అక్బర్ చక్రవర్తికి వేటాడ్డం ఒక సరదా. ఆ సరదా వల్ల రాజ్యంలోని అడవులన్నీ నిర్వీర్యమైపోవడం బీర్బల్‌ను ఎంతగానో బాధించింది. బీర్బల్ ఈ విషయాన్ని అక్బర్ దృష్టికి తీసుకురావాలనుకున్నాడు. తగిన సమయం కోసం ఎదురుచూస్తుండగా ఒకరోజు అక్బర్ తన పరివారంతో కలిసి వేటకు వెళ్ళాడు. బీర్బల్ కూడా అతని వెంటే ఉన్నాడు. అడవికి వెళ్ళే తోవలో వారు ఒక చిలుకల గుంపు చెట్టుపై కూర్చుని అరవడం చూశారు. అక్బర్ బీర్బల్‌తో "బీర్బల్! నువ్వు పక్షుల భాషను అర్ధం చేసుకుంటానని చెప్పావుగా, ఆ చిలుకలు ఏమని మాట్లాడుకుంటున్నాయో చెప్పగలవా?" అని అడిగాడు.
బీర్బల్ వాటి మాటలను శ్రద్ధగా వింటున్నట్టు నటిస్తూ, "రాజా! ఈ చిలుకలు పెళ్ళి పద్ధతుల గురించి మాట్లాడుకుంటున్నాయి. పిల్ల వాడి తండ్రి ఏ పక్షులూ, జంతువులూ లేని ఐదు అడవులను వరకట్నంగా కావాలని అడుగుతున్నాడు. పెళ్లికూతురు తండ్రి ఇదేం కర్మ, పది ఖాళీ అడవులైనా కట్నంగా ఇవ్వడం సమ్మతమే అంటున్నాడు" అని చెప్పాడు.
ఇంకా ఏం మాట్లాడుతున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో అక్బర్, "మరి పెళ్లికొడుకు తండ్రి ఏమంటున్నాడు?" అని అడిగాడు.
బదులుగా బీర్బల్ "మహారాజా! పెళ్లికొడుకు తండ్రి అంత సులభంగా ఖాళీ అడవులను ఎలా ఇవ్వగలవని పెళ్లికూతురు తండ్రిని అడగగా, పెళ్లికూతురు తండ్రి అయిన ఈ రాజ్యపు చక్రవర్తికి వేటాడటం సరదా. ఆ సరదాతో ఎన్నో అడవులను నాశనం చేశాడు. ఆయన తన సరదాతో మరికొన్నింటిని కూడా పక్షులు, జంతువులు లేని అడవులుగా మారుస్తాడని చెబుతున్నాడు" అన్నాడు. చిలుకల సహాయంతో బీర్బల్ తను చెప్పాలనుకున్న మాటలను తెలివిగా అక్భర్‌కు చెప్పేశాడు. తన సరదా అడవులకు ఎంతటి దుర్గతి తీసుకువచ్చిందో గ్రహించిన అక్బర్ వెంటనే దానికి కళ్ళెం వేశాడు.
అనగనగా ఒక నది. ఆ నది ఒడ్డున ఒక చెట్టు. చెట్టుపైన పిట్టగూడు. ఆ గూటిలో పావురాల జంట. ఆ పావురాలు రెండూ కలిసికట్టుగా ఆహారం కోసం వెళ్లేవి. తిరిగి చీకటిపడే వేళకు గూటికి చేరి ఊసులాడుకుంటూ ఒకదానికొకటి ఆహారం తినిపించుకునేవి. ఆ చెట్టుకింది పుట్టలో ఒక గండు చీమ. పాపం! అది ఒంటరిది. దానికి నా అనేవాళ్లెవరూ లేరు. రోజూ పావురాల జంట ఆనందంతో కువకువలాడటం చూసేది. వాటితో స్నేహం చేయాలనుకుంది. ఓ రోజున పావురాలను "మిత్రులారా! కష్టసుఖాలు చెప్పుకోడానికి నాకెవరూ లేరు. నేను మీతో స్నేహం చేయవచ్చా?" అని అడిగింది.
చీమ మాటలకు పావురాలు ఫక్కున నవ్వాయి. "నేల మీద నడిచే నువ్వెక్కడ? ఆకాశంలో ఎగిరే మేమెక్కడ? మేము తెల్లగా, అందంగా ఉంటాము. నువ్వేమో, నల్లగా, అసహ్యంగా ఉంటావు. నీకూ మాకూ పొంతన లేదు. నీతో మేము స్నేహం చేయము" అని చెప్పాయి. చీమ బాధపడి ఊరుకుంది.
ఓ రోజు ఒక తుంటరి పిల్లాడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి, ఉండేలు తీసి, పావురాలకి గురిపెట్టి, కొట్టబోయాడు. చీమ అది గమనించి మెల్లగా వెళ్లి, వాడి పాదాన్ని గట్టిగా కుట్టింది. పాదం మీద చురుక్కుమనేసరికి పిల్లాడి ఏకాగ్రత దెబ్బతిని, ఉండేలులోని రాయి గురితప్పింది, ఆ అలికిడికి పావురాలు రివ్వున ఎగిరిపోయాయి.
ఆ పిల్లాడు వెళ్లిన కాసేపటికి పావురాలు ఆ చెట్టుమీదకి వచ్చి "చీమా! నువ్వెంత మంచిదానివి? మేము నిన్ను చులకనగా మాట్లాడినా, మనస్సులో పెట్టుకోకుండా మమ్మల్ని కాపాడవు. ఇక నుంచి మనం మంచి స్నేహితులుగా ఉందాం" అన్నాయి. పావురాళ్లతో చెలిమి కుదిరినందుకు చీమ చాలా సంతోషించింది.
ఒక ఊరిలో వృద్ధ సాధువు ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్ళి భిక్ష తెచ్చుకుని కాలం వెళ్లదీసేవాడు. ఆయనకున్న దయాగుణం, మంచిమనసు వల్ల ప్రజలకు సాధువు వచ్చేసరికే ఆయన కోసం ఆహారం సిద్ధం చేసి ఉండేవారు.
సాధువు తాను భిక్షగా స్వీకరించిన ఆహారంలో నుండి పేదవారికి, బిచ్చగాళ్లకు, దారినపోయే బాటసారులకు పంచి మిగిలినది తినేవాడు. కొన్నిసార్లు ఆహారమంతా ఇతరలకు పంచి పస్తులుండేవాడు.
ఒకరోజు ఆ సాధువు ఒక వృద్ధురాలి ఇంటికి భిక్ష స్వీకరించడానికి వెళ్ళాడు. ఆ వృద్ధురాలు చాలా పిసినారి, దుర్మార్గురాలు, ఎవరికీ భిక్ష పెట్టేది కాదు. అయినా సాధువును వదిలించుకోడానికి కొంత ఆహారం భిక్ష వేసింది. మరునాడు కూడా సాధువు ఆ ఇంటికి భిక్ష కోసం రాగా, పాడైపోయిన అన్నం పెట్టింది. మూడోరోజు సాధువు వృద్ధురాలి ఇంటి దగ్గరకు రాగానే, అతని బెడద వదిలించుకునేందుకు. ఆమె ఒక దుర్మార్గపు పన్నాగం పన్నింది.
వంటగదిలోకి వెళ్ళి విషం కలిపిన అన్నం తీసుకువచ్చి పెట్టింది. ఆ అన్నాన్ని స్వీకరించిన సాధువు అటూ ఇటూ తిరిగి సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. అన్నం తిందామని తన ఇంటి వాకిట్లో కూర్చొగానే ఒక యువకుడు అలసటగా రొప్పుతూ నడుస్తున్నాడు. వెంటనే సాధువు ఆ యువకుడిని పిలిచి, "అలసటగా ఉన్నట్టున్నావు. కాస్త అన్నం తిను. కాస్సేపు కూర్చుని వెళ్ళు" అని అతనికి వృద్ధురాలు పెట్టిన అన్నం మొత్తం పెట్టేశాడు. దురదృష్టవశాత్తు ఆ యువకుడు వృద్ధురాలి కొడుకే. ఆకలిగా ఉన్న ఆ యువకుడు వెంటనే గబగబా అన్నం తిని తన ఇంటికి బయల్దేరాడు. ఇల్లు చేరుకునే సరికి తలతిరుగుతున్నట్లు అనిపించింది. వెంటనే నురగలు కక్కుతూ తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. కొడుకు నుంచి విషయం తెలుసుకున్న తల్లి లబోదిబోమంది. ఆ యువకుడినే అనుసరిస్తూ వచ్చిన సాధువు తనకు తెలిసిన విద్యతో అతణ్ణి బతికించాడు. అప్పుడు వృద్ధురాలు ఏడుస్తూ తన తప్పును క్షమించమని సాధువు కాళ్ళమీద పడింది. అప్పటినుంచి జీవితాంతం మంచితనంతో మెలిగింది.
తెనాలి రామలింగడి దగ్గరకు ఒక పండితుడు తాను రాసిన కొన్ని పద్యాలను వినిపించాలని వచ్చాడు. తన పాండిత్యాన్ని రామలింగడి ముందు ప్రదర్శించాలని ఆయన కోరిక. అసలు తీరికలేని రామలింగడు "పండితావర్యా! మీరు మీ పద్యాలను మా వద్ద ఉంచి వెళ్ళండి. మేము తరువాత వాటిని తప్పకుండా చదివి అభిప్రాయం మీకు చెబుతాము" అని చెప్పాడు. రామలింగడి మాటలు నమ్మని ఆ పండితుడు పద్యాలను ఇప్పుడు వినవలసిందేనంటూ పట్టుబట్టాడు.
పండితుడు మొండి వైఖరి రామలింగడికి కోపం తెప్పించినా "సరే! మొదలెట్టండి" అని ఒక గోడకు ఒరిగి కూర్చున్నాడు. పండితుడు పద్యాలు చదవడం మొదలెట్టాడు. మొదటి రెండు మూడు పద్యాలకు "ఊ" కొట్టిన రామలింగడు ఆ తర్వాత ఎంచక్కా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. పండితుడు తన పద్యాల మోత మాత్రం ఆపలేదు.
రామలింగడు కాస్సేపటి తర్వాత నిద్రలేచాడు.
"అయ్యా! నా పద్యాలను మరోసారి వినిపించాలా?" అడిగాడు పండితుడు. "ఎందుకు? నేను ఇందాకే నా అభిప్రాయం చెప్పానుగా!" అన్నాడు రామలింగడు. "మీరా..... అభిప్రాయమా? లేదే! మీరు జోరునిద్రలోకి జారుకున్నారు" అని ఆశ్చర్యంగా అన్నాడా పండితుడు. "అవును నిజమే! నేను నిద్రలోకి జారుకున్నప్పుడే నా అభిప్రాయం వెలిబుచ్చాను" అని ముక్తసరిగా బదులిచ్చాడు రామలింగడు.
రామలింగడి వ్యంగ్య సమాధానానికి, అతని చతురతను కొనియాడాలో లేక తనను వెక్కిరించాడని బాధపడాలో అర్ధంకాక అక్కడి నుండి జారుకున్నాడు ఆ పండితుడు.
స్వర్గంలో సంచరిస్తున్న బ్రహ్మదేవుడికి ఒక సందేహం కలిగింది. లోకాలంన్నింటినీ సృష్టించిన తనను భూ లోకవాసులు గుర్తుపెట్టుకున్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అనుకున్నదే తడవుగా భూలోకానికి వెళ్లాలని అనుకున్నాడు.
ప్రయాణికుడిలా మారిపోయి ఒక శిల్పి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఎన్నో అందమైన విగ్రహలు ఉండడం చూసి ముచ్చటగా అనిపించింది బ్రహ్మకి. ఒక విగ్రహాన్ని చూపిస్తూ దీని ఖరీదెంత అని శిల్పిని అడిగాడు బ్రహ్మ. దానికి శిల్పి అది అంత ప్రముఖమైన విగ్రహం కాదు అని, దాని ధర తక్కువగానే ఉంటుందని బదులిచ్చాడు. అతని జవాబుకు బ్రహ్మ సంతోషించాడు.
తరువాత ఒక స్త్రీ విగ్రహాన్ని చూపిస్తూ దీని ధరెంతో చెప్పగలవా? అని శిల్పిని ప్రశ్నించాడు ప్రయాణికుడి రూపం లో ఉన్న బ్రహ్మ, దానికి శిల్పి ఆ విగ్రహం కొంచెం కష్టపడి చేశాను దానికి కొంత డిమాండ్ ఉంది. కాబట్టి అది కాస్త ఎక్కువ ధర పలుకుతుందని సమాధానమిచ్చాడు.
కొద్ది సేపు విగ్రహాలన్నింటిని పరిశీలించిన బ్రహ్మకు ఒక మూలలో తన విగ్రహం తారసపడింది. బ్రహ్మ తన విగ్రహం ఎక్కువ ధర పలుకుతుందని భావించి సంతోషంగా మరి ఈ విగ్రహం ధర ఎంతని తన విగ్రహాన్ని చూపిస్తూ శిల్పిని అడిగాడు.
"మీరు ఆ రెండు విగ్రహాలనూ తీసుకుంటే ఈ బ్రహ్మ విగ్రహాన్ని ఉచితంగా ఇస్తాను" అని అన్నాడు శిల్పి. ప్రయాణికుడి రూపంలో ఉన్న బ్రహ్మ శిల్పి మాటలకు నోరెళ్లబెట్టి విగ్రహంలా నిల్చుండిపోయాడు.
ఒక అడవిలో నివసిస్తుండే ఒక నక్కకి ఒకనాడు బాగా ఆకలి వేసింది. దాంతో అది అడవి అంతా గాలించి ఎక్కడా ఆహారం దొరకక అది విసిగి వేసారిపోయింది. చివరికి ఆ నక్క కొన్ని జింకలు, దుప్పులు ఐక్యమత్యంగా కలిసి జీవించే ఒక చోటుకి బయలు దేరింది. అక్కడ తనకేదయిన ఆహారం దొరక్కపోతుందా అని అనుకుంటూ. నక్క అక్కడికి చేరే సరికి కొన్ని జింక పిల్లలు, దుప్పి పిల్లలు సంతోషంతో కేరింతలు కొడూతూ ఆడుకోసాగాయి. అవి నక్క బావని ఒకసారి పలకరించి మళ్ళీ తమ ఆటలో లీనమయిపోయాయి. నక్కకి వాటిని చూడగానే తను బూరెల గంపలో పడ్డట్టయ్యింది. ఆ టక్కరి నక్క వాటిని తన ఆహారంగా ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తూ అది ఒక చెట్టు క్రింద కూర్చొని అవి ఆడే ఆటలని జాగ్రత్తగా గమనించడం మొదలు పెట్టింది. అవి ఆడుకొనే చోట ఒక చిన్న పిల్లకాలువ, దానిని దాటుటకు దానిపై ఒకేసారి ఒకటి మాత్రమే దాటటానికి అవకాశం వుండే ఒక తాటి మొద్దు వేసి ఉంది. దుప్పి పిల్లలు వాటి ఆటలో భాగంగా రెండు పిల్లలూ రెండు వైపుల నుండీ ఒకేసారి బయల్దేరి సరిగ్గా చెట్టు తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. ఆ సరికి ముందుకు వెళ్ళటానికి ఆ రెండు దుప్పి పిల్లలకు అసాధ్యమయిపోయింది. ఆ రెండింటిలో ఏదో ఒకటి వెనక్కి వెళితేకాని రెండవ పిల్ల ముందుకు సాగిపోవటానికి వీలు కాకపోవటంతో అవి రెండూ సమాధానపడి, ఒక దుప్పి ఆ తాటి మొద్దుపై పడుకోగా రెండవది జాగ్రత్తగా దానిపై నుండి దాటి అవతలివైపుకి చేరింది. ఆ తర్వాత పడుకున్న దుప్పి కూడా లేచి నిరాటంకంగా ఇవతలివైపుకు వచ్చి చేరింది.
