অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ధాశరథీ శతకం

ధాశరథీ శతకం

శ్రీరఘురామ! చారుతుల - సీదళదామ శమక్షమాది శృం
గార గుణాభిరామ! త్రిజ - గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధ రాక్షస వి - రామ! జగజ్జన కల్మషార్ణవో
త్తారకనామ! భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: శ్రీ ఇక్ష్వాకు వంశమునగల రఘురామరాజు పరంపరన జన్మించి, సొగసైన తులసీదళములచే కూర్చబడిన దండను ధరించి, శాంతి, క్షమలనెడి ఇంపైన గుణములచే ప్రకాశించుచూ, ముల్లోకములందు పొగడదగిన పరాక్రమ లక్ష్మియే ఆభరణముగా గల్గి, వారింపనలనివిగాని కబంధుడను రాక్షసుని వధించి, ప్రపంచమందలి గల మనుజుల యొక్క పాపములనెడి సముద్రములను దాటింపగలడని పేరుగల, దయకు సముద్రమువంటి రూపము దాల్చిన, భద్రాచలమనెడి కొండ పైభాగమున నివాసముంటున్న దశరథ మహారాజు కుమారుడైన రామా! నీకు నమస్కారము.

రామ విశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్థ్స వంశ కలశాంబుధిసోమ సురారిదోర్భలో
ద్దామ విరామ భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: సౌందర్యాది గుణములచే ప్రజలను సంతోషింపజేయుచు, అధిక పరాక్రమము గల్గిన పరశురాముని ఓడించి, యే సమయాల్లోనైనా పరస్త్రీలయందు ఆసక్తి లేకుండా, మేఘచ్ఛాయ కాంతిలో నొప్పారుచూ, కాకుత్సవంశమునకు చంద్రుని వంటి వాడవై, రాక్షసుల సంహరించుచున్న రామా! నీకునమస్కారము.

హాలికునకున్ హలాగ్రమున నర్థము సేకురుభంగి దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు
ర్మలినఁమనోవికారియగు మర్త్యుని నన్నొఁడగూర్చి నీపయిన్
దలఁవు ఘటింపఁజేసితిని దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: రైతునకు నాగేటి చివర భాగమున హఠాత్తుగా ధనము లభించినట్లుగా, మరియు దప్పికతో బాధపడువారికి గంగానదీ జలమబ్బినట్లుగా, చెడు బుద్ధిగల నన్ను చక్కజేసి, నా బుద్దిని నీపై తలపు కలిగించునట్లు చేసినచో ధన్యుడనయ్యెదను దయాంతరంగుడవగు భద్రాద్రిరామా! నీకు నమస్కారము.

కొంజక తర్కవాదమను - గుద్దలిచేఁబరతత్వభూస్థలిన్
రంజిలఁద్రవ్వి కన్గొనని రామనిధానము నేఁడుభక్తిసి
ద్దాంజన మందు హస్తగత మయ్యె భళీ యనగా మదీయహృ
త్కంజమునన్ వసింపుమిక దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: సంకోచింపక తర్కవాదములను చేయుచూ, భూమిని గుద్దలితో తవ్విననూ కన్పించని నిధి యనెడి రాముని, ఇప్పుడు భక్తియనెడి సిద్ధాంజనమగు కాటుకయందు నీ దర్శనము లభించిన్నట్లుగా, ఇకమీద భక్తిచే నా హృదయ కమలమునందు నివశింపుము కరుణా సముద్రుడవగు భద్రాద్రిరామా! నీకు నమస్కారము.

ఖరకరవంశజ విను మఖండిత భూతపిశాచ ఢాకినీ
జ్వర పరితాపసర్పభయ వారకమైన భవత్పదాబ్జ వి
స్పుర దురువజ్రపంజరముజొచ్చితి, నీయెడ దీన మానవో
ద్దార బిరుదాంక మేమఱకు దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: త్రెంపనలవికాని భూతములు, పిశాచములు,ఢాకినీలు జ్వరములు, పరితాపములు, సర్వములు మున్నగు వాట్లచేభయములను పోగొట్టు నీ పాదపద్మములనివాసమైన, మరియు తళతళ ప్రకాశముతో గొప్పదైన వజ్ర పంజరమును గూటిని ప్రవేశించితిని. నీవు దీన జనులను ఉద్దరించువాడవనెడి బిరుదము గల్గి యున్నావని మరువక నన్నాదరింపుము భద్రాద్రిరామా! నీకు నమస్కారము.

జుఱ్ఱెద మీ కథామృతము జుఱ్ఱెద మీ పదకంజ తోయమున్
జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే
జుఱ్ఱెద జుఱ్ఱుజుఱ్ఱఁగ రుచుల్ గనువారి పదంబు గూర్పవే
తఱ్ఱుల తోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: రామా! నీ కథల అమృతమును త్రాగెదను. నీ పాదపద్మముల నుండి పుట్టిన తీర్థమును జుర్రెదను. 'రామ' యనెడి నామోచ్చరణముచే కల్గిన సుధారసమనెడి రుచిని పంచిపెట్టుటకు వినియోగించెదను. నీ చరిత్ర రుచులు రుచులుగా భూనభోంతరాళము వరకు వ్యాపింపచేయుదును. కాని నీచులతో పొత్తులేకుండా నన్నుకాపాడుము భద్రాచల రామా! నీకు నమస్కారము.

మామక పాతక వ్రజము మ్రాన్పనగణ్యము చిత్రగుప్తులే
యేమని వ్రాఁతురో? శమనుఁడేమి విధించునొ? కాలకింకర
స్తోమ మొనర్చుటేమొ? వినఁ జొప్పడ దింతకమొన్నె దీన చిం
తామణి యెట్లు గాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: రామా! నా పాపములు పోవుటకు మార్గాలు చాలా కలవు. చిత్రగుప్తుడేమి వ్రాయునో, యముడేమి విధించునో, కాలకింకరులేమి చేయునో, నీవు దీనులను ఆపత్సముద్రములందు పడిన వారినెలా రక్షించెదవో తెలియుటలేదు. భద్రాద్రిరామా! నా కష్టమును తొలగింపుము.

దాచిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు; నీ
దాసుని దాసుడా? గుహుడు తావక దాస్య మొసంగినావు; నే
జేసిన పాపమా! వినుతి చేసినగావవు గావుమయ్య! నీ
దాసులలోన నేనొకఁడ దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: రామా! శబరి నీకు బంధువు కాకపోయిననూ ఆమెను కాపాడినావు. గుహుడు నీ దాసునకు కూడా దాసుడు కాడు. అతనిని ఆదరించి రక్షించినావు. నేను పూర్వము చేసిన పాపములను జ్ఞప్తి పెట్టుకొనక, నన్ను నీ పదమునందు స్థానము కల్పించుము రామా! నీకు నమస్కారము.

సూరిజనుల్ దయాపరులు సూనృతవాదు లులుబ్ధిమానవుల్
వీరపతివ్రతాంగనలు విప్రులు గోవులు వేదముల్ మహీ
భారముఁదాల్పఁగా జనులు పావనమైన పరోపకార స
త్కార మెఱుంగలే రకట దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: రామా! పండితులు, దయగలవారు సత్యాచారపరులు. ఉదార స్వభావులు పతివ్రతలు బ్రాహ్మణులు గోవులు వేదములు మున్నగు విశిష్ట జన్ములు భూభారము లెరుంగక సంచరించుచున్నారు. రామా! ఏమని చెప్పను, నాయందు దయ యుంచి నన్ను రక్షింపుము.

వారిచరావతారమున వారధిలోఁజొషుబాఱిఁక్రోధవి
స్తారగుడైన యా నిగమ తస్కరవీర నిశాచరేంద్రునిన్
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికిన్ మహో
దారత నిచ్చి తీవెగ దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: రామా! మత్స్యావతారమునందు వేదములను దొంగలించుకొని పోయిన రాక్షస వీరుడగు సోమకాసురుని పట్టుకొనుటకు, కోపాతిశయను గల్గి సముద్రము లోపలకు అతివేగముగా జనివానిని చంపి, వేదములను రక్షించినవాడవు నీవు తప్ప దేవతలయందు ఎవరున్నారు రామా! మరియు మిక్కిలి యౌదార్యముతో బ్రహ్మకు వేదములను అప్పగించితివి కదా! అట్టి నీవు నన్ను కాపాడుము రామా! నేకు నమస్కారము.

కర మనురక్తి మందరము గవ్వముగా, నహిరాజు ద్రాడుగా
దొరకొని దేవదానవులు దుగ్థపయోధి మథించుచున్నచో
ధరణి చలింప లోకములు తల్లడ మందఁగఁగూర్మమై ధరా
ధరము ధరించి తీవెకద దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: రామా! దేవతలను,రాక్షసులను, వైరములతో కూడి మందర పర్వతమును కవ్వముగాను, సర్వరాజగు వాసుకిని కవ్వపు త్రాడుగాను చేసి పాల సముద్రమును చిలుకుచుండగా, అపుడా కొండ తటాలున మునుగుట చేత భూమి, లోకములు తల్లడిల్లటం చూచి కూర్మావతారం యెత్తి కొండను వీపుమీద దాల్చిన వాడవు నీవే గదా! కాబట్టి పైవలె మమ్ము కూడా రక్షింపుము.

చిరతరభక్తి నొక్కతుల సీదళ మర్పణ చేయుఁవాడు ఖే
చర గరు డోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సదా భవత్
స్పురదరవింద పాదముల బూజలొనర్చిన వారికెల్లద
త్పర మరచేతధాత్రిగద దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: రామా! సదా మీకు భక్తితో నొక్కు తులసీదళమును సమర్పించిన వాడు గరుడోరగ సమూహముతో ప్రకాశించును గదా! అటులనే మీ పాదారవిందములను పూజించువారికి అరచేతియందు ఉసిరికాయవలె మోక్షము లభించునటకదా! అటులనే నీ పాదారవిందములను పూజించుచున్న మాకు మోక్షపదమివ్వ కోరుచున్నాను. వెంటనే దయచేయుడు రామా! నీకు నమస్కారం.

భానుఁడు తూర్పునందు గనుపట్టినఁబావక చంద్రతేజముల్
హీనత చెందినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము చేయుచున్నఁబరదైవ మారీచు లడంగకుండునే
దానవ గర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: రామా! సూర్యకాంతికి అగ్నిమున్నగు కాంతులు క్షీణించినట్లు, నీ పద ధ్యానము యొక్క ప్రకాశముచే జగమంతయు నిండి ఉన్నది. అందుచే ఇతర దేవతల ప్రకాశము క్షీణించిపోవుచున్నది. అందుచే కావున ఇతర దేవతలను ఆశ్రయించక నిన్నే ఆశ్రయించుచున్న నేను మోక్షపద స్థానమును కోరుచున్నాను. రాక్షసుల గర్వమును హరించిన రామా! నీకు నమస్కారము.

నీ మహనీయతత్త్వరస నిర్ణయబోధ కథామృతాబ్దిలో
దా మును గ్రుంకులాడక వృధా తను కష్టముజెంది మానవుం
డీ మహిలోక తీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ
త్తామస పంకముల్ విడునె దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: నీ గొప్పతత్వముతో కూడిన కథామృత సముద్రములో మునగక, శరీర కష్టము చెంది మనుజులెన్ని తీర్థముల మునిగిననూ, మనస్సున కంటిన తమోగుణమను బురద వీడిపోవద్దు గదా! అలాగే దుర్వికార చేష్టలతో పాపపు పనులు చేసినాను. నన్ను వాటిబారి నుండి రక్షింపుము రామా! నీకు నమస్కారము.

జనవర మీకథాళి విన సైపక కర్ణములందు ఘంటికా
నినద వినోదముల్ సలుపు నీచునకున్ వరమిచ్చినావు ని
న్ననయము నమ్మి కొల్చిన మహాత్మున కేమియొసంగెదో సనం
దననుత మాకొసంగుమయ దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: ఓ రామా! మీ చరిత్రలను వినుటకు ఓర్పుజాలక చెవులయందు ఘంటల శబ్దములను వేడుకగా వినుచూయున్న మనుజులకు ఏమి ఇచ్చెదవో, సనందన మహర్షిచేత కొనియాడబడిన కరుణా సముద్రడవగును ఓ రామా! నీకు నమస్కారము.

పాపము లొందువేళ రణపన్నగ భూత భయజ్వరాదులం
దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్
బ్రాపుగ నీవుఁదమ్ము డిరుపక్కియలన్ జానీ తద్విపత్తి సం
తాపము మాన్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: రామా! పాపములు పొందునపుడును, యుద్ధము, సర్వ భయము, భూత బాధలు, శరీరమందు రోగాదులు మున్నగు ఆపదలు కల్గిన వెంటనే, నిన్ను కొలుచు వారికి సహాయము చేయుటకై నీకు, తమ్ముళ్ళయిన లక్ష్మణ, భరతులను ఇరుప్రక్కల పెట్టుకొని సన్నిధికొచ్చి రక్షించెదవని లోకులు పలుకుచున్నారు. కాబట్టి ఆపదలలో యున్న నన్ను రక్షింపుము భద్రాద్రి రామా! నీకు నమస్కారము.

భ్రమరము కీటకంబుఁగొని పాల్పడిఝాంకరణోపకారియై
భ్రమరముగా నొనర్చునని పల్కుటఁజేసి భవాదిదుఃఖసం
తమస మెడల్చి? భక్తిహితం బుగ జీవుని విశ్వరూప త
త్త్వము, నధరించుటే మరుదు దాశరథీ కరుణాపయోనిధీ!

తాత్పర్యం: రామా! తుమ్మెద పురుగుని పట్టుకొని తన ఝుంకారంతో తమ్మెదగా మార్చి తిరుగునట్లు పుట్టుకనుండి చీకటిబాపి జీవునినీలో కలుపుకొనుటలో విశేషమేమియునూ లేదుకదా! అలాగే నా పాపపు జన్మను నీలో ఐక్యము పొందునట్లుగా చేయుము రామా! నీకు నమస్కారము.

ఆధారము: తెలుగు పెన్నిధి.కం© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate