অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

భాస్కర శతకం

భాస్కర శతకం

ఒక్కడు మాంసమిచ్చె మఱియొక్కడు చర్మము గోసి యిచ్చె వే
ఱొక్కరు డస్థి నిచ్చె నిక నొక్కడు ప్రాణములిచ్చె వీరిలో
నొక్కనిపట్టునన్ బ్రదుక నోపక యిచ్చిరొ కీర్తి కిచ్చిరో
చక్కగ జూడు మంత్రి కుల సంభవ! రాయనమంత్రి భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! ఒకరు శరీరంలో నుండి మాంసాన్ని కోసి ఇచ్చారు. ఒకరు చర్మం కోసి ఇచ్చారు. మరొకరు వెన్నెముక ఇచ్చారు. ఇంకొకరు ప్రాణమే ఇచ్చారు. వీళ్ళంతా బతక లేక ఈ పనులు చేయలేదు, కీర్తికోసం చేయలేదు. ఓ మంత్రి కులంలో జన్మించిన రాయన భాస్కరుడా! బాగా ఆలోచించి చూడు(ఒక పావురాన్ని కాపాడటం కోసం శరీరం నుండి మాంసం కోసి ఇచ్చినవాడు శిబి చక్రవర్తి. ఇంద్రుడడిగితే సహజ సిద్ధమైన కవచకుండలాలను ఇచ్చినవాడు కర్ణుడు. రాక్షస సంహారానికి ఇంద్రునకు ఆయుధంగా తన వెన్నెముకను ఇచ్చినవాడు దధీచి. వామనుడడిగితే ప్రాణమే ఇచ్చినవాడు బలిచక్రవర్తి. వీళ్ళంతా త్యాగధనులు, మహాదాతలు).

పరహితమైన కార్యమతి భారతముతోడిదియైన పూను స
త్పురుషుడు లోకము ల్పొగడ, పూర్వమునం దొక రాలవర్షమున్
కురియగ చొచ్చినన్ కదిసి గొబ్బున గోజన రక్షణార్థమై
గిరి నొక కేల ఎత్తెనట కృష్ణుడు ఛత్రము భాతి భాస్కరా!

తాత్పర్యం: లోకులకు హితాన్ని కలిగించే పని ఎంత కష్టమైనది అయినా మంచివాడు పూనుకుంటాడు. పూర్వం రాళ్ళ వర్షం కురిసినప్పుడు గోవులను, గోపాలకులనూ రక్షించటానికి కృష్ణుడు కొండనే ఎత్తి గొడుగుగా పట్టాడు.

సిరిగల వాని కెయ్యెడల చేసిన మేలది నిష్పలం బగున్
నెఱి గుఱిగాదు పేదలకు నేర్పున చేసిన సత్పలంబగున్
వఱపున వచ్చి మేఘు డొక వర్షము వాడినచేలమీదటన్
కురిసిన గాక అంబుధుల కుర్వగ నేమి ఫలంబు భాస్కరా!

తాత్పర్యం: ధనవంతునికి మనం చేసే మేలు వ్యర్థం. పేదవానికి చేస్తే ప్రయోజనం కలుగుతుంది. వానలు లేనపుడు ఎండిపోతూ ఉన్న చేల మీద మేఘుడు వాన కురిస్తే ఫలితం ఉంటుంది కానీ, సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఉండదు కదా!

దక్షుడు లేని యింటికిఁబదార్థము వేఱొక చోట నుండి వే
లక్షలు వచ్చుచుండినఁబలాయనమై చనుఁగల్ల గాదు ప్ర
త్యక్షము వాగులున్ వరద లన్నియు వచ్చిన నీరు నిల్చునే
అక్షయమైన గండి తెగనట్టి తటాకములోన భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! గట్లు తెగి గండి పడి యున్న పెద్ద చెరువులోనికి ఎన్ని వైపులనుండి ఎంత గొప్ప ప్రవాహములు ఎన్ని వాగులు వచ్చి పడిననూ ఆ నీరు నిలువదు కదా! అదే విధంగా, ఒక కుటుంబమునకు ఎన్ని విధములుగా ఎంత ఆదాయము వచ్చిననూ ఆ సంపదను ఒక పద్ధతి ప్రకారము నిర్వహించు సమర్థుడైన యజమాని లేక పోయినచో ఆ సంపదలన్నియు వ్యర్థముగా ఖర్చయిపోవునని భావం.

సన్నుత కార్యదక్షు డొకచాయ నిజప్రభ యప్రకాశమై
యున్నపుడైన లోకులకు నొండక మేలొనరించు సత్వసం
పన్నుడు భీము డా ద్విజులప్రాణము కావడె ఏకచక్రమం
దెన్నికగా బకాసురుని నేపున రూపడగించి భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! భీముడు బ్రాహ్మణ వేషములో అజ్ఞాతముగా గడుపవలసి వచ్చిన సమయమున కూడా ఏకచక్ర పురము నందలి బ్రాహ్మణ కుటుంబమును బకాసురుని బారి నుండి రక్షించగలిగినవాడు. కనుక కార్యదక్షుడైనవాడు ఏ కారణము చేతనైననూ తన గొప్పతనమును మరుగు పరచుకొనవలసి వచ్చిననూ, ఇతరులకు తనకు చేతనైనంత మేలు ఏదైననూ చేయగలడని భావం.

అడిగినయట్టి యాచకుల ఆశ లెరుంగక లోభవర్తియై
కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వానికె
య్యెడల; అదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్
కుడువగ నీనిచో కెరలి గోవులు తన్నును గాక భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! దూడలను తాగనియ్యక పాలు తీసుకోవాలని సిద్ధపడితే ఆవులు పాలియ్యవు సరి కదా తంతాయి. అలాగే ఏదో యిస్తారని ఆశతో వచ్చి చేయిచాచి అడిగే వారికి లోభితనముతో లేదు పొమ్మంటే ధర్మ దేవత ఆ లోభికి ధనం ఎప్పటికీ రాకుండా చేస్తుంది. అడిగిన వారికి ఎంత కొంత యిస్తూ ఉంటే ధనం ఏదో విధంగా వస్తూ ఉంటుంది. కాబట్టి యాచించే వారిని చులకనగా చూచి "లేదుపో" అని అనకూడదు.

తగిలి మదంబుచే నెదిరి తన్ను నెఱుంగక దొడ్డవానితో
పగఁగొని పోరుటెల్ల నతిపామరుఁడై చెడు, టింతెగాకఁ?
నెగడి జయింప నేరఁ,డది నిక్కము, దప్పదు; ధాత్రి లోపలన్
దెగి యొక కొండతో తగరు ఢీకొని తాకిన నేమి భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! ఎదుటివాని శక్తిని, తన శక్తిని గ్రహించక గొప్పవానితో శత్రుత్వం పూని మదంతో పోరాడటం వల్ల, అవివేకియై చెడిపోవడమే గాని తాను జయింపలేడు. అది నిజము. పొట్టేలు సాహసంతో కొండను ఢీ కొంటే దాని ప్రాణం పోతుంది కదా!

ఊరక సజ్జనుండొదిగి యుండిననైన దురాత్మకుండు ని
ష్కారణ మోర్వలేక అపకారము చేయుట వాని విద్యగా
చీరలు నూరుటంకములు చేసెడివైనను పెట్టెనుండగా
చేరి చినింగిపో గొరుకు చిమ్మట కేమి ఫలంబు? భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! ఎంతో విలువైన బట్టలు పెట్టెలో ఉండగా చిమ్మట పురుగు వాటికి చిల్లులు పెట్టి కొరికి పాడుచేస్తుంది. దానివల్ల ఆ పురుగుకి ఏమి లాభం లేదు. వాటికి పాడు చెయ్యటం ఒక స్వభావం. అలాగే ఎవ్వరినీ ఏమీ పెల్లెత్తు అనక తన ఇంట తానున్న సజ్జనుణ్ణి నిష్కారణంగా దుర్జనుడు అపకారం చేసి బాధ పెడతాడు. వాడికి వచ్చే లాభం ఏమీ లేదు. అది చెడ్డవాని గుణం.

సంతత పుణ్యశాలి యొక జాడను సంపద వాసిపోయి తా
నంతట పోకనెట్టుకొని యెప్పటియట్ల వసించియుండు; మా
సొంతము నందు చందురుని యన్ని కళల్ పెడబాసి పోయినన్
కాంతి వహింప డోటు తిరుగంబడి దేహము నిండ! భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! పుణ్యాత్ముడు తన సంపద అంతా పోయినా బాధపడక ఎప్పటిలా ఉంటాడు. చంద్రుడు నెల చివర కళలన్నీ పోయినా మళ్ళీ కాంతివంతునిగా వెలుగొందును కదా!

శ్రీగల భాగ్యశాలిఁగడుఁజేరఁగవత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వను
ద్యోగముచేసి; రత్ననిలయుండని కాదె సమస్త వాహినుల్
సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా!

తాత్పర్యం: మునులచే స్తుతింపబడిన సర్వజనులకు గురుమూర్తియగు ఓ భాస్కరా! జనులు భాగ్యవంతుల వద్దకు చాలా దూరము. శ్రమయని గుర్తించక ఓర్పుతో నివశించుటకు, తమంతట తామే, ప్రేమతో పయనమై వస్తారు. ఎట్లనగా రత్నములకు నిధియగు సముద్రుని వద్దకు సాగరములన్నియును ప్రకృతి సిద్ధముగాచేరును గదా! అలాగే సమ్పదలున్నవాని వద్దకు జనులు ఆహ్వానము లేకుండానే వస్తారని భావం.

అంగన నమ్మరాదు తనయంకెకురాని మహాబలాడ్యువే
భంగుల మాయలొడ్డి చెఱపందల పెట్టు, వివేకియైన సా
రంగధరుం బదంబుఁగరంబులు గోయఁగజేసెఁదొల్లిచి
త్రాంగియనేకముల్ నుడవరాని కుయుక్తులు పన్ని భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా!స్త్రీ వ్యామోహముచే పురుషుని కోరగా అతడు నిరాకరించినచో వానికి అనేక నిందారోపణములు చేసి, రాజులచే కఠిన శిక్ష విధించు వరకు తన పన్నాగము వదలదు. పూర్వము చిత్రాంగియను స్త్రీ సారంగధరుని ప్రేమించగా, అతడు నిరాకరణ తెలుపగా రాజు వద్దకు వెళ్ళి అనేక ఫిర్యాదులు చేసి అతని కాళ్ళు, చేతులు నరికించినది కదా! అందుకే అలాంటి స్త్రీలను నమ్మరాదు. బలవంతుడైననూ బాధలకు గురియగును.

అక్కఱపాటు వచ్చు సమయంబునఁజుట్టములొక్కరొక్కరి
న్మక్కువనుద్దరించుటలు మైత్రికిఁజూడగ యుక్తమేసుమీ
యొక్కట నీటిలో మెరక నోడల బండ్లను బండ్లనోడలన్
దక్కక వచ్చుచుండుట నిదానముగాదె తలంప భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! మానవులు ఇచ్చిపుచ్చుకొనుట సహజము. అలాగే అవసరమున్న వేళయందు బంధువులు ఒకరినోకరు ప్రేమతో, కష్టముతో నుండిన వేళలయందు ఉద్ధరించుటకు ప్రయత్నములు చేయుట స్నేహమునకు భావం. ఎలాగనగా, నీటిలో పడవల మీద బండ్లు తీలుకొని వెళ్లునట్లు.భూమి మీద బండ్ల మీద పడవలను తీసుకువెళ్ళునట్లు. అలాగే తగిన అవసరము వచ్చిన వేళ ఒకరినొకరు అన్యోన్యతలు పాటించాలని సారాంశము.

అతిగుణహీనలోభికిఁబదార్థము గల్గిన లేకయుండినన్
మితముగఁగాని కల్మిగల మీఁదటనైన భుజింప డింపుగా
సతమని నమ్ము దేహమును సంపద, నేఱులునిండిపాఱినన్
గతుకగఁజూచుఁగుక్కదన కట్టడ మీఱక యెందు భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! సద్గుణములు లేని లోభి వానికి సంపద కల్గిననూ, లేకపోయిననూ మితముగా భుజించను. సంపద కల్గిన మీదట కూడా లేని వానివలె భుజించును. ఎందుకనగా శరీరము, భాగ్యము, శాశ్వతమని నమ్మి జీవనము గడుపును. ఎట్లనగా నదులు సంపూర్తి జలముతో ప్రవహించుచూ గడుపును. ఎలాగనగా నదులు సంపూర్తి జలముతో ప్రవహించుచున్ననూ, కుక్క తన అలవాటు చొప్పున నాలుకతో నీటిని త్రాగును కదా!

అదను దలంచి కూర్చిప్రజ నాదర మొప్పవిభుండు కోరినన్
గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టితెండనన్
మొదటికి మోసమౌబొదుగు మూలము గోసిన బాలు గల్గునే
పిదికినఁగాక భూమిఁబశు బృందము నెవ్వరికైన భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! పాలకోరకు పశువుల పొదుగు మూలమున పిదికినచో పాలు లభించును. పొదుగును కోసినచో పశు ప్రాణమునకే ముప్పు వచ్చును. అట్లే రాజు అవసరార్థము కనిపెట్టి ప్రజలను ఆహ్వానించి వినయముతో ధనమడిగిన వెంటనే తెచ్చి నిత్తురు. వానిని భయకంపితులను చేసి ధనమడిగినచో ముప్పు వచ్చును. రాజు పల్కిన ప్రల్లదనములను సహించక తిరుగుబాటు చేయుదురు ప్రజలు.

అనఘునికైనఁజేకుఱు ననర్హుని గూడి చరించినంతలో
మన మెరియంగ నప్పుఁడవమానము కీడుధరిత్రియందు నే
యనువుననైనఁదప్పవు యథార్థము తానది యెట్టులన్నచో
నినుమునుగూర్చి యగ్ని నలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! ఇనుముతో కలిసియున్న అగ్నికి సమ్మెటపోటు పడినట్లుగా లోకము నందు తగనివానితో స్నేహము చేయుచూ సంచరించు వానికి, ఎంతటి సద్గుణ వంతునకైననూ నేదియో నొక సమయాన అవమానం, హాని, కలుగును. ఇయ్యది తప్పనిసరిగా గుర్తించు కొనును.

అవని విభుండు నేరుపరియై చరియించిన గొల్పువార లె
ట్లవగుణలైన నేమి పనులన్నియుఁజేకుఱు వారిచేతనే
ప్రవిమల నీతిశాలియగు రాముని కార్యము మర్కటంబులే
దవిలి యొనర్పవే? జలధి దాటి సూరారులద్రుంచి భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! మిక్కిలి రాజనీతిగల రాముని కార్యమును వానరులు పూనుకొని సముద్రమును దాటి లంకా నగరమును ప్రవేశించి, రాక్షసులను వధించి సీతను తీసుకువచ్చి, కార్యమును సాధించెను. అటులనే రాజు నేర్పరి యైనచో సేవకులు అల్పులైననూ వారిచే కార్యము లన్నియును సాధించి తీరగలడు. కొంచం ఆలస్యంగానైనా సాధించవచ్చు.

ఈజగమందుఁదా మనుజు డెంత మపోహాత్మకుడైన దైవమా
తేజము తప్పఁజూచునెడఁద్రిమ్మరికోల్పడుఁనెట్లన న్మహా
రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడ గాయలాకులున్
భోజనమై తగ న్వనికిఁబోయి, చరింపఁడె మున్ను భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! మానవుడు ఎంత గొప్పవాడైననూ గ్రహయోగ బలము వక్రించినచో నా గొప్పతనమంతయూ తగ్గిపోయి, దేశ సంచారియై తప్పక తిరగవలసిన స్థితి ఏర్పడవచ్చును. ఎట్లనగా శ్రీ రామచంద్రుడు కాలి నడకతో అడవి కేగి ఆకులు, కాయలు మున్నగునవి భుజించి, తిరిగి రాజ్యమునకు వచ్చెను కదా! అలాగే విధి వక్రించినచో ఎంత వాడైననూ విధిననుసరించి నడవవలసిందేనని భావం.

ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మ దలంచి యుగ్రవా
కృరుషతజూపినన్ఫలముకల్గుట తథ్యముగాదె యంబురం
బురిమిన యంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ
స్థిరతర పౌరుషంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! మేఘుడు ప్రాణంబున భయము గలుగునట్లు ఉరిమి వెంటనే జనులను రక్షించు పట్టుదలతో నానందము కలుగునట్లు వర్షించును. ఆ విధంగా మిక్కిలి దయగలవాడు సమయానుకూలంగా కఠిన వాక్యములు పల్కిననూ తదుపరి తప్పక మేలునే చేయును, కీడు మాత్రం చేయడు.

ఊరక వచ్చుఁబాటుపడిన కుండిననై న ఫలం బదృష్టమే
పారఁగఁగల్గువానికిఁబ్రయాసము నొందిన దేవదానవుల్
వార లటుండగా నడుమ వచ్చిన శౌరికిఁగల్గెగాదె శృం
గారపుఁబ్రోవు లచ్చియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! సముద్రమునందు రత్నములు పుట్టును. దేవతలు, రాక్షసులు కౌస్తుభమణి కొరకు కష్టపడి సముద్రమును చిలికెను. కాని రాక్షస, దేవతల మధ్య శ్రీమహావిష్ణువునకు శృంగారవతియగు కౌస్తుభమణి లభించునని భావము. దరిద్రునకు కష్టించిననూ ఫలితం ఉండదని భావం.