ఇదంతా ఆసక్తిగా గమనించగానే ఆ నక్క మెదడులో చటుక్కున ఒక ఆలోచన మెరిసింది. దాంతో అది వెంటనే ఆ దుప్పి పిల్లల వద్దకు వెళ్ళి వాటితో మీరిద్దరూ అలా సమాధానపడటం, ఒకటి రెండవదానికి తలవంచడం మన జంతుజాతికే అవమానకరం. మీరిద్దరూ మీ మీ బలా బలాలు పరీక్షించుకొని మీలో బలహీనుడు, బలవంతుడికి ముందుకి వెళ్ళడానికి దారివ్వాలని చెబుతూ అది రెండింటిని రెచ్చగొట్టింది. దాంతో నక్క మాటలు బాగా తలకెక్కించుకున్న ఆ రెండు పిల్లలు పౌరషంతో మళ్ళీ ఆట ప్రారంభిస్తూ తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. కాని ఈసారి వాటిలో ఏ ఒక్కటీ, సమాధానపడక రెండవ దానికి దారివ్వటానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. దాంతో అవి వెంటనే నక్క బావ చెప్పినట్లు బలపరీక్షకు సిద్దపడ్డాయి. తాటి మొద్దుపై నుండి రెండూ ఒకేసారి వేగంగా వెనక్కి వెళ్ళి, అంతకు రెట్టించిన వేగంతో ముందుకు వచ్చి, రెండూ తమ తలల్ని గట్టిగా ఢీ కొన్నాయి. ఆ పోట్లాటలో అవి రెండూ పట్టుతప్పి కాలవలో పడి మరణించాయి. దాంతో నక్క వేసిన ఎత్తుగడ పారింది. ఆ రెండు దుప్పి పిల్లల మృతదేహాలు ఆ రోజుకి తన పొట్ట నింపడమే కాకుండా మరో రెండు రోజులకి సమకూరడంతో ఆ నక్క ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైయింది. ఈ సంఘటనని దుప్పి పిల్లలు, జింక పిల్లలద్వారా తెలుసుకున్న పెద్ద దుప్పులు తమ ఐక్యమత్యాన్ని దెబ్బతీసి, తమలో తాము కలహించుకొనేటట్టుచేసి, తనపబ్బం గడుపుకున్న నక్కబావకి ఎలాగయినా బుద్ది చెప్పాలనుకున్నాయి. ఒకరోజు తన ఆహారం కాస్త అయిపోయాక మళ్ళీ అక్కడకు చేరిన జిత్తులమారి గుంట నక్క ఈ సారి కూడా చెట్టు క్రింద తిష్ట వేసి దుప్పి పిల్లలు జింకపిల్లలు ఆడే ఆటలని గమనించసాగాయి. అయితే ఈ సారి పిల్ల దుప్పులు కాకుండా పెద్ద దుప్పులు ఆట మెదలెట్టాయి. అవి కూడా మెదట పిల్ల దుప్పులు ఆడినట్టుగానే తాటి మొద్దు మధ్యకు వచ్చి ఒకదానిపై మరొకటి అవతలకి, రెండవది యివతలకి వచ్చి చేరాయ
ఇదంతా గమనిస్తున్న నక్క ఒక్కసారి ఆనందంతో తలమునకలయ్యింది. ఈసారి కూడా తన పథకం ఫలిస్తే చావబోయేవి పెద్ద దుప్పులు కాబట్టి తనకు దాదాపు పది రోజులకి సరిపడే ఆహారం లభిస్తుంది. ఇలా ఆలోచించిన ఆ నక్క ఆ రెండు దుప్పులను సమీపించి, మునుపటి పిల్ల దుప్పులకు చెప్పినట్లే బలపరీక్ష విషయం గురించి వాటితో చెప్పింది. దాని సూచన నచ్చిన పెద్ద దుప్పులు రెండూ వెంటనే ఒప్పుకొని తమ ఆట తమ తమ పరిధులు ఎంతవరకు వున్నాయో నిర్ణయించడానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించమని నక్కని కోరాయి. అందుకు నక్క ఆనందంగా అంగీకరించి తాటి మొద్దు పై నుంచొని వాటికి హద్దులు నిర్దేశించటంలో లీనమయ్యింది. ఇంతలో ఆ రెండు పెద్ద దుప్పులు శరవేగంతో వెనక్కి వెళ్ళి అంతకు రెట్టింపు వేగంతో పరిగెత్తుకు వచ్చి నక్క మధ్యలో వుండగా తమ తలల్ని గట్టిగా ఢీ కొన్నాయి. అంతే ఆ దెబ్బతో నుజ్జు నుజ్జయిన నక్క బావ తిక్క కుదిరి ఠపీమని చచ్చూరుకుంది. తమ శత్రువుని ఎత్తుకు పై ఎత్తువేసి, చిత్తు చేసినందుకు జింకలు దుప్పులు సంతోషపడి మళ్ళీ ఎప్పటిలా ఐకమత్యంతో కలిసి జీవించసాగాయి.
ఒక అడవి సమీపాన ఒక పూరిగుడిసె ఉండేది. అందులో కొండయ్య, కాంతమ్మ దంపతులు కాపురం ఉండేవాళ్ళు. కొండయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి, పట్టణంలో అమ్మేవాడు. ఇలా వాళ్ళ జీవనం సాగించేవారు. ఒక రోజు మామూలుగా కొండయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళి ఒక చెట్టు కొట్టబోయాడు. అప్పుడు వనదేవత ప్రత్యక్షమయింది. 'చెట్టు నరకటం వలన అడవి పాడవుతుంది. చెట్టు నరకవద్దు' అంది. కట్టెలు కొట్టి అమ్మకపోతే నా జీవితం ఎట్లా గడుస్తుంది అన్నాడు కొండయ్య. అప్పుడు వన దేవత 'నీకు ఒక పాడి ఆవును ఇస్తాను. దాని పాలు అమ్ముకొని సుఖముగా జీవించు' అంది. కొండయ్య సరేనన్నాడు. వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది.
వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది. కొండయ్య ఆవును తోలుకొని ఇంటికి వచ్చాడు. భార్యకు చూపాడు. ఆమె కూడా చాలా సంతోషించింది. రోజూ పాలు అమ్మగా వచ్చే డబ్బుతో వాళ్ళ జీవితం గడిపేవారు. కొన్ని రోజులు గడిచాయి. రోజూ ఆవుకి మేత వేయాలి, పాలు పితకాలి. కాంతమ్మకు విసుగువేసింది. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. భర్తను మళ్ళా అడవికి పంపింది. కొండయ్య ఆవును తోలుకొని అడవికి వెళ్ళాడు. గొడ్డలితో ఒక చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమయింది. ఏమిటి కొండయ్యా! మళ్ళీ వచ్చావు? చెట్టును ఎందుకు నరకబోతున్నావు? అని అడిగింది.
అప్పుడు కొండయ్య ఈ ఆవు వద్దు. ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే ఉపాయం చెప్పు అన్నాడు. వన దేవత సరే అన్నది. ఆవును తీసుకొని ఒక బాతుని ఇచ్చింది. ఇది ప్రతీ రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది. అమ్ముకొని సుఖముగా జీవించమని చెప్పింది. కొండయ్య బాతుతో ఇల్లు చేరాడు. బాతు ప్రతి రోజూ బంగారు గుడ్డు పెట్టేది. దాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో రోజులు గడిపేవాళ్ళు. కొన్ని రోజులకు కాంతమ్మకు మళ్ళీ విసుగు పుట్టింది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. మనం త్వరగా ధనవంతులం కావాలంటే కోరిన ధనం ఇచ్చే సంచి కావాలి. అది అడిగి తీసుకురా అని మళ్ళీ కొండయ్యను అడవికి పంపింది.
బాతుని తీసుకొని అడవికి వెళ్ళాడు. చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమయింది. 'ఏం కొండయ్యా! మళ్ళీ వచ్చావు అంది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్దు మాత్రమే పెడుతుంది. మాకు ఇది వద్దు ధనం ఇచ్చే సంచి ఇవ్వు' అన్నాడు. అతని అత్యాశకు వనదేవతకు కోపం వచ్చింది. బాతుతో పాటు మాయమైపోయింది.
కొండయ్యకు కోపం వచ్చింది. బలంగా గొడ్డలితో చెట్టు కొమ్మ నరికాడు. అది తెగి కొండయ్య కాళ్ళపై పడింది. కాళ్ళు విరిగాయి. పడిపోయాడు. కాంతమ్మ కొండయ్యను వెతుక్కుంటూ అడవికి వచింది. ఎలాగో కొండయ్యను తీసుకొని ఇల్లు చేరింది. కొండయ్య పని చేయలేడు. ఎట్లా? కాంతమ్మే అడవికి వెళ్ళి ఉసిరి, నేరేడు, రేగు పండ్లు ఏరుకొని వచ్చేది. వాటిని తినేవారు. గింజలను ఇంటి వెనక ఖాళీ స్థలంలో విసిరే వారు. కొన్నాళకు అవి మొలకలెత్తి పెరిగి పెద్దవయ్యాయి. కాయలు కాసాయి. కాంతమ్మకు అడవికి వెళ్ళే భాధ తప్పింది. కావలసిన పండ్లు తాము తినేవారు. మిగిలినవి సంతలో అమ్మేవారు. చెట్లను కొట్టి బతకటమే కాకుండా చెట్లను పెంచి కూడా జీవితం సాగించవచ్చని కొండయ్య దంపతులు గ్రహించారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని కాంతమ్మ చదును చేసింది. రకరకాల పండ్ల మొక్కలు నాటింది. ప్రతి రోజు క్రమం తప్పకుండా నీరు పోసేది. ఒక రోజు వనదేవత ప్రత్యక్షమయింది. వాళ్ళు చేసే మంచి పని చూసింది సంతోషపడి దీవించింది. కొండయ్య దంపతులకు మొక్కలు పెంపకం విలువ తెలిసింది. తమ చుట్టు పట్ల మొక్కలు నాటటంలో నలుగురికి తోడ్పడ్డారు. ఆనందంగా జీవనం గడిపారు.
పృధ్వీపాలుడు ఔదార్యంగల రాజు ఆయన కొలువు లోకి పండితులు ఎప్పుడు స్వేచ్చగా ప్రవేశించే వీలు ఉండేది. ఒకరోజు బిచ్చగాడిలా కనిపిస్తున్న ఒక వృద్ధుడు పృధ్వీపాలుడి కొలువులోకి ప్రవేశించబోయాడు. అతడి అవతారం చూసి ద్వారపాలకులు అడ్డుకున్నారు.
"నాతో ఈ విధంగా ప్రవర్తించకూడదు. నేను రాజు గారి అన్నని" అని చెప్పాడతడు.
"ఇలాంటి వేషాలు మా దగ్గర కుదరవు. మా రాజు గారికి అన్నలుగాని, తమ్ముళ్ళుగాని లేరు" అన్నారు ద్వారపాలకులు.
"నా మాటలు నమ్మకపోతే మీరు నేరుగా రాజు దగ్గరకి వెళ్ళి మీ అన్న కలవటానికి వచ్చాడు అని చెప్పండి" అని చెప్పాడు ఆవ్యక్తి.
ద్వారపాలకులు చెప్పింది వినగానే పృధ్వీపాలుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. "అవునా...వెంటనే అతన్ని నాముందుకు తీసుకురండి" అని ఆదేశించాడు.
ఆ వ్యక్తిని చూడగానే రాజు "అన్నగారికి స్వాగతం. ఏమిటి విశేషాలు?" అని అడిగాడు.
అతను రాజుగారి ముందు ఆసీనుడవుతూ "సోదరా...నా దగ్గర మంచి వార్తలేం లేవు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నా రాజ్యం రోజు రోజుకి కూలిపోతున్నది. నాకున్న ముఫ్ఫైరెండుమంది సేవకులలో ఒకరిద్దరు మాత్రమే మిగిలారు. నా అయిదుగురు రాణులు కూడా ముసలివాళ్ళైపోయారు. దయచేసి నాకు సాయం చెయ్యి" అన్నాడు.
పృధ్వీపాలుడు అతని వైపు చాలా ఆసక్తిగా చూశాడు. తరువాత తన కోశాధికారితో అతనికి ఒక యాబై రూపాయలు ఇవ్వమని చెప్పాడు. " యాబై రూపాయలు చాలా తక్కువ" చెప్పాడతను.
"సోదరా... ధనానికి చాలా ఇబ్బందిగా ఉంది. నా భాండాగారం తరిగిపోయింది" అన్నాడు రాజు.
ఆ వృద్దుడు ఒకసారి గాడంగా నిట్టూర్చి "ఏడు సముద్రాల అవతలున్న సముద్రపు ఒడ్డులో బంగారు ఇసుక వుంది. నాతో వచ్చి ఆ బంగారు ఇసుక తీసుకువచ్చి నీ భాండాగారం నింపుకో అన్నాడు"
"మరి ఆ సముద్రాలను దాటటం ఎలా?" సందేహంగా అడిగాడు పృధ్వీపాలుడు.
"నా పాదాల మహత్యాన్ని నువ్వు గమనించే వుంటావు. నేను సముద్రం లో అడుగు పెడితే అక్కడి నీరు కూడ ఆవిరైపోతుంది" అన్నాడు వృద్దుడు.
పృధ్వీపాలుడు అతను కోరినంత ధనం ఇచ్చి పంపించమని కోశాధికారికి ఆదేశించాడు. వృద్ధుడు వెళ్ళిపోయాక ప్రధానమంత్రి "ప్రభూ...మీ ఇద్దరి సంభాషణ నాకు అర్ధం కాలేదు" అన్నాడు.
పృధ్వీపాలుడు చిన్నగా నవ్వి " అతను ఒకప్పుడు బాగా బ్రతికిన పండితుడు. అదృష్టం నాణేనికి ఒకవైపు నన్ను రాజుగా రెండోవైపు అతణ్ణి పేదవాడిగా చేసి మమ్మల్ని అన్నదమ్ములను చేసింది. అతను నివసించే రాజ్యం వేరొకటి కాదు అతని శరీరమే. అతని ముఫ్ఫైరెండు సేవకులంటే అతని పండ్లు. అయిదుగురు రాణులంటే అతని పంచేంద్రియాలు. అంతేకాదు భాండాగారం తరిగిపోయింది అని నేనన్న మాటకు, తనెక్కడ కాలు పెట్టినా సముద్రాలు సైతం ఇంకిపోతాయని లోపం తనమీద వేసుకున్నట్లు మాట్లాడిన సున్నితంగా నన్ను విమర్శించాడు" అని వివరించి చెప్పాడు.
చ్యవన మహాముని గంగా యమునల సంగమ ప్రదేశాన నీళ్ళలో మునిగి సమాధిపరుడై తపస్సు చేస్తున్నాడు. చేపలు ఆయన శరీరమంతా ఎక్కి హాయిగా తిరగటం మొదలు పెట్టాయి. ఆయన కరుణతో వాటిని మన్నించాడు. వాటి చేష్టలకు సంతోషపడ్డాడు. అలా పన్నెండేళ్ళు గడిచిపోయాయి. ఒకసారి జాలరులు ఆ ప్రాంతానికి వచ్చి వల వేశారు. చేపలతో పాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు. జాలర్లు వల పైకి తీసి ఆ మహామునిని చూసి భయపడ్డారు. తప్పు క్షమించమని ఆయన కాళ్ళమీద సాష్టాంగపడ్డారు. "ఈ చేపలతో కొన్నేళ్ళుగా సహవాసం చేయడం వల్ల నాకు వాటిమీద మక్కువ ఏర్పడింది. వాటితో సహా ప్రాణాలు విడవడం కూడా ఇష్టమే నాకు! కనుక అలా చేయండి . లేదా మీకో ఉపాయం చెబుతాను. ఈ చేపల్ని మీరు ఎలాగో అమ్ముకుంటారుగా! వాటితోపాటు నన్ను కూడా అమ్మెయ్యండి" అన్నాడు. జాలర్లు భయపడుతూ వెళ్ళి ఆ సంగతి నహుష మహారాజుతో చెప్పారు. ఆయన భయసంభ్రమాలతో మంత్రి, పురోహితులను వెంటబెట్టుకుని ఆ మహాముని దగ్గరకు వెళ్ళి శిరస్సు వంచి నమస్కారం చేశాడు. 'మహాత్మా! తెలియక అపరాధం చేశారు బెస్తలు. అది ఏం చేస్తే పోతుందో సెలవియ్యండి' అన్నాడు. 'మహారాజా! బెస్తలు తమ కుల ధర్మం చేశారు. అందులో వారి తప్పేముంది పాపం వాళ్ళు చాలా శ్రమపడ్డారు. అందుచేత నా శరీరానికి తగిన వెల వాళ్ళకివ్వు' అన్నాడు చ్యవన మహర్షి. ఆయన మనస్సులో కోపం లేనందుకు నహుషుడు సంతోషించాడు. మంత్రిని పిలిచి, ఈ బెస్తలకు వెయ్యి మాడలు ఇవ్వండి అన్నాడు. 'ధర్మంగా ఇవ్వు మహారాజా' అన్నాడు ముని. 'అయితే పదివేలివ్వండి' చాలదు. 'లక్ష!' న్యాయం కాదు. సరే, 'కోటి' ఉహూ. 'పోనీ నా రాజ్యంలో సగం ఇస్తాను.' 'నువ్వూ నీ మంత్రులూ ఆలోచించుకుని తగిన వెల ఇవ్వండి!' దీనికింత చర్చేమిటి' 'నా రాజ్యమంతా ఇచ్చేస్తాను.' చ్యవనుడు నవ్వుతూ సరిపోదు అన్నాడు. నహుషుడు విచార పడిపోయాడు. మంత్రులందరిని కొంచెం పక్కకు తీసుకువెళ్ళి ' ఇంకేం చేద్దాం' అని ఆలోచన అడిగాడు. ఇంతలో అక్కడికి గవిజాతుడనే మహాముని వచ్చాడు. నహుషుడి సమస్యేమిటో అడిగి తెలుసుకున్నాడు. 'మహారాజా! చింత విడిచిపెట్టు, గోవులకు, విప్రులకు భేదం లేదు ఆ ఇద్దరూ హవికీ, మంత్రాలకూ ఆధారమైన వాళ్ళు. సకల వేదాలకూ ఆశ్రయుడైన మహర్షికి వెల నిర్ణయించడం దుర్లబమైన పని. బ్రాహ్మణుడితో సమానమైనదే గోవు కూడాను. కనుక గోవు నివ్వు. వెల సరిపోతుంది.' అని ఉపాయం చెప్పాడు. నహుషుడు సంతోషించాడు. చ్యవనుడి దగ్గరకు వెళ్ళి "మహాత్మా! నన్ను దయ చూడు. మీకు వెల కట్టడం ఎవరికి సాధ్యం? గోవునిస్తాను. అనుగ్రహించు అన్నాడు.
చ్యవనుడు సంతోషించాడు. తగిన మూల్యమే నిర్ణయించావు. అలాగే ఇవ్వు అన్నాడు. నహుషుడు గోవును జాలరులకిచ్చాడు. జాలరులు గోవుతో సహా చ్యవనుడి దగ్గరకు వెళ్ళారు. "అయ్యా! మమ్మల్ని చూసింది మొదలు మా మీద అనుగ్రహం చూపిస్తున్నావు. మమ్మల్ని కరుణించి ఈ గోవును మా దగ్గర నుంచి మీరు తిసుకోండి" అని వేడుకున్నారు. కాదనలేకపోయాడు చ్యవనుడు. "సరే అలాగే ఇవ్వండి" అని ఆ గోవును వాళ్ళ దగ్గర్నుంచి తీసుకొని, మీరూ, ఈ చేపలూ స్వర్గానికి వెళ్ళండి అని దీవించాడు. వెంటనే ఆ బెస్తలు, చేపలు కూడా శరీరాలతో ఎగసి స్వర్గానికి వెళ్ళారు. నహుషుడూ, ఆయన పరివారం అది చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు చ్యవనుడూ, గవిజాతుడూ కలిసి నహుషుణ్ణి పిలిచి - "నీకు మేము చెరో వరం ఇస్తాం. ఏం కావాలో కోరుకో" అన్నాడు. "మీరు తృప్తిపొందడం కంటే నాకింకేం కావాలి" అన్నాడు నహుషుడు వినయంగా. "రాజా! నీకు ధర్మపరత్వం, దేవేంద్ర వైభవం కలుగుతాయి" అని దీవించి వాళ్ళిద్దరూ అంతర్హితులయ్యారు. నహుషుడు పరమానంద భరితుడయ్యాడు. "సజ్జన సాంగత్యం వల్ల ఉత్తమ ఫలితాలుంటాయని" చెబుతూ నారదుడు ధర్మరాజుకి కథ చెప్పాడు.
ఒకప్పుడు ఒక తేనెటీగ ఎంతో కష్టపడి తన తుట్టెలలో దానికవసరమైన ఆహారాన్ని దాచిపెట్టుకునేది.
ఒకరోజు ఆ తేనెటీగ తన తుట్టెలోని తేనెను స్వర్గంలో ఉన్న బ్రహ్మ దేవుడికి సమర్పించాలని నిశ్చయించుకుంది. వెంటనే స్వర్గానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కరించి తేనెను బహూకరించింది. బ్రహ్మ సంతోషంగా తేనెను అందుకున్నాడు. తేనెటీగ భక్తికి మెచ్చిన బ్రహ్మ ఏదైనా వరం కోరుకొమ్మని అన్నాడు.
కొంతసేపు ఆలోచించిన తేనెటీగ తనకు ఒక విషపు కొండిని ప్రసాదించమని కోరింది. ఎవరైనా తన దగ్గరకొచ్చి తేనె దొంగిలించాలని చూస్తే వాళ్ల ప్రాణాలు తీసేంత విషపూరితంగా ఆ కొండి ఉండాలని కోరుకుంది.
బ్రహ్మదేవుడికి తేనెటీగ కోరుకున్న వరం నచ్చలేదు. కాని బ్రహ్మ ఏమీ అనలేక నువ్వు అడిగినట్లు విషపు కొండిని ఇస్తాను. నువ్వు ఆ కొండితో కుడితే మనిషి చచ్చిపోయేంత విషపూరితంగా ఉండదు కాని అతనిని కొంత గాయపరిచేట్లు ఉంటుందని చెప్పాడు. కాని ఇతరలను కుట్టడం నీకు కుడా అపాయమే, దానివల్ల నీ ప్రాణాలు పోతాయి, అని బ్రహ్మదేవుడు తేనెటీగకు వరమిచ్చాడు. తేనెటీగకు అది వరమో, శాపమో అర్ధంకాలేదు.
హిరణ్యకుడు అను ఎలుక, చిత్రాంగుడు అనే జింక, మంథరుడు అనే తాబేలు, లఘుపతకము అనే కాకి వీళ్ళు నలుగురు మిత్రులు. కర్పూర గౌరవము అనే చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువులో ఒడ్డున ఉన్న చెట్టు తొర్రలో ఎలుక, ఆ చెట్టు మీద కాకి ఉండేది. ఆ ప్రక్కనే ఉన్న పొదలో జింక ఉండేది.
సాయంత్రపు పూట ఈ నలుగురు మిత్రులు ఒకేచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఒక రోజు మధ్యాహ్నమనగా ఆహారం కోసం వెళ్ళిన జింక సాయంత్రం అవుతున్నా తిరిగి రాకపోవటంతో తాబేలు, ఎలుక, కాకి కంగారు పడ్డాయి. చాలా సేపు ఎదురుచూసినా జింక వస్తున్న జాడ కనిపించలేదు.
'స్నేహితులారా! చిత్రాంగుడు ఇంతసేపయినా ఇంటికి తిరిగి రాలేదంటే ఏదో ప్రమాదంలో చిక్కుకొని ఉంటాడు అంది తాబేలు కంగారుగా. 'అవును నిజమే!' అన్నాయి ఎలుక, కాకి. 'ఇప్పుడు ఏం చేద్దాం!' అనుకున్నాయి ఆ మూడు. స్నేహితులారా! నేను ఎగిరివెళ్ళి అడవంతా చూసివస్తాను' అంటూ కాకి రివ్వుమంటూ ఆకాశంలోకి ఎగిరింది.
తాబేలు, ఎలుక చిత్రాంగుడు వస్తాడేమోనని నాలుగు దిక్కులు చూస్తూ నిల్చున్నారు. ఆకాశంలో ఎగురుతున్న కాకికి ఒకచోట జింక కనిపించిది. కాని అది వేటగాడు పన్నిన వలలో చిక్కికుపొయి బాధతో గింజుకుంటోంది. కాకి జింక ముందు వాలింది. కాకిని చూసి జింక ఆనందంతో 'వచ్చావా! లఘుపతనకము ఆహారం కోసం వచ్చి చూసుకోకుండా వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాను నన్ను రక్షించవా' అంది. 'భయపడకు చిత్రాంగా! నేను మన ఎలుక మిత్రుడు హిరణ్యకుడిని తీసుకువస్తాను అతను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాడు!' అని కాకి జింకకు ధైర్యం చెప్పి మళ్ళీ ఆకాశంలోకి వేగంగా ఎగిరి వెళ్ళి కొద్దిసేపట్లోనే ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని వచ్చి జింక దగ్గర వాలింది.
ఎలుక తన పదునైన పళ్ళతో వల కొరికి జింకను విడిపించింది. ఆ ముగ్గురు ఆనందంగా కబుర్లు చెప్పుకొంటూ తమ ఇళ్ళ వైపు నడిచారు. దారిలో వాళ్ళకి తాబేలు ఎదురుపడింది. అయ్యో! మంధరా నువ్వెందుకు వచ్చావు అనడిగాడు హిరణ్యకుడు. 'చిత్రాంగుడు ఆపదలో ఉన్నాడని తెలిసి ప్రశాతంగా కూర్చోలేకపోయాను.
మీరిద్దరూ చిత్రాంగుడిని రక్షిస్తారని నాకు తెలుసు. అయినా మనసు ఊరుకోలేదు. అందుకే వచ్చాను అంటూ సమాధానమిచ్చాడు మంథరుడు. 'నువ్వు నిజమైన స్నేహితుడివీ అంటూ చిత్రాంగుడు ఆనందంగా మంథరుడిని ముద్దు పెట్టుకున్నాడు. ఆ నలుగురూ అనందంగా కబుర్లు చెప్పుకొంటూ ఇంటి దారి పట్టారు. కొంతదూరం ఆ నలుగురు నడిచే సరికి వేటగాడు ఎదురుపడ్డాడు. వాడిని చూడగానే జింక పొదలోకి దూరిపోయింది. కాకి ప్రక్కనే ఉన్న చెట్టు మీదకి ఎగిరిపోయింది, ఎలుక ప్రక్కనే ఉన్నకలుగులోకి దూరిపోయింది. తాబేలు మాత్రం ఎటూ పారిపోలేక వేటగాడి చేతికి దొరికిపోయింది.
జింక తప్పించుకున్నా తాబేలు దొరికిందని ఆనందపడ్డ వేటగాడు తాబేలును బాణం కొసకి తాడుతో కట్టి భుజం మీద వేసుకొని ఇంటి దారిపట్టాడు. వేటగాడు కొంతదూరం వెళ్ళగానే జింక, ఎలుక, కాకి ఒక్కచోట చేరి 'అయ్యో! చిత్రాంగుడు వేటగాడి బారి నుంచి తప్పించుకున్నాడంటే మళ్ళీ మంథరుడు వీడి చేతికి దొరికాడే' అనుకుని బాధపడ్డాయి.
అప్పుడు హిరణ్యకుడు 'స్నేహితులారా! మన మంథరుడిని రక్షించుకుంటానికి నాకు ఒక మంచి ఉపాయం తట్టింది అంది. 'హిరణ్యకా! తొందరగా ఆ ఉపాయం చెప్పు అంది కాకి. 'వేటగాడు నడిచే దారిలో చిత్రాంగుడు చచ్చినట్లు పడి ఉంటాడు. అప్పుడు వేటగాడు పట్టుకుంటానికి మంథరుడిని కట్టిన బాణం క్రింద పెట్టి వెళతాడు. అప్పుడు ఆ తాడును నేను కొరికి మంథరుడిని తప్పిస్తాను' అని చెప్పింది.
ఆ ఉపాయం ఎలుకకి, కాకికి నచ్చింది. ఆ మూడు అడ్డదారిలో వేటగాడి కంటే ముందుకి పోయి ఒక చోట జింక దారికి అడ్డంగా పడుకొంది. కాకి దాని మీద వాలి ముక్కుతో పొడుస్తున్నట్లు నటించసాగింది. ఆ దారిలో నెమ్మదిగా వస్తున్న వేటగాడు జింకను చూసాడు. దాని మీద వాలి కాకి ముక్కుతో పొడవటం వల్ల అది చచ్చిపోయిందనుకొని 'ఆహా! ఏమి నా భాగ్యం. ఈ రోజు అదృష్టం నా పక్షాన ఉంది అందుకే వలలో జింక తప్పించుకున్నా ఇక్కడ మరొక జింక దిరికింది అని ఆనందపడుతూ భుజం మీద బరువుగా ఉన్న తాబేలును నేల మీద పెట్టి జింక దగ్గరకు నడిచాడు.
వెంటనే ఎలుక వచ్చి తాబేలుకి కట్టిన తాడును కొరికేసింది. కాకి 'కావ్! కావ్'మని అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. జింక పారిపోయింది. వేటగాడు కొయ్యబారి పోయి అంతలోనే తేరుకుని తాబేలు కోసం చూసాడు. అప్పటికే తాబేలు ప్రక్కనే ఉన్న చెరువులోకి పారిపోయింది.
'ఆహా! ఏమి నా దురదృష్టం చేతిలో వున్న దానిని వొదులుకున్నాను అనుకొంటూ ఆ వేటగాడు ఇంటికి వెళ్ళిపోయాడు.
ఎలుక, జింక, తాబేలు, కాకి ఆనందంగా తమ ఇంటికి వెళ్ళిపోయాయి. చూసారా! స్నేహం అంటే ఈ నాలుగు ఉన్నట్లు ఉండాలి. ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకుంటానికి అవసరమైతే ప్రాణాలను కూడా ఫణంగా పెట్టగలగాలి. పనికిరాని స్నేహితులు పదిమంది ఉండే కంటే అవసరంలో ఆదుకొనే స్నేహితుడు ఒక్కడుంటే చాలు. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం.
గోదావరి నదీ ప్రాంతములో కపిలేశ్వరము అనే గ్రామము ఉంది. ఓ మోతు బరికి కృష్ణ అనే కొడుకు ఉన్నాడు. అతనిలో ఎంత కష్టమయిన విద్యనైన క్షణములో నేర్చుకునే చురుకుదనము ఉంది. ఆగకుండా ఎనిమిది మైళ్ళ దూరమయినా పరుగుపెట్టగలడు. గురితప్పకుండా చిటారుకొమ్మపై వున్న కాయని కొట్టగలడు. ఎంతటి బరువైనా సులభముగా ఎత్తగలడు. కుస్తీలు పట్టి శభాష్ అనిపించుకోగలడు. తండ్రికి వ్యవసాయ పనుల్లో, తల్లికి ఇంటిపనిలో సాయం చేస్తుంటాడు.
"మీ అబ్బాయి కృష్ణ చాలా చురుకైనవాడు. రాజమహేంద్రవరములో గల శంకరతీర్ధులవారి వద్దకి పంపిన వాడి తెలివితేటలు ఇంకా రాణించగలవు" అని గ్రామములోగల పెద్దలు చెప్పారు. అంతేగాక ఆయనకి రాని విద్యలు లేవు. మహాపండితుడు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారికి జీవన భుక్తికి ఏలోటు వుండదు అని చెప్పారు. తండ్రి శంకరతీర్ధుల వారి గురించి కృష్ణకి చెప్పి చూశారు. కాని కృష్ణ వారి మాటలు వినలేదు.
కృష్ణ "జీవితంలో క్రొత్త విద్యలు నేర్చుకుని ఏం చేయాలి? ఉన్నంతలో నలుగురికి సాయపడాలి. నేర్చుకోగల పరిస్థితి ఎందుకు? ఆయన వద్ద ఎందుకు శిష్యరికం చెయ్యాలి. నేను గొప్పవాణ్ణికాదా? నేనే క్రొత్త విద్య కనిపెట్టగలను" అని అత్మవిశ్వాసంతో పలికాడు. తన గ్రామ ప్రజలు తన గొప్పతనము గుర్తించాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే ఉద్దేశ్యం కలిగింది. ఆ ఊరిలో పెద్దతోట ఉంది. ఆ తోటలో ఒక చెట్టుకి రేగికాయలు ఉన్నాయి. అవి తింటే కాకరకాయలాగా చేదుగా ఉంటాయి. ఆ కాయల జోలికి ఎవరూ వెళ్ళరు. వాటిని గురించి బాగా ఆలోచించాడు.
మరుసటి రోజు సాయంత్రం ఒక కోతి ఆ కాయల్ని తిని రెట్టించిన ఉత్సాహంతో ఆకాశములోకి ఎగిరింది. అది గమనించిన కృష్ణ రెండుకాయలు తిని మరి నాలుగు కాయలు జేబులో వేసుకుని పైకి ఎగిరి పక్షిలాగా పై ఎత్తుకి వెళ్ళి క్రమంగా క్రిందకి దిగాడు. ఇటువంటి ఫలాలు తినే ఆంజనేయుడు లంకని దాటాడా అనే సంశయము కూడా కలిగింది కృష్ణకి మరుసటి రోజు గ్రామ పెద్దల్ని సమావేశపరచి వారికి చెప్పి ఆకాశగమనము చేయసాగాడు. ఆ వార్త దావానంలా అంతా ప్రాకిపోయింది. రాజమహేంద్రవరములోగల శంకరతీర్ధులవారికి తెలిసి వారు ఈ గ్రామమునకు వచ్చి కృష్ణను కలిశారు. తనను శిష్యునిగా చేసుకుని ఆ విద్య నేర్పమని అడిగారు. తన గురించి చెప్పారు.
కృష్ణ "తమరు శంకరతీర్ధుల వారా? తమకి రానివిద్య లేదంటారు గదా? ఈ ఒక్క విద్యకోసం వెతుక్కుంటూ నావద్దకి వచ్చారా? తమకి రాని విద్య ఉండకూడదనే అహంభావమా? " అని అడిగాడు. "నాయనా! నాకే గనక అహంకారం వుంటే నీ వద్దకి శిష్యరికం చేయటానికి రాను శంకరతీర్ధులవారు అనగా" అలాంటప్పుడు ఈ కొత్త విద్య సంపాదించాలనా? " అని కృష్ణ అడిగాడు. విద్యావంతుడికి ధన సంపాదనపై వ్యామోహము ఉండదు. నేను విద్యలు నేర్చుకున్నది నా కోసమూ కాదు. నాకున్న జ్ఞానము నా భవితరాల వారికి పంచిపెట్టాలనే సదుద్దేశమే.
నేను దాపరికము లేకుండా మనకున్న జ్ఞానము మనతోనే అంతరించిపోకుండా జాగ్రత్తపడుతున్నాను అని వినయముగా చెప్పారు శంకరతీర్ధులు. కృష్ణ హేళనగా నవ్వి ఈ విద్య నాతోనే అంతరచిపోయినందువల్ల ప్రమాదం ఏమీ లేదు. ప్రపంచానికి నష్టము కలగదు అని అన్నాడు.
"ఉంది నాయనా! మనిషి నీటిలో ఈదాలి, గాలిలోకి ఎగరాలి. అన్ని వాతావరణ పరిస్థితులకి తట్టుకోవాలి. అదే నీటిలో చేప గాని, మొసలి గాని బయటకు వస్తే బలహీనమయి ప్రాణము కోసం విలవిలలాడగలవు. హిమాలయ పర్వత శ్రేణులలో ఉండే ఎలుగుబంటి ఎడారిలో ఉండలేదు. నీవు నేర్చిన విద్య వలన ఏరు దాటవచ్చు, కార్చిచ్చులా మండుతున్న మంటల్లోంచి బయటపడవచ్చు. ఏ విద్యకైనా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి అవసరాన్ని బట్టి మనుష్యులు ఉపయోగించుకోగలరు. విద్యలను, గ్రంధస్థము చేసి ప్రచారం చేయటమే విద్యావంతుల కర్తవ్యము" అని చెప్పారు శంకరతీర్ధులవారు.
వారు చెప్పిన మటలు వినగానే కృష్ణ ఆయనకి నమస్కరించి పాదాలపై పడి "నన్ను మన్నించండి. నేను మీకు శిష్యరికం చేసి నా జ్ఞానము అభివృద్ధి చేసుకుంటాను. నాకు తెలిసిన విద్య మీకు గురుదక్షిణగా సమర్పించుకుంటాను.
"నేనే గొప్పవాణ్ణి అనే అహం నాలో కలిగి మీకు మనస్థాపం కలిగించాను. నన్ను తమ శిష్యుడిగా స్వీకరించండి" అని అన్నాడు.
విద్యావంతునికి వినయము భూషణము వంటిది. రోజూ గురువును భక్తి శ్రద్ధలతో పూజించి మంచి శిష్యునిగ, ఉత్తమపౌరునిగ ఉంచుతుంది. విద్య వలన వివేకము, వినయము, జ్ఞానము కలుగును. విద్యలేనివాడు వింత పశువని సామెత కలదు.
అనగా అనగా ఒక పెద్ద అడవి వుంది. అందులో ఎన్నో జంతువులు జీవిస్తున్నాయి. ఆ అడవిలోనే ఒక తోడేలు దాని భార్యా పిల్లలతో కలిసి వుంది. ఈ తోడేలు దాని కాపురం ఒక గుహలో పెట్టింది. అవి పగలంతా అడవిలో తిరిగి ఆహారము తినేవి. రాత్రి వేళలో గుహను చేరి విశ్రాంతి తీసుకునేవి. అలా రోజులు గడుస్తున్నాయి. వానాకాలం మొదలయింది. ఆ సంవత్సరం వానలు విపరీతంగా కురిశాయి. ఆ వానల వలన వాగులు పొంగి వరదలు వచ్చాయి. ఆ అడవి సగం నీటితో నిండిపోయింది. అందులో తోడేలు గుహ కూడా వుంది. దాని కుటుంబానికి ఆహారం దొరకటం కూడా కష్టమయింది. వాటికి ఏమి చేయటానికీ పాలుపోలేదు. అచటి నుండి అవి బయలుదేరి మంచి గుహ కోసం వెతకటం మొదలు పెట్టినాయి. తోడేలు తన భార్యతో "మనకు చాలా చెడు రోజులు వచ్చినాయి. ఆహారము లేదు సరికదా! మన పిల్లలు వానకు తడిసి పోతున్నారు. ఇపుడేమి చేద్దాం?" అని అంది. ఆడ తోడేలు చాలా తెలివిగలది. అది బాగా ఆలోచించింది. అచటకు దగ్గరలో ఒక గుహ వుంది. దానిలో ఒక సింహం వుంది. అది విశాలమైన గుహ. బాగా ఆలోచించగా ఈ విషయం ఆడ తోడేలుకు గుర్తుకు వచ్చింది. దానిలో ఎంత కాలమైనా హాయిగా వుండవచ్చు అనుకుంది. ఈ ఆలోచన మగనికి చెప్పింది. అది విని తోడేలు మండిపడింది. "ఉండీ ఉండీ మనమంతా సింహానికి ఆహారమవుదామా?" అంది. ఆడ తోడేలు ఒక మంచి పథకము ఆలోచించింది.
ఏమి చేయాలో వివరంగా మగ తోడేలుకు చెప్పింది. ఆ పథకానికి తోడేలు సంతోషించింది. ఆ పనికి పూనుకుంది. మగ తోడేలు,ఆడ తోడేలు వాటి పిల్లలు అన్నీ కలిసి సింహం గుహ ముందుకు చేరాయి. మగ తోడేలును, పిల్లలనూ చాటుగా ఉండమంది. అచట ఒక చెట్టు చాటున అవి ఉన్నాయి. ఆడ తోడేలు ఒక్కటి నెమ్మదిగా ఆ గుహద్వారము దగ్గరకు చేరింది. అచట చప్పుడు ఏమీ వినపడలేదు. ఆడ తోడేలు నెమ్మదిగా గుహలోకి తొంగి చూసింది. అచట ఎవరూ కనపడలేదు. గుహ అంతా ఖాళీగా వుంది. నెమ్మదిగా గుహలోపలికి వెళ్ళి అంతా కలియ తిరిగింది. ఎటువంటి అలికిడీ లేదు. సింహం అప్పుడు గుహలో లేదు. బయటకు ఆహారము కోసం వెళ్ళింది. గుహ విశాలంగా చాలా బావుంది. సింహం ఆహారం తిని రాత్రి వేళకు వస్తుందని అర్థమైంది. తోడేలు తన భర్తనూ, పిల్లలనూ లోపలికి రమ్మని సైగ చేసింది. వారంతా లోపలికి చేరారు. పగలంతా అడవిలో తిరిగి ఆహారము తిని చీకటి పడగానే సింహం గుహకు వస్తే, ఏమి చేయాలో మగ తోడేలుకు చెప్పి గుహ బయటనే కాపలా వుంచింది. చీకటి పడసాగింది. దూరము నుంచి సింహం రావటం చూసింది. సింహం గుహకు దగ్గరగా రాగానే మగ తోడేలు గుహలోకి వెళ్ళింది.
ఆడ తోడేలు పిల్లలను గబ గబా నాలుగు దెబ్బలు కొట్టింది. అవి పెద్దగా ఏడవటం మొదలు పెట్టినాయి. మగ తోడేలు, ఆడ తోడేలు కలిసి విచిత్రంగా అరవటం మొదలు పెట్టాయి. ఆ అరుపులూ, కేకలూ వింటుంటే సింహానికి కొంచెం భయమేసింది. ఏదో పెద్ద జంతువు నా గుహలోకి చేరిందేమో అనుకుంది. అది గుహలోకి వెళ్ళకుండా బయటనే వుంది. సింహం ద్వారం వద్ద నిలబడి వుండటం చూచింది. ఆడ తోడేలు ఇలా అరవసాగింది. "పిల్లలు ఏడుస్తున్నారు. వారికి సింహం మాంసం వండి పెట్టాలట! లేకపోతే తిండి తినరట. గోల పెడుతున్నారు. ఇపుడు నేను ఏమి చేసేది? ఇప్పటికిప్పుడు సింహపు మాంసం కావాలంటే ఎలా వస్తుంది? నేను ఎక్కడి నుండి తీసుకురాను." అంది. దానికి మగ తోడేలు ఇలా అంది "తొందరపడకు ఒక సింహం ఇటు రావటం చూశాను. అది బాగా బలిసి వుంది. దాని మాంసం బాగా రుచిగా వుంటుంది. అది ఈ వైపుకి రాగానే దానిని చంపి దాని మాంసం తీసుకువస్తాను" అని గట్టిగా అరిచింది. ఈ మాటలు సింహం వింది. దానికి బాగా దడ పుట్టింది. లోపల ఏ జంతువులు వున్నాయో సింహానికి అర్థం కాలేదు. అవి తనను చంపుతాయేమో అనుకుంది. వెనుకకు చూడకుండా చాలా దూరం వెళ్ళింది. తోడేళ్ళ సంసారం గుహలో చేరటం అచట వుండే ఒక నక్క చూసింది. తోడేళ్ళ సంభాషణ అంతా వింది. సింహం పరుగు తీయటం చూసింది.
తోడేళ్ళ సాహసానికి నక్క ఆశ్చర్యపోయింది. తోడేళ్ళు సింహాన్ని మోసం చేసి గుహనుంచి తరమటం గమనించింది. తోడేళ్ళకి ఎలాగైనా బుద్ది చెప్పాలనుకుంది. సింహం కోసం ఆ ప్రాంతమంతా వెతికింది. అన్ని చోట్లా గాలించింది. దానికి సింహం దగ్గరలో ఎక్కడా కనపడలేదు. నక్క చాలా దూరం వెళ్ళి అంతా వెదికింది. చివరకు ఒక గుట్ట చాటున సింహం పడుకుంది. అది బాగా రొప్పుతోంది. నక్క మెల్లిగా సింహం దగ్గరకు చేరింది. ఇలా అంది. "ఓ మృగరాజా! నీవు ఈ అడవికి రాజువు. నీలాంటి వారు ఒక తోడేలుకి ఇలా భయపడటం సబబేనా?నీలాంటి నాయకులు అలా పరుగు తీయవచ్చునా? రేపు ఈ విషయం మిగిలిన జంతువులకి తెలిసిన నీ పరువు వుంటుందా" ఈ మాటలకి సింహం ఏ సమాధానం చెప్పలేదు. దానికి భయం ఇంకా తగ్గలేదు. నక్క మాటలు సింహం అసలు నమ్మలేదు. నక్క మరలా ఇలా అంది. "ఓ రాజా! ఆ తోడేలును నీ గుహనుంచి వెళ్ళగొడతాను. నీవు నాతోరా "సింహం తనలో తాను ఇలా అనుకుంది. ఇది అసలే నక్క దీనిని అసలు నమ్మరాదు. దీనితో వెళితే ఇది నన్ను గుహ దగ్గరకు తీసుకెళ్ళి అచటనే వదలిపెడుతుంది. అపుడు నేనేం చేయాలి? ఆ జంతువుని చూసి నక్క పారిపోతే? ఇంతలో సింహానికి ఒక ఉపాయం తట్టింది. "ఓ నక్కా! నేను నిన్ను నమ్మను. నేను చెప్పింది చేస్తే నీతో రావడానికి ఒప్పుకుంటాను" అంది. నక్క అది ఏమిటో చెప్పమంది. "నా తోకతో నీ తోకను ముడివేసుకొని యిద్దరం వెళదాం సరేనా" అంది. దీనికి నక్క ఒప్పుకుంది. ఆ తోడేళ్ళు ఏమి చేయలేవని నక్క ఆలోచన.
సింహం, నక్క తోకలు ముడివేసుకొని గుహ వద్దకు చేరుకున్నాయి. సింహం, నక్క కలిసి రావడం ఆడతోడేలు చూసింది. నక్క ఏదో ఎత్తు వేసిందని ఆడతోడేలు ఊహించింది. తోడేలు గుహముందుగా వచ్చి పక్కకు నిలబడింది. "ఏం నక్కా నేను రెండు సింహాలను తెమ్మంటే, ఒక్క దాన్నే తెచ్చావేమి? సరే ముందు నిన్ను చంపుతాను. తరువాత సింహాన్ని కూడా చంపి ఆ రెండింటినీ కలిపి వండుకు తింటాను" అని అరిచింది. ఆ మాటలు సింహం వింది. నక్క తనని మోసం చేసిందని భావించి వెనుకకు తిరిగి వేగంగా పరుగెత్తింది. ఆ పరుగులో నక్క శరీరం చీరుకుపోయింది. తోక తెగి, అది క్రిందపడి చనిపోయింది. ఇదంతా చెట్టుపైన వున్న ఒక కోతి చూచింది. నెమ్మదిగా ఆ కోతి సింహం దగ్గరకు వెళ్ళింది. నక్క చెప్పినట్లే చెప్పింది. మెల్లిగా సింహాన్ని ఒప్పించింది. సింహం కోతితో ఇలా అంది "నీవు తాడుతో నా మెడకు నీ మెడకు కట్టు. అప్పుడు వెళ్దాం" అంది. అలాగే చేసింది. ఆ రెండూ తాడుతో మెడలు కట్టుకున్నాయి. నెమ్మదిగా గుహ దగ్గరకు వెళ్ళినాయి. రెంటిని ఆడతోడేలు చూసింది.
ఆడతోడేలు నక్కని అరచినట్లే "ఓసీ కోతి! పొద్దుననగా సింహాన్ని తీసుకువస్తానని ఇంతరాత్రికి వస్తావా? ముందు నిన్ను చంపి, తరువాత సింహాన్ని చంపుతాను" అంది పెద్దగా. ఈ మాటతో సింహానికి వణుకు పుట్టింది. అది వెనుకకు తిరిగి పరుగులంకించుకుంది. దానితో పాటు కోతి కూడా పరుగెత్తాల్సి వచ్చింది. అవి రెండూ అలా పరుగెత్తి ఒక దిగుడు బావిలో పడి చనిపోయాయి. అందుకే పెద్దలు అంటారు "బుద్ధిబలం వుంటే బలహీనులు కూడా బలవంతులను జయించవచ్చును" అని.
హేలాపురికి రాజు నవనీత వర్మ. ఆయన జనరంజకంగా పరిపాలన చేసేవాడు. ఆయన పేదలకు ఎంతో సహాయం చేసేవాడు. ఒక రోజున ఒక పేద బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అతని పేరు పుండరీక శర్మ. 'బ్రాహ్మణుడా! నీవు ఏ పని మీద వచ్చావు?' అని అడిగాడు రాజు. అందుకు బ్రాహ్మణుడు ఎంతో వినయంగా చెప్పాడు. 'మహారాజా! నేను కటిక బీదవాడిని. ఆ బాధ భరించలేకుండా ఉన్నాను. దయతో నాకు సహాయం చేయండి' అని వేడుకున్నాడు. రాజుగారు అతని బాధ తెలుసుకున్నారు. అతని వంక పరిశీలనగా చూశారు. అతని బట్టలు చిరిగి ఉన్నాయి. అతని శరీరం సన్నగా ఎముకలు కనిపించేలా ఉంది. రాజు కొంతసేపు ఆలోచించాడు. 'ఇక మీద మీరు రోజూ ఉదయం రండి. నన్ను కలవండి' అని చెప్పాడు మహారాజు. రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు శర్మ. మరుసటి రోజు ఉదయం మహారాజును కలిశాడు శర్మ. 'ఈ ఉత్తరం తీసుకువెళ్ళండి. మా కోశాధికారికి ఇవ్వండి' అన్నాడు మహారాజు. శర్మ ఆ ఉత్తరం తీసుకుని కోశాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఆ ఉత్తరం చూసుకొని కోశాధికారి రెండు వరహాలు శర్మకు ఇచ్చాడు. శర్మకు ఎంతో ఆనందం కలిగింది. రెండు వరహాలు అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ డబ్బులు. రోజువారీ అతని కుటుంబానికి కొంత ఖర్చు అవుతుంది. ఇంకా డబ్బులు మిగులుతాయి. రాజు రోజూ ఉత్తరం ఇస్తున్నాడు. ఉత్తరం తీసుకుని కోశాధికారి రెండు వరహాలు ఇస్తున్నాడు. బ్రాహ్మణుడి జీవితం ఆనందంగా గడిచిపోతుంది. ఒకరోజు పుండరీకుడు కోశాధికారి దగ్గర రెండు వరహాలు తీసుకున్నాడు. తిన్నగా ఇంటిదారి పట్టాడు. దారిలో అతనికి ఒక మనిషి కనిపించాడు.
'నన్ను రోజూ రాజుగారి దగ్గర చూస్తున్నారు కదా! నేను రాజుగారి మంగలిని. రోజూ రాజుగారికి మర్దన చేస్తాను' అన్నాడు ఆ మనిషి. అవును. మిమ్ములను అక్కడ చూశాను. ఇంతకూ నాతో ఏమిటి పని? అన్నాడు పుండరీకుడు. నేను రోజూ రాజుగారికి మర్దన చేస్తాను. ఆయన శరీరం తేలికపడి సంతోషంగా ఉంటారు. ఆ సమయంలోనే నువ్వు వస్తావు. రాజుగారు సంతోషంతో నీకు సహాయం చేస్తున్నారు. అంటే ఆ సంతోషం నావల్లనే కదా వస్తోంది! నాకు ఇక్కడ చాలా పలుకుబడి ఉంది. నేను కోశాధికారికి చెబితే నీకు రావలసిన డబ్బు ఆగిపోతుంది. నేను చెప్పకుండా ఉండాలీ అంటే నువ్వు ఒక పనిచేయాలి. నాకు రోజూ నీకు వచ్చే డబ్బులో వాటా ఇవ్వాలి. రోజూ అర వరహా కానుకగా ఇవ్వాలి. నా మాటకు తిరుగులేదు అన్నాడు ఆ మంగలి. వాడి పేరు చెన్నయ్య. పుండరీక శర్మకు మతిపోయింది. ఏమి అనడానికి తోచలేదు. కొంతసేపు ఏమీ మాట్లాడలేదు శర్మ. ఆ తరువాత "నేను నీకు లంచం ఇవ్వను" అని తన దారిన తను వెళ్ళిపోయాడు. కానీ చెన్నయ్య, శర్మను వదలలేదు. రోజూ దారిలో కనిపించి లంచం అడగసాగాడు. ఒకరోజు శర్మకు ఎదురుపడ్డాడు మంగలి చెన్నయ్య. 'రాజుగారు మీమీద కోపంగా ఉన్నారు' అన్నాడు చెన్నయ్య శర్మతో.
ఎందుకూ? అన్నాడు శర్మ. 'మీరు ముక్కు నుండి వదిలే గాలి వాసన వస్తోందట. ఆ చెడు వాసనకు రాజుగారు చిరాకు పడుతున్నారు. మీరు రేపటి నుండి ముక్కుకు గుడ్డ కట్టుకుని రమ్మని చెప్పారు' అన్నాడు చెన్నయ్య. నిజమే అనుకున్నాడు శర్మ. చెన్నయ్య రాజుగారి వద్దకు వెళ్ళాడు. రాజుగారి పాదాలు వొత్తుతూ 'కొందరు ఉపకారం పొందుతూ కూడా చిన్నచూపు చూస్తూ ఉంటారు' అన్నాడు చెన్నయ్య. 'ఎవరిని గురించి నువ్వు మాట్లాడుతున్నావు?' అన్నారు మహారాజు. తమరి నుండి రోజూ రెండు వరహాలు తీసుకు వెళ్ళే బ్రాహ్మణుడు. అతను ఉదయం ఏదో గొణుగుతూ పోతున్నాడు. ఏమిటి సంగతి? అని అడిగాను నేను. రాజుగారి నోటినుండి చెడువాసన వస్తోంది. అది తట్టుకోవాలీ అంటే ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి అన్నాడు మహారాజా! అన్నాడు చెన్నయ్య వినయంగా! మరుసటి రోజు చెన్నయ్య చెప్పిన విధంగానే వచ్చాడు శర్మ. ముక్కుకూ, మూతికీ ఎర్రని గుడ్డ కట్టుకుని రాజుగారిని కలిశాడు. రాజుగారు సంగతి ఏమిటి? అని శర్మను అడిగారు. 'నా ముక్కు నుండి చెడు వాసన వస్తోంది. దానివల్ల మీకు చిరాకు కలుగుతోంది. దానిని నివారించడానికే మహారాజా!' అన్నాడు శర్మ అమాయకంగా! రాజుగారికి చెన్నయ్య ఎత్తుగడ తెలిసింది. చెన్నయ్య లంచం అడిగిన సంగతి కూడా చెప్పాడు పుండరీక శర్మ.
మరురోజు శర్మకు రెండు ఉత్తరాలు ఇచ్చాడు మహారాజు. 'ఈ రెండో ఉత్తరం చెన్నయ్యకి ఇవ్వండి. మీరు మీ ఉత్తరం చూపించి ధనం తీసుకోండి' అన్నాడు మహారాజు. పుండరీక శర్మకు దారిలో చెన్నయ్య కనిపించాడు. మహారాజు గారు నీ సేవను ఎంతో మెచ్చుకున్నారు. నీకు ఈ ఉత్తరం ఇమ్మని చెప్పారు అని ఉత్తరం ఇచ్చాడు శర్మ. "చెన్నయ్యా! నీకు డబ్బు ఇవ్వనందుకు ఎంతో బాధ పడుతున్నాను. ఈ రోజు నాకు డబ్బు అక్కరలేదు. ఈ ఉత్తరం తీసుకు వెళ్ళి నువ్వే ఆ డబ్బు తీసుకో" అని రాజుగారు ఇచ్చిన ఉత్తరం ఇచ్చాడు. చెన్నయ్య సంబరపడుతూ డబ్బు కోసం కోశాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఉత్తరం చూసిన కోశాధికారి మండిపడ్డాడు. డబ్బులకు బదులు చెన్నయ్యను భటులు బంధించారు. "నువ్వు లంచం కోసం శర్మగారిని బెదిరించావు. నీ నోటిని సూదీ దారంతో కుట్టమని మహారాజుగారి ఆజ్ఞ. నీ లంచగొండి తనానికి యిదే తగిన శిక్ష" అన్నాడు కోశాధికారి. చెన్నయ్య సిగ్గుతో తలదించుకున్నాడు.
శిళ్లంగేరి అనే గ్రామంలో ఒక జమిందారుండేవాడు. అతడు చాలా ధర్మాత్ముడు. పేదవాళ్లు వచ్చి జీవనోపాధి చేసుకోవడానికి ఏ సహాయం అడిగినా లేదనేవాడుకాదు. ఒక రోజు అతని వద్దకు సోమశర్మ అనే ఒక పేదవాడొచ్చాడు. జమిందారు అతనికి పుష్కలంగా పాలునిచ్చే ఆవునిచ్చి పాలవ్యాపారం చేసుకొని జీవించమన్నాడు. సోమశర్మ జమిందారుతో "అయ్యా, తమరేమో ఆవునిచ్చారు. కానీ దానిని ఉంచడానికి మా చిన్న ఇంటిలో స్థలం లేదు." అన్నాడు. జమిందారు కొంత ధనమిచ్చి, ఆవును కట్టివేయడానికి ఒక గుడిసె వేసుకోమన్నాడు.
"అయ్యా ఆవునిచ్చారు. దానిని కట్టివేసుకోవడానికి ఒక గుడిసె వేసుకోవడానికి ధనమిచ్చారు. ఆవు ఇచ్చే పాలను అమ్మితే వచ్చే డబ్బు మాకే సరిపోతుంది. దానికి గడ్డీ దాణా ఎలా కొనను?" అన్నాడు సొమశర్మ. అందుకు జమిందారు ఆవుకు కావలసిన గడ్డీ, దాణా కూడా ఉచితంగా తానే ప్రతీరోజు తన ఇంటి నుండి పంపిస్తానన్నాడు.
రెండు రోజులు గడిచాయి. సోమశర్మ జమీందారు దగ్గరకు వచ్చి "అయ్యా నాకో ఇబ్బంది వచ్చింది. పాలు బజారుకు తీసుకెళ్లి అమ్మాలంటే కష్టంగా ఉంది. ఈ పని చేసే అలవాటు లేదు." అన్నాడు.
జమిందారు ఆ పాలను తానే కొంటానన్నాడు. మరో రెండు రోజులు గడిచాయి. ఈసారి సోమశర్మ జమిందారు వద్దకు వచ్చి, "అయ్యా ఇంత వరకు మేము భిక్షాటనతో కాలం గడిపిన వాళ్లం. ఈ ఆవుకు చాకిరీ చెయ్యడం, ఇంట్లో అన్నం వండుకోవడం మొదలైన పనులు చేయడం నా భార్యకు చాలా కష్టంగా ఉంది" అన్నాడు. జమిందారు ఆలోచించి "సరే మీకు శ్రమ లేకుండా ఒక పనిమనిషినీ, వంట మనిషినీ పంపిస్తాను" అన్నాడు.
సోమశర్మ ఇంటికి పనిమనిషి వంట మనిషి వచ్చారు. సోమశర్మకు, అతని భార్యకు చాలా సంతోషమయింది. వంట వండిపెట్టింది. భోజనం వేళకు సరిగ్గా సోమశర్మ ఇంటికి ముగ్గురు బ్రాహ్మణులు వచ్చారు. వీరు ఎందుకొచ్చారో సోమశర్మకు అర్థం కాలేదు. వాళ్లు సోమశర్మతో "శర్మగారూ, మమ్ములను జమిందారు పంపించారు. మీరు భోజనం చేయడం కూడా బద్దకం వల్ల కష్టంగా ఉంటుందని అందువల్ల ఆ పని చేయడానికి పంపించారు" అన్నారు.
సోమశర్మకు, అతని భార్యకు సిగ్గువేసింది. ఆ రోజు నుండి సోమరితనానికి స్వస్తిచెప్పి బాగా కష్టపడటం అలవాటు చేసుకొన్నారు.
ఓ ఊరిలో ఇద్దరు మిత్రులున్నారట వారిద్దరూ ఎప్పుడూ ఏదో విషయంగా వారు వాదులాడుకుంటూనే ఉంటారట. ఆ ఊరి వాళ్ళకు వీరి గోల తెలిసినా, క్రొత్తగా ఆ ఊరు వచ్చిన ఆసామికి వీరి గోల తలనొప్పిగా అనిపించి మిత్రులంటే ఏకమాటగా, ఏకత్వంగా, శాంతియుతంగా ఉండాలే కానీ, అయినదానికీ, కానిదానికీ కీచులాడుకునే వాళ్ళు అసలు మిత్రులెలా అవుతారు. అని అనుకొని ఆ విషయమే వారిని సూటిగా అడుగుతూ "మొగుడూ పెళ్ళాల మైత్రి ఎలాంటిదో గాఢ మైత్రి బంధం కూడా అంతే, అంటే భార్య కోపిస్తే భర్త సర్దుకుపోవాలి, భర్త కోపిస్తే భార్య తగ్గాలి. అప్పుడే ఆ సంసారం రచ్చకెక్కకుండా ఉంటుంది. 'స్నేహఁ' కూడా ఇలానే ఉండాలి తెలుసా" అని సలహా ఇచ్చాడట.
విన్న ఆ ఇద్దరూ పక్కున ఓ నవ్వు నవ్వారట. పైపెచ్చు ఆ వ్యక్తి వంక పిచ్చివాడివన్నట్లు చూస్తూ, "చూడూ ఒక్క మనిషి తన వంద తరాల బాగుకై పరితపిస్తున్నప్పుడు, ఇద్దరం మనుషులం కలిస్తే గొడవకాక ఏమవుతుంది. ఒక్కడి ఆలోచనైతే అది పాపమైనా, పుణ్యమైనా, అన్యాయమైనా, అవినీతి అయినా, ఇది తప్పు అనిచెప్పే దిక్కులేక చేసుకుపోతూనే ఉంటాడు కానీ, మంచీ చెడు అని రెండు పదాలు ఉన్నట్లు మేమిద్దరం ఉన్నాము. కాబట్టే ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి చేసే విషయంలోనే మేము కీచులాడుకుంటామే కానీ, మరొకటికాదు" అన్నారట.
విన్న ఆపెద్ద మనిషి "మీరు చెప్పేది నాకు అర్ధం కావటంలేదు. కొంచం విపులంగా చెప్పండి" అని అడగగా, "ఇందులో అర్ధమైయ్యేలా చెప్పేదేముంది బాబుగారూ నంగిలా నిమ్మనంగా ఉండి గోతులు త్రవ్వే వారి వలన సమాజానికి హానికానీ కల్మషం లేకుండా గలగలా సెలయేరులా గోలచేసే మావల్ల ఎవరికీ హాని ఉండదు ఏమంటారు" అని అడిగారట. ఆ విషయం నిజమేననిపించిన ఆ ఆసామి తనదారిన తాను వెళ్ళిపోయాడు.
అనగనగానేమో ఒక రాజుగారికి ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ళు ఇద్దరూ మంచి వాళ్ళుకారు. చిన్నవాడు మంచివాడేకానీ, పాపం అమాయకుడు. వీరిలో రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలా అని రాజు ఆలోచించి, ముగ్గుర్నీ పిలిచి మీకు మూడు పరీక్షలు పెడతాను. గెలిచిన వాడిదే రాజ్యం. మొదటి పరీక్షగా ప్రపంచంలోనే గొప్ప శాలువా తేవాలి అన్నాడు. ముగ్గుర్నీ మైదానంలోకి తీసుకువెళ్ళి మూడు పక్షి ఈకల్ని పైకి ఎగురవేసి అవి ఎటు ఎగిరితే ఆ దిశల్లో వెళ్ళిరండి అని కోటలోకి వెళ్ళిపోయాడు. వాటిలో ఒక ఈక తూర్పు దిక్కుగా ఎగిరితే పెద్దవాడు అటు వెళ్తానన్నాడు. ఇంకోటి పడమరకేసి వెళితే రెండోవాడు ఆ దిశగా వెళతానన్నాడు. మూడో ఈక పైకంటా ఎగిరి తిరిగి అక్కడే నేల మీద పడిపోయింది. అది చూసి పెద్దవాళ్ళిద్దరూ మూడోవానిని ఎగతాళి చేసి వెళ్ళిపోయారు. పాపం మూడోవాడు దిగులుగా కూర్చొని ఆ ఈకని తీస్తుంటే అక్కడ నేలమీద ఒక తలుపు కనిపించింది. దాన్ని తీసేసరికి కిందికి మెట్లు కనిపించాయి. దిగి వెళితే ఒక గది కనిపించింది. గదిలోపలి నుండి కప్పల రాజును నేను. కష్టాలన్నీ తీరుస్తాను అనే పాట వినిపించింది. మూడో వాడు లోపలికి వెళ్ళి చూస్తే, ఒక పెద్దకప్ప కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చొని ఉంది. దాని చుట్టూ బోలెడు కప్పలు కూర్చొని వున్నాయి.
కప్పల రాజు ఎవరు నువ్వు అని అడిగితే మూడో రాజకుమారుడు అంతా చెప్పాడు. వెంటనే ఆ కప్ప నా మాయల పెట్టె తెండి! అది నా మహిమల దుట్టి! అని అరిచేసరికి కప్పలన్నీ ఒక పెట్టెను మోసుకువచ్చాయి. కప్పరాజు దాని మూత తీసి దాంట్లోంచి బంగారు దారాలతో అల్లిన శాలువా తీసి రాజకుమారుడికి ఇచ్చింది. ఈలోగా పెద్దవాళ్ళిద్దరూ ఏం చేశారో తెలుసా? మూడోవాడు ఎలాగూ ఏమీ తేలేడు కాబట్టి గొప్ప శాలువా గురించి వెతికి శ్రమ పడటం ఎందుకనుకొని ఊరి సంతలో రెండు శాలువాలు కొనేసి వెనక్కి వచ్చేశారు. రాజు మూడో వాడు తెచ్చిన బంగారు శాలువా చూసి 'శభాష్' అన్నాడు. ఇప్పుడు రెండో పరీక్ష. ఈ లోకంలోనే మంచి ఉంగరం తేవాలి. అంటూ మూడు ఈకల్ని ఎగరేశాడు. అవి మళ్ళీ అలాగే పడ్డాయి. పెద్దవాళ్ళిద్దరూ తలో దిక్కుకు వెళితే, మూడోవాడు మళ్ళీ నేలమీద తలుపు తీసి కప్పరాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు కప్ప రాజు పెట్టెలోంచి వజ్రపు ఉంగరం తీసి ఇచ్చాడు.
ఈ సారి కూడా రాజు మూడో వాడు తెచ్చిన ఉంగరాన్ని చూసి 'శభాష్' అన్నాడు. ఇప్పుడు ఆఖరి పరీక్ష. ఈ భూమి మీదే అందమైన అమ్మాయిని తేవాలి. అంటూ మళ్ళీ ఈకలు ఎగరేశాడు. ఈ సారి కూడా పెద్దవాళ్ళిద్దరూ చెరోదిక్కు వెళితే మూడో ఈక కిందనే పడడంతో మూడోవాడు తిరిగి కప్పరాజు దగ్గరకే వెళ్ళాడు. కప్పలరాజు చప్పట్లు కొట్టి ఒక పల్లకి తెప్పించాడు. అందులో తన కూతురైన ఈ ఆడకప్పను కూర్చోమన్నాడు. ఆ పల్లకిని మోసుకుంటూ బోలెడు కప్పలు బయలుదేరాయి. చేసేదిలేక మూడోవాడు వాటి వెనుకే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. రాజు పెద్దవాళ్ళిద్దరూ తెచ్చిన అమ్మాయిలను చూసి, మూడోవాడికేసి తిరిగి నువ్వు తెచ్చిన అమ్మాయి ఏది? అన్నాడు. ఈలోగా కప్పలు పల్లకిని మోసుకుంటూ వెళ్ళాయి. రాజు పల్లకి తెర తీసి చూసేసరికి అందులో ఆడకప్ప ఉంది. సభలోని వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు. అంతా నవ్వుతుండగానే పల్లకిలో కప్ప బయటకు గెంతింది. అలా గెంతగానే అందమైన అమ్మాయిగా మారిపోయింది. ఆమె సౌందర్యానికి సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు.
రాజు మళ్ళీ 'శభాష్' అని మూడో వాడిని రాజుగా ప్రకటించాడు. కానీ పెద్దవాళ్ళిద్దరూ చెడ్డవాళ్ళుకదా? తండ్రి మీదకే కత్తులు దూసి 'ఇక మేమే రాజులం. మీరంతా రాజ్యం విడిచి పొండి' అన్నారు. అప్పుడో చిత్రం జరిగింది. పల్లకిని మోసుకువచ్చిన కప్పలన్నీ సైనికులుగా మారిపోయి, పెద్ద కొడుకులను బంధించి రాజుగారిని విడిపించాయి. ఆయన పెద్దకొడుకులను దేశం నుండి తరిమేసి మూడోవాడిని రాజును చేశాడు.
అది ఒక పెద్ద చెట్టు. దాని మొదలు దగ్గర కొన్ని రకాల రెక్కల పురుగులు చేరి, కబుర్లాడు కొంటున్నాయి. ఆ కబుర్లు పెరిగి పెరిగి, చివరికి మనలో ఎవరుగొప్ప? అనే వివాదానికి వచ్చింది!
ఆ పురుగులలో ఒక రెక్కల చీమ గబగబా ముందుకు వచ్చి చూడండి! నేను నేలమీద పాకగలను, గాలిలో ఎగరగలను 'నేనే గొప్ప' అంటూ అటూ ఇటూ తిరిగింది చరచరా! అది చూసి ఒక చీకురు పురుగు తన పెద్ద రెక్కలను ఆడిస్తూ చూడండి నా రెక్కలు ఎంత పెద్దవో, మీలో ఇంతంత పెద్ద రెక్కలు ఎవరికీ లేవు 'నేనే గొప్ప' అంది గర్వంగా, తన రెక్కలను చూసుకొంటూ, చూపిస్తూనూ!
ఇలా అన్ని పురుగులూ ఏవేవో గొప్పలు చెప్పుకొంటుంటే, ఓ మిణుగురు పురుగు చరచరా ముందుకు వచ్చి వూరుకోండి, లేనిపోని గొప్పలు చెప్పుకోకండి నన్ను చూడండి! నేను నేల మీద పాకగలను, గాలిలో ఎగరగలను. అంతే కాదు మీలో ఎవరికీ లేని గొప్పదనము నాకున్నది. నేను మిలమిలా మెరిశానంటే నక్షత్రంగా వుంటాను. "ఆకాశం నుండి ఓ తార దిగి వచ్చింది కాబోలూ" అనుకొంటారు అందరూ! నన్ను చూసి, ఎంత అందంగా ఉందో అని అందరూ ముచ్చటపడతారు.అంటూ గిర్రున తిరిగి మిలమిల మెరిసి పోయింది.
మిణుగురు పురుగు మెరుపులు చూసి చూసి మిగిలిన రెక్కల పురుగులు నివ్వెర పోయాయి. ఏమీ మాట్లాడలేక కళ్ళప్పగించి ఊరుకొన్నాయి. మిణుగురు పురుగు వయ్యారంగా గాలిలో ఎగురుతూ మెరుస్తూ వుంటే, బంగారు పిచ్చుక చూసి, రివ్వున చక చకా వచ్చి, ఆ మిణుగురు పురుగును ముక్కుతో కరుచుకొని, చెట్టుమీద ఓ కొమ్మకు కట్టుకొని ఉన్న తన గూటిలోని మట్టి ముద్దకు అంటించి, నొక్కేసింది. కాళ్ళు రెక్కలు మట్టిముద్దకు అంటుకు పోవడం వల్ల, మిణుగురు పురుగు కదలలేక పోయినది. ఎగరలేక పోయినది.
ఇది చూసి రెక్కల పురుగులన్నీ హడలిపోయాయి. అంతలో చీకురు పురుగు "చూశారా? నక్షత్రంలా మిలమిల మెరిసే శక్తి నాకే ఉంది" అంటూ గర్వంగా ఎగిరెగిరిపడిన మిణుగురు పురుగు గతి ఏమైందో! దానిని చూసి మనం బుద్దితెచ్చుకోవాలి. నేనే గొప్ప, నేనే గొప్ప అని విర్రవీగకుండా నడుచుకోవాలి" అనుకొంటూ, అటూ ఇటూ వెళ్ళిపోయాయి.
అనగనగా ఒక ఊరు. ఆ ఊరు చుట్టూరా పెద్ద అడవి. ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడు. ఆయనికి ఒక చిన్నారి కూతురు ఉంది. ఆ అమ్మాయి ఒంటి రంగు బంగారంలా ఉంది. తండ్రి సువర్ణ అని పిలిచేవాడు. సువర్ణకి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. రామయ్య రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు మందర. సువర్ణని చూసి అసూయ పడేది. మందరమ్మకి ఒక కూతురు పుట్టింది. ఆ పిల్ల పేరు ఆశ. ఆశకి బొమ్మలు తనకే కావాలి. మిఠాయి అంతా తనే తినాలి. గౌన్లు అన్నీ తనవే అనేది. పాపం! సువర్ణ ఎంత పని చేసినా, మందరమ్మ తిడుతూ, కొడుతూ ఉండేది. చిరిగిన గౌన్లు ఇచ్చేది. సరిగ్గా అన్నం పెట్టేది కాదు. ఆశకి తల్లి పోలిక వచ్చింది. శరీరం నల్లటి నలుపు రంగు. ఇంటికి వచ్చిన అందరూ సువర్ణని చూసి "బంగారు బొమ్మలా ఉందమ్మా" అని మెచ్చుకుంటుంటే, మందరమ్మ, చూసి పళ్ళునూరేది! మందరమ్మ అసూయ, కోపంతో, సువర్ణని ఎండలో పనిచేయించేది! అలా ఎండలో పనిచేస్తే ఆమె శరీర రంగు నల్లగా మారుతుందని. మందరమ్మ సువర్ణకి అన్నం పెట్టేది కాదు. పని చేసి అలసిపోయి, పశువుల పాకలో కూర్చుంది. సువర్ణని చూసి చీమలు జట్టుగా వంట ఇంటిలోనికి వెళ్ళాయి. రొట్టె ముక్కలు తెచ్చి సువర్ణకి ఇచ్చి వెళ్ళిపోయేవి. పెంపుడు చిలుక రివ్వున ఎగిరి వెళ్ళి జామకాయలు తెచ్చి, సువర్ణ ఒడిలో పడేసేది. సువర్ణ అడవిలోకి వచ్చింది. వెంట కుక్క పిల్ల కూడా వచ్చింది. తోడుగా రామచిలుక కూడా ఎగురుతూ వచ్చింది. సువర్ణకి అడవిలో నడిచి, నడిచి, ఆకలివేసింది. దాహం వేసి అలిసిపోయి మూర్చపోయింది. కుక్క పిల్ల పరుగెత్తుకు వెళ్ళి అడవిలో ఉండే అవ్వని తీసుకు వచ్చింది. అవ్వ సువర్ణ ముఖం మీద నీళ్ళు జల్లి లేపింది
అవ్వ సువర్ణతో, తన ఇంట్లో పనిచేస్తే "మంచి కానుక" ఇస్తానని చెప్పింది. సువర్ణ పని చేయసాగింది. సువర్ణ సోమరిపోతు కాదు! ప్రతి పనీ ఎంతో శ్రద్దగా, కష్టపడి చేస్తుంది! ఎవ్వరితోనూ పోట్లాడదు. ఒకసారి అవ్వ అడవిలోకి వెళుతూ, గది నిండా బంగారు నగలు పెట్టి, తలుపులు వేయకుండా వెళ్ళిపోయింది! సాయంత్రం అవ్వ తిరిగి వచ్చి నగలు చూసింది! అందులో ఒక్క నగ కూడా పోలేదు. మర్నాడు అవ్వ మళ్ళీ, వంట ఇంటి నిండా రకరకాల మిఠాయిలు పెట్టి తలుపు తెరచి వెళ్ళిపోయింది. సాయంత్రం వచ్చింది! ఒక్క మిఠాయి కూడా పోలేదు. సువర్ణ తనకి ఇచ్చిన రొట్టె ముక్కని మాత్రమే తిని ఊరుకుంది. ఇంటికి తిరిగి వచ్చేసరికి అన్నీ అలాగే ఉన్నాయి. సువర్ణ చినిగిన గౌనుతో ఉన్నా ఒక్క గౌను కూడా దొంగతనం చేయలేదు. అవ్వకి చాలా ఆనందం కలిగింది. పరుల సొమ్ముకి ఆశపడనివారే, ఇతరులకు చాలా మేలు చేస్తారు! మన సువర్ణ కూడా అలాంటి మంచి మనిషి! అవ్వ సువర్ణకి తలంటి పోసింది. కొత్త గౌను తొడిగింది. మిఠాయిలు పెట్టింది. నగలు యిచ్చింది! అంతేకాదు. తర్వాత తన దగ్గర ఉన్న ఒక కొరడా తీసి ఝుళిపించింది. వెంటనే అక్కడ గాలికి చిరు గంటలు శబ్దం చేస్తుండగా, ఒక చక్కటి బంగారు ఊయల ధగ ధగ మెరుస్తూ ప్రత్యక్షం అయింది.
అవ్వ సువర్ణని చేయిపట్టుకొని ఆ ఊయలలో కూర్చోపెట్టింది! "అమ్మాయి! నువ్వు చాలా మంచి పిల్లవి! నీకు నేను ఈ 'కొరడా' కానుకగా ఇస్తాను. నువ్వు వెళ్ళి మీ ఊరిలో నున్న వారందరికి ఈ ఊయలలో కూర్చొని సాయం చెయ్యి. నువ్వు యీ 'ఊయల'లో కూర్చొని ఏది కోరితే, అది నీ దగ్గరకు వస్తుంది" అంటూ సువర్ణ చేతకి కొరడా అందించింది. సువర్ణ కళ్ళు మూసుకొని, 'చక్కటి గౌను ఒకటి కావాలి' అనుకుంది. వెంటనే గౌను ఆమె ఒడిలో ఉంది! సువర్ణ ఇంటికి తిరిగి వచ్చింది. వానలు లేక ఊరిలో కరువుతో బాధపడుతున్నారు. సువర్ణ కొరడాతో బంగారు ఊయల ప్రత్యక్షం చేసింది. దానితో కరువు కాటకం తీరింది. అందరూ సువర్ణని "బంగారు తల్లి" అని ఆశీర్వదించి వెళ్ళారు. ఇది చూసి మందరమ్మకు చాలా ఆశ పుట్టింది. సువర్ణను చంపేసి ఆ 'కొరడా' తీసుకోవాలని అనుకుంది. 'నాకు ఒకసారి ఆ కొరడా ఇవ్వమ్మా' అంది ప్రేమగా. సువర్ణ ఇచ్చింది. మందరమ్మ ఆశని ఒడిలో కూర్చోపెట్టుకొని ఊయలలో కూర్చుంది! అంతే!
ఒక్కసారి ఊయల ఇనుపముళ్ళతో మందరమ్మని బంధించివేసిది. అడుగున రంపపు మొనలు, చుట్టూరా మంటలు! ఆమె అందులో కాలిపోయింది. "అమ్మాయి! ఈ బంగారు ఊయల మంచి వాళ్ళ కోసమే!" చెడ్డవాళ్ళు ఇందులో కూర్చుంటే, వారికి ఇదే 'శాస్తి!' అని చెప్పి మాయమైంది. ఇది చూసి ఆ ఊరిలో అందరూ, చెడ్డ బుద్దులు మానేసి, మంచి నడవడికతో నడుచుకున్నారు!
ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి బాబాలు, స్వామీజీలంటే విపరీతమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. ఆ ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు. రాఘవయ్య ఆ స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి "స్వామీ! అబద్దాలు చెప్పకుండా, పాపాలు చేయకుండా బతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా, ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు?" అని అడిగాడు.
"ఆ సంగతి అలా ఉంచు. సరిగ్గా ఏడు రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశముంది" అన్నాడు స్వామీజీ. రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో, బాకీలు, వసూళ్ళ గురించి కుటుంబ సభ్యులకు వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడపసాగాడు.
ఏడవ రోజు రాఘవయ్య స్వామీజీని కలిసాడు. స్వామీజీ రాఘవయ్యతో "నాయనా! ఈ ఏడు రోజుల్లో ఎన్ని పాపాలు చేసావు?" అని అడిగాడు. "స్వామీ! మృత్యువుని ఎదురుగా ఉంచుకుని ఎలా పాపాలు చెయ్యగలను?" అన్నాడు రాఘవయ్య.
నీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్ప లేదు కదా! మీ ఇంట్లో ఇవాళ ఆవు చనిపోతుంది. ఇక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పావు. నాలాంటి వాళ్ళు మృత్యువును జీవితాంతం మరిచిపోరు. అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా, ప్రశాంతంగా జీవించగలం" అన్నాడు స్వామీజీ.
ఒకప్పుడు డిక్ వైటింగ్టన్ అనే కుర్రాడు ఒక దనవంతుడైన వ్యాపారి ఇంట్లో వంట అబ్బాయిగా పని చేసేవాడు
డిక్ తనకు ఉండడానికి ఒక నీడ, వేళకు తిండి దొరికినందుకు ఆనందించేవాడు. కాని, తను కూడా తన యజమాని అంత ధనవంతుడని కావాలని, కనీసం వంటగదిలో తనపై అజమాయిషీ చేసే వంటలమ్మంత ధనవంతుడినైనా కావాలని కోరుకొనేవాడు.
ఎండాకాలం మధ్యాహ్నాలలో కొన్ని సార్లు అతను తన పిల్లిని ఒడిలో కూర్చోబెట్టుకుని కోడిపిల్లలను చూస్తూ, వంటలమ్మ పాడే జోల పాట వింటూ హయిగా పగటికలలను కనే వాడు.ఒక రోజు తన పిల్లి సప్తసముద్రాలు దాటి వెళ్ళి తన కోసం బంగారం, వజ్రాలు, రత్నాలు, తెచ్చినట్లు, దాంతో తను లండన్ నగరానికి మేయర్ అయినట్టు పగటికల కన్నాడు.
డిక్ వైటింగన్ తన యజమాని ఆదేశాలను పాటిస్తూ తన పగటికలను నిజంచేసుకోవాలనే దిశలో పట్టుదల చిత్తశుద్దితో పని చేసే వాడు.
"తన కల నిజమైతే...", అని తరుచుగా అనుకునేవాడు .
కొన్నాళ్ళకి డిక్ వైటింగ్టన్ కల నిజంగానే ఫలించింది. అతను లండన్ నగరానికి మూడు సార్లు మేయర్‌గా ఎన్నికయ్యాడు. అతడి కల నిజమైనందుకు అతనికి చెప్పలేనంత ఆనందం, తృప్తి కలిగాయి.
ఒకనాడు శ్రీకృష్ణదేవరాయల దర్శనానికై సామంత రాజు వచ్చ్హాడు. తన చేతిలోని సంచిని రాయలవారి చేతికిచ్చి "ఇది ఒక వజ్రం, దీని విలువెంతో మీ రాజ్యంలోని నిపుణులతో పరీక్షించి నాకు తెలపండి. మా రాజ్యంలో దీని విలువను కనిపెట్టే నిపుణులు ఎవరు లేరు" అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ వజ్రాన్ని చూద్దామని సంచి విప్పిన రాజుకు కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో తళతళ మెరుస్తున్న వస్తువు కనబడింది. అంతే! దాని విలువను బేరీజు వేయాల్సిందిగా రాజ్యంలోని నిపుణులందరినీ కోరాడు.
అందరూ ఆ పనిలో నిమగ్నమయ్యారు. కాని, వారికి ఎంతకీ దాని విలువ ఎంతో తెలియలేదు. ఆ వజ్రం విలువ తెలుసుకోవడానికి నిపుణులు తమ పరిజ్‌నానాన్ని అంతటినీ ఉపయోగించారు. పురాతన పుస్తకాలు, వజ్రాలు, రత్నాలకు సంబంధించిన తాళపత్రాలు వెతికారు. కాని వారి శ్రమ ఫలించలేదు. దాని విలువ లెక్కకట్టడం ఎవరి వల్లా కాలేదు. కాని అందరు కలిసి లక్ష వరహాలకు తక్కువ ఉండదని తేల్చేశారు.
దాంతో శ్రీకృష్ణదేవరాయలు ఆ వజ్రాన్ని తీసుకు వచ్చి సభికుల ముందు పెట్టి ఈ వజ్రం విలువ కచ్చితంగా బేరీజు వేసిన వారికి పదివేల వరహాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. సభికులెవ్వరు ధైర్యం చేయకపోగా, నిపుణులంతా తలలు వేలాడేసుకున్నారు. అంతలోనే ప్రవేశించిన రామలింగడు రాజుగారి ప్రకటన విని "ఓస్ అదెంత పని" అనుకుంటు ముందుకు నడిచి, "రాజా! ఇది వెలకట్టలేని రాయి", అని రాజుగారితో దాన్ని తీసుకుని తన ఛాతివద్ద పెట్టుకుని కొద్దిసేపు అలాగే ఉంచాడు. "రామలింగా! ఏంచేస్తున్నావ్" సున్నితంగా మందలించాడు రాజు. "ప్రభూ! నేను నా మనస్సు అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాను" చెప్పాడు రామలింగడు. "రాజా! ఇది ఒక విలువలేని రాయి" తేల్చేశాడు రామలింగడు. "రామలింగా! ఇది విలువలేని రాయి అని నిరూపించు లేదా సభకు క్షమాపణలు చెప్పు" మరోసారి మందలించాడు రాజు. "సరే రాజా" అంటూ రాజుతో సహా సభికులందరినీ ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూసి చీకటిగా చేసి ఆ రాయిని ఒక బల్లపై ఉంచాడు రామలింగడు.
"రాజా! మీరు ఇందాకట్నుంచి చెబుతున్న వజ్రం ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం" అన్నాడు రామలింగడు. రాజుతో సహా ఎవరూ ఆ రాయి ఎక్కడుందో కనిపెట్టలేకపోగా, రామలింగడు "అది మీ ముందున్న బల్లపైనే ఉంది. వజ్రమైతే చీకట్లోనూ మెరుస్తుంది కదా! నేనిందాక ఆ వజ్రాన్ని నా చొక్కా లోపల పెట్టుకుని వెలుతురు కనబడుతుందేమోనని గమనించాను" అని అసలు విషయం చెప్పాడు రామలింగడు. ఆ రాయి వజ్రం కాదని నిరూపించి, పదివేల వరహాలు గెలుచుకున్నాడు తెనాలిరామలింగడు.
రామాపురం లో రాజు అనే కుర్రాడు ఉండేవాడు. అతను చాలా బద్దకస్తుడు. ప్రతీ పని సులభంగా అయిపోవాలని ఆశించేవాడు. కష్టమైన పనంటే చాలా ఇబ్బందిగా కదిలేవాడు.
ఒక రోజు ఆ ఊరిలో ఉండే పండితుడికి రాజు ఎదురయ్యాడు. రాజులో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు...'నీవు ధనవంతుడిగా మారేందుకు ఓ మార్గం ఉంది. ఈ ఊరి ఈశాన్యదిశలో రావిచెట్టుకి కుడివైపు పదిఅడుగుల దూరం లో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి' అని చెప్పి వెళ్ళిపోయాడు పండితుడు.
'బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో! ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే? శ్రమంతా వృధా అయిపోతుంది' అనుకుంటూ అక్కణ్నుంచి వెళ్ళిపోయాడు రాజు. ప్రతీ పనీ ఇలాగే ఏదో ఒక వంకతో తప్పించుకునేవాడు.
కొంత కాలానికి ఆ ఊరిలో కరువు వచ్చింది. తాగడానికి నీరు లేక పశువులు, ప్రజలు ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎందరు ప్రయత్నించినా నీళ్ళు పడలేదు.
రాజుకి హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
బంగారు నగలు దొరికితే తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి హయిగా బతకొచ్చనుకున్నాడు.
వెంటనే పలుగు పార తీసుకొని ఈశాన్యదిశలో రావి చెట్టు దగ్గర తవ్వటం మొదలు పెట్టాడు. ఎంతతవ్వినా నగల జాడ కనిపించలేదు. అయినా ఈ కరువు నుంచి తప్పించుకోవాలంటే డబ్బు అవసరం. కాబట్టి ఎలాగైనా వాటిని చేజిక్కించుకోవాలని తవ్వుతూనే ఉన్నాడు రాజు. మూడు రోజులు గడిచాయి. నాలుగో రోజు ఉదయాన్నే రాజు కాళ్ళకి నీటి చెమ్మ తగిలింది. కొద్దిసేపటికి నీరు ఊరటం ప్రారంభించింది. రాజు గబగబా గుంటలో నుంచిపైకి వచ్చేశాడు. ఆ గుంటంతా నీళ్ళతో నిండిపోయింది. ఈ వార్త తెలుసుకున్న ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి రాజు శ్రమని మెచ్చుకున్నారు. ఊరికి గొప్ప ఉపకారం చేశాడని అందరూ రాజుకి ఎన్నెన్నో బహుమానాలు ఇచ్చారు.
శ్రమపడితే అందరి ప్రశంసలతోపాటు విలువైన బహుమతులూ వస్తాయని గ్రహించిన రాజు, ఆనాటి నుండి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు.
పాలకొల్లు చంద్రశేఖరం, సూర్యం ప్రాణ స్నేహితులు, ఇద్దరు సినిమాలకి షికార్లకీ తిరుగుతూ కాలక్షేపము చేస్తుంటారు. ఓ రోజు ఇద్దరూ సినిమాకని బయల్దేరారు. కొత్త సినిమా కారణముగా వాళ్ళు వెళ్ళేటప్పటికే బుకింగ్‌లో టికెట్స్ అయిపోయాయి. ఆ హాలులో దొంగటికెట్లు అమ్ముతున్నారన్న పేరు బాగా వుంది.సార్! మీకు టికెట్స్ కావాలా, అన్న పిలుపుకు సూర్యం గమనించి కావాలి అన్నాడు. ఇరవైరూపాయల టికెట్ పాతిక రూపాయలే అన్నాడు ఆ వ్యక్తి. వద్దురా ఇంటికెళ్దాం, ఇక్కడి పరిస్థితి నీకు తెలియదు. అంతా మోసం అనగానే చూస్తుండు అని చెప్పి యాభై రూపాయలనోటు ఇచ్చి రెండు టికెట్స్ తీసుకున్నాడు.
ఇద్దరు హాలులోపలకి వెళ్ళి గేట్‌కీపర్ కు ఇవ్వగా ఆ టికెట్స్ గమనించి మిమ్మల్ని ఎవరో బాగా మోసం చేశారని చెప్పాడు. చేసేది లేక వెనుదిరిగారు. కాని సూర్యం మాత్రము ఆనందంగా ఉండడం చూసి చంద్రశేఖరం, ఏమిటి ఆనందముగా ఉన్నావంటే నేను ఇచ్చిన యాభైరూపాయలు కూడా దొంగనోటే అని చెప్పాడు. నిన్న బ్యాంకులో డబ్బు కట్టడానికి వెళితే బ్యాంకువారు అసలు నోటుకీ దొంగనోటుకీ గల గుర్తులు అవీ చెప్పారు. అది ఎలాగో మా వద్దకి ఒకటి చేరింది. దాంతో ఇక్కడ ఇచ్చాను. ఆ దొంగనోటుని చించవలసినది. వీళ్ళ వ్యవహారము తెలిసే ఆ విధంగా చేశాను.
టికెట్ అమ్మిన వ్యక్తి ఆనందముగా పాన్ షాపులో ఇచ్చి సిగరెట్ పెట్టె ఇవ్వమన్నాడు. పాన్ షాపతను నోటును పరీక్షగా చూసి ఇది దొంగనోటు మీకెవరిచ్చారో అన్నాడు. నేనే మోసగాణ్ణి అనుకుంటే నన్నే మోసం చేశాడే అనుకుంటూ ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు విచారముగా.
గుండూరావు గణితశాస్త్రంలో దిట్ట. అతి తెలివి కాస్త ఎక్కువ. ఓ రోజు బంధువుల పెళ్లికి ఓ పల్లెటూరు వెళ్లాడు. సాయంత్రం సరదాగా షికారుకు వెళుతూ, ఒక గుట్ట దగ్గర గడ్డిమేస్తున్న గొర్రెలమందను చూశాడు. ఒంటినిండా ఉన్నితో ఎంతో బొద్దుగా ముద్దుగా ఉన్నాయవి. వాటిలో ఒకదాన్ని తన తెలివితో సంపాదించాలనుకున్నాడు. "నీ మందలోని గొర్రెలను లెక్కించకుండా మొత్తం ఎన్ని ఉన్నవీ చెబుతాను. అది సరైనదైతే ఒక గొర్రెనిస్తావా?" అనడిగాడు అక్కడున్న కాపరిని. 'సరే' అన్నాడు కాపరి అయిష్టంగానే. గుండూరావు వెంటనే మందలోని వరుసల వైపు చూసి "అన్నీ కలిపి తొంభై తొమ్మిది" అన్నాడు. కాపరి అతనివైపు ఆశ్చర్యంగా చూసి, "నిజమే" అన్నాడు. "అయితే గొర్రెనిస్తావా మరి?" అన్నాడు గుండూరావు. "సరే, మీరే తీసుకోండి" అన్నాడు కాపరి. గుండూరావు ఆనందంగా మందలో అన్నింటికన్నా బలంగా ఉన్న ఒక గొర్రెను తీసుకుని భుజాల మీద వేసుకుని, అక్కడినుంచి కదలబోతుండగా కాపరి "నేను మీ వృత్తిని ఊహించి చెబుతాను. నిజమైతే నా గొర్రెను నాకిచ్చేస్తారా" అన్నాడు. గుండూరావు తనలో తను ముసిముసిగా నవ్వుకుంటూ "సరే, చెప్పు" అన్నాడు. "మీరు ఒక లెక్కల మాష్టారు కదా" అన్నాడు కాపరి. గుండూరావు ఆశ్చర్యంతో "నిజమే, ఎలా కనుక్కున్నావు" అన్నాడు.
"మీరు మందలోని గొర్రెలను లెక్కపెట్టకుండా వరుసను బట్టి సరిగానే చెప్పేశారు. కానీ మందలోనుంచి ఒక దానిని ఎంచుకోమంటే నేను కాపలాకి తెచ్చుకున్న కుక్కని ఎత్తుకున్నారు మరి!" అన్నాడు.
గుండూరావు తన భుజాలమీదున్న కుక్కను చూసి సిగ్గుపడి, దాన్ని కిందికి దించి కాపరి ఈరన్న తెలివికి ఈర్ష్యపడ్డాడు.
పూర్వం అనంతారంలో భీమయ్య అనే పేదవాడు ఉండేవాడు.ఒకసారి ఆయన బంధువుల ఊరికి బయల్ధేరాడు. మధ్యాహ్నానికి ఒక పట్టణానికి చేరుకున్నాడు. భీమయ్యకు బాగా ఆకలివేస్తోంది. అందుకని దగ్గర్లోని పేదరాసి పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు. పేదరాశి పెద్దమ్మ ఇంటి ప్రక్కనే కల్లు దుకాణం ఉంది. ఆ దుకాణం యజమానురాలి పేరు సూరమ్మ. భీమయ్య అక్కడికెళ్ళేటప్పటికి సూరమ్మ చేపలు వేయిస్తోంది. భీమయ్య ఇదేమీ పట్టించుకోలేదు. పేదరాశి పెద్దమ్మ దగ్గరకెళ్ళాడు.
ఆమెకు కొంత డబ్బిచ్చి, కడుపునిండా భోజనం చేశాడు. బయటకొచ్చి తన దారిన తాను వెళ్ళసాగాడు. ఇంతలో సూరమ్మ గోలగోలగా అరుస్తూ అతని దగ్గరకెళ్ళింది. సూరమ్మ అరుపులకు చుట్టుపక్కలవాళ్ళు అక్కడకు చేరారు. ఆమె ఎందుకు అలా అరుస్తుందో భీమయ్యకు అర్ధం కాలేదు అదే అడిగాడు. "ఈ పెద్దమనిషి నా చేపల వాసన పీల్చి, డబ్బులివ్వకుండా చక్కా పోతున్నాడు అంది సురమ్మ. ఆ మాటలకు భీమయ్య తెల్లబోయాడు. "చేపల వాసన పీల్చినందుకు డబ్బులివ్వాలా! ఎంత?" అయోమయంగా అడిగాడు. "ఒక వెండి నాణెం" చెప్పింది సూరమ్మ.
"ఇది చాలా అన్యాయం. బజార్లో పీల్చిన వాసనకు కూడా డబ్బులివ్వాలా? నేనివ్వను" అన్నాడు భీమయ్య. అతనితో సూరమ్మ వాదనకు దిగింది. చివరకు వాళ్ళిద్దరూ పట్టణాధికారి దగ్గరకెళ్ళారు. జరిగిందంతా ఆయనతో చెప్పారు. "అవునయ్యా...నువ్వు చేపల వేపుడు వాసన పీల్చడం వలన ఆ కూర రుచి తగ్గుతుంది. కాబట్టి నువ్వు ఆమెకు డబ్బులివ్వాల్సిందే" చెప్పాడు పట్టణాధికారి. భీమయ్యకు ఏమీ పాలుపోలేదు. అయోమయంగా అయన్నే చూస్తూ నిలబడ్డాడు. అతణ్ణి చూసి పట్టణాధికారి చిరునవ్వు నవ్వాడు.
"చూడు భీమయ్య...నేనిచ్చిన తీర్పు ప్రకారం నువ్వు వెండి నాణాన్ని ఎండకు ఎదురుగ్గా పెట్టు. సూరమ్మ వచ్చి ఆ నాణెం నీడను పట్టుకుంటుంది. చెల్లుకు చెల్లు" అన్నాడు పట్టణాధికారి. ఇది విన్న తరువాత సూరమ్మ ముఖం మాడిపోయింది. అత్యాశకు పోయినందుకు తనను తానే నిందించుకుంది. పట్టణాధికారిని, భీమయ్యను క్షమాపణ కోరింది. భీమయ్య సంతోషంగా తన దారిన తాను వెళ్ళిపోయాడు.
ఓ గ్రామంలో రామేశం అనే రైతు ఉండేవాడు. తనకున్న కొద్దిపాటి భూమిలోనే కష్టపడి పంట పండించుకునేవాడు. ఇరుగు పొరుగికి సాయం చేసేవాడు. అతని పొలానికి కొద్దిదూరంలోనే కామేశం అనే మరో రైతు ఉండేవాడు. చాలా స్వార్థపరుడు. ఎవరైనా పచ్చగా ఉంటే ఓర్వలేకపోయేవాడు. ఆ యేడు వర్షాలు బాగా పడడంతో పాటు కుటుంబమంతా కష్టపడడంతో రామేశం పొలం బాగా పండింది. అది చూసి కామేశానికి కన్నుకుట్టింది. ఓ రోజు అర్థరాత్రి రామేశం పొలానికి నిప్పుపెట్టాడు. దగ్గరలోనే కాపలా పడుకున్న రామేశం గభాల్న లేచి మంటలార్పేశాడు. అయితే అప్పటికే కొంత పంట తగలబడిపోయింది. ఆ పని ఎవరు చేశారో తెలిసినా గొడవపడటం ఇష్టం లేక ఊరుకున్నాడు.
తర్వాత ఓ రోజు రాత్రి రామేశానికి ఎవరివో ఏడుపు వినిపించి లేచి బయటికి వచ్చి చూశాడు. కామేశం భార్య గుడ్లు తేలేసిన పిల్లాడిని ఒడిలో పడుకోబెట్టుకుని ఏడుస్తోంది. సమయానికి కామేశం కూడా లేడు. రామేశం క్షణం కూడా ఆలోచించకుండా ఆ పిల్లాడిని తన ఎడ్లబండిలో కూర్చోబెట్టుకుని, పదిమైళ్ల దూరాన ఉన్న వైద్యుడి ఇంటికి తీసుకెళ్లాడు. సకాలంలో వైద్యసాయం అందడంతో పిల్లాడు తొందరగా కోలుకున్నాడు.
మర్నాడు భార్య ద్వారా జరిగిందంతా తెలుసుకున్న కామేశం "సమయానికి దేవుడిలా వచ్చి మా అబ్బాయి ప్రాణాలు కాపాడావు. కానీ, నేను మాత్రం నీకు తీరని ద్రోహం చేశాను". అంటూ రామేశం చేతులు పట్టుకుని ఏడ్చాడు. ఆ తర్వాత, కామేశం తన ప్రవర్తన మార్చుకుని, అందరితో స్నేహంగా ఉండసాగాడు.
శ్రీకృష్ణదేవరాయలకు తన మంత్రి తెనాలి రామలింగడి తెలివి, చతురతను పరీక్షించాలని ఎప్పుడు కోరికగా ఉండేది. ఒకసారి రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. బంగారు నాణేలు గంప నిండా ఉండటంతో ఏమాత్రం కుదుపు వచ్చినా గంపలోని పైనున్న నాణేలు కిందపడతాయి. పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది.
ఎవ్వరూ ఆ గంపను మోయలేరు. దాంతో మిగిలిన సభికులు రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించారు. రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా లేదు. కొద్ది సేపు ఆలోచించిన రామలింగడు తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణేలను పోసి మూట కట్టాడు. కొన్ని నాణేలను తన జేబుల్లో నింపుకుని, మూటను వీపు మీద వేసుకుని, వెలితి పడిన గంపను నెత్తిన పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు.
రామలింగడు సమయస్పూర్తికి ఆశ్చర్యపోయిన రాజు "శభాష్ రామలింగా! శభాష్!" అంటూ మెచ్చుకోసాగాడు. రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తలవంచి నమస్కరించిగానే అతని జేబుల్లోని నాణాలు బరువుకు నేలమీద పడిపోయాయి. వాటి చప్పుడు సభంతా మార్మోగింది. అంతే సభంతా నవ్వులతో నిండిపోయింది. రామలింగడి తొందరపాటుకు అంతా నవ్వసాగారు. దాంతో గంపను, ముటను కిందపెట్టి రామలింగడు ఆ జారి పడిపోయిన నాణేల కోసం సభంతా వెతకసాగాడు. పడుతూ, లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా అనిపించింది. అందరు తలోమాట అన్నారు.
"ఎంత దురాశపరుడు" అన్నాడు ఆస్ధాన పూజారి. "గంపెడు నాణేలున్నా కిందపడిన రెండు మూడు నాణేల కోసం వెతుకుతున్నాడు" అన్నాడు సేనాధిపతి. "అదిగో ఆ స్తంభం వెనకాల ఒకటి, రాజు గారి సింహాసనం పక్కన ఒకటి" అనుకుంటూ సభంతా పరిగెత్తుతూ కింద పడిన నాణేలను ఏరసాగాడు రామలింగడు. ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గర కొచ్చి ఆయన చెవిలో "ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనింతవరకూ చూడలేదు" అంటూ రామలింగడిని ధూషించసాగాడు.
రామలింగడు నాణేలన్నీ ఏరిన తర్వాత రాజు "రామలింగా! నీకు గంపెడు నాణేలను ఇచ్చాను కదా! మరి ఎందుకింత దురాశ, కిందపడిన కొన్ని నాణేల కోసం వెతికావు? అన్నారు. "రాజా! ఇది దురాశ కాదు, కిందపడిన నాణేలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి ఉంది కదా! ఇలా అందరూ నడిచే చోటపడి, ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను. కాబట్టే నేను అంత అదుర్దాగా వాటిని ఏరి వేశాను" అని చెప్పడంతో సభంతా మూగబోయింది.
రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగడిని కౌగిలించుకున్నారు. అతనికి మరో గంపెడు బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.
ఒకరోజు బీర్బల్‌ని ఏడిపించాలని అక్బరు చక్రవర్తి దర్బారులో "బీర్బల్ రాత్రి నాకు ఒక కల వచ్చింది. అందులో మనిద్దరం మన ఉద్యానవనంలో షికారు చేస్తున్నాం. అమావాస్య అవటం వల్ల అంతా చీకటిగా ఉంది. ఇంతలో మన దారులకి అడ్డంగా రెండు పెద్ద గొయ్యిలు వచ్చాయి. మనిద్దరం వాటిలో పడిపోయాం. అదృష్టవశాత్తు నేను పడింది తేనె ఉన్న గొయ్యిలో. నువ్వు పడ్డ గొయ్యిలో ఏముందో తెలుసా?" బీర్బల్‌ని ప్రశ్నించాడు అక్బరు.
"ఏముంది ప్రభూ అందులో" అమాయకంగా అడిగాడు బీర్బల్. "బురద". షాదుషా మాటలు విని సభలోని వారందరు పెద్దపెట్టున నవ్వారు. బీర్బల్‌ని ఏడిపించగలిగానన్న ఆనందం కలిగింది అక్బర్‌కు. సభలో నిశ్శబ్దం ఏర్పడ్డాక బీర్బల్ "విచిత్రంగా ఉంది ప్రభూ నాకూ సరిగ్గా ఈ కలే వచ్చింది. అయితే మీరు అంతవరకే కలగని నిద్రలేచేసారు. నేను కల పూర్తయ్యే వరకు నిద్ర పోయాను. అప్పుడు మీరు చాలా రుచికరమైన తేనెతో, నేనేమో దుర్గంధమైన బురదతో పైకి వచ్చాం. శుభ్రపరచుకోవడానికి నీటి కోసం చుట్టూ వెతికాం. కానీ మనకు ఆ దగ్గరలో ఒక నీటి చుక్క కూడా కనిపించలేదు. అప్పుడేం జరిగి ఉంటుందో మీరు ఊహించగలరా?" అన్నాడు.
"ఏం జరిగింది?" కొంచెం కంగారుగానే అడిగాడు అక్బర్. "మనం ఒకరినొకరు నాకి శుభ్రపరచుకున్నాం". అక్బరు ముఖం ఎర్రబడింది. ఏదో అనబోయి ఆగిపోయాడు. తను చేసిన అవమానానికి బీర్బల్ సరైన సమాధానం చెప్పాడని ఊరుకున్నాడు. ఇంకెన్నడూ బీర్బల్‌ని ఏడిపించే ప్రయత్నం చేయలేదు.
మూర్ఖులకు మంచి మాటలు, మంచి సలహాలు చెవికెక్కవు. అలాంటి వాళ్ళకి సలహాలు చెప్పటం వృధా ప్రయాస మాత్రమేకాదు. ఒక్కొక్కసారి ప్రాణాలకు కూడా ముప్పు కలుగవచ్చు. అందుకనే సాధ్యమయినంత వరకు మూర్ఖులకు దూరంగా ఉండటం ఉత్తమం. మూర్ఖులైన కోతిమూకకి ఓ సలహా ఇవ్వబోయి తన ప్రాణాలు పోగొట్టుకున్న పక్షి వైనం ఈకధలో తెలుసుకుందాం.
పూర్వం ఓ కొండ ప్రాంతంలో ఓ కోతుల గుంపు ఉండేది. అవి కొండ క్రిందనున్న గ్రామాలలోకి దండుగా వచ్చి దొరికినంత ఆహారం తిని మిగిలిన ఆహారాన్ని పట్టుకుపోయి కొండ ప్రాంతంలోని తమ స్ధావరంలో దాచుకుని వచ్చినన్ని రోజులు తిని మళ్ళీ యధావిధిగా ఆహారం కోసం గ్రామాల మీద పడేవి. ఆ కోతుల స్ధావరం దగ్గరే ఉన్న ఓ మర్రిచెట్టు మీద ఓ పాలపిట్టల జంట కాపురం చేస్తుండేవి. రోజూ సాయంత్రంపూట ఆ కోతుల దండు చేసే వింత చేష్టలు ఆ పాలపిట్టల జంటకు వినోదం కలిగిస్తూ ఉండేది.
అది చలికాలం. ఓ సాయంత్రం పూట ఆ కోతులకి చలికాగాలన్న ఆలోచన కలిగింది. వెంటనే చెట్ల మీద ఎగురుతున్న మిణుగురుపురుగులను తీసుకొచ్చి కుప్పగా పోసి వాటి చుట్టూ కూర్చున్నాయి. మిణుగురు పురుగులనుండి వెలుగు తప్ప వేడి రాకపోవటంతో వాటికి ఏం చెయ్యాలో అర్ధం కాక బుర్రలు గోక్కోసాగాయి. వాటి అవస్ధ చెట్టు మీద పాలపిట్ట జంట చూసి నవ్వుకున్నాయి. ఆ జంటలోని మగపిట్ట 'పాపం! అవి మంట ఎలా పుట్టించాలో తెలియక బాధ పడుతున్నాయి. వాటికి వివరంగా చెప్పివస్తాను' అంది.
అందుకు ఆడపిట్ట 'వద్దు! అవి కోతులు వాటికి విచక్షణా జ్ఞానం తక్కువ, వాటి మధ్యకు నువ్వు వెడితే నీకేదన్నా అపకారం తలపెడతాయి' అంది భయంగా. 'ఫర్వాలేదులే! అవి మరీ అంత మూర్ఖమైనవి కావు' అంటూ ఆ పాలపిట్ట రివ్వుమంటూ చెట్టుమీద నుంచి ఎగిరి ఆ కోతుల గుంపు మధ్యలో వాలింది. తమ మధ్యలో వాలిన ఆ పాలపిట్ట వంక గుర్రుగా చూసాయి గుంపులోని కోతులు. పాలపిట్ట అది పట్టించుకోకుండా 'మిత్రులారా! ఇవి పురుగులు వీటి వల్ల కొంచెం వెలుగు వస్తుంది కానీ వేడి రాదు. మీరు చలికాగాలంటే వెళ్ళి ఎండుకట్టెలు తెచ్చుకుని వాటిని చెకుముకిరాయిని రాజేసి వచ్చే నిప్పుతో అంటించండి. అపుడు మంట వచ్చి చలి తీరుతుంది' అంది. కోతులకి తమకి సలహా ఇవ్వటానికి పాలపిట్ట వచ్చిందని కోపం వచ్చింది. 'ఇంతలేవు నువ్వు మాకు సలహా యిస్తావా?' అంటూ ఆ పిట్టను పట్టుకుని పుటుక్కుమంటూ మెడను విరిచి చంపేసాయి.
పాపం ఆ పాలపిట్ట లోని ఆడపిట్ట 'మూర్ఖులకి సలహా యివ్వటం మంచిది కాదని చెప్పినా వినకుండా ప్రాణాలు పోగొట్టుకున్న ఆ మగపిట్ట కోసం ఏడుస్తూ అక్కడి నుంచి ఎగిరిపోయింది.
టర్కీ రాజు మంచి పాలకుడు, కాని కొంచెం మూఢనమ్మకాలెక్కువ.
రాజుగారికి రోజూ ఉదయం లేవగానే సూర్యుడిని చూడాలని, ఇతరులెవరినైనా చూస్తే ఆ రోజు దురదృష్టం వెంటాడుతుందని అతని మూఢనమ్మకం.
ఒకరోజు వేటకెళ్లడానికి ఉదయాన్నే నిద్ర లేచిన రాజుగారు తోటలో ఎవరినీ చూడకుండా నడుస్తూ వెళ్తున్నాడు. ముల్లా నస్రుద్దీన్ కూడా మంత్రి గారికి ఒక సమాచారం తెలపడానికి అటువైపే వచ్చాడు. రాజుని చూసిన నస్రు "రాజుగారూ శుభోదయం! బావున్నారా?" అని పలకరించాడు.
దానికి రాజుగారు మారు మాట్లాడకుండా నేలను చూస్తూ ముందుకు కదిలాడు. ఆశ్చర్యపోయిన నస్రు రాజుగారి మెహంలోకి చూస్తూ " ఏమయింది రాజా?! మీ మెడగానీ పట్టేసిందా?" అన్నాడు.
నస్రుని చూడడం దురదృష్టం అని భావించిన రాజు కోపంతో, "ఇంత ఉదయమే నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? నన్ను కలవాల్సిన అవసరం ఏంటి? నీకు తెలీదా నేను సూర్యుణ్ణి చూసిన తర్వాతే ఇతరులను చూస్తానని?" అని అరిచాడు.
కోపం పట్టలేని రాజు సైనికులను పిలిచి, "నస్రుని తీసుకెళ్ళి గదిలో బంధించండి. ఆహారం, నీరు ఇవ్వండి, కాని నేను వేటకు వెళ్ళి వచ్చేవరకు గదిలోనే ఉంచండి. ఇతన్ని చూడడం వలన నాకేదైనా దురదృష్టం కలిగిస్తే నేను వచ్చిన తర్వాత ఇతన్ని శిక్షిస్తాను" అన్నాడు.
సైనికులురాజు చెప్పినట్టే చేశారు. వేటకెళ్ళి తిరిగొచ్చిన తర్వాత రాజుగారు చాలా ఆనందంగా కనిపించారు. ఆ రోజు వేట ఆయనకు బాగా కలిసొచ్చింది. అతనికి తన మూఢనమ్మకం తప్పని తెలిసింది. నస్రుతో ఇలా అన్నాడు "రా మిత్రమా! నిన్ను చూడడం దురదృష్టం కలిగిస్తుందని భావించిన నాకు కళ్లు తెరుచుకున్నాయి. ఈ రోజు వేట ఓ అధ్బుతం. నన్ను క్షమించు."
బదులుగా నస్రు "నన్ను తప్పుగా అనుకోకండి రాజా! నేను ఉదయాన్నే మీ మెహం చూసినందుకు చూశారుగా ఈ శిక్ష. నాకు దురదృష్టం తెచ్చిందెవరో?"
అతని మాటలకు రాజు నవ్వుతూ నస్రుని ఆలింగనం చేసుకుని వరహాల సంచిని కానుకగా ఇచ్చాడు.
ఆ రోజు సోమవారం. సూరిబాబు ఎంతో ఉత్సాహంగా బడికి బయలుదేరాడు. దారిలో స్నేహితులు కలిశారు. మాటల సందర్భంలో ఆదివారం నాడు తాము ఎలా గడిపామో ఒక్కొక్కరు సంతోషంగా చెప్పడం ప్రారంభించారు. నిఖిల్ తాను తన అభిమాన హీరో సినిమా చూశానన్నాడు. చంద్రం తానెంతో ఇష్టపడే క్రికెట్ ఆడినట్లు చెప్పాడు. లోకేష్ తాను గీసిన డ్రాయింగ్ గురించి వర్ణించాడు. సూరిబాబు వంతు వచ్చింది. ఇంతలో బడి గంట మోగటంతో వారంతా బడిలోకి గబగబ అడుగులు వేయసాగారు. గదుల నుంచి బయటకు వచ్చారు. అప్పుడే పాఠశాల ఆవరణలో ఆగిన కారు వంక అందరూ తదేకంగా చూడసాగారు. కారులోంచి ఓ వ్యక్తి దిగడం, ప్రధానోపాధ్యాయుడి గదిలోకి వెళ్ళడం గమనించిన విద్యార్థులు అతడు ఎవరై ఉంటారో అని గుసగుసలాడసాగారు. మధ్యాహ్నాం చివరి పీరియడ్ "నీతిబోధన" తరగతికి తెలుగు మాష్టారు వచ్చారు. మాష్టారు చెప్పే నీతి కథలంటే పిల్లలకెంతో ఇష్టం. ఆ రోజు మాష్టారు చెప్పబోయే కథకోసం పిల్లలెంతో ఆత్రుతతో ఎదురు చూడసాగారు. కానీ మాష్టారు తాను చెప్పిన నీతికథలు పిల్లలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవాలని ఉత్సాహపడ్డారు.
తెలుగు మాష్టారు విద్యార్థులను తాము ఇతరులకు సాయపడిన సందర్భాల గురించి అడగడంతో వారు అవాక్కయ్యారు. మాష్టారు చెప్పిన కథలు వినడం వాటిని తమ స్నేహితులకు చెప్పడం తప్ప ఆ కథల్లోని నీతిని తమ జీవితంలోని వివిధ సందర్భాలలో ఎలా అన్వయించుకోవాలో తెలియక, బొత్తిగా ఆచరించని ఆ విద్యార్థులు మాష్టారు వేసిన ప్రశ్నకు బిక్కముఖం వేశారు. తాను ఇన్నాళ్ళు చెప్పిన నీతికథలు బాలల ఆలోచనల్లో ఏ మాత్రం కదలిక తేలేకపోయినందుకు మాష్టారు బాధపడ్డారు. మాష్టారి మనస్సును సరిగ్గా చదవగలిగిన సూరిబాబు, తాను ఆచరించిన పనులను మాష్టారి ముందుంచేందుకు తనకెందుకు ధైర్యం చాలడంలేదోనని కలవరపడ్డాడు. ఎలాగైనా సరే, మాష్టారి బోధనల వల్ల తాను చేసిన ఒక మంచి పనిని మాష్టారికి చెప్పి అతడి వేదన పోగొట్టాలని తలచిన సూరిబాబు "మాష్టారూ! నేను చెబుతా!" అని మనసులోనే అనుకుంటూ పైకి లేవబోయాడు. ఇంతలో తెలుగు మాషార్ని ప్రధానోపాధ్యాయుడు పిలుస్తున్నారని కబురు రావడంతో మాష్టారు వెళ్ళిపోయారు. సూరిబాబుకు తాను చేసిన పని మాష్టారికి చెప్పే అవకాశం చేజారిపోయింది. కొంత సేపటికి లాంగ్‌బెల్ కొట్టడంతో పిల్లలంతా బడి వదిలిపెట్టారు.
మరుసటి రోజు ఉదయం ప్రార్థనా సమావేశం జరుగుతోంది. ప్రధానోపాధ్యాయుడు ఓ కొత్త వ్యక్తిని అందరికి పరిచయం చేశాడు. క్రితం రోజు పాఠశాలకు కారులో వచ్చిన ఆ వ్యక్తిని కొందరు గుర్తించారు. అతడు వృద్దాశ్రమానికి చెందిన ఆఫీసరు. తర్వాత తెలుగు మాష్టార్ని వేదికపైకి ఆహ్వానించారు. మాష్టారి నీతికథల వల్ల ఓ విద్యార్థి ఆలోచనల్లో వచ్చిన మంచి మార్పే నేడు మన పాఠశాలకు ఎంతో గర్వకారణమయిందని ప్రధానోపాధ్యాయుడు చెబుతుండగా, అందరూ ఆ విద్యార్థి ఎవరో? అని ఎదురు చూడసాగారు. తెలుగు మష్టారి ముఖంలో ఆనందం చూసి సంబరపడుతున్న సూరిబాబు తనను వేదికపైకి పిలవడాన్ని పట్టించుకోలేకపోయాడు. తమ తోటి విద్యార్థులు తనను వేదికపైకి వెళ్ళమని చెప్పడం, అందరూ తన వంకే చూస్తూ ఉండటం, ఏమి జరుగుతుందో ఏమీ అర్థంకాని సూరిబాబు తడబడుతూ వేదికపైకి వెళ్ళాడు. ఆదివారం నాడు నడిరోడ్డుపై అడ్డంగా వెళుతున్న ఓ అంధ వృద్ధుణ్ణి బస్సు ప్రమాదం నుండి కాపాడడమేకాక అతణ్ణి వృద్ధాశ్రమంలో చేర్చిన సూరిబాబుకు వృద్ధాశ్రమ ఆఫీసర్ మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.
విద్యార్థులు, టీచర్లు తమ కరతాళ ధ్వనులతో సూరిబాబును అభినందించసాగారు. సూరిబాబుని మాట్లాడమని వృద్ధాశ్రమ ఆఫీసరు కోరారు. "తాను ఆచరించడమే కాక, నీతికథల ద్వారా మాలో మానవతా దృక్పథాన్ని పెంపొదిస్తున్న మా తెలుగు మాష్టారే నాకు ఆదర్శం" అన్నాడు. ప్రధానోపాధ్యాయుడు సూరిబాబును అభినందిస్తూ, గురువుని మించిన శిష్యుడని అభివర్ణించారు.
ఒక రోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా, నింపాధిగా సమాధానం చెబుతున్నారు.
అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు.దెబ్బ బాగా తగలడంతో "అమ్మా" అని అరిచాడు.అతను అరవకున్నా మరోసారి "అమ్మా" అనే శబ్దం వినబడడంతో ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం కొండల్లోనించి రావడాన్ని గమనించాడు.
ఆశ్చర్యాన్ని తట్టుకోలేక రఘు "ఎవరు నువ్వు" అని అడిగాడు శబ్దం వినిపించినవైపు చూస్తూ "ఎవరు నువ్వు" మరల ఆ గొంతుక పలికింది.
రఘు మళ్ళీ కొంచెం గట్టిగా, "నీకు ధైర్యం ఉందా?" అని అరిచాడు. అదే మాట ముందు కంటే గట్టిగా అతనికి వినిపించింది. ఆ మాట విని కోపం పట్టలేకపోయిన రఘు "పిరికి పందా!" అని నరాలు బిగపట్టి మరింత గట్టిగా అరిచాడు. అదేవిదంగా మరింత గట్టిగా "పిరికి పందా!" అని వినిపించిది.
ఇక లాభం లేదనుకున్న రఘు తండ్రితో "నాన్నా! ఏంటీది? ఎవరు నాన్నా అక్కడ?" అని అడిగాడు.తండ్రి నవ్వుతూ "కొంచెం ఓపిక పట్టు" అంటూ "నువ్వు చాంపియన్ వి" అన్నారు గట్టిగా. "నువ్వు చాంపియన్ వి" అన్న శబ్దమే మళ్ళీ వినిపించిది.ఆశ్చర్యపోయిన రఘుకి ఏం జరుగుతుందో అస్సలు అర్ధం కాలేదు.
రఘు తండ్రి అతనికి ఇలా చెప్పాడు. "దీన్ని ప్రతిధ్వని అంటారు బాబు! జీవితం కూడా ఇలాంటిదే. నీవు ఏది పలికినా ఏది చేసినా దాని ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది. మన జీవితం మనం చేసే పనులకు ప్రతిబింబం వంటిది.ప్రపంచం లో ప్రేమ శాంతి వికసించాలి, 'అందరూ నీతో ప్రేమగా వుండాలి' అని నువ్వు అనుకుంటే నీ మనసులో ప్రేమ, శాంతికి అపారమైన చోటు కల్పించాలి. నీ జట్టులో పట్టుదల, విజయ కాంక్ష రగిలిచాలంటే నీలో అవి పుష్కలంగా వుండాలి. లేకపోతే విజయ కాంక్షని పురిగొల్పాలి. ఈ సహజమైన బంధం అందరి జీవితాలలో అన్ని సందర్బాలకి వర్తిస్తుంది. జీవితానికి మనం ఏది ఇస్తే జీవితం మనకి అదే ఇస్తుంది.
ఒకరోజు ఒక సింహం ఎండలో తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద సేదదీరింది.
చిట్టెలుక ఒకటి చెట్టుపై నుంచి చూసుకోకుండా సింహం మీదకు దూకింది. అప్పుడు సింహం ఆ ఎలుకను కోపంగా చూసింది.
ఆ ఎలుక భయపడి "అయ్యా నేను అల్ప ప్రాణిని. అవివేకం వల్ల మీ మీదకు దూకాను. నన్ను కరుణించి ప్రాణభిక్ష పెట్టండి" అంటూ ప్రాధేయపడింది.
సింహం దయతో ఆ ఎలుకను చంపకుండా వదిలిపెట్టింది. దానికి ఎలుక ఎంతో సంతోషించి "మీరు చేసిన మేలును నేను ఎన్నటికీ మరచిపోను" అని తన బొరియలోకి వెళ్ళిపోయింది.
కొన్ని రోజులు గడిచాయి. ఎప్పటిలా వనమంతా తిరుగుతున్న సింహం ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది. ఆ వల నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నించింది. కాని బయటపడలేకపోయింది.
'ఇక ఈ రోజుతో తన జీవితం ముగిసిపోతుంది అనుకుని భయంకరంగా అరుస్తూ ఆ వల నుండి బయటపడటానికి శతవిధాల ప్రయత్నించసాగింది.
దాని అరుపులు విన్న ఎలుక తన బొరియలోంచి బయటకు వచ్చింది. వలలో చిక్కుకున్న సింహాన్ని చూసింది.
"బాధపడకండి మహారాజా! మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే అవకాశం నాకు కలిగింది" అంటూ వల తాళ్ళని తన వాడియైన పళ్ళతో పటపటా కొరికేసింది.
ప్రాణాపాయం నుండి బయటపడ్డ సింహం ఎలుకకి కృతజ్ఞతలు తెలిపింది.
ఒకరోజు అక్బరు చక్రవర్తికి తన రాణి పట్ల చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయన రాణిని అంత:పురం విడిచి పుట్టింటికి వెళ్ళిపొమ్మని, ఇంకెప్పూడూ తిరిగి రావద్దని ఆజ్ఞాపించాడు. రాణి అక్బరు కోపం పోగొట్టడానికి ఎన్నో రకాలుగా ప్రాధేయపడింది. కాని, ఆయన రాణి మాటలు వినే స్థితిలో లేడు. ఏం చేయాలో పాలుపోక రాణి బీర్బలు కు కబురు పంపింది. బీర్బల్ వచ్చాక జరిగినదంతా చెప్పి ఆ సంకటంలోంచి తనను గట్టెక్కించమని ప్రాధేయపడింది. బీర్బల్ ఆమెను ఓదార్చి, కొద్దిసేపు ఆలోచించి ఒక ఉపాయం చెప్పాడు. అది విన్న రాణి మనసు కొంత కుదుటపడింది.
వెంటనే రాణి కోపంగా ఉన్న అక్బరు దగ్గరకి వెళ్ళి "ప్రభూ, మీ ఆదేశానుసారం నేను రేపు ఈ కోటను వదిలి వెడుతున్నాను. ప్రభువుల వారు అనుమతి ఇస్తే నాకు ప్రియమైంది నాతో తీసుకువెళ్ళాలనుకుంటున్నాను." అని వినయంగా చెప్పింది.
"ఈ కోట నుండి నీకేం కావాలో అది తీసుకువెళ్ళు" అని జవాబిచ్చాడు అక్బరు. ఆ మరునాడు రాణి తన ప్రయాణానికి సిద్ధం అయ్యింది. అప్పుడు బీర్బల్ అక్బర్ దగ్గరకు వెళ్ళి "ప్రభూ, రాణీగారు కోటను వదిలి వెళ్ళి పోవాలనుకుంటున్నారు కాని వారికి ప్రియమైన వస్తువు ఒకటి ఉందని, అది లేనిదే వెళ్ళలేనని అంటున్నారు." అని చెప్పాడు.
"తనకేం కావాలో అది తీసుకుని తక్షణం ఇక్కడుంచి వెళ్ళిపోమని చెప్పు."
"అలాగే జహాపనా. ఆవిషయంలోనే వారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు"
సరే రమ్మని చెప్పు" అని ఆదేశించాడు అక్బరు.
రాణి సరాసరి అక్బరు ముందు నిలబడి "ప్రభూ మీరు నా ప్రియమైన వస్తువు నాతో తీసుకెళ్ళవచ్చని అనుమతి ఇచ్చారు. మీరు నాతో కలిసి మా పుట్టింటికి రమ్మని మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను. మీకంటే ప్రియమైనది ఈ ప్రంపంచంలో నాకు ఇంకొకటి లేదు," అంది రాణి వణికే కంఠంతో.
రాణి మాటలు వినగానే అక్బరులోని కోపం ఒక్కసారిగా చల్లారింది. రాణి తనను ఎంతగానో ప్రేమిస్తోందన్న విషయాన్ని గ్రహించాడు. ఈ తెలివైన ఆలోచన ఎవరిదో అక్బరుకు తెలుసు. అందుకే నవ్వుతూ బీర్బల్ వైపు చూశాడు.
ఆధారము: రమేష్ బాబు, టీచర్, పశ్చిమ గోదావరి
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/10/2020
రచన: మౌనిక, పదో తరగతి, కస్తూర్బాగాంధీ బాలికా విద్య...
ఈ పేజి లో మరికొన్ని నీతి కథలు అందుబాటులో ఉంటాయి...
ఈ పేజి లో మరికొన్ని నీతి కథలు అందుబాటులో ఉంటాయి......
నేనూ, మా అన్న ఉండేవాళ్ళం, మా యింటికల్లా పిల్లలం. మ...