ఉండలుగా చుట్టి అర్జున్ సింగ్ ను సాబల్ సింగ్ ను ఇష్టానుసారం తీసుకోమని చెప్పాడు. అర్జున్ సింగ్ చీటీ తీసుకొని మ్రింగివేసాడు, సాబల్ సింగ్ చీటీ చూచుకొన్నాడు. అందులో "సురేంద్ర నగర్ మీదికాదు" అని రాసి వుంది. మాట ప్రకారం సాబల్ సింగ్ సురేంద్ర నగరను అర్జున్ సింగ్ కు వదిలి పెట్టాడు. అయితే రాజగురువు రెండు చీటీలనూ ఒకే విధంగా అంటే "సురేంద్ర నగర్ మీదికాదు" అని రాసినట్లు తెలియదు. ఎంతో తెలివిగా ఆయన సురేంద్రనగర్ ను బుధ్ధిమంతుడైన అర్జున్ సింగ్ కు వచ్చేలా చూశాడు. మంత్రి సుబుధ్ధితో ఈ విషయం వివరించాడు.
అప్పుడు సుబుద్ది కాసేపు ఆలోచించి రాజుతో రాజా! మనవూరిలో రామశర్మ అనే కంసాలి వున్నాడు. అతడు రధాన్ని బాగా నడపగలడు. కానీ కొంత బంగారాన్ని మాత్రం మూడొ కంటికి తెలియకుండాతీసుకొన్నాడు! అని పలుకగా రాజు ఆశ్చర్య పడి అతనిని పిలుచుకురమ్మని ఆఙ్ఞాపించాడు. కొంత సేపటికి రామశర్మరాగా రాజు అతనిని చూచి "ఓయీ! నీవు మాకొక బంగారు రధాన్ని చేయవలె. అందుకు ఎంత బంగారం కావాలని ప్రశ్నింపగా "రాజా! ఆ రధమునకు యాబదివేల వరహాలు విలువచేసే బంగారం కావాలి" అని బదులు చెప్పాడు. "ఓయీ! నీవు మూడోకంటికి తెలియకుండా బంగారాన్ని తీసుకుంటావంటకదా!" అని రాజు పలుకగా "ఓ రాజా! నేను అనుకొంటే మొత్తం తీసుకోగలనని" శర్మ బదులిచ్చాడు. "ఓ రామశర్మ! నీవు చెప్పినట్లే మొత్తం బంగారాన్ని తీసుకోగలిగితే నేను నా ఆస్థాన స్వర్ణ కారునిగా నియమిస్తాను.
మౌల్వీ నజీరుద్దీన్ చాలా గ్రంథాలు చదివి అపార జ్ఞానం సంపాదించాడు. కానీ అసలు జ్ఞానం కావాలంటే అది జీవితం నుండే నేర్చుకోవాలన్నది అతని ఉద్దేశ్యం. అందుకే ప్రజలను కలుసుకునే వీలుండే పనేదైనా చేస్తే జీవిత సత్యాలు తెలుస్తాయని, అన్వేషణ ఆరంభించాడు.
నజీరుద్దీన్‌కి ఈత బాగా తెలుసు. అందువల్ల పడవ నడిపే పని బావుంటుందని, దానిలో చేరాడు. రోజూ నదికి అటూ ఇటూ మనుషుల్ని పడవపై చేరవేయడం అతని పని.
ఒకరోజు అతని పడవలో ఒక ముసలి గురువు ఎక్కాడు. ప్రయాణిస్తుండగా మాటా మాటా కలిసి, ఆ గురువు ఒక మహా పండితుడని తెలిసింది. మౌల్వీ నజీరుద్దీన్ తన పేరు చెప్పకుండా, తన గురించి తెలియనివ్వకుండా ఉన్నాడు.
కొద్దిసేపటికి వర్షం ప్రారంభమైంది. "నీకు వర్షం ఎలా కురుస్తుందో తెలుసా?" అని అడిగాడు గురువు.
"నాకు తెలియదు " అన్నాడు నజీరుద్దీన్.
"వర్షం ఎలా కురుస్తుందో తెలియకపోతే నీ సగం జీవితం వ్యర్థం" అన్నాడు గురువు ఎగతాళిగా.
"అవునా గురువుగారూ? మరెలా?" అని అడిగాడు అమాయకంగా.
"ఇంకేముంది? నువ్వు సగం చచ్చినవాడితో సమానం" అన్నాడు గురువు. ఇంతలో వర్షం ఎక్కువైంది. పడవలోకి నీళ్లు చేరుతున్నాయి. అలలు పెద్దవై పడవ అటూ ఇటూ ఊగడం మొదలెట్టింది.
"గురువుగారూ! మీకు ఈత వచ్చా?" అని అడిగాడు నజీరుద్దీన్. అప్పటికే భయం భయంగా వణుకుతున్న గురువు "రాదు" అన్నాడు.
"అయితే మీ పూర్తి జీవితం వ్యర్థం " అని నజీరుద్దీన్ పడవలో నుండి నీటిలోకి దూకి, ఈదుకుంటూ వెళ్లిపోయాడు.
పరమానందయ్యగారికి పన్నెండు మంది శిష్యులు. వాళ్ళు ఒకరోజు కట్టెలకోసం అడవికి వెళ్ళారు. తిరుగు ప్రాయాణంలో వాళ్ళు ఒక వాగును దాట వలసి వచ్చింది.
"అమ్మో! వాగులో మునిగి పోతామేమో" అంటూ భయపడ్డారు. "మనం ఒకరి చేయి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం" అన్నాడు ఒకడు. "సరే" అన్నాడు మరొకడు. అలాగే వారు వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి "అందరం వాగుదాటామా?" అనే అనుమానం వచ్చింది. "ఓరేయ్! మీరంతా వరుసలో నిలబడండి. నేను లెక్కపెడతాను" అన్నాడు. అందరూ వరుసలో నిలబడ్డారు.
"ఒకటి, రెండు, మూడు..... పడకొండు. ఒరేయ్ పదకొండు మందిమే ఉన్నాం! ఒకడు వాగులో మునిగిపోయాడు" అన్నాడు. శిష్యులందరూ ఒకరి తరువాత ఒకరు లెక్కబెట్టారు. ఎన్నిసార్లు లెక్కబెట్టినా సంఖ్య పదకొండే వచ్చింది.
"మనలో ఒకరు వాగులో మునిగిపోయారు" అంటూ అందరూ భోరుభోరున ఏడుస్తూ, గురువు గారి దగ్గరకు వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ భోరున విలపించారు.
గురువుగారు అందరినీ తేరిపార చూశారు. శిష్యులను మళ్ళీ లెక్కపెట్టమన్నారు. ఒకడు లెక్కబెట్టాడు. మళ్ళీ పదకొండే వచ్చింది. గురువుగారు శిష్యులూ చేసిన తప్పును గుర్తించారు. వారందరినీ వరుసలో నిలబెట్టి స్వయంగా లెక్కబెట్టారు. శిష్యులు తమ పొరపాటు తెలుసుకొని నవ్వారు.
మొగసాల మర్రి గ్రామంలో ధర్మయ్య, రంగయ్య అనే ఇద్దరు వడ్డీ వ్యాపారం చేస్తూ జీవించేవారు. వారిలో ధర్మయ్య తక్కువ వడ్డీ తీసుకొని అడిగిన వారికి లేదనక అప్పులిచ్చి అవసరాలలో ఆదుకొంటుండేవాడు. ఎవరైనా ఇచ్చిన అప్పును సకాలంలో తీర్చకపోతే పీడించేవాడుకాదు. అందువల్ల ఆ ఊరి ప్రజలకు ధర్మయ్య అంటే చాలా ఇష్టం. కాని రంగయ్య మాత్రం పరమలోభి. అధిక వడ్డీలు గుంజి లక్షలకు లక్షలు సంపాదించాలని కలలు కనేవాడు. అప్పులు తీర్చకపోతే వారు తాకట్టు పెట్టిన భూములు, నగలను, ఇండ్లను తిరిగి ఇవ్వక వారికి నిలువ నీడ లేకుండా చేస్తాడు. ఆ ఊరి ప్రజలు అతనిని లోభి అని, చండాలుడని చెప్పుకొనేవారు. ప్రజల్లో ధర్మయ్యకున్న గొప్ప పేరును చూసి రంగయ్య అసూయపడేవాడు. ఎలాగైనా ధర్మయ్యను దెబ్బ తీయాలని అనుకున్నాడు. ఆ ఊరివారందరూ కలిసి ఒక రామాలయం కట్టించారు. ఆ ఊరి జమిందారు ఇచ్చిన విరాళంతో నగలను చేయించారు. ఆ గుడి తాళాలను నిజాయితీ పరుడైన ధర్మయ్యకే అప్పగించారు. అది చూసి ఓర్వలేని రంగయ్య మండిపడ్డాడు. అతను బాగా ఆలోచించి ఒక పథకం వేశాడు. ధర్మయ్య ఇంట్లో పనిచేసే రాజయ్యను రహస్యంగా కలిసాడు. ఎలాగైనా గుడి తాళాలను తెచ్చి ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని ఆశ చూపాడు. మొదట్లో రాజయ్య దానికి ఒప్పుకోలేదు. కాని కుటుంబ అవసరాల వల్ల అతను ఆ పనికి ఒప్పుకున్నాడు. ధర్మయ్య గుడి తాళాలను పెట్టెలో పెట్టి భద్రంగా వుంచాడు. రాజయ్య మాత్రం దానిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు.
ఒక రోజు ధర్మయ్య భార్య నగల కోసం పెట్టె తెరచి మరలా దానికి తాళం వేయడం మరచి లోనికి వెళ్ళిపోయింది. అదే అదనుగా భావించి చాటున ఉన్న రాజయ్య ఆ పెట్టెను తెరచి గుడి తాళాలను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ గుడి తాళాలను రంగయ్య చేతికిచ్చాడు. ఒకరోజు రాత్రి రంగయ్య ఊరంతా గాఢ నిద్రలో ఉండగ గుడి తలుపులు తెరచి గర్భ గుడిలోనికి వెళ్ళాడు. అక్కడ దేవతలకు అలంకరించిన నగలను తీసి ఒక సంచిలో వేసుకొని అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు. మరుసటి రోజు దేవుని నగలు దొంగిలించారన్న వార్త ఊరంతా పాకిపోయింది. గుడి తాళాలు ధర్మయ్య వద్ద ఉండగా దొంగతనం ఎలా జరిగిందోనని కొందరి మాటల్లో వినిపిస్తుంది. గ్రామ పెద్ద భీమన్న ఈ విషయాన్ని గూర్చి రచ్చబండ దగ్గర పంచాయితీ నిర్వహించారు. ఊరివారందరితో పాటు ధర్మయ్య, రంగయ్యలు కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పుడు గ్రామ పెద్ద భీమన్న, ధర్మయ్యా! తాళాలు నీవద్ద ఉన్నాయి. మరీ దొంగతనం ఎలా జరిగింది? దీనికి నీ సంజాయిషీ ఏమిటీ? అని ప్రశ్నించాడు. ధర్మయ్య గ్రామ పెద్ద వంక చూసి "అయ్యా! గుడి తాళాలను పెట్టెలో భద్రంగా ఉంచాను. రెండు రోజులుగా అవి కనిపించలేదు. ఎంత వెతికినా వాటి ఆచూకీ తెలియలేదు" అని బదులిచ్చాడు. "ఈ ధర్మయ్య మోసకారి, తానే నగలు కాజేసి ఏమి తెలియదన్నట్లు నటిస్తునాడు. తగిన శిక్ష వేసి చెరసాలలో వేయించండని రంగయ్య చెప్పాడు.
గ్రామ పెద్ద భీమన్నకు రంగయ్య మాటలపై నమ్మకం కలుగలేదు. ధర్మయ్య నిజాయితీ పరుడని నమ్ముతున్నాడు. ఇందులో ఏదో మోసం జరిగింది. అది తెలుసుకోవాలనుకున్నాడు. ఒకరోజు గ్రామ పెద్ద ధర్మయ్య ఇంట్లో పని వారందరిని పిలిపించాడు. వారికి తలోక ఉంగరాన్ని ఇచ్చి ఇవి మహిమ కలవని, ఒక మునీశ్వరుని వద్ద నుండి సంపాదించానని చెప్పాడు. దొంగతనం చేయని వారి ఉంగరం ధగ ధగ మెరుస్తుందని నమ్మబలికాడు. వాటిని మరుసటి రోజు తిరిగి ఇవ్వమని చెప్పి వారిని పంపించాడు. రాజయ్య తాను తాళాలు దొంగిలించిన విషయం బయటకు తెలియకుండా తనకు తెలిసిన కంసాలి వద్ద ఉంగరాన్ని మెరుగు పట్టించాడు. మరుసటి రోజు వారు ఆ ఉంగరాలను భీమన్నకు అందజేసారు. భీమన్న ఆ ఉంగరాలను పరిశీలించి రాజయ్య ఉంగరం మెరుస్తుండడం గమనించాడు. అయనకు దొంగ ఎవరో తెలిసిపోయింది. వెంటనే "రాజయ్య నిజం చెప్పు? నగలను ఎక్కడ దాచావ్? అంటూ గద్దించాడు. అది విని రాజయ్య గజగజ వణికిపోయాడు. అయ్యా! నగలను గూర్చి నాకేం తెలియదు. బుద్ది గడ్డి తిని గుడి తాళాలను రంగయ్య చేతికిచ్చాను. తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదని గ్రామ పెద్దను వేడుకొన్నాడు. రంగయ్య తను చేసిన నేరం అందరికి తెలిసిపోయిందన్న విషయం గ్రహించి సిగ్గుతో తలవంచుకున్నాడు. అప్పుడు భీమన్న "రంగయ్య నీవు స్వార్థంతో అతి పవిత్రమైన దేవుని నగలను దొంగిలించావు! నిజాయతీ పరుడైన ధర్మయ్యపై నేరాన్ని మోపి దోషిగా అందరి ముందు నిలబెట్టావు! అందువల్ల నీకు కఠిన శిక్ష విధించి చెరసాలలో వేయించాలని తీర్పు ఇస్తున్నాను" అన్నాడు. అప్పుడు ధర్మయ్య రంగయ్యను క్షమించి వదిలివేయమని గ్రామపెద్దను వేడుకున్నాడు. భీమన్న ధర్మయ్య మాట కాదనలేక రంగయ్యను మందలించి వదిలివేశాడు. అపకారికి కూడా ఉపకారం చేసే ధర్మయ్య గొప్ప గుణానికి అక్కడున్న వారందరూ మెచ్చుకున్నారు. రంగయ్య, ధర్మయ్య చేతులుపట్టుకొని "అసూయతో చేసిన నేరానికి క్షమించమని" అడిగాడు. ధర్మయ్య "ఇప్పుడైనా నీలో మార్పు వచ్చింది! అంతే చాలు అన్నాడు. తర్వాత ఇద్దరు ఎన్నో గొప్ప పనులు చేసి ఆ ఊరిని బాగు చేసారు.
ఒక అందమైన నగరం. దాన్ని దేవతలు పాలిస్తుండేవారు. తమ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉండేవారు. అందుచేత ఆ నగరంలో అందరూ సంతోషంగా ఉండేవారు. కొంతకాలానికి ఈ దేవతలకు అమితంగా గర్వం ఏర్పడింది. ఎవరికి వారే తామే గొప్ప అని, తమవల్లే నగరంలో సంక్షేమం ఏర్పడిందని, తాము లేకపోతే అంతా చిద్రం అయిపోతుందని గర్విస్తూండేవారు. ఈ దేవతల నగరం ఏదోకాదు - మానవ శరీరం. దేవతలు జ్ఞానేంద్రియాలు, అవయవాలన్నీ తమ తమ పనులు సక్రమంగా నెరవేర్చేవి. అందుచేత శరీరం ఎప్పుడూ ఆరోగ్యంతో సుఖంగా ఉండేది. అవయవాలలో అహంకారం ఆవిర్భవించినప్పుడు ప్రతీదీ తనకు తానే గొప్ప అని మిట్టిపడుతూండేది. ప్రతీదీ తాను లోపిస్తే శరీరంలో పనులు ఆగిపోతాయని, అప్పుడు శరీరం క్షీణించిపోతుందని అనుకుంది. అందుచేత వారిలో తగాదా బయల్దేరింది.
మొట్టమొదట ఎక్కడలేని అహంకారంతో మనస్సు ప్రారంభించింది. "నేను మీ అందరికీ రాజును. మీరంతా నా అధీనంలో ఉన్నారు. నేను నా ఇష్టం వచ్చినట్లు మిమ్మలను నడిపిస్తున్నాను. నేని లేకపోతే మీలో ఏ ఒక్కరూ ఏమీ చేయలేరు. ఎవ్వరూ మిమ్మల్ని గొప్ప అనుకోరు" అంది. మనస్సు చెప్పిన దానికి కోపంతో ఉద్రేకించిపోయి కన్ను" నేనే ఈ శరీరంలో ముఖ్యమైన దానిని. నేను లేకుండా కాళ్ళూ, చేతులూ తమ పనులు సక్రమంగా నెరవేర్చలేవు. నేను లేకపోతే చదువు ఉండదు, వ్రాతలు ఉండవు" అంది. వెంటనే ప్రగల్భంతో చెవి ప్రారంభించింది. "నీవు గొప్ప అంటే ఎవరు ఒప్పుకుంటారు. నేను లేకపోతే ఏమీ వినపడదు. ఏదీ వినిపించకుండా ఎవరు ఏంచేయగలరు? నేనే అందరికంటే గొప్పదానిని" అంది. వెంటనే ముక్కు లేచింది. "నేను లేకపోతే అసలు వాసనే తెలియదు. శ్వాస నావల్లే జరుగుతూంది. శ్వాసించకుండా ఎవరు జీవించగలరు? నేను మీఅందరికంటే గొప్పదానిని" అంది. అంతవరకు మాట్లాడకుండా నోటిలో ఊరుకున్న నాలుక తన గొప్ప చెప్పుకోవడం ప్రారంభించింది. "అసలు నేనే లేకపోతే మీ ప్రగల్భాలు మీరు ఇలా చెప్పుకోగలరా? మీ అందరికీ లేని మాట్లాడే శక్తి నాకుంది. నేను లేకపోతే తినే ఆహారంలో ఉప్పు, పులుపు, తీపి రుచుల వైవిధ్యం తెలియదు. రుచి తెలీనప్పుడు జీవితం విలువ ఏముంది? నేనే అందరికంటే గొప్పదాన్ని" అంది.
"ఇలా మనలో ప్రతివారూ ఎవరికి వారే గొప్ప అని, ఇతరులందరూ ఎందుకూ పనికిరానివారని అనుకుంటున్నాం. ఈ తగవు తీరేది కాదు. కాబట్టి ఒక పోటీ పెట్టి ఎవరు గొప్పో నిర్ణయించుకుందాం. మనం ఒక సంవత్సరంపాటు ఒకరి తరువాత ఒకరు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోదాం. అప్పుడు ఎవరు లేకపోతే దేహంలో అన్ని పనులు, క్రియలు నిలిచిపోతాయో వారే గొప్పవారుగా పరిగణించబడతారు. ఈ తీర్పుకు అన్నీ ఒప్పుకున్నాయి. మొట్టమొదట మనసు ఒక సంవత్సరంపాటు విడిచి వెళ్ళిపోయింది. తరువాత వచ్చి చూస్తే ఏ అంగానికా అంగం తమ పనులు చేసుకుంటున్నాయి. మనసు ఆశ్చర్యం వెలుబుచ్చింది. అప్పుడు అంగాలన్నీ "ఎందుకు అలా ఆశ్చర్యపోతావు? నీవు లేకపోయినా మేమంతా సుఖంగా ఉన్నాం. మాకు ఏ విచారమూ లేదు" అన్నాయి. తరువాత కన్ను బయలుదేరింది. అదికూడా తిరిగివచ్చి వివిధాంగాలు తమ పనులు యధావిధిగా నిర్వహిస్తున్నట్లు గ్రహించింది. కన్ను తరువాత చెవి బయల్దేరింది. దారిలో ఓ బధిరుడు ఎదురయ్యాడు. అతడు సంకేతాలతో అన్ని విషయాలూ చెప్పాడు. శరీరం అంతా ఇతర అంగాలతో చైతన్యవంతంగా ఉంది. దాంతో తన గడువు పూర్తికాకుండానే తిరిగివచ్చింది. తరువాత ముక్కు బయల్దేరింది. ముక్కుకి దారిలో ఓ ముక్కిడి తటస్థపడ్డాడు. వెంటనే ముక్కు తిరిగి వచ్చేసింది. తరువాత నాలుక లేచి వెళ్ళడానికి ప్రారంభించింది. ఒక మూగవాడిని చూసీచూట్టంతోనే తిరిగివచ్చేసింది.
అన్ని అవయవాలు వచ్చాక ఆత్మ తన ఉపన్యాసం ప్రారంభించింది, "ఇప్పుడైనా గ్రహిస్తారా నేనే గొప్పదాన్నని?" అని ఋజువు చేయడానికి శరీరం నుంచి బయటకి వెళ్ళడానికి ఉద్యుక్తురాలయ్యింది. కొంచెం కదిలిందో లేదో శరీరావయవాలన్నీ చైతన్యరహితం కాసాగాయి. కంటి గుడ్లు తేలిపోయాయి, నాలుక బైటికొచ్చేసింది, శరీరం మొద్దుబారసాగింది. దాంతో అవయవాలన్నీ "ఓ ఆత్మా, మమ్మల్ని క్షమించు. నువ్వుమాత్రం మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు" అని ప్రాధేయపడ్డాయి. అప్పుడు ఆత్మ "మనలో ఏ ఒక్కరు లేకపోయినా మన శరీరం బాధపడుతుంది. మనం అందరం పొందికగా పనిచేస్తేనే శరీరం ఆరోగ్యవంతంగా, సుఖంగా ఉంటుంది. రండి. మనం అందరం చేదోడువాదోడుగా సంఘీభావంతో కలసి మన పనులు చేసుకుందాం" అనడంతో అవయవాలన్నీ తమ తమ ప్రాధాన్యలతోపాటు ఇతర అవయవాల ప్రాధాన్యతను కూడా గుర్తించాయి. శరీరంలోని వివిధ అంగాల మాదిరిగానే ఒక కుటుంబంలో, సమాజంలో, దేశంలో వివిధ సుఖ సంతోషాలు, శాంతి భద్రతలు ఐకమత్యం మీదే ఆధారపడి ఉంటాయి.
ఒకరోజు కొందరు నావికులు సముద్రయాత్రకు బయలుదేరారు. వారు తమతోపాటు తమ పెంపుడు కోతిని వెంటబెట్టుకుని యాత్రను మొదలెట్టారు. వారు సముద్రం మధ్యలో ఉండగా ఒక భయంకరమైన ఉప్పెన వచ్చింది. ఆ ఉప్పెన ధాటికి అందరూ సముద్రంలోకి కొట్టుకుపోయారు. కోతి కూడా తాను మునిగిపోయానని అనుకునే సమయంలో ఒక డాల్ఫిన్ వచ్చి కోతిని తన వీపుపై ఎక్కించుకుంది.
కోతి, డాల్ఫిన్ ఇద్దరూ సురక్షితంగా ఒక దీవికి చేరుకున్నారు. కోతి... డాల్ఫిన్ వీపు మీది నుండి దిగి ఒడ్డుపై కూర్చుంది. డాల్ఫిన్... కోతితో, "మిత్రమా! నీకు ఈ ప్రదేశం తెలుసునా?" అని అడిగింది. అపాయం నుంచి గట్టెక్కి సురక్షితంగా ఉన్నానని రూఢీ చేసుకున్న కోతి, "ఈ ప్రదేశం నాకు తెలియకపోవడం ఏమిటి? ఈ దీవిని పరిపాలించే రాజు నాకు మంచి స్నేహితుడు. నీకోక విషయం తెలుసో లేదో! నేను ఒక రాజకుమారుడిని."
కోతి వ్యర్ధప్రెలాపనలు పేలుతోంది. ఆ దీవిలో ఒక్క జీవికూడా నివసించదని తెలిసిన డాల్ఫిన్‌కు చిర్రెత్తుకొచ్చినా సమ్యమనంతో, "ఓహో! నువ్వు రాజకుమారుడివి. కాని ఇప్పటి నుంచి నువ్వు రాజువన్నమాట!" అంది. కోతికి డాల్ఫిన్ మాటలు అర్ధంకాక "నేను రాజునెలా అవుతాను?" అని అడిగింది డాల్ఫిన్‌ను. ఒడ్డు నుంచి కోతికి అందకుండా దూరంగా వెళ్లిన డాల్ఫిన్. "చాలా సులభం. ఈ దీవిలో ఉన్న జీవివి నువ్వొక్కడివే కాబట్టి నీవే ఈ దీవికి రాజువు" అని సమాధానమిచ్చి కోతిని ఆ దీవిలోనే వదిలి వెళ్లిపోయింది.
ఒక ఊరిలో రాజమ్మ అనే ఒక వృద్ధ వితంతువు ఉండేది. ఆమె వద్ద నూరు బంగారు నాణాలు ఉండేవి. వయసు మీద పడుతుండడంతో రాజమ్మ తీర్ధయాత్రలకు బయల్దేరాలనుకుంది. ఆమె తన దగ్గరున్న బంగారు నాణాలను ఒక సంచిలో వేసి లక్కతో కట్టేసింది. ఆ నాణాల సంచిని పొరుగింటి షావుకారుకు దాచమని ఇస్తూ "అయ్యా ఒకవేళ నేను తిరిగి వచ్చినట్లయితే నా నాణాల సంచిని తీసుకుని నీ సేవకు ప్రతి ఫలంగా పది బంగారు నాణెములు ఇస్తాను. నేను రాకపోయినట్లయితే ఈ సంచి నీదే అని చెప్పింది.
రాజమ్మ వెళ్ళిన వెంటనే షావుకారు సంచిలోని నూరు బంగారు నాణాలను లెక్కపెట్టాడు. ఆ నాణాలను దక్కించుకోవాలని ఒక పన్నాగం పన్నాడు.
రాజమ్మ తీర్థయాత్రలు ముగించుకుని తిరిగి వచ్చి తన బంగారు నాణాల సంచిని ఇవ్వమని కోరగా షావుకారు సంచిని ఆమెకు అందించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, రాజమ్మ షావుకారుకు మాట ఇచ్చినట్లు పది బంగారు నాణాలు ఇవ్వడానికి సంచి బిరడా తొలగించి చూడగా, సంచిలో బంగారు నాణాలకు బదులుగా ఇనప నాణాలు ఉన్నాయి. ఆమె ఆ సంచి తీసుకుని షావుకారు దగ్గరకెళ్లి జరిగినదంతా వివరించింది. కాని షావుకారు తనకేమీ తెలియదని బుకాయిస్తూ, తనకు రావలసిన పది బంగారు నాణాలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు.
రాజమ్మ న్యాయం కోసం రాజు వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పింది.
రాజు షావుకారును న్యాయస్థానానికి రప్పించి ఏం "ఈ విషయంపై నీవేమి చెప్పాలనుకుంటున్నావు?" అనడిగాడు.
అప్పుడు షావుకారు "నాకేమీ తెలియదు మహారాజా! ఈ అవ్వ నాకు ఒక లక్కతో బిగించిన సంచిని భద్రపరచమని ఇచ్చింది. నేను తిరిగి భద్రంగా అప్పగించాను, ఇంతవరకు నాకు రావలసిన రుసుము అందలేదు" అన్నాడు.
ఇద్దరి వాదనలు విన్న రాజు సంచిని సునిశితంగా పరిశీలించాడు. సంచికి చేసిన రంధ్రం దానిని నిపుణతతో కుట్టిన క్రమం రాజును ఆలోచించేలా చేసింది. రాజు రాజమ్మను, షావుకారును రెండు రోజుల తర్వాత న్యాయస్థానంలో హాజరుకావాలని ఆదేశించాడు.
ఈ క్రమంలో, రాజు పట్టణంలోని నిపుణులైన కుట్టుపని వారిని తన ఆస్థానానికి రప్పించి వారికి ఆ సంచిని చూపించాడు. వారిలో ఒకడు ఆ సంచిని షావుకారు అడిగితే కుట్టించానని చెప్పాడు.
రెండు రోజులు గడిచిన తరవాత, రాజమ్మ, షావుకారు రాజుగారి ఆస్థానంలో హాజరయ్యారు. రాజు రాజమ్మకు అనుకూలంగా తీర్పు ఇచ్చాడు.
షావుకారు తను తప్పు చేయలేదని వాదించాడు. అప్పుడు రాజు ఆ కుట్టుపనివాడిని చూపించాడు. అంతే! షావుకారు తప్పు ఒప్పుకున్నాడు.
మొత్తం బంగారు నాణాలు రాజమ్మకి ఇవ్వవలసిందిగా షావుకారును రాజు ఆదేశించాడు. షావుకారు తనకి రావలసిన పది బంగారు నాణాలను కూడా జరిమానా రూపంలో కోల్పోయాడు. రాజమ్మ కోరిక మేరకు రాజు షావుకారుకు జైలుశిక్ష విధించలేదు.
ఒక ఊరి చివర పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు పైనుండే కాకికి, ఆ చెట్టు కింద బొరియలో ఉండే కుందేలుకి మంచి స్నేహం.
ఊరి పక్క నున్న అడవి నుండి ఒక నక్క కుందేలుని పసిగట్టి దానిని తినడానికి చెట్టు దగ్గరకు వచ్చింది. నక్కను చూడగానే కుందేలు ఒక్క ఉదుటున పొదలోకి దూరిపోయింది.
ఎప్పటికైన సరేబయటకు రాకుండాపోతుందా అని నక్క పొద దగ్గరే కూర్చుని ఆలోచించింది. 'ప్రతి రోజు కుందేలు ఆహారం కోసం ఉండలేదు. కచ్చితంగా బయటకు రావాల్సిందే! అప్పుడు దాన్ని పట్టుకుని తినచ్చు .'
ఇదంతా చెట్టుపై నుండి కాకి చూస్తూనే ఉంది. విసుగెత్తి నక్క వెళ్ళిపోతుంది అనుకుంది గాని ఎంతసేపైనా అది పొద ముందు నుండి కదలడం లేదు. ఇలాగైతే తన మిత్రుడైన కుందేలుకి ఇబ్బంది అని ఆలోచించి, కావు కావు మని అరవడం మొదలు పెట్టింది.
అంతే! ఎక్కడెక్కడి కాకులన్నీ ఆ అరుపులకు వేపచెట్టుపైకి వచ్చి చేరాయి. నక్కకి ఏమీ అర్ధంకాలేదు.
కాకి తోటికాకులకి సంగతంతా చెప్పింది. వెంటనే కాకులన్ని ఒక్కసారిగా నక్కపై దాడి చేశాయి. ముక్కులతో పొడిచి పెట్టాయి. కాకుల పోట్లని తట్టుకోలేక నక్క బతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది. మళ్ళీ ఆ వైపు రానేలేదు.
నక్క పారిపోవడంతో కుందేలు నెమ్మదిగా బొరియనుండి ఇవతలకు వచ్చింది. "నా ప్రాణాలు రక్షించినందుకు కృతజ్ణతలు మిత్రమా!" కాకి చేసిన సాయానికి కృతజ్నలు చెప్పింది కుందేలు.
రెండూ కలిసి ఎప్పటిలాగే సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండసాగాయి.
రామయ్య, సోమయ్య ఇద్దరూ ఇరుగుపొరుగు వాళ్ళు. రామయ్య పేద కుటుంబానికి చెందిన రైతు సోమయ్య పెద్ద భూస్వామి. రామయ్య ఎప్పుడూ ఉల్లాసంగా, హయిగా ఉండేవాడు. ధనం లేక పోయినా ఎంతో సంతోషంగా, సంతృప్తిగా జీవితం గడిపేవాడు.
సోమయ్య ఎప్పుడూ ఆదుర్దాగా, ఏదో ఆలోచనలో ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఏ దొంగైనా వచ్చి తన బీరువాలోని డబ్బును కాజేస్తాడేమోనని భయపడేవాడు సంతోషంగా ఉండే రామయ్యను చూసి అసూయపడేవాడు సోమయ్య.
ఒక రోజు సోమయ్య రామయ్యను పిలిచి నీవు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించు అని కొంత డబ్బు ఇచ్చాడు.
రామయ్యకు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. చీకటి పడింది. రాత్రంతా రామయ్యకు కంటి మీద కునుకులేదు. డబ్బు పెట్టె వంకే చూస్తూ కాలం గడిపాడు సోమయ్యకున్న భయం, అశాంతి ఇప్పుడు రామయ్యకు పట్టింది.
తెల్లవారగానే రామయ్య డబ్బు పెట్టెను తీసుకెళ్ళి సోమయ్యకు తిరిగి ఇచ్చి నేను పేదవాణ్ణి సోమయ్యా నన్ను ఇలాగే ఉండనివ్వు నీవు ఇచ్చిన డబ్బు నా మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తోంది. నీ డబ్బు నువ్వే తీసుకో అన్నాడు.
అనగనగా ఓ పల్లెటూరు. ఆ ఊరిలో ఒక గొప్ప ధనవంతుడు. పెద్ద భవనం... బోలెడంత మంది పనివాళ్లు... ఇంటినిండా బంధుమిత్రులతో వైభవంగా జీవించేవాడు. అ భవనానికి కొద్దిదూరంలో ఓ పేదవాడు. చిన్న పూరిగుడిసె... వారసత్వంగా వచ్చిన తోట... అందులో పండ్ల చెట్లు, పూల మొక్కలు పెంచుతూ వాటి ద్వారా వచ్చే కొద్దిపాటి ఫలసాయంతో పొట్టపోసుకునేవాడు.
ధనికుడికి ఆస్తి ఉన్నా ఆరోగ్యం లేకపోవడంతో కడుపునిండా తినడానికి, కంటినిండా నిద్రపోడానికి నోచుకోలేదు. దాంతో అసంతృప్తితో బాధపడేవాడు. పేదవాడు మాత్రం ఎంతో హాయిగా, ఆనందంగా జీవించేవాడు. అన్నీ ఉన్న తనకు లేని సంతోషం, ఏమీలేని ఆ పేదవాడికి ఎలా దక్కుతుందో తెలుసుకోవాలనుకున్నాడు ధనికుడు. దాంతో ఓ రోజు పేదవాడి దగ్గరకెళ్లి, అతడి సంతోషానికి కారణమేంటో చెప్పమన్నాడు. కష్టపడి పనిచేయడం, ఉన్నదానితో తృప్తిపడటమే తన ఆనందానికి కారణాలని చెప్పాడు పేదవాడు. ధనికుడు ఎంతో సంతోషంతో తన ఇంటికి పిలుచుకెళ్లి, విందుభోజనం పెట్టి, వెయ్యి బంగారునాణాలు కానుకగా ఇచ్చాడు.
ఆ రోజు రాత్రి ధనికుడికి కంటినిండా నిద్రపడితే, తన దగ్గరున్న డబ్బును ఎవరైనా దోచుకుపోతారేమోనన్న భయంతో పేదవాడికి కునుకే కరువైంది. దాంతో అతడు మర్నాడు ఆ డబ్బు మూటను తిరిగి ధనికుడికిచ్చి వచ్చేశాడు. ఆ రోజు యథాప్రకారం హాయిగా నిద్రపోయాడు.
అననగనగా ఒక వనము. ఆ వనంలో కాకి, పావురం, కొంగ స్నేహంగా ఉన్నాయి. ఒక రోజు ఆ మూడు ఒక పందెం కట్టుకున్నాయి. వనంలో అవి ఉన్న స్థలం నుంచీ దాదాపుగా ఓ కిలోమీటర్ దూరాన ఉన్న కొబ్బరి చెట్ల దగ్గరికి చేరాలి. ఎవరు ముందుగా చేరితే వారు పందెంలో నెగ్గినట్లు... ఆ నెగ్గిన వాళ్లు ఏం చెప్పినా మిగతా వాళ్ళిద్దరూ అలా నడుచుకోవాలనే పందెం అది.
కాకి, పావురం, కొంగ నిర్ణీత స్థలం నుంచీ ఆకాశ మార్గాన ఎగురుతూ వచ్చాయి. కొంగ ఎంతగా రెక్కలు అదిలించినా కాకినీ, పావురాన్ని దాటలేక చాలా దూరం వెనక బడింది. "పావురం మిత్రమా. మనం అతి వేగంగా చాలాదూరం ఎగిరి వచ్చాం. కొంగ మనల్ని దాటి పోవడం అసంభవం... కాసేపు మనమిద్దరం ఆ చెట్టు కొమ్మల చాటున కూర్చుని కబుర్లు చెప్పుకుందాం" అంది కాకి. "సరే అది వచ్చేలోపు మనం గమ్యం చేరుకోలేమా" అంది పావురం. ఆ రెండు పక్షులు చెట్టు మీదకి పోయాయి. ఏవేవో కబుర్లూ, ఊసులు చెప్పుకోవడంలో మునిగిపోయాయి.
కొంగ నెమ్మదిగా ఎగురుకుంటూ కొలను గట్టున ఉన్న కొబ్బరి చెట్లను చేరుకుంది ప్రశాంతంగా. అది చూసిన పావురం, కాకి పిచ్చి కబుర్లు ఆపేసి గబగబా ఎగిరి వచ్చి ఆయాసపడుతూ కొంగ చెంత వాలిపోయాయి. "మమ్మల్ని ఓడించావు కొంగ గారు. మా పిచ్చి కబుర్లూ, ఊసులే కొంపలు ముంచాయి... ఏకాగ్రతగా వచ్చి విజయం సాధించావు... నీకు అభినందనలు... "
అన్నాయి పావురము, కాకి తలదించుకొని...
చూశారా పిల్లలూ పిచ్చి కబుర్లు ఎంత నష్టం కలిగిస్తాయో...
ఒక గడ్డి మైదానంలో రెండు కోడిపుంజులు నివాసముండేవి. ఒకరోజు అవి ఆ మైదానానికి యజమానిగా ఏదో ఒకటి మాత్రమే ఉండాలనుకున్నాయి.
రెండు పుంజులూ పోటీకి ఏర్పాట్లు చేసుకున్నాయి. ఒక మంచి ముహూర్తం చూసి యుద్ధనికి సన్నద్ధమయ్యాయి. ఆ పోటీలో గెలిచిన పుంజు యజమాని హోదాని పొందుతుంది. పోరు మొదలైంది. ఆ రెండు పుంజులలో ఒకటి అత్యంత బలమైనది. కాగా మరోటి కొంత బలహీనమైనది.
కొద్దిసేపటి తరువాత బలమైన పుంజును ఎదిరించలేని బలహీనమైన పుంజు ఓడిపోయానని ఒప్పేసుకుంది.
అంతే గెలిచిన కోడిపుంజుకు సంతోషంతో పాటు గర్వం కూడా కలిగింది. "చూసావా మిత్రమా, ఇప్పుడిక ఈ మైదానానికి నేనే రాజును. నువ్వు నా బానిసవు. ఈ రోజునుండి నేను చెప్పినట్టు నువ్వు వినాలి" అని పకపకా నవ్వింది. ఆ కోడిపుంజు అంతటితో ఊరుకోలేదు. తన విజయాన్ని అందరూ గుర్తించాలనీ, ఓటమిపాలైన పుంజు అవమానపడాలనీ విలువైన ఉంగరంగంతులేస్తూ గట్టిగా అరవసాగింది. ఓడిపోయిన కోడిపుంజు తలవంచుకుని నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది.
ఆకాశంలో చాలా దూరంగా ఆహారం కోసం అన్వేషిస్తున్న ఒక గద్దకు కోడిపుంజు కేరింతలు వినబడ్డాయి. గద్ద రివ్వున ఎగురుతూ కిందకు వచ్చింది. మితిమీరిన సంతోషంలో జరగబోయే ప్రమాదాన్ని పసికట్టలేక పోయిందా కోడిపుంజు. ఇంకేముంది గద్ద దాన్ని ఎత్తుకుపోయి చంపి తినేసింది. ఓడిపోయిన కోడిపుంజే ఆ మైదానానికి యజమాని అయింది.
ధనికుడైన వృద్ధుడొకడు తన ఆస్తిని సమభాగాలుగా తన ముగ్గురు కొడుకులకూ పంచి యిచ్చాడు. కాని విలువైన వజ్రపు ఉంగరాన్ని తను వుంచుకున్నాడు. "అలా ఎందుకు చేశావు?" అన్న ప్రశ్నకు అతను ఇలా జవాబిచ్చాడు. "ఆఖరుకు నాకు మిగిలిన ఈ వజ్రపు ఉంగరాన్ని విభజించడం సాధ్యం కాని పని. కనుక నా ముగ్గురు కొడుకులలో ఎవరు నిజమైన మానవతావాదో నేను కనుగొన్నాకనే ఈ వజ్రపు ఉంగరం వాడికి దక్కుతుంది". అతని ముగ్గురు కొడుకులూ మూడు త్రోవలలో వెళ్ళారు. కాలం అతి వేగంగా సాగిపోయింది. అతను నిర్ధారించిన సమయం ఆసన్నమైంది. ముగ్గురు అన్నదమ్ములూ తండ్రి యింటికి మరలి వచ్చారు. ఒక్కొక్కడూ తన మానవతా చర్యలను చెప్పుకోసాగాడు.
వారిలో జ్యేష్టుడు ఇలా మొదలుపెట్టాడు, "నాన్నా! విను. ఒక రోజు నా దగ్గరకు ఒక అపరిచితుడు వచ్చాడు. తన ధనాన్ని అంతా నాకు అప్పగించి, తను తిరిగి వచ్చేంత వరకు దాన్ని భద్రంగా వుంచుకోమని కోరాడు. నేను సరే అన్నాను. రాసి యిచ్చిన పత్రంలా నా మాటను అతను స్వీకరించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులయ్యాక అతను తిరిగి వచ్చి తన డబ్బునిమ్మన్నాడు. నేను దానిని నా దగ్గర వుంచేసుకునేవాణ్ణే, కాని నిజమైన మానవతావాదిని కాబట్టి ఆ డబూ వడ్డీతోసహా కూడా చేర్చి అతనికి అప్పగించాను. కాబట్టి ఇప్పుడు నీవే చెప్పు, ఆ వజ్రాల వుంగరానికి నేను తగినవాణ్ణే కదా!" అన్నాడు. వృద్ధుడు ఇలా అన్నాడు "కాని అబ్బాయీ, లోకంలో అంతరాత్మ వుండే వ్యక్తులు చేసినట్లే నువ్వు కూడా చేశావు" అన్నాడు.
ఇక రెండో కొడుకు ప్రారంభించాడు. "నా సముద్ర యానంలో వానా, వురుములతో సహా పెనుతుఫాను చెలరేగింది. ఆ తరుణంలో ఓడ పైభాగం మీద ఒంటరిగా నుంచున్న ఒక అమాయకుడైన బిడ్డ తూలి లోతైన సముద్రంలో పడిపోయాడు. ఆ బిడ్డను కాపాడాలని ఎవ్వరూ అనుకోలేదు. కాని నిజమైన మానవతావాదినైన నేను మాత్రం భయంకరంగా విజృంభించే కెరటాలలోకి దూకి ఒక అమాయకుడైన బిడ్డను రక్షించాను. నాన్నా, ఇప్పుడు చెప్పు, నేను యదార్థమైన మానవతా వాదినే కదా" అన్నాడు. దానికి ఆయన తండ్రి "మంచి పనే చాశావు నాయనా! నీ జీవితాన్నే నీవు లక్ష్యపెట్టక తెగించావు. అది చాలా ఘనకార్యమే. కాని పిరికిపందకానివాడు, ఎవరైనాసరే సరిగ్గా అలాగే చేసేవాడు" అన్నాడు.
ఆఖరి కొడుకు తన అనుభవాన్ని యిలా చెప్పసాగాడు, "నాన్నా! నేను గొర్రెల మందకు కాపరిగా ఉండేటప్పుడు చల్లని గాలి నా శత్రువులు నిద్రపుచ్చింది. ఆ సుఖనిద్రలో ఏటవాలుగా వుండే చోటుకు అతను దొర్లిపోయాడు. ఇంక కొంచెం దొర్లితే అతను తప్పక చనిపోయేవాడే. నేను అక్కడకు అతన్ని పోనివ్వలేదు. అతను నా శత్రువైనా అతన్ని లేపి ఆసన్న విపత్తునుండి అతన్ని రక్షించాను" అని ముగించాడు. అతని తండ్రి గర్వంగా సంతోషిస్తూ "అబ్బాయీ! నీవు అత్యంత ఘనమైన కార్యాన్ని చేశావు, శత్రృత్వాన్నీ, పగనూ మనస్సు నుండి బహిష్కరించడానికి అత్యంత గొప్ప హృదయం అవసరం. నీవే నిజమైన మానవతాభిమానివి. నిస్సందేహంగా ఈ వజ్రపు ఉంగరం నీకే చెందాలి" అని ఆ ఉంగరాన్ని తన చిన్న కొడుక్కి బహూకరించాడు.
ఒక ఊరిలో నలుగురు స్నేహితులు చేరి ఉండేవారు. సమాన లక్షణాలున్న వారందరూ ఒకే చోట చేరటం సహజం. వీరందరూ గర్భ దరిద్రులు. నిలవడానికి నీడ లేకుండా ఒక పూట తింటే మరోపూట పస్తుండేవారు. నలుగురూ ధనం సంపాదిద్దామనే ఆశయంతో విశాల ప్రపంచంలోకి బయలుదేరారు. ఊరు వదిలి కృష్ణా నది గట్టు మీద ప్రయాణం సాగించారు. కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత ఒక చోట జడలుకట్టుకు పోయిన జుట్టుతో ఒక సన్యాసి వీరి కంటబడ్డాడు. ఆ సన్యాసికి వారు సాష్టాంగ దండ ప్రణామంచేసి తమ కోరికను అతడితో విన్నవించుకున్నారు. యోగ శక్తితో తమకు సహకరించమని వేడుకున్నప్పుడు ఆ సన్యాసి వారికొక జ్యోతిని ఇచ్చి "ఈ జ్యోతిని మీ చేతులలో పెట్టుకుని మీరు హిమాలయ పర్వతాల వైపుకు బయల్దేరి వెళ్ళండి. చేతిలో జ్యోతి ఎక్కడ అడితే అక్కడ భూమిని త్రవ్వండి. మీకు కావలసినంత ధనం లభిస్తుంది" అని చెప్పాడు.ఆ నలుగురు ఆ జ్యోతి పట్టుకుని హిమాలయ కొండలవైపు బయలుదేరారు. ఒకచోట ఆ జ్యోతి చేతులలోనుంచి పడిపోయింది. సన్యాసి వారికి చెప్పినట్టుగా అక్కడ భూమిని లోతుగా త్రవ్వారు. అది ఒక పెద్ద రాగి గని. ఆ నలుగిరిలో ఒకడు తనకు కావలసింది తీసుకుని దానో తృప్తిపడి వెనకకు మరలిపోయాడు. మిగిలిన ముగ్గురూ జ్యోతిని పట్టుకుని యధాప్రకారం తిరిగి ప్రయాణం సాగించారు. మరొక చోట జ్యోతి జారి పడిపోయింది. అక్కడ త్రవ్విచూశారు. అదో పెద్ద వెండి గని. ఆ ముగ్గురిలో ఒకడు ఆ వెండితో తృప్తి చెంది ఇంటికి వెళ్ళాడు. మిగిలిన ఇద్దరూ ఇంకా ఉత్తమోత్తమమైనది దొరుకుతుందేమోనని బయల్దేరి నడక ప్రారంభించారు.
మూడోసారి జ్యోతి పడిపోయింది. వీరిద్దరూ శ్రమపడి తవ్వారు. బంగారం! అదో బంగారు గని. మూడో స్నేహితుడు దాంతో బాగా తృప్తిపడ్డాడు. ఇంక నాలుగోవాడు అత్యాశతో మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. వజ్రాలు, రత్నాలు లభిస్తాయని ఆశించాడు. ప్రయాసతో బహుదూరం ప్రయాణించాడు. కొంతదూరం వచ్చేటప్పటికి ఒక చోట ఒక మనిషి తల మీద పెద్ద చక్రం గిరగిర తిరుగుతూవుంటే అక్కడ ఆగి "ఇదేమిటి నీ తల మీద ఆ చక్రం అలా తిరుగుతూంది?: అని అడిగాడు. ఆ పెద్ద మనిషి "మొదట ఈ చక్రాన్ని నీ తల మీద పెట్టుకో. తరువాత కథ చెబుతాను" అన్నాడు. దీనికి నాలుగోవాడు ఒప్పుకున్నాడు. కథ విందామని ఆ చక్రాన్ని తన తల మీదికి పెట్టనిచ్చాడు. ఆ పెద్ద మనిషి కథ చెప్పడం ప్రారంభించాడు. "నేనూ నీలాగే ఈ సౌభాగ్య జ్యోతిని పట్టుకుని ఇంతవరకూ వచ్చాను. నేనూ ఎంతో ఆశపడ్డాను. నేను దొరికిన రాగితో తృప్తి పడలేదు. దొరికిన వెండితో తృప్తిపడలేదు. నేను ఇక్కడ ఒక వ్యక్తిని చూశాను. ఈ చక్రం అతడి తల మీద గిరగిరా తిరుగుతూంది. నీలాగే నేనూ ఈ చక్రంలో తల దూర్చాను. ఇటివంటి తప్పు ఇంకొకడు చేసి నీకు విముక్తి కలిగించే వరకు ఈ చక్రం నీ తల మీద ఇలా తిరుగుతూనే ఉంటుంది" అని చెప్పి వెళ్ళిపోయాడు.
అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో సౌరభూడు (అసలు కథలో పేరు గుర్తు లేదు ప్రస్తుతానికి సౌరభుడు అని అనుకుందాం) అందరితో పాటే వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. కానీ అప్పుడప్పుడూ ఆశువుగా కవిత్వం చెప్పేవాడు. విన్న నలుగురూ బాగుంది, బాగుంది అనేవారు. అలా మొదలై ప్రతి రోజూ మద్యాహ్నం భోజనం వేళ ఇతను కవిత్వం చెప్పడం తోటి వారంతా చేరి బాగు బాగు అనడం ఓ దినచర్యలా మారిపొయింది.
ఒకరోజు దూరపు బంధువు ఒకతను ఏదో పనిమీద ఈ ఊరు వచ్చి మన సౌరభూడి ఇంటిలో దిగాడు. సౌరభూడి కవిత్వం గురించి విని మద్యాహ్నం తనుకూడా తీరిక చేసుకొని విన్నాడు. విని బాగుంది అని చెప్పి, ఊరకుండకుండా ఇలా అప్పుడప్పుడూ కవిత్వం చెప్పకపోతే ఏదన్నా పుస్తకం వ్రాయరాదు అని ఓ ఉచిత సలహా ఇస్తాడు.
దానికి సమాధానంగా సౌరభుడు తను ఎంతోకాలం నుండి వ్రాస్తూ పూర్తికావచ్చిన 'దేవపరిణయం' అనే పుస్తకాన్ని ఇంటికి వెళ్ళాక చూపిస్తాడు. దాన్ని చదివిన పెద్దాయన చాలా సంతోషించి రాజాశ్రయం పొందితే కవిత్వం ఇంకా రాణిస్తుందని చెప్పి ఒకసారి తనతో పాటు రమ్మని తన ప్రక్కింటిలోనే రాజకవి ఉంటాడని పిల్చినాడు.
ఇంటిలోని వారు, పొరుగువారు కూడా వచ్చినాయనకే వంతపాడేసరికి సౌరభుడు అతనితో పాటు బయలుదేరి రాజధాని చేరతాడు.
పక్కింటాయనే కాకుండా రాజకవి మన సౌరభుడి చుట్టానికి మంచి మిత్రుడు కూడా! అతన్ని కలుసుకొని తన పుస్తకం చూపిస్తాడు. మొత్తం ఓపిగ్గా చదివిన రాజకవి కొన్ని మార్పులూ, చేర్పులూ సూచిస్తాడు. అవి అన్నీ చేసి రాజుగారికి వినిపించి మంచి బహుమతి మెచ్చుకోళ్ళు పొందుతాడు.
తరువాత అందరూ అక్కడనే ఉండి మంచి మంచి కవిత్వం వ్రాయమని అడుగుతారు, కానీ వినకుండా ఇంటికి వెళ్ళి తన పుస్తకాన్నీ, బహుమతులను ముందేసుకొని బావురుమంటాడు. తను వ్రాయాలనుకున్నది ఒకటి చివరికి మార్పులూ, చేర్పులు తరువాత ఆత్మలేని శరీరంలా తయారవుతుంది. ముగింపు కూడా తను అనుకున్నది ఒకటి అక్కడ వ్రాసినది మరొకటి.
ఒక గురువుగారు, ఆయనకిద్దరు శిష్యులు. శిష్యులు స్వతహాగా మంచివారే కానీ కొంచెం అమాయకులు, మరి కొంచెం తెలివితక్కువ వారు. ఒకడి పేరు రామ, మరోకడి పేరు సుధామ. వారి ప్రవర్తన గురువుకు అప్పుడప్పుడు చాలా తలనొప్పిగా తయారయ్యేది. అయినా సరే ఆయన వాటన్నింటిని సహిస్తూ వారికి కొంతైనా విద్య ఒంటబట్టాలనే ఉద్దేశ్యంతో తన దగ్గరే ఉంచుకున్నాడు.
ఒకరోజు గురువుకి కాస్త ఒంట్లో నలతగా ఉండి కాస్సేపు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. శిష్యులను పిలిచి, "రామా, సుధామా! నాకు ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉన్నాయి. మీరిద్దరు నా కాళ్ళు నొక్కాలి నేను కొంచెంసేపు నిద్రపోతాను." అన్నాడు.
గురువుగారికి సేవ చేసే అవకాశం రావడంతో శిష్యులకు చాలా సంతోషం కలిగింది. "తప్పకుండా గురువుగారు!" ఎంతో ఉత్సాహంగా అన్నారు.
రామ, సుధామ గురువు చెరో కాలు తమ ఒళ్ళో పెట్టుకుని ఎంతో ప్రేమతో కాళ్ళు నొక్కసాగారు. కొంచెంసేపు తరువాత నిద్రలో గురువు రెండు కాళ్ళు దగ్గరకు తీసుకోవడంతో రామ ఒత్తుతున్న కాలు సుధామ దగ్గరున్న కాలికి తగిలింది.
"ఏయ్ రామా, నీ కాలును దూరంగా ఉంచు. లేకపోతే బాగోదు." అన్నాడు సుధామ కోపంగా.
"పోవోయ్, నీదేమైనా గొప్పకాలా? ఛండాలమైన కాలు. నువ్వే నీ కాలును దూరంగా ఉంచుకో" అని జవాబిచ్చాడు రామ.
సుధామ ఇంకోమాటన్నాడు. దానికి రామ ఇంకోలా జవాబిచ్చాడు. ఈ విధంగా వాదన కాస్త పోట్లాటలోకి మారిపోయింది. ఒకడు కాలిని నరికేస్తానంటే మరొకడు నిప్పుతో తగలెడతానని అన్నాడు. అంతే రామ కోపంగా వంటింటి వైపు పరిగెత్తి మండుతున్న కట్టెను తీసుకుని వచ్చాడు. సుధామ బయటకు పరిగెత్తి గొడ్డలి పట్టుకుని వచ్చాడు.
ఈ గందరగోళానికి గురువుకు మెలుకవ వచ్చి చూస్తే ఏముంది? ఆయన్ని తగలబెట్టడానికి, నరకడానికి ఇద్దరు శిష్యులు యమదూతల్లా నిలబడి ఉన్నారు.
"ఒరేయ్ నాయనల్లారా ఏమిటిరా ఇది!" కంగారుగా పైకి లేచాడు గురువు. జరిగింది తెలుసుకుని ఇద్దరిని బాగా చివాట్లు వేసాడు.
రాఘవరావుగారు కూతురును చూడటానికి పట్నం నుండి వచ్చారు. ఆయన కర్నూలు జిల్లాలో హెడ్‌మాస్టర్. తాతగారిని చూసి పరుగున వచ్చాడు పవన్. మనవడిని ఎత్తుకొని ముద్దాడుతూ ఇంట్లోకి నడిచాడు రాఘవరావుగారు. అమ్మా! అమ్మా! తాతయ్య వచ్చాడు. అరిచాడు పవన్. శైలజ కిచెన్ రూం నుండి బయటికి వచ్చి తండ్రిని క్షేమసమాచారాలడిగింది. అనంతరం అల్లుడుగారింకా రాలేదా? అడిగారాయ
ఆఫీస్ టైం అయిపోయింది కదా! వస్తుంటారు నాన్నా అని చెప్పింది శైలజ. మనువడితో ఆడుకుంటూ కబుర్లలో పడ్డాడు రాఘవరావుగారు. తండ్రి కోసం పవన్ మనసు ఎదురుచూస్తుంది. ఆఫీస్, దారి కబుర్లు పూర్తి చేసుకొని రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చాడు రంగనాథం. రాగానే పరుగున వెళ్ళి తండ్రి చేయి పట్టుకున్నాడు పవన్. అలసటగా వున్న రంగనాథం చేయి విడిపించుకున్నాడు. మామగారిని చూసి క్షేమసమాచారాలు అడిగాడు. టవల్ తీసుకొని బాత్‌రూం వైపు నడిచాడు. తండ్రి తనను ఎత్తుకోవాలని ఎంతో ఆశగా పరుగెత్తుకుంటూ వచ్చిన పవన్ మనసు నిరాశతో గిలగిలలాడింది.
రంగనాథం డ్రస్ చేంజ్ చేసుకొని వచ్చాడు. అలసటగా కుర్చీలో కూర్చున్నాడు. టి.వి. ఆన్ చేసాడు. పవన్ పలక చేత పట్టుకొని పరుగున వచ్చాడు. పలకలో ఓ సున్నా చుట్టి, దానికి రెండు కళ్ళు, ముఖం, చెవులు పెట్టాడు. నాన్నా! నాన్నా! నేను బొమ్మ గీశాను చూడు అన్నాడు. రంగనాథం టి.వి పై నుండి చూపు మరల్చలేదు. పలకలోకి చూడకుండా ఎబిసడిలు రాసుకోకుండా ఈ బొమ్మలేంటి? వెళ్ళి ఎబిసిడిలు రాయి వెళ్ళు అన్నాడు చెంపలు నిమిరి. తాను గీసిన బొమ్మ చూసి నాన్న మెచ్చుకుంటాడని ఆశ పడిన పవన్ ముఖం చిన్నబోయింది. మెల్లగా వెళ్ళి గోడవారగా కూర్చున్నాడు. ఎబసిడిలు వచ్చినవన్నీ రాసాడు. నాన్నా నాన్నా! ఎబసిడిలు రాశాను అంటూ ఉత్సాహంగా వచ్చాడు. తాతయ్యకు చూపించు అన్నాడు రంగనాథం. ఉరకలు వేసే ఉత్సాహం చచ్చుబడిపోయింది. చేసేది లేక ముఖం చిన్నబుచ్చుకుని తాతయ్య దగ్గరకెళ్ళి కూర్చున్నాడు. రాత్రి భోజనాలయ్యాక టి.వి లో వార్తలు వింటున్నాడు రంగనాథం. పవన్ వచ్చాడు. నాన్నా! నాన్నా! కథ చెప్పవా? గడ్డం పట్టుకుని లాగుతూ అడిగాడు. "కథకు కాళ్ళులేవు. ముంతకు చెవుల్లేవు పడుకోకన్నా" అన్నాడు రంగనాథం. పవన్ కథ చెప్పమని గడ్డం పట్టుకులాగుతున్నాడు. వార్తలు వినాలి. చెబుతుంది నీక్కాదా విసిగించకు వెళ్ళి పడుకో! లేకుంటే పిచ్చోడికి పట్టిస్తా అన్నాడు. అంతా గమనిస్తున్న రాఘవరావుగారు అల్లుడూ వాడికి కథ చెప్పు అన్నారు.
అదేంటి మామయ్యా! వాడేదో పిల్ల తనం కొద్దీ కథ చెప్పమంటున్నాడు. అలాగని కథలు చెబుతూ కూర్చోవటమేనా? అంత తీరికెక్కడుంది. అన్నాడు రంగనాథం. వచ్చినప్పటి నుండీ గమనిస్తున్నాను. నువ్వు వాడిని నిర్లక్ష్యం చేస్తున్నావు అన్నారు రాఘవరావుగారు. నేను వాడిని నిర్లక్ష్యం చేయటమేమిటి? వాడు నాప్రాణం. వాడికి పదిహేను జతల బట్టలు తెచ్చాను. కోరిన తినుబండారాలు కొనిచ్చాను. వందలకొద్దీ ఫీజ్‌తో స్కూల్లో చేర్చాను. వాడికేంతక్కువైంది? అన్నాడు రంగనాథం. వాడికి అన్నీ అమర్చావని నీ వనుకుంటున్నావు. సంతృప్తి పడుతున్నావు కానీ, వాడి ఒంటరితనాన్ని దూరం చేసే నీ ప్రేమ మాత్రం వాడికి లేదు అన్నారు రాఘవరావుగారు. వాడు నా ప్రాణం. వాడిపై నాకు ప్రేమలేక పోవడమేమిటి మావయ్యా? ఆశ్చర్యంగా అడిగాడు రంగనాథం.
రాఘవరావుగారు అల్లుడి మాటలకు నవ్వి, పిల్లలకు తల్లిదండ్రులతో కబుర్లు చెప్పాలని ఉంటుంది. తాము రాసిన అక్షరాలు, బొమ్మలు చూపి మెప్పుపొందాలని ఉంటుంది. కథలు వినాలని ఉంటుంది. తల్లిదండ్రులతో ఆడుకోవాలని ఉంటుంది. కానీ మనం యాంత్రిక జీవితంలో పడి పట్టించుకోము. వారికేలోటు చేయలేదనుకుంటాం. వాళ్ళ మనసులో బాథ మనకర్థం కాదు. వాళ్ళ ఒంటరితనాన్ని గుర్తించలేము. వాళ్ళ ఉత్సాహాన్ని అల్లరి అంటాం. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గదమాయిస్తాము, భయపెడతాము. వాళ్ళ ఉరకలు వేసే ఉత్సాహాన్ని ఆనకట్ట వేస్తాము. తెలుసుకోవాలనే ఉత్సుకతను ఆదిలోనే నరికేస్తాం. ఎన్నో పనులతో అలసిపోయామంటాము. కానీ పిల్లల సమక్షంలో అలసట తీర్చుకోవచ్చని మనకు తెలియదు. పని, స్నేహితులు, ఊరి రాజకీయాలు, అనవసర కబుర్లు, టి.వి కోసం కేటాయించే సమయంలో కొంత టైం కూడా పిల్లలకోసం వినియోగించలేము. వారితో కలిసి కబుర్లు చెప్పలేం, ఆడలేం. వాళ్ళని మానసికంగా ఒంటరిని చేస్తాం. వాడికన్నీ అమర్చామనుకుంటాం. ఇదీ మనం పిల్లల కోసం చేస్తున్న త్యాగం అన్నారు.
ఆయన మాటల్లోని యదార్థం అర్థమయ్యి రంగనాథం ఉలిక్కిపడ్డాడు. నన్ను క్షమించండి మామయ్యా! మీరు చెప్పింది అక్షరాలా నిజమే! అంటూ తాత పక్కన నిద్రలోకి జారుకున్న బాబు వైపు నడిచాడు రంగనాథం.
ఒకరోజు సభలో అక్బర్ చక్రవర్తి బీర్బల్‌ను ఈ విధంగా ప్రశ్నించాడు. "ఒక వ్యక్తి ఒకే సమయంలో బీదవాడు మరియు గొప్పవాడుగా గుర్తింపు పొందడం సాధ్యమవుతుందా?"
"సాధ్యమవుతుంది ప్రభూ" అని చెప్పాడు బీర్బల్. " అలాగా! అయితే అలాంటి వ్యక్తిని నాకు చూపించగలవా?" . "తప్పకుండా చూపిస్తాను ప్రభూ" అని బీర్బల్ సభ నుండి బయటకు వెళ్ళి పోయాడు. కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తిని వెంటబెట్టుకుని సభకు తిరిగి వచ్చాడు. "ఇతను కడు బీదవాడు ప్రభూ! బిచ్చ మెత్తుకుని జీవిస్తాడు" బీర్బల్ ఆ వ్యక్తిని అక్బరు ముందు నిలబెడుతూ చెప్పాడు.
"ఆ విషయం చూస్తేనే అర్ధం అవుతోంది. మరి ఇతను గొప్పవాడు ఎలా అవుతాడు?" ఆసక్తిగా అడిగాడు అక్బరు. "ఒక చక్రవర్తితో పాటు ఇతను కూడా ప్రజల ముందు సత్కారాన్ని పొందగలిగితే, ఇతను తన బిచ్చగాళ్ళ మధ్య గొప్పవాడిగా గుర్తింపు పొందుతాడు" అన్నాడు బీర్బల్.
బీర్బల్ చాతుర్యానికి అక్బరు చక్రవర్తి ఎంతో ఆనందించాడు.
అభిమానం చాలా చిత్రమైనది. ప్రేమ గుడ్డిది అంటారు. అలాగే ఈ అభిమానం కూడా గుడ్డిదేనని చెప్పాలి. కత్తి పండ్లు కోసుకొని తినడానికే పనికి వస్తుంది.అలాగే ఆ అభిమానం మనుషుల మధ్య అనుబంధానికి దారి తీస్తుంది. మనుషుల పతనానికీ దారి తీస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ! "అతి సర్వత్రావర్ష్యమేత"అని అన్నారు పెద్దలు. మంచి అయినా, చెడ్డ అయిన ఒక స్థాయివరకూ పరవాలేదు. ఆ స్థాయి దాటితే ముప్పు తప్పదు కదా. అటువంటి సమయాల్లో తమని అభిమానించే వారిని పెడదోవ పెట్టనీకుండా సరైన సలహా ఇచ్చి, వారిని సక్రమమైన మార్గంలో పయనించేలా చూడాల్సిన బాధ్యత అభిమానింపబడే వారిలోనూ వుంది. అందుకు ఉదాహరణే ఈ కథ.
పదవ తరగతి చదువుతున్న మహేష్‌కు రచయిత చక్రపాణి గారంటే చాలా ఇష్టం. చక్రపాణి గారి కథలను, నవలలను విడవకుండా చదువుతాడు. చక్రపాణిగారిని చూడాలని మఖాముఖి మాట్లాడాలని ఎంతో ఆశగా ఉండేది మహేష్‌కి. ఆయన ఉండేది హైదరాబాదులో కాబట్టి అక్కడికి వెళ్ళేంత డబ్బు తన వద్ద లేదు కాబట్టి, తల్లిదండ్రులను అడిగినా ప్రయోజనం వుండదు కనుక ఊరకుండిపోయాడు.
అదృష్టవశాత్తు చక్రపాణిగారు ఆ ఊరిలో జరిగే ఓ సభకు ముఖ్య అతిథిగా వస్తున్నారు అని తెలుసుకున్నాడు మహేష్. తన అభిమాన రచయిత తన ఊరు వస్తున్నందుకు కలిసి మాట్లాడబోయే అవకాశం కలుగుతున్నందుకు ఎంతో సంతోషించాడు. కానీ వెంటనే మరుసటి రోజు నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, అలాంటి రోజుల్లో తల్లిదండ్రులు తనను బయటకురానీయరని గుర్తుకొచ్చి తనలోతానే బాధపడ్డాడు.
ఏది ఏమైనా తల్లిదండ్రులకు మస్కాకొట్టి సభ జరిగే చోటికి వచ్చి చక్రపాణిగారిని చూసి, ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైతేనేం ఆ రోజు తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి బయట పడ్డాడు. కార్యక్రమం జరిగే వేదిక వద్దకు చేరుకున్నాడు.
సభ పూర్తయిన తరువాత ఒంటరిగా ఉన్న సమయంలో చక్రపాణిగారి దగ్గరకు వెళ్ళాడు మహేష్. ఆయనకు నమస్కరించి, తనను పరిచయం చేసుకున్నాడు. "సార్! నేను ఈ ఊరి హైస్కూల్లోనే టెన్త్ క్లాస్ చదువుతున్నాను. మీరంటే చాలా ఇష్టం. అందుకే రేపు పరీక్షలైనా చదవాల్సిన బుక్స్ ప్రక్కన పెట్టి మిమ్మల్ని చూడటానికి వచ్చాను" అని గొప్పగా చెప్పాడు.
మహేష్ చివరిమాటలు విని ఎంతో బాధపడ్డారు చక్రపాణిగారు. అది గమనించిన మహేష్, "ఏంటిసార్! అలా ఉన్నారు" అని అడిగాడు.
"బాబూ మహేష్ నీవు నా అభిమానివైనందుకు సంతోషం. కానీ ఇప్పుడు నీవు చేసిన పని బాగులేదు. ఎందుకంటే ఈ వయస్సులో నీకు చదువు ముఖ్యం. ఇక ముందు ఇలాంటి పని చేయకు. నీవు బాగా కష్టపడి చదివి, ప్రయోజకుడివి అయితే నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. నీలాంటి అభిమానుల్ని సంపాదించుకున్నందుకు, నేనూ గర్వపడతాను" అని చెప్పారు చక్రపాణిగారు.
ఆయన మాటలను ఆలోచిస్తూ తానుచేసింది తప్పేననిపించింది మహేష్‌కి. వెంటనే ఇకముందు ఇలాంటి పనులు చేయనని చక్రపాణిగారికి మాట ఇచ్చి, ఇంటికొచ్చి చదవటంలో నిమగ్నయ్యాడు మహేష్.
ఒక గ్రామములో సుశీల అనే ఆమెకి, సురేష్ అనే కొడుకు ఉన్నాడు. అతను చిన్నతనములో ఒకనాడు పక్కవారింటిలో నుంచి తోటకూర దొంగిలించి తీసుకొచ్చి తల్లికి ఇచ్చెను. దానికి ఆమె ఆప్యాయంగా కౌగిలించుకొని మానాయనె! అని మెచ్చుకొన్నది. అది ఏదో ఘనకార్యము అన్నట్లుగా ఆ పిల్లవాడు చాలాబాగున్నదని తలచి ఇరుగుపొరుగు వాళ్ళ ఇంటిలో నుంచి వస్తువులు తీసుకురావడము మొదలుపెట్టాడు. తల్లి తప్పని కూడా మందలించలేదు. అదే అవకాశంగా తీసుకొని రోజూ స్కూలులో, తనతోటి పిల్లల దగ్గర పెన్ను గానీ, పెన్సిల్ గానీ, పుస్తకం గానీ, దొంగతనముగా తీసుకురావడము మొదలు పెట్టాడు. క్రమంగా పెరిగి పెద్దవాడైయ్యేటప్పటికి గజదొంగగా మారి అనేక వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఒక రోజు రక్షక భటులు ఇతన్ని పట్టుకొనిపోవుచూండగా అతని తల్లి "అయ్యో! తోటకూర నాడే ఇది తప్పని చెప్పలేక పొయానే! చెప్పినట్లయితే తన కొడుకు ఇలాంటి వాడు కాక పోవును కదా" అని దుఖించింది. కావున ఎప్పుడూ దొంగతనము చేయరాదు.
అది బస్టాండ్. ప్రయాణికుల అరుపులు, పాప్‌కార్న్ అమ్మే కుర్రాళ్ళ కేకలతో గందరగోళంగా ఉంది. ఇంతలో చేతిలో బ్రీఫ్‌కేస్‌తో బస్‌స్టాండ్‌లోకి అడుగుపెట్టాడు నవీన్. కళ్ళకు గ్లాసులు, మెడలో గోల్డ్‌చెయిన్, సఫారీ డ్రస్‌తో నవీన్ చాలా అందంగా ఉన్నాడు. తను ఎక్కబోయే బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో బాబూ అన్న పిలుపుకు పక్కకి తిరిగి చూసాడు నవీన్. తనకెదురుగా కొంచెం దూరంలో ఒక ముసలివాడు, మాసిన గడ్డం అక్కడక్కడ చిరిగిన బట్టలతో అసహ్యంగా ఉన్నాడు. ఏమిటి అంటూ నిర్లక్ష్యంగా ముసలాయన వైపు చూసాడు నవీన్. బాబూ గూడెం బస్సు ఇక్కడే కదా ఆగేది అన్నాడు. ఆ ప్రశ్నకు అవునంటూ ముక్తసరిగా సమాధానం చెప్పి మరో వైపు ముఖం తిప్పుకున్నాడు నవీన్. మళ్ళీ బాబూ! అంటూ పిలిచాడు అదే ముసలాయన. ఏమిటన్నట్లు అసహ్యంగా ముఖం పెట్టి కళ్ళతోనే ప్రశ్నించాడు నవీన్.
నవీన్ చూపులకు బయపడ్డ ముసలాయన ఈ బస్సు జంక్షన్లో ఆగుతుందిగా బాబూ అన్నాడు. ఆ ఆగుతుందిలే అంటూ మరో వైపు ముఖం పెట్టాడు. నవీన్ శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు. అలాంటి నవీన్ అపరిశుభ్రంగా ఉన్న ముసలాయనతో మాట్లాడటం అంటేనే అదోరకంగా ఫీలవుతున్నాడు. అదీగాక ఈ బస్‌స్టాండ్‌లో ఇంతమంది ప్రయాణికులుండగా పనిగట్టుకొని తననే అడుగుతున్నందుకు మనసులోనే తిట్టుకోసాగాడు. ఇంతలో గూడెం బస్ వచ్చి పాయింట్‌లో ఆగింది. బిల బిలమంటూ వచ్చిన జనం బస్సులో ఎక్కడానికి ఒకర్నొకరు తోసుకుంటూ నానాయాతన పడుతున్నారు. కొందరైతే బస్సు కిటికీ గుండా చేతిరుమాళ్ళు, బ్రీఫ్‌కేసులు వేసి సీటులు రిజర్వ చేసుకుంటున్నారు. నవీన్ కూడా కిటికీ గుండా బ్రీఫ్‌కేస్‌ను ఓ సీటులో పెట్టి అందరూ ఎక్కిన తరువాత ఎక్కవచ్చులే అని మనసులో అనుకుని క్రిందే ఉండి చుట్టూ పరిశీలించసాగాడు.
కొన్ని క్షణాల అనంతరం బస్సు లోపల నుండి బాబూ! ఇదిగో బాబూ మిమ్మల్నే అంటూ గట్టిగా అరవడంతో బస్సు వైపు చూసాడు నవీన్. నల్ల బనీను ధరించిన ఓ వ్యక్తిని గట్టిగా పట్టుకొని అరుస్తున్నాడు ఇంతకు మునుపు తను చూసిన ముసలాడు. జరిగిందేమిటో అర్థంకాని నవీన్ ఒక్క ఉదుటున బస్సులోకి దూసుకుపోయాడు. బస్సులోకి వెళ్ళిన నవీన్ దృష్టి నల్ల బనీను వ్యక్తి చేతిలో ఉన్న తన బ్రీఫ్‌కేస్ మీద పడింది. అంటే వీడు దొంగన్న మాట. అని మనసులో అనుకొని ఆ దొంగపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. నవీన్ రావడంతో పాపం ముసలాయన రొప్పుతూ దొంగని వదిలేసాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ జరుగుతున్న గొడవ చూసి బస్సులో కొచ్చాడు. జరిగింది తెలుసుకొని ఆ దొంగని లాఠీతో కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్ళాడు.
ఇంతలో నవీన్ దృష్టి బస్సు రాడ్‌కు ఆనుకొని ఆయాసంతో రొప్పుతున్న ముసలాయన మీద పడింది. పాపం అతని బట్టలు చూసి ఇంతవరకూ తను అసహ్యించుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. కానీ అవేమీ పట్టించుకోని ఆ ముసలాయన తనకు చెప్పలేనంత సహాయం చేసాడు. తనే ఆ దొంగని గమనించి పట్టుకోకపోతే బ్రీఫ్‌కేస్‌లో ఉన్న తన స్టడీ సర్టిఫికేట్స్, రెండువేలరూపాయల డబ్బు, బట్టలు అన్నీ తను పోగొట్టుకొని ఉండేవాడు. అందుకే తను చేసిన తప్పును తెలుసుకొని ఆ దేవుడి ఋణం తీర్చుకోవాలి అని మనసులో అనుకొని ఆయాసంతో రొప్పుతున్న ఆ ముసలి వ్యక్తిని చేత్తో గట్టిగా పట్టుకొని, చూడు తాతా! నీకు చాలా నీరసంగా ఉంది కదూ! నా సీట్లో కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకొందువుగానీ రా తాతా! అంటూ తీసుకెళ్ళి తన సీట్లో కూర్చోబెట్టాడు.
సాధు జంతువైన ఎద్దును ఒక సింహం తరుముతూ వచ్చింది. ప్రాణభయంతో ఎద్దు కొన్ని మైళ్ల దూరం పరిగెత్తంది. ఏమి చేయాలో పాలు పోక, తరుముకొస్తున్న మృగరాజు నుండి తప్పించుకోవడానికి ఒక గుహలోకి చొరబడింది. ఆ గుహ ఒక పొగరుబోతు పొత్తేలు నివాసం. దృఢమైన శరీరం, వాడియైన కొమ్ములు ఏ జంతువుకూ ఉండవని దాని భ్రమ, గుహలోకి చొరబడిన ఎద్దును చూసి పొట్టేలు ప్రాణభయంతోఎందుకొచ్చావంటూ కొ్మ్ములతో పొడవడం ప్రారంభించిది. ఎద్దు ఎంత వారించినా పొట్టేలు వినలేదు సరికదా నా కొమ్ములు పోట్లు కాచుకో అంటూ మరింతగా పొడవడం మొదలు పెట్టింది.
అప్పటికే అలసిపోయిన ఎద్దు పొటేలు దుడుకుతనాన్ని,దుర్మార్గాన్ని కొద్ది సేపు సహనంతో భరించింది. కాని సింహం కనుచూపు మేరలో కనబడకుండా పోయేసరికి తన జవాబును పొట్టేలుకు చూపించింది.
నాకు నీకంటే బలమైన శరీరం, వాడియైన కొమ్ములు ఉన్నాయంటూ సత్తా చూపించి, పొట్టేలును స్పృహకోల్పోయేలా చేసింది ఆ ఎద్దు స్పృహలోకొచ్చిన పొట్టేలు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడింది.
సంస్కృత భాషలో అద్భుతమైన నీతి కథలను, నీతి చంద్రిక, పంచతంత్రము, హితోపదేశము మొదలైన పేర్లతో లోకానుభవంతో పండిన మహానుభావులు రచించారు. హితోపదేశం - మిత్రలాభంలో నారాయణకవి చెప్పిన గొప్ప నీతి వున్న చిన్న కథ ఒకటి ఉంది.
వింధ్యారణ్య ప్రాంతంలో భైరవుడు అనే పేరుగల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి, రకరకాల ఆహారపదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో దొరకనిదేముంది? ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం ఇలా ఎన్నో లభిస్తాయి. కాని, ఈ శాఖాహారం కంటే కుందేలు, జింక, అడవి పంది వంటి జంతువుల మాంసాహారమే ఈ వేటగాళ్ళు ఇష్టపడతారు. భైరవుడు ఒకనాడు ఒక బలసిన జింకను వేటాడి చంపాడు. ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చుననుకుంటూ, దానిని భుజంపైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది కనిపించింది.
భైరవుడు తన భుజం మీది జింక శవాన్ని నేలపైకి దించి, తన విల్లమ్ములు తీసుకున్నాడు. పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు. అడవి పందులకు కోపం మొండితనం ఎక్కువ. వేటగాడి బాణం వెనుదిరిగి వచ్చిందా అన్నట్లు, అది అతి వేగంగా వచ్చి, భైరవుని పొట్టను కోరలతో చీల్చి చంపింది. తర్వాత, అదీ చచ్చింది. వీరి తొక్కిసలాటలో ఆటుగా వచ్చిన పాము కూడా, ప్రాణాలు విడిచింది.
ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెదకుతూ అటుకేసి వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడు, జింక, పంది, పాము దానికి కన్నుల విందుగా కనిపించాయి. నక్కలు స్వయంగా వేటాడలేవు. పులి, సింహం లాంటి జంతువులు చంపి తిని వదలిన అవశేషాలను, జీవుల శవాలను తిని తృప్తి పడతాయి. అందుకే ఒకేసారి నాలుగు శవాలు కనిపించే సరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది. నక్క ఇలా ఆలోచించింది "ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినొచ్చు. జింక, పంది శవాలను రెండు నెలల పాటు భోంచేయవచ్చు. ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపునింపుకోవచ్చు. అంటే మూడు నెలల ఒక్క రోజు పాటు ఆహారం గురించి వెదికే పనే లేదన్నమాట. మరి ఈ పూట మాటేమిటి? ఆ! ఈ వేటగాని ధనుస్సుకు కట్టివున్న కమ్మని వాసన వేస్తున్న, నరాలతో చేసిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది."
క్షుద్రబుద్ధి వింటిని సమీపించి, లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన అల్లెత్రాడును కొరికింది. అంతే! పదునైన వింటి కోపు దాని శరీరంలో గుచ్చుకుని, తన దురాశకు చింతిస్తూ క్షుద్రబుద్ధి ప్రాణాలు విడిచింది. ఇప్పుడక్కడ ఐదు శవాలు పడి ఉన్నాయి.
భైరవుడు ఒక మృగము చాలదని మరో దాన్ని వేటాడబోయి చచ్చాడు. క్షుద్రబుద్ధిఎటువంటి కష్టం లేకుండా మూడు నెలల పాటు తిండి దొరికించుకుని కూడా పేరుకు తగినట్లు పిసినారి తనంతో వింటినారిని కొరికి, తానూ శవంగా మారింది. అందుకే అత్యాశ మంచిది కాదు. మానవుడు ఆశాజీవి. కానీ దురాశకు పోతే దుఃఖమే మిగులుతుంది.
ఒక ఊరిలో ఒక జమీందారుండేవాడు. ఒక నాటి రాత్రి ఇద్దరు దొంగలు జమీందారు ఇంట్లో తమకు దొరికినంత బంగారాన్ని, ధనాన్ని దోచుకుని ఆడవిలోకి జారుకున్నారు, ఆ బంగారాన్ని మరసటి రోజు తమ పక్క ఊరిలో అమ్మాలని ముందే నిర్ణయించుకున్నారు, అప్పటివరకు ఆ ధనాన్ని ఎక్కడైనా దాచేయాలని అనుకున్నారు.
ఒక చెట్టు బోదెలో బంగారాన్ని దాచారు. కాని అది భద్రంగా ఉంటుందని వారికి నమ్మకం కలగలేదు, అందువల్ల వారిద్దరూ ఆచెట్టు బోదెవైపు ఒక కన్ను వేయాలని ఎవరికివారు అనుకున్నారు.
కొద్దిసేపటి తర్వాత ఇద్దరికీ ఆకలివేసింది. కాని అంత ధనాన్ని వదిలి వారిద్దరూ తినడానికి ఎలా వెళ్లగలరు? కాబట్టి భోజన వసతలు ఏర్పాటుచేయడానికి కూడా వాళ్లు వంతులు వేసుకోవాలనుకున్నారు వారిలో మొదటి వాడు రెండవాడితో "లంబూ, నీవు ఈ బంగారానికి రక్షణగా ఉండు. నేను ఊర్లోకి వెళ్లి మనకు కావలసిన భోజనం తీసుకువస్తాను" అన్నాడు.
"సరేరా జంబూ! కాని త్వరగా వచ్చెయ్" అని లంబూ బదులిచ్చాడు.
జంబూ ఊర్లోకి వెళ్లాడు ఆ లోపల లంబూ 'నేను ఈ దొంగిలించిన ధనాన్ని జంబూతో పంచుకోవడమెందుకు?" అని ఆలోచించి ఒక పన్నాగం పన్నాడు.
జంబూ భోజనం తీసుకురాగానే అతణ్ణి చంపి మొత్తం ధనాన్ని బంగారాన్ని తానే సొంతం చేసుకోవాలనుకున్నాడు.
ఊర్లోకి వెళ్లిన జంబూకు కూడా అచ్చం ఇలాంటి ఆలోచనే వచ్చింది. అతను భోజనం చేసి లంబూకు తీసుకువచ్చే ఆహారంలో విషం కలిపాడు. కొద్దిసేపటి తర్వాత, జంబూ అడవిలోని ఆ చెట్టు వద్దకు చేరుకున్నాడు. చెట్టు పక్కన దాక్కున్న లంబూ ఒక పెద్ద రాయితో జంబూ తలపై బలంగా మోదడంతో జంబూ విలవిల్లాడుతూ కిండపడి ప్రాణం విడిచాడు. సంతోషంగా విషం కలిపిన ఆహారం తిన్న లంబూ నురగలు కక్కుతూ మరణించాడు,
అంత ధనం, బంగారం వారిద్దరిలో ఎవరికీ దక్కకుండా పోయింది.
పిల్లలు! అతి స్వార్ధం అనర్ధాలకు దారి తీస్తుందని పెద్దలెందుకంటారో అర్ధమయిందా?!
ఆధారము: రమేష్ బాబు, టీచర్, పశ్చిమ గోదావరి
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020