ఎట్టుగఁబాటు పడ్డ నొకయించుక ప్రాప్తము లేక వస్తువుల్
పట్టుపడంగా నేరవు నిబద్ద సురావళిఁగూడి రాక్షసుల్
గట్టు పెకల్చి పాల్పడలిఁగవ్వము చేసి మథించి రంతయున్
వెట్టియెకాక యే మనుభవించిరి వా రమృతంబు భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! అమృతము కొరకు రాక్షసులు దేవతలు స్నేహముతో కలసి మందరగిరిని ద్రెచ్చి కవ్వముగా జేసి, పాల సముద్రమును చిలికిరి. వీరు పడిన పాట్లు వ్యర్థము. కాని అమృతం లభించలేదు. ఆ విధముగానే మానవుడెంత కష్టపడిననూ దాననుభవింపదగిన అదృష్టము లేకపోయినచో ఫలితము లభించదు.

ఎడ్డెమనుష్యుఁడేమెఱుఁగు నెన్ని దినంబులు గూడియుండినన్
దొడ్డ గుణాడ్యునందుఁగల తోరపు వర్తనల్లఁబ్రజ్ఞ బే
ర్పడ్డ వివేకి రీతి; రుచిపాకము నాలుక గాకెఱుంగనే?
తెడ్డది కూరలోఁగలయ ద్రిమ్మరుచుండినైన భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! మూఢాత్ముడు గుణవంతుని వెంట తిరుగుచున్ననూ అతని సద్గుణములతో కూడిన నడవడికలు గుర్తించలేడు, జ్ఞాని గుర్తించగలడు. ఎలాగనగా కూరలో తిరుగుచున్న తెడ్డు ఆ రుచిని గుర్తించలేదు. కూర యొక్క రుచి నాలుక గుర్తించును.

ఘనుఁడొక వేళఁగీడ్పడిన గ్రమ్మఱ నాతని లేమి వాపఁగాఁ
గనునొక నొక్కసత్ప్రభువు గాక నరాధము లోప రెందఱుం
బెనుఁజెఱు వెండినట్టితఱిఁబెల్లున మేఘుఁడుగాక నీటితో
దనుపఁదుషారముల్ శతశతంబులు చాలునటయ్య భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! పెద్ద తటాకము నందు నీరు యెండిపోయినచో మరల నీటితో నింపుటకు మేఘమే వర్శించవలెను కాని మంచు బిందువులెన్ని వర్షించిననూ తటాకము నీటిలో నిండదు కదా! అలాగే గొప్పవానికి కష్ట దశ ప్రాప్తించి కష్టములనుభవించుచున్నచో, నా కష్టములను తీర్చుటకు ఒక రాజు కావలెయును కాని, సామాన్య మానవుడు ఏమియునూ చేయలేడు. అది క్షణకాల భోగము మాత్రమేయగునని భావం.

ఏల సమస్తవిద్యల నొకించుక భాగ్యము గల్గియుండినన్
జాలు ననేక మార్గములసన్నుతి కెక్క నదెట్లొకో యనన్
ఱాలకు నేడ విద్యలు? తిరంబగు దేవత రూప చేసినన్
వ్రాలి నమస్కరించి ప్రసవంబులు పెట్టరె మీద భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! రాళ్ళు విద్య నేర్వకున్ననూ వాటి అదృష్టముచే దేవతా ప్రతిమలగును. జనులు ఆ ప్రతిమలకు పూలతో అర్చనలు, పూజలు చేసి తరిస్తారు. అటులనే అదృష్టరేఖ ఉన్నచో సమాజమునందు కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లుతారు. అంటే విద్యలేకపోయిననూ అదృష్ట రేఖ ముఖ్యమని భావము.

ఒక్కఁడెచాలు నిశ్చలబలోన్నతుఁడెంతటి కార్యమైనఁదాఁ
జక్కనొనర్ప గౌరవు లసంఖ్యులు పుట్టిన ధేనుకోటులం
జిక్కగనీక తత్ప్రబలసేన ననేక శిలీముఖంబులన్
మొక్కపడంగఁజేసి తుదుముట్టఁడె యొక్క కిరీటి భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! దుర్యోధనాదులు గొప్పసేనతో కూడి విరాటరాజు యొక్క ఆవుల మందను తన వశము చేసుకొని తోలుకొని పోవుచుండగా అర్జునుడొక్కడే అనేక బాణములతో యుద్ధము చేసి వారలను జయించి గోవులను మరలించుకొని విరాటరజునకప్పగించెను. అటులనే స్థిరమైన బలవంతుడెంతటి కార్యమునైననూ చేయగలడు.

పట్టుచుఁదండ్రి యత్యథమువర్తనుఁడైననుగాని వానికిం
బుట్టిన పుత్రకుండ తన పుణ్యవశంబున దొడ్డ ధన్యుఁడౌ
నెట్టన మఱ్ఱివిత్తు మునుపెంతయు గొంచెము దానబుట్టునా
చెట్టు మహోన్నతత్వమును జెందదే శాఖలనిండి భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! మర్రిచెట్టు విత్తనము చిన్నదైననూ దాని నుండి పెరిగిన వృక్షము శాఖోపశాఖలుగా మహావృక్షమగును. అలాగే తండ్రి నీచప్రవర్తన గలవాడైననూ వానికి పుట్టిన కుమారుడు తన పూర్వపుణ్యాన గొప్పవాడుగా కావచ్చని భావం.

స్థానము తప్పివచ్చునెడఁ తానెటువంటి బలాడ్యుడున్ నిజ
స్థానికుడైన యల్పుని కతంబుననైనను మోసపోవుగా
కానలలోపలన్ వెడలి గందగజం బొకనాఁడు నీటిలో
గానక చొచ్చినన్ మొసలికాటున లోఁబడ దోటు భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! మదించిన ఏనుగు అడవిని వదిలి నీటియందు ప్రవేశము గల్గిన తోడనే మొసలికి లొంగిపోయినది గదా! అలాగే మానవుడెంత బలము గల వాడైననూ తన స్థానమును విడిచి, అన్య స్థానమును చేరినచో బలము తగ్గి పరాభవములు పొందునని భావం.

కట్టడదప్పి తాము చెడు కార్యముఁ చేయుచునుండిరేనిఁదో
బుట్టినవారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యముం
దొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యుఁడా
పట్టున రాముఁజేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! దశకంఠుడగు రావణబ్రహ్మ యొక్క సోదరుడు విభీషణుడు అన్నను వదిలేసి, శ్రీ రామమూర్తికి నేస్తమై అతనిచే శాశ్వతమైన లంకానగరాథిపత్యమును పొందెను. అలాగే చెడ్డ పనులు చేసినచో సోదరుడైననూ వానిని విడిచిపెట్టుట తథ్యమని భావం. రావణబ్రహ్మ సీతను అపహరించుకొని పోవుటయే చెడ్డపని.

ప్రేమను గూర్చి యల్పునకుఁబెద్దతనంబును దొడ్డవానికిం
దామతి తుచ్ఛపుంబని నెదం బరికింపగా యీయరాదుగా
వామకరంబుతోడ గుడువం గుడిచేత నపానమార్గయుం
దోమగవచ్చునే మిగులఁదోచని చేతులుగాక భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! లోకంలో నీచునకు గొప్ప పదవిని, గొప్పవానికి చిన్న పదవి నిచ్చి పనులు చేయించుచో ఆ పాలనమంతయు ఆలోచన లేక ఎడమ చేతితో భుజించుటయును, కుడి చేతితో మల మూత్రములు శుభ్రపరచుటయును యగును.

తెలియని కార్యమెల్లఁగడతేర్చుట కొక్కవివేకి జేకొనన్
వలయునట్లైన దిద్దుకొనవచ్చుఁబ్రయోజనమాంద్యమేమియుం
గలుగదు ఫాలమందు దిలకం బిడునప్పుడు చేతనద్దమున్
గలిగిన జక్క జేసికొనుగాదె నరుం డది చూచి భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! మనుజుడు నుదుటి యందు బొట్టును పెట్టుకొనుచూ చేతి యందు అద్దముతో బొట్టును వంకర టింకర లేకుండా సరిచేసుకొనును. అలాగే నేర్పరి వద్దకెళ్ళి పనులను చక్కదిద్దుకొని సంతోషాతిశయమును తెలివిగలవాడు పొందునని భావం.

ఆధారము: తెలుగు పెన్నిధి.కం© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate