ఇక మీదట ఎవరైనా, దేశంలో ఏమూలన నివసించే వారైనా ఐఐటిల నుంచి ఇండియన్ మెడికల్ రీసెర్చి కౌన్సిల్‌లో పాఠాలు బోధించే ప్రొఫెసర్ల దగ్గర చదువుకోవచ్చు. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్డ్ లెర్నింగ్ (ఎన్‌పిటిఈల్) అనే ప్రాజెక్ట్‌ను హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టుతో కలిసి గూగుల్ ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా పాఠాలను అందిస్తోంది. కేవలం పాఠాలు చెప్పి ఊరుకోకుండా విద్యార్థులకు నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తారు.
కోర్సు పూర్తి చేసుకున్న వాళ్లకు సర్టిఫికెట్‌లు ఇస్తారు. అయితే కోర్సు ఉచితంగా నేర్పించినప్పటికీ పరీక్ష రాసేందుకు మాత్రం నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. కంప్యూటర్ సైన్సు, మేనేజ్‌మెంట్, సోషల్ సైన్సెస్, సివిల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్సు రంగాలకు చెందిన 47 కోర్సులను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. దేశంలో పేరుగాంచిన ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్‌పూర్, ఐఐటి ముంబయి, చెన్నయ్ మ్యాథమెటికల్ ఇనిస్టిట్యూట్, ఇండియన్ మెడికల్ రీసెర్చి కౌన్సిల్ ఫ్యాకల్టీ ఆన్‌లైన్‌లో బోధిస్తారు.
రెగ్యులర్ యూనివర్శిటీ మోడల్‌లోనే ఈ కోర్సులను రూపొందించారు. వీడియో లెక్చర్స్, రీడింగ్ మెటీరియల్, క్విజ్‌లు, అసైన్‌మెంట్లు ఉంటాయి. పాఠం నిడివి బట్టి మెటీరియల్‌ను మూడు భాగాలుగా 10, 20, 40 గంటలుగా విభజించారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలను కోర్సు కాలపరిమితిలోనే తీర్చే సౌకర్యం కూడా ఉంది. దీంతోపాటు ఆన్‌లైన్ డిస్కషన్ ఫోరమ్‌ల్లో కూడా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
గడిచిన రెండేళ్లలో ఇప్పటివరకు 90 ఆన్‌లైన్ కోర్సులను అందించారు. దాదాపు నాలుగు లక్షల మంది సర్టిఫికెట్లు అందుకున్నారు. చదువుకోవాలన్న ఆసక్తి ఉండి మ్యాథమెటిక్స్, ఏరోనాటిక్స్, కంప్యూటింగ్ రంగాల్లో పరిణితి పెంచుకోవాలంటే ఇది మంచి రిసోర్సుగా ఉపయోగపడుతుంది. మరిన్ని వివరాలకోసం ఎన్‌పిటిఈల్ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి. కోర్సుల్లో ఎన్‌రోల్ చేసుకోండి.
http://nptel.ac.in/
ఆధారము: ఆంధ్రజ్యోతి