অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కలినరీ మీ కలా..

కలినరీ మీ కలా..

కొందరు తమ కలలు సాకారం చేసుకునేందుకు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఇంకొందరు మనసొప్పకపోయినా తప్పదనుకుని ఏదో ఒక కంపెనీలో చేరిపోతారు. మరికొందరుంటారు.. వీళ్లకు కెరీర్‌తో పాటు కిక్‌ కూడా కావాలి. అలాంటివారికి బెస్ట్‌ ఆప్షన్‌ కలినరీ ఆర్ట్స్‌. కుకింగ్‌ విభాగంలో ఇప్పుడు బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ఎన్నెన్నో కోర్సులూ వచ్చేశాయి.

వండేవారికి.. తినేవారికి.. రిటైర్మెంట్‌ ఉండదు. ఈ సూత్రమే కుకింగ్‌ కోర్సులకు నానాటికీ డిమాండ్‌ పెరగడానికి కారణం అవుతోంది. ఇంజనీరింగ్‌, కామర్స్‌ రంగాలపై ఆసక్తి లేని విద్యార్థులు చాలామంది తమ కెరీర్‌ ఆప్షన్‌గా కలినరీ ఆర్ట్స్‌ను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే చదువులు ముగించుకుని.. ఉద్యోగాల్లో స్థిరపడిన వారు సైతం అభిరుచిలో భాగంగా రుచులు వండటంలో తర్ఫీదు పొందుతున్నారు. అవకాశాలు విస్తృతం అవుతుండటంతో చాలా మంది గృహిణులు కూడా పాకశాలలో చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పలు యూనివర్సిటీలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, ప్రైవేట్‌ కళాశాలలు, పెద్ద పెద్ద హోటళ్లు కలినరీ ఆర్ట్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. డిప్లమో నుంచి మాస్టర్స్‌ వరకు రకరకాల కోర్సులు ఆఫర్‌ చేస్తున్నాయి.

ఆసక్తి గలవారికి..

కుకింగ్‌ అనేది ఒక ఆర్ట్‌. ఆసక్తి, ఉత్సాహం ఈ రెండూ ఉన్నప్పుడే ఈ రంగంలో ముందుకు వెళ్లడం సాధ్యమవుతుంది. హోటల్‌ మేనేజ్‌మెంట్‌కు అనుబంధంగా ఉన్న కలినరీ ఆర్ట్స్‌లో రకరకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఫుడ్‌ ప్రొడక్షన్‌, ఫుడ్‌ అండ్‌ బివరేజ్‌ (ఎఫ్‌ అండ్‌ బీ) విభాగాలు ఆసక్తిగల వారిని అమితంగా ఊరిస్తుంటాయి. ఫుడ్‌ ప్రొడక్షన్‌లో ఆహారం తయారు చేస్తారు. ఎఫ్‌ అండ్‌ బీలో హోటల్‌కు వచ్చే అతిథుల అవసరాలను గుర్తించి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఫ్రంట్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌, హౌస్‌ కీపింగ్‌ రంగాలపట్ల యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. అదే సమయంలో పదిమందిలో ఒకరిగా రాణించాలని కోరుకునేవారు మాత్రం ఫుడ్‌ ప్రొడక్షన్‌, ఎఫ్‌ అండ్‌ బీ రంగాల వైపు మొగ్గు చూపిస్తున్నారు

 

ప్రవేశం ఎలా..

హోటల్‌ మేనేజ్‌మెంట్‌కు అనుబంధంగా ఉండే కలినరీ ఆర్ట్స్‌లో పదో తరగతి పాసైన వారికి కూడా ప్రవేశం లభిస్తుంది. చదువుకు తగ్గట్టుగా మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లు వివిధ రకాలైన కోర్సులు, కరికులమ్స్‌ ఫాలో అవుతున్నాయి. అర్హతలను బట్టి కోర్సులు డిజైన్‌ చేస్తున్నాయి. సర్టిఫికేట్‌/ డిప్లమో కోర్సులకు పదో తరగతి, బ్యాచిలర్‌ కోర్సులకు ఇంటర్మీడియెట్‌, పీజీ డిప్లమో కోర్సులకు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు అర్హులు. అడ్మిషన్స్‌కు సంబంధించిన వివరాలను ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల వెబ్‌సైట్ల ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు. ఎడ్యుకేషన్‌లో భాగంగా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్య నానాటికీ గణనీయంగా పెరుగుతోంది. ఇతర కెరీర్‌లో ఉన్న వారు సైతం హాబీ కొద్ది డిప్లమో, సర్టిఫికేట్‌ కోర్సులు చేస్తున్నారు. ఇలాంటి వారి కోసం పలు ఇన్‌స్టిట్యూట్‌లో వెకేషన్‌ సర్టిఫికేట్‌ కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయి. ఆసక్తి గల గృహిణుల గురించి ప్రత్యేకంగా ట్రైనింగ్‌ క్లాసులు ఏర్పాటు చేస్తున్నాయి
అవకాశాలు..
ఆర్థికాభివృద్ధి ఊపందుకోవడంతో హోటల్‌ మేనేజ్‌మెంట్‌, సంబంధిత రంగాలకు ఢోకా లేదనే చెప్పొచ్చు. ఓ మోస్తరు హోటల్స్‌ కూడా బాగా బిజినెస్‌ చేస్తున్నాయి. ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలో హోటల్‌ పరిశ్రమలో మన దేశం రెండో స్థానంలో ఉంది. పర్యాటక రంగం దినదినాభివృద్ధి చెందుతుండటం కూడా కలినరీ ఆర్ట్స్‌ అవకాశాలకు ఊతమిస్తోంది. ఫుడ్‌ ప్రొడక్షన్‌, ఎఫ్‌ అండ్‌ బీ విభాగాల్లో డిప్లమో, సర్టిఫైడ్‌ కోర్సులు చదివిన వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కొలువులతో పాటు సొంతంగా వ్యాపారం మొదలుపెట్టడానికి కూడా ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఫుడ్‌ సెక్టార్‌లో పుట్టుకొస్తున్న స్టార్ట్‌పల వెనుక కలినరీ కోర్సుల ప్రభావం ఎంతైనా ఉంది. అందుకే మీ ప్రతిభకు కాస్త డిజిటల్‌ హంగులు అద్దగలిగితే ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంట్రీ ఇవ్వడం, సక్సెస్‌ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.
జాతీయ స్థాయిలో
నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ దేశవ్యాప్తంగా జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (జేఈఈ) నిర్వహిస్తుంది. దీనికి ఇంటర్మీడియెట్‌ / 10+2 అర్హత. ఏటా ఏప్రిల్‌/మే నెలల్లో ఈ ఎగ్జామ్‌ ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి దేశంలోని టాప్‌ 31 హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో బీఎస్సీ ఇన్‌ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కూడా ఈ పరీక్ష ద్వారానే బీఎస్సీ కోర్సులో అడ్మిషన్‌ కల్పిస్తుంది. బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేసిన వారు సాధారణ డిగ్రీ చేసిన విద్యార్థులతో పాటు యూపీఎస్సీ, రైల్వేలు వంటి అన్ని ప్రభుత్వ సంస్థల ఉద్యోగాల కోసం పోటీ పడొచ్చు.
కోర్సుల వివరాలు
  • డిప్లమో ఇన్‌ ఫుడ్‌ అండ్‌ బివరేజ్‌ సర్వీస్‌
  • డిప్లమో ఇన్‌ బేకరీ అండ్‌ కన్‌ఫెక్షనరీ
  • డిప్లమో ఇన్‌ ఫుడ్‌ ప్రొడక్షన్‌
  • బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ కలినరీ ఆర్ట్స్‌
  • బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ
  • క్రాఫ్ట్స్‌మెన్‌ కోర్స్‌ ఇన్‌ ఫుడ్‌ అండ్‌ బివరేజ్‌ సర్వీస్‌
  • సర్టిఫికేట్‌ కోర్స్‌ ఇన్‌ ఫుడ్‌ ప్రొడక్షన్‌ అండ్‌ పాటిస్సెరీ (ఏడాదిన్న కోర్సు)
  • క్రాఫ్ట్స్‌మెన్‌ కోర్స్‌ ఇన్‌ ఫుడ్‌ ప్రొడక్షన్‌
  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లమో ఇన్‌ డైటిక్స్‌ అండ్‌ హాస్పిటల్‌ ఫుడ్‌ సర్వీస్‌

 

 

టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌
కలినరీ అకాడమీ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌
www.iactchefacademy.com/
కాలేజ్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ అండ్‌ టూరిజం, న్యూఢిల్లీ
www.htcampus.com/
ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కలినరీ ఆర్ట్స్‌, న్యూఢిల్లీ
www.chefiica.com/
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, క్యాటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ అప్లయిడ్‌ న్యూట్రీషన్‌, గోవా
www.ihmgoa.gov.in
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఔరంగాబాద్‌
www.ihmaurangabad.ac.in
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, హైదరాబాద్‌
www.ihmhyd.ఆర్గ్
ఆధారము: ఆంధ్రజ్యోతి

 

 

 © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate