అమాయకులను తెలివైన వాళ్ళు ఎలా మోసం చేస్తారో చివరికి వాళ్ళకి ఏ గతి పడుతుందో ఈ కధ వల్ల మనకు తెలుస్తుంది. మోసం, దుర్మార్గం ఎక్కువ కాలం సాగదు అది బయటపడ్డప్పుడు ఆ తప్పుకు తగ్గ మూల్యం చెల్లించాల్సిందే అన్నది ఈ కధలో నీతి. పూర్వం ఒక అడవిలో చంపక అనే కొంగ ఉండేది. అది ముసలిది అయిపోవటం వల్ల ఇతర కొంగల లాగా వేటాడి ఆహారం సంపాయించటం కష్టంగా అనిపించి అందుకు ఒక ఉపాయం ఆలోచించింది. బదరికావనంలో కాసారం అనే సరస్సు ఉండేది. అక్కడ మంచి చేపలు సరస్సు నిండా ఉన్నాయని తెలుసుకుంది. ఆ కొంగ వెంటనే ఎగిరి వెళ్ళి ఆ సరస్సులో మకాం పెట్టింది. వంటికాలు మీద నిల్చుని జపం చెయ్యసాగింది. సరస్సులోని చేపలు కొంగచుట్టూ చేరాయి. అయినా కొంగ వాటిని చంపి తినలేదు. అది చూసి చేపలు ఆశ్చర్యపోయి కొంగా! నీకు మేం ఆహారం. పైగా నీకు అందుబాటులోకి వచ్చినా మమ్మల్ని తినవేంటి? అంటూ అమాయకంగా అడిగాయి .
అప్పుడు ఆ కొంగ ఓ... నా చేప మిత్రులారా! నేను గంగా నది ఒడ్డునున్న మర్రిచెట్టు మీద కూర్చుని ఉన్నాను. అప్పుడు ఆ చెట్టు క్రింద ఓ యోగి తన శిష్యులకు ధర్మాలను చెబుతూ సకల ప్రాణులయందు దయతో ఉంటే కాని మోక్షం లభించదని చెప్పాడు. అది విన్న నేను ఇక నుంచి మీలాంటి జీవులను చంపి తినకూడదని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పింది. చేపలు సంతోషించాయి. కొద్దిరోజుల్లోనే చేపలు కొంగ మంచి మిత్రులయ్యాయి. ఒక రోజు ఉదయం చేపలు నీటిపైకి వచ్చేసరికి కొంగ ఏడుస్తూ కనిపించింది. మిత్రమా! ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడిగాయి చేపలు. ఏం చెప్పను మిత్రలారా! ఇప్పుడే చేపలు పట్టేవాళ్ళు ఇటు వైపు వచ్చారు. వాళ్ళు ఈ సరస్సులో చాలా చేపలు ఉంటాయి, త్వరలో వచ్చి ఈ నీళ్ళన్నీ తోడేసి చేపలు పట్టుకుందాం అని అనుకోవటం విన్నాను అని బాధగా చెప్పింది కొంగ.
కొంగ మాటలకు చేపలు భయంతో బిక్కచచ్చిపోయాయి. ఇప్పుడెలా..? అని చేపలు మనసులో భయపడసాగాయి. కొద్దిరోజులలోనే మనం మంచి మిత్రులం అయ్యాం... త్వరలో మీరంతా చేపలవాళ్ళ చేతికి దొరికి మరణిస్తారని తల్చుకుంటుంటేనే నా మనసు ఏదోలా అయి పోతోంది అంటూ కొంగ దొంగ కన్నీరు కార్చింది. కొంగ మాటలకి చేపలన్నీ మరింత బెదిరిపోయి ఏడ్చాయి. కొంగ మిత్రమా? మమ్మల్ని ఈ ఆపదనుండి నువ్వే కాపాడాలి అంది ఓ చేప. అయ్యో! నేను ముసలి కొంగను మిమ్మల్ని ఎలా రక్షిస్తాను. అయినా ప్రయత్నిస్తాను. ఇక్కడకు దగ్గరలో ఉన్న కొండలలో నాకు తెలిసిన సరస్సు ఉంది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం మీలో ఇద్దరిద్దరి చొప్పున ముక్కుతో పట్టు కెళ్ళి ఆ సరస్సు లో వదిలేసి వస్తాను అన్నది. చేపలన్ని ఆనందంగా తలలూపాయి.
ఆ రోజు నుంచి కొంగ ప్రతి రోజు ఉదయం సాయంత్రం రెండు రెండు చేపలని ముక్కుకు కరుచుకుని వెళ్ళి కొంత సేపటి తరువాత ఖాళీ నోటితో తిరిగివచ్చి తీసుకెళ్ళిన చేపలని క్షేమంగా మరో సరస్సులో వదిలి వచ్చానని చెప్పేది. కొద్ది రోజులు గడిచిపోయాయి. చెరువులో చేపలు సగం పైగా ఖాళీ అయిపోయాయి. అదే సరస్సులో జంత్రుడు అనే ఎండ్రకాయ ఉండేది. దానికి కొంగ చేపలకు చేస్తున్నది మేలు కాదు కీడు అన్న అనుమానం వచ్చింది. ఆ విషయం చేపలకు చెప్పి మరనాడు తను కూడా వెళతానంది అవి సరే అన్నాయి. ఒక రోజు కొంగ మిత్రమా ఈ రోజు నా వంతు నన్ను తీసు కెళ్ళు అన్నది. ఆహా! రోజూ ఈ చేపలను తిని నా నోరు చప్పబడిపోయింది. ఈరోజు ఈ ఎండ్రకాయతో విందుభోజనం చేసుకుంటాను అననుకుని సరే అంది కొంగ .
ఎండ్రకాయను నోటికి కరుచుకుపోయింది. కొంగమిత్రమా! నన్ను ముక్కున కరుచుకుంటే నా కొండె నీ కళ్ళలో దిగబడే ప్రమాదం ఉంది అందుకని నీ మెడను కరిచి పట్టుకుంటాను అన్నది. కొంగ ఇదీ ఒకందుకు మంచిదే అనుకుని సరే అన్నది. ఎండ్రకాయ కొంగ మెడను పట్టుకున్నాక కొంగ ఆకాశంలోకి ఎగిరింది. కొంతదూరం ప్రయాణం చేసాక ఎండ్రాకాయ క్రిందకు చూసింది. అప్పుడు ఎండ్రకాయ నిజమే! ఇది దొంగ కొంగ. ఈ రాళ్ళు రప్పలలో నీటి చుక్క కూడా ఉండదు. దీనికి తగినశాస్తి చెయ్యాల్సిందే అనుకుని కొంగ మెడను కొరికేసింది. కొంగ ప్రాణాలు వదులుతూ నేల మీద పడిపోయింది. ఎండ్రకాయ కొంగ మెడను వదిలి తాపీగా తన చేప మిత్రులు ఉన్న సరస్సు వైపు నడిచింది. చూసారా! మోసం ఎంతో కాలం దాగదు... తాడిని దన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడు. అబద్దాలు చెప్పి చేపలను చంపి తిన్న కొంగ ఎండ్రకాయ చేతిలో చచ్చింది. అందుకే ఎవ్వరిని మోసం చెయ్యరాదు. అలా చేస్తే కొంగలాగా చివరికి ఫలితం అనుభవించాల్సి వస్తుంది.
గోవిందయ్య అనే వ్యాపారస్తుడు అతి పిసినారి. ఏదయినా సరే బేరమాడటంలో అవతలి వ్యక్తికి విసుగు తెప్పించి తను లాభపడాలని కోరుకునే మస్తత్వము గల వ్యక్తి. ఒక దినమున అరణ్యమార్గము గుండా పట్నము వెళ్తున్నాడు. తనతోపాటు ఎవరూ లేరు. అతనిని చూస్తే వర్తకులుగాని, సాటివారుగానీ, హడలెత్తేవారు. అరణ్యమార్గములో పోతూవుండగా చెట్టు పొద సమీపములో బక్కచిక్కిన శరీరముతో వున్న ఋషి పడి వున్నాడు. అతను 'దాహం... దాహం' అని వినీ వినపడనట్లుగ అంటుంటే గోవిందయ్య వెళ్ళి తన వద్దగల మంచినీళ్ళు మునీశ్వరుని నోట్లో పోశాడు. కళ్ళు తెరిచి ముని "చివరి ఘడియల్లో నాకు దాహార్తిని తీర్చినావు. నీ మేలు మరవను. నాకు ఇది చివరి నిమిషం. నిమిషంలో మృత్యువు నన్ను సమీపించనుంది. వెంటనే అదైనా వరము కోరుకో... నేను ప్రసాదించగలను" అన్నాడు. గోవిందయ్య దురాశతో "మునీశ్వరా! ఒక వరమంటే నేను ఏం కోరుకోను. కనీసము మూడు వరాలైనా ఇవ్వండి స్వామీ" అన్నాడు. అప్పటికే మునీశ్వరుని కళ్ళు మూతలు పడసాగాయి. శక్తి సన్నగిల్లింది అయినా "అలా వీలుకాదునాయనా! ఏదయినా వరం కోరుకో! ఆలస్యము చేయకు" అన్నాడు మునీశ్వరుడు తన శక్తినంతా కూడదీసుకుని. గోవిందయ్యలో వ్యాపార సరళి ప్రవేశించింది. కనీసము రెండు వరాలైనా కోరుకోవాలనే కాంక్ష బయలుదేరింది. అతనిలో గల ఆశపోతుతనము అతన్ని వివశుణ్ణి చేసింది. వెంటనే "పోనీ కనీసం రెండు వరాలయినా ఇవ్వంది స్వామీ" అని అన్నాడు అసంతృప్తిగా. వెంటనే మునీశ్వరుదు "అలా సాధ్యముకాదు నాయనా! నేను నీకు వరము ఒక్కటే ఇవ్వగలను. ఆలస్యము చేయక వెంటనే కోరుకో" అన్నాడు. అప్పటికే ఋషిపుంగవుని మాటలుతడబడి చివరి శ్వాస తీసుకునే ప్రయత్నములో వున్నాడు. గోవిందయ్యలో ఆశపోతు తనము చావలేదు. ఏం కోరుకోవాలా అని ఆలోచిస్తూ మునీశ్వరుని వంక చూశాడు. అప్పటికే ఆ మునీశ్వరుని ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. తన ఆశపోతు తనమే తనకు శాపముగా మారిందని తలిచాడు. ఒక్కటైనా మంచి వరం కోరుకొని వుంటే బాగుండేది కదా తనకు దక్కిన అదృష్టము చేజారిపోయింది కదా అనే విచారముతో ఇంటి ముఖము పట్టాడు. తన దురాశే దుఃఖమునకు మూలము అని గ్రహించి అప్పటి నుంచి అందరితో సఖ్యతగా వుంటూ కాలము గడిపాడు.
పూర్వం ఓ వ్యాపారి తన వస్తు సామాగ్రిని మరో దేశంలో అమ్మడానికి అనుచరులతో బయలుదేరాడు. దారిలో వారు ఒక ఎడారి చేరుకున్నారు. ఎండవేడిమికి ఇసుక కాలుతోంది. అలాంటప్పుడు అందులో ప్రయాణించడం దుర్లభం. అందరూ దిగాలు పడ్డారు. అరికాళ్లు బొబ్బలెక్కేటంత ఎండ మండిపోతోంది. ఎడ్లయినా, ఒంటెలైనా నడవడం చాలా కష్టం. అందునా వాళ్ల దగ్గర తగినన్ని మంచినీళ్లు లేవు. నీళ్లు లేకుండా ఎలా ప్రయాణం కొనసాగించాలా అని విచారించసాగారు.
వ్యాపారి "నేనూ అధైర్యపడితే వీళ్లు మరీ నీరుగారిపోతారు. ఈ పరిస్ధితుల్లో ఇలా వదిలేయడం నాయకత్వమనిపించుకోదు. ఏదో ఒకటి చేయాలి. లేకుంటే సరుకులు, ఇంత శ్రమా వృధా అయిపోతుంది. వీళ్లని రక్షించే మార్గమేదైనా ఆలోచించాలి" అనుకున్నాడు.
కనుచూపుమేరలో గడ్డి పరకలు కనిపించాయి. "నీరు లేకుండా ఏ మొక్కా ఎడారిలోనైనా పెరగదుగదా" అనుకున్నాడు. వెంటనే తన అనుచరుల్లో చలాకీగా వున్న వారిని పిలిచి అక్కడ గొయ్యి తవ్వమన్నాడు. తవ్వగా తవ్వగా వాళ్లకి రాయి అడ్డు వచ్చింది. విసిగెత్తి నాయికుడిని తిట్టుకున్నారు. "ఇదంతా వృధాశ్రమ, సమయాన్ని వృధా చేస్తున్నాం!!" అన్నారు. కానీ వ్యాపారి మాత్రం "స్నేహితులారా, అలా నిరుత్సాహపడద్దు ప్రయత్నించండి. కాదంటే మనం, మన ఎడ్లు ఆకలిదప్పులతో నాశనమవుతాం... ఉత్సాహం కోల్పోవద్దు" అన్నాడు.
అతను అలా అన్నాడో లేదో, రాయి పగిలి గుంట ఏర్పడింది. దానిపై వొంగి అతను చెవి పెట్టి దాని అడుగున నీటి రొద విన్నాడు. వెంటనే తవ్వుతున్న కుర్రాణ్ణి పిలిచి, "ఆగిపోకు, అందరూ ఇబ్బంది పడతాం... ఇదుగో ఈ గొడ్డలి తీసుకుని రాయిని బద్దలకొట్టు" అని ఉత్సాహపరిచాడు.
ఆ కుర్రాడు గొడ్డలితో బలంగా రాతిని కొట్టాడు. అది పగిలింది. వెంటనే ఎంతో వేగంగా నీరు పైకి రావడం చూసి ఆశ్చర్యపోయాడా కుర్రాడు. అంతా ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఆ నీటిని తాగారు, స్నానం చేశారు. పశువులకి స్నానం చేయించారు. వంట చేసుకుని తిన్నారు.
అక్కడి నుంచి వాళ్లంతా బయలుదేరే ముందు అక్కడ నీళ్లున్నాయన్న సంగతి అందరికీ తెలిసేలా ఓ ధ్వజం పాతారు. సుదూర ప్రాంతాట నుంచి వచ్చే యాత్రికులకు అక్కడ ఎర్రటి ఎండతో మాడే ఎడారి మధ్యలో కొత్త నీటి వూట వుందన్నది తెలిసేలా చేశారు. వారి ప్రయాణం కొనసాగించి సురక్షితంగా ముగించారు.
అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఖజానా నిండుగా డబ్బులు ఉండేవి, అయినా రాజుకు తెలీని అసంతృప్తి. ఒక రోజు ఆ రాజు వేటకు వెళ్ళినాడు, వేటకు వెళ్ళి జింక పిల్లలు, భల్లూకాలు, సింగాలు, వేటాడి అలసి నిద్రిస్తుంటే ఒక కల వచ్చింది.
రాజు ఆనందాశ్చర్యాలతో మేల్కొంటాడు. లేచి చూస్తే ఏముంది ధగ ధగ మెరుస్తూ ఏడు పెద్ద కూజాలు కనిపించినాయి, వాటిలో ధనం చూసి రాజుకు మూర్చ వచ్చినంత పని అయినది. ఆనందంతో వాటిని చూసి రాజు తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ, నగలు అన్నీ దానిలో వేసినాడు కానీ కూజా నిండుగా కాలేదు! ఇంకా సగం ఖాళీగానే ఉన్నది.
రాజ్యం వెళ్ళి ఒక్క రోజు ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. వారం రోజుల ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. ఒక్క నెల రోజుల ఆదాయం వేసినాదు కానీ ఇంకాక్ ఊజా ఖాళీగానే ఉన్నది. ఒక సంవత్సరం ఆదాయం వేసినాడు ఇంకా ఖాళీగానే ఉన్నది. ఇహ పౌరుషం పొడుచుకొచ్చి ఆవేశంతో ఖజానా మొత్తం వేయడానికి సిద్ధం అయినాడు, కానీ తెలివి గల మంత్రిపుంగవులు వచ్చి రాజు ఆవేశాన్ని చల్లార్చి రాజా! ఈ ఏడవ కూజా ఉన్నది చూసినారా అది మీ మనస్సు లాంటిది, అది ఎప్పటికీ తృప్తి పొందదు మీరు కొద్దిగా తెలివిగా ఆలోచించండి అని చెప్పినాడు. రాజు కూడా నిజమే కదా అనుకొని చక్కగా తృప్తి పొంది ఆవేశాన్ని అనుచుకున్నాడు.
ఒక రాణి దేశంలోకెల్లా అతి పెద్ద సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉండేది. ఆమె ఏకైక పుత్రుడే ఆ రాజ్యానికి కాబోయే మహారాజు. యువరాజు ఆరడుగుల ఎత్తులో ఎంతో అందంగా, సుకుమారంగా ఉండేవాడు. అతనికి యుక్త వయసు వచ్చింది. పెళ్ళి చెయాలని భావించింది రాణి. కాబోయే కోడలు కూడా చాలా అందంగా, సుకుమారంగా ఉండాలని కోరుకుంది.
యువరాజుకి ఎన్నో రాజ కుటుంబాల నుండి సంబంధాలు వచ్చాయి. కాని ఆ రాజకుమార్తెలెవరూ రాణి కోరుకున్న లక్షణాలకు తగ్గట్టుగా లేరు. రాణి ఎన్నో సంబంధాలను కాదన్నదనే వార్త దేశమంతటా పొక్కింది. అది విన్న ఒక అందమైన రాకుమారి... రాణి గారిని కలుసుకోవాలని నిర్ణయించుకుంది. రాణిగారు ఎలాంటి రాకుమారిని తన కోడలుగా కోరుకుంటున్నారో తెలుకోవాలని అనిపించింది. అందుకని రాణి గారిని వ్యక్తిగతంగానే వెళ్ళి కలవాలనుకుంది.
సైనికులు ద్వారా తన రాకను రాణి గారికి తెలియజేసింది రాకుమారి. ఆమె కోసం రాణి తన భవనంలోని అందమైన గదిని సిద్ధంగా ఉంచిది. రాకుమారి రాణి గారి భవనానికి రాగానే రాణిగారి పరిచారికలు ఆమెను ఆ అందమైన గదిలోకి తీసుకు వెళ్ళారు. రాకుమారి ఎంత సున్నితమైనదో తెలుసుకోవాలని గదిలోని మంచం మీద కొన్ని మల్లెపూలు పెట్టి, వాటి మీద ఏడు పరుపులు పరిచారు. రాత్రి కాగానే ఆ మంచంపై పడుకున్న రాకుమారికి ఆ మల్లెపూల వల్ల అస్సలు నిద్ర పట్టలేదు.
ఆమె వీపు మీద ఎర్రని మచ్చలు ఏర్పడ్డయి. ఒళ్ళంతా కంది పోయింది. రాకుమారిని చూసేందుకు వచ్చిన రాణి కందిపోయిన ఆమె ఒంటిని చూసి ఆమె అత్యంత సున్నితమైనదని, తనకు కోడలిగా, తన కొడుకుకు సరైన భార్యగా రాణిస్తుందని నిర్ణయించుకుంది.
ఒకరోజు రాజుగారికి ఎద్దుపాలు త్రాగాలని అనిపించింది. 'ఎద్దుపాలా!?' అదేమంత పెద్ద కోరిక ఎవరైనా భటులకు చెప్తే వాళ్ళుతీసుకుని వస్తారు కదా! అని మీరు అనవచ్చు. నిజమే కాని ఎద్దులు పాలు ఇవ్వవు కదా! ఆ విషయం రాజుగారికి తెలుసు అయినా కూడా బీర్బల్ ఏం చేస్తాడోనని బీర్బల్‌ను ఆ విధమైన కోరిక కోరాడు రాజుగారు. ఇప్పుడు అర్ధం అయ్యింది కదా! అక్బర్ చక్రవర్తికి ఎంత విచిత్రమైన కోరిక కలిగిందో సరే! వెంటనే బీర్బల్‌ను పిలిపించాడు. తనకు ఎద్దుపాలు త్రాగాలని ఉందని చెప్పాడు.
అక్బర్ చక్రవర్తి ఆ మాట చెప్పగానే బీర్బల్‌కు రాజుగారు తనను పరీక్షించేందుకు ఇలాంటి కోరిక కోరారని అర్ధం అయ్యింది. వెంటనే అనుమానం కూడా వచ్చింది రాజుగారు చెప్పింది ఒక వేళ తను పొరపాటుగా విన్నానేమోనని మళ్ళీ అడిగాడు "మహారాజా! మీరు అడిగింది ఆవు పాలే కదా! తప్పకుండా తెప్పిస్తాను" అన్నాడు. ఆ మాటకు అక్బర్ చక్రవర్తికి నవ్వు వచ్చింది. "బీర్బల్! నేను చెప్పింది నువ్వు సరిగా వినలేదనుకుంటాను నేను అడిగింది ఆవు పాలు కాదు ఎద్దు పాలు ఆవు పాలైతే నిన్ను అడగడం ఎందుకు? ఎవరైనా భటులను పంపించి నేను తెప్పించుకుంటాను కదా!" అన్నాడు అక్బర్ చక్రవర్తి. "అది కాదు మహారాజా! ఎద్దులు పాలు ఇవ్వవు కదా!" అన్నాడు బీర్బల్.
"ఆ విషయం అందరకూ తెలిసిందే కదా! అయినా కూడా నాకు ఎద్దు పాలు త్రాగాలని ఎంతో కోరికగా ఉంది. నా కోరికను నువ్వు తీర్చాలి తప్పదు" పట్టుదలగా అన్నాడు అక్బర్ చక్రవర్తి. అక్బర్ చక్రవర్తి పట్టుదల ముందు బీర్బల్ తలవంచక తప్పలేదు. "సరే మహారాజా! మీరు అడిగినట్టుగానే మీకు ఎద్దు పాలు తెప్పిస్తాను" అని ఒప్పుకున్నాడు బీర్బల్. బీర్బల్ సమాధానం విని అక్బర్ చక్రవర్తి మాత్రమే కాదు, సబలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈసారైనా బీర్బల్ తన ఓటమిని ఒప్పుకుంటాడని, ఎద్దు పాలు తీసుకురావడం అసాధ్యం మహారాజా! ఈ పని నావల్ల కాదు అని అంటాడని అక్బర్ చక్రవర్తి అనుకున్నాడు. కానీ అట్లా అనకుండా సరే మహారాజా! ఎద్దుపాలు తీసుకుని వస్తాను అని బీర్బల్ అనేసరికి అక్బర్ చక్రవర్తితో పాటు సభలో ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యపోయారు.
"బాగా అలోచించే చెప్తున్నావా?" అని అడిగాడు అక్బర్. "అవును మహారాజా! మీ కోరికను మన్నించాలి కదా! మీరు కోరుకున్నట్లుగానే తప్పకుండా ఎద్దు పాలు తీసుకుని వస్తాను." అని చెప్పాడు బీర్బల్. "సరే! ఓ వారం రోజులు సమయం ఇవ్వండి మహారాజా!" అన్నాడు బీర్బల్. "అలాగే కానీ వారం రోజుల తర్వాత నువ్వు ఎద్దు పాలు తీసుకుని రాకపోతే మాత్రం నిన్ను శిక్షించాల్సి వస్తుంది. బాగా గుర్తుంచుకో" హెచ్చరికగా అన్నాడు అక్బర్ చక్రవర్తి. అందుకు బీర్బల్ సమ్మతించాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళాక బీర్బల్ చాలాసేపు అలోచించాడు. ఎలా రాజుగారి కోరిక తీర్చేది? ఎద్దులు ఎక్కడా పాలు ఇవ్వవని రాజుగారికి తెలుసు అయినా కూడా రాజు గారు ఎద్దు పాలు అడుగుతున్నాడంటే రాజుగారు తనను పరీక్షించడంకోసమే....
ఎలా రాజుగారికి ఎద్దుపాలు తీసుకుని వచ్చేది? ఈ విధంగా చాలాసేపు అలోచించగా బీర్బల్‌కు ఓ ఉపాయం తట్టింది. వెంటనే తన కూతురిని పిలిచి ఏం చేయాలో చెప్పాడు. బీర్బల్ కూతురు తండ్రి చెప్పినట్టుగానే బట్టలమోపు తీసుకుని రాజుగారి కోట వెనుకన ఉన్న ఖాళీ ప్రదేశానికి వెళ్ళింది. అప్పటికి సమయం అర్ధరాత్రి దాటి ఉంటుంది. అక్బర్ చక్రవర్తితో సహా అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో బీర్బల్ కూతురు గట్టిగా చప్పుడు చేస్తూ బండ కేసి బట్టలు ఉతకడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి బట్టలు ఉతుకుతున్న శబ్ధానికి మహారాజుకు నిద్రాభంగం అయ్యింది. మంచి నిద్ర పాడయ్యేసరికి రాజుగారికి చాలా కోపం వచ్చింది. వెంటనే భటులను పంపించి ఈ సమయంలో బట్టలు ఎవరు ఉతుకుతున్నారో కనుక్కుని రమ్మనాడు. అక్బర్ చక్రవర్తి భటులు వెళ్ళి బీర్బల్ కూతురిని వెంట పెట్టుకుని రాజుగారి దగ్గరకు తీసుకుని వచ్చారు.
"ఏమమ్మాయ్! ఎవరు నువ్వు? ఈ సమయంలో బట్టలు ఉతుకుతున్నా వేమిటి?" అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. రాజుగారిని చూసి ఆ అమ్మాయి కొంచెం భయపడింది. "చెప్పమ్మాయ్! ఈ సమయంలో బట్టలు ఉతుకుతున్నావేమిటి? మరోసారి అడిగాడు అక్బర్ చక్రవర్తి. "ఇంట్లో చాలా పని ఉండటం వలన వీలు కాలేదు మహారాజా! అందుకే ఈ సమయంలో బట్టలు ఉతుక్కుంటున్నాను." అని చెప్పింది ఆ అమ్మాయి. "చాలా ఆశ్చర్యంగా ఉందే" అన్నాడు మహారాజు. "అవును మహారాజా! మా నాన్నగారు ప్రసవించడం వలన ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మా నాన్నగారి ప్రసవం సంగతి వినగానే మా బంధువులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కావాల్సినవన్నీ చూడటం వలన బట్టలు ఉతుక్కోవడానికి సమయం దొరకలేదు. మా నాన్నగారు చంటిబిడ్డ ఇంతకుముందే నిద్రపోయారు. అందుకని ఈ సమయంలో బట్టలు ఉతుక్కోవడానికి వచ్చాను." అని చెప్పింది ఆ అమ్మాయి.
ఆ అమ్మాయి చెప్పిన సమాధానం విని అక్బర్ ఆశ్చర్యపోయాడు. "ఏంటి మీనాన్నగారు ప్రసవించారా!?" అని అడిగాడు. "అవును మహారాజా!" అంది ఆ అమ్మాయి. "మగవాళ్ళు ఎక్కడైనా పిల్లల్ని కంటారా!? నువ్వు చెప్పేదంతా చాలా విడ్డూరంగా ఉంది. నిజం చెప్పు అసలు ఎవ్వరునువ్వు?" కొంచెం కోపంగా అడిగాడు రాజుగారు. "నేను నిజమే చెప్తున్నాను మహారాజా! నిజంగానే మా నాన్నగారు ప్రసవించారు." అని చెప్పింది ఆ అమ్మాయి. "ఇదిగో అమ్మాయి! చిన్నపిల్లవు కదా అని ఊరుకుంటుంటే మళ్ళీ మళ్ళీ అదే అబద్దం చెప్తున్నావు. నిజం చెప్పు ఎవరు నువ్వు?" అని అడిగాడు అక్బర్ చక్రవర్తి "మహారాజా! నేను నిజమే చెప్తున్నాను నిజంగానే మా నాన్నగారు ప్రసవించారు. అయినా మహారాజా! ఎద్దులు పాలు ఇవ్వగా లేనిది మానాన్నగారు ప్రసవించడంలో ఆశ్చర్యం ఏముంది?" ఎంతో అమాయకంగా ముఖంపెట్టి అడిగింది. అంతే అక్బర్ చక్రవర్తికి నవ్వు వచ్చింది. అంతేకాదు ఆ అమ్మాయి ఎవరో కూడా రాజుగారికి అర్ధం అయ్యింది.
"నువ్వు బీర్బల్ కూతురివి కదూ?" అని అడిగాడు మహారాజు "అవును మహారాజా!" అంది ఆ అమ్మాయి. అంతే మరోసారి బీర్బల్ తెలివి తేటలకు ప్రశంసలు బహుమానాలు లభించాయి. తర్వాత... తర్వాత ఏముంది? మరునాడు అక్బర్ చక్రవర్తి సభలో జరిగినదంతా చెప్పాడు. బీర్బల్‌ను ఎంతగానో మెచ్చుకున్నాడు. బోలెడన్ని బహుమతులు కూడా ఇచ్చాడు. తెలివితేటలు ఉంటే ఎలాంటి సమస్యలనైనా ఎంత సులభంగా పరిష్కరించుకోవచ్చో.
ఒక ఊరిలో ఒక వర్తకుడున్నాడు. అతడు గొప్ప జిత్తుల మారి. అతనొక నాడు మరొక వూరి సంతకు బయలుదేరాడు. దారిలో అతను చాలా విచారంగా వున్నాడు. అతని విచారానికి కారణం ఆనాడు తనింకా లాభసాటి పని ఏదీ చెయ్యలేదు అన్న ఆలోచనే. ఎలాగో లాభం దారిలోనే సంపాదించాలనే దురాలోచన ప్రారంభమయిందతనికి. ఇంతలో దారిలో ఒక మనిషి తారసపడినాడు. ఆ రైతు మరొక గ్రామం నుండి షావుకారు వెళుతున్న గ్రామానికే సంతపని మీద వెళుతున్నాడు. అతన్ని చూడగానే షావుకారికి పల్లెటూరి రైతు అంటే బైతు అని షావుకారు నమ్మకం. ఆ నమ్మకంతో సునాయాసమైన లాభం సంపాదించడానికి షావుకారు బ్రహ్మాండమైన ఎత్తువేశాడు. రైతుని చూసి ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. రైతు సంతకు వెడుతున్నానని జవాబు చెప్పాడు. సరే దారిలో ఉబుసుపోవడానికి యేవయినా కథలు చెప్పుకుందామని షావుకారు సూచించాడు. కథలంటే అందరికీ ఇష్టమే. అందులోను ప్రయాణంలో కాలక్షేపానికి కథలైనా ఉండాలి. కమ్మని నేస్తం అయినా ఉండాలి. కాలక్షేపానికి బావుంటుందని రైతు వెంటనే ఒప్పుకున్నాడు. షావుకారు కథకి పందెం కడితే రంజుగా ఉంటుందన్నాడు. ఇద్దరూ చెరొక కథ చెప్పాలనీ, ప్రతి కథా నమ్మడానికి వీలులేనంత అభూత కల్పనలతో అంటే పచ్చి అబద్దంగా ఉండాలనీ ఆ అబద్దం నమ్మడానికి వీలులేదని ఇద్దరిలో ఏ ఒకరయినా సందేహం వెలిబుచ్చితే, అతడు రెండవవాడికి వంద రూపాయలు చెల్లించాలనీ షావుకారు నిర్ణయించాడు. పాపం భయస్తుడయిన రైతు ఆ పందానికి మొదట ఒప్పుకోలేదు. కానీ జిత్తులమారి షావుకారు నయవంచనలకు లొంగి చివరకు అంగీకరించాడు. ఇంకేముంది? షావుకారు రొట్టె విరిగి నేతిలో పడిందని సంతోషించాడు. రైతును మొదట కథ చెప్పమన్నాడు. కానీ, వయస్సులో పెద్దవాడయిన షావుకారే ముందు కథ చెప్పాలని రైతు పట్టుబట్టాడు. "వైద్యుడు ఇచ్చినవి పాలే, రోగి కోరిందే పాలే" అన్నట్లు షావుకారు కోరిందీ అదే రైతు వత్తిడి చేసిందీ అదే, ఠపీమని షావుకారు అంగీకరించి, మొదటి దెబ్బకే లాభం చేసుకోవాలని లోలోపల పొంగి పోయాడు. అతను కథనిలా ప్రారంభించాడు.
అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద బిడారు వర్తకుడున్నాడు. అతనికి పాతిక ఒంటెలు వున్నాయి. వాటినన్నిటినీ ఒక దాని ముక్కును మరియొకదానికి పెద్ద పెద్ద మోకులతో కట్టి, ఒక పెద్ద గుంపుగా ఎడారిలో నడిపించుకుంటూ పోతున్నాడు. ఒకొక్క ఒంటె మీద వందేసి బారువుల ఖర్జూరపు పండ్లూ, వందేసి బస్తాల చింతపండూ, వందేసి బుట్టల తాటిబెల్లం వేసుకొని బదరీనాధ్‌కు ఎగుమతి చేస్తున్నాడు. అదే సమయానికి ఆ ప్రాంతములో నున్న రాజుగారి కుమార్తె తలంటుకొని, జుట్టు ఎండలో ఆరబెట్టుకుంటోంది. ఆమె చెలికత్తె జుట్టు చిక్కుతీస్తుంది. ఇంతలో ఒక పెద్ద గండభేరుండ పక్షి, ఆ ఎడారిలో ఎగురుతూ క్రిందనున్న ఒంటెలను చూచింది. దానికి ఆకలి వేసింది. వెంటనే ఒక ఒంటెని కాళ్ళతో తన్నుకొని కోడిపిల్లలను గ్రద్ద తన్నుకొని పోయినట్లు పైకి ఎగిరిపోయింది. కాని క్రింద నున్న పర్వతాల్లాంటి పాతిక ఒంటెలు ఒక కదువుగా వుండడం వలన అన్నీ పైకి పోయినవి. చాలా విచిత్రం! అది ఎంత పెద్ద గండభేరుండ పక్షో! దానికి ఎంత బలముందో! కాని క్రిందనున్న ఒంటెలు ఒకదానికి ముక్కు కొకటి కదువులతో కట్టబడి వుండడం వలన గిజగిజ తన్నుకున్నాయి. దానితో పక్షికి తట్టుతప్పింది. లటుక్కుమని కాళ్ళసందు నున్న ఒంటె జారి క్రిందపడింది. దాని వెంట మిగిలిన ఒంటెలు కూడా జరజర పడిపోసాగాయి. అవి అలాగ పడిపోతూ పెద్ద పెద్ద అరుపులు అరచాయి. ఇంతలో క్రింద తలారబోసుకుంటున్న రాజకుమార్తె ఆ గొడవేమిటాయని తల పైకెత్తి చూసింది. అంతే పైనుండి క్రిందపడుతున్న పాతికి ఒంటెల గుంపు కనిపించింది. ఆ రాకుమారి కళ్ళు ఒక్కొటి చిన్న సైజు చెరువంత వుంటుంది. మొత్తం పాతిక ఒంటెలు ఆ కంట్లో పడిపోయాయి.
రాకుమారి కంట్లో నలకల్లా పడ్డ ఒంటెలు చేసే గోలకి రాకుమారికి తీవ్ర ఇబ్బంది కలగజేయగా ఆవిడ బాధగా అరుస్తూ ఉంటే పక్కనే ఉన్న చెలికత్తె రాకుమారి కన్నులోని ఒక్కొక్క ఒంటెని తీసి తన జేబులో వేసుకుంది. మొత్తం 25 ఒంటెలను తీసి రాకుమారి బాధను తగ్గించింది. ఆ చెలికత్తె వెంటనే జేబురుమాల తీసుకొని, రాచకన్నె కన్ను వత్తి ఒక్కొక్క ఒంటెని కంటిలోనివి తీసి జేబులోవేసింది. అలాగ పాతిక ఒంటెలను తీసి రాజకుమార్తె గగ్గోలును తగ్గించింది. అని ఆ షావుకారు తనవంతు కథను పూర్తిచేశాడు. కాని రైతు ఏ రకమయిన సందేహాన్ని బయట పెట్టలేదు. పాపం షావుకారు నిరుత్సాహపడి బిక్కమొహం వేశాడు. ఇంక చేసేది లేక రైతు వంతు కథను మొదలు పెట్టమన్నాడు. ఆ రైతు తన కథను ఇలా చెప్పాడు.
మా నాన్న గారు ఈ ఊరిలో చాలా పెద్ద రైతు ఆయనకు రెండువందల జతల ఎడ్లు, ఐదువందల ఆవులు, ఒక వేయి ఎకరాల మాగాణి, పెద్ద మండువా ఇల్లు ఉండేది. ఆ రోజుల్లో మీ నాన్న చాలా పేద షావుకారు, మా నాన్నకి చాలా గుర్రాలుండేవి. ఆ గుర్రాలలో చింత పువ్వురంగు గుర్రం అంటే మా నాన్నకు పంచప్రాణాలు, దాన్ని చూసి అందరూ ముచ్చట పడేవాళ్ళు. ఆ గుర్రం మీదే మా నాన్న ప్రతివారం సంతకు వెళ్ళి సామానులు వేసుకుని, ఇంటికి వస్తూండేవాడు, ఒకసారి సంతకు వెళ్తుండగా గుర్రం మీద జీను రాసుకొని గుర్రం వీపు మీద పుండు పడింది. సంతనుంచి గోధుమల బస్తాలు గుర్రం మీద వేసుకొని మా నాన్న వస్తూ వుండగా దారిలో పెద్ద గాలివాన వచ్చిందట. అందువలన పెద్ద ధూళిపొర ఎగిరి గుర్రం వీపు మీదనున్న పుండుపై పడిందట. తరువాత వాన చినుకులు కూడా దాని మీద పడ్డాయి. గుర్రం వీపు మీద పడి మొలకెత్తడం మొదలు పెట్టాయి. అలా మొలచిన మొక్కలకు గుర్రం వీపు మీద పెద్ద గోధుమ పొలం తయారయింది. మరి కొన్నాళ్ళకు ఆ పొలం పండి కోతకు సిద్దపడింది. అందుచేత ఆ పొలం కొయ్యటానికి రెండువందల మంది పనివాళ్ళను మా నాన్న పెట్టాడట, అంటే మా గుర్రం మీద పెరిగిన గోధుమ చేను ఎంత పెద్దదో తెలుసుకో! ఆ చేను కోయగా ఎన్నో వేల బస్తాల గోధుమల దిగుబడి వచ్చిందట, ఇంతలో మీ నాన్న మా నాన్న దగ్గరకు వచ్చి "పెదకాపుగారూ! నేను చాలా పేదవాణ్ణి పిల్లలతో నానా బాధపడుతున్నాను. దయచేసి నాలుగు బస్తాల గోధుమలు నాకు అప్పుగా ఇప్పించండి. మీ అప్పు తప్పక తీరుస్తాను. అని దీనంగా ప్రాధేయపడ్డాడు. అసలే మా నాన్నది చాలా జాలిగుండె మీ నాన్న కష్టంలో అడిగిన అప్పు ఇవ్వడానికి అంగీకరించాడు. వెంటనే మీ నాన్న నాలుగు బస్తాల గోధుమలు తీసుకొని వెళ్ళిపోయాడు. కాని ఆ బాకీని ఇప్పటికీ తీర్చలేదు. అందుచేత వడ్డీ లేకపోయినా, అసలు మొత్తమైనా నువ్వు ఇస్తే మీ నాన్న చచ్చి యే లోకాన ఉన్నాడో ఋణ విముక్తుడవుతాడు. అని తన కథను ముగించాడు.
ఇప్పుడు షావుకారు పెద్ద సంకటంలో పడ్డాడు. నిజానికి షావుకారు తండ్రి పెద్ద ధనికుడు. కాని రైతు కథలో చాలా బీదవాడని అన్నాడు. అతను చెప్పింది కాదంటే వంద రూపాయలు రైతుకి ఇచ్చుకోవలసినదే. పోనీ పైసా కోసం పరువు పోగొట్టుకుందాం అనుకున్నా గుర్రం వీపు మీద గోధుమ పొలం ఏమిటి? అనే సందేహం వచ్చిపడింది. అది బయటకు చెబితే నిర్ణయం ప్రకారం వంద రూపాయలు ఇచ్చుకోవలసిందే. పోనీ ఆ అవమానాన్ని పచ్చి అబద్దం అని తెలిసినా సహించినా షావుకారు తండ్రి అప్పుగా నాలుగు బస్తాల గోధుమలు తీసుకోవడం ఏమిటి? ఖర్మ ఇక షావుకారు నాలుగు బస్తాల గోధుమలయినా రైతుకు ఇచ్చుకోవాలి. లేదా వందరూపాయలు ఐనా ఇచ్చుకోవాలి. ఇప్పుడు షావుకారు పని అడకత్తెరలో పోకచక్కలా అయింది. ఈ రెండింటిలో అప్పుకంటే అనుమానమే చౌక అంటే నాలుగు బస్తాల గోధుమల కంటే కథ అంతా పచ్చి అబద్దం అనేసి, వంద రూపాయలు వదులుకోవటమే నయం అని నిశ్చయించుకున్నాడు. అందుచేత "కథ అంతా పుక్కిటి పురాణం" అని రైతుతో అన్నాడు. వెంటనే నిర్ణయం ప్రకారం రైతు వంద రూపాయలు వసూలు చేసుకున్నాడు. పాపం షావుకారు బ్రహ్మాండమైన ఎత్తువేశాడు. కాని చివరకి తను తవ్విన గోతిలో తానే పడ్డట్టు చిత్తయిపోయాడు.
ఒకప్పుడు అదృష్టానికి, తెలివితేటలకు మధ్య ఒక వాదన వచ్చింది. నేను గొప్ప అంటే నేనే గొప్ప అని రెండూ వాదించుకున్నాయి. వారిరువురూ వారివారి వాదనలను ప్రొయోగాత్మకంగా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు.
అదృష్టం తన సామర్ధ్యాన్ని నిరూపించడానికి ఒక పేదరైతును ఎంచుకుంది. అతని గోధుమ పంటని ముత్యాలుగా మార్చింది. కానీ ఆ రైతు మాత్రం తన గోధుమ పంటంతా గులకరాళ్ళుగా మారిపోయాయని చింతించింది. అప్పుడే అటుగా వెళ్తున్న రాజు అతడి దు:ఖానికి కారణమేంటని అడిగాడు. రైతు అంతా వివరించాడు. ముత్యాలపంటను చూసిన రాజు ఆశ్చర్యపోయి, పక్కనే ఉన్న మంత్రితో "ఇతనెవరో కానీ చాలా అదృష్టజాతకుడిలా ఉన్నాడు. రాకుమార్తెను ఈ యువరైతుకు ఇచ్చి వివాహం జరిపించాలనుకుంటున్నాను" అని మెల్లగా అన్నాడు. మంత్రి నిజమే అనడంతో "నీ పంటనంతా రాజమహల్‌కు తీసుకురా. నీకు నేను మోయలేనంత ధనంతో పాటు నా కుమార్తెనిచ్చి పెళ్ళి జరిపిస్తాను" అని రైతుతో అన్నాడు రాజు.
రాజు మాటకు రైతు ఎగిరిగంతేసి తన అంగీకారం తెలిపాడు. ఊళ్ళోకి పరిగెత్తుకుపోయి అందరికీ రాకుమార్తెతో తనకు జరగబోయే వివాహం గురించి చెప్పగా గ్రామస్ధులు అతడిని ఆట పట్టించారు.
రైతు రాజమహలుకు ఒంటరిగా వెళ్ళాడు. రాకుమార్తెతో అతని వివాహం జరిగింది. రాత్రి సమయంలో అతని భార్య (రాకుమార్తె) నిండుగా వస్త్రాలు ధరించి అతని గదిలోకి ప్రవేశించింది. ఆమెను చూడగానే అతనికి పెళ్ళికూతురు వేషంలో వచ్చి మనుషుల రక్తం కధ గుర్తుకు వచ్చింది. రైతు రాకుమార్తెను కూడా పిశాచిగా భావించి భయంతో పారిపోయి నదిలో దూకాడు.
రాకుమార్తె అరుపులు వల్ల కొందరు సైనికులు అతని వెంట పరుగుతీసి అతన్ని కాపాడి, తీసుకువచ్చారు. రాజు రైతుపై కోపంతో అతనికి ఉరిశిక్ష విధించాడు.
విజ్ణానం అదృష్టంతో ఇలా అంది. "చూసావా, నీవు ఆ పేదరైతుకు ఎంతటి కష్టాన్ని తెచ్చి పెట్టావో? నేను అతడిని కాపాడతాను".
విజ్ణానం రైతు మెదడులోనికి ప్రవేశించింది. వెంటనే రైతు జాగృతమై ఇలా అన్నాడు. "రాజా! ఏ నేరానికై నాకు ఉరిశిక్ష విధించారు? నిన్న రాత్రి ఒక వ్యక్తి నదిలో మునిగిపోతూ, కాపాడమని చేసిన హాహాకారాలు నేను విన్నాను. పెళ్ళి రోజు రాత్రి ఎవరైనా మునిగి చనిపోతే అది ఆ పెళ్ళికూతురికి అశుభసూచకం కదా అందువల్ల నేను అతడిని కాపాడడానికి పరిగెత్తాను. నేను నిన్న రాత్రి చేసినదంతా మీ కూతురి క్షేమం కోసమే".
ఈ మాటలు విన్న రాజు అతడిని క్షమాపణలు వేడుకుని ఆలింగనం చేసుకున్నాడు.
ఒక పాడుబడ్డ గుడిసెలో ఒక గాడిద, కోడిపుంజు ఉండేవి. గాడిద బాగా లావుగా, దిట్టంగా ఉండేది. రెండు జంతువులూ చాలా స్నేహంగా ఉండేవి. ఒక రోజు ఒక సింహం తన దారిలో వెళ్తూ దిట్టంగా ఉన్న గాడిదను చూసింది. ఎలాగైనా దానిని చంపి,తినాలని అనుకుంది.
సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న సింహానికి గాడిద గడ్డి తింటూ పరధ్యానంగా ఉండడం గమనించింది. అంతే, చెట్టు మాటున దాగి, గాడిదపై దాడి చేయాలని ఒక రంకె వేసింది. సింహాన్ని గమనించిన కోడిపుంజు తన మిత్రుడిని చంపుతుందేమోనని "కొక్కొరోకో....కొక్కొరో" మని అరవసాగింది. కోడి పుంజు గోల విన్న సింహం ఎవరైనా వస్తారేమో అని భయపడి వెనుదిరిగి పారిపోయింది. కోడిపుంజు అరుపులను విని పరధ్యానంలో నుండి తేరుకున్న గాడిద సింహం పారిపోవడం చూసి తనను చూసి భయపడి పారిపోతుందేమోనని, తనను తాను మృగరాజులా ఊహించుకుని సింహం వెంటబడడం ప్రారంభించింది.
సింహం కంటే వేగంగా పరిగెత్తి సింహాన్ని చేరుకునేంతలో సింహం వెనక్కి తిరిగి చూసింది. అవకాశం వెతుక్కుంటూ కాళ్ల దగ్గరికే వచ్చింది అనుకుని ఒకేఒక్క గెంతులో గాడిద మీద పడింది. తన పని ముగించి బ్రేవుమంది.
పుట్టలు, గుట్టలు దాటుకొంటూ సింహం హడిలి పోతూ తన గుహలోకి వచ్చేసింది. సింహం గాబరాను గమనించిన నక్క, గబగబా వచ్చి సింహం అంతగా భయపడడానికి కారణం ఏమిటని అడిగింది. సింహం, ఆయాసంతో వొణుకుతూ చెప్పింది.
"మామూలుగా కొలనులో మంచి నీళ్ళు తాగి గట్టు ఎక్కాను. అంతలో పెద్ద పెద్ద అరుపులు వినపడ్డాయి. గుర్, గుర్...పువ్వాం పువ్వాం... బెకా బెకా మంటూ హొరెత్తిన ఆ అరుపులు వింటే ఎంతో భయం వేసింది, అటూ ఇటూ చూశాను...ఎవ్వరూ కనపడలేదు సరిగదా! ఆ అరుపులు ఇంకా భయంకరంగా పెరిగి పోతున్నాయి. ఈ అడవిలో ఏదో దొంగ మృగం వచ్చి వుంటుంది!నన్ను చంపడానికి ఏ దెయ్యమో వచ్చి, అరుస్తుందని నాకు భయం వేసింది. పరుగెత్తుకుంటూ గుహలోకి వచ్చేశాను. కౄరమృగమో, దెయ్యమో దానిని చంపివేస్తేనే గాని నాకు స్తిమితం కలగదు" అంటూ ముందు కాళ్ళపై తల పెట్టుకొని ఆలోచించడం మొదలు పెట్టింది సింహం...! నక్కకు విషయం అంతా అర్ధమైయింది. ఆ అరుపులు, ఇది వరకు ఎన్నోసార్లు విన్నది నక్క! అందుచేత దానికి భయం కల్గలేదు. ఏమీ భయం లేదని సింహానికి నచ్చజెప్పి కొలను దగ్గరకు తీసుకు వచ్చింది. బిగ్గరగా అరవమంది, ఆ అరుపులు, విని శత్రుమృగం బైటకు వస్తే చంపివేయవచ్చని ధైర్యం చెప్పింది నక్క . సింహం, కొంచెం ధైర్యం తెచ్చుకొని బిగ్గరగా అరిచింది. అడవి దద్దరిల్లి పోయేలా అరుపులు మీద అరుపులుగా అరిచింది.
వెంటనే, అంతకంటే బిగ్గరగా అరుస్తూ చెరువులోంచి, ఓ బోదురుకప్ప గభాలున ఎగిరి సింహం దగ్గరకు ఒక్క దూకు దూకింది. అసలే భయంతో వున్న సింహం, మరింత కంగారు పడుతూ అటూ ఇటూ ఎగరడంతో ఆ బోదురు కప్ప సింహం కాలి కింద పడి నలిగి చచ్చింది.
'హమ్మయ్య' అనుకొంటూ సింహం చతికిలపడి కూర్చుంటే నక్క అన్నది.
'ఏవో అరుపులు విని, ఎవరో శత్రువులు అనుకొని గాబరా పడ్డావు గాని, కప్ప అల్పమైన జంతువు; దాని గొంతు మాత్రం పెద్దది! కర్ణ కఠోరంగా అరుస్తుంది... బలం లేని వాడు ఇలాగే అరుస్తాడు' అందుకే "బూకరింపులు బలహీనుని ఆయుధాలు" అంటారు పెద్దలు! అని హితవు చెప్పింది నక్క!
ఒక ఊళ్ళో గంగ, మంగ అనే ఇద్దరు స్త్రీలు పక్కపక్కనే కాపురం ఉంటున్నారు. గంగ తనకున్న రెండు గేదెలతో నేతి వ్యాపారం చేస్తూ ఉండేది. మంగ తన ఎనిమిది గేదెలతో, పాలు అమ్ముకుని బతుకుతూ ఉంది.
ఒకసారి గంగ దగ్గర మంగ కిలో నెయ్యి అప్పుగా తీసుకుంది. ఎన్ని రోజులైనా నెయ్యిని తిరిగి ఇవ్వలేదు. ఊరిలో గయ్యాళిగా పేరున్న మంగను తన కిలో నెయ్యి గురించి ఎలా అడగాలా? అని ఆలోచించిన గంగ ఒకనాడు, "మంగక్కా! నువ్వు నా దగ్గర ఆరు నెలల క్రితం కిలో నెయ్యి అప్పుగా తీసుకున్నావు. ఇప్పుడు నా దగ్గర లేదు, చుట్టాలొచ్చ్హారు కాస్త ఆ నెయ్యి బాకీ తీరుస్తావా?" అని అడిగింది. మంగ ఉవ్వెత్తున లేచి "నీ దగ్గర నేను అప్పు చేయడమేంటి? ఎనిమిది గేదెలున్న నేనెక్కడ, ముష్టి రెండు గేదెలతో బతుకీడుస్తున్న నువ్వెక్కడ?" అంటూ నానా తిట్లు తిట్టింది. గంగకి కన్నీళ్లు జలజలా రాలాయి. ఏమీ అనలేక ఆ ఊరి న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది.
మరునాడు న్యాయసభలో న్యాయాధికారితో మంగ గట్టిగా అరుస్తూ "అయ్యా! ఇదేమి న్యాయం? ఎనిమిది గేదెలున్న నేను రెండు గేదెలున్న ఈ గంగ దగ్గర కిలో నెయ్యి అప్పు తీసుకున్నానంటే మీరు నమ్ముతున్నారా? ఆమె చెప్పింది నమ్మి మీరు నన్ను ఇక్కడకు పిలిపించడం చాలా అన్యాయం" అని విరుచుకుపడింది.
మంగ మాటలను గమనించిన న్యాయాధి కారి ఆమె మాటలలో ఉన్న కపటబుద్దిని కూడా గమనించాడు. వారి పోట్లాటకు తీర్పును మరో రోజుకు వాయిదా వేశాడు.
ఆ రోజు తన న్యాయస్ధానం ముందు దారిని బురదగా చేయించి ఉంచాడు న్యాయాధికారి. గంగ మంగ ఇద్దరూ ఆ బురదలో నడుస్తూ లోపలికి వచ్చ్హారు. భటులు వాళ్ళిద్దరికీ చెంబులతో నీళ్ళు ఇచ్చ్హారు. గంగ కేవలం సగం చెంబుడు నీటితో బురదనంతా శుభ్రం చేసుకోగా మంగకి మూడు చెంబుల నీళ్లు అవసరమయ్యాయి. అది గమనించిన న్యాయాధికారి మంగతో "ఏమ్మా! మూడు చెంబుల నీళ్లు ఇచ్చినా నువ్వు నీ కాళ్ల బురదను వదిలించుకోలేక పోయావు. గంగ మాత్రం సగం చెంబెడు నీటితో శుభ్రం చేసుకుంది. ఎనిమిది గేదెలున్నా నీకు పొదుపు చేయడం చేతకాదు. దుబారా చేయటం నీకు అలవాటు. నువ్వు గంగ దగ్గర కిలో నెయ్యి అప్పుగా తీసుకున్నది నిజమే. వెంటనే గంగకు ఇవ్వవలసిన కిలో నెయ్యితో బాటు మరో నాలుగు కిలోల నెయ్యి కలిపి మొత్తం ఐదు కిలోల నెయ్యి ఇచ్చేయి. లేకపోతే నీకు కఠినశిక్ష వేస్తాను" అన్నాడు.
మంగ మారు మాట్లాడక చేసిన తప్పుకు లెంపలేసుకుని గంగకు ఇవ్వవలసిన నెయ్యిని తిరిగి ఇచ్చేసింది.
ఒకప్పుడు పక్షులు, పెద్ద జంతువులు తమ మధ్య ఆధిపత్యం కోసం యుద్దం చేయాలని భావించాయి. పక్షిలా ఎగరగలిగే లక్షణమున్న జంతువు గబ్బిలం. దానికి పక్షులు, జంతువుల రెండింటి లక్షణం ఉండడం వలన అది ఏ గ్రూపులోనూ చేరక ఒంటరిగా మిగిలిపోయింది. పక్షులు దానిని తమవైపు రావలసిందిగా కోరినా... "నేను జంతువును" అని గర్వంగా చెప్పుకుంది. తరువాత కొన్ని జంతువులు దానిని తమవైపు రావల్సిందిగా కోరగా "నేను పక్షిని" అని వాటితో చెప్పింది.
కొన్ని రోజుల తరువాత యుద్దం ఆగిపోయి శాంతియుత వాతవరణం ఏర్పడింది. ఇప్పుడు గబ్బిలం వెళ్ళి పక్షులతో కలిసుండాలని వాటి వద్దకు వెళ్తే అవి దానిని తిరస్కరించాయి. తరువాత అది జంతువులతో జతకూడాలని అనుకుంది. అక్కడ కూడా దానికి అవమానం ఎదురైంది. అప్పటి నుండి గబ్బిలం చిన్న చిన్న పాడుబడ్డ బొయ్యారాలలో నివసిస్తూ, రాత్రి అయ్యే వరకు తన మొహాన్ని ఎవరికీ చూపించకుండా జీవిస్తోంది.
ఒక నది ఒడ్డున ఒక గుడ్డి రాబందు నివసించేది. ఎన్నో ఇతర పక్షులూ అదే చెట్టుపైన జీవించేవి. పక్షులు తాము తెచ్చుకున్న ఆహారములో కొంత రాబందుకు కూడా ఇచ్చేవి. బదులుగా, ఆ పక్షులు గూళ్లలో లేనపుడు వాటి పిల్లలను రాబందు చూసుకునేది.
ఒకరోజు ఒక పిల్లి చెట్టుమీద ఉన్న పక్షి కూనలను గమనించింది. ఎలాగైనా వాటిని ఆరగించాలని అనుకుంది. కాని పిల్లి రావడం గమనించిన పక్షి కూనలు అరవడం మొదలెట్టాయి. వాటి అరుపులు విన్న గుడ్డి రాబందు "ఎవరు, ఎవరక్కడా?" అని అరిచింది.
రాబందును చూసిన పిల్లికి ప్రాణం పోయినంత పనయింది. 'నా పనైపోయిందిరా దేవుడా. ఈ రాబందు నన్ను వదలుదురా బాబు! దీన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాలి' అని అనుకుంటూ, " నేనే...నీ ఆశీర్వాదం పొందాలని వచ్చాను గురువా" అన్నది పిల్లి గట్టిగా. రాబందు ఎవరు నువ్వు? అని అడిగింది.
"నేను పిల్లిని" అని జవాబిచ్చింది పిల్లి.
"వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణం తీస్తాను" అని అరిచింది రాబందు. రాబందు అరుపులకు భయపడ్డ పిల్లి "గురూ్! నా మాట విను తర్వాత నన్ను చంపినా సరే" అని ప్రాధేయపడింది.
"మరి నువ్వెందుకు వచ్చావో చెప్పు?" అని రాబందు పిల్లిని నిలదీసింది.
"నీవు ఎంతో బుద్ధి, తెలివితేటలు గలవాడివని విని, నీ ఆశీర్వాదం పొందాలని వచ్చాను. కాని నీవు ఈ బక్క పిల్లిని చంపాలనుకుంటున్నావు. "నన్ను అతిధిలా ఆదరించాలి" అని చెప్పింది పిల్లి. పిల్లి మాటలకు రాబందు "కాని నువ్వు మాంసాహారివి. నిన్ను నేనెలా నమ్మగలను?" అంది. బదులుగా పిల్లి "నేను జీవహింస చేయడం పాపమని తెలుసుకుని శాకాహారిలా మారిపోయాను" అని చెప్పింది. గుడ్డి రాబందు పిల్లిని నమ్మింది. చెట్టుపైన ఉన్న తన గూట్లో ఉండనిచ్చింది. రోజులు వేగంగా గడుస్తున్నాయి, జిత్తులమారి పిల్లి పక్షి కూనలను ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా తినడం మొదలు పెట్టింది. గుడ్డి రాబందుకు ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు.
కాని పక్షులు మాత్రం తమ పక్షి కూనలు కనబడకపోతుండడం గమనించాయి. ఎప్పుడైతే తన పని ముగిసిందో, పిల్లి మెల్లగా్ జారుకుంది. కొన్ని రొజుల తర్వాత, పక్షులు తమ పక్షి కూనల ఎముకలను గుడ్డి రాబందు గూటిలో కనిపెట్టాయి.
"ఈ గుడ్డి రాబందు మన పిల్లల్ని తినేసింది" అనుకుని, పక్షులన్నీ కలిసి ఆ గుడ్డి రాబందును పొడిచి చంపేశాయి.
ఒక అడవిలో వింత పక్షి జీవించేది. దానికి రెండు తలలు, రెండు ముక్కులు, రెండు మెడలు ఉన్నాయి. కాని ఒక్కటే కడుపు ఉంది. ఒకరోజు అది అలా పచార్లు కొడుతుండగా దానికొక దేవతాఫలం దొరికింది. పక్షి సంతోషం పట్టలేక ఒక నోటితో ఆ పండును రుచి చూసి, "ఆహా! ఎంత రుచిగల పండు. ఎన్నో పండ్లు తిన్నాను కాని దీనంత రుచిగల పండు తినలేదు" అనసాగింది మొదటినోరు.
"నాక్కుడా సగం ఫలం ఇవ్వవా? నేను కూడా రుచి చూస్తాను" అని రెండోనోరు. "నేను తిన్నా నువ్వు తిన్నా ఒక కడుపులోకే కదాపోయేది" అంటూ మిగతా పండునంతా తినేసింది మొదటినోరు. ఎలాగైనా మొదటినోటికి గుణపాఠం చెప్పాలనుకున్నది రెండోనోరు.
ఆ రోజు నుండి మొదటినోటితో మాట్లాడటం మానేసింది రెండోనోరు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రెండోనోటికి ఒక చెట్టుకు వేలాడుతున్న విష్పు ఫలం కనబడింది.
"అది విషపుఫలం. నీవు దానిని తింటే నువ్వు, నేను ఇద్దరం చనిపోతాం. ఎంతైనా మనకున్నది ఒకే పొట్ట కదా!" అని మొదటి నోరు రెండో నోటిని ఆ విషపు ఫలం తిన వద్దని వారించసాగింది.
విషపు ఫలాన్ని తింటున్నట్టు నటించిన రెండోనోరు మొదటినోటిని ఒకసారి గమనించింది. చావు అంచుల్లో ఉన్నామని మొదటినోరు అనుకుంటున్న తరుణంలో, "చుశావా? నేనీ విషఫలం తింటే నువ్వు, నేను ఇద్దరం చచ్చే వాళ్లం. మనకిద్దరికీ ఒకే పొట్ట ఉన్నా మనిద్దరం ప్రతి వస్తువును పంచుకుని తింటూ, సజావుగా, సఖ్యతగా ఉంటే సమస్యలే రావు" చెప్పింది రెండోనోరు.
అవునన్నట్టు సిగ్గుతో తలదించుకున్న మొదటినోరు ఆ రోజు నుండి రెండోనోటితో సజావుగా, సఖ్యతగా ఉండసాగింది.
నీచబుద్ధి గల స్నేహితుడి వల్ల మనకు ఆపదలు వస్తాయి. సాయం చేసే గుణం ఉన్న వాళ్ళని చూసి ఓర్చుకోలేని వాళ్ళు తమకు తెలియకుండానే ఇతరులకు హాని చేస్తారు. అలాంటి వారితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదాన్ని తెస్తుంది. అలాంటి స్నేహితుడి వల్ల ప్రాణాలను పోగొట్టుకున్న హంసకథ తెలుసుకుందాం. మహేంద్రపురంని ఆనుకుని ఉన్న అడవిలో ఓ హంస, పావురం ఎంతో స్నేహంగా ఉండేవి. హంస పున్నమినాటి చంద్రునిలా తెల్లగా నిండుగా ఉండేది. దానికి చేతనయినంతవరకు ఇతర పక్షులకు సాయంచేస్తూ ఆనందంగా జీవించేది. పావురం మాత్రం పక్షుల జాతిలో ఉత్తమజాతికి చెందిన హంస తనకి స్నేహితుడని, తను మంచివాడు కావటం వల్లనే ఆ హంస తనతో స్నేహం చేసిందని తన జాతి పక్షుల ముందు గర్వంగా గొప్పలు చెప్పుకునేది.
మహేంద్రపురంలో ఉండే వల్లభుడు అనే వేటగాడు ఒక రోజు వేటకోసం అడవికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వరకు వెతికినా వాడికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఇవ్వాళ్ళ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో గానీ అడవంతా బోసిపోయినట్లుగా ఉంది అనుకుంటూ ఎండవేడికి తట్టుకోలేక దగ్గరలో ఉన్న ఓ చెట్టు క్రిందకు చేరి తన దురదృష్టానికి చింతించసాగాడు. ఆ చెట్టు మీద నిద్రపోతున్న హంస క్రింద అలికిడికి నిద్రలేచి చూసింది. చెమట నిండిన శరిరంతో ఉస్సూరుమంటూ చెట్టు క్రింద కూర్చన్న వేటగాడు కనిపించాడు దానికి. వాడిని చూడగానే ఆ హంసకు జాలి కలిగింది. అలసటతో ఉన్న వేటగాడికి కాసేపు సేద తీర్చుదాం అనుకుంటూ తన పొడవైన రెక్కను విసనకర్రలా మార్చి వాడికి గాలి విసరసాగింది. ఆ చల్లని గాలికి అలసటతో ఉన్న వేటగాడికి నిద్ర వచ్చి ఆ చెట్టు క్రిందే పడుకుండిపోయాడు.
అదే సమయంలో అక్కడకి వచ్చిన పావురం హంస చేస్తున్న పని చూసి, నీది ఎంత జాలి మనసు, మనల్ని చంపటానికి వచ్చిన వేటగాడికి కష్టపడి గాలి విసురుతున్నావు. ఇలాంటి పాపాత్ముడికి సేవలు చేయటానికి నీకు సిగ్గుగా లేదు అంది. దానికి హంస మిత్రమా! పరోపకారం మిదం శరీరం అన్నారు పెద్దలు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా మనకు చేతనయినంత సాయం చెయ్యాలి అంది. చెయ్యి! చెయ్యి బాగా సాయం చెయ్యి! అంటూ పావురం ఎగతాళిగా నవ్వూతూ సరిగ్గా ఆ వేటగాడి మొహం మీద పడేలా రెట్ట వేసి తుర్రుమంటూ ఎగిరిపోయింది. ఆ రెట్ట సూటిగాపోయి వేటగాడి ముక్కు మీద పడటంతో వాడు కోపంగా కళ్ళుతెరచి తల పైకెత్తి చెట్టు మీదకు చూసాడు. వాడికి రెక్కలను చాపి ఉన్న హంస కనిపించింది. వెంటనే బాణం అందుకుని గురిచూసి హంసను కొట్టాడు. అది సూటిగా పోయి హంస డొక్కల్లొ గుచ్చుకుని దాని ప్రాణాలను తీసీంది.
ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్ధానంలోని తెనాలి రామలింగడిపై ఒక విషయంలో విసుగు చెందాడు. ఆ కోపంతో "రేపటి నుంచి నీ ముఖం నాకు చూపెట్టకు పో!" అని ఆదేశించాడు. మౌనంగా తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామలింగడు.
మరునాడు, కృష్ణదేవరాయలు దర్బారుకు బయలుదేరుతుండగా మార్గమధ్యంలో కనబడిన అతని న్యాయాధికారి ఒకరు రాజుతో - "రాజా! మీరు తెనాలి రామలింగడిని ఈ రోజు దర్బారుకు రావద్దని ఆదేశించినా, మీ ఆదేశాలు పాటించక అతను ఎప్పుడో దర్బారుకు హాజరయ్యాడు. అంతేకాదు, అక్కడ తన వెకిలి చేష్టలతో అందరితో అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు" అని చెప్పాడు.
అది విన్న రాజు ఆవేశంతో ఊగిపోతు, "నా ఆదేశాలనే ధిక్కరించేందుకు రామలింగడికి ఎన్ని గుండెలు" అన్నాడు. "అవును రాజా! మీ ఆదేశాలు అతనికి పూచికపుల్లతో సమానం. వంద కొరడా దెబ్బలు కూడా అతని రాజధిక్కారానికి శిక్ష కాజాలవు" అని రాజు కోపాన్ని మరింత పెంచాడు ఆ అధికారి.
కోపంతో చిర్రెత్తు కొచ్చిన రాజు వేగంగా దర్బారులోకి ప్రవేశించాడు. అప్పటికే దర్బారులో ఉన్న తెనాలి రామలింగడు తన తలపై ఒక కుండను బోర్లించుకున్నాడు. చూసేందుకు వీలుగా రెండు కళ్ల దగ్గర రెండు రంధ్రాలున్నాయి. రామలింగడి గడుసుతనాన్ని అర్ధం చేసుకున్న రాజు "ఏంటి రామలింగా! ఈ వెకిలి వేషాలు? నీవు నా ఆదేశాలను ధిక్కరించావు" అన్నాడు. దానికి రామలింగడు "లేదు మహాప్రభూ! నా ముఖం మీకు చూపెట్ట వద్దని మీరే కదా ఆదేశించారు. మీరు ఇప్పుడు నా ముఖాన్ని చూడగలుగుతున్నారా? లేదు కదా. అలాంటప్పుడు ఇది ధిక్కారం ఎలా అవుతుంది" అని బదులిచ్చాడు.
"రామలింగా! నీ తెలివికి జోహార్లు. ఇంక ఆ కుండను తొలిగించి, నీ స్ధానంలో నీవు కుర్చుంటావా?" అన్నాడు మహారాజు. తెనాలి రామలింగడు తలపై నుంచి కుండను తీసి వేసి తన ఆసనంలో కూర్చుని కార్యకలాపాలు మొదలుపెట్టాడు.
ఒక చిన్న గ్రామంలో ఒక ముసలి అవ్వ, ఆమె మనవడు కలిసి ఒక చిన్న గుడిసెలో జీవించేవారు. ఒక రోజు ఆమె వంట చేస్తుండగా, మనవడు ఆమె దగ్గరికొచ్చాడు. "నానమ్మ! ఈ మధ్య నాకు ఒంట్లో అస్సలు బావుండట్లేదు, తలనొప్పి, కడుపు నొప్పి, జ్వరం అన్నీ ముకుమ్మడిగా బాధిస్తున్నాయి. స్కూల్‌లో కుడా నాకు మార్కులు తక్కువుగా వస్తున్నాయి, ఉపాధ్యాయులు తిడుతున్నారు, స్నేహితులు నాతో సరిగా మాట్లాడట్లేదు" అని తన బాధలన్నింటినీ ఏకరువు పెట్టసాగాడు.
అవ్వ తన మనవడికి ఎలాగైనా జీవిత సత్యాన్ని వివరించాలని, "చూడు నాన్నా! నువ్వు ఈ ఉడకని, వండని బియ్యాన్ని అలాగే తినగలవా?" అని అడిగింది. "ఛీ. అస్సలు తినలేను" అన్నాడు మనవడు. "మరి కేవలం నీళ్ళు త్రాగి జీవించగలవా?" అని నానమ్మ అడగ్గా "లేదు" అని జవాబిచ్చాడు మనవడు. "కూరలో వేసే కారం ఒక్కదాన్నే తిని కడుపు నింపుకోగలవా? మళ్ళీ అడిగింది నానమ్మ. "అమ్మో! నావల్ల కాదు" చెప్పాడు మనవడు. "మరి ఉప్పు" అని అడిగిన నానమ్మను "లేదు నానమ్మ. కాని ఇవన్నీ ఎందుకడుగుతున్నావు?" అని ఎదురు ప్రశ్నించాడు మనవడు.
"బాబూ! బియ్యం, నీరు అన్నీ కలిస్తే అన్నం. ఉప్పు, కారం, కూరగాయలు కలిస్తే కూర అవుతాయి కదా! అదే విధంగా బాధ, సంతోషం, కోపం, శాంతం.... ఇలా అన్నీ కలిస్తేనే అది జీవితమవుతుంది. ఇదే జీవిత సత్యం. దేవుడికి ఎవరికి, ఏమి, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు.
మనం మన జీవిత స్ధితి గతులను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి. ప్రతిఫలం మాత్రం దేవుడికే వదిలేయాలి. ఆయన ఏది ఇస్తే దానికి తలవంచి స్వాగతించాలి. నీకూ ఇలాగే మంచి రోజులూ ఉంటాయి, చెడు రోజులూ ఉంటాయి" అని జీవిత సత్యాన్ని మనవడికి వివరించింది నానమ్మ.
పూర్వము ఒక పట్టణములో వినాయకరావు అనే వ్యాపారి వుండేవాడు. ఆయన పనివాళ్ళను పెట్టుకోవటం వారికి జీతము ఇవ్వకుండా ఏవో సాకులు చెప్పి పంపేవాడు. ఆయన జీవితంలో ఎవ్వరికీ జీతం ఇవ్వలేదు. ఒకసారి వినాయకరావు వద్దకు చిరంజీవి అనే కుర్రవాడు వచ్చాడు. పని కావాలంటూ అడిగాడు. పనివాడులేక ఇబ్బందిగానే వుంది వినాయకరావుకి. తాను చెప్పిన పని చెయ్యాలనీ, చెయ్యకపోతే జీతం ఇవ్వననీ ముందే చెప్పాడు వినాయకరావు. చిరంజీవి చెప్పిన పని సవ్యముగానే పూర్తి చేసేవాడు. నెలరోజులు పూర్తి కావటానికి ఒకరోజే మిగిలింది. వినాయకరావుకి ఏంచెయ్యాలో ఎలా చెప్పి జీతం తీసుకోవాలని ఎదురు చూస్తున్నాడు.
ఆ రోజున అక్కడికి ధనవంతులు వచ్చారు. వచ్చిన వాళ్ళు బాగానే కొనుగోలు చేశారు. ఆ ఆనందములో వినాయకరావు చిరంజీవితో అందరికీ డ్రింక్ తీసుకురా అన్నాడు. యజమాని మాట ప్రకారము అందరికీ డ్రింక్‌లు తెచ్చి ఇచ్చాడు. అందరూ త్రాగివెళ్ళారు. ఇంకా రెండు డ్రింక్‌లు ఉన్నాయి. ఈ రెండు డ్రింక్‌లు ఎవరికి? నిన్ను డ్రింక్‌లు తెమ్మన్నానుకానీ వాళ్ళకి ఇవ్వమన్నానా అంటూ నీకు ఈ నెల జీతం ఇవ్వను అన్నాడు వినాయకరావు. ఇంతలో వెనక్కి వెళ్ళిన ధనవంతులు రావటం ఆ సంభాషణ వినడం వలన చిరంజీవి నెల జీతం తాము ఇస్తామనిచెప్పి, అతని వద్ద కొనుగోలు చేసిన కొన్ని వస్తువులు బాగాలేవని చెప్పి తిరిగి ఇచ్చివేశారు. వినాయకరావు గురించి ఆ ధనవంతులు అందరివద్దా చెప్పటం వల్ల అతని వ్యాపారము పూర్తిగా దెబ్బతినింది.
ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతను చాలా అద్భుతంగా బొమ్మలు చెక్కేవాడు. అలా చెక్కిన బొమ్మల్ని తన గాడిదపై తీసుకువెళ్ళి పక్క ఊరి సంతలో అమ్ముతుండేవాడు. ఒక రోజు ఆ శిల్పి ఒక దేవత బొమ్మను చెక్కాడు. బొమ్మ చాలా అందంగా, దైవత్వంతో ఉన్నట్టు ఉంది. ఆ బొమ్మను జాగ్రత్తగా గాడిద మీద పెట్టుకుని, పక్క ఊరికి తీసుకువెళ్తున్నాడు. దారిలో వెళ్ళేవారు ఆ దేవత బొమ్మను చూసి, నిజంగా దేవతలా భావించి దణ్ణం పెట్టుకుని వెళ్తున్నారు. అయితే ఇదంతా గాడిదకి మరొక రకంగా అనిపించింది. అందరూ తనని చూసి, తనకే నమస్కారం చేస్తున్నారనుకుంది. అలా నడుస్తూ వెళ్తున్న కొద్దీ అందరూ ఆగాగి నమస్కారాలు చేయడంతో గాడిదకి గర్వం పెరిగింది.
'ఇంత మందికి నేను పెద్ద మనిషిలాగా, గౌరమివ్వాలనిపించేలా కనిపిస్తున్నానా! అని ఆశ్చర్యపోయింది. 'ఇక నేనెవ్వరి మాట విననవసరం లేదు' అనుకుంది. కొద్ది సేపయ్యాక దానికి కాళ్ళునొప్పి పుట్టాయి. అందుకని అది దారి మధ్యలో ఆగిపోయింది. గాడిద ఆగిపోయినా, దానిపైన దేవతకి ప్రజలు ఇంకా దండాలు పెడుతూనే పోతున్నారు. గాడిద ఆగిపోయిందేంటబ్బా అని శిల్పి గాడిదను ఎంత సముదాయించినా అది కదలలేదు. 'ఊరి వాళ్ళంతా నాకు గౌరవమిస్తుంటే నేను గొప్పదాన్నే కదా! మరి గొప్పవాళ్ళు యజమానుల మాటని ఎందుకు వినాలి, అనుకుని అక్కడి నుండి కదలలేదు.
శిల్పికి విసుగు వచ్చి, దేవతా విగ్రహాన్ని గాడిదపై నుండి తీసి తన తలపైనే పెట్టుకుని ముందుకు సాగాడు." ఆ(! పోతే పోయాడు" అనుకుని గర్వంతో కళ్ళు మూసుకుంది గాడిద. కొద్ది సేపటి తర్వాత కళ్ళు తెరచి చూస్తే, ఒక్కరు కూడా తన దగ్గర లేరు. అందరూ తన యజమాని వెనకే దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో దారిలో అడ్డంగా ఉందని ఒకతను, గాడిద వీపుపై కర్రతో కొట్టాడు. దానితో గాడిదకి జ్ఞానోదయం అయింది. "అనవసరంగా నన్ను నేను గొప్పగా ఊహించుకున్నాను. ఇంకాసేపు ఇక్కడే ఉంటే, నా వీపు పగిలిపోయేలా ఉంది, అనుకుని యజమాని దగ్గరకు పరుగెత్తింది.
వేసవి సెలవులు ముగియగానే తిరిగి పాఠశాలలు తెరిచారు. పాత కొత్త విద్యార్థులతో పాఠశాల కళకళలాడసాగింది. ఐదో తరగతి చదువుతూ పాఠశాలకు డుమ్మా కొట్టిన అనిల్ పుస్తకాల సంచిని తగిలించుకొని తన చిట్టి తమ్ముడిని వెంట బెట్టుకొని పాఠశాలలోకి అడుగుపెట్టాడు.
అనిల్‌ని చూడగానే ఆనందంగా సత్యం మాస్టారు బాబూ! అనిల్ ప్రభుత్వ ఉత్తర్వులమేరకు వేసవిలో పాఠశాల పెట్టి నీలాంటి బడి మానేసిన పిల్లలకు పాఠాలు చెప్పడం మేలే అయ్యింది. తిరిగి పాఠశాల తెరవగానే వారి వారి స్టాండర్డ్‌ను అనుసరించి పాఠశాలలో చేరుతున్నారు. నువ్వు అందుకేగా వచ్చింది అన్నాడు. మాష్టారు! నా సంగతేమో గాని, నా చిట్టి తమ్ముణ్ణి ఆశీర్వదించండి, వీడి పుట్టిన రోజు ఈ రోజే! అన్నాడు స్వీట్స్ తమ్ముడి చేత ఇప్పించి. మనస్పూర్తిగా ఆశీర్వదిస్తూ వెయ్యేళ్ళు వర్ధిల్లు బాబూ! అన్నాడు సత్యం మాస్టారు. అంతే! అనిల్ ఆ మరుక్షణం తన తమ్ముడిని ఒకటో తరగతిలో కూర్చుండబెట్టి ఇంటి ముఖం పట్టాడు. తన అంచనా తప్పవడంతో సత్యం మాస్టారు, అనిల్‌ని వెనక్కి పిలిచి అనిల్ నిన్ను - నీ వాలకాన్ని చూసి తిరిగి పాఠశాలలో చేరి బాగా చదువుకోవడానికి వచ్చావనుకొన్నానే! బడిలోచేరి చదువుకోవా? అన్నాడు.
నాకూ చదువుకోవాలనే ఉంది మాష్టారు. కాని కుటుంబ పరిస్థితులు సహకరించడంలేదు. యాక్సిండెంట్‌లో నాన్న పోగానే అమ్మ ఏకాకి అయ్యింది. బంధువుల సాయం అంతంతమాత్రమే! నోటికింత ముద్దపెట్టే పొలాన్ని, పాడి గెదెలను చూసుకుంటూ అమ్మకి సాయంగా ఇంటి పట్టునే ఉంటున్నాను. అన్నాడు అనిల్. దాంతో అనిల్‌ని అర్థం చేసుకొన్న సత్యం మాస్టారు బాబూ! అనిల్ నీకు నేను చదువు చెబుతాను. రాత్రి పాఠశాలకు రా! ఈ రోజుల్లో చదువు ఎంతో అవసరం! పట్టాల కోసం, ఉద్యోగాల కోసం అనుకోవడం పొరపాటు. విద్య మన జీవితాలకో వెలుగు! అన్నాడు. ఆ మాటలతో జ్ఞానోదయం కలిగిన అనిల్ రాత్రి పాఠశాలకెళ్ళి చక్కగా చదువుకొని, సత్యం మాస్టారి సలహా సంప్రదింపులతో ఎన్నో పరీక్షలు రాసి పాసై ఒక ఉద్యోగస్తుడయ్యాడు.
చిత్రగిరిపురం రాజ్యానికి రాజు దశవంతుడు. అతనికి వేటంటే ప్రాణం. ఒకరోజు వేటకెళ్లాడు. అడవంతా తిరిగినా ఒక్క ప్రాణీ దొరకలేదు. బాగా అలసిపోయి కోటకు తిరుగు ముఖం పట్టాడు. ఎందుకిలా జరిగిందని ఆలోచిస్తుండగా, వేటకు బయలుదేరే ముందు తనకు ఎదురొచ్చిన పేదరైతు గుర్తుకొచ్చాడు. అతని ముఖం చూడటం వల్లే వేట దొరకలేదనుకున్నాడు. కోటకు చేరుకుని, ఆ రైతును బంధించి చంపేయమని సైనికులను ఆజ్ఞాపించాడు.
ఊరంతా తిరిగి రైతును పట్టుకున్న సైనికులు రాజాజ్ఞను వివరించారు. దానికి రైతు, "భటులారా! చనిపోయే ముందు నాది చివరి కోరిక. ఒకసారి నేను రాజును చూడాలి" అని విన్నవించుకున్నాడు. దాంతో అతన్ని కోటకు తీసుకెళ్లారు. కోటలోకి వస్తూనే రైతు, రాజుకు నమస్కరించాడు. రాజు ఆగ్రహంతో 'వీణ్ని ఇంకా చంపకుండా ఎందుకు వదిలిపెట్టారు?' అంటూ భటులపై విరుచుకుపడ్డాడు. దానికి రైతు, "మహారాజా! మీరు నా ముఖం చూసినందుకు మీకు వేట దొరకలేదు. అంటే మీరు ఏ ప్రాణినీ చంపలేదు. దానివల్ల మీకు పాపం అంటకుండా పుణ్యమే దక్కింది. కానీ, నేను మీ ముఖం చూసినందుకు నా ప్రాణాలే పోతున్నాయి. దానికి నేనేం చేయాలి" అనేసి తన తల నరకమంటూ భటుల వద్దవంగి నిల్చున్నాడు.
ఆ రోజు రాత్రి ధనికుడికి కంటినిండా నిద్రపడితే, తన దగ్గరున్న డబ్బును ఎవరైనా దోచుకుపోతారేమోనన్న భయంతో పేదవాడికి కునుకే కరువైంది. దాంతో అతడు మర్నాడు ఆ డబ్బు మూటను తిరిగి ధనికుడికిచ్చి వచ్చేశాడు. ఆ రోజు యథాప్రకారం హాయిగా నిద్రపోయాడు.
రాజుకు జ్ఞానోదయమైంది. తాను ఎంత తప్పు చేయబోయాడో గ్రహించాడు. వెంటనే శిక్షను ఆపించాడు. "నీ ధైర్యానికి మెచ్చాను. ఇకపై నీవు వ్యవసాయం చేసుకునేందుకు ఎలాంటి శిస్తులూ కట్టనవసరం లేదు. నా కనులు తెరిపించినందుకు ఇదే నేను నీకిచ్చే బహుమానం" అంటూ భుజం తట్టాడు.
కట్టెలు కొట్టువాడు కట్టెలు కొట్టుచుండగా వాని గొడ్డలి జారి ప్రక్కనే వున్న నదిలో పడిపోయెను. తన జీవనాధారమైన గొడ్డలి పోయినదని అతడు వల వల ఏడ్చుచూ నది ఒడ్డున కూర్చుండెను.
అతని దు:ఖమును చూచి ఆ నది దేవత ప్రత్యక్షమై ఏమి జరిగినదని అడిగి తెలుసుకొని నది దేవత వెంటనే నదిలోకి మునిగి, ఒక బంగారు గొడ్డలి తెచ్చిచూపెను. ఇది నాదికాదనెను. దేవత తిరిగి వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చెను. వాడు అది చూచి అదియు నాదికాదనెను. దేవత మరల వెళ్ళి ఇనుప గొడ్డలి తెచ్చెను. ఆ అదియే నాది అని కట్టెలవాడు దానిని సంతోషంతో తీసుకొనెను. నది దేవత వాని నిజాయితీకి మెచ్చుకొని ఇనుప గొడ్దలితో పాటు బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా బహుమతిగా ఇచ్చెను.
వాడు ఇంటికి వెళ్ళి ఊరంతట ఈ సంగతి చెప్పెను. ఇది విని ఒక ఆశపోతుకు దుర్భుద్ది పుట్టెను. మరుసటి దినము తాను ఒక ఇనుపగొడ్డలిని తీసుకొని కట్టెలు కొట్టుచున్నట్లు నటించుచు కావాలని గొడ్డలిని నీటిలో పడవేసెను. నది ఒడ్డున కూర్చొని దొంగ ఏడుపు మొదలు పెట్టెను. నది దేవత ప్రత్యక్షం కాగా తన గొడ్డలి పడిపోయెనని చెప్పెను. దేవత నీటిలోనికి వెళ్ళి బంగారు గొడ్డలి తెచ్చెను. అదే నా గొడ్డలి అని అబద్దం చెప్పెను. దేవతకు కోపం వచ్చి, వెంటనే బంగారు గొడ్డలితో సహా అదృశ్యమాయెను. ఆశపోతుకు బంగారం, వెండి గొడ్డళ్ళు రాకపోగా, తాను తెచ్చుకున్న ఇనుప గొడ్డలికూడా దక్కలేదు.
అది ఒక అందమైన పచ్చిక మైదానం. వర్షాకాలం కావడంతో మరింత ఆకర్షణీయంగా ఉంది. పచ్చిక బాగా ఉండడంతో ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను మేపడానికి అక్కడికి వచ్చాడు. అతను చెట్టుక్రింద కూర్చుని ఉండగా గొర్రెలన్నీ పచ్చిక మేస్తున్నాయి.
ఆ మందలో కొన్ని గొర్రెపిల్లలు కూడా ఉన్నాయి. వాటిని చూసిన ఒక డేగ పై నుండి ఎగురుకుంటూ వచ్చి ఒక గొర్రెపిల్లను తన బలమైన గోర్లతో పైకి లేపి గూటిలోకి తీసుకెళ్లింది. అదంతా గమనిస్తున్న ఓ కాకి తనకిక సులభంగా భోజనం దొరుకుతుంది అనుకుంది. "నేను కూడా డేగలా ఎగరగలను, నాకు కూడా బలమైన గోర్లున్నాయి. నేనెందుకు గొర్రెలను కబళించుకుపోలేను?" అని అనుకున్న కాకి, ఎగురుకుంటూ వచ్చి ఒక బలిష్ఠమైన గొర్రెమీద దాడి చేసింది.
అంతే, దాని గోర్లు, కాళ్లు ఆ గొర్రె ఉన్నిలో చిక్కుకుపోవడంతో గొర్రెలన్నీ అరవడం మొదలుపెట్టాయి. గొర్రెల అరుపులు విన్న కాపరి కాకిని చూశాడు. పరుగున వచ్చి దానిని పట్టుకుని ఒక పంజరంలో బంధించి తన పిల్లలకు 'పెంపుడు కాకి''లా బహుకరించాడు.
అనగనగా ఒక అడవిలో నాలుగు ఆవులు కలిసి మెలసి ఉండేవి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ నాలుగు ఆవులు కలిసే వెళ్ళేవి. మేతకు వెళ్లినా కలిసే మేతకు వెడుతూ ఉండేవి. వాటి యజమాని కూడా వాటి ఐకమత్యానికి ఎంతో ఆనందించేవాడు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆ నాలుగు ఆవులు ఎప్పటిలా మేతకు వెళ్లాయి. వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటున్నాయి.
అంతలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది. దూరంగా మేత మేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరూరింది. "ఆహా! ఈరోజు నాకువిందు భోజనం దొరికిందన్న మాట. ఈ ఆవులు చాలా పుష్టిగా ఉన్నాయి. వీటిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను" అని సింహం అనుకుంది.
సింహాన్ని చూస్తే నిజానికి ఆవులు భయపడాలి. కానీ అవి ఏమాత్రం భయపడలేదు. "చూడండి సింహం మనల్ని భయపెట్టేందుకు గాండ్రిస్తోంది. మీరుభయపడద్దు. మనందరం ఐకమత్యంగా ఉంటే ఈ అడవిలో ఏ జంతువు మనల్ని ఏమీ చెయ్యలేదు. నేను చెప్పినట్లు చెయ్యండి. ఆ సింహం మన దగ్గరకు రాగానే మనం నలుగురం కలిసి మన వాడి కొమ్ములతో దాని మీదకు దూకుదాం దానిని తరిమికొడదాం" అని చెప్పింది ఆ నాలుగు ఆవులలో ఒక ఆవు. "నీఆలోచన బాగుంది. నువ్వు చెప్పినట్టుగానే చేద్దం" అంటూ మిగిలిన ఆవులు అంగీకరించాయి.
అంతే సింహం తమ మీద దూకేలోపునే నాలుగు ఆవులు కలిసి సింహం మీద దూకాయి. తమ వాడి కొమ్ములతో సింహాన్ని పొడిచాయి. సింహానికి ఎదురు దాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడికి దిగాయి. అంతే సింహంవాటి దాడికి ఎదురు నిల్వలేక భయపడి పారిపోయింది. ఆ విధంగా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి.
అయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు. శారీరక బలంతో సాధించలేనిది బుద్ధిబలంతో సాధించచ్చు అని దానికి తెలుసు. అందుకే మంచి సమయం చూసి ఆ నాలుగు ఆవులను విడి విడిగా కలిసింది.
ఆ రోజు మీరంతా కలిసి నామీద పోట్లాడినప్పుడు "నీ కొమ్ముల వాడితనం ఉందే అబ్బో నిజంగా సింహం పంజా కూడా నీ కొమ్ముల వాడితనం ముందు ఎందుకు పనికి రాదు. నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్టేదాన్ని నేనునీ బలానికి నీ ధైర్యానికి తలవంచి నమస్కరిస్తున్నాను. అంతా బాగానే ఉంది కానీ నువ్వే కదా మిగిలిన మూడు ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది. అంటే నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకుడివిలాంటి వాడివి. కాబట్టి మిగతా మూడు నీకు మేత తెచ్చిపెట్టాలి. అంతేకాదు నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి. కానీ ఇక్కడ అలా జరగటం లేదు. అదే నాకు బాధగా ఉంది" అని చెప్పింది. ఆ ఆవు ఆలోచనలో పడింది.
ఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్లి చెప్పింది. దాంతో నాలుగు ఆవులు మిగతావాటి కన్నా తామే గొప్ప అని అనుకోవడం మొదలుపెట్టాయి. అట్లా అనుకుని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయడం మొదలు పెట్టాయి. దాంతో వాటి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదైయింది. వాటి మధ్య ఉన్న ఐకమత్యం దెబ్బతింది. ఆ నాలుగు ఆవులు ఒకదాని పొడ ఒకదానికి గిట్టదన్నట్టు ఎవరికి వారే అన్నట్టు సంచరించసాగాయి. ఇదివరకులా అవి కలిసి మెలసి ఉండటం లేదు. కలిసి మేతకు వెళ్ళడంలేదు. ఎవరికి వారుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి. వాటి మధ్య ఇదివరకు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు. తను అనుకున్నది సాధించినందుకు సింహం ఆనందించింది. వాటిని విడగొట్టినందుకు దానికి చాలా సంబరంగా ఉంది. ఇంకే ముంది అదునుచూసుకుని ఒక్కొక్క ఆవు మీదకు లంఘించి వాటిని మట్టుపెట్టింది. అలా వాటి అనైక్యత వాటి వినాశనానికి దారి తీసింది.
చూశారా! ఆ ఆవులు కలిసి ఉన్నంతకాలం అడవికి రాజైన సింహం కూడా వాటిని ఎంతో తేలికగా సంహరించగలిగింది. అందుకే మన పెద్దవారు ఐకమత్యమే మహాబలం అని చెప్పేది. కలిసి ఉన్నప్పుడు ఏవైనా ఆపదలూ వస్తే మన సంఘటితంగా ఎదుర్కోగలం. లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తలవంచాల్సి వస్తుంది.
"రాఘవయ్యా! పోయిన వారం బంధువులొస్తే మీ దుకాణంలో స్వీట్స్ కొనుక్కెళ్లాను. అవి ఇంతకుముందులా రుచిగా లేవు. పట్టుమని వారం రోజులు కూడా నిల్వ ఉండలేదు. తేడా ఎక్కడ జరిగిందో కనుక్కోని, సరిచేసుకో" అన్న మిత్రుడు సీతారామయ్య మాటలే తలచుకుంటూ పడుకున్నాడు రాఘవయ్య.
తను పదేళ్లుగా స్వీట్ షాప్ నడుపుతున్నాడు. వంటలకు వాడే సరుకుల నాణ్యతలో ఏ మాత్రం రాజీపడేవాడు కాదు. కాబట్టే ఇన్నేళ్లల్లో కొత్త దుకాణాలు ఎన్ని వెలిసినా రాఘవయ్య స్వీట్ షాప్‌లో రద్దీ తగ్గలేదు. అలాంటిది ఇవాళ మిత్రుడు సీతారామయ్య అన్న మాటలు రాఘవయ్యను ఆలోచనలో పడేశాయి. మొదట వంటవాళ్ల పనితనం మీద అనుమానమొచ్చింది. కానీ అదంతా తన భ్రమ అని కొద్దిరోజుల్లోనే రూఢీ అయ్యింది. మరి సరుకు విషయంలో ఏమైనా లోపముందా? గత పదేళ్లుగా ఒకే దుకాణంలో సరుకులు కొంటున్నాడు. ఇంతవరకు ఒక్కసారి కూడా తేడా రాలేదు. అలాంటిది ఇప్పుడు వస్తుందంటే నమ్మబుద్ధికాలేదు.
ఈ మధ్య తమకు సరఫరా అవుతున్న నెయ్యి కాస్త తేడాగా అనిపిస్తోందని భార్య సుభద్ర రెండు, మూడుసార్లు అంది. తానే పెద్దగా పట్టించుకోలేదు. ' ఒకవేళ నెయ్యిలో ఏమైనా కల్తీ జరుగుతోందా?' అని రాఘవయ్యకు అనుమానమొచ్చింది.
అసలు కల్తీ జరిగిందో? లేదో? ఎవరికి తెలుసు? జరిగితే దుకాణం యజమాని రంగారావును గద్దించవచ్చు. లేకపోతే....అనవసరంగా అనుమానించినట్లవుతుంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? అని ఆలోచించసాగాడు రాఘవయ్య అదే విషయం మాటల సందర్భంలో పెద్ద మనవడు శ్రీధర్‌తో చెప్పాడు.
పదవ తరగతి పాసైన శ్రీధర్‌కి సైన్స్ అంటే మహా ఇష్టం. ఎక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ జరిగినా తప్పకుండా వెళతాడు. అలా ఓ ఎగ్జిబిషన్‌లో ఆహార పదార్ధాల్లో జరిగే కల్తీని గుర్తించడమెలాగో వివరించారు. అక్కడ చూపించిన పదార్ధాల్లో నెయ్యి కూడా ఉంది. 'చిన్న ప్రయోగం చేసి చూస్తే కల్తీ జరిగిందో లేదో తెలిసిపోతుంది' కదా అనుకున్నాడు శ్రీధర్. తన దగ్గర వున్న కొన్ని రసాయనాలను తీసుకొచ్చాడు.
మనవణ్ణి ఆశ్చర్యంగా చూస్తున్న రాఘవయ్యతో, "తాతయ్యా! ఇది బయట కొన్న నెయ్యి, ఈ గిన్నెలోది మన ఇంట్లో వెన్న కరగబెట్టిన నెయ్యి ఇవేమో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఫర్‌ఫ్యూరాల్ కలిసిన ఆల్కహాల్. ఈ రెండింటితోనే ఏది స్వచ్ఛమైన నెయ్యో తెలిసిపోతుంది" అన్నాడు శ్రీధర్.
"అదెలా?!" ఆశ్చర్యంగా అడిగాడు రాఘవయ్య.
"ముందు మన ఇంట్లో కాచిన నెయ్యితో ప్రయోగం చేద్దాం. ఎంత నెయ్యి వుందో అంతే పరిమాణంలో మొదట హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపాలి. దీన్ని బాగా కలిపిన తర్వాత ఫర్‌ఫ్యూరాల్ కలిసిన ఆల్కహాల్ ద్రావణాన్ని దీనికి చేర్చాలి. కాసేపట్లో నెయ్యి రంగు మారితే నకిలీది. లేకపోతే స్వచ్ఛమైనది" అన్నాడు శ్రీధర్. రెండు గిన్నెల్లోనూ ద్రావణాలు కలిపాడు. ఇంట్లో చేసిన నెయ్యిలో ఏ మార్పూలేదు. కానీ బయట కొన్న నెయ్యి గులాబీ రంగులోకి మారింది.
"చూశారుగా తాతయ్యా! మనం బయట కొన్న నెయ్యిలో డాల్డా కలిసింది. అందువల్లే నెయ్యి రంగు మారింది. ఇన్నాళ్లూ ఆ దుకాణం యజమాని మనల్ని మోసం చేశాడు" ఒకింత ఆవేశంగా అన్నాడు శ్రీధర్. రాఘవయ్యకు అసలు విషయం అర్ధమైంది.
మర్నాడు శ్రీధర్‌ని తీసుకొని రంగారావు దుకాణానికి వెళ్లాడు. వీళ్ల మాటలు విన్న రంగారావు మొదట దబాయించాడు. కానీ ప్రయోగాత్మకంగా నిరూపించిన మీదట తన తప్పు ఒప్పుకున్నాడు. ఇకమీదట నిజాయితీగా వ్యాపారం చేస్తానని, ఈ ఒక్కసారికి క్షమించమని వేడుకున్నాడు.
"రంగారావ్! ఏ వ్యాపారానికైనా నమ్మకమే పునాది. దాన్ని పోగొట్టుకుంటే నష్టాలపాలయ్యేది నువ్వే. ఇకమీదట ఇలాంటి తప్పుడు పనులు చేస్తే నలుగుర్నీ పిలిచి నీ గుట్టు రట్టు చేస్తాను. అప్పుడు నువ్వు ఈ ఊళ్లోనే కాదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా దుకాణం నడపలేవు" అని తీవ్రంగా మందలించాడు రాఘవయ్య. చిన్న ప్రయోగం ద్వారా పెద్ద మేలు చేసిన శ్రీధర్‌ను మెచ్చుకున్నాడు.
ఒక పర్వత ప్రాంతంలో దట్టమైన అడవి ఉండేది. ఆ అడవి ఎన్నో పచ్చటి, పొడవైన పైన్ చెట్లతో నిండి ఉండేది. వసంతకాలం రావడంతో అడవి మరింత పచ్చగా, దట్టంగా తయారయింది.
ఒక కోకిల ఎక్కడి నుంచో వచ్చి పైన్ చెట్టు పైన గూడు కట్టుకుంది. అది ఉల్లాసంగా ఉన్నప్పుడల్లా తన అద్బుతమైన స్వరగానాలతో అడవినంతా హాయిగాఉంచేది.
ఆకురాలే కాలం రానే వచ్చింది. పైన్ చెట్టు ఆకులన్నీ రాలి బోసిపోయి మోడులా తయారైంది. కోకిల ఆకులు రాలిపోయిన ఆ చెట్టును, పచ్చదనం కోల్పోయిన తన పరిసరాల్ని చూసి చాలా బాధపడింది. ఒక రోజు ఉదయం అక్కడి నుండి ఎగిరిపోయి, మంచి పుష్పాలు విరబూసి, ఆహ్లాదకరంగా ఉండే చోటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది.
అద్భుతంగా పాటలు పాడే కోకిల వెళ్ళిపోతుండటం చూసిన పైన్ చెట్టు, కోకిలతో "సోదరీ! ఎక్కడికెళ్తున్నావు? నేను పచ్చగా ఉన్నప్పుడు నీకు చోటు కల్పించాను. ఇప్పుడు నేను అందవిహీనంగా కన్పించినంతమాత్రాన నన్ను విడిచి వెళ్తావా? మళ్ళీ వసంతకాలం రాగానే నేను పచ్చగా అవుతాను కదా" అని అంది.
బదులుగా కోకిల, "లేదు, లేదు, నేనిక్కడ ఉండలేను. ఆకులు రాలని చెట్లు, ప్రకాశవంతమైన పరిసరాలు ఉండే చోటికి వెళ్లాలనుకుంటున్నాను. నేను నీతో ఇక ఉండలేను" అంది.
పైన్ చెట్టు ఎంత బ్రతిమాలినా వినకుండా కోకిల తన రెక్కలు విప్పి తుర్రున ఎగిరిపోయింది. తను అందవిహీనంగా తయారయ్యానన్న బాధకంటే, కోకిల వెళ్ళిపోయిందన్న బాధతోనే పైన్‌చెట్టు మరింత కుంగిపోయింది. అతి చిన్నదైన కోకిల, చాలా పెద్దదైన పైన్‌చెట్టుకు ఒక గుణపాఠం నేర్పింది.
ఒక బిచ్చగాడుండేవాడు. దొరికినదేదో తిని, ఏ అరుగు మీదనో నిద్రపోయేవాడు. ఖరీదైన కోరికలు లేనందున వాడికి సుఖాల మీదికి మనసు పోలేదు. ఒకసారి వాడికి, ఓ గొప్పదాత ఐదు దీనారాలు బహుమతిగా ఇవ్వగా దాంతో ఒక కోతిని కొన్నాడు. అది ఆడిస్తూ బతికితే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చని బిచ్చగాడి ఊహ. ఓ రాత్రి వేళ కోతి ఒక యువకుడిగా మారిపోయింది. అతడు బిచ్చగాణ్ణి పేరుపెట్టి పిలిచి, ఒక బంగారు నాణెం ఇచ్చి ఇద్దరికీ భోజనం తెమ్మన్నాడు. నువ్వు ఏ శాపం వల్ల ఇలా అయ్యావని అడగబోయాడు బిచ్చగాడు. అదంతా అనవసరం వెళ్ళి చెప్పింది చెయ్యమన్నాడు. ఆకలిగా ఉన్న బిచ్చగాడు ఇక ఏమీ మాట్లాడలేదు. ఆ యువకుడే, ఓ డబ్బుసంచి సృష్టించి నగరం మధ్యలో ఒక గొప్ప మేడ కిరాయికి కుదిర్చేలా చూశాడు. ఇప్పుడు భాగ్యవంతుడి దర్పాన్ని, ఠీవిని బిచ్చగాడికి నేర్పాడు. రాజకుమార్తెతో నీకు పెళ్ళి చేయిస్తాను అనగానే నమ్మలేక విచిత్రంగా చూశాడు బిచ్చగాడు. అప్పటికే అతనికి యువకుడి మీద చాలా కృతజ్ఞతగా ఉంది. యువకుడు ఏం చెప్తే అది మారు మాట్లాడకుండా చెయ్యడానికి సిద్దంగా ఉన్నాడు.
అతడి సలహా మేరకు ఆ దేశపు రాజుగార్ని కలిసి, వజ్రాలను బహుకరించి, కూతుర్ని ఇమ్మన్నాడు. రాజు తన న్యాయాధికారితో ఆలోచించి వివాహానికి సమ్మతించాడు. ఇంత మేలు చేసినందుకు తనకు తిరిగి ఏదైనా ఉపకారం చెయ్యమన్నాడు యువకుడు. ప్రాణాలైనా ఇస్తానన్నాడు బిచ్చగాడు. నీభార్య చేతికున్న తావీజు కావాలి అన్నాడు యువకుడు. అది తీసుకెళ్ళి ఇచ్చాడు బిచ్చగాడు. అంతే! అతడికి అంతవరకూ వచ్చిన సంపదా, రాజకుమారీ అన్నీ మాయం. బిచ్చగాడి బతుకు మరల మొదటికి వచ్చింది. ఒకరోజు జ్యోతిష్కుని సంప్రదించాడు. అతడు పైశాచీ భాషలో ఓ రేకుమీద ఏదో రాసి, ఎడారిలోకి వెళ్ళమన్నాడు. బిచ్చగాడు అలాగే వెళ్ళాడు. అక్కడ ఒక చోట కేవలం మనుషుల్లేకుండా కాగడాలు నడుస్తూ, ఓ పల్లకీ గాల్లో తేలుతూ కనిపించింది. జ్యోతిష్కుడు తనకిచ్చిన కాగితాన్ని పల్లకీలోని వ్యక్తికి చూపించాడు బిచ్చగాడు. అతడికి విషయం అర్థమైది. వెంటనే బిచ్చగాణ్ణి మోసం చేసిన కోతి యువకుణ్ణి మంత్ర శక్తులతో పిలిపించి విచారించాడు. తావీజుని ఆ యువకుడు వెంటనే మింగేసి, నాయకుడి ఆగ్రహానికి గురైనాడు. అతడు తన అరచెయ్యి బాగా సాచి, తన ఆజ్ఞ ధిక్కరించిన కోతి యువకుని పాతాళానికి అణగతొక్కేశాడు. తావీజు తిరిగి బిచ్చగాడి వశమైంది. అసలు మహిమంతా తావీజులోనే ఉంది. అది చేతికి రాగానే బిచ్చగాడి పరిస్థితి మళ్ళీ మారిపోయింది. భాగ్యం, సంపదా, రాజకుమార్తె అన్నీ అతడికి దక్కాయి. ఆ తరువాత అతడెప్పుడూ ఆమె చేతి నుంచి తావీజును తొలగించే ప్రయత్నం చేయలేదు. ఇంకెప్పుడూ కోతుల గురించి ఆలోచించలేదు.
పిల్లలు శృతిమించిన అల్లరి చేస్తే దానిని పెద్దవాళ్ళు కోతి చేష్టలు అనటం కద్దు. ఈ కోతి చేష్టలు ఎవరికీ ఉపయోగపడవు సరికదా అప్పుడప్పుడు ప్రాణాలు తీసే ప్రమాదాలను కూడా తెచ్చి పెడుతుంటాయి. పనికిరాని పనులు జోలికి పోవటం ఎంత ప్రమాదమో ఈ కధలో ఓ కోతి పాత్ర ద్వారా మనం తెలుసుకుందాం. పూర్వం 'అరిదుర్గ' అనే పట్టణంలో శుభదత్తుడు అనే వైశ్యుడు ఉండేవాడు. అతడు పట్టిందల్లా బంగారం అన్నట్లు వ్యాపారంలో బాగా కలిసి వచ్చి కొద్దికాలంలోనే ఆ పట్టణము మొత్తంలోకే ఏకైక ధనవంతుడు అయ్యాడు. శుభదత్తుడికి అన్నీ ఉన్నా ఒకే ఒక లోటు. అతని తరువాత తను సంపాదించిన ఆస్తిని అనుభవించటానికి సంతానం లేదు. ఒక రాత్రి శుభదత్తుడి కలలో రాముడు కనిపించి ఊరి చివరున్న రామాలయాన్ని బాగుచేయిస్తే శుభదత్తుడికి సంతానం ఇస్తానని మాట ఇచ్చాడు.
మర్నాడు శుభదత్తుడు ఆ రామాలయం బాగు చేయించటానికి కొంతమంది పనివాళ్ళను నియమించి వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చాడు. చెదలు పట్టి విరిగిపోయిన దూలాల స్ధానంలో కొత్త దూలాలని అమర్చటానికి పనివాళ్ళు మంచిజాతి టేకు దుంగలని ఆ దేవాలయంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో రంపంతో కొయ్యటం మొదలు పెట్టారు. దేవాలయంలోని చెట్ల మీదున్న కోతులు దుంగను రంపంతో కోస్తున్నప్పుడు వచ్చే వింతశబ్దం విని 'ఇదేదో భలే బాగుంది' అనుకున్నాయి. మధ్యాహ్నం అయింది. పని వాళ్ళందరూ భోజనములకు బయలుదేరారు. అప్పటివరకు రంపంతో నిలువుగా కోసిన దుంగ కలిసిపోకుండా మధ్యలో ఓ మేకును అడ్డంగా కొట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. పనివాళ్ళు భోజనానికి వెళ్ళగానే చెట్ల మీద కోతులు క్రిందకు దిగాయి. అక్కడే ఉన్న రంపం అందుకుని పనివాళ్ళు కోసినట్లుగా దుంగను కొయ్యాలని ప్రయత్నాలను మొదలు పెట్టాయి. దుంగ మధ్యలో పనివాళ్ళు కొట్టిన మేకు అడ్డంగా ఉంది. కాసేపు కోతులన్నీ ఏం చెయ్యాలా...? అని బుర్రలు గోక్కున్నాయి. ఒక కోతి ఆ మేకును అడ్డం తీసేస్తే సరిపోతుందని సలహా ఇచ్చింది. ఆ సలహా మిగతా కోతులన్నిటకీ నచ్చింది. ఆ కోతుల గుంపులో బలమైన కోతి మందుకు వచ్చి ఆ మేకును తను లాగుతానంది. మిగతా కోతులు దానికి జయ జయ ధ్వానాలు చేశాయి. ఆ కోతి ఓ సారి మిగతా కోతుల వంక గర్వంగా చూసి చీలి ఉన్న దూలం మధ్యల కూర్చుని రెండు చేతులతో మేకుని పట్టుకుని పైకి లాగింది. మరుక్షణం రెండుగా చీలి ఉన్న దూలం దగ్గరకు అతుక్కు పోయింది. మధ్యలో కూర్చున్న కోతి దెబ్బకి చచ్చిపోయింది.
అడవిలో కట్టెలు కొట్టుకునేందుకు రామయ్య వెళ్ళాడు. అక్కడికి సమీపములో వేటగాడు వలపన్ని బియ్యం నూకలు వెదజల్లి వుంచాడు. వాటికి ఆశపడి జంటపావురాళ్ళు వలలో చిక్కుకుని ప్రాణభీతితో ఉన్నాయి. వాటిని వల తప్పించి పైకి ఎగురవేశాడు రామయ్య.
కొంతకాలము గడిచింది. రామయ్య అడవికి వెళ్ళి వస్తూనే వున్నాడు. ఒక రోజు దారి తప్పి అడవిలో బాగా పైకి వెళ్ళిపోయాడు. దారి తెలియక అవస్థపడుతున్నాడు. చీకటి పడింది. క్రూరమృగములు తనని ఏం చేస్తాయోనని భయపడుతూ అక్కడికి సమీపంలో గల సత్రం వద్దకు చేరుకున్నాడు. ఇంతలో వర్షం ప్రారంభమయింది. ఏమిటో ఈ పాడు వర్షము, ఇంటికెలా వెళ్ళాలో తెలియటంలేదు. అని భాధపడుతున్నాడు. ఆ సమీపములో గల పావురముల జంట రామయ్యని గుర్తించాయి. దారితప్పిన అతన్ని గమ్యస్థానము చేర్చే ఉద్దేశ్యముతో తలగుడ్డ తన్నుకుని వెళ్ళాయి. రామయ్య తల గుడ్డకు వంగి పైకి చూసి ఆ పావురముల వెంట బయలుదేరి గమ్యస్థానము చేరుకున్నాడు. ఎంత చిన్న జీవులైన తనని గమ్యస్థానము చేర్చినందుకు భగవన్నామస్మరణ చేస్తూ ఇల్లు చేరాడు. ఆ పావురముల జంట కృతజ్ఞతకు మురిసిపోయాడు. తర్వాత వాటిని తన వద్దనే వుంచుకుని పెంచుకోసాగాడు.
అదొక ఖాళీ ప్రదేశం. వీధిలో రెండు ఇళ్ళ మధ్యన ఉంది. ఆ వీధి వారందరికీ ఆ ఖాళీ స్థలం ఓ చెత్త కుండీలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ స్థలానికి యజమాని ఒక నల్లకుక్క! ఆ నల్ల కుక్క, చుట్టు ప్రక్కల ఇళ్ళ వారు, తిని పారవేసిన విస్తరాకులలోని మెతుకులు తింటూ, ఆ దొడ్డిలో నలుమూలలా తిరుగుతూ ఉంటుంది. ఏ మూల ఏ చప్పుడైనా ఉలిక్కి పడి చూస్తూ!కోపంగా గుర్రుపెడుతుంది ఆ కుక్క. ఎప్పుడైనా మరో కుక్క ఆ స్థలంలోకి వచ్చిందంటే దాని మీద పడి, రక్కి, కరిచి ఆ కుక్కను అవతలకు తరిమివేస్తుంది. ఆ స్థలంలో పడిన పుల్లిస్తరాకులన్నీ దాని సొత్తు; వాటిని ఎవ్వరూ ముట్టుకొనడానికి వీలు లేదు. అయినా చీమలు, ఈగలు ఆ ఆకుల మీద ముసురుతూనే ఉంటాయి! ఆ నల్ల కుక్క వాటిని తోలేస్తూనే ఉంటుంది.
ఇలా ఉండగా ఓ పండుగ రోజున రోజూ కంటే ఎక్కువ పుల్లిస్తరాకులు ఆ స్థలంలో వచ్చి పడ్డాయి. వాటిని చూడగానే నల్లకుక్కకు పండగ ఆనందం కలిగింది. కాని, అంతలోనే పుల్లిస్తరాకులతో పడిన పిండివంటల ముక్కల వాసన పసిగట్టి మరో కుక్క తిందామని అక్కడకు వచ్చింది. ఆ కుక్క రావడమే తడవుగా నల్లకుక్క దాని మీద ఉరికింది పెద్దగా అరుస్తూ! కొత్త కుక్క కోరలు చూపుతూ నల్ల కుక్క మీద తిరగబడింది.
అరుపులు కరుపులతో పెద్ద కోట్లాట జరిగింది. ఆ దెబ్బలాటతో పుల్లిస్తరాకులన్నీ చిందరవందర అయిపోయాయి;అన్నీ మట్టి కొట్టుకొని పోయాయి. చివరకు కొత్త కుక్కను వీధి చివరిదాక తరిమేసి, నల్ల కుక్క తిరిగి వచ్చింది. ఒగుర్చుకుంటూ చూస్తే మట్టి, తుక్కు, చెత్తతో నిండిన పుల్లిస్తరాకులలో దానికి అన్నం మెతుకులే కనపడ లేదు. అటూ ఇటూ వెతికి దిగులు పడుతూ కూర్చుంది...!
ఆ ఆకుల మీద తిరుగుతూ వున్న ఓ కండ చీమ, నల్లకుక్కను చూసి జాలిగా అంది; "ఎవరో తిని పారవేసిన పుల్లిస్తరాకులు నీ సొంతం అనుకొంటావు. ఎవరినీ చేరనీయవు. ఏ కుక్క అయినా వస్తే, మీద పడి అరిచి, కరిచి తరిమి వేస్తావు. చూడు, నీ దెబ్బలాట వల్ల, తిందామనుకున్నదంతా ఎలా మట్టి కొట్టుకు పోయిందో!" నాకే తప్ప ఎవరికీ వుండకూడదు అనే నీ దుర్బుద్ధి నీకు కూడా లేకుండా చేసింది... చూడు... మా చీమలను! ఎక్కడైనా రవ్వంత తినుబండారం కనపడితే, మా చీమలనన్నిటినీ పిలుచుకు వస్తాము. అందరమూ కలిసి తింటాము; హాయిగా వుంటాము... మా చీమలను చూసి బుద్ధి తెచ్చుకుంటే, నువ్వూ, నీ జాతివాళ్ళు బాగు పడతారు అంటూ చక్కా పోయింది కండ చీమ!"
ఆకలితో, అలసటతో అవస్థ పడుతున్న నల్లకుక్కకు చీమ మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి. అలాగే పడుకుంది, మట్టి ఆకులను చూస్తూ, కన్నీళ్ళు కారుస్తూ మూలుగుతూ.
ఒక చాకలివాడి దగ్గర గాడిద, కుక్క ఉండేవి. కుక్క పగలూ, రాత్రీ చాకలివాడి ఇల్లు కాపలా కాసేది. గాడిద బండెడు బట్టల మూటలు వీపు మీద మోసుకుని చెరువుకు తీసుకెళ్ళేది. కొంత కాలం గడిచాక... 'ఇంతవరకు ఒక్క దొంగ కూడా నా ఇంటికి రాలేదు. ఇన్నిరోజులు ఈ కుక్క తిండి కోసం అనవరంగా చాలా ఖర్చు చేశాను" అని భార్యతో అన్నాడు.
ఈ మాటలు విన్నది కుక్క. 'రాత్రంతా మేలుకుని ఎంత సేవ చేశాను? నేనుండటం వల్లే దొంగలు పడలేదన్న విషయం విస్మరించాడు'. అనుకుని ఎంతో బాధపడింది.
ఆ రోజు నుండి చాకలివాడి భార్య కుక్కకు సరిగ్గా ఆహారం ఇవ్వడం మానేసింది. పాపం ఆ కుక్క పగలంతా ఆహారం కోసం ఊళ్ళో తిరిగి తిరిగి... ఏమైనా దొరికితే ఇంత తిని, ఓపిక ఉంటే చాకలివాడి ఇంటికి వచ్చేది. లేదంటే ఊళ్ళో ఎక్కడో ఒక చోట ముడుచుకుని పడుకునేది. కొన్ని రోజులు గడచాక... ఒక అర్ధ రాత్రి దొంగ ఒకడు చాకలివాడి ఇంటిలోకి ప్రవేశించాడు. కుక్క దొంగను చూసింది కాని మొరగలేదు. నిశ్శబ్దంగా చూస్తూ కుర్చుంది. దొంగ ఇంటిలోకి వెళ్ళడం గాడిద కూడా పసిగట్టింది.
"ఒక దొంగ మన యజమాని ఇంట్లోకి వెళ్ళాడు తెలుసా?" రహస్యంగా అంది గాడిద.
"అవును, తెలుసు"
"మరి యజమానిని ఎందుకు హెచ్చరించడం లేదు?"
"నా ఇష్టం" నిర్లక్ష్యంగా జవాబిచ్చింది.
"నీ ఇష్టప్రకారం నువ్వు నిర్ణయాలు తీసుకోకూడదు. యజమాని ఇంటిని కాపాడటం నీ బాధ్యత" అని చెప్పింది గాడిద.
"నోరు మూసుకుని పడుకో. అనవసరమైన సలహాలు ఇవ్వకు" కుక్క కోపంగా చెప్పింది.
"సరే... నువ్వు మొరగకు. నేను గట్టిగా అరచి యజమానిని నిద్రలేపుతాను. కుక్క కంటే గాడిదే విశ్వాసమైనదని రుజువు చేస్తాను" అని గాడిద గట్టిగా ఓండ్ర పెట్టింది.
లోపల గాఢనిద్రలో ఉన్న చాకలివాడు ఉలిక్కిపడి నిద్రలేచాడు. బంగారంలాంటి నిద్ర చెడగొట్టినందుకు అతనికి చాలా కోపం వచ్చింది. ఒక దుడ్డు కర్ర తీసుకువచ్చి "ఏం పోయేకాలమే నీకు. అర్థరాత్రి రచ్చ చేస్తున్నావు" అంటూ గాడిదను రెండు బాది, తిరిగి వెళ్ళి నిద్రపోయాడు.
రహస్యంగా ఇంటిలో ఒక మూల నక్కిన దొంగ విలువైన వస్తువులను చక్కగా మూటకట్టుకుని పారిపోయాడు. ఆ మరునాడు ఉదయం నిద్రలేచిన చాకలివాడు ఇల్లు గుల్లవడం చూసి లబోదిబోమన్నాడు. బక్కచిక్కిపోయి నీరసంగా పడున్న కుక్కని చూశాకగాని అతనికి జ్ఞానోదయం కాలేదు. తన తప్పు తెలుసుకున్న చాకలివాడు ఆ రోజునుండి కుక్కకు ఆహారం ఇస్తూ మంచిగా చూసుకోసాగాడు.
అడవిలోని ఒక కుందేలు చెట్టు కింద పడుకుని నిద్రపోవడాన్ని అటుగా వస్తున్న సింహం చూసింది. అసలే ఆకలితో ఉన్న సింహం కుందేల్ని తిని సరిపెట్టుకోవాలనుకుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఓ జింక రావడాన్ని గమనించింది. కుందేలును తింటే కడుపు నిండదు... ఈ జింకను తింటే పండగే పండగ. ఈ లోపలే సింహం రాకను గమనించిన జింక అక్కడి నుండి పారిపోయింది. జింక పోతేపోయింది, కుందేలునైనా తిందామని సింహం వెన్నక్కి తిరిగి చూసేసరికి కుందేలు కూడా పారిపోయింది.
ఆహారం దొరక్క నకనకలాడుతోంది ఓ నక్క. దాంతో ఒక పథకాన్ని ఆలోచించింది. ఒక కొలను ఒడ్డుకు పోయి తచ్చాడసాగింది. సూర్యకిరణాలు నడినెత్తికి రావడంతో చిన్న చిన్న జంతువులన్నీ ఆహార సంపాదనకు బయటకు వచ్చాయి.
'మిత్రులారా! బద్దకం భవిష్యత్తును నాశనం చేస్తుంది. వేకువనే మేల్కొని పనులు చేసుకోవడం మంచి పని' అంటూ అటుగా పోతున్న కుందేళ్ల గుంపును ఉద్దేశించి హితవాక్యాలు చెప్పింది నక్క. "నిజమే కాని చలి మమ్మల్ని బయటకు రానివ్వడం లేదు!" అని సమాధానమిచ్చాడు కుందేళ్ల నాయకుడు. "చలిని చూసి మీరు భయపడటమా? ఆ చలే మిమ్మల్ని చూసి భయపడి పారిపోయే మంత్రం నా దగ్గర ఉంది. నిండా మునిగిన వాడికి చలే ఉండదంటారు. వేకువనే ఈ నీటిలో మునగండి, హాయిగా ఉండండి" అంది నక్క. ఇవి కుతంత్రపు మాటల్లా ఉన్నాయని గ్రహించిన కుందేళ్లు "రేపటి నుండి అలానే చేస్తాము" అని తప్పించుకుని పోయాయి.
"ఈ కుందేళ్లు నా మాటలు నమ్మినట్లున్నాయి. నిండా మునిగితే ఊపిరాకడ చస్తాయి. ఇక ఒడ్డున కాచుకుని ఉంటే చాలు నా తిండి సమస్య తీరిపోయినట్లే" అని పైకే అంది నక్క. ఈ మాటలు కొలనులో ఉన్న మొసలి విని "నక్క బావా, నీ మాటలు యథార్థం కాదు. చలిని భరించలేక ఈ కొలనులోని చేపలన్నీ నన్ను బయటపడేయమని కోరుతున్నాయి. అది నా ఒక్కడి వల్లా సాధ్యం కావడం లేదు. నువ్వు తోడుంటే వాటిని తోడి బయటపడేద్దాము" బతిమాలింది మొసలి. దాని మాటలు నిజమని నమ్మిన నక్క "ఓస్, అంతేనా, అయితే పద పోదామ" అంటూ చెంగున ఎగిరి మొసలి వీపుపై కూర్చుంది. కొద్దిదూరం పోయాక మొసలి నీటిలో బుడుంగున మునిగింది. ఈత రాని నక్క ఊపిరాకడ చచ్చి చివరకు మొసలికి ఆహారమైపోయింది.
టర్కీ రాజు, నస్రుపట్ల విపరీతమైన అభిమానం పెంచుకున్నాడు. నస్రు యొక్క విజ్ఞానకాంక్ష, చతురత అతడిని రాజుగారికి మరింత ప్రీతిపాత్రుడిని చేశాయి.
ఒకరోజు రాజు నస్రును పిలిచి ఇలా చెప్పాడు. "ముల్లా నస్రుద్దీన్, నేను నిన్ను నిజమైన విజ్ఞానం గురించి తెలుసుకోవడానికి భారతదేశానికి పంపదల్చుకున్నాను. అక్కడ చాలా మంది సాధుపుంగవులు, గురువులు వున్నారు. వారు కచ్చితంగా విజ్ఞాన సముపార్జనలో నీకు సహాయం చేస్తారు".
ఈ మాటలకు ఉప్పొంగిపోయిన నస్రు, రాజు తన ప్రయాణానికి ఆర్ధిక సహాయం చేస్తానని చెప్పడంతో మరింత సంతోషించాడు.
మధ్యమధ్యలో ఆసక్తికరమైన వ్యక్తులను కలుస్తూ, ఎన్నో రోజుల ప్రయాణం తర్వాత నస్రు భారతదేశానికి చేరుకున్నాడు. భారతదేశంలోని ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, మహానదులు, అద్భుతమైన జంతు మరియు పక్షి సంపద అతడిని భారతదేశంపట్ల ఆకర్షితుడయ్యేలా చేశాయి.
భారతదేశమంతటా పర్యటించిన తర్వాత, నస్రు రుషులు, ఆధ్యాత్మిక గురువులను కలవడం మొదలుపెట్టాడు. అతడు ఎందరో నిజమైన, తెలివైన ఆధ్యాత్మిక గురువులను కలిశాడు. అలాగే తాము పుణ్యపురుషులమని ప్రజలను మోసం చేసే సోమరులనూ కలిసాడు.
ఒకరోజు ఒక అడవిలో నడుచుకుంటూ వెళుతుంటే ఒక ఋషిని కలిశాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ ఋషి ఊరి ప్రజలను వారానికోసారి తనను దర్శించాలని తనకి నచ్చిన ఆహారం తీసుకురావాలని లేదంటే వారిని శపిస్తానని హెచ్చరించాడు.
నస్రుకి ఆ ఋషి ప్రజలను మోసం చేస్తున్నాడని అర్ధమై, అతనితో తమాషా చేద్దామని అనుకున్నాడు. నస్రు ఋషి దగ్గరికెళ్ళి నిల్చున్నాడు. ఋషి కళ్ళు తెరవగానే నస్రుని చూసి, "నేను నీకు ఎలా సహాయపడగలను బాలకా?" అన్నాడు. బదులుగా నస్రు, "ఋషీ నేను దూరదేశమైన టర్కీ నుండి
నిజమైన విజ్ఞానం గురించి తెలుసుకోవడానికి వచ్చాను. మీ యొక్క విశ్వాసాలను నాకు వివరించండి." అన్నాడు.
అతనికొక అనుచరుడు దొరికాడన్న ఆనందంలో పెద్దదైన స్వరంతో ఋషి ఇలా చెప్పాడు, "జీవితం అంతం లేనిది. ఒక జన్మలో నీవు మానవుడివైతే మరో జన్మలో నీవు జంతువు లేదా మొక్కలా పుడతావు".
నస్రు ఆశ్చర్యపోయినట్లు నటిస్తూ, "అవును ఋషి ఉత్తమా! నిజంగా నేను ఒకసారి ఒక చేప వల్ల రక్షింపబడ్డాను" అన్నాడు.
"ఏంటి! ఒక చేపా! ఎలా జరిగిందది? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను" పెద్దవైన కళ్ళతో, కుతూహలంతో ప్రశ్నించాడు ఋషి. ఆ ఋషికి వివిధ వ్యక్తుల నుండి కథలు సేకరించి, తన కథలుగా ప్రచారం చేయడం ఒక అలవాటు.
బదులుగా నస్రు "నేను ఒకరోజు ఒంటరిగా ప్రయాణిస్తుంటే ఒక అడవిలో తప్పిపోయాను. చాలా రోజులు నేను తిండి, నీళ్ళు లేక తిరిగాను. నేను చనిపోతానేమో అనుకునేంతలో ఒక సరస్సు నా కంటపడింది. నా శక్తినంతా కూడదీసుకుని ఆ సరస్సును చేరుకున్నాను"...
అతి కుతూహలంతో ఋషి నస్రు మాటలకు అడ్డు తగులుతూ, "ఏమయింది? చెప్పు? నువ్వు ఆ సరస్సులో పడిపోయావా? ఏదైనా అద్భుతమైన శక్తిగల చేప వచ్చి నిన్ను కాపాడిందా? చేప దేవుడిగా మారిందా?" అని అడిగాడు.
నస్రు నవ్వుతూ ఇలా అన్నాడు, "కాదు! కాదు ఋషి! నేను సరస్సు దగ్గరికెళ్ళి ఒక చేపను పట్టి, కాల్చి తిన్నాను. ఆ చేపే లేకపోతే నేను చనిపోయేవాణ్ణే కదా!"
నస్రు తనని వెర్రివాణ్ణి చేశాడని గుర్తించిన ఋషి కోపోద్రిక్తుడయ్యాడు. ఋషి స్పందించేలోగానే నస్రు అక్కడి నుండి పగలబడి నవ్వుతూ తన దారిలో తను వెళ్ళిపోయాడు.
ఒక రోజు రాత్రి ధనవంతునికి చెందిన తోటలో కాయలు దొంగిలించడానికి దొంగ వచ్చాడు. తోటలోని కొన్ని కాయలు కోసాడు. ఆ అలికిడికి తోటలో నౌకర్లు లేచి దివిటీలు వెలిగించి తోటంతా వెతికారు. దొంగతనానికి వచ్చిన ఆ దొంగ పట్టుబడకుండా తప్పించుకోవాలని ఒంటికి విభూది రాసుకొని చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక చెట్టు కింద కూర్చొని సాధువులాగా కొంగ జపం చేయసాగాడు. నౌకర్లు దొంగను పట్టుకోలేక పోయారు. కానీ ఆ తోటలో జపం చేసుకుంటున్న ఆ సన్యాసిని చూసి వారు చాలాచాలా సంతోష పడ్డారు. మరుసటి రోజు ఆ తోటలో సాధువు బసచేసాడన్న వార్త సుడిగాలిగా ఊరిలో ప్రాకి పోయినది. చాలామంది ప్రజలు, పండ్లు, తినుబండారాలు తీసుకొని వచ్చి సాధువు కాళ్ళదగ్గర పడ్డారు. కొంతమంది అతడి పాదాల వద్ద వెండి, బంగారం, డబ్బులు కూడా పెట్టారు.
'నేను దొంగ సన్యాసిని కదా! అయినా ఎంతమంది ప్రజలు నాపట్ల భక్తిశ్రద్ధలు చూపుతున్నారు. ఎంత ఆశ్చర్యం! అని దొంగ ఆలోచించాడు. 'నేను సాధువుగా మారితే ఇంకెంతగా గౌరవిస్తారో? అని ఆలోచించి, నిజమైన సాధువు కావడానికి ఆ దొంగ తీర్మానించుకొన్నాడు. కొంతకాలానికి ఆ దొంగ నిజంగానే ఒక సాధువుగా మారి భగవంతుని కృపను పొందాడు.
ధర్మయ్య ఒక నిజాయితీ గల వర్తకుడు. ఒకరోజు వ్యాపార నిమ్మితం పరదేశానికి వెళ్లిన ధర్మయ్య అక్కడ సత్రంలో రంగయ్య అనే వ్యక్తితో కలిసి ఒకే గదిలో బస చేశాడు. తెల్లవారక ముందే సత్రంలో నుండి బయలుదేరిన ధర్మయ్య తన వ్యాపార లావాదేవీలను కొనసాగించేందుకు మరో పట్టణం చేరుకున్నాడు. ఆ పట్టణ పోలీసులు అతన్ని అడ్డగించి తనతో పాటు బస చేసిన రంగయ్య హత్య చేయబడ్డాడని తెలుసుకొని నిర్ఘంతపోయాడు. పోలీసులు ధర్మయ్యను ప్రశ్నిస్తూ అతని సంచి వెదకగా అందులో రక్తంతో తడిసిన కత్తి ఉండడంతో ధర్మయ్యే నేరస్ధుడని నమ్మిన పోలీసులు ధర్మయ్య ఎంతగా వాదించినా వినకుండా అతన్ని ఇరవై ఆరేళ్ళు జైలు శిక్ష విధించారు.
దీనంగా దేవుణ్ణి ప్రార్దించడం తప్ప మరేమీ చేయలేని ధర్మయ్య దేవుడి కృపకోసం ఎదురు చూడ సాగాడు. అంతలోనే కొంత మంది కొత్త నేరస్ధులను జైలులోకి తీసుకువచ్చారు అధికారులు. వారిలో కరడుగట్టిన హంతకుడు రత్నయ్య కూడా ఉన్నాడు. రత్నయ్య మాటలలో రంగయ్యను చంపింది రత్నయ్యేనని తెలుసుకున్నాడు ధర్మయ్య. కాని ప్రతీకారం తీర్చుకోవాలని చూడలేదు ధర్మయ్య.
ఒకరోజు జైలు నుండి పారిపోయేందుకు సొరంగం తవ్వుతున్న రత్నయ్యను చూశాడు ధర్మయ్య. సొరంగం తవ్వుతున్న చప్పుడు విన్న పోలీసులు వచ్చి గదిలో ఆరా తీశారు. కాని రత్నయ్యే సొరంగం తవ్వాడని ధర్మయ్య చెప్పలేదు సరికదా మౌనంగా తెలియనట్లే ఊరుకున్నాడు. తన నేరం వల్ల జైలుశిక్ష అనుభవిస్తున్న ధర్మయ్యకి తన పట్ల ఇంత దయ, ప్రేమ చూసేసరికి తట్టుకోలేకపోయినా రత్నయ్య ధర్మయ్య కాళ్లపై పడి తనను క్షమించమంటూ వేడుకోగా, "దేవుడే క్షమిస్తాడు" అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు ధర్మయ్య.
మరుసటి రోజే తన నేరం అంగీకరించిన రత్నయ్య తన వల్ల నేరం అనుభవిస్తున్న ధర్మయ్య నిరపరాధి అని అతన్ని విడిచిపెట్టమని జైలు అధికారుబతిమాలాడు. అసలు నేరస్ధుడు దొరకడంతో ధర్మయ్యను వదిలేశారు అధికారులు.
అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క. అది జిత్తులమారిదే కాదు, ఆకతాయిది కూడా!
ఓ రోజు అది అనుకోకుండా ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది. దాని నుంచి బయట పడడానికి రకరకాలుగా ప్రయత్నించింది. ఎట్టకేలకు బయటపడింది. కాని దాని తోక మాత్రం అందులో ఇరుక్కుపోవడంతో గట్టిగా లాగేసరికి పుటుక్కున తెగిపోయింది. బయటకి వచ్చాక తనకు తోక లేకపోవటం చూసి నాలుక్కరుచుకుంది. తోక లేకపోతే అడవిలోని మిగిలిన నక్కలన్నీ తనను ఎగతాళి చేస్తాయే, ఎలాగా అనుకుంది. చివరికి ఓ ఉపాయం ఆలోచించింది. అడవిలోని జంతువులన్నింటినీ సమావేశపరిచింది. తానో మహారాజులాగా అభినయిస్తూ ఇలా ప్రసంగించింది. "మిత్రులారా! తోక వల్ల మనకు ఎన్ని ఇబ్బందులెదురవుతున్నాయో తెలుసా! ఒక్కోసారి వేటగాళ్ళకు ముందుగా మన తోకే దొరుకుతుంది. దాంతో మనం వాళ్ళకి దొరికిపోతాం. ఆ తర్వాత నానా తంటాలూ పడాల్సి వస్తుంది. అందుకే మనందరం మన తోకలను తెంపేసుకుంటే సరి! ఏమంటారు?" అంది ఎంతో తెలివిగా!
అడవిలోని జంతువులన్నింటికీ దీని సంగతి బాగా తెలుసు. అందుకే దాని అతి తెలివికి అవన్నీ ముందు ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత తెలివి తెచ్చుకున్నాయి.
"నీ జిత్తులు మా దగ్గర చూపించకు, గతంలో ఆ తోక గురించి ఎన్ని కబుర్లు చెప్పేదానివి! అసలు తోకే లేకుంటే మనకు అందమే ఉండేది కాదన్నావు. ఇప్పుడు నీ తోకే తెగేసరికి మా అందరి తోకలూ కత్తిరిద్దామని కుతంత్రం పన్నావు. నీ ఆటలు మా దగ్గర సాగవు. నీలాంటి తోకలేని నక్క ఈ అడవిలోనే ఉండటానికి వీల్లేదు" అంటూ దాన్ని దూరంగా తరిమికొట్టేశాయి.
ఆధారము: రమేష్ బాబు, టీచర్, పశ్చిమ గోదావరి
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
ఈ పేజి లో మరికొన్ని నీతి కథలు అందుబాటులో ఉంటాయి...
రచన: మౌనిక, పదో తరగతి, కస్తూర్బాగాంధీ బాలికా విద్య...
ఈ పేజి లో మరికొన్ని నీతి కథలు అందుబాటులో ఉంటాయి.....
ఈ పేజి లో మరికొన్ని నీతి కథలు అందుబాటులో ఉంటాయి......