అనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మఱ్ఱిచెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివశిస్తున్నాయి. వాటియందు ఒక కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకము. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలో నూకలు చల్లి వానిపై వలపన్ని కొంతదూరంలో దాగి ఉన్నాడు. తెల్లవారుచుండగా కొన్ని పావురములు ఆకాశమార్గాన ఎగురుచూ భూమిపై నూకలు చూచాయి. వెంటనే క్రిందకి దిగి తిందామని ఆశపడగా పావురముల రాజు చిత్రగ్రీవుడు "వద్దు తొందర పడవద్దు మనుషులే లేని ఈ అడవిలోనికినూకలు ఎలా వచ్చినవి. ఇందులో ఏదో మోసముంది. కనుక మనము ఈ నూకలకు ఆశపడరాదు. పూర్వము ఒక బాటసారి బంగారు కంకణమునకు ఆశపడి పులినోట పడి మరణించాడు. మీకా కథ చెబుతాను వినండి" అని చెప్పసాగాడు చిత్రగ్రీవుడు.
ఒక చెరువు గట్టున ఉన్న పెద్ద పొదలో ఒక ముసలి పులి నివశిస్తుంది. అది ఆ దారిలో పోవుచున్న బాటసారినొకనిని చూచి "ఓ బాటసారి! ఇదిగో నావద్ద ఒక బంగారు కడియం ఉంది. దీనిని ఏ పుణ్యాత్మునికైనాదానం చేయవలెనని ఎంత కాలం నుండో ఎదురుచూచు చున్నాను. అదృష్టవశమున ఈ రోజు నీవు కనబడినావు. నాయందు దయతలచి ఆ చెరువులో శుద్దిగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణము తీసుకో" అని తన వద్దనున్న బంగారు కడియము చూపినది. ధగధగమని మెరుస్తున్న ఆ కడియమును చూడగానే బాటసారికి ఆశ కలిగింది. కాని పులి వద్దకు పోతే అది తనను చంపుతుందేమో అని భయంతో వణికిపోయాడు. ఒకవైపు బంగారం కడియం, మరొకవైపు భయం.
అయినా ధైర్యం తెచ్చుకొని ఆ పులితో "పులిరాజా! నీవు క్రూర జంతువు, నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగాలను? బంగారు కడియం కొరకు ప్రాణాలు తీసుకొనువారు ఉన్నారా?" అనగా, అప్పుడు పులి "నేను క్రూర జంతువునే, నీవు భయపడుట న్యాయమే. కాని నేను నీ వయస్సులో ఉన్నపుడు అనేక పాపములు చేశాను. ఎన్నో జంతువులను, ఎందరో మనుష్యులను పొట్టనబెట్టుకున్నాను. ఆ పాపమును పోగొట్టుకొనుటకే ఈ కడియమును దానముచేయదలిచాను. లేవలేని సత్తు పండు ముసలదాన్ని, గోళ్ళు మోద్దువారినవి, పండ్లూడిపోయినవి, కళ్ళు కూడా సరిగా కనపడటం లేదు. మాంసభక్షమే మానివేసి కాయకసరులతో కడుపు నింపుకొనుచున్నాను. కనుక ఎటువంటి అనుమానం పెట్టుకొనక స్నానము చేసి రమ్ము. రేపో మాపో చావనున్న నన్ను చూచి భయపడకు" అని చెప్పింది. దురాశతో బాటసారి పులి మాట నమ్మి స్నానము చేయుటకు చెరువులో దిగి అందులోని బురదలో కూరుకుపోయి పైకి రాలేక "అయ్యో! బురదనేలలో దిగబడిపోవుతున్నాను. రక్షించండీ! రక్షించండీ! అని అరవగా, పులి భయపడకు! నేను వచ్చి నిన్ను రక్షించి పైకి తీయుదును" అని అతని వద్దకు వచ్చి మీదకు దూకి చంపి తృప్తిగా ఆరగించినది. దురాశకు పోయి దుర్మరణం పాలైన బాటసారి వలే మనం కూడా నూకలకై నేల వాలితే ముప్పు తప్పదు" అన్నది.
అంతలో ఒక ముసలి పావురం "నేను మీ అందరికంటే పెద్దవాడను, నా వంటి పెద్దల సలహాలను తప్పక వినాలి. లేని పోనీ అనుమానం పెట్టుకొని, ఆకలితోనున్న మనం ఎదురుగా ఉన్న ఆహారం ఒదులుకొని మరొక చోటుకు పోవటం అవివేకం. చిత్రగ్రీవుని అనుమానం మనకు తెలియదా? అందరం కిందకు దిగి నూకలు తిందాం రండీ!" అని ఆ పావురం నేలవాలింది. ఆకలితో ఉన్న మిగతా పావురములన్నియు కూడా నెల వాలి వలలో చిక్కుకున్నవి.
పావురములు చిత్రగ్రీవుని మాటలు విననందుకు విచారించి ముసలి పావురమును తిట్టసాగినవి. చిత్రగ్రీవుడు పావురములతో "మిత్రులారా! మీరు ఇతనిని దూషించినందువల్ల ప్రయోజనం లేదు, తనకు తోచినది చెప్పాడు. అపుడు మన బుద్దులేమైనవి? ఆకలికి ఆగలేక ఆశకు పోయినాము, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ఆలోచించుకోవాలి గాని, మనలో మనము కీచులాడుకొనిన ప్రయోజనం లేదు. అదిగో వేటగాడు వచ్చుచున్నాడు, నాకొక ఉపాయము తోచుచున్నది. ఐకమత్యమునకు మించిన బలం మరొకటి లేదు, మనమందరం కలిసి ఒక్కసారిగా పైకెగిరనచో వల కూడా మన వెంటే వస్తుంది, అందుకని ఒక్కాసారిగా పైకి ఎగురుదాం" అని చిత్రగ్రీవుడు చెప్పగా, అతని ఉపాయముకు సంతోషించి ఒక్కసారిగా పైకి ఎగిరినవి. ఆ పావురాలతోపాటు వల కూడా పైకి లేచింది.
వలలో పైకెగిరిన పావురాలను చూచి వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. పావురాళ్ళు చిక్కకపోయినా పర్వాలేదు, తన జీవనాధారమైన వలైనా దొరుకుతుందేమో అని అతడు ఆ పావురములు పరుగెత్తిన దిక్కుగా కొంతదూరం వెళ్లి ఇక వానిని వెంబడించలేక నిరాశతో ఇంటి దారి పట్టాడు.
ఈ వింత చూస్తున్న లఘుపతనకము అనే కాకి పావురములు ఏమి చేయునో, వల నుండి ఎట్లు తప్పించుకొనునో చూద్దామని వాని వెంట ఎగురుతూ ప్రయాణించింది. పావురములు కొంత దూరం పోయిన తర్వాత చిత్రగ్రీవుడు ఆ అడవిలో ఒక చెట్టు చూపి, "మిత్రులారా! మనము ఈ చెట్టు కింద నేలపై వాలుదాము. అచట భూమి కన్నంలో నా బాల్య స్నేహితుడు హిరణ్యకుడను ఎలుక నివశిస్తున్నాడు. అతడు వల త్రాళ్ళు కొరికి మనందరినీ విడిపించగలడని చెప్పింది. ఆ మాటలకు పావురములన్నియు సంతోషించి హిరణ్యకసికుని కన్నం వద్ద వాలాయి. ఆ చప్పుడు విని హిరణ్యకసికుడు భయంతో కన్నంలో దూరాడు. చిత్రగ్రీవుడు మెల్లగా కన్నం దగ్గరకు పోయి "మిత్రమా హిరణ్యకా! నేను నీ చిన్ననాటి స్నేహితుడను చిత్రగ్రీవుడను, భయములేదు బయటకు రమ్మని పిలిచాయి. చిత్రగ్రీవుని గొంతు గుర్తు పట్టి హిరణ్యకుడు కన్నం నుండి బయటకు వచ్చి వలలో చిక్కు పడిన పావురములను చూచి "అయ్యో వలలో చిక్కుకుంటివా! నిన్ను క్షణంలో విడిపించెద"నని అతని వద్దకు వెళ్ళివలను కొరకబోగా చిత్రగ్రీవుడు "మిత్రమా ముందుగా నా మిత్రులందరినీ విడిపించు, ఆ తరువాత నన్ను విడిపించు. తనెంత ఆపదలలో ఉన్ననూ తనవారి కష్టములు తొలిగించువాడు నిజమైన మిత్రుడు, స్వార్థము సర్వనర్థములకు మూలము. స్వార్థపరుడు బతికియున్ననూ చచ్చిన వానితో సమానము. కనుక నీ పంటి బలమున్నంత వరకు నావారిని విడిపించుము. తరువాత నన్ను విడిపించు" అన్నాడు.
ఆ మాటలకు హిరణ్యకుడు పరమానందము చెంది "నీ వంటి మంచి మిత్రుడు లభించుట నా పూర్వ జన్మ సుక్రుతము. నీ వారిపై నీకు గల ప్రేమ సాటిలేనిది. నీవు కోరినవిధంగా ముందు నీ సహచరులనే విడిపించెదను" అని పలికి ఎంతో ఉత్సాహంతో వల త్రాళ్ళు కొరికి పావురములన్నింటిని వలనుండి విడిపించినది. చిత్రగ్రీవుడు హిరణ్యకుని కౌగలించుకుని "మిత్రమా! నీ మేలు మేము ఎన్ని జన్మలకైననూ మరువలేము పోయివత్తుము సెలవిమ్మని" కృతజ్ఞతలు తెలిపి పావురములన్నియు కలిసి బయలుదేరినవి. వారిని సాగనంపి చిత్రగ్రీవుని అభినందించుచుహిరణ్యకుడు కన్నంలోకి పోయాడు.
ఇదంతయు చూసి, లఘుపతనకము అను కాకి హిరణ్యకునితో స్నేహం చేయవలెనని తలిచి కన్నం వద్దకు వెళ్లి, "మిత్రమా హిరణ్యకా! నేను లఘుపతనకమనుకాకిని. నీవు పావురములకు చేసిన మేలు కనులారా చూశాను. నీ వంటి ఉత్తమునితో స్నేహము చేయవలెనని వచ్చితిని. దయ ఉంచి బయటకు వచ్చి నాతో స్నేహం చేయుము" అనగా హిరణ్యకుడు "నీవు చెప్పే మాటలు చాలా బాగున్నవి. స్నేహము ఎవరితో చేయాలో నాకు బాగా తెలుసు. కాకులు ఎలుకలకు ఆజన్మ శత్రువులు. నీతో స్నేహము నా ప్రాణానికే ముప్పు. నీ తీపి మాటలకుమోసపోవునంత అమాయకుడనుకాను. పూర్వము ఒక లేడి నక్క మాటలు నమ్మి మోసపోయి ఆపదలో చిక్కి చివరకు తన మిత్రుడగు కాకి వలన రక్షించబడినది. ఆ కథ చెప్పెద వినుము అని ఈ విధంగా చెప్పసాగింది.
పూర్వం మగధ దేశంలో మందారవతి అనే అడవి. ఆ అడవిలో ఒక కాకి, లేడి ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. ఏ తోటలోనైనా మొక్కజొన్న కండెలు దొరికితే లేడి కాకికి ఇచ్చేది. కాకి ఏ గ్రామంలోనైనా మంచి తినుబండారాలు దొరికితే లేడికి తెచ్చి పెట్టేది. ఈ విధంగా ఆ రెండూ ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి మంచిచెడులు మరొకరికి చెప్పు కొనుచు అన్యోన్యంగా జీవిస్తున్నాయి.
ఆ అడవిలోనే నక్క కూడా జీవిస్తున్నది. ఒకనాడు బాగా బలిసియున్న ఆ లేడిని చూచి, ఎలాగైనా దానిని చంపి తినాలనే కోరిక నక్కకు కలిగింది. అందుకని ఒక ఎత్తు వేసింది. మేత మేసే లేడి వద్దకు వెళ్లి "నమస్కారం లేడి బావగారూ! నేనీ అడవిలో ఆ చివరకు ఒక మూల ఉండేదాన్ని. అక్కడ క్రూరజంతువుల బాధపడలేక యిటువచ్చాను. వచ్చీ రావడంతోనే మీరు నాకు కనిపించారు. నీతో చెలిమి చేయాలనే కోరిక కలిగింది. నీకీ చోటు బాగా తెలుసుకదా! ఒకరికొకరం తోడుగా కబుర్లు చెప్పుకుంటూ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ హాయిగా జీవిద్దాం" అని ఇంకా ఎన్నో మాయమాటలు చెప్పింది.
లేడి నక్క మాటలు నమ్మింది. "ఆపదలో ఉండి శరణువేడి స్నేహం కోరివచ్చిన తోటి జంతువుని ఆదరించటం కనీస ధర్మం" అని భావించినది. నక్కతో స్నేహం చేయతలచి "నక్క బావా? నాకొక కాకి స్నేహితుడున్నాడు. మేమిద్దరం కలిసి ఆ కనిపించే చెట్టు వద్ద ఉంటున్నాము. నీవు కూడా మాతోపాటు ఉందువుగాని మా యింటికి వెళదాం రా!" అని దానిని వెంటబెట్టుకొని కాకి వద్దకు వచ్చి, దానికి నక్క విషయమంత చెప్పినది. కాకి జింకతో "మిత్రమా! మంచి చెడు ఆలోచించక, కొత్తగా వచ్చిన వారిని నమ్మి స్నేహము చేయరాదు. ఇది జిత్తులమారి నక్క. పైగా మాంసాహారి కూడా, దాని గుణగణాలు మనకి తెలియవు. అలాంటి వారి స్నేహం మంచిది కాదు. వారివారి గుణగణములు తెలియక ఎవ్వరినిబడితే వారిని దరికి చేరనిస్తే పిల్ల మాటలు నమ్మి చేరదీసి చివరకు ప్రాణములు పోయిన గ్రద్దవలె అగును. ఆ కథ చెప్తాను ఆలకించు అంటూ ఆ కథ చెప్పసాగింది.
పూర్వం గంగానది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉన్నది. దానిమీద ఎన్నో పక్షులు నివశిస్తున్నాయి. అదే చెట్టు తొర్రలో "జరద్గవము" అను ఒక గుడ్డిగద్దజీవిస్తున్నది. గుడ్డితనానికి తోడు ముసలితనం తోడై ఆహారం తెచ్చుకోడానికి కూడా చేత కాక అవస్థపడుచున్నది. దానిని చూచి పక్షులు జాలిపడి తాము సంపాదించిన ఆహారంలో కొంత దానికి పెట్టేవి. అందుకుగాను ఆ చెట్టుపైనున్న పక్షిపిల్లలను కాపాడుతూ గ్రద్ద కాలం గడుపుచున్నది. ఇలా ఉండగా ఒకనాడు పక్షులన్నీ ఆహారం కోసం వెళ్ళడం చూచి "దీర్ఘకర్ణము" అనే జిత్తులమారి పిల్లి పక్షి పిల్లలని తినాలని ఆ చెట్టు ఎక్కింది.
పిల్లిని చూచి భయపడి పక్షిపిల్లలు అరవసాగినవి. శత్రువెవడో వచ్చాడని గ్రహించి గ్రద్ద "ఓరీ దుర్మార్గుడా! నీవేవ్వడవు? ఇక్కడకు ఎందుకు వచితివి?" అని గద్దించింది. "నేను దీర్ఘకర్ణమనే పిల్లిని" అని చెప్పగా వినిన గ్రద్ద "నువ్వా! తక్షణమే ఇక్కడి నుండి వెళ్లిపొమ్ము, పోకపోతే నీ ప్రాణాలు నీకు దక్కవు, పోతావా? లేదా? అని కోపంగా గద్దించింది. గ్రద్ద మాటలకు పిల్లి గజగజలాడి, అయ్యా! నేను ఎంత పాపం చేసితినో ఈ పిల్లి జన్మనెత్తితిని. అనేక పాపములాచారించితిని. కొంత కాలంగా నాకు జ్ఞానము కలిగి మాంసము ముట్టక, సత్వము తప్పక చాంద్రాయణ వ్రతమాచారించితిని. గంగా స్నానము చేసి పెద్దలవలన ధర్మ మార్గము తెలుసుకొనవలెనని ఆశతో మీ వద్దకు వచ్చితిని కాని, వేరొక దురాలోచన నాకు లేదు. కాబట్టి నాయందు దయ ఉంచి నన్ను శిష్యునిగా స్వీకరించండి" అని గ్రద్దతో పలికింది. పిల్లి వినయంగా పలికిన మాటలకు గ్రద్ద సంతోషించి, పిల్లిని తన శిష్యునిగా అంగీకరించింది. ఆనాటి నుండి ప్రతిరోజూ పక్షులు లేనిసమయంలో ఆ చెట్టుపై గ్రద్ద-పిల్లి కాలక్షేపం చేయసాగాయి. కొన్నిరోజులు అలానే నమ్మకం కలిగించి పిల్లి తెలివిగా చెట్టుమీదుకు పాకి గూళ్ళలోని పక్షిపిల్లలని తిని, ఆ ఈకలను, ఎముకలను గ్రద్ద నివశించుచున్న చెట్టు తొర్రలో పడవేసింది. గ్రుడ్డిగ్రద్దకు ఈ విషయమేమియు తెలియదు.
క్రమంగా పక్షులకు తమ పిల్లలు పోవుచున్నవనే అనుమానం కలిగింది. వెంటనే గ్రద్దను అడిగాయి. అది తనకేమీ తెలియదని అన్నది. కాని దాని తొర్రలో ఉన్నా ఈకలను, ఎముకలను చూచి "ఈ పాడు గ్రద్ద మనమిచ్చే ఆహారం చాలక మనం లేని సమయం చూచి మన పిల్లలని పొట్టనబెట్టుకొన్న"దని భావించి, పక్షులన్నీ కలిసి గ్రద్దను పొడిచి చంపేశాయి. కాబట్టి కొత్తగా వచ్చిన వారిని నమ్మి దగ్గరకు చేరనీయరాదు" అని కాకి(లఘుపతనకము) జింకతో(చిత్రాంగుని)తో పలికెను.
కాకి మాటలు విన్న జింక కాకితో "మిత్రమా! వేరే జాతుల వారమైనా మనమిద్దరం స్నేహంగా ఉండటం లేదా! అలాగే ఈ నక్క కూడా మనతో కలిసి ఉంటుంది. జాతికన్నా గుణం ముఖ్యం కదా, ఇది నాకు మంచిదే అనిపిస్తుంది, మనతోనే ఉండనిద్దాం" అని అన్నది. మిత్రుని మాట కాదనలేక కాకి సరే అంది. ఆరోజు నుండి కాకి, నక్క, జింక ఎంతో సంతోషంగా ఉంటున్నాయి. జిత్తులమారి నక్క సమయం చూచి లేడి మాంసం తినాలని ఆలోచించసాగింది. ఒకనాడది జింక వద్దకు వచ్చి "మిత్రమా! ఆ పక్కన చక్కటి పచ్చిక ఉంది, రేపు మేతకు అటు వెళదాం అంది. జింక కూడా సరే అంది. మరునాడు రెండూకలిసి అటువైపుగా మేతకు వెళ్ళినవి. అక్కడ పచ్చికయే కాక జొన్న చేను కూడా ఉంది. దానిని చూచి లేడి ఆనందించింది. ప్రతిదినం ఆ పొలంలో కడుపారా పైరు మేయసాగింది. పొలం కాపు అది గ్రహించి లేడిని బంధించుటకు వలపన్ని ఇంటికి పోయాడు. మరునాడు యథాప్రకారం మేతకు వచ్చిన జింకఆ వలలో చిక్కుకున్నది. తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అంతలో నక్క అక్కడికి వచ్చింది. వలలో చిక్కిన జింకని చూచి అదిలోలోపల ఎంతగానో సంతోషించింది. నక్కను చూచి జింక "మిత్రమా! మంచి సమయంలోనే వచ్చావు, పొలం కాపు వచ్చు వేళయింది. కనుక వెంటనే వల కొరికి నా ప్రాణాలను కాపాడు" అని వేడుకుంది. అది విని నక్క వలను కొరుకుటకు వెళ్ళినట్లే వెళ్లి వెనుకకు తగ్గి "మిత్రమా! ఈ వల నులినరములతో చేయబడినది, నేడు ఆదివారము, నేను నరములను ముట్టను, ఈ పని తప్ప మరేపనైనా చెప్పు చేసెదను" అని మెల్లగా అచట నుండి జారుకొన్నది. కాని ఆ నక్క ఆ పక్కనే ఒక పొదలో దాక్కొని పొలం కాపు రాక కోసం ఎదురుచుడసాగింది. పొలం యజమాని వచ్చి లేడిని చంపి, బయటకు వేయగానే దాని మాంసము కడుపారా తినవచ్చని ఎంతో సంతోషంగా ఉన్నది నక్క.
ఇంతలో కాకితన మిత్రుడైన జింక ఎంతవరకూ రాకపోవుట చేత దానిని వెతుకుతూ బయలుదేరింది. అలా వెతుకుతుండగా దానికి ఒకచోట వలలో చిక్కిన జింకని చూచి, కిందకు దిగి "మిత్రమా, ఏమిటి ఈ దారుణం, ఏం జరిగింది అని అడిగింది కాకి. కాకి మాటలు విన్న జింక కన్నీరు కారుస్తూ "మిత్రమా! ఆరోజు నీవు చెప్పిన మాటలు విననందుకు ఇది ఫలితం" అనగానే కాకి ఆ నక్క ఎక్కడ అని అడిగింది."అది నా మాంసం తినవలెనని ఇక్కడే ఎక్కడో నక్కి ఉండి ఉంటుంది" అని విషయం వివరంగా చెప్పింది. అంతలో దూరంగా పొలం కాపు కనిపించాడు. కాకి జింకతో "మిత్రమా! పొలం కాపు వస్తున్నాడు. నాకు ఒక ఉపాయం గుర్తుకు వచ్చింది. నీవు తక్షణం ఊపిరి బిగపట్టి చచ్చిపోయినట్లు పడుకొని ఉండు. నేను నీ కన్నులు పొడుచుచున్నట్లు నటిస్తాను, పొలంకాపు వచ్చి నిన్ను చూచి చిచ్చిపోయవని వల నుండి వేరు చేయగానే, నేను "కావ్ కావ్" అని అరిచిన వెంటనే నీవు లేచి పరుగెత్తు"అనిచెప్పింది. జింక సంతోషించి సరే అని ఆ విధంగానే చేసింది.
పొలం కాపు వలనుండి జింకను వేరు చేయగానే వెంటనే అది కాకి చెప్పినట్లుగా పరుగెత్తింది. అది చూచి పొలంకాపు ఆశ్చర్యపోయాడు. తనను మోసం చేసిందని గ్రహించి, దీనికి తగిన శాస్తి చేస్తానని తన చేతిలో ఉన్న పెద్దకర్రని దానికి తగిలేలా విసిరాడు. అది అదృష్టవశాత్తు జింకకి తగలలేదు. గురి తప్పిపాడు బుద్దితో పొదలో దాక్కున నక్కకు తగిలింది. వెంటనే అది గిలగిల తన్నుకొని అక్కడే చచ్చిపోయింది.
కావున "నీతో స్నేహం చేయుట నిప్పును పట్టుకొని కాలింది అని బాధపడ్డట్టు ఉంటుంది" అనగా అప్పుడు కాకి "ఆర్యా! కాకి జాతిలో పుట్టినంత మాత్రాన నన్ను పాపాత్మునిగా బావించకు. నిన్ను చంపి తినినంత మాత్రాన నా ఆకలి తీరునా? మృత్యువు ఎవరికీ ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో ఎవరు చెప్పగలరు? నేను నీకు ఏవిధమైనటువంటి అపకారం చేయను. చిత్రగ్రీవునితో ఎంత స్నేహంగా ఉన్నావో నాతో కూడా అలాగే ఉండు, అనుమానించక నా కోరిక నెరవేర్చు, నాకు సంతోషం కలిగించు మిత్రమా!" అన్నది.
హిరణ్యకుడు కాకి పట్టుదలకు సంతోషించి స్నేహానికి అంగీకరించింది. అప్పటి నుండి కాకి, ఎలుక స్నేహంగా కొన్నాళ్ళు కాలం గడిపాయి. కొంతకాలం తరువాత కాకికి ఆహారం దొరుకుట కష్టమైపోయింది. అది దండకారణ్యంలో ఉన్న తన మిత్రుడు మందరుడనే తాబేలు వద్దకు పోవాలని నిశ్చయించుకుని, ఆ విషయంహిరణ్యకునికి చెప్పింది. హిరణ్యకుడు "మిత్రమా! ఆహారం దొరకక కడుపు మాడ్చుకొని ఇక్కడే ఉండమని చెప్పలేను. పోయిరమ్మని చెప్పి నిన్ను ఒదిలి నేను ఒంటరిగా ఉండలేను. మందరుని వద్దకు నన్ను కూడా తీసుకొని వెళ్ళుము. కష్టమో, సుఖమో, మన ముగ్గురం కలిసి ఒక చోటనే ఉందాం" అని చెప్పింది.
కాకి ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని దండకారణ్యము వదిలి వేరొక అడవిలో ఒక చెరువు గట్టుపై వాలింది. అదే సమయమున చెరువు ఒడ్డునకు వచ్చిన మందరుడు లఘుపతనకమును(కాకి)చూచి "మిత్రమా! ఎంతకాలమునకు కనబడితివి, క్షేమముగా ఉన్నావు కదా! అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. తరువాత లఘుపతనకము మందరునకు హిరణ్యకుని పరిచయం చేసి, అతని మంచి గుణములను వివరించింది. మందరుడు హిరణ్యకుని ఎంతో గౌరవించి, హిరణ్యకుని గురించి తెలుసుకొనదలచి అతనితో "మిత్రమా! ఎలుకలు పల్లెలలో పట్టణములలో నివశించుచుండగా నీవీ అడవిలో ఉండుటకు కారణమేమి? నీకు పల్లెలలో ఉండుట నచ్చలేదా? మొదటి నుండి అడవిలోనే నివశించుచున్నావా? అని అడిగింది.
హిరణ్యకుడు నవ్వి "కాదు మిత్రమా! నేను అందరివలె ఒక పట్టణమునే నివశించితిని. కొంతకాలం వరకు సుఖంగానే బ్రతికాను. కాని చివరకు సర్వం కోల్పోయి చావు తప్పి జనసంచారము లేని అడవికి వచ్చి జీవయాత్రని కొనసాగించుచుంటిని. నా కథ చెప్పెదను వినండి!" అని ఈవిధంగా చెప్పసాగింది.
ఒక పెద్ద నగరంలో సన్యాసులు నివశించు మటంలో "చూడాకర్ణు"డను సన్యాసి నివశించుచున్నాడు. అతడొక చిలుక కొయ్యకు తాను తినగా మిగిలిన భిక్షాన్నపు పాత్రను తగిలించేవాడు. నేను అతని గదిలోనే నివశిస్తూ ఉండేదాన్ని. అతడు లేని సమయమో, నిద్రపోయే సమయమో చూచి నేను ఆ పదార్థములను తింటూ ఉండేవాణ్ణి. నా అజాగ్రత్త వలన పాత్ర మీద మూత తీసినపుడు చప్పుడయ్యేది. నిద్రపోతున్న చూడాకర్ణుడు అపుడపుడు లేచి నన్ను బెదిరించేవాడు. వెంటనే నా స్థావరానికి పరుగు తీసేదాన్ని. చూడాకర్ణుడు నా చర్యలకు విసుగు చెంది, నా పీడను వదిలించుకోవాలని ఎన్నో ప్రయత్నాలను చేస్తుండేవాడు.
ఇలాఉండగా ఒకనాడు చూడాకర్ణుని స్నేహితుడొకడు వచ్చాడు. అతన్ని పేరు వీణాకర్ణుడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకొంటున్న సమయం చూచి నేను పాత్ర మూత తీసి భోజనమారగించుచుంటిని. నా చప్పుడు విని చూడాకర్ణుడు నన్ను అదలించాడు, ఇంకా నా గురించి వీణాకర్ణునికి చెప్పాడు. అది వినిన అతని స్నేహితుడు "దీని దుంప తెగ, ఈ ఎలుక ఎంత తెలివైనది, చిలుక కొయ్యకు తగిలించిన పాత్ర మూతసైతము తొలిగించి భోజనం తోలిగించుచూ నీకు నష్టం కలిగించుచున్నదా, దీనికింత ధైర్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి, కారణం లేనిచో కార్యము పుట్టదు. ఉదాహరణకు నేనొక కథ చెబుతాను విను" అని వీణాకర్ణుడు కథను చెప్పడం ప్రారంభించాడు.
వర్థమానపురంలో ఒక పురోహిత దంపతులు ఉండేవారు. ఒకసారి అతని తండ్రి తద్దినం వచ్చింది. నువ్వు, పప్పుతో తద్దినం పెడదామని నిర్ణయించుకొని, ఆ పనిని బ్రాహ్మణుడు భార్యకు పురమాయించాడు. ఆమె నువ్వులు బాగుచేసి కడిగి పప్పును ఎండలో ఆరబెట్టింది. రెండు కోళ్ళు, రెండు ఎలుకలు పప్పును కాళ్ళతో చెరిగి తినసాగాయి. బ్రాహ్మణుడు చూచి "ఈ నువ్వులు అంటు పడినవి, తద్దినానికి ఇవి పనికిరావు, వీటిని ఎవరికైనా ఇచ్చి బదులు నువ్వులతో మరల పప్పు తయారుచేయ"మని భార్యను ఆజ్ఞాపించాడు. ఆ ఇల్లాలు నువ్వుపప్పు తీసుకొని నాలుగు ఇళ్ళు తిరిగింది.
ఒక ఇంటి ఇల్లాలు సంతోషంగాఆ నువ్వుపప్పు తీసుకొని బదులు నువ్వులిచ్చి పంపింది. తాను కష్టపడకుండా "బాగుచేసిన నువ్వుపప్పు సరికి సరిగా సమానంగా దొరకడం అదృష్టంగా భావించి సంతోషించింది. ఇంతలో ఆ ఇల్లాలు భర్త వచ్చి సంగతి తెలుసుకున్నాడు. తరువాత ఆమెతో "పిచ్చిదానా! ముడి నువ్వులకు బాగుచేసిన నువ్వుపప్పుని ఎవరైనా ఇస్తారా? మేలి సరుకు ఇచ్చి నాసిరకం సరుకు ఎవరు మార్చుకుంటారు? ఏ కారణం లేకుండా ఆ ఇల్లాలు నూగుపప్పునిచ్చి ముడినూగులెందుకు తీసుకుంటుంది. ఆ విధంగా ఎందుకు చేస్తుందో కనుక్కున్నావా?" అని అడిగాడు. " ఆ విషయం మనకెందుకు? ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఆ కారణాలతో మనకు పని లేదు, నువ్వులను దంచి పప్పు చేసుకొనే శ్రమ లేకుండా చెరిగి బాగు చేసి నూగులు మనికకు మానెడు లభించాయి. అంతేచాలు" అన్నది సంతోషంతో.
అదే విధంగా ఈ ఎలుక రాకపోకలకు కారణం ఈ కన్నం కదా! దానిని తవ్వి చూస్తే సరిపోతుంది. ఉండడానికి చోటు లేకస్థావరం కోసం ఎటో పారిపోతాయి, నీ జోలికి రావు అని చెప్పి పలుగు తెచ్చి కన్నమును తవ్వాడు. చేయునది లేక నేను, నాతోపాటు మరో నాలుగు ఎలుకలు కూడా మరోచోటుకి పారిపోయినవి. అప్పటినుంచి అందరికీ ఇబ్బంది కలిగించడం ఎందుకని, అడవిలో అయితే ఎవరికీ ఏ బాధ లేకుండా హాయిగా బతకడం మంచిదని భావించి నేనీ అడవికి చేరాను. కొన్నాళ్ళకు ప్రియ మిత్రుడు చిత్రగ్రీవుని స్నేహం లభించింది. తరువాత నీస్నేహం దొరికింది. ఇదీ నా చరిత్ర" అని చెప్పగా విని మందరుడు "మిత్రమా! నీవెంత కష్టపడి ఎన్నాళ్లనుండియో కన్నంలోదాచుకున్న ధాన్యము వృదాగా పోయినది కదా! "పేరాశ ప్రాణాంతకం" లోభిసోమ్ము లోకులపాలు" అనే సామెతలు నీ విషయంలో నిజమైనవి. దానం చేయుట గాని, తాననుభవించుట గాని లేకుండా దాచి ఉంచిన ధనం నేలపాలో, దొంగలపాలో కావడం ఖాయం. లోభితనం జీవితంలో శోకం చేకూరుస్తుంది. లోభం వల్ల ఒకనక్క తన ప్రాణాలే పోగొట్టుకుంది. ఆ కథ చెప్తాను విను అని కథ ప్రారంభించింది.
ఒక అడవిలో ఒక జిత్తులమారి టక్కరి నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. అన్నీ తనకే కావాలనే పేరాశ. కానీ నక్క చిన్న జంతువు కాబట్టి దాని ఆశ తీరడం లేదు. ఏ సింహమో, పులో వేటాడి తినగ మిగిలిన జంతువుల మాంసాన్ని తిని జీవనం సాగిస్తుండేది.
ఇలా ఉండగా ఒక రోజు ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకొని వస్తున్నాడు. అంతలో అతనికి అడవి పంది కన్పించింది. వెంటనే గురి చూసి పందిపై బాణం వదిలాడు.బాణం కొద్దిగా గురి తప్పి తగలటం వల్ల గాయం అయిందే తప్ప వెంటనే ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడిపైకి దూకి అతనిని చంపి మరికొంత సేపటికి పంది కూడా అక్కడే చచ్చిపోయింది. ఆ పంది విలవిలా తన్నుకుంటుండగా ఒక పాము దాని కింద పడి అదీ చచ్చిపోయింది.
ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడి, పంది, పాముని, వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడంత మాంసం లభించడంతో ఎంతో ఆనదించింది. ఆ నక్కకు అసలే దురాశ కదా! వేటగాని పక్కనే పడిఉన్న బాణంకు నరం బిగించి ఉంది. "ఈ నరంతో ఇప్పటికి సరిపెట్టుకుందాం" అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగటంతో వంగి ఉన్న బాణం బద్ద వేగంగా, నిటారుగా సాగి, నక్క గుండెలకు గట్టిగా గుద్దుకుంది. నక్క అక్కడికక్కడే మరణించింది.
మిత్రమా! "రాని దాని కోసం ఎదురుచూడటం, పోయినదాని కోసం విచారించడం, కష్టాలు వచ్చినపుడు క్రుంగిపోవడ, సుఖాలు కలిగితే పొంగిపోవడం అనునవి బుద్దిమంతులకు తగవు. ఉన్నదానితో తృప్తిపడి గౌరవంగా జీవించాలి. ధనాన్ని కన్నా ముఖ్యంగా మంచితనం సంపాదించాలి. చిన్నవాడవైనా నీవు బుద్దిమంతుడవు, స్నేహానికి తగిన వాడవు. నాకు లఘుపతనకము(కాకి) ఎంతో నీవు కూడా అంతే. దైవకృప వలన మనం ముగ్గురం స్నేహితులుగా కలిశాం. ఈనాటి నుండి ముగ్గురం ఇక్కడే హాయిగా కాలం గడుపుదాం" అని పలికెను. ఆనాటి నుండి కాకి, తాబేలు , ఎలుక ఎంతో స్నేహంగా గడుపుతున్నాయి.
ఒకనాడు మిత్రులు మూడూచెరువు గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాయి. అప్పుడొక లేడిపిల్ల పరుగెత్తుతూ అచటికి వచ్చింది. దాన్ని చూచి భయపడి మందరుడు చెరువులోనికి, కాకి చెట్టుపైకి, ఎలుక కలుగులోకి పోయి పారిపోయినవి. కొంతసేపటికి లఘుపతనకము పైకెగిరి చుట్టూ ప్రక్కలు పరిశీలించింది. శత్రువులెవరూ లేరని రూడీ చేసుకుంది."మిత్రులారా! మనం భయపడవలసిన పనేమీ లేదు. ధైర్యంగా బయటకు రండి" అని పిలిచింది. ఎలుక, తాబేలు బయటకు వచ్చాయి. లేడి అక్కడే భయంతో గజగజ వణుకుతూ బెదురు చూపులతో నిలబడి ఉంది. తాబేలు దాన్ని చూసి జాలిపడింది. "ఓయీ! నీవెరు? ఎక్కడి నుండి వస్తున్నావు? ఎందుకు ఇలా పరుగెత్తుతున్నావు?" అని అడిగింది. అపుడు లేడి "నాపేరు చిత్రాంగుడు, నన్నొక వేటగాడు తరుముకుంటూ వచ్చాడు. వాని నుండి తప్పించుకొనుటలో మీ వద్దకు చేరాను. నాకు దిక్కూ, మొక్కూ లేదు, మీరే నాకు శరణము, నన్ను మీ సోదరునిగా భావించి కాపాడండి" అని బ్రతిమాలింది.
వెంటనే మందరుడు సరే నీవు భయపడకు, ధైర్యంగా ఉండుము" అని లేడికి ధైర్యము చెప్పి తన మిత్రులతో "లేడిని మన జట్టులో చేర్చుకుందాం. నాకు ఇతని మాటలు నమ్మతగినవిగా తోచుచున్నది. మనతోపాటు కలిసి ఉంటాడు. మీ అభిప్రాయము చెప్పండి" అని అడిగింది. కాకి, ఎలుక రెండు తమ అంగీకారాన్నితెలిపి సరేనన్నవి.ఆనాటి నుండి లేడి కూడావాటితో కలిసి మెలిసి కాలం గడపసాగింది.
ఒకరోజు మేతకు పోయిన లేడి ఎంతవరకూ తిరిగి రాలేదు. అతనికేదైనా ఆపద కలిగిందేమోనని, నేను నీటిలోలాగా నేల మీద పరుగెత్తలేను కదా! మీరిద్దరూ వెళ్ళిచూచి రండి అని చెప్పగా కాకి నేను వేగంగా వెళ్ళిచిత్రాంగుని జాడ తెలుసుకొని వస్తాను, మీరు విచారించవద్దు, చిటికలో వస్తానని ఎగిరిపోయింది. ఒకచోట వలలో చిక్కుకున్న లేడిని చూసింది. దగ్గరకు వెళ్ళిఏం జరిగింది మిత్రమా? ఈ ఆపద ఎలా వచ్చింది అని అడిగింది. అపుడు లేడి "మిత్రమా! నేను మేత మేయుచూఉండగా అనుకోకుండావేటగాని వలలో చికుకున్నాను" అని చెప్పింది. అపుడు కాకి "భయపడకు మిత్రమా, నేను వెళ్లి మన మిత్రుడు హిరణ్యకుని వెంట తీసుకొని వస్తాను. అతడు వల కొరికి నిన్ను రక్షిస్తా"డని వేగంగా ఎగిరిపోయింది.
మందర, హిరణ్యకులు లఘుపతనకము ద్వారా లేడికి కలిగిన ఆపదను విని, ఎంతగానో విచారించాయి. కాకి హిరణ్యకుని తన వీపు మీద ఎక్కించుకొని క్షణాలలో చిత్రంగుని వద్ద వాలింది. చిత్రంగునకు(లేడికి)పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లనిపించింది. హిరణ్యకుడు వల తాళ్ళను పటపటమని క్షణాలలో కొరికేశాడు. చిత్రాంగుడు వల నుండి బయటకు వచ్చి తనను కాపాడిన ఎలుకను, కాకిని ఎంతగానో మెచ్చుకొని ముగ్గురూ వేగంగాతమ నివాసానికి వెళ్ళుచుండగా హిరణ్యకుడు "చిత్రంగా! నీ కష్టములకు అంతం లేనట్లుంది. ఈ మధ్యనే వేటగాని నుండి తప్పించుకొని మా వద్దకు చేరావో లేదో ఇంతలోనే మరల ఈ కష్టం ఎదురైంది. మేం రావడం ఏమాత్రం ఆలస్యం అయినా ప్రాణంపోయేదే గదా! నీవెంత బాధననుభావించావో" అని బాధతో అన్నది.
హిరణ్యకుని పలుకు విని చిత్రాంగుడు "మిత్రమా! ప్రతి జీవికీ కీడో,మేలో ఎపుడేది కలుగుతుందో దానిని అనుభవించక తప్పదు కదా. ప్రాణులకు సుఖ దుఃఖాలు సహజమే కదా! పూర్వ జన్మలో నేనేం పాపం చేశానో కాని పుట్టిన నాటి నుండి కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాను, నా కథేంటో చెబుతాను వినండి" అని ఇలా చెప్పసాగింది.
"మిత్రులారా! నేను ఆరునెలల వయస్సులోనే వేటగానికి చిక్కాను. బంధుమిత్రులు నన్ను చూచి ఎంతో దుఃఖించారు. వేటగాని రాకతో భయపడి పారిపోయారు. వారికోసం ఎంతగానో విలపిస్తూ ఉంటే, వేటగాడు నన్ను తన భుజానిపై వేసుకొని అతని ఇంటికి వెళ్ళాడు. అతడు నన్ను బాధించలేదు. నాతల నిమురాడు, ముద్దులాడి మేత పెట్టాడు. నా దగ్గరే పడుకున్నాడు. మరునాడు నన్నొక రాజకుమారుని దగ్గరుకు తీసుకెళ్ళి, ఆయనకు నన్ను కానుకగా ఇచ్చాడు. రాకుమారుడు సంతోషంతో నన్నెంతగానో మెచ్చుకున్నాడు. తల నిమిరి బుజ్జగించాడు. వేటగానికి మంచి బహుమానం ఇచ్చి పంపాడు. ఆ తరువాత నన్నొక శాలలో పెట్టి ఎంతో ప్రేమగా పెంచసాగాడు రాకుమారుడు. రాజభటులు నాపై ఈగ కూడా వాలకుండా కాపాడుతూ ఉండేవారు. నాకు రోజూ మంచి ఆహార పదార్థాలు పెడుతూ ఉండేవారు. ఆ విధంగా క్రమక్రమంగా నాకు మనుషుల మీద భయం పోయి, వారికి మచ్చికయ్యాను. కొన్నాళ్ళకు నేను పారిపోననే నమ్మకంతో రాకుమారుడు నా ఇష్టం వచ్చినట్లు తిరగనిచ్చాడు. అప్పుడు నా ఆనందానికి హద్దులు లేవు. ఎక్కడ తిరిగినా నన్ను అందరూ ఆదరించేవారే కాని అదలించేవారు లేరు. కోటంతా తిరిగి చూశాను, ఉద్యానవనాలలో విహరించాను. ఒకనాడు పట్టణం చూడాలని బుద్దిపుట్టింది. వెంటనే కోట నుండి బయటపడి చెంగు చెంగున ఎగురుతూ వీధులలో గెంతులు వేయుచున్నాను. రాకుమారుడు నా మెడలో కట్టించిన బంగారు మువ్వలు, కాళ్ళ గజ్జెలు గల్లుగల్లుమని మొగుచుండగా పిల్లలూ, పెద్దలూ నా వెంటపడ్డారు. నేను వారికి భయపడి వేగంగా పరిగెత్తుతూ రాణీవారు నివశించుచున్న ఉద్యానవనంలోకి వెళ్ళాను.
అంతఃపురం కాంతలు నన్ను పట్టుకొని ముద్దులాడి, కొంతసేపు నాతో ఆడుకొని చీకటి పడుతున్నదని నన్ను తమతో కోటకు తీసుకొని వెళ్ళారు. రాత్రివేళ నన్ను వారురాజపుత్రుని పడకగది సమీపమునగల ఒక స్తంభమునకు కట్టారు. నడిరేయి మంచినిద్రలో ఉండగా మెరుపులతో, ఉరుములతో పెద్ద పెద్ద వర్షం కురవసాగింది. నాకు చిన్నప్పటినుండి వానంటే ఎంతో ఇష్టం. సంతోషంతో నేను మానవ భాషలో "ఆహా! మెరుపు కాంతులతో మబ్బులెంత అందంగా ఉన్నవి. చిన్నప్పుడు వానలో తడుస్తూ స్నేహితులతో కలిసి ఆడుతూ, పాడుతూ ఎంత సంతోషించేదాన్ని, ఆ రోజులు మరల రావు కదా! అనుకొంటిని.
నా మాటలు రాకుమారుడు విని, అతడు ఆశ్చర్యంతో తన మందిరం నుండి బయటకు వచ్చి, "ఈ జంతువు మనుష్యుల భాషలో మాట్లాడుటెంతో విచిత్రముగా ఉన్నది" అనుకున్నాడు.మరునాడు జ్యోతిష్కులను పిలిపించి రాత్రి జరిగిన విషయం వారికి చెప్పాడు. వారు "రాకుమారా! ఈ జంతువు మానవ భాషలో మాట్లాడిందా, అయితే దీనినిఅంతఃపురమున ఉండనీయరాదు, పెద్ద కీడు జరుగుతుంది. కాబట్టి మాట్లాడే ఈ లేడిని వెంటనే అడవిలో వదిలేయండి" అన్నారు. భటులు రాకుమారుని ఆజ్ఞతో నన్నీ అడవిలో వదిలారు. ఈ విధంగా నేను మళ్ళీ అడవికి వచ్చాను, నా బంధువులెవరైనా కన్పిస్తారనే ఆశతో తిరుగుతున్నాను. ఒక వేటగాడు నన్ను చూచి వెంటబడ్డాడు. అదృష్టం కొద్ది అతణ్ణి తప్పించుకొని వేగంగా పరుగెత్తి వచ్చి మీ శరణు కోరాను, మీరు నన్నాదరించి నా ప్రాణాలను కాపాడారు" అని తన కథని ముగించింది.
చిత్రాంగుని కథ విన్న ఎలుక, కాకి "త్వరగా వెళదాం పదండి, మనకోసం మందరుడు ఎంతగా విచారించుచున్నాడో?" అన్నాయి. చిత్రాంగుడు, లఘుపతనకము, హిరణ్యకులు మాట్లాడుకొంటూ వస్తుండగా, వారిని వెతుక్కుంటూ మందరుడుఎదురగా వచ్చాడు. హిరణ్యకుడు, మిత్రమా నీవిలా వస్తావనే గబగబా మేమే వస్తున్నాము. తొందరపడి నీవెందుకు వచ్చావు. భూమిపై నీవు గబగబా నడవలేవు కదా! తొందరపడి రావటం దేనికి, దారిలో ఏ శత్రువయినా చూస్తే నీ గతి ఏం అవుతుంది? అనగా తాబేలు "మీ సంగతులు తెలియకనే నేనెంత తల్లడిల్లానో, ఎంతసేపుఎదురు చూసానో, ఎంత దుఃఖించానో తెలుసా? మీలో ఒక్కరైనా రాకపోతిరి, అందువల్ల మనసు ఉండలేక బయలుదేరి వచ్చాను" అన్నది బాధతో.
స్నేహితులు నలుగురు ఇంటిదారి పట్టారు. ఇంతలో వల నుండి తప్పించుకుపోయిన లేడిని వెదుకుతూ వేటగాడు వెనుకనుండి వస్తున్నాడు. అదిచూచి కాకి "అయ్యో కొంపమునిగింది, వేటగాడు వస్తున్నాడు పారిపోండి. ఎవరిని వారు కాపాడుకోండి అనిహెచ్చరించింది. లేడి తన కాళ్ళకు బుద్దిచెప్పి పరుగుతీసింది. ఎలుక ఒక కన్నంలో దూరింది. కాకి చెట్టెక్కేసింది, తాబేలు మాత్రం ఏదారీ తోచక నెమ్మదిగా నడుస్తూ వేటకానికి దొరికింది. వాడు దానిని పట్టుకొని తన వింటి కొనకు కట్టివేసి భుజంపై పెట్టుకొని వెళుతున్నాడు. అది చూచి కాకి, లేడి, ఎలుక మూడు ఎంతో విచారించాయి. వేటగాని నుండి ఎలాగైనా తాబేలును విడిపించడానికి ఒక ఉపాయం ఆలోచించి అమలు చేసాయి. వేటగాడు వచ్చు త్రోవలో చెరువు గట్టున చిత్రంగుడు ఊపిరి బిగపట్టి, కాళ్ళు చాచుకొని చచ్చినట్లు పడిఉంది. కాకి దాని కనులు పొడుచుచున్నట్లు నటించింది.
ఇంతలో వేటగాడు అచటకు వచ్చి, లేడి నిజంగా చచ్చినదని భావించి, తాబేలు కట్టివున్న వింటిని, బాణమును కిందపెట్టి లేడిని తీసుకుపోవుటకు దానిని సమీపించాడు. వెంటనే ఎలుక తాబేలు వద్దకు వెళ్లి దానికి కట్టిన తాడును కొరికి తక్షణం చెరువులోకి పొమ్మని హెచ్చరించింది. మందరుడు వెంటనే చెరువులోకీ, హిరణ్యకుడు కలుగులోకి పోయారు. వేటగాడు దరికి రాగానే కాకి పైకి ఎగిరి 'కావ్ కావ్'మని అరిచింది. లేడి వెంటనే లేచి పిక్కబలం చూపి పరుగు తీసింది. ఈ చిత్రం చూచి వేటగాడు ఆశ్చర్యపోయాడు. వెనుదిరిగి విల్లు బాణాలు పెట్టిన చోటికి వచ్చాడు. వాటి కొనకు కట్టిన తాబేలు మాయమవడం గ్రహించి మరింత ఆశ్చర్యపోయాడు. చేసేది లేక ఇంటిదారి పట్టాడు.
వేటగాడు పోయిన కొంతసేపటికి నలుగురు స్నేహితులు మళ్ళీ కలుసుకొన్నారు. హిరణ్యకుడు పన్నిన చిన్న ఉపాయాన్ని కాకి వల్ల తెలుసుకొని "మిత్రమా! నీ బుద్ది బలంతో నా ప్రాణం కాపాడావు, లేనిచో నా బతుకు నేటితో ముగిసియుండేది. నీ మేలు ఎన్నటికీ మరువలేను" అని ఎంతో మెచ్చుకొంది. హిరణ్యకుడు "మిత్రమా! కష్టంలో కాపాడటమే నా స్నేహధర్మం. నా విధి నేను నిర్వర్తించాను, ఈ మాత్రం దానికి పొగడ్తలెందుకు" అని అన్నది. ఆ తర్వాత ఆ నలుగురు మిత్రులు మరింత స్నేహంగా ఆనందంగా ఎంతోకాలం జీవించారు.
రాకుమారులారా! చెడు సహవాసం సులభంగా దొరుకుతుంది, క్షణంలో విడిపోతుంది. మంచి స్నేహం లభించడం చాలా కష్టం. చెడు స్నేహం ప్రొద్దుటి నీడలా మొదట గొప్పగా తరువాత తక్కువగా వుంటుంది. సజ్జనుల సావాసం సాయంకాలం నీడవలె మొదట్లో కొద్దికొద్దిగా రానురాను పెద్దదిగా వృద్ది చెందుతుంది. మీరు నలుగురు కాకి, తాబేలు, ఎలుక, జింక మొదలగువానిలా కలిసిమెలిసి ఉండండి. జీవితంలో మంచి మిత్రులను సంపాదించుకోండి. మిత్రలాభాన్ని మించిన సంపద మరొకటి లేదు ఈ లోకంలో. ఈనాటికి మిత్రలాభమనే కథలు చాలు, రేపటి నుండి మిత్రాబేదానికి సంబందించిన కథలు చెపుతాను. ఇక విశ్రాంతి తీసుకోండి అని విష్ణుశర్మ రాకుమారులకు చెప్పాడు.
పంచతంత్రములలో మొదటి భాగమైన మిత్రలాభం పూర్తిగా వివరించి చెప్పిన తరువాత విష్ణుశర్మ రాకుమారులకు మిత్రభేదతంత్రాన్ని వివరించసాగాడు. "రాకుమారులారా! ఇది మీరు జాగ్రత్తగా వినండి. స్నేహితుల మధ్య విరోధాన్ని కల్పించి వారిని విడగొట్టడాన్ని "మిత్రభేదం" అంటారు. బలవంతులిద్దరు కలిసి మిత్రులుగా ఉంటే వారి మైత్రికి భంగం కల్గించి తమ అవసరాన్ని సాధించుకోవడానికి బుద్ధిమంతులీతంత్రాన్ని ఉపయోగిస్తారు.
పూర్వం రామాపురం అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో వర్ధమాను అనే వ్యాపారి ఒకడుండేవాడు. అతడు ఇరుగు పొరుగున ఉన్న పట్టణాలకు పోయి వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. సరుకులన్నీ బండ్ల మీద వేసుకొని మరొక నగరానికి వెళ్లుచున్నాడు. అతడెక్కిన బండికి సంజీవకము, నందకము అను రెండు బలిసిన ఎడ్లు కట్టబడ్డాయి. ఆ అడవిదారిలో బండికి కట్టబడిన రెండు ఎద్దులలో సంజీవకం అనే ఎద్దు కాలు మడతపడి బెణికింది. ఆ కారణంతో సంజీవకం నడవలేక కింద పడింది.
అపుడు వర్తమానుడు "నా ఎడ్లలో ఇది చాలా మంచిది. ఎన్నాళ్ళనుండియో నా వద్ద నమ్మకంగా పనిచేసింది. ఎవరికి ఎపుడు ఏ గతి కలుగుతుందో చెప్పలేము. దీనికి అడవిపాలు కావలిసి ఉంది కాబోలు! ఏం చేస్తాం ఈ పక్కనున్న పల్లెటూళ్ళో మంచి ఎద్దునొకదాన్ని కొనుక్కుని రండి" అని నౌకర్లను పంపించి ఇంకొక ఎద్దును తెప్పించుకొనితన బండికి కట్టుకొని, సంజీవకమును ఆ అడవిలోనే వదిలి తన దారిన తాను వెళ్ళిపోయాడు. రెండు మూడు రోజులు గడిచిన తరువాత సంజీవకం మెల్లగా లేచి కుంటుతూ ఆ అడవిలో పచ్చిక పుష్కలంగా దొరికే చోటికి వెళ్లి బాగా మేస్తూ అదృష్టం బాగుండి ఏ క్రూరమృగాల నోటపడకుండా తప్పించుకుంటూ, కాలు బాగుపడి క్రమక్రమంగా కోలుకుంటుంది.
ఒకనాడు అది మేఘం ఉరిమినంత పెద్దగా అడవంతా మారుమ్రోగేలా రంకేసింది. ఆ రంకె విని పక్షులు పారిపోయాయి. జంతువులు హడలిపోయాయి. భూమి అదిరింది. అదే సమయంలో అక్కడికి సమీపంలో ఉన్న మడుగులో నీరు త్రాగాలని వస్తున్న "పింగళకము" అనే సింహం ఆ శబ్దాన్ని విన్నది. దాని గుండెలు దడదడా కొట్టుకున్నాయి. వెంటనే మూర్చపోయి, కొంతసేపటికి తెప్పరిల్లింది. పింగళకం ఆ అడవిలో మృగాలన్నింటికీ రాజు. అది తన మనసులో "నా అంత ధైర్యశాలికే భయం పుట్టేలా అరచిన జంతువు ఏ జాతికి చెందినదో, ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చినదో. ఇంతకు మునుపెన్నడూ ఇలాంటి శబ్దం వినలేదు. గుండె దద్దరిల్లేలా అరిచిన ఆ జంతువెంత పెద్దదో!" అని తలిచి గడగడ వణుకుతూ ముందుకు అడుగు పడక అక్కడే నిలబడింది.
పింగళకుని వద్దవిచిత్రుడు అనే నక్క మంత్రి ఉన్నాడు. మంత్రికి ఇద్దరు కుమారులున్నారు. వారు "కరటకుడు, దమనకుడు" అను పేర్లు గల రెండు నక్కలు. వారిద్దరూ రాజుగారి అవస్థ చూచి, తమకు కూడా ఎంతో భయం కలిగినా ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా ఒక మూల నక్కినారు. అపుడు దమనకుడు కరటకునితో "ఒరే కరటకా! మన రాజు చూడు ఎలా వణుకుతున్నాడో! మనం తిన్నగా ఆయన దగ్గరకుపోయి ధైర్యం చెప్పి భయాన్ని పోగొట్టి ఆయన అభిమానం సంపాదిద్దాము" అన్నాడు.
అందుకు కరటకుడు "మనకెందుకురా! పిలువని పేరంటం! చెప్పని ఒక్క పొద్దు మనం ఆయనకు నౌకర్లము కాము కదా! ఆయన దయ వల్ల బతికే సేవకులెంతో మంది ఉన్నారు. ఆయన మంచీ చెడులు చూడాల్సిన పని వాళ్ళది. దారిన పోయే శనిని ఎవరైనా తెచ్చి తలపై పెట్టుకుంటారా? అక్కడక్కడా దొరికే ఆహారం కడుపునిండా తిని హాయిగా పడి ఉండక మనకెందుకు వచ్చిన గొడవ? పిలువని పేరంటానికి పోనేకూడదు. పోయినచో చెక్కముక్క పీకిన కోతిలాగా చచ్చిపోతాము. ఆ కథ చెబుతాను జాగ్రత్తగా విని అని కథ చెప్పడం ప్రారంభించింది.
ఒకఊళ్ళో ఒక పెద్ద మఱ్ఱిచెట్టు ఉంది. ఆ చెట్టు మీద చాలా కోతులున్నాయి. చెట్టుకింద కొందరు వడ్రంగులు దూలం కోస్తున్నారు. అది సులభంగా చీలాలని రంపం బాగా ఆడాలని వారు కోసిన భాగంలో కర్రను మేకుగా చెక్కి రెండు చీలికల మధ్యన ఉంచారు. మధ్యాహ్నం కాగానే వారు అన్నం తినటానికి వెళ్ళిపోయారు. వారటు వెళ్ళగానే ఒక ముసలి కోతి చెట్టు దిగి వచ్చి దూలం మీదెక్కి కూర్చుంది. దూలం చీలికలో ఒక కాలు బయటికొక కాలు పెట్టి మేకును బలంగా లాగింది. కొంతసేపటికి ఆ కొయ్యమేకు ఊడి రెండు చీలికలు టంగున కలుసుకొన్నాయి. దూలం మధ్యలో కాలుపడి నలిగింది. అది లబలబ మొత్తుకుంటూ కొంతసేపటికి ప్రాణాలు విడిచింది.
కాబట్టి అనవసరమైన పనులకు పోరాదు, మన దారిన మనం వెళదాం రా అని అన్నది. ఆ మాటలకు దమనకుడు "కరటకా! నీకు తెలియదురా! మనం మిత్రులకు మేలు చేయాలన్నా, శత్రువులకు కీడు చేయాలన్నా రాజుగారి అండ తప్పక ఉండాలి. రాజాశ్రయం లేని బతుకు బతుకే కాదు. బతికిన నాలుగు రోజులు రాజాలాగా దర్జాగా బతకాలిరా! మంచి చెడు తెలుసుకోలేని వాడు పశువుతో సమానం కదా!" అని చెబుతూ ఉంటే కరటకుడు "చాలు చాలు నీ మాటలు ఆపేసెయ్" మనమేమన్నా ఆయన మంత్రులమా? సలహాలు చెప్పడానికి! ఇంతకు ఏం చేద్దాం అంటావ్! చెప్పు" అని అడిగింది.
అపుడు దమనకుడు "బుద్ధిగా శ్రద్ధగా చదువుకొన్నవాడు ప్రయోజకుడౌతాడు, అట్టి వాణ్ణి రాజు గౌరవిస్తాడు. ఆ గౌరవంతో రాజ్యతంత్రాలు తెలుసుకోవచ్చు. క్రమక్రమంగా ప్రధాని కూడా కావచ్చు. కాబట్టి నేనిప్పుడే పోయి అతని భయం తీర్చి మన్నన పొంది వస్తాను. నేను వచ్చేదాకా నీవిక్కడే కూర్చో, వెంటనే వస్తాను" అని చెప్పింది. అపుడు కరటకుడు సరే వెళ్లిరా, నీకు జయం కలుగుతుంది అని అన్నది.
దమనకుడు సింహం వద్దకు వెళ్లి నమస్కారం చేశాడు. పింగళకుడు "దమనకా! క్షేమంగా ఉన్నావా? ఏం పని మీద వచ్చావు?" అనిఅడిగింది. అపుడు దమనకుడు "ప్రభూ! తమ దయవల్ల నేను క్షేమంగానే ఉన్నాను. అలా వెళ్తూ తమరేదో భయభ్రాంతులుగా ఉండి విచారిస్తూ ఉంటే కనుక్కొని వెళదామని వచ్చాను. తమ వంటి పరాక్రమవంతులను భయపెట్టినవిషయమేమిటో సెలవివ్వండి" అని అన్నది. అపుడు పింగళకుడు దమనకునితో "ఏం లేదోయ్! దప్పిక అయింది, ఆ మడుగు వద్ద నీళ్ళు తాగుదామని బయలుదేరాను. పిడుగు పాటుగా ఏదో శబ్దం వినిపించింది. నీవు కూడా వినే ఉంటావు. ఇంతకు ముందే అడవంతా దద్దరిల్లేలా, జంతువుల గుండెలు పగిలే విధంగా ఒక అరుపు వినిపించింది. దాన్ని గురించే ఆలోచిస్తున్నాను" అని అన్నాడు.
"అదా సంగతి, ప్రభూ! నేనిప్పుడే వెళ్లి ఆ శబ్దం చేసిందెవరో చూచి వచ్చి తమకు విన్నవిస్తాను. "పిట్ట కొంచెం-కూత ఘనం" అంటారు గదా! చిన్న జంతువుకైనా పెద్ద నోరు ఉండవచ్చు. అదేదో పెద్ద జంతువైతే మృగాలన్నీ పరిగెత్తి తమ వద్దకు వచ్చేవి కదా! చప్పుడు విని భయపడినా, నిదానించి నిజానిజాలు తెలుసుకోగల్గటం బుద్ధిమంతుల లక్షణం గదా! మీకొక కథ చెపుతాను వినండి" అని దమనకుడు ఈ కింది కథ చెప్పడం ప్రారంభించాడు.
ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి వివిధరకాల మాంసాలు తినడం మహా ఇష్టం. తన తెలివితేటలతో రకరకాల మాంసాలు సంపాదించుకొని తినేది. అది స్వయంగా పెద్ద జంతువుల్ని చంపలేదు. కాబట్టి చనిపోయిన కళేబరాలను కాని, సింహమో, పులో చంపి తిని వదిలిన మంసాలను ఆరగిస్తూ ఉండేది. ఒకనాడు దానికి ఆహారం దొరకలేదు. ఆహారం వెదుకుచూ బయలు దేరి ఒక యుద్ధభూమికి చేరింది. అక్కడ ఎన్నో శవాలు మానవులవి, గుర్రాలవి, ఏనుగులవి కనబడ్డాయి. వాటిని చూచి తన పంట పండిదని నక్క ఎంతగానో పొంగిపోయింది. దాని ఆనందానికి హద్దులు లేవు.
ఇంతలో దానికి "ఢం-ఢం, గర్-గర్" అనే శబ్దాలు వినిపించాయి. అదేదో క్రూర జంతువు కోపంతో అరిచినట్లు తలిచి భయపడింది. ఒక బండ పక్కన దాగి కొంతసేపు ఆగి చూచింది. ఏ జంతువూ అటుగా రాలేదు. నక్క కొంచెం ధైర్యం చేసి ముందుకు వచ్చి ఒక చెట్టు చాటున నక్కి చూసింది. అక్కడ ఒక చెట్టు కింద యుద్ధభేరి ఉంది. గాలికి చెట్టుకొమ్మ ఒకటి దానికి తగలటం వల్ల చప్పుడైందని గ్రహించింది. "ఓరి దేవుడా! ఈ భేరి నన్నెంతగా హడలగొట్టిందీ! ముందు దీని పని పట్టా"లని దానిపై గల చర్మాన్ని కొరికి తిన్నది. తర్వాత అక్కడున్న ఆహారాన్ని కడుపారా కొన్నాళ్ళు ఆరగించింది.
మహారాజా! నిజము తెలుసుకోక అదేదో జంతువని భయపడి ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోతే చేజిక్కిన ఆహారం పోగొట్టుకొనేదే కదా! కాబట్టి శబ్దం విన్న మాత్రాన భయపడటం మంచివారి లక్షణం కాదు. మీరిక్కడే ఉండండి, నేనిప్పుడే వెళ్లి అదేమిటో తెలుసుకొని వస్తాను అని కరటకుని వద్దకు వెళ్లి విషయం తెలియజేయగా, కరటకుడు పరాధికారం పైన వేసుకుంటున్నావ్. కుక్క పని గాడిద చేయబోయి తన్నులు తిని మరణించింది. ఆ కథ చెపుతాను విను అని కథ చెప్పటం ప్రారంభించింది.
ఒక గ్రామంలో "ధావకమల్లుడు" అనే చాకలి ఉండేవాడు. అతడొక గాడిదని, కుక్కని పెంచుతున్నాడు. గాడిద చాకిరేవుకి బట్టలన్నీ మోస్తుండేది. అందువలన గాడిదదే ఎక్కువ కష్టం అని దానికి ఎక్కువ తిండి పెట్టేవాడు. కుక్కేముంది? దున్నలా తిని పడుకోడమే కదా! అని చాకలికి అనిపించింది. అందువలన కుక్కకి సరిగా ఆహారం పెట్టడం మానేసాడు. గాడిదని బాగా మేపుతున్నాడు. యజమాని చూపుతున్న ప్రవర్తనకు కుక్కకు చాలా కోపం వచ్చింది.
ఒకరోజు అర్థరాత్రి చాకలి గుర్రుపెట్టి నిద్రిస్తున్న సమయంలో ఒక దొంగ వాని ఇంట్లో ప్రవేశించి బట్టలన్నీ మూటగట్టుకొనుచున్నాడు. అది చూచి గాడిద కుక్కతో "మిత్రమా! చూశావా! దొంగ ఇంటిలో దూరి మనయజమాని సొమ్మును, ఊరి వారి బట్టలను కాజేయుచున్నాడు" అన్నది. ఆ మాటలను వినిన కుక్క "నేనెప్పుడో చూశాను. కాని నాకు కడుపు నిండాతిండి కూడా పెట్టకుండా మాడుస్తున్న మన యజమానికి తగిన శాస్తి జరగాలి. అందుకే నేను మొరగను" అన్నది. వెంటనే గాడిద "నీవు మొసగాడివి, నీ పని నేను చేయాలేననుకున్నావా? నాకూ నోరుంది. నేనూ అరవగలను చూడు, మన యజమానిని మేలుకొలిపి దొంగను పట్టుకొనేలా చేస్తాను" అని చెప్పి పెద్దగా ఒండ్రు పెట్టింది. దొంగ చేతికి చిక్కిన సొమ్ము, బట్టల మూట తీసుకొని పారిపోయాడు.
రోజంతా రెక్కలు నొప్పులు పుట్టేలా బట్టలుతికిన బడలికతో గుర్రు పెట్టి నిద్రిస్తున్న చాకలి తనకు నిద్రాభంగం కలిగిందన్న కోపంతో లేచి గాడిదను పెద్ద కర్రతో చావబాదాడు. ఆ దెబ్బలకు గాడిద మరణించింది. కాబట్టి "పరాధికారం పైన వేసుకొని రాజోద్యోగులెవరో చేయాల్సిన పనిని నీవు నిర్వర్తించడం నాకు నచ్చలేదు. నీవు నా సోదరుడవు కాబట్టి చెప్తున్నాను, తర్వాత నీ ఇష్టం" అని కరటకుడు దమనకునితో చెప్పాడు. కరటకుడు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి దమనకుడు కరటకునితో పాటు సంజీవకమును సమీపించి ఈ విధంగా మాట్లాడాడు.
"ఈశ్వరుని వాహనమైన నందీశ్వరుని వంటి ఓ వృషభరాజా! నీకు నమస్కారం. ఈ అడవంతటికీ రాజు "పింగళకుడు" అనే సింహం. మేమిద్దరం ఆ రాజుగారి ప్రతినిధులం. ఆయన ఆజ్ఞ లేకుండా ఈ అడవిలో ఇంతవరకూ ఏ మృగం స్వేచ్ఛగా తిరగటానికి వీలులేదు. ఈ రోజు నీ అరుపు విని రాజుగారు ఎవరో కొత్తగా వచ్చిన వారు కాబోలు, మన విషయం వారికి తెలిసి ఉండదు. మీరు వెళ్లి నచ్చజెప్పి మన వద్దకు తీసుకురండి. మేము వారిని సన్మానించి వారితో స్నేహం చేస్తా"మని మమ్ములను పంపారు. తమరు మా వెంట వస్తే మేము మిమ్ములను వారికి పరిచయం చేసి స్నేహం చేయిస్తాము" అని పలికింది. దమనకుని మాటలు విన్న సంజీవకం ఆలోచించి దిక్కులేకుండా అడవిలో తిరుగుతూ ఏ పులినోట్లోనో పడే కంటే రాజదర్భారులో చేరి రాజుగారి స్నేహితునిగా ఉండడం మంచి"దని సరే వెళ్దాం పదండి అని వారి వెంట బయలుదేరి పింగళకం వద్దకు వెళ్ళింది.
సంజీవకం కరటకునితో కబుర్లాడుతూ నెమ్మదిగా వస్తుంటే దమనకుడు ముందుగా గబగబా పింగళకుని వద్దకు పరుగెత్తి "మహారాజా! మనకు భయం కలిగేలా శబ్దం చేసిందెవరో కాదు. "సంజీవకం" అనే వృషభేంద్రుడు. అతడెంతో మంచివాడు, తెలివైన వాడు, బలవంతుడు. మీకు మంత్రిగా ఉండతగిన వాడు. సెలవైతే వెళ్లి అతణ్ణి తమ సన్నిధికి తీసుకొస్తాను" అని చెప్పింది. పింగళకుడు అలాగే తీసుకొనిరా అన్నాడు.
దమనకుడు సంజీవకాన్ని తీసుకువచ్చి పింగళకుని ముందు నిలిపాడు. సంజీవకం మృగరాజునకు నమస్కారం చేసి, మహారాజా! మీ అనుమతి లేకుండా నేనీ అడవిలో ప్రవేశించాను. ఇష్టానుసారంగా ప్రవర్తించాను. ఇది నేను తెలియక చేసిన తప్పు. కాబట్టి నన్ను క్షమించండి" అని అనగానే పింగళకుడేంతో సంతోషించాడు. "సంజీవకా! భయపడకు. నేటి నుండి నీవు నా మిత్రుడవు, అంతే కాదు ఇప్పటినుండి నీవు నా మంత్రిగా ఉండు. నీ ఇష్టానుసారం ఈ అడవంతా తిరుగు, నా హితుడవుగా సచివుడుగా సర్వ మర్యాదలు అందుకో" అన్నాడు.
ఆనాడు మొదలుకొని పింగళకుడు పలువిధాలగాకొనియాడుతూ రోజురోజుకూ అతనితో స్నేహాన్ని పెంచుకొని వానిని ఆదరిస్తూ తన బంధుమిత్రులను సరిగా చూడక అశ్రద్ధ వహించటం మొదలు పెట్టాడు. తమ రాజు ఇలా అవడానికి వారంతా ఎంతాగానో విచారించారు. కరటక దమనకులకు కూడా రాజుగారు సంబంధం చాలా వరకు తగ్గింది. ఒకనాడు కరటకుడు "ఎద్దును తెచ్చి గద్దెనెక్కించింది నేను. అది మరచి సంజీవకం తనకు మేలు చేశామనే విశ్వాసం కూడా లేకుండా మనలను నిరుత్సాహపరుస్తుంది. పింగళకం కూడా గౌరవించడం లేదు సరికదా, మాట్లాడాలన్నావారిరువురూ ఇంకొకరికి అవకాశం ఇవ్వట్లేదు. మనకే కాదు మునుపటి రాజమిత్రులకూ, బంధువులకు కూడా మనం చేసిన పని వల్ల కష్టమే కలిగింది. నేను ముందుగానే "మనకెందుకంటే నీవు వినలేదు. దీనికంతకు నీవే కదాకారణం!" అని దమనకునితో అన్నాడు.
దానికి దమనకుడు "తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది" అనే సామెత నా విషయంలో నిజమైంది. ఇలా జరుగుతుందని నేను మాత్రం కలగన్నానా? నేను పొందతలిచిన మంత్రి పదవి సంజీవకంనకు దక్కింది. నా పాచిక పారలేదు. చేతులారా చేసుకున్న అపరాధానికి నక్క, సన్యాసి దేవశర్మల మాదిరిగా నేనూ మోసపోయాను. నీకా కథ చెపుతాను విను అనిదమనకుడు కథ చెప్పటం ప్రారంబించాడు.
"పూర్వం ఒక చోట బాగా బలిసిన రెండు పొట్టేళ్ళు పోట్లాడుకొంటున్నాయి. అవి దూరంగా వెనుకకు వెళ్ళిపరుగున వచ్చి ఢీ కొనడం మొదలుపెట్టాయి. రెండూ బాగా బలిసి ఉండటం చేత ఒకదానినొకటి తీసిపోక పోట్లాడుకొనుచున్నాయి. వాటి తలలు పగిలి అవి రెండు ఢీ కొన్నచోట రక్తం గడ్డకట్టింది. ఆ పోట్లాట చూచిన ఒక నక్క ఆ నెత్తురు చూడగానే దానికి నోరూరింది. పొట్టేళ్ల వెనక్కి దూరంగావెళ్ళిమరలా వచ్చి ఢీ కొనేలోగా ఆ రక్తాన్ని నాకేయాలనుకొంది. అలా నాకుతుండగా రెండు పొట్టేళ్ళు రివ్వున వచ్చి ఢీ కొన్నాయి. వాని తలల తాకిడికి మధ్యలో ఉన్ననక్క నలిగి చచ్చింది. దురాశ నక్క ప్రాణాలు తీసింది. మంత్రి పదవికై గల ఆశతో నేను మోసపోయాను" అని దమనకుడు కరటకునితో చెప్పాడు. అంతేకాకుండా "దేవశర్మ" అనే సన్యాసిని మోసగించిన"ఆషాడభూతి" కథను చెపుతాను విను అని కథ చెప్పటం ప్రారంభించింది.
పూర్వం ఒక ఊరిలో దేవశర్మ అనే సన్యాసి ఒకడుండేవాడు. అతడు బాగా చదువుకున్నవాడు, అనేక విషయాలు తెలిసినవాడు. చక్కగా ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఊళ్ళన్నీ తిరిగి ప్రజలకు వేదాంతం బోధిస్తూ ఉండేవాడు. భక్తుల కథలు, దేవుని కథలు వినిపిస్తూ ఉండేవాడు. ఆయన బోధనలు వినడానికి జనులు తండోపతండాలుగా వచ్చేవారు. వారు భక్తితో దేవశర్మకి పండ్లు, ఫలాలు, దక్షిణ తాంబూలాలు సమర్పించేవారు. కానుకలు తెచ్చిన వారితో దేవశర్మ "ఎందుకు నాయనా ఇవన్నీ, ఎందుకు తల్లీ మీకీ శ్రమ" అని పైకి పలుకుతూ లోలోపల సంతోషిస్తూ వాటిని స్వీకరించేవాడు. పండ్లు, ఫలాలు తిన్నన్ని తిని కొన్నిటిని భక్తులకు ప్రసాదంగా పంచేవాడు. డబ్బు మాత్రం జాగ్రత్తగా తన వద్ద ఉన్న బొంతలో దాచేవాడు. ఎప్పుడూ ఆ బొంతను పైన కప్పుకొని కూర్చొనేవాడు.
ఒకనాడు "ఆషాడభూతి" అనే యువకుడు ఈ విషయం కనిపెట్టి ఆ సన్యాసి వద్ద బొంత కాజేయాలని ఒక ఉపాయం పన్నాడు. అతడు దేవశర్మ వద్దకు వచ్చి మాయమాటలు చెప్పి అతనిని నమ్మించి అతని వద్ద శిష్యునిగా చేరి ఎంతో వినయ విధేయతలతో సేవలు చేయనారంభించాడు. కొన్నాళ్ళకు సన్యాసికి శిష్యుని మీద బాగా నమ్మకం కుదిరింది. తానెక్కడికి పోయినా శిష్యుని వదిలి వెళ్ళేవారు కాదు.
ఒకనాడు గురుశిష్యులిద్దరూ ఒక గ్రామం వెళ్ళారు. మరునాడు తిరిగి తమ ఊరు వస్తున్నారు. కొంతదూరం వెళ్ళగానే ఆషాడభూతి "గురువుగారూ! ఎంత అపచారం జరిగింది. రాత్రి మనం నిద్రించిన ఇంటివారి చీపురు పుల్ల ఒకటి నా సంచికంటుకొని వచ్చింది. అక్కడ నేనది గమనించలేదు. ఎంత ఘోరం జరిగిందో చూడండి. గడ్డి పరకైనా పరుల సొమ్ము పాము వంటిది కదా! పరధనాన్ని కాజేయటం కన్నా పాపం లేదు అని తమబోటి పెద్దలు చెపుతారు కదా! తమరు సెలవిస్తే నేనిప్పుడే వెళ్లి ఈ సొమ్మును ఆ ఇంటివారికి ఇచ్చివస్తా"నని వెనకకు పరుగెత్తి దారిలో కొంతసేపు గడిపి తిరిగి వచ్చాడు.
అప్పుడు గురువుగారు "శిష్యా! నీ బుద్ధి మెచ్చుకోదగినది. ఇతరుల సొమ్ము గడ్డిపోచైనా అంటుకోరాదనే అభిప్రాయం గల నీ వంటి శిష్యుడు లభించటం నిజంగా నా అదృష్టం" అని పొగిడాడు. ఇంతలో సాయంకాలం అయింది. సంధ్యావందనం చేసుకొనే నిమిత్తం దేవశర్మ తన బొంతను, ఇతర సామగ్రిని ఆషాడభూతి చేతికి ఇచ్చి "నాయనా! వీనిని జాగ్రత్తగా చూస్తూ ఇక్కడే కూర్చొనుము. నేను చెరువులో స్నానం చేసి సంధ్యావందనం ముగించుకొని వస్తాను" అని చెప్పి వెళ్ళాడు. అదే మంచి సమయమని భావించి ఆషాడభూతి బొంతతో సహా పారిపోయాడు.
కొంతసేపటికి దేవశర్మ గట్టుపైకి వచ్చి చూడగా ఆషాడభూతి కనపడలేదు. "శిష్యా ఆషాడభూతీ! ఎక్కడున్నావు నాయనా? త్వరగా రా నాయనా!" అని గొంతు చించుకొని కేకలు వేశాడు. ఎంతగా అరిచి గీ పెట్టినా ఎంత గాలించినా శిష్యుని జాడ తెలియలేదు. మంచివాడని ఉత్తముడని శిష్యుణ్ణి నమ్మి ఎన్నాళ్ళగానో దాచుకున్న ధనమంతా ఈ దుర్మార్గునికి అప్పగించానే" అనిదేవశర్మ ఎంతగానో దుఃఖించాడు.
ఈ లోకంలోఆషాడభూతి వంటి నమ్మక ద్రోహులుంటారు. కాబట్టి తొందరపడి ఎవరినీ నమ్మరాదు. తాడెక్కేవాడికి తల తన్నేవాడు ఉంటాడు. దానము భోగము ఎరుగని లోభివాడు కూడబెట్టిన ధనం చివరకు దొంగలపాలై తీరుతుంది" అని ఈ కథ సారాంశం.
దమనకుని వలన పై కథలు విన్న కరటకుడు "ఈ కథలు సరే! మరి నీవిప్పుడు ఏంచేయదలచావు? అని అడిగాడు. దానికి దమనకుడు "వెంటనే సంజీవక-పింగళకుల స్నేహం చెడగొట్టాలి, దానికేదైనా ఉపాయం ఆలోచించాలి. ఎంత కష్టమైన పనైనా ఉపాయంతో ఇట్టేసాధించవచ్చు. పూర్వం ఒక కాకి ఉపాయంతో పామును చంపించింది. ఆ కథ చెపుతాను విను అని కథ చెప్పటం ప్రారంభించింది.
నర్మదానది తీరానఒక చెట్టు మీద కాకి జంట ఒకటి నివశిస్తున్నది. ఆ చెట్టుకింద పుట్టలో ఒక పాముంది. కాకి దంపతులు ఆహారం కోసం వెళ్ళగానే పాము చెట్టెక్కి వాని పిల్లలను గ్రుడ్లను తినివేస్తుండేది. తమకంటే బలముగల పాము నేమియు చేయ జాలక ఆ కాకి జంట విచారంతో కాలం గడపసాగింది. ఒకనాడు ఆ కాకులకు స్నేహితుడైన నక్క వాని వలన సంగతి తెలుసుకొని "పూర్వం చేపలను మోసగించి తిన్న కొంగను ఉపాయం పన్ని మోసంతో ఒక ఎండ్రకాయ కొంగను చంపింది. మీకా కథ చెపుతాను విను అని కథ చెప్పటం ప్రారంభించింది.
ఒక చెరువులో చాలా చేపలున్నాయి. ఒక కొంగ ఆ చేపలను ఎలాగైనా చంపి తినాలనుకొంది. ఆ చెరువులో వాలగానే తమను వేటాడి తినే పక్షి వచ్చిందని చేపలన్నీ దూరంగా పరుగెత్తి నీట మునిగేవి. కొంగ తలవంచి కండ్లు మూసి నాలుగు రోజులు తపస్సు చేస్తున్నదానిగా నటించసాగింది. చేపలు దగ్గరకు వచ్చినా ముట్టుకోలేదు. చేపలకుదాని వింత ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది.
ఆ చెరువులో నివసిస్తున్న ఒక ఎండ్రకాయ కొంగను చూచి "కొంగబావా! కాళ్ళ దగ్గరకి వచ్చిన చేపలనైనా ముట్టక నీవెట్లు బతికెదవు? ఇక్కడ ఒంటి కాలుపై నిలిచి కనులు మూసుకొని నీవేమి చేయుచున్నా"వని అడిగింది. అపుడా కొంగ జీవహింస మహాపాపమని పెద్దలు చెప్పగా విన్నాను. ఇంతకాలం తెలియక ఎన్నో చేపలను తిన్న పాపం పోవాలని తపస్సు చేయుచున్నాను. మాంసాహారం పూర్తిగా మానేశాను. ఆకు, అలం తిని నీరు తాగి కాలం గడుపుతున్నాను. అందుకే మీ వంకైనా చూడటం లేదు" అని చెప్పింది.
కొంగ మాటలను చేపలు నమ్మాయి. ఆనాటి నుండి అవి నిర్భయంగా కొంగ చుట్టూ తిరిగేవి. కొంగ వాటికెన్నో కబుర్లు, కథలు, మరెన్నో విషయాలు చెప్పసాగింది. తన మీద వాటన్నిటికీ గురి కుదిరేలా ప్రవర్తించేది. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు కొంగ కన్నీరు కారుస్తూ చేపలతో "మీకు కష్టకాలం రానున్నది. నిన్న జాలరులుచెరువుని చూచి చెరువులో నీరు తగ్గింది, నాలుగు రోజుల తర్వాతవచ్చి వలలు పన్ని నీరు చిమ్మి చేపలను పట్టుకుందామని చెప్పుకుంటే విన్నాను. నాకేముంది, ఎక్కడికైనా క్షణంలో ఎగిరిపోగలను. మీ ప్రాణాలెలా కాపాడాలని ఆలోచిస్తున్నాను. ఇంతలో ఒక ఉపాయం తట్టింది. ఇక్కడికి సమీపంలో ఆ కొండ అవతల ఒక పెద్ద సరస్సు ఉంది. అక్కడకు మిమ్ములను నా నోట కరుచుకొని పైకెగిరి వేగంగా వెళ్లి ఆ సరస్సులో దింపి వస్తాను. అంతకంటే నేను చేయగల సహాయం ఏదీ లేదు, తర్వాత మీ ఇష్టం" అని చెప్పింది.
చేపలు దాని మాటలు నమ్మాయి. తమనెలాగైనా కాపాడమన్నాయి. నాటి నుండి కొంగ తడవకు నాలుగైదు చేపలను ముక్కున కరచుకొని కొండవైపుగా వెళ్లి అక్కడొక పెద్ద బండమీద వాటిని పెట్టి తినసాగింది. తమ స్నేహితులందరూ క్షేమంగానే ఉన్నారని కొంగ చేపలకు చెపుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు చేపలతో పాటు ఎండ్రకాయ కూడా తననూ సరస్సులో చేర్చమని కోరింది. కొంగ సంతోషంగా సరే అని చేపలను ముక్కున కరుచుకొంటాను. నీవు గట్టిగా నా మెడ పట్టుకో, నేను విడవమనగానే విడిచేయమని చెప్పింది. కొంగ మెడ చాపింది, ఎండ్రకాయ దాని మెడ గట్టిగా పట్టుకుంది.
కొంగ పైకెగిరి తాను చేపలను తినే బండ దగ్గరకు వచ్చింది.ఎండ్రకాయకు అనుమానం వచ్చి వాలింది. అటూ ఇటూ చూసింది. అక్కడ ఎలాంటి చెరువుగాని, సరస్సుగాని కనపడలేదు. పైగా కొండ వద్ద బండ మీద చేపల పొలుసులు, వాటి ఎముకలు దానికి కనిపించాయి. ఇన్నాళ్ళూ కొంగ చేసిన మోసం దానికి అర్థం అయింది. "కొంగజపం"అంటే ఇదే కాబోలు. దొంగ కొంగ తీపి మాటలు చేపలన్నింటినీ మోసగించి పొట్టన పెట్టుకుంది. నేను పట్టు వదిలితే నన్ను పట్టుకొని చంపి తినక మానదు. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదు. దీని మెడ నా కొండెలతో కత్తిరించి చంపేస్తా"నని ఎండ్రకాయ కొంగ గొంతు పట్టి కొరికి చంపింది. కొంగ పీడా వదిలించుకొని నెమ్మదిగా చెరువు వద్దకు చేరి బతికి బయట పడింది.
పాపం కొంగ చేపలను తినడానికి పన్నిన ఉపాయం దానికి అపాయంగా మారింది. కాబట్టి ఉపాయం పన్నేటపుడు దానివల్ల ఎటువంటి ముప్పు జరగకుండా జాగ్రత్త వహించాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి. మంచి ఉపాయం ఆలోచించి మీకు శత్రువైన పామును చంపేయండి" అని నక్క సలహా ఇచ్చింది.
కాకులు నిదానంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాయి. కాకులు నివశిస్తున్న దగ్గరలో రాకుమార్తె ఉద్యానవనముంది. ఆ సమయమున రాకుమార్తె చెలికత్తెలతో కోనేటి స్నానం చేస్తుంది. ఇదే మంచి సమయమని భావించి మగకాకి వెళ్లి ఆమె కంఠహారాన్ని ముక్కున కరుచుకొని పైకెగిరింది. రాజభటులు అది చూచి, కాకిని వెంబడించారు. కాకి నెమ్మదిగా వారికి చిక్కక ఎగురుచుండగా ఆ హారాన్ని పాము పుట్టలో పడవేసింది. అది గమనించిన రాజభటులు పుట్ట తవ్వి, పామును చంపి కంఠహారాన్ని తీసుకొని వెళ్ళారు.
ఈ విధంగా మంచి ఉపాయంతో కాకులు తమ శత్రువుని తేలికగా చంపి హాయిగా జీవించాయి. దేహబలం కంటే బుద్ధి బలం గొప్పది. బుద్ధిలేని వానికి ఎంత బలమున్నా ఏం లాభం? ఏనుగు కొండంత ఉంటుంది. చిన్న మావటివాడు దానిని లొంగదీస్తున్నాడు కదా! ఉపాయశాలి అయిన కుందేలు మృగరాజైన పెద్ద సింహాని చంపింది. అనగానే కరటకుడు ఏమేమి? సింహాన్ని కుందేలు చంపిందా? అదెలా జరిగింది? ఆ కథేంటో నాకు వినిపించు అనిన అడిగాడు. అపుడు దమనకుడు కథ చెప్పటం ప్రారంభించింది.
ఒక అడవిలో మదోత్కటమనే బలమైన సింహం నివశిస్తుంది. అది చాలా పొగరుబోతు, ఎంతో పౌరషం కలది. తన పంతం నెగ్గాలనే పట్టుదలగల క్రూర జంతువు. ఆ అడవిలో అది ఆడింది ఆట, పాడింది పాట. దాన్ని ఎదురించే బలం ఏ మృగానికి లేదు. కాబట్టి అది తనకంటే బలంగలవారు లేరని గర్వంతో ప్రతి జంతువునూ భయపెడుతూ, తన కంటికి కనిపించిన జంతువునల్లా చంపటం మొదలుపెట్టింది. సింహం కనపడిందంటే చాలు అడవిలోని జంతువులన్నీ ప్రాణాలు అరచేత పెట్టుకొని పారిపోయేవి.
ఒకనాడవన్నీ కలిసి ఒక తీర్మానం చేశాయి. రోజుకొకరు చొప్పున వంతు వేసుకొని సింహానికి ఆహారంగా వెళ్ళాలనినిర్ణయించుకున్నాయి. మృగరాజుగారు దయతో తమ ప్రార్థన అంగీకరించి, తమ ఇష్టం వచ్చినట్లు జంతువులన్నింటినీ చంపివేయకూడదని ఆ తీర్మానం. అవన్నీ కూడపలుక్కుని కలిసి కట్టుగా వెళ్ళి ఆ సంగతిని సింహానికి తెలియజేశాయి. "రోజూ ఇలా అవసరమున్నా లేకున్నా కనపడ్డ జంతువులన్నింటినీచంపితే ఈ అడవిలో జంతువులన్నీ కొద్ది రోజుల్లోనే నశిస్తాయి. తరువాత ఆకలితో నేనూ అవస్థ పడవలసి వస్తుంది" అని మనసులోనే అనుకొని అందుకు అంగీకరించింది. వేటాడకుండానే తన వద్దకు ఆహారం వస్తుందని, మృగాల మొర ఆలకించి సరే అన్నది. ప్రతిరోజూ మధ్యాహ్నంఅయ్యేసరికి మీలో ఒకరునాకు ఆహారంగా నాముందు నిలబడాలి, ఆలస్యం చేసినా, మతిమరుపు చూపించినా మీ అంతు చూస్తాను. మాటంటే మాటే గుర్తుంచుకోండి అని గద్దించింది.
ఆ రోజు నుండి మృగాలు మాట ప్రకారం వంతుల వారీగా రోజుకొకరు చొప్పున సింహానికి సకాలంలో ఆహారంగా వెళుతున్నాయి. సింహం వేట మానేసింది. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకనాడు ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. చక్కగా ఆలోచించగలదు. ఆనాడు ఎలాగైనాఆపద నుండి బయట పడాలనిమంచి ఉపాయం ఆలోచించింది. అన్ని జంతువుల మాదిరగా కాకుండా కుందేలు చాలా ఆలస్యంగా సింహం దగ్గరకు వచ్చింది. అప్పటికే వేళ దాటిపోతున్నప్పటికీ ఆహారంగా ఏ జంతువూ రాకపోయేసరికి సింహం మండిపడుతూ ఉంది. దానికి తోడు ఆకలి బాధ ఎక్కువైంది. సింహం కోపంతో గర్జిస్తుండగా కుందేలు మెల్లమెల్లగా దాని వద్దకు చేరింది. సింహం దానిని చూచి "ఓరీ!నీవా! నీకెంత పోగరురా! ఎందుకింత ఆలస్యం చేశావ్?" అని పెద్దగా గద్దించింది.
కుందేలు గజగజా వణుకుతూ "మహారాజా! నేను మామూలు సమయానికే బయలుదేరి గబగబా పరిగెత్తి వస్తున్నాను. కాని దారిలో ఇంకొక సింహం కనిపించింది. తానే అడవి అంతటికీ రాజునని, తన మాటకి ఎదురు చెప్పేవాళ్ళు లేరని, నన్ను తనకి ఆహారం అవమని అడుగు ముందుకు వేయనీయక అడ్డం తగిలి నన్ను ఆపేసింది. నేను అతి కష్టం మీద దానిని ఒప్పించి "మా రాజును నీ వద్దకు తీసుకొని వస్తా"నని ప్రమాణం చేసి తమ వద్దకు పరుగెత్తుకు వచ్చాను. పొగరుతో కన్నూ, మిన్నూ కానరాక తమను నిందించిన ఆ సింహానికి తగిన బుద్ధి చెప్పండి. పాపం తమరు ఎంతో ఆకలిగా ఉన్నారు, ముందు నన్ను ఆరగించండి" అన్నది కుందేలు.
సింహం గట్టిగా గర్జించి కనులెగరేసి "ఆ పొగరుబోతు ఎక్కడుందో చూపించు ముందు, నిన్ను నిందిస్తూ నిన్నడ్డగించిన ఆ పిరికిపందకు తగిన శాస్తి చేస్తేనే గాని నేను ఆహారం ముట్టను. నిన్ను భక్షిస్తే వాణ్ణి నాకెవరు చూపిస్తారు? పద ముందు వాని దగ్గరకు వెళ్దాం" అని అన్నది. సింహాన్ని కుందేలు ఒక పాడుపడిన బావి దగ్గరకి తీసుకొని వెళ్ళింది. "మహారాజా! నన్నడ్డగించి మిమ్ము నానా మాటలు అన్న సింహం ఈ నూతిలోనే దాగి ఉంది వెళ్ళిచంపండి" అన్నది.
కుందేలు మాటలు విన్న సింహం కోపంతో మరొకమారు గర్జించింది. నూతిగట్టు మీదకెక్కి అందులోకి తొంగిచూసింది. నీటిలో దాని నీడ కనపడింది. అది తన విరోధి అని భావించి, పంజా ఎత్తి గర్జిస్తూ బావిలోకి దూకింది. కుందేలు సంతోషంతో ఇంటికి పోయి తన వారందరికీ జరిగిన విషయమంతా చెప్పింది. మృగాలన్నీ కుందేలును మెచ్చుకున్నాయి. శత్రువు మరణించినందువలన ఆనాటి నుండి జంతువులన్నీ హాయిగా కాలం గడిపాయి.
కాబట్టి బుద్ధిబలం గలవారికి అసాధ్యమైనది ఏదీ ఉండదు. అలాంటి బుద్ధిబలాన్ని ఉపయోగించి సంజీవక పింగళకులకు విరోధం కలిగిస్తాను. అందుకు కాలం కూడా ఇపుడే కలిసి వచ్చింది. రాజద్రోహం చేసినందుకు పదవులు పోగొట్టుకొని ఉన్న మన కాటక-పాటకులు సంజీవకుని ఆశ్రయిస్తున్నారు. అతనిని నమ్ముకొన్నచో రాజునకు చెప్పి ఎలాగైనా తమ పదవులను తిరిగి తమకు ఇప్పిస్తాడని వాటి నమ్మకం. ఈ అవకాశాన్నుపయోగించుకొని ఎద్దు మీద నేరాలు మోపి అతని మీద ఉన్న స్నేహ భావం తొలిగించి, రాజుగారి మనస్సుని మారుస్తాను అని దమనకుడు చెప్పగా విని కరటకుడు నీకు విజయం కలుగు గాకా! క్షేమంగా పోయి లాభంగా తిరిగి రా" అని పలికింది.
దమనకుడు పింగళకుని వద్దకు పోయి నమస్కరించి "మహారాజా! మన్నించండి. పిలవని పేరంటంగా వచ్చినందుకు నన్ను క్షమించండి. తమరి ఉప్పు తిని నీడన పడి ఉండేవాడిని. తమ మేలు కోరి ఒక రహస్య విషయం మనవి చేయాలని వచ్చాను" అన్నాడు. వెంటనే పింగళకుడు "దమనకా! నీ కంటే నాకు మంచి ఆప్తులెవరున్నారు? సందేహించకు, నీవు చెప్పదలచిన విషయం నాకు నిర్భయంగా చెప్పు. భయపడవలసిన పని లేదు" అని పలికింది.
మహారాజా! మీరు మనసారా ప్రేమిస్తున్న సంజీవకుడు ఇపుడు మునిపటివలే లేడు. అతనికి మీ రాజ్యం కాజేయాలనే ఆశ పుట్టింది. మిమ్ములను సంహరించి ఈ అడవికి తానే రాజు కావాలని కోరిక కలిగింది. అతడిప్పుడు రాజద్రోహులైన కాటక పాటకులతో కలిసి కుట్ర చేస్తున్నాడు, ఇది తెలిసినప్పటినుండి నా మనసు మనసులో లేదు. ఎప్పుడు ఈ వార్తను మీ చెవిన వేయాలా అని నిరీక్షిస్తున్నాను. నేడు తమతో మనవి చేసే అవకాశం దొరికింది అని అన్నది.
మంత్రి పదవి ఇచ్చి ఎంతో గౌరవంగా చూస్తూ ప్రాణస్నేహితునిగా నమ్మానే! ఇలాంటి ద్రోహం తలపెడతాడా? నీ మాట నిజమని నమ్మమంటావా? అన్నాడు పింగళకుడు. వెంటనే దమనకుడు "ప్రభువులు నా వంటివారు నిజం చెప్పినా నమ్మరు, కారణం నాకు పదవి లేకపోవడమే. నీచులకు పుట్టుకతో వచ్చిన బుద్ధులు పోవు. పాములను తలపై పెట్టుకొని పూజించినా కాటు వేయడం మానదు కదా! సంజీవకుడు త్వరలో మీతో యుద్ధమునకు రావడానికి ఆలోచిస్తున్నాడు. మొదట అతని గుణం తెలియక నేనే మీ వద్దకు తీసుకు వచ్చి మీకు నచ్చచెప్పి మంత్రి పదవి ఇప్పించాను కదా! అట్టి వానిని నమ్మవద్దని ఎందుకు చెప్పుచున్నానో ఆలోచించండి" అనిమరొకమారు హెచ్చరించింది.
"మరైతే సంజీవకుణ్ణి వెంటనే మంత్రి పదవి నుంచి తొలిగిస్తాను. ఆ తరువాత ఈ అడవి నుండి తరిమేద్దాం" అని మృగరాజు పలుకగా, దమనకుడు"శాంతించండి మహారాజా! ఎంతకాలం నుండో మహారాజుగా ఉండి ఒక్కసారి ఆమాంతం శత్రువుగా మారితే అతడు వెంటనే తమకు అపకారం తల పెట్టవచ్చు"నని దమనకుడు పలికాడు. పింగళకుడు నవ్వి "నాకే అపకారం తలపెట్టేటంతటి వాడా అతడు!" అని తేలిక భావంతో అన్నాడు.
దానికి దమనకుడు "ప్రభువుల వారికి తెలియనిది కాదు, ఇతరుల స్వభావం తెలియక వారికి నివాసం కల్పించి పదవులీయడం మనది మొదటి తప్పు. అతని స్వభావం ఇలాంటిదని మనకు తెలిస్తే మనలో చేరనిచ్చేవారమా? స్వభావం తెలియక మిత్రుడని నమ్మి నల్లికి చోటిచ్చి చీరపోతు తన ప్రాణం పోగొట్టుకుంది. మీకా కథ చెపుతాను వినండి అని దమనకుడు కథ చెప్పటం ప్రారంభించింది.
"మందవిసర్పణి" అనే పేరుగల చీరపోతు ఒకటి రాజుగారి పాన్పును ఆశ్రయించి కాలం గడుపుతూ ఉండేది. రాజుగారు గాఢంగా నిద్రపోయిన తరువాత అది నెమ్మదిగా బయటకు వచ్చి ఆయన రక్తం త్రాగి కడుపు నింపుకొనేది. పగటి పూట పరుపు కిందనో, తలగడ కిందనో దాగి ఎవరికంటా పడకుండా కాలం గడుపుతుండేది. ఏ ఆటంకము, ప్రాణ భయము లేకుండా ఆ చీరపోతు కాలం గడుపుతుండగా ఒకనాడు "డిండిమం" అనే నల్లి ఆ మంచం మీదకి చేరింది. దానిని చూచి మందవిసర్పణి "ఓయి! ఎచట నుండి వచ్చావు? నీ రాకకు కారణం ఏమిటి?" అని అడిగింది.
అపుడా నల్లి "నా పేరు డిండిమము. ఇంతకాలం పేదల ఇళ్ళలో ఉన్నాను, ఎందరి రక్తమో రుచి చూసాను, కాని రాజుల రక్తం చవిచూడలేదు. సన్న బియ్యపు అన్నము, కమ్మని పప్పు, మాంసపు కూరలు, రుచిగల పిండివంటలు, వెన్న, నేయి, పాలు, పెరుగు, పండ్లు మొదలైన మంచి వంటకాలు భుజించే రాజుల రక్తం ఎంతో రుచిగా ఉంటుందని విన్నాను. దయచేసి నన్ను నీ స్నేహితునిగా భావించు. నేను కూడా నీతోపాటు ఈ మంచం మీదే కాలం గడుపుతాను" అని చీరపోతును బతిమాలింది. అమాయకురాలైన చీరపోతు సరే నీ ఇష్టం, నా సొమ్మేమీ పోదు కదా! కానీ ఒక్క విషయం, ఇక్కడ నీవెంతో జాగ్రత్తగా ఉండాలి. రాజు గాఢనిద్రలో ఉన్న సమయం కనిపెట్టి, నెమ్మదిగా పోయి ఆయనకు బాధ కలగకుండా మెలుకువ రాకుండా మెల్లగా రక్తం తాగాలి" అని చెప్పింది. అందుకు నల్లి సరే అన్నది.
ఆ రాత్రి రాజుగారు పడుకొని నిద్రపోకముందే నల్లి పరుపుపైకి పాకి వీపును కుట్టి రాజుగారి రక్తం పీల్చసాగింది. రాజుగారు అబ్బా! అని పెద్దగా అరిచి సేవకులను పిలిచి నా వీపుపై ఏదో కుట్టింది. తేలు కుట్టినట్లు మండుతుంది. దీపం తెచ్చి చూడండి అని ఆజ్ఞాపించాడు. వారు దీపం తెచ్చేంతలో నల్లి పారిపోయి మంచం సందులో దూరింది. భటులకు తలగడ కిందున్న చీరపోతు కనిపించింది. అదే రాజును కుట్టివుంటుందని భావించి వారు చీరపోతును నలిపి చంపేశారు. కనుక స్వభావం తెలుసుకోకుండా ఎవరిని పడితే వారిని దరి చేర్చుకోరాదు, బుద్ధి తెలుసుకొని మెలగాలి. అల్పబుద్ది గల వానికి ఆకతాయికి ఉపకారం చేయటం మంచిది కాదు. అలా చేస్తే ప్రాణాలకే ముప్పు కలుగుతుంది. మనవల్ల ఉపకారం పొందినవారే మనకు అపకారం తల పెడతారు.
దమనకుడి కథ విని సింహం నా బలం ముందు సంజీవకుని బలం ఎంత? అతను నాకెలా హాని చేయగలడని అడిగింది. తమతో పోరాడగల శక్తి సంజీవకునికి లేదు. నిజమే, కాని కాటక పాటకుల వారి ముఠావాళ్ళు ఎందరో అతనికి సహాయంగా ఉన్నారు. అతడు వారితో కలిసి మిమ్ములను చంపే ఉపాయం ఆలోచిస్తున్నాడని అనుమానం" అని దమనకుడు పలకగా, పింగళకుడు భయపడి దమనకా నీవు తక్షణం సంజీవకుని వద్దకు వెళ్ళి అభిప్రాయం తెలుసుకొనిరా, వెంటనే వెళ్ళు" అని చెప్పాడు.
చిత్తం మహారాజా! వెళ్ళొస్తా అని దమనకుడు సంతోషంగా బయలుదేరి సంజీవకుని సమీపించి కంటనీరు పెట్టసాగాడు. దమనకా! ఎందుకు విచారించుచున్నావు? మనవారంతా క్షేమంగా ఉన్నారా? అని అడిగాడు సంజీవకుడు. దమనకుడు తమ దయవలన అందరంక్షేమంగానే ఉన్నాము. కాని తమకే ఆపద ముంచుకొచ్చింది, అది తలుచుకొని విచారించుచున్నాను. తమరు కొలువుకు రాగానే పింగళకుడు మిమ్ములను చంపి మీ రక్తం తాగాలని చూస్తున్నాడు. నన్ను తమరిని వెంటనే వెంటబెట్టుకొని రమ్మని నన్ను మీ వద్దకు పంపాడు అని చెప్పింది.
ఆ మాటలు విని సంజీవకం ఉలిక్కిపడి దమనకా! నన్ను తమ ప్రాణములతో సమానంగా చుచుకుంటున్న రాజుగారు నన్ను చంపదలచాడా? నేను నమ్మలేకపోతున్నాను" అన్నాడు. అందుకు దమనకుడు నవ్వి "రాజుల మాటలు నీటి మూటలు, వారి ప్రేమాభిమానాలు నమ్మిన వారు వెర్రివాడితో సమానం. రాజులు తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళంటారు. వారికి ఆగ్రహం వచ్చిననూ అనుగ్రహం వచ్చిననూ మనలాంటి వారెదురు చెప్పలేరు కదా! మనసు పుడితే ప్రాణమెలా ఇస్తారో, మనసు చెడితే అలాగే ప్రాణం తీస్తారు. రాజుసేవకంటే మరొక నరకమున్నదా! ఈ లోకంలో రాజుసేవలో సుఖపడిన వారు ఎవడైనా ఉన్నాడా! తాత్కాలికంగా సుఖపడి చివరకు చెడిపోవటం మటుకు ఖాయం" అన్నది.
సంజీవకుడు ధైర్యం వహించి "జాతస్యహిదృవం మృత్యుహు" పుట్టినవాడు గిట్టక తప్పదు. ఇంతకూ నేను చేసిన నేరమేమిటి? నేను కలలోనైనా ఆయనకు అపకారం తలపెట్టను కదా! తప్పు చేయని నన్ను రాజు నన్నెందుకు చంపాలనుకుంటున్నాడు?" అని అడిగింది. మీరు రాజద్రోహులైన కాటక పాటకులతో స్నేహం చేస్తున్నారని, తమ రాజ్యం అపహరించడానికి వారితో కలిసి కుట్ర చేస్తున్నారని ఎవరో చెప్పగా పింగళకుడు విన్నాడట. అందువలన విచారం లేక మిమ్ములను చంపడానికి నిశ్చయించుకున్నాడు అని దమనకుడు చెప్పాడు.
మనరాజు మంచివాడు, ఎవరో చెప్పిన మాటలు నమ్మి మంచి చెడు విచారించక దండించడం తప్పు. చెప్పుడు మాటలు వినే రాజుని సేవించటం కంటే గొప్ప తప్పు మరొకటి లేదు. చెప్పుడు మాటలు వినేవాడి కంటే చెడ్డవారు మరొకరు లేరు. చెడ్డవారితో స్నేహం చేసేవాడు సముద్రంలో కలిసేనది నీరు వలె చెడిపోతాడు.
అడవిలో దొరికిన గడ్డిపోచలు మేసి విశ్వాసంతో రాజును సేవిస్తున్న నా మీద మాయోపాయములు పన్ని ఎవరో నా మీద చాడీలు చెప్పి ఉంటారు. అది నమ్మిన రాజు తనను సేవిస్తున్న నన్ను చంపుట చాలా తప్పు. పూర్వం సింహాన్ని సేవిస్తున్న ఒంటెను"పులి, నక్క, కాకి" మాటలు నమ్మి చంపిన సింహంలా నన్ను చంపి భక్షిద్దామనుకుంటున్నాడు కాబోలు" అని చెప్పగా దమనకుడు "ఆ ఒంటె-సింహం" కథ ఏమిటో చెప్పు అని అడిగింది. అపుడు సంజీవకుడు ఆ కథను చెప్పడం ప్రారంభించాడు.
ఒక అడవిలో ఒక సింహం నివశిస్తున్నది. అది ఆ అడవిలోని జంతువులన్నింటికీ రాజు. దానికి సలహాలిచ్చేవి "పులి, నక్క, కాకి". మంచితనమే తప్ప లౌకికం తెలియని నా లాంటి ఒంటె ఒకటి ఒకనాడు వాని కంట పడింది. పులి, నక్క, కాకి మూడూ కలిసి దాని వద్దకు వెళ్ళి "ఎవరు నీవు? ఈ అడవికిఎందుకు వచ్చావు?" అని అడిగాయి. అపుడు ఒంటె "అయ్యా! నా యజమాని పెట్టె బాధలు పడలేక నేనీ పక్క గ్రామం నుండి ఈ రోజేవచ్చాను. దిక్కు లేని దానను. నన్ను కాపాడి పుణ్యం కట్టుకోండి" అని వాటితో అన్నది.
అలాగే, భయపడకు! నిన్ను మా జట్టులో చేర్చుకుంటాము. మా రాజు ఎంతో మంచివాడు. ఆయనకు చెప్పి నీకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తాము. మా వెంట రా! అని అవి మూడు ఒంటెను తీసుకొని సింహం వద్దకు వెళ్ళాయి. "ప్రభూ! ఇతడు మా వలెనే తమను సేవించడానికి కొత్తగా మన వనానికి వచ్చాడు. మంచి బలం కలవాడు, బుద్ధిమంతుడు. దుడుకుతనమెరగని సాధు స్వభావుడు" అని గొప్పగా పొగిడాయి. సింహం ఒంటెను కుడా తన మంత్రులలో ఒకనిగా నియమించింది.
క్రమక్రమంగా ఒంటె మంచితనం సింహానికి బాగా నచ్చింది. అది ఒంటెను ఆప్తమిత్రునిగా భావించి తన రాజ్యానికి ప్రధానమంత్రిని చేసింది. నిన్నగాక మొన్న వచ్చిన ఒంటె ప్రధాని అయిందని ఈర్ష్యతోపులి, నక్క, కాకి దానిని ద్వేషించసాగాయి. సమయం చూచి దానికి హాని తలపెట్టాయి.
ఒకసారి సింహానికి జబ్బు చేసి కదలలేని పరిస్థితి ఏర్పడింది. అపుడు పులి, నక్క, కాకి జంతువులను వేటాడి తెచ్చి సింహానికి ఆహారంగా పెట్టేవి. ఒకనాడవి ఎంత వేటాడినా ఒక్క జంతువు దొరకలేదని అవి విచారంగా సింహంతో చెప్పాయి. తాము పన్నిన ఉపాయంతో కాకి "తమవంటి ప్రభువులకు ఉపయోగపడని ఈ శరీరమెందులకు? మీ ఆకలి బాధ చూడలేకున్నాను. నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి" అన్నది. అపుడా సింహం "నీ వంటి అల్ప జీవులను చంపితే నా ఆకలి తీరుతుందా? నీ మాంసం నాకు ఒక పంటి కిందకు కుడా చాలదు" అనుచుండగా నక్క "ప్రభూ! నన్ను చంపి భక్షించి మీ ఆకలి బాధ చల్లార్చుకోండి" అన్నది. అందుకు సింహం "ఎంత చేతకాకున్నా నీ వంటి క్షుద్ర జంతువులను చంపి తింటానా! కుక్కలు, నక్కలు జంతువులలో నీచమైనవి. చచ్చిన శవాలను పీక్కుతిను నక్క ఈ రాజుకు భోజనమా? నిన్ను చంపి తినడం కంటే ఆకలితో చావటం మేలు అని పలికింది.
అపుడు పులి "మహారాజా! నన్ను తినండి. ఇన్నాళ్ళుగా మీకు సేవ చేసిన నేను మీరు ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు వదిల్తే చూడలేను" అన్నది. అపుడు సింహం పులితో "ఓరీ! నీవు గోవులు, మేకలు, కుందేళ్ళు వంటి సాధు జంతువులను తిన్న మహా పాపివి. నిన్ను ముట్టుకోవడమే ఎంతో పాపం. నిన్ను నేను భక్షించను" అని పలికింది. తరువాత ఒంటె, రాజు వద్దకు పోయి "సింహరాజా! నా శరీరం ఎంతో పెద్దది. నన్ను భక్షిస్తే మీ ఆకలి పూర్తిగా తీరుతుంది. కాబట్టి సందేహించక నన్ను తినండి" అన్నది. సింహం మిత్రద్రోహం చేయడానికి తటపటాయిస్తుంది. ఆ సంగతి గమనించిన కాకి "మహారాజా! మీరు మా ముగ్గురిని తినడానికి ఒప్పుకోలేదు. సరే ఇతని ప్రార్థననైనా మన్నించి తమ ఆకలి తీర్చుకోండి. ఆకలి బాధకాగలేక సర్పం తన పిల్లలని తానే తిని ఆకలి తీర్చుకుంటుంది. దేహాన్ని రక్షించుకొనటం ప్రతి ప్రాణికీ ముఖ్య కర్తవ్యం కదా! మీ వంటి ప్రయోజికులు బతికి ఉంటే పదిమందికి లాభం కలుగుతుంది. మా వంటి అప్రయోజికులు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే కదా!" అని చెప్పింది. నక్క, పులి కూడా ఆ మాటలనేసమర్ధించాయి. ఆకలితో ఉన్న సింహం ఆ మాటలకు లొంగింది. "మీకు తోచినట్లు చేయండి" అన్నది. సింహం వెంటనే ఒంటెపై పడి చంపింది. సింహం ఒంటె మాంసం తిని ఆకలి బాధ తీర్చుకుంది. తమ పాచిక పారినందుకుపులి, నక్క, కాకి ఎంతగానో సంతోషించాయి.
కాబట్టి కొత్తగా వచ్చిన సేవకులు ఎంత మంచి వారైనా తోటి వారందరికీ ఏదోక కీడు చేయాలని చూస్తారు. రాజునకు ఏవో మాయమాటలు కల్పించి చెపుతారు. అలాంటి నీచుల మాటలు నమ్మిన రాజు కూడా పరమ నీచుడే అవుతాడు. "దుష్టులతో స్నేహం చేయకూడదు. దుష్టబుద్ధులతో వచ్చావు కాబట్టి నేను భయంతో చెట్టెక్కాను" అని ఒడ్రంగి మునుపొక సింహానికి చెప్పాడు. ఆ కథ చెపుతాను విను అంటూ కథ చెప్పటం ప్రారంభించాడు.
ఒక ఊరిలో వడ్రంగి అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ప్రతి రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చుకొని, వాటిని అమ్మి ఆ డబ్బుతో జీవనం కొనసాగించేవాడు. ఒకనాడు అతనికి సింహం ఎదురైంది. సింహాన్ని చూచి వడ్రంగి గజగజ వణుకుతూ నిలబడ్డాడు. అప్పుడు సింహం "నీవెందుకు భయపడుతున్నావు? నిన్ను ఏమీ చేయనులే" అన్నది. వడ్రంగి కొంత ధైర్యం తెచ్చుకొని రెండు అడుగులు ముందుకు వేసి తన వద్దనున్న అన్నం, కూరలు సింహం ముందు పెట్టాడు. ఆనాటి నుండి వడ్రంగి, సింహం మంచి స్నేహితులయ్యారు. అతడు ప్రతిరోజూ సింహానికి రుచిగల పదార్థాలు తెచ్చి పెట్టసాగాడు. పండుగలకూ, పబ్బాలకూ పిండి వంటలు కూడా తెచ్చి పెట్టేవాడు.
కొన్నాళ్ళు జరిగిన తరువాత సింహానికి ఒక కాకి, నక్కతో స్నేహం ఏర్పడింది. అది వాటికి తన స్నేహితుడైన వడ్రంగి గురించి గొప్పగా చెప్పింది. అవి అతనిని తమకు చూపించమని కోరాయి. ఒకనాడు వడ్రంగి వచ్చేవేళకు సింహం స్నేహితులిద్దరినీ తీసుకొని అక్కడకు వచ్చింది. సింహం వెనుక కాకి, నక్క ఉండటం చూచి వడ్రంగి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతని వింత ప్రవర్తనకి సింహం ఆశ్చర్యపోయింది. మిత్రమా! వీళ్ళు నా కొత్త స్నేహితులు, నీక్కూడా మిత్రులే, భయపడవలసిన పనేమీ లేదు. చెట్టు దిగివచ్చి మా ముగ్గురికీ నీవు తెచ్చిన పదార్థములు పెట్టి మమ్ములను సంతోషపెట్టుము" అని అన్నది.
వడ్రంగి సింహంతో మిత్రమా! ఉన్నతులూ, ఉత్తములూ అయిన వారితోనే స్నేహముచేయాలి. నీవు మృగరాజువని నీతో స్నేహం చేశాను. కాని నీవు నీ కన్నా తక్కువ జాతివారైన నక్క,కాకితో స్నేహం చేశావు. దీనితో నీ గొప్పతనం దిగజారిపోయింది. పైగా ఈ నక్క జిత్తుల మారిది, కాకి అరిష్టానికి పేరు పొందినది. కాకి వాడియైన తన ముక్కుతో, నక్క కుటిలమైన ఆలోచనలతో నాకు ఏదైనా హాని చేస్తాయి. ఇటువంటి దుష్టులతో నీవు స్నేహం చేశావు. కనుక ఇకనుండి నేను నీతో స్నేహం చేయను అని చెప్పాడు. సింహం సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయింది. వడ్రంగి కూడా చెట్టు దిగి ఇంటికి వెళ్ళిపోయాడు.
అగ్నిదేవుడెంతో శక్తి గలవాడు. ఆయన గాలి దేవునితో స్నేహం చేసి ఇంకా తన శక్తిని రెట్టింపు చేస్తూ ఎంతగానో ఎదిగిపోతారు, ఎంతోగానో ప్రకాశిస్తాడు. నిముషాలమీద లోకాలన్నీ భస్మం చేయగలుగుతాడు. అలాకాక తనకంటే తక్కువ వాడైన ఇనుముతో స్నేహం చేస్తే సమ్మెట దెబ్బలు తింటాడు. చివరకు నీటిలో తన శక్తిని కోల్పోయి పూర్తిగా చల్లారిపోతాడు. అందువలన అన్ని వేళలా మంచివారితోనే స్నేహం చేయమని పెద్దలు చెపుతూ ఉంటారు. కథలో మనరాజు కూడా ఎవరో దుర్మార్గుల జట్టు చేరినాడు. ఆ దుర్మార్గులే నాపై లేనిపోని నేరములు చెప్పి నమ్మించి ఉంటారు. ఆ మాటలు విని, అవి నిజమని నమ్మి నన్ను చంపదలచినచో ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉన్నదా? ఏది ఏమైనా కాని అటువంటి రాజులకు లోబడి ఉండుట కంటే ధైర్యంగా వారిని ఎదురించి పోరాడతాను. విజయమో, వీరస్వర్గమో తేల్చుకుంటాను. అని సంజీవకుడు పలుకగా దమనకుడు తన తంత్రము చక్కగా పని చేసిందని లోలోన సంతోషించి "సంజీవకా! నీ నిశ్చయము మెచ్చుకోతగినదే, కాని పింగళకుడు నీ కంటే ఎంతో బలవంతుడు. మహా పరాక్రమవంతుడు. అట్టి బలవంతునితో విరోధము మంచిది కాదు. బలవంతుడైన శత్రువును ఉపాయంతో జయించాలి. మునుపు తీతువుపక్షి సముద్రుణ్ణి జయించింది. అనగా సంజీవకుడు 'ఆ కథ ఏమిటో చెప్పు" అనగా దమనకుడు ఈ విధంగా చెప్పసాగాడు.
పూర్వం సముద్రతీరాన గల చెట్టు మీద తీతువు పిట్టల జంట నివశిస్తూ ఉండేది. సముద్రంలోని అలలు పెద్ద ఎత్తున వచ్చి చెట్టుపై ఉన్న ఆ పక్షి గుడ్లను మింగేయసాగాయి. అపుడు ఆడ తీతువు పక్షి భర్తను చూచి "నాధా! ఈ సముద్రుడు మన చెట్టు కన్నా ఎత్తుగా పొంగి మన గుడ్లను పొట్టన పెట్టుకుంటున్నాడు. ఇచట నివశించటం మనకు క్షేమం కాదు. మరొక చెట్టుపైకి పోదాం" అన్నది.
మగతీతువు పక్షి "పిచ్చిదానా! మన రాజు గరుత్మంతుల వారు. ఆయన విష్ణు దేవుని వాహనము. పక్షి కులాన్ని రక్షించటం ఆయన విధి. అందువలన ఆయనను వేడుకొన్నామంటే వెంటనే వచ్చి మనకు సహాయం చేస్తాడు. ఆయన బలం ముందు సముద్రుడెంత? నీవేమీ విచారించకు" అని చెప్పాడు. అపుడు ఆడతీతువు పక్షి హితుల మాటలు విని మూర్ఖులవుతారు. "కర్ర విడిచి నేల పడిన తాబేలు" వలే చనిపోతారు. నీకా కథ చెపుతాను విను ఈ కథ చెప్పటం ప్రారంభించింది.
పూర్వం ఒక కొలనులో "కంబుగ్రీవం" అనే తాబేలు, వికటము, సంకటము అనే రెండు హంసలు ఎంతో స్నేహంగా ఉండేవి. ఎండాకాలం సమీపించింది. హంసలు తాబేలుతో "మిత్రమా! ఈ కొలను మెల్లమెల్లగా ఎండిపోతుంది. కాబట్టి మేము వేరొక సరస్సునకు పోతలచాము" అన్నాయి. తాబేలు బాధతో "ఇదేమి అన్యాయము, ఇన్నాళ్ళుగా మీతో స్నేహం చేసిన నన్ను ఒంటరిగా ఒదిలి మీరు వెళ్ళిపోవడం ధర్మమేనా? మిమ్ములను చూడకుండా ఒక్కరోజైనా బతకగలనా! ఎలాగైనా మీతో పాటు నన్ను కూడా తీసుకొని పొండి" అని బతిమాలింది.
హంసలు ఒక ఉపాయం ఆలోచించి, ఒక పుల్లను తెచ్చి అవి తాబేలుతో మిత్రమా! నీవు ఈ కర్రను నోటితో కరుచుకొని ఉండుము. మేమిద్దరం చెరొక కొనను మా ముక్కులతో పట్టుకొని పైకెగిరెదము. మా మధ్యలో నీవునూ మాతోపాటు ఆకాశంలో పయనించి మరొక సరస్సుకు చేరుకోగలవు. మేము చెప్పేవరకు నోరు తెరవవద్దు అని చెప్పాయి. అందుకు తాబేలు సంతోషంతో అలాగే అంది. బయలుదేరే ముందు హంసలు తాబేలుతో "మిత్రమా! మార్గంలో ఎన్నో పల్లెలు, పట్నాలు వస్తాయి. ఆకాశంలో వెళుతున్న మనల్ని చూసి జనం గోల చేస్తారు, పిల్లలు కేరింతలు కొడతారు. నోటికి వచ్చినట్లు ఏవేవో మాట్లాడతారు. నీవు మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ నోరు తెరవవద్దు. తెరిచావో కర్ర నుండి విడిపోయి కిందపడి చచ్చిపోతావు" అని మరొకమారు గుర్తుచేసాయి.
ఆ హెచ్చరికలను తప్పక పాటిస్తాను అని తాబేలు కర్రను నోట కరిచి గట్టిగా పట్టుకుంది. హంసలు ఆ పుల్లను అటూ ఇటూ తమ ముక్కులతో పట్టుకొని ఆకాశానికి ఎగిరాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక గ్రామం వచ్చింది. ఈ వింతని చూచిఆ ఊళ్ళోని పిల్లలూ, పెద్దలూ పెద్దగా అరిచి గోల చేయడం మొదలు పెట్టారు. కొందరు ఈలలు వేస్తున్నారు. తాబేలు ఆకాశంలో ఎగురుతుంది అని హేళన చేయసాగారు. మరికొందరు వెంటపడుతున్నారు.
తాబేలుకు ఆత్రం పెరిగిపోతుంది. ఆ తొందరలో అది హంసలు చేసిన హెచ్చరికను మరిచిపోయింది. కింద ఆ కోలాహలమేమి అని హంసలను అడగబోయి నోరు తెరిచింది. వెంటనే కర్రనుండి విడిపోయి దభీమని కిందపడి మరణించింది. లోకంలో మూడు రకాల మనుషులుంటారు. సొంతగా ఆలోచించుకొనేవారు, రెండూ లేక చెడేవారు. తమకు తెలియక, ఒకరు చెపితే వినక ఉండేవారినే మూర్ఖులంటారు. అలాంటి మూర్ఖులు తాబేలులాగా ప్రవర్తించి చెడిపోతారు. "పూర్వం ఒక చేప తన మిత్రుని మాట వినక ప్రాణం పోగొట్టుకుంది" అని అనగామగతీతువుపక్షి ఆ చేప కథ ఏమిటో చెప్పు అన్నది. ఆడతీతువు పక్షి ఆ కథ చెప్పడం ప్రారంభించింది.
ఒక చెరువులో "దూరదర్శి, కుశాగ్రబుద్ధి, మందబుద్ధి" అనే మూడు చేపలు ఎంతో స్నేహంగా ఉండేవి. ఒక సంవత్సరం వానలు సరిగా పడక చెరువులో నీరు బాగా తగ్గింది. అది గ్రహించి దూరదర్శి మిగిలిన రెండు చేపలను చూచి "స్నేహితులారా! ఈ ఏడు వానలు లేవు. మనమున్న ఈ చెరువు ఎండిపోతుంది. కనుక మనము మరొక చెరువుకు పోదాము. లేకుంటే జాలరులు వచ్చి మనల్ని పట్టుకొని చంపేస్తారు" అన్నది. ఎప్పుడో ఆపద వస్తుందని ఇప్పుడే ఎక్కడో తెలియని చోటుకి వెళ్దామంటావేంటి? అంతగా ఆపద వస్తే అపుడు ఆలోచిద్దాంలే, తరువాత దేవునిపైన భారం వేద్దాం అన్నది కుశాగ్రబుద్ధి. మందబుద్ధి కూడా ఏం మాట్లాడక ఊరుకుంది. వీళ్ళతో మనకు కుదరదని దూరదర్శి ఆ రోజే మరొక చెరువుకు వెళ్ళిపోయింది.
మరికొన్నాళ్లకు చెరువులో నీరు బాగా తగ్గిపోగా, జాలర్లు వచ్చి వలలు పన్ని చేపలు పట్టారు. కుశాగ్రబుద్ధి, మందబుద్ధి ఇరువురూ ఆ వలలో చిక్కుకున్నారు. ఒక జాలరి వచ్చి అవి చిక్కుకున్న వలను విడతీసి బతికి ఉన్న చేపలను తన చేతిలోనికి, చనిపోయిన చేపలను చెరువు గట్టుపైకి వేయుచున్నాడు. అది గమనించిన కుశాగ్రబుద్ధి చనిపోయిన దానివలే కదలక, మెదలక పడియున్నది. జాలరి దానిని ఒడ్డుకు విసిరి వేశాడు. సమయం చూచి అది మెల్లగా ఎగురుతూ చెరువులోనికి జారుకొని ప్రాణాలు కాపాడుకొన్నది.
ఏ ఉపాయము తెలియక గిలగిల కొట్టుకొనుచున్న మందబుద్ధిని జాలరి తన బుట్టలో వేసుకొని చంపేశాడు. కనుక మిత్రుల మాటలు విని తీరాలి. సాధ్యమైనంతవరకూ మన ప్రయత్నం మనం చేయాలి. మనకు సాధ్యం కాని విషయంలో దేవునిపై భారం వేయాలి. కానీప్రతి చిన్న విషయంలోనూ దేవుడా నీదే భారం అని ఎవరైనా కూర్చుంటారా?" అని ప్రశ్నించింది. భార్య మాటలు విని మగతీతువుపక్షి నవ్వి ఊరుకుంది.
కొన్నాళ్ళకు ఆడతీతువు పక్షి మరల గుడ్లను పెట్టింది. భార్య అయిన ఆడతీతువు పక్షి నెత్తి నోరు మొత్తుకున్నా వినని మగతీతువు పక్షికి బుద్ధి చెప్పాలని సముద్రుడు పెద్ద కెరటాలతో ఉప్పొంగి గుడ్లను అపహరించాడు. ఆడతీతువు నిద్రాహారాలు మాని దుఃఖించసాగింది. మగతీతువు పక్షి గరుత్మంతుని ప్రార్థించాడు. గరుడుడు వచ్చి తీతువు పక్షి కోరిక తెలుసుకున్నాడు. వెంటనే సముద్రుడిని పిలిచి వాని గుడ్లను వానికప్పగించాడు. కాబట్టి బుద్ధిమంతుడు తనకంటే విరోధిగల ఉపాయంతోనే జయించాలి. యుద్ధం చేసి గెలుస్తామనే నమ్మకం లేనపుడు పోట్లాటకు దిగటం శుద్ధ దండగ.
దమనకుడు ఇట్లు చెప్పగా విని సంజీవకుడు "ఉపాయాలు, కుట్రలు, కుతంత్రాలు పిరికివాళ్ళకేకానిపౌరుష వంతులకు పనికిరావు. మన పింగళకుడు మహా బలవంతుడని నాకు తెలుసు. వీరుడు బలవంతునితో యుద్ధం చేసి గెలుస్తాడు. అఖండ కీర్తిని సంపాదిస్తాడు. గెలిచినా,ఓడినా లెక్క చేయడు. గెలిస్తే జనులందరిచేత జేజేలందుకొంటారు. మరణిస్తే వీరస్వర్గము అందుకుంటాడు. కాబట్టి పింగళకునితో యుద్ధం చేసి విజయమో, వీరస్వర్గమో తేల్చుకుంటాను. నీవు ముందుగా పోయి రాజుగారికి నేను యుద్ధానికి వస్తున్నానని సిద్ధంగా ఉండమని చెప్పు అన్నాడు.
దమనకుడు తన ఎత్తుగడ పారినందుకు లోలోపల ఎంతో సంతోషిస్తూ సంజీవకుని వద్ద సెలవ తీసుకొని పింగళకుని వద్దకు పోయి, "మహారాజా! నేను చెప్పాను కదా! సంజీవకుని కళ్ళు నెత్తికెక్కినవని, మిమ్ములను బుద్ధిహీనుడనీ, మంచి చెడ్డ తెలియని అవివేకి అని అన్నాడు. నిదానం లేని నీచుడని, మీకు లొంగి ఉండి సలామ్ చేయుట ఇక ఎంత మాత్రం సాగదని చెప్పాడు. తమతో పోరాడి విజయమో, వీరస్వర్గమో తేల్చుకొనడమే తన కర్తవ్యం అన్నాడు. "వినాశకాలే విపరీతబుద్ధిః" అన్నట్లు చెడిపోయే కాలం వస్తే చెడు బుద్ధులే కాని మంచి బుద్ధులెలా వస్తాయి" అని ఉన్నవీ, లేనివీ సంజీవకుడు అన్నవీ, అననవీ ఇంకా ఎన్నో మాయమాటలు కల్పించి అతనిపై పింగళకునికి బాగా కోపం కలిగించేలా చేసింది.
పింగళకుడు పట్టరాని కోపంతో భయంకరంగా గర్జించాడు. అదే సమయంలో సంజీవకుడు వచ్చి గట్టిగాఢీ కొన్నాడు. ఒకరికొకరు తీసిపోకుండా కొంతసేపు పోట్లాడారు. పింగళకుని గర్జనలతో సంజీవకుని రంకెలతో ఆ అడవి అంతా దద్దరిల్లింది. సంజీవకుణ్ణి తన పంజాతో గట్టిగా ఒక దెబ్బ వేయబోయాడు. అది తప్పించుకొని సంజీవకుడు తన వాడియైన కొమ్ములతో పింగళకునిడొక్కలో ఒక్క కుమ్ము కుమ్మాడు. ఆ దెబ్బకు పింగళకుడు మూర్చబోయాడు.
ఇది అంతయు చూస్తున్న కరటకుడు, దమనకునితో "నీ మాటలు విని మనరాజు పడరాని పాట్లు పడుతున్నాడు చూడు" అన్నాడు. తగిన సలహా ఇవ్వని మంత్రి వలన ధరణీనాధుడు చెడిపోయాడు. నీ స్వలాభం కోసం రాజును పరివారంతో ఆలోచించనీయకుండా చేశావు. సాధుస్వభావం గల సంజీవకుణ్ణి ప్రాణం మీదకి తెచ్చావు. ఇలాంటి పాపపు పనులు మానుకొమ్మని నేనెంత చెప్పినా వినకపోతివి. నీ వంటి మూర్ఖులకు హితంచెప్పేవాడు కోతులకు బుద్ధి చెప్పబోయి సుచీముఖం లాగా ప్రమాదానికి గురి అవుతాడు. ఆ కథ చెపుతాను విను అని ఇలా చెప్పసాగాడు.
కొంతకాలం క్రితం ఒక చెట్టు మీద "సుచీముఖం" అనే చిన్న పక్షి ఒకటి నివశిస్తూ ఉండేది. అది చాలా తెలివైనది కూడా. ఆ సమీపంలోని చెట్లమీద కొన్ని కోతులు నివశిస్తున్నాయి. చలికాలం వచ్చింది. ఒకరోజు చలి ఎక్కువగా పడసాగింది. చలికి తట్టుకోలేక కోతులు చలిమంట వేసుకోవాలనుకున్నాయి. అవి కొన్ని మిణుగురు పురుగులను చూచి నిప్పు అనుకుని వాని చుట్టూ కూర్చొని చలికాచుకోసాగాయి.
సుచీముఖం ఆ కోతుల తెలివి తక్కువతనానికి లోలోన నవ్వుకొని "మిత్రులారా! అవి మిణుగురు పురుగులు కాని, నిప్పురవ్వలు కాదు. వాటివల్ల మీ చలి తీరదు. అదిగో ఆ చెట్టు వద్ద నిప్పు ఉన్నది. అచటికి వెళ్ళి చలి కాచుకోండి" అని చెప్పింది. ఆ మాటలు విన్న కోతులకు కోపం వచ్చింది. "నోరు మూసుకో, చూడబోతే చిటికెడంత లేవు, నీవు మాకు నీతులు చెప్పేదానవా? నీకున్నపాటి బుద్ధి మాకు లేదనుకున్నావా? నీకింత పొగరా!" అని ఆ కోతులు దాని మెడ పట్టుకొని పిసికి చంపేశాయి. కనుక మూర్ఖులకు హితం చెప్పరాదు. చెప్పినా బుద్ధిహీనులు వారి మాటలు వినక మనకే హాని పెడతారు. అలాంటివారికి సహాయం చేయబోయి చివరకు వారే చెడిపోతారు. పూర్వం సుబుద్ధిని చెరుపబోయి దుష్టబుద్ది చెడిపోయాడు. నీకా కథ చెపుతాను విను కథ చెప్పటం ప్రారంభించింది.
పూర్వం ఒక గ్రామంలో సుబుద్ధి, దుష్టబుద్ధి అనే ఇద్దరు స్నేహితులున్నారు. వారు వ్యాపారం చేసి ధనం సంపాదించుకొనిరావాలని ఇల్లు విడిచి వెళ్ళారు. దారిలో వారికి ధనంతో నిండి ఉన్న బిందె ఒకటి దొరికింది. దానిని తీసుకొని ఇద్దరూ ఆ ధనాన్ని చెరిసగం తీసుకుందామని ఇళ్ళకు బయలుదేరారు. పగలైతే ఎవరైనా చూస్తారని రాత్రివేళ ఊరి బయట ఒక చెట్టు కింద వారాబిందెను పాతి పెట్టి ఏదో ఒకరోజు మరల అదే విధంగా ఇద్దరూ వచ్చి బిందెను తీసుకొని పోవచ్చని, అలా చేస్తే గ్రామస్తులకు తమపై అనుమానం రాదని, అసూయ కలగదని వారు నిర్ణయించుకొని ఎవరిళ్ళకు వారు వెళ్ళారు.
దుష్టబుద్ధికి ఆశ పెరిగింది. ఆ బంగారు నాణేలు మొత్తం తానొక్కడే కాజేయాలనుకున్నాడు. ఒకనాటి రాత్రి ఒక్కడే వెళ్ళి ఆ బిందెను తెచ్చుకొని ఇంటిలో పెట్టుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత సుబుద్ధి వచ్చి "మిత్రమా! మనం దాచిన ధనం గల బిందెను తెచ్చుకుందాం రా" అన్నాడు. దుష్టబుద్ధి అతని వెంట బయలుదేరి వెళ్ళాడు. ఇద్దరూ చెట్టు కింద తవ్వారు. ఎంత తవ్వినా ఎంత వెదికినా బిందె కనపడలేదు. దుష్టబుద్ధి సుబుద్ధితో "దుర్మార్గుడా! నన్ను మోసం చేస్తావా! ఇక్కడ దాచిన బిందె ఏమౌతుంది? నీవు నాకు చెప్పకుండా ముందుగానేవచ్చి తీసుకొని పోయి ఏమీ ఎరుగని వాని వలే నాటకమాడుతున్నావా?" అని కోపంగా పలుకగా సుబుద్ధి మిత్రమా! దేవుని సాక్షిగా నాకేమీ తెలియదు. మన రహస్యము ఇంకొకరికి తెలిసే అవకాశమే లేదు. బిందేమైందో, ఎవరు కాజేశారో! అంతా వింతగా ఉంది అనగా "నీ మోసపు మాటలు నా వద్ద చెల్లవు. మర్యాదగా నా వాటా ధనం నాకు ఇవ్వు! లేదా రాజుగారికి ఫిర్యాదు చేస్తా" అని దుష్టబుద్ధి అతణ్ణి బెదిరించాడు. సుబుద్ధికి ఆ మాటలు ఎంతగానో బాధ కలిగించాయి. అపుడు సుబుద్ధి "నా మాట నమ్మనిచో నేనేం చేయగలను? నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, అన్నిటికీ ఆ భగవంతుడిదే భారం" అని అతడు చెప్పాడు.
దుష్టబుద్ధి రాజుగారికి ఫిర్యాదు చేశాడు. రాజు ఉభయుల వాదన విన్నాడు. అపుడు రాజుగారుదుష్టబుద్ధితో సుబుద్ధే ఆ ధనం కాజేశాడంటున్నావే? దానికి సాక్ష్యం ఏమైనా ఉందా? అన్నాడు. "మహారాజా! న్యాయం దాచిపెడితే దాగేదా? బిందెలు పాతిన చోట చెట్టు ఉంది కదా! ఆ చెట్టే సాక్షి, సుబుద్ధియే ఆ ధనాన్ని అపహరించినట్లు అదే రేపు మీ ఎదుట నిజం చెపుతుంది. విచారణ చేసి నాకు న్యాయం చేయండి" అని దుష్టబుద్ధి రాజును బతిమాలాడు. ఆ మాటలకు రాజు గారితో పాటు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. చెట్టు సాక్ష్యం చెప్పడమేంటని? ఈ చిత్రమేమిటో రేపు చూద్దాం" అనుకున్నాడు రాజు.
దుష్టబుద్ధి ఇంటికి వచ్చి ముసలి వాడిన తన తండ్రికి రాజుగారి కొలువులో జరిగిన సంగతి వివరించి, "నాన్నగారూ! చేజిక్కిన ధనమును పరులకెలా దక్కనీయాలి? నీవు ఒక్క మాట చెప్పినట్లయితే ఈ ధనమంతయు మనదే అగును. సుబుద్ధి గాడికి శిక్ష పడును. ఏ ఆపద లేక మనం ఈ ధనంతో హాయిగా జీవించవచ్చు. ఆ చెట్టుకు మనిషి పట్టేంత తొర్రజ ఉంది. అది బయటకు కనిపించదు. చెట్టు మొదట్లోకి ఎక్కి చూస్తే తప్ప ఎవరికీ తెలియదు. నీవీరాత్రి ఆ చెట్టు తొర్రలో దూరి రహస్యంగా కూర్చో. రేపు రాజు వచ్చి ప్రశ్నించగానే "ఇచట దాచిన ధనము సుబుద్ధియే కాజేశాడు. దుష్టబుద్ధికి ఏమీ తెలియదు" అని చెప్పమన్నాడు.
ఆ మాటలకు తండ్రి "ఓరీ నీచుడా! నీకు చెడు కాలము దాపురించినట్లుంది. లేకుంటే ఇలాంటి చెడు ఆలోచనలు నీకు కలుగునా? ముందు వెనుక ఆలోచింపక పనిచేయువాడు ఇంతకు మునుపు పామును చేరుపబోయి తాను చెడిన కొంగ వలే హాని చెందును. నీకా కథ చెపుతాను విను" అని కథ చెప్పటం ప్రారంభించాడు.
ఒక అడవిలోని చెట్టుపై ఒక కొంగల జత గూడు కట్టుకొని నివశిస్తున్నాయి. వాని పిల్లలను గుడ్లను ఆ చెట్టు కింద పుట్టలోనున్న పామొకటి తినేయసాగింది. పాము బాధ తప్పించుకోడానికి కొంగలు ఉపాయం పన్నాయి. అవి కొన్ని చేపలను తెచ్చి పాము పుట్ట నుండి ముంగిస రంధ్రం వరకూ వేశాయి. రంధ్రం నుండి బయటకు వచ్చిన ముంగిస ఆ చేపలను తింటూ పాము పుట్ట వద్దకు వెళ్ళింది. బయటకు వచ్చిన పామును ముక్కలు ముక్కలుగా చంపింది.
కొంగలు తమ శత్రువైన పాము చచ్చిందని సంతోషించాయి. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పామును చంపిన ముంగిస చెట్టుపైకెక్కి మంచి మాంసం దొరికింది అని కొంగ గుడ్లను, పిల్లలను తేనేసింది. కాబట్టి ఉపాయం ఆలోచించగానే సరి కాదు. దానితో పాటు అపాయాన్ని కూడా గుర్తించాలి. ఉపాయంలో అపాయం ఉందేమో చూసుకోవాలి" అని తండ్రి చెప్పాడు. దుష్టబుద్ధి తండ్రి వినలేదు. చివరకు చేసేది లేక ముసలి తండ్రి చెట్టు తొర్రలో దాగి సాక్ష్యం చెప్పుటకు అంగీకరించాడు.
మరునాడు దుష్టబుద్ధి, సుబుద్ధి, రాజుగారు, వారివెంట కొందరు భటులు, ఊరి పెద్దలు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళారు. రాజు చెట్టుని చూచి "ఓ వృక్షరాజమా! ధనం ఉన్న బిందెను నీ సమక్షంలో సుబుద్ధి, దుష్టబుద్ధి దాచారు కదా! ఆ ధనాన్ని ఎవరు అపహరించారో చెప్పు" అన్నాడు. "ఆ ధనం సుబుద్ధి ఎత్తుకొని పోయినాడు, దుష్టబుద్ధికి ఏమీ తెలియదు" అనే మాటలు చెట్టునుండి వినపడ్డాయి. రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. సుబుద్ధి రాజుని చూచి "మహారాజా! ఇందులో ఏదో మోసమున్నది. చెట్టు సాక్ష్యం చెప్పడం ఎక్కడైనా ఉన్నదా! ఒకవేళ ఉంటే నిజం చెపుతుంది కాని అబద్ధం చెబుతుందా!ఈ చెట్టును చక్కగా పరీక్ష చేయండి. తరువాత తమకు తోచిన తీర్పు చెప్పండి" అన్నాడు. రాజుకు ఆ మాటలు మంచిగానే తోచాయి.
రాజు సేవకులను చెట్టెక్కి చూడమన్నాడు. వారు చూచి చెట్టు మొదట్లో పెద్ద తొర్ర ఉందన్నారు. అందులో ఎండుగడ్డి వేసి నిప్పు పెట్టండి అని వారిని ఆజ్ఞాపించాడు. సేవకులు అలా చేయగానే ఆ వేడికి, పొగకు తట్టుకోలేక దుష్టబుద్ధి తండ్రి ఒళ్ళంతా మంటలు మంటలు అని అరుస్తూ బయటకి వచ్చాడు. "మహారాజా! నన్ను మన్నించండి" అని వాస్తవమంతా రాజుకు చెప్పాడు. రాజు మిత్రద్రోహానికి, దొంగతనానికి పాల్పడిన దుష్టబుద్ధిని శిక్షించి సుబుద్ధికి న్యాయం చేశాడు. పరులకు చెడు చేయాలని తలపెడితే ఎవరు తీసిన గోతిలో వారే పడతారు, దూరపు చూపు లేకుండా ఆలోచన చేస్తే అదే మనకు ముప్పు తెచ్చి పెడుతుంది.
కనుక "ఓ దమనకా! నీవు దుష్టబుద్ధిలాగే నిన్ను నమ్మిన రాజుకు ద్రోహం తల పెట్టావు. ఒకరిని మోసం చేయతలిస్తే వాడే మోసపోవడం ఖాయం. నీకొక కథ చెబుతాను విను అని కరటకుడు ఈ కింద కథను చెప్పడం ప్రారంభించాడు.
ఒక నగరంలో రామయ్య, రంగయ్య అనే వర్తకులిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఒకసారి రామయ్యవ్యాపార నిమిత్తం దూర దేశాలకు వెళ్తూ తన వద్దనున్న వంద టన్నుల లోహమును తన స్నేహితుడైన రంగయ్యకు ఇచ్చి జాగ్రత్తగా దాచి ఉంచమని చెప్పి తాను ఊరు వెళ్ళిపోయాడు.
కొంతకాలం తర్వాత రామయ్య సొంత ఊరుకి తిరిగి వచ్చి మిత్రుని ఇంటికి పోయి "మిత్రమా! నాకు విదేశీ వ్యాపారం కలిసి రాలేదు. అందుకని తిరిగి మన ఊరిలోనే మునుపటి లోహ వ్యాపారం చేయదలచాను. నేను నీ వద్ద దాచి ఉంచిన లోహం నాకు ఇమ్ము" అని అడిగాడు. "అయ్యో మిత్రమా! ఈ ఏడు ఎలుకల బాధ ఎక్కువైంది. మా ఇంటిలోని వస్తువులతో పాటు నీ లోహమంతయు అవితిని పొట్టన పెట్టుకొన్నవి. ఈ మాట నీకు చెప్పటానికి నోరు రాలేదు. నేనెంతగానో చింతించాను" అది ఆ దేవునికే తెలుసు అంటూ ఆ రంగయ్య కంటతడి పెట్టాడు.
మిత్రుడు తనను మోసం చేశాడని రామయ్య గ్రహించి "వీనితో తగువు పడుట కంటే సమయం చూచి దెబ్బకు దెబ్బ తీయుట మంచిది" అని భావించి, "నా దురదృష్టమునకు నీవేమి చేయగలవు రంగయ్య! జరిగిన దానికి చింతించి లాభం లేదు. నా దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది" అని పలికి ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత అతడు తన మిత్రుడైన రంగయ్య ఇంటికి వచ్చి పోతూ ఉండేవాడు. ఒకనాడు రామయ్య మిత్రుని ఇంటికి వచ్చి అతని కుమారుని చూచి ఎత్తికొని ముద్దాడి బజారుకి తీసుకునిపోయి మిఠాయిలు కొనిస్తాను అన్నాడు. ఆ బాబుని తీసుకొని బజారుకి తీసుకెళ్ళాడు. పిల్లవానినొక స్నేహితుని ఇంటిలో దాచి తానొక్కడే రంగయ్య ఇంటికి వచ్చి, మిత్రమా! నీ పిల్లవానికిమిఠాయిలు కొనిపెట్టి తిరిగి వచ్చుచుండగా ఎక్కడనుండో ఒక పాడు గద్ద రివ్వున వచ్చి బాలుని తన్నుకొని పోయినది. నీకు చెప్పడానికి నోరు రాకున్నది. ఏమి చేయుదువు?" అంటూ రామయ్య బాధపడుతూ చెప్పాడు.
రంగయ్య కోపంతో వెంటనే రాజుగారికి ఫిర్యాదు చేశాడు. రాజు రామయ్యను పిలిపించి "ఏమోయ్! పిల్లవానిని గ్రద్ద తన్నుకొని పోయినదని చెప్పావంట, అది నమ్మతగ్గ విషయమేనా? అని గద్దించాడు రాజు. "ప్రభూ! వంద టన్నుల లోహమును ఎలుకలు తినివేయగా లేనిది, బాలుని గ్రద్ద తన్నుకుపోవుటలో ఆశ్చర్యమేముంది? కావాలంటే నిజమో కాదో రంగయ్యనే అడిగి చుడండి" అన్నాడు. రాజు జరిగిన కథ అంతయు విని రంగయ్యను గట్టిగా మందలించి రామయ్యకు ఇవ్వవలసిన లోహమును తెప్పించి ఇప్పించాడు. తరువాత రామయ్య, రంగయ్య కొడుకును తెచ్చి అతనికి అప్పగించాడు.
కాబట్టి, మోసమును మోసంతోనే జయించాలి. నీ మిత్రభేద తంత్రమునకు పింగళకుడో సంజీవకుడో చావడం ఖాయం, చూచి ఆనందించుము" అంటూ కరటకుడు దమనకునితో చెప్పాడు. సంజీవకుని కొమ్ము పోటుతో మూర్చపోయిన పింగళకుడు కొంతసేపటికి తేరుకొని తనకు కలిగిన పరాభవమునకు సహించలేక పెద్దగా గర్జించి సంజీవకుని పైకి దూకి ఆవేశంతో అతని పొట్ట చీల్చి చంపాడు. దమనకుడు నెమ్మదిగా పింగళకుని వద్దకు పోయి నిలిచాడు. పింగళకుడు ముందూ వెనుక ఆలోచింపక సంజీవకుని చంపి పాపము మూటకట్టుకుంటిని. విష వృక్షమైననూ పెంచిన చేతులతో త్రుంచరాదని పెద్దలు చెప్పారు కదా! గుణవంతుడగు సేవకుని శిక్షించుట రాజుకెంతో హానికరము. సంజీవకుని చంపి శాశ్వతమైన అపకీర్తి పాలైతి"నని చింతించుచుండగా దమనకుడు "మహారాజా! మీకు చెప్పతగినవాడను కాదు. శత్రువుని చంపి విచారించువారు ఎక్కడైనా ఉన్నారా? ద్రోహము చేయదలచిన వాడు కొడుకైనా, తండ్రియైననూ, తమ్ముడైననూ రాజు శిక్షించవలసినదే కాని జాలిపడరాదు. ఇది రాజధర్మము" అని ఓదార్చాడు. పింగళకుడు మనస్సు కుదుటబరచుకొని క్రమంగా ఎప్పటివలె రాజ్యపాలన చేయసాగాడు.
ఆధారము: తెలుగు పెన్నిధి.కం
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో చారుమతి అనబడే ఒక అమ...
అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు వుండేవారు. ఆయనికి చుట్...
ఈ పేజి లో తెనాలి రామకృష్ణ కథలు అందుబాటులో ఉంటాయి.....
చాలా సంవత్సరాల క్రితం తక్షిల అనే ఊరిలో చాణక్య అనబడ...