অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ట్రెండ్‌ సెట్టర్స్‌.. యాక్సెసరీ డిజైనర్స్‌

ట్రెండ్‌ సెట్టర్స్‌.. యాక్సెసరీ డిజైనర్స్‌

టేబుల్‌ మీద పెట్టుకునే ఫ్లవర్‌వాజ్‌, చేతికి తొడుక్కునే స్టయిలిష్‌ బాండ్‌, మెడలో ధరించే యాక్సెసరీస్‌, జేబులోని అందమైన వాలెట్‌, కాళ్లకు తొడుక్కునే డిజైనర్‌ జోళ్లు.. బెల్టులు.. కళ్లజోళ్లు.. ఒక్కటేమిటి? స్టయిలిష్‌గా కనిపించేందుకు వాడే ప్రతి వస్తువు యాక్సెసరీ డిజైనర్‌ రూపొందించనదే! ట్రెండ్స్‌ పెరుగుతున్నకొద్దీ యాక్సెసరీ డిజైనర్లకు భలే డిమాండ్‌ ఏర్పడుతోంది. ఈ కెరీర్‌లోకి వెళ్లాలంటే.. ఓ లుక్కేయండి.

కోర్సు : యాక్సెసరీ డిజైన్‌
అవకాశాలు : ఫుట్‌వేర్‌, జువెలరీ, ఇంటీరియర్‌ ప్రొడక్ట్స్‌, లెదర్‌, క్రాప్ట్స్‌
ఎక్కడ చదువుకోవచ్చు: ఎఫ్‌డిడిఐ, ఎన్‌ఐఎ్‌ఫటి, పెర్ల్‌ అకాడమీ, ఐఐసిడి, ఎన్‌ఐడి
కోర్సు కాల వ్యవధి : 3 -4 ఏళ్లు లేదా 6 నెలల నుంచి 2 ఏళ్లు.
అర్హతలు : ఇంటర్‌ తరువాత అయితే 3 లేదా 4 ఏళ్ల కోర్సులు. పదో తరగతి తరువాత అయితే షార్ట్‌టర్మ్‌ కోర్సులు.
నైపుణ్యాలు : మెటీరియల్స్‌ పట్ల పరిజ్ఞానం, డిజైన్‌ సెన్స్‌, స్కెచ్చింగ్‌, క్రియేటివిటి.

జ్యువెలరీ : ప్రిషియస్‌ అండ్‌ కాస్ట్యూమ్‌ వెరైటీ, సిల్వర్‌వేర్‌, మెటల్స్‌, స్టోన్స్‌ గిఫ్ట్‌ వేర్‌

గృహాలంకరణ సామగ్రి : స్నానాల గదులు, వంట గదుల అలంకరణకు వాడే వస్తువులు, అలంకరణ కోసం వాడే రంగురంగుల విద్యుద్దీపాలు, హోమ్‌డెకర్‌, పిల్లలు ఆడుకునే టాయ్స్‌, ఇతర ఉత్పత్తులు, మేక్‌పరూమ్‌లలో వాడే అద్దాలు, గోడగడియారాలు, చేతివాచీలు వీటి కిందికి వస్తాయి. ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌ స్టయిల్‌ : బ్యాగులు, పర్సులు, లగేజీ బ్యాగులు, సన్‌గ్లాసులు, కేశ సంరక్షణ ఉత్పత్తులు తదితరం. కార్పొరేట్‌ కార్యాలయ ఉత్పత్తులు : డెస్క్‌టాప్‌ ప్రొడక్ట్స్‌, గిఫ్టులు, ఫైళ్లు, యాక్సెసరీస్‌. ఇవన్నీ డిజైనర్లు రూపొందించేవే!
యువత ఎక్కడుంటే అక్కడ ట్రెండ్స్‌ ఉంటాయి. ఇంటి నుంచి ఆఫీసుల వరకు రోజూ పదుల సంఖ్యలో అలంకరణ వస్తువులు, యాక్సెసరీలు వాడుతుంటాం. ఏటా కనీసం నాలుగుసార్లు కొత్త ట్రెండ్స్‌ పుట్టుకొస్తాయన్నది డిజైనర్ల అభిప్రాయం. కాబట్టి ఎప్పటికప్పుడు యాక్సెసరీలను తయారు చేసేందుకు సృజనాత్మత కలిగిన డిజైనర్ల అవసరం పెద్ద ఎత్తున ఉంటోంది. ఈ రంగంలో పేరొందిన ఇన్‌స్టిట్యూట్లలో చదువు పూర్తి చేసిన వారికి సంబంధిత ఉద్యోగాలు వస్తున్నాయి.

ఎన్నెన్నో కోర్సులు
ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డిడిఐ) ఫుట్‌వేర్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును ఆఫర్‌ చేస్తున్నది. ఇంటీరియర్‌ ప్రొడక్ట్స్‌ కోసం పెర్ల్‌ అకాడమీ కూడా ఉపయుక్తమైన కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇది నోయిడాలో ఉంది. దక్షిణ ఢిల్లీ పాలిటెక్నిక్‌ కళాశాల మహిళల కోసం జువెలరీ డిజైన్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లమోను నిర్వహిస్తున్నది. ఇదే జువెలరీ డిజైనింగ్‌లో జైపూర్‌ క్యాంప్‌సలోని పెర్ల్స్‌, గాంధీనగర్‌లోని నిఫ్ట్‌ కూడా కోర్సుల్ని అందిస్తున్నాయి.
యాక్సెసరీ డిజైనింగ్‌లో వస్తున్న మార్పులకు తగ్గట్టు, ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణమైన మార్పులతో కోర్సులను అప్‌డేట్‌ చేసుకుంటున్నాయి విద్యాసంస్థలు. చదువుతోపాటు ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ఇవ్వడం, ఉద్యోగాలను చూపించడం వీటి ప్రత్యేకత. కొత్త తరం, కొత్త జీవనశైలిని అనుసరించే యువతీయువకులు పెరిగిపోతున్న దశలో.. ఫ్యాషన్‌ యాక్సెసరీలకు విపరీతమైన డిమాండ్‌ పలుకుతోంది. మార్కెట్‌లోకి ఎన్నో పేరున్న కార్పొరేట్‌ సంస్థలు సైతం వస్తున్నాయి. టైటాన్‌, పాంటలూన్స్‌, సూపర్‌ హౌస్‌ గ్రూప్‌, వెస్ట్‌సైడ్‌, రిలయన్స్‌ రిటైల్‌, కార్బన్‌, స్వార్వోస్కీ, టిఫ్పానీ, లి అండ్‌ ఫంగ్‌, లిబర్టీ షూస్‌, గీతాంజలి జువెలర్స్‌, విఐపి లగేజ్‌, తనిష్క్‌, క్రు బొస్‌, ఇంపల్స్‌, గోద్రెజ్‌, కబీర్‌ లెదర్స్‌ అండ్‌ లైఫ్‌ స్టయిల్‌.. ఇలా బోలెడన్ని కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

ఎలాంటి మెటీరియల్‌ ?
మనం రోజు వాడే యాక్సెసరీలలో పలు రకాల ముడిపదార్థాలను వాడతారు. లెదర్‌, జూట్‌, కాన్వాస్‌, ఫ్యాబ్రిక్‌, క్లే, మెటల్‌లతో పాటు మరికొన్ని పదార్థాలను, లోహాలను వినియోగిస్తారు. యాక్సెసరీ డిజైనింగ్‌లో భారతీయ హస్తకళలను ఇష్టపడే వారికి జైపూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాఫ్ట్‌ అండ్‌ డిజైన్‌ సంస్థ అద్భుతమైన కేంద్రం. ఈ విద్యాసంస్థలో పట్టభద్రులైన విద్యార్థులకు దేశవ్యాప్తంగానే కాదు.. విదేశాల్లోను మంచి ఉద్యోగాలు దొరుకుతుండటం విశేషం.
ఇలాంటి అత్యుత్తమ సంస్థలో చదువుకుని ఏదో ఒక విభాగంలో ప్రత్యేకతను సాధించాలి. ఉదాహరణకు సాఫ్ట్‌ మెటీరియల్స్‌ అయిన టెక్స్‌టైల్స్‌, లెదర్‌, పేపర్‌, నేచురల్‌ ఫైౖబర్స్‌తో పాటు.. హార్డ్‌ మెటీరియల్స్‌ అయిన వుడ్‌, మెటల్‌, స్టోన్‌.. ఫైర్డ్‌ మెటీరియల్స్‌ అయిన సిరామిక్స్‌, లెదర్‌, పేపర్‌, నేచురల్‌ ఫైబర్‌.. వంటి వాటిలో పరిజ్ఞానం సమకూర్చుకుంటే మంచిది. కొన్ని ఇన్‌స్టిట్యూట్లు కొన్ని స్పెషలైజేషన్లను అందిస్తున్నాయి. మన ఆసక్తి, డిమాండ్‌ను బట్టి కోర్సుల్ని ఎంచుకోవచ్చు.

ఆశించినంత జీతభత్యాలు
చదువుకున్న ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి, ఎంచుకున్న కంపెనీని బట్టి జీతభత్యాలలో వ్యత్యాసం ఉంటుంది. యాక్సెసరీ డిజైనింగ్‌లో ఏ కోర్సు చేసినప్పటికీ ఏడాదికి సుమారు మూడు నుంచి ఆరు లక్షల రూపాయల ప్యాకేజీలను ఆఫర్‌ చేస్తున్నాయి కంపెనీలు. ప్రొడక్ట్‌ కంపెనీలు, ఎక్స్‌పోర్టు హౌసులు, డిపార్ట్‌మెంట్‌ స్టోర్స్‌, క్రాఫ్ట్‌ ఆర్గనైజేషన్స్‌, డిజైన్‌ హౌస్‌లలో డిజైనర్‌గా ఆహ్వానం అందుకోవచ్చు. ముఖ్యంగా యాక్సెసరీ డిజైనర్లు ఒక ఉత్పత్తికి నవ్యరీతిలో ఆకృతిని సమకూర్చాలి. ట్రెండ్‌కు తగ్గట్టు డిజైన్లను రూపొందించి ఇవ్వగలగాలి. ఐడియా తట్టడానికి గంట పంటవచ్చు. లేదంటే వారం రోజులైనా పట్టవచ్చు. లక్ష్యం చేరుకోవడానికి ఒత్తిడి కూడా ఉంటుందీ రంగంలో. పోటీతత్వం, ఆసక్తి, సృజనాత్మకత, సామాజికగమనం, జీవనశైలి రీతులు వంటివన్నీ అర్థం చేసుకునే తత్వం కూడా ఉండాలి. ‘‘సంస్కృతి, కళలు, సాంకేతికత వంటి వాటిని జోడించి.. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వస్తుత్పత్తులను డిజైన్‌ చేసే వారికి.. ఈ రంగంలో పైకి ఎదగడానికి ఢోకా ఉండదు’’ అన్నది నిపుణుల భావన.

కోర్సులు ఎక్కడెక్కడ?

  • ఎన్‌ఐఎఫ్‌టి (హైదరాబాద్‌, బెంగళూరు, భోపాల్‌, ఢిల్లీ, షిల్లాంగ్‌, కంగ్రా, రాయ్‌బరేలి) యాక్సెసరీ డిజైనింగ్‌ కోర్సులను నిర్వహిస్తోంది. నాలుగేళ్ల కోర్సుకు ఫీజులు చెల్లించాలి.
  • లెదర్‌ డిజైనింగ్‌లో కోర్సులను ఆఫర్‌ చేస్తోంది ఎన్‌ఐఎఫ్‌టి. చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, రాయ్‌బరేలిలలో కోర్సు అందుబాటులో ఉంది.
  • గాంధీనగర్‌ ఎన్‌ఐఎఫ్‌టి నాలుగేళ్ల జువెలరీ అండ్‌ ప్రిషియస్‌ ప్రొడక్ట్స్‌ కోర్సును నిర్వహిస్తున్నది.
  • జైపూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాఫ్ట్‌ అండ్‌ డిజైన్‌ సంస్థ క్రాఫ్ట్‌ డిజైన్‌లో అత్యుత్తమ స్పెషలైజేషన్లను బోధిస్తోంది. సాఫ్ట్‌ మెటీరియల్స్‌ అప్లికేషన్‌, హార్డ్‌ మెటల్‌ అప్లికేషన్‌, ఫైర్‌ మెటల్‌ అప్లికేషన్‌ వంటివి ముఖ్యమైనవి. ఇవన్నీ నాలుగేళ్ల వ్యవధిగల కోర్సులు. ఫీజులు కూడా కాస్త ఎక్కువ. సంస్థల్లో సీటొస్తే బ్యాంకుల నుంచి రుణాలను కూడా పొందవచ్చు.
  • గాంధీనగర్‌లోని ఎన్‌ఐడి లైఫ్‌ స్టయిల్‌ యాక్సెసరీలలో పీజీ డిప్లమోను అందిస్తోంది. ఇలాంటి సంస్థల పూర్తి వివరాలు కావాలనుకునే ఔత్సాహికులు ఆయా ఇన్‌స్టిట్యూట్ల పేరున ఉన్న వెబ్‌సైట్లను దర్శించవచ్చు.

 

ఆధారము: ఆంధ్రజ్యోతి © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate