অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

విలువ‌ల‌తో కూడిన కెరీర్ .. డెవ‌ల‌ప్ మెంట్ జ‌ర్న‌లిజం

పరిచయం

పాత్రికేయం.. ప్రజా సమస్యలపై పోరాడే పాశుపతాస్త్రం. కలం కదిలించి, అక్షర అస్త్రాలను సంధించి.. ప్రజలకు తోడుగా, పచ్చని కెరీర్‌కు నీడగా నిలిచే ప్రొఫెషన్. చేపట్టిన వృత్తి.. వ్యక్తిగత వికాసానికే కాకుండా, పది మంది పురోగతికీ ఉపయోగపడాలన్న కోరిక ఉన్న వారికి సరైన కెరీర్ ఆప్షన్ డెవ‌ల‌ప్ మెంట్ జర్నలిజం. సామాజిక స్పృహ, సృజనాత్మకతకు భాషా సామర్థ్యం, కష్టపడి పనిచేసే తత్వం తోడైతే ఉన్నత అవకాశాలకు కొదవలేని డెవ‌ల‌ప్ మెంట్ జర్నలిజం కెరీర్‌పై స్పెషల్ ఫోకస్..

ప్రసార మాధ్యమాలు.. జాతి హృదయ స్పందనను వినిపించే అత్యుత్తమ సాధనాలు. సమాజానికి నిలువుటద్దంగా ఉంటూ సామాన్య ప్రజల రోజు వారీ సమస్యలకు పరిష్కారాన్ని చూపే నిజమైన వేదికలు. కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా.. అక్షరాలే అస్త్రాలుగా, మాటలే తూటాలుగా చేసుకొని ప్రజా సమస్యలపై పోరాడటంలోనూ, వారిని చైతన్యవంతుల్ని చేయడంలోనూ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. సమాజ హితాన్ని కాంక్షిస్తూ అక్షరాలతో అందరినీ ఆలోచింపజేసే అరుదైన అవకాశం జర్నలిజంలో పనిచేసేవాళ్ళకు మాత్రమే లభిస్తుంది. ఈ కెరీర్‌ నిత్య నూతనం. ఈ నేపథ్యంలో యువత ముందు ఉత్తమ కెరీర్‌ ఆప్షన్‌గా ఉన్న డెవలప్‌మెంట్ జర్నలిజంపై స్పెషల్‌ ఫోకస్‌..

వృత్తిపరమైన సంతృప్తి

సాధారణంగా జర్నలిజం పరిధిలోకి రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, వ్యాపార, సినిమా.. ఇలా అన్ని రంగాలూ వస్తాయి. కానీ, డెవలప్‌మెంట్ జర్నలిజంలో మాత్రం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికం, పర్యావరణం, వ్యవసాయం, ఆరోగ్యం, పరిశుభ్రత, లింగ వివక్ష, మౌలిక సదుపాయాలు, రహదారుల భద్రత, విద్య, మానవ హక్కులు.. ఇలా మానవాభివృద్ధికి సంబంధించిన రంగాలు ఉంటాయి. ఆయా రంగాల్లో సమస్యలను తెరపైకి తీసుకురావడం డెవలప్‌మెంట్ జర్నలిస్టుల బాధ్యత. అన్ని భాషల్లో మీడియా సంస్థలు విస్తరిస్తుండడంతో పాత్రికేయులకు అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. జర్నలిస్టులకు ప్రస్తుతం పత్రికలు, వార్తా చానళ్లు, మ్యాగజైన్లు, వెబ్‌సైట్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. డెవలప్‌మెంట్ జర్నలిస్టులకు మంచి డిమాండ్ ఉంది. మీడియా సంస్థల మధ్య పోటీ విపరీతంగా పెరగడంతో పాత్రికేయులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. వృత్తిలో ప్రతిభాపాటవాలు చూపితే సమాజంలో పేరుప్రఖ్యాతలు సంపాదించుకోవచ్చు. ఫ్రీలాన్స్‌గా కూడా పనిచేసుకొనే అవకాశం ఉంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులకు వృత్తిపరమైన సంతృప్తి లభిస్తుంది.

కావాల్సిన నైపుణ్యాలు

జర్నలిస్టులకు సామాజిక బాధ్యత తప్పనిసరిగా ఉండాలి. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా భావించాలి. ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగని మనస్తత్వం అవసరం. మంచి కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ ఉండాలి. వార్తలు, వార్తల్లోని జీవరేఖను గుర్తించే నేర్పు ముఖ్యం. పాత్రికేయులు నిత్య విద్యార్థిగా మారాలి. ఎప్పటికప్పుడు జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఈ వృత్తిలో డెడ్‌లైన్లు ఉంటాయి కాబట్టి పొరపాట్లకు తావులేకుండా వేగంగా పనిచేయగలగాలి. క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులు ఆరోగ్యాన్ని నూటికి నూరు శాతం కాపాడుకోవాలి.

అర్హతలు

ఇంటర్మీయెట్, గ్రాడ్యుయేషన్ స్థాయిల్లో ఏ కోర్సులు చదివినా పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టొచ్చు. అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా జర్నలిస్ట్‌గా పనిచేయొచ్చు. అయితే, సోషల్ సైన్స్ కోర్సులు చదివితే ఇందులో రాణించడానికి అవకాశం ఉంటుంది. మనదేశంలో జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా, పీజీ డిప్లొమా తదితర కోర్సులున్నాయి. ఆసక్తిని బట్టి ఇంటర్/గ్రాడ్యుయేషన్ తర్వాత వీటిలో చేరొచ్చు. మొదట మీడియా సంస్థలో ట్రైనీగా చేరి, అనుభవం, నైపుణ్యాలను పెంచుకొని పూర్తిస్థాయి జర్నలిస్టుగా కెరీర్‌లో నిలదొక్కుకోవచ్చు.

వేతనాలు

పని చేస్తున్న మీడియా సంస్థ(న్యూస్ చానల్, వార్తాపత్రిక, మేగజైన్)ను బట్టి వేతనం అందుతుంది. ప్రారంభంలో ఏడాదికి రూ.1.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల వేతన ప్యాకేజీ పొందొచ్చు. అనుభవం, పనితీరు ఆధారంగా జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తిలో ప్రతిభ చూపితే తక్కువ సమయంలో ఉన్నత హోదాలు, అధిక వేతనాలు అందుకోవచ్చు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తే రాసిన కథనాలను బట్టి ఆదాయం లభిస్తుంది.

కోర్సులను అందిస్తున్న సంస్థలు

ఉస్మానియా యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.osmania.ac.in/
ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-హైదరాబాద్
వెబ్‌సైట్: www.efluniversity.ac.in
ఎ.పి. కాలేజీ ఆఫ్ జర్నలిజం
వెబ్‌సైట్: apcj.in/
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.braou.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.iimc.nic.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం అండ్ న్యూ మీడియా
వెబ్‌సైట్: www.iijnm.org
ఆసియన్ కాలేజీ ఆఫ్ జర్నలిజం
వెబ్‌సైట్: www.asianmedia.org

 

ఆధారము: ఆంధ్ర ప్రభ లో ప్రచురితమైన కథనం ఆధారంగా

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate