অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వనరులు

ఉపయోగపడు వనరులు

 1. స్టుడెంట్ గైడ్
 2. ఇండియాయెడు
 3. యానియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్
 4. యానియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్
 5. 12th తరువాత కేరీర్

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

ఉన్నత కొలువులకు గేట్

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్).. ఇంజనీరింగ్ చదివే ప్రతి విద్యార్థిరాయాలనుకునే పరీక్ష! ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఐఐటీలు, నిట్‌లు తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణికంగా నిలిచే ఈ పరీక్ష.. గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ రంగ సంస్థల ఎంట్రీ లెవల్ నియామకాలకు గేట్‌వేగా నిలుస్తోంది. 2015 గేట్ స్కోర్‌తో నియామకాల కోసం నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు...

ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి పరిశ్రమలు ఆశిస్తున్న అన్వయ సామర్థ్యం, సమస్యా సాధన, విశ్లేషించే గుణం, తార్కిక వివేచన వంటి నైపుణ్యాలను పరీక్షించడంలో గేట్‌కు మించిన పరీక్ష మరొకటి లేదని చెప్పొచ్చు. అంతేకాకుండా గతంలో ప్రభుత్వ రంగ సంస్థలు.. సొంతంగా నిర్వహించే నియామక ప్రక్రియలో ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఈ అంశాలను పరీక్షించడం సాధ్యమయ్యేది కాదు. గేట్ వంటి పరీక్షల్లో విజయం సాధించాలంటే సంబంధిత సబ్జెక్ట్‌లో ప్రాథమిక భావనలపై పట్టు ఉండాలి. ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే ప్రతిభ ఉన్న విద్యార్థులు మాత్రమే గేట్‌లో మంచి స్కోర్ సాధించగలుగుతున్నారు. గేట్‌ను దేశంలోని అత్యున్నత సాంకేతిక సంస్థలైన ఐఐటీలు, ఐఐఎస్సీ అత్యంత ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా నిర్వహిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లు గేట్ స్కోర్ ఆధారంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి.

వేర్వేరుగా ప్రకటనలు:

ఉద్యోగ నియామకాలకు సంబంధించి పీఎస్‌యూలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేస్తాయి. వాటికనుగుణంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నియామక ప్రక్రియలో గేట్ స్కోర్‌కు ప్రాధాన్యం ఇస్తారు. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులకు తర్వాతి దశలో బృంద చర్చలు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు (కంపెనీని బట్టి ఇవి మారుతుంటాయి) నిర్వహించి నియామకాన్ని ఖరారు చేస్తారు. హెచ్‌పీసీఎల్, పవర్ గ్రిడ్, ఎన్‌సీఎల్, గెయిల్ వంటి సంస్థలు గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ టాస్క్ పేరుతో బృంద చర్చలు సైతం నిర్వహించి అందులోనూ రాణించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూ దశకు ఎంపిక చేస్తాయి. ఈ క్రమంలో దాదాపు 75 శాతం వెయిటేజీని గేట్ స్కోరుకు ఇచ్చి మిగతా 25 శాతం వెయిటేజీని ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్‌లకు కేటాయిస్తున్నాయి. కాబట్టి గేట్‌లో మంచి స్కోర్ సాధించడం కీలకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ముందుగా గేట్:

ఈ కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ముందుగా గేట్-2015కు దరఖాస్తు చేసుకోవాలి. గేట్ అడ్మిట్ కార్డ్‌పై ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆయా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలి. గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్/ఇంటర్వ్యూకు ఎంపికైతే గేట్ దరఖాస్తు ప్రింటవుట్, అడ్మిట్ కార్డ్, స్కోర్ కార్డ్ తీసుకువెళ్లాలి. దరఖాస్తు చేసుకునేటప్పుడు గేట్ దరఖాస్తులో ఏ వివరాలైతే (పేరు, పుట్టిన తేదీ, చిరునామా) నింపారో అవే వివరాలను సంబంధిత కంపెనీల దరఖాస్తులోనూ నింపాలి. అయా కంపెనీల్లో ఏ విభాగాల్లో అయితే నియామక ప్రకటనలు వెలువడ్డాయో అదే ఇంజనీరింగ్ బ్రాంచ్ పేపర్‌తో గేట్ రాయాలి.

ఎంపిక ప్రక్రియ:

తొలుత పీఎస్‌యూలు గేట్ నిర్వహణ తేదీ కంటే ముందుగానే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. అభ్యర్థులు వీటికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. గేట్ ఫలితాలు వెలువడ్డాక ర్యాంకుల ఆధారంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తాయి. ఆ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలో తదుపరి దశలకు హాజరయ్యేందుకు తమ సంసిద్ధతను తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడే వారికి మలి దశలకు అనుమతి లభిస్తుంది.

ఇంటర్వ్యూ కాల్:

గేట్ స్కోర్ 500లోపు (ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు) ఉండాలి. ఓబీసీ అభ్యర్థులు 700 నుంచి 800 ర్యాంకులోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యరులు 1500 నుంచి మూడు వేల మధ్య ర్యాంకు సాధిస్తే ఇంటర్వ్యూ కాల్ ఆశించొచ్చు.

ఇంటర్వ్యూలో రెండు ముఖ్యమైన అంశాలు:

ఎంపిక ప్రక్రియ తుది దశ ఇంటర్వ్యూలో రెండు ముఖ్యమైన అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. అవి.. వ్యక్తిగత నేపథ్యం, టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్‌కు సంబంధించి సైద్ధాంతిక అవగాహనతో పాటు బీటెక్ స్థాయిలో అభ్యర్థులు చేసిన ప్రాజెక్ట్ వర్క్స్, ఇంటర్న్‌షిప్స్, మినీ ప్రాజెక్ట్ వర్క్స్ వంటి వాటిపైనా ప్రశ్నలు అడుగుతారు. ఇందులోనూ విజయం సాధించిన అభ్యర్థులకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వంటి హోదాలతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు లభిస్తాయి.

సర్వీస్ అగ్రిమెంట్:

కొన్ని పీఎస్‌యూలు ఎంపికైన అభ్యర్థుల నుంచి నిర్ణీత కాలానికి సర్వీస్ అగ్రిమెంట్ కూడా తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇది ఒక ఏడాది వ్యవధిలో ఉంటోంది. అంటే ఎంపికైన వారు తప్పనిసరిగా ఏడాది పాటు సంస్థలో విధులు నిర్వర్తించాల్సిందే.

శిక్షణ:

ఎంపికైన అభ్యర్థులు మొదట కొంత కాలంపాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరికి మేనేజ్‌మెంట్ ట్రైనీ, ట్రైనీ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ వంటి హోదాలు కేటాయిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారిని శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారు. ఈ సమయంలో వీరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు, సౌకర్యాలు, భత్యాలు లభిస్తాయి. వేతనాల విషయానికొస్తే.. ప్రారంభ వేతనం ఏడాదికి సగటున ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉంటుంది.

పీఎస్‌యూల నోటిఫికేషన్లు

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్

భర్తీ చేసే విభాగాలు:మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్.

అర్హత: సంబంధిత లేదా అనుబంధ బ్రాంచ్‌లో బీఈ/ బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్). మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్విహిస్తారు. చివరగా మెడికల్ టెస్ట్ ద్వారా నియామకాన్ని ఖరారు చేస్తారు. ఎంపికైన వారిని మేనేజ్‌మెంట్ ట్రైనీస్‌గా వ్యవహరిస్తారు. వీరికి దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 17, 2014.

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 30, 2015.

వెబ్‌సైట్: www.bpclcareers.in

నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్

భర్తీ చేసే విభాగం:

ఎలక్ట్రికల్ అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత లేదా అనుబంధ బ్రాంచ్‌లలో బీఈ/బీటెక్/ఎంఎస్సీ/ఎంటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్)

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జనవరి 1, 2015

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31, 2015.

వెబ్‌సైట్: www.nhpcindia.com

కోల్ ఇండియా

భర్తీ చేసే విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, జియాలజీ, మైనింగ్.

అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత లేదా అనుబంధ బ్రాంచ్‌లలో బీఈ/బీటెక్/ఎంఎస్సీ/ఎంటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్)

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబర్ చివరి వారంలో

వెబ్‌సైట్: www.coalindia.in

గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్

భర్తీ చేసే విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, మెటలర్జీ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్.

అర్హత: సంబంధిత లేదా అనుబంధ బ్రాంచ్‌లో బీఈ/బీటెక్. మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులవ్వాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మార్చి 15, 2015

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 30, 2015.

వెబ్‌సైట్:www.gsecl.in

హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్

భర్తీ చేసే విభాగాలు: సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూ నికేషన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్.

వెబ్‌సైట్:www.hindustanpetroleum.com

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్

భర్తీ చేసే విభాగాలు: ఎలక్ట్రికల్, ఈసీఈ, మెకానికల్, మెటీరియల్ సైన్స్

అర్హత:సంబంధిత లేదా అనుబంధ బ్రాంచ్‌లలో బీఈ/బీటెక్/ ఎంఎస్సీ/ ఎంటెక్

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 15, 2014

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 15, 2015.

వెబ్‌సైట్:www.celindia.co.in

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్

భర్తీ చేసే విభాగాలు:కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఎలక్ట్రికల్, ఈసీఈ, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జికల్, మైనింగ్

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 17, 2014

దరఖాస్తుకు చివరి తేదీ:ఫిబ్రవరి 21, 2015.

వెబ్‌సైట్:www.iocl.com

గేట్ స్కోర్‌తో నియామకం చేపట్టే మరికొన్ని సంస్థలు

 • గెయిల్ (గ్యాస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)
 • నాల్కో (నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్)
 • ఓఎన్‌జీసీ లిమిటెడ్ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్)
 • ఎన్‌టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) లిమిటెడ్
 • భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్
 • పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఠి రైట్స్ లిమిటెడ్

భవిష్యత్తుపై స్పష్టతతో.. తగిన ప్రణాళిక

గేట్ ర్యాంకు ఇప్పుడు ఐఐటీల్లో ఉన్నత విద్యకు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సాధనంగా మారిన నేపథ్యంలో అభ్యర్థులు భవిష్యత్తుపై స్పష్టతతో తగిన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఉన్నత విద్య లేదా ఇతర ఉద్యోగాలు లక్ష్యంగా ఆలోచించే అభ్యర్థులు పీఎస్‌యూల్లో దరఖాస్తు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆయా సంస్థల నియామక నిబంధనలపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా సర్వీస్ అగ్రిమెంట్, ఇతర సర్వీస్ నిబంధనలు అమలు చేస్తున్న సంస్థలకు దరఖాస్తు చేసుకునేందుకు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక.. పీఎస్‌యూల్లో ఉద్యోగమే లక్ష్యంగా నిర్దేశించుకున్న అభ్యర్థులు, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ వంటి వాటిపై ఆందోళన చెందక్కర్లేదు. ఇవి సాధారణంగా బీటెక్ స్థాయిలో తమ బ్రాంచ్‌కు సంబంధించిన అంశాలపైనే ఉంటాయి. ఈ నేపథ్యంలో గేట్‌లో టాప్-500లోపు ర్యాంకు లక్ష్యంగా కృషి చేస్తే.. పీఎస్‌యూ ఆఫర్ గ్యారెంటీ.

- ఎ. రవితేజ, గేట్-2013 ఆల్ ఇండియా 2వ ర్యాంకు (ఎలక్ట్రికల్)

ఇంటిగ్రేటెడ్ కోర్సులు

కాలక్రమేణా విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నాయి.. సంప్రదాయ కోర్సుల స్థానంలో నూతన విభాగాలు ప్రవేశిస్తున్నాయి.. మారుతున్న అవసరాలు, పెరుగుతున్న ప్రాథమ్యాల మేరకు.. ఒక విద్యార్థి తన సంబంధిత అంశంతోపాటు మిగతా విభాగాలపై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరిగా మారింది .. ఆ మేరకు రెండు కోర్సుల కలయికతో రూపొందించినవే ఇంటిగ్రేటెడ్ కోర్సులు.. ప్రస్తుతంఅంతా ప్రవేశాల సందడి నెలకొన్ని సమయంలో వివిధ విద్యా సంస్థలు అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్సులపై విశ్లేషణ...

ఒకప్పుడు డీగ్రీ తర్వాత పీజీ చేయాలంటే వేర్వేరు కాలేజీల్లో చేరడం తప్పనిసరి. ఆ మేరకు సంబంధిత నిబంధనలు, ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం డిగ్రీ, పీజీ ఒకేచోట చదివే అవకాశాన్ని కల్పించడానికి ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఆవిర్భవించాయి. జాతీయ స్థాయిలో పలు యూనివర్సిటీలతోపాటు రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాల యాలు, ఐఐఎస్సీ, ఐఐటీలు కూడా ఇంజనీరింగ్ నుంచి హ్యుమానిటీస్ అంశాల వరకు ఈ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. వివరాలు..

ఇంజనీరింగ్‌లోను..

ఇంటిగ్రేటెడ్ కోర్సులు కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితం కాలేదు. ఇంజనీరింగ్ కోర్సుల్లోనూ ఈ ఒరవడి కొనసాగుతోంది. ఐఐటీల విషయానికొస్తే..ఎంఎస్సీ, ఎంఎస్సీ టెక్, ఎంటెక్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల కాల వ్యవధి-ఐదేళ్లు. ఐఐటీ-ఖరగ్‌పూర్ ఎంఎస్సీ (స్పెషలైజేషన్స్-అప్లయిడ్ జియాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఎక్స్‌ప్లోరేషన్ జియోఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఫిజిక్స్), ఐఐటీ-బాంబే ఎంఎస్సీ (కెమిస్ట్రీ), ఐఐటీ-రూర్కీ ఎంఎస్సీ (అప్లయిడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్), ఐఎస్‌ఎం-ధన్‌బాద్ ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్), ఐఎస్‌ఎం-ధన్‌బాద్ ఎంఎస్సీ టెక్ (స్పెషలైజేషన్స్-అప్లయిడ్ జియాలజీ, అప్లయిడ్ జియోఫిజిక్స్). ఐఐటీ-రూర్కీ ఎంటెక్ (జియలాజికల్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఫిజిక్స్), ఐఐటీ-వారణాసి ఎంటెక్ ( ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, జియోఫిజికల్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్) కోర్సులను అందిస్తున్నాయి. అంతేకాకుండా పలు రకాల స్పెషలైజేషన్స్‌తో బీటెక్+ఎంటెక్, ఎంఫార్మసీ డ్యూయల్ డిగ్రీ, బీఎస్, ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. జేఈఈ-అడ్వాన్స్‌డ్ ర్యాంక్ ఆధారంగా ఇందులో ప్రవేశం పొందొచ్చు. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్) ఎంట్రెన్స్ ద్వారా ఎంఎస్సీ- పీహెచ్‌డీ, ఎంఎస్సీ- పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ, పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను ఐఐటీల్లో చదివే అవకాశం ఉంది. ఐఐఎస్సీ బీఎస్-ఎంఎస్, ఐఐఎం-ఇండోర్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ వంటి విభిన్న కోర్సులను కూడా అందిస్తున్నాయి.

జేఎన్‌టీయూలో కూడా:

జేఎన్‌టీయూ-హైదరాబాద్ కూడా డబుల్ డిగ్రీ కోర్సులను అందిస్తుంది. అవి.. బీటెక్+ఎంటెక్ (సివిల్ ఇంజనీరింగ్), బీటెక్ (సివిల్)+ఎంబీఏ , బీటెక్+ఎంటెక్ (మెకానికల్), బీటెక్ (మెకానికల్)+ఎంబీఏ, బీటెక్ (ఈఈఈ)+ఎంబీఏ, బీటెక్+ఎంటెక్ (ఈఈఈ), బీటెక్ (ఈసీఈ)+ఎంబీఏ, బీటెక్+ఎంటెక్ (ఈసీఈ), బీటెక్+ఎంటెక్ (సీఎస్‌ఈ), బీటెక్ (సీఎస్‌ఈ)+ఎంబీఏ. ఈ కోర్సుల్లో ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. అంతేకాకుండా అమెరికాలోని ఫ్లైట్ యూనివర్సిటీ, బ్యాంకాక్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఈ కోర్సుల్లో ఎంసెట్/జేఈఈ-మెయిన్ స్కోర్ ప్రామాణికంగా అడ్మిషన్లు నిర్వహిస్తారు. జేఎన్‌టీయూ-కాకినాడ, ఆంధ్రా యూనివర్సిటీలు కూడా డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందజేస్తున్నాయి.

సంప్రదాయ సబ్జెక్ట్‌లలో..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పలు యూనివర్సిటీలు కూడా సంప్రదాయ సబ్జెక్ట్‌లలో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందజేస్తున్నాయి. అవి..ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), ఎంబీఏ, ఎంఏ (అప్లయిడ్ ఎకనామిక్స్), ఆంధ్రా యూనివర్సిటీ ఎంఏ (ఎకనామిక్స్), నాగార్జున యూనివర్సిటీ ఎంబీఏ, ఎంఎస్సీ (నానో టెక్నాలజీ). ఆయా యూనివర్సిటీలు నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ఈ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా ఇంటిగ్రేటెడ్ విభాగంలో ఎంఏ/ఎంఎస్సీ కోర్సులను బోధిస్తుంది. కాల వ్యవధి ఐదేళ్లు. ఈ కోర్సులను సెమిస్టర్ పద్ధతిలో నిర్వహిస్తారు. 10 సెమిస్టర్లు ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్, హెల్త్ సైకాలజీ, ఎర్త్ సెన్సైస్ సబ్జెక్ట్‌లను వర్సిటీ ఆఫర్ చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ ఎంఏ విభాగంలో హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ కోర్సులు, హ్యుమానిటీస్ కింద తెలుగు, హిందీ, ఉర్దూ భాషా కోర్సులు ఉన్నాయి. సోషల్ సెన్సైస్ కింద ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఎంఎస్సీతోపాటు పీహెచ్‌డీ..

సైన్స్ అభ్యర్థులకు డిగ్రీ అర్హతతో ఎంఎస్సీతోపాటు పీహెచ్‌డీ చేసే అవకాశాన్ని కొన్ని రకాల కోర్సులు క ల్పిస్తున్నాయి. ఈ కోర్సులను ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీకోర్సులుగా వ్యవహరిస్తారు. అటువంటి ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (వెబ్‌సైట్: www.iisc.ernet.in )-బెంగళూరు, బయలాజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సును ఆఫర్ చేస్తుంది. జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (వెబ్‌సైట్: www.jncasr.ac.in ) -బెంగళూరు, కూడా బయలాజికల్ సైన్స్, కెమికల్ సెన్సైస్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను అందిస్తుంది. అంతేకాకుండా పలు ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఇటువంటి కోర్సులను ప్రవేశపెట్టాయి. తద్వారా పీజీ, పీహెచ్‌డీ కోర్సులను ఒకే చోట పూర్తి చేసే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది.

పయోజనాలు

ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఎంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ ఒకే చోట చదివే అవకాశం లభిస్తుంది. తద్వారా విలువైన సమయాన్ని కూడా ఆదా చేయవచ్చు. ఉదాహరణకు ఇంజనీరింగ్‌లో డిగ్రీని తీసుకుంటే.. బ్యాచిలర్ నాలుగేళ్లు, పీజీ రెండేళ్లు కలిపి మొత్తం ఆరేళ్లు. అదే ఇంటిగ్రేటెడ్ డిగ్రీలో ఐదేళ్లలోనే కోర్సును పూర్తి చేయవచ్చు. సంబంధిత సబ్జెక్ట్‌తోపాటు ఇతర అంశాలపై కూడా మంచి అవగాహన వస్తుంది. అంతేకాకుండా మారుతున్న పరిస్థితులు, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను రూపొందిస్తారు. తద్వారా కెరీర్‌లో త్వరగా స్థిరపడొచ్చు.

ఐఐఎం లక్నో: ఐపీఎంఎక్స్

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)-లక్నో, ఏడాది వ్యవధి గల ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మేనేజ్‌మెంట్ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ కోర్సుకు రూపకల్పన చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ కోర్సు ప్రారంభమవుతుంది. ఈ కోర్సును నాలుగు టర్మ్‌లలో బోధిస్తారు. ప్రతి టర్మ్ తొమ్మిది వారాల పాటు ఉంటుంది. ఇందులో మేనేజీరియల్ ఎకనామిక్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్, జనరల్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలను బోధిస్తారు.

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. సంబంధిత రంగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

ప్రవేశ విధానం: జీమ్యాట్ స్కోర్ (2011, జూలై 1-అక్టోబర్ 30, 2014 మధ్య స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు), అనుభవం ఆధారంగా నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇంటర్వ్యూలు డిసెంబర్‌లో ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2014.

వివరాలకు: www.iiml.ac.in

ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్

జేవియర్స్ లేబర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్: ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కోర్సు వ్యవధి 16 నెలలు. దీన్ని నాలుగు టర్మ్‌లలో బోధిస్తారు. మొదటి మూడు టర్మ్‌లలో తప్పకుండా చదవాల్సిన 15 సబ్జెక్ట్‌లు ఉంటాయి. నాలుగో టర్మ్‌లో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

అర్హత: ఏదైనా డిగ్రీ. సంబంధిత రంగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

ప్రవేశ విధానం: అనుభవం ఆధారంగా నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: అక్టోబర్ 20, 2014.

వివరాలకు: www.xlri.ac.in

ఫ్యాషన్ టెక్నాలజీ లో భవిత

హైటెక్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి.. ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ - నిఫ్ట్’. హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ సమీపంలోని నిఫ్ట్ క్యాంపస్ కూడా జాతీయ స్థాయిలో సుపరిచితమైన సంస్థ. ఫ్యాషన్ రంగంలో వినూత్న కోర్సుల్లో శిక్షణకు కేరాఫ్ ఈ ఇన్‌స్టిట్యూట్. ఫ్యాషన్ టెక్నాలజీలో యాక్సెసరీస్ డిజైన్ మొదలు నిర్వహణ నైపుణ్యాలు అందించే ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ వరకు పలు కోర్సులను అందిస్తున్న నిఫ్ట్ విశేషాలు...

ఆధునిక ప్రపంచం.. అత్యాధునిక అభిరుచులు.. కాళ్లకు ధరించే షూస్ నుంచి కళ్లజోడు వరకు వినూత్నమైన డిజైన్లను కోరుకుంటున్న వినియోగదారులు. వ్యక్తుల రోజువారీ అవసరాల్లో భాగంగా మారిన అనేక వస్తువుల డిజైనింగ్, మార్కెటింగ్, మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో శిక్షణనందిస్తున్న సంస్థ... నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. కేంద్ర టెక్స్‌టైల్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ ఇన్‌స్టిట్యూట్‌గా 1986లో ఢిల్లీలో ప్రధాన క్యాంపస్‌గా ఏర్పాటైంది. ఇప్పుడు ఈ విద్యాసంస్థ దేశవ్యాప్తంగా 15 క్యాంపస్‌ల ద్వారా ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది. 1995లో ప్రారంభమైన నిఫ్ట్-హైదరాబాద్ క్యాంపస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. బ్యాచిలర్స్ డిగ్రీ నుంచి పీజీ వరకు పలు కోర్సులను అందిస్తూ ఫ్యాషన్ రంగ ఔత్సాహికులకు చక్కటి వేదికగా నిలుస్తోంది. కలర్‌ఫుల్ కెరీర్‌కు మార్గం వేస్తోంది.

బ్యాచిలర్ టు పీజీ: ప్రస్తుతం నిఫ్ట్ - హైదరాబాద్ క్యాంపస్‌లో.. డిజైన్ విభాగంలో అయిదు కోర్సులు (ఫ్యాషన్ డిజైన్; ఫ్యాషన్ అండ్ టెక్స్‌టైల్స్; ఫ్యాషన్ అండ్ టెక్స్‌టైల్స్ యాక్సెసరీస్; ఫ్యాషన్ కమ్యూనికేషన్; నిట్ వేర్ డిజైన్).. టెక్నాలజీ విభాగంలో ఒక కోర్సు( బీటెక్ - అపరెల్ ప్రొడక్షన్) బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫ్యాషన్ కమ్యూనికేషన్ కోర్సు వినూత్నమైందిగా పేర్కొనవచ్చు. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రంగాల్లో రాణించడానికి అవసరమైన స్కిల్స్ అందించే ఈ స్పెషలైజేషన్‌ను పూర్తి చేస్తే డిజైన్ రంగంతోపాటు ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ జర్నలిజం, గ్రాఫిక్ డిజైన్ తదితర కమ్యూనికేషన్ విభాగాల్లోనూ మంచి కెరీర్‌ను సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. పీజీ స్థాయిలో ఎంబీఏకు తత్సమానమైన మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సు కూడా నిఫ్ట్- హైదరాబాద్ క్యాంపస్‌లో ఉంది.

బోధనలో సృజనాత్మకత: ఫ్యాషన్ టెక్నాలజీ అంటే సృజనాత్మకతకు పెద్దపీట వేసే రంగం. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిఫ్ట్-హైదరాబాద్ క్యాంపస్‌లో బోధనలోనూ సృజనాత్మకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులే కొత్త డిజైన్లను ఆవిష్కరించేలా రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ కల్పించే విధంగా శిక్షణనిస్తున్నారు. ఈ క్రమంలో స్టూడెంట్-ఫ్యాకల్టీ నిష్పత్తిని 20:1గా నిర్దేశించి ప్రతి విద్యార్థిపై దృష్టి పెట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యం: ఫ్యాషన్, డిజైన్ రంగాల్లో అకడమిక్ శిక్షణ మిగతా కోర్సులతో పోల్చితే భిన్నమైంది. విద్యార్థులు నిరంతరం సృజనాత్మకత, పరిశీలన దృక్పథంతో అడుగులు వేయాలి. కేవలం క్లాస్ రూం, లైబ్రరీ, లేబొరేటరీలకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు కూడా నిఫ్ట్ ప్రాధాన్యమిస్తోంది. నిరంతరం కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫ్యాషన్ షోలను నిర్వహిస్తోంది.

ఆర్ అండ్ డీ ప్రాజెక్ట్: నిఫ్ట్- హైదరాబాద్ క్యాంపస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యకలాపాలను కూడా చేపడుతోంది. కేంద్ర చేనేత శాఖ ఆమోదం పొందిన పాలరాతి బొమ్మల రూపకల్పన; సిల్వర్ ఫిల్‌గ్రీ ప్రాజెక్ట్ వంటివి ఇందుకు ఉదాహరణలు. అంతేకాకుండా ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని పలు పరిశ్రమలకు అవసరమైన లోగో డిజైన్, ఉద్యోగుల యూనిఫాం డిజైన్ వంటి మరెన్నో ప్రాజెక్ట్‌లు కూడా చేపట్టింది. వీటిలో ప్రత్యక్షంగా పాల్పంచుకునేందుకు విద్యార్థులకూ అవకాశం కల్పిస్తోంది.

ప్లేస్‌మెంట్స్ ఖాయం: నిఫ్ట్‌లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ ఖాయం. ప్రతి ఏటా నవంబర్ / డిసెంబర్‌లో నిర్వహించే క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్‌లో అర్‌వింద్ మిల్స్, రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్, స్నాప్ డీల్, టాటా ఇంటర్నేషనల్ వంటి ప్రముఖ కంపెనీలెన్నో పాల్గొంటున్నాయి. లక్షల్లో వార్షిక వేతనాలను అందిస్తున్నాయి. 2013 ప్లేస్‌మెంట్స్‌లో పీజీ ప్రోగ్రామ్ అభ్యర్థుల్లో అత్యధికంగా రూ.15 లక్షలు, బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లలో అత్యధికంగా రూ.9 లక్షల వార్షిక వేతన ప్యాకేజీని నిఫ్ట్ - హైదరాబాద్ సెంటర్ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. సగటున పీజీ బ్యాచ్‌లో రూ.3.69 లక్షలు, బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లో 2.99 లక్షల వార్షిక వేతనం లభించింది. ఫ్యాషన్ కమ్యూనికేషన్ ఉత్తీర్ణులకు ఎన్‌డీటీవీ, టైమ్స్ నౌ, హెడ్‌లైన్స్ టుడే వంటి మీడియా సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు లభించాయి.

అత్యాధునిక సదుపాయాలు: టీచింగ్, లెర్నింగ్ కోణంలో నిఫ్ట్-హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఆడియో-విజువల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లేబొరేటరీ, లైబ్రరీల ద్వారా విద్యార్థులకు నిరంతర అధ్యయన మార్గాలను అందిస్తోంది. అంతేకాకుండా ఫ్యాషన్ రంగంలోని అత్యంత ఆదరణ పొందుతున్న డిజైన్‌ల రూపకల్పన శైలిని ప్రత్యక్షంగా తెలుసుకునే విధంగా ఆయా వస్తువులను రిసోర్స్ సెంటర్‌లో అందుబాటులో ఉంచుతోంది.

ప్రవేశానికి మార్గం.. నిఫ్ట్ ఎంట్రెన్స్: నిఫ్ట్ 15 క్యాంపస్‌లలో ప్రవేశాల కోసం ప్రతి ఏటా జాతీయస్థాయిలో నిఫ్ట్ ఎంట్రెన్స్ (యూజీ/పీజీ) నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ ఆధారంగా కేంద్రీకృత కౌన్సెలింగ్ విధానంలో క్యాంపస్‌లు, సీట్ల కేటాయింపు ఉంటుంది.

వెబ్‌సైట్: www.nift.ac.in/hyderabad/

సృజనాత్మకత ఉంటే..

‘‘ఫ్యాషన్ రంగంలో అవకాశాలు కోరుకునే వారికి, తగిన సృజనాత్మకత ఉన్న వారికి సరైన వేదిక నిఫ్ట్. హైదరాబాద్ క్యాంపస్ ఏర్పాటైన కొన్నేళ్లలోనే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందుతోంది. విద్యార్థులకు ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ లభించడానికి అనువైన వాతావరణం హైదరాబాద్‌లో ఉంది. నగరంలోని విభిన్న జీవన శైలులు గల వ్యక్తులు, అభిరుచులను ప్రత్యక్షంగా వీక్షించి.. తద్వారా తాజా పరిస్థితులకు సరితూగే విధంగా డిజైన్లు రూపొందించే అవకాశం విద్యార్థులకు లభిస్తోంది’’

ప్రొఫెసర్ ఎన్. రాజారాం, డెరైక్టర్, నిఫ్ట్ - హైదరాబాద్

ఆధారము: సాక్షి

కెరీర్‌కు.. కామర్స్ సర్టిఫికెట్ కోర్సులు

ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణలతో మన దేశం పారిశ్రామికంగా పురోగతి సాధిస్తోంది. భారీ సంఖ్యలో బహుళజాతి సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. వీటితోపాటు వ్యాపార, వాణిజ్య రంగాలు కూడా శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యం లో కామర్స్ చదివిన విద్యార్థులకు అపార అవకాశాలు ముందుకొచ్చాయి. ఇంటర్మీడియెట్ (సీఈసీ/ఎంఈసీ), బీకాం, ఎంకాం చదివినవారికి వివిధ విద్యా సంస్థలు, యూనివర్సిటీలు కామర్స్.. సంబంధిత అంశాల్లో సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులన్నీ దాదాపు ఆరునెలలు/ఏడాది వ్యవధితో ఉంటున్నాయి.

మరికొన్ని సంస్థలు రెండు రోజుల (గంటల లెక్కన) నుంచి వారం వ్యవధి ఉన్న కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని కోర్సులకు ఇంటర్మీడియెట్ (సీఈసీ/ఎంఈసీ), మరికొన్ని కోర్సులకు బీకాంలో ఉత్తీర్ణత సాధించాలి. సర్టిఫికేషన్ కోర్సులు పూర్తిచేస్తే గ్రాడ్యుయేషన్‌లో నేర్చుకున్న సబ్జెక్టులకు అదనంగా నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు. తద్వారా జాబ్ మార్కెట్‌లో మంచి ఉద్యోగాన్ని దక్కించుకోవచ్చు. వివిధ యూనివర్సిటీలు అందిస్తున్న కామర్స్.. సంబంధిత సర్టిఫికేట్ కోర్సులు..

ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ - న్యూఢిల్లీ
కోర్సులు: సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్  (సీఎఫ్‌పీ), సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్.  వెబ్‌సైట్: http://iifm.co.in

యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్
కోర్సు: ఈ-కామర్స్
వెబ్‌సైట్: www.unom.ac.in

యూనివర్సిటీ ఆఫ్ కేరళ - తిరువనంతపురం
కోర్సు: ఈ-కామర్స్
వెబ్‌సైట్: www.keralauniversity.ac.in

యూనివర్సిటీ ఆఫ్ పుణే
కోర్సు: ఈ-కామర్స్
వెబ్‌సైట్: www.unipune.ac.in

యూనివర్సిటీ ఆఫ్ ముంబై
కోర్సులు: అకౌంటెన్సీ, అకౌంట్స్ ఆఫ్ ట్రస్ట్స్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ, ఇన్‌డెరైక్ట్ ట్యాక్సెస్ (సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్), బేసిక్ అకౌంటింగ్, డెరైక్ట్ ట్యాక్సెస్ (ఇన్‌కం ట్యాక్స్), కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అండ్ ట్యాలీ ప్యాకేజ్, ఈ-కామర్స్, ట్యాక్స్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీస్, ఎన్విరాన్‌మెంటల్ ఆడిటింగ్.
వెబ్‌సైట్: www.mu.ac.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ - ముంబై
కోర్సులు: సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఇన్..

 • ఎస్‌ఎంఈ ఫైనాన్స్ ఫర్ బ్యాంకర్స్
 • క్రెడిట్ కార్డ్ ఫర్ బ్యాంకర్స్
 • క్వాంటిటేటివ్ మెథడ్స్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్
 • ట్రేడ్ ఫైనాన్స్
 • మైక్రో ఫైనాన్స్

వెబ్‌సైట్: www.iibf.org.in

ఆధారము: సాక్షి

ఉద్యాన పంటలకు.. హార్టికల్చరిస్ట్

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా కార్యాలయంలో కూర్చొని చేసే డెస్క్ జాబ్ మీకిష్టం లేదా? నిత్యం ప్రకృతి ఒడిలో ఉంటూ, పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ పనిచేసుకోవాలనుకుంటున్నారా? అయితే, మీలాంటి వారికి సరిగ్గా సరిపోయే కెరీర్.. హార్టికల్చరిస్ట్. ప్రస్తుతం హార్టికల్చరిస్ట్‌లకు లెక్కలేనన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే ప్రకృతిని కాపాడుతూ, ప్రజల ఆహార అవసరాలను తీరుస్తూ సమాజానికి సేవ చేస్తున్నామన్న వృత్తిపరమైన సంతృప్తి దక్కుతుంది.

ఉద్యోగాలు,పరిశోధనలు :

హార్టికల్చరిస్ట్‌లు ప్రధానంగా సుందరమైన ఉద్యాన వనాల పెంపకంతోపాటు పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తిని చేపట్టాల్సి ఉంటుంది. క్రాప్ ప్రొడక్షన్, ప్లాంట్ బ్రీడింగ్, క్రాస్-బ్రీడింగ్, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ప్లాంట్ ఫిజియాలజీ తదితర రంగాల్లో పరిశోధనలు చేయాలి. నాణ్యమైన, అధిక పోషకాలతో కూడిన ఫలసాయమిచ్చే మొక్కలను సృష్టించాలి. ఉద్యాన పంటలన్నీ హార్టికల్చరిస్ట్ పరిధిలో ఉంటాయి. హార్టికల్చర్‌లో వెజిటెబుల్ సైన్స్, ఫ్రూట్ టెక్నాలజీ, ఫ్లోరికల్చర్ అనే స్పెషలైజేషన్లు ఉన్నాయి. హార్టికల్చరిస్ట్‌లకు ప్రస్తుతం ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఎన్నో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు, ఫామ్‌హౌస్‌లు వీరికి స్వాగతం పలుకుతున్నాయి. రహదారుల పక్కన పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు హైవే అథారిటీలు వీరిని నియమించుకుంటున్నాయి. ఇక సొంతంగా నర్సరీని ఏర్పాటు చేసుకొని అగ్రిప్రెన్యూర్‌గా ఉపాధి పొందొచ్చు. పరిశోధనా రంగంలో చేరితే అధిక వేతనాలు అందుకోవచ్చు. ఆసక్తి ఉంటే కన్సల్టెంట్‌గా కూడా ప్రజలకు సేవలందించొచ్చు.

కావాల్సిన స్కిల్స్:

ఈ రంగంలో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. హార్టికల్చరిస్ట్‌కు ప్రకృతిపై ఇష్టం, క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి. కొత్త వంగడాల అభివృద్ధికి, నాణ్యమైన పండ్లు, కూరగాయలను ఉత్పత్తి చేసేందుకు శాస్త్రీయ దృక్పథం అవసరం. ఈ రంగంపై ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలి. అందమైన వనాలను పెంచేందుకు సృజనాత్మకత ఉండాలి.

అర్హతలు:

భారత్‌లో అగ్రికల్చర్ సైన్స్‌లో వివిధ కోర్సులున్నాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో చేరొచ్చు. పరిశోధనా రంగంలో అడుగుపెట్టాలంటే డాక్టరేట్ పూర్తిచేయాలి. హార్టికల్చరిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించాలంటే పీజీ చేస్తే సరిపోతుంది.

వేతనాలు:

హార్టికల్చరిస్ట్/సూపర్‌వైజర్‌కు ప్రారంభంలో నెలకు రూ.12 వేల వేతనం అందుతుంది. తర్వాత సీనియారిటీని బట్టి మేనేజర్/సీనియర్ మేనేజర్‌కు నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు లభిస్తుంది. ఇక డెరైక్టర్ స్థాయికి చేరుకుంటే నెలకు రూ.లక్షకు పైగానే అందుకోవచ్చు.

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం-హైదరాబాద్
వెబ్‌సైట్: www.angrau.ac.in

డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.drysrhu.edu.in

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ టెక్నాలజీ
వెబ్‌సైట్: www.iht.edu.in

ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-ఢిల్లీ
వెబ్‌సైట్: www.iari.res.in

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో స్థిరపడొచ్చు

‘‘దైనందిన కార్యకలాపాలకు అవసరమైన కోర్సులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వ్యవసాయ ప్రధానమైన భారతదేశంలో అగ్రికల్చర్, అనుబంధ విద్యకు గిరాకీ తగ్గదు. హార్టికల్చర్‌లో గ్రాడ్యుయేషన్, పీజీ, డిప్లొమా కోర్సులను పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అవకాశాలున్నాయి. ఉద్యానవన, విత్తనాభివృద్ధి సంస్థల్లో పనిచేయవచ్చు. స్వయం ఉపాధి పొందుతూ మరికొందరికి మార్గం చూపాలంటే నర్సరీలు, సీడ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగానూ పనిచేయొచ్చు’’

- డాక్టర్ బి.ఎం.సి.రెడ్డి, వైస్‌ఛాన్సలర్, డాక్టర్ వై.ఎస్.ఆర్.హార్టికల్చరల్ యూనివర్సిటీ.

ఆధారము: సాక్షి

ఫైర్ ఇంజనీరింగ్... పుష్కల అవకాశాలు!

సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సూత్రాలను ఉపయోగించి అగ్ని ప్రమాదాల నివారణకు, నియంత్రణకు పాటుపడేదే.. ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్తి, ప్రాణ, పర్యావరణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన తక్షణ చర్యల్లో ఫైర్ ఇంజనీరింగ్ పాత్ర చాలా కీలకం. నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి పరిశ్రమలో, భవనాల్లోనూ ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా మారింది. ఫైర్ ఇంజనీరింగ్ రంగంలో నిపుణులకు విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆ క్రమంలోనే ఇటీవల కాలంలో ఫైర్ ఇంజనీరింగ్ కోర్సుల పట్ల విద్యార్థుల్లో అవగాహన, ఆసక్తి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలతోపాటు సిటీలోని పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్‌లో పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేషన్‌లు, బ్యాచిలర్ కోర్సులు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫైర్ ఇంజనీరింగ్‌తో అవకాశాలపై ఫోకస్..

అర్హతలు:

ఫైర్ , సేఫ్టీ ఇంజనీరింగ్ కోర్సులను సాధారణంగా ఇంటర్మీడియెట్ అర్హతతో అభ్యసించొచ్చు. పదో తరగతితోనూ సేఫ్టీ సూపర్‌వైజర్, సేఫ్టీ స్టీవార్డ్, ఫైర్‌మన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు సేఫ్టీ ఆఫీసర్, సేఫ్టీ ఇంజనీర్, ఫైర్ ఇంజనీర్, ఫైర్ ఆఫీసర్ కోర్సుల్లో చేరొచ్చు. ఫైర్ ఇంజనీర్‌గా స్థిరపడాలంటే.. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

కోర్సుల స్వరూపం:

కోర్సులో స్థూలంగా.. ఫైర్ ఇంజనీరింగ్ సైన్స్, ఫైర్ ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్, ఫైర్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్, సేఫ్టీ మేనేజ్‌మెంట్, సేఫ్టీ ఇంజనీరింగ్, లాస్‌కంట్రోల్ అండ్ సేఫ్టీ లాస్‌తోపాటు ప్రధానంగా ఫైర్ ఫైటింగ్, ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఆక్యుపేషనల్ హెల్త్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌పై శిక్షణ ఇస్తారు. ఫైర్ ఫైటింగ్ అనేది వివిధ విభాగాల్లో ఉంటుంది. ఆయిల్ ఫైర్, గ్యాస్ ఫైర్, మెటల్‌ఫైర్.. ఇలా ఒక్కోదాన్ని ఆర్పివేయడానికి ప్రత్యేక శిక్షణ కల్పిస్తారు. ఫైర్ ఇంజనీరింగ్‌లో భాగంగా విద్యార్థులు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ డిజైన్, స్మోక్ డిటెక్టర్స్, హైజిన్ సిస్టమ్స్ ఏ విధంగా అమర్చాల్సి ఉంటుందో అధ్యయనం చేస్తారు. పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా శిక్షణ ఇస్తారు.

నైపుణ్యాలు:

ఫైర్ ఇంజనీరింగ్ , సేఫ్టీ మేనేజ్‌మెంట్ రంగంలో స్థిరపడాలనుకునే వారు... ప్రమాదాలు సంభవించినప్పుడు లిప్తపాటులో స్పందించగలిగే లక్షణాలను కలిగి ఉండాలి. వేగంగా నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలుండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. సూక్ష్మ పరిశీలనా నైపుణ్యాలూ అవసరం.

ఉద్యోగాలెక్కడ:

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఫైర్ ఇంజనీర్లకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఫైర్ సర్వీసెస్, ఆర్కిటెక్చరల్ అండ్ బిల్డింగ్ డిజైన్, ఇన్సూరెన్స్ అసెస్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇండస్ట్రీ, రిఫైనరీస్, బాట్లింగ్ ప్లాంట్స్, టెక్స్‌టైల్స్, విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించే, అగ్నిప్రమాదాలకు అవకాశమున్న ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ యూనిట్‌ల్లో ఫైర్ ఇంజనీర్లకు ఉద్యోగావకాశాలు ఉంటాయి.

వేతనాలు:

ఫైర్ ఇంజనీర్లు, సేఫ్టీ ఇంజనీర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, సేఫ్టీ ఇన్‌స్పెక్టర్‌లుగా ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రారంభంలోనే ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. ఫైర్ ఇంజనీర్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉన్న గల్ఫ్ లాంటి దేశాల్లో ఎక్కువ మొత్తాన్నే చెల్లిస్తున్నారు.

ఫైర్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్న ప్రముఖ విద్యాసంస్థలు:

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధీనంలో నడిచే నాగ్‌పూర్‌లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్... పలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను ఆఫర్ చేస్తోంది. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల గుర్తింపు కూడా ఉంది.

అందించే కోర్సులు

 • సబ్ ఆఫీసర్స్ ఠ స్టేషన్ ఆఫీసర్స్ అండ్ ఇన్‌స్ట్రక్టర్స్
 • డివిజనల్ ఆఫీసర్స్
 • బ్రీతింగ్ అపారెటస్ ఠ ఫైర్ ప్రివెన్షన్
 • బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్(ఫైర్)
  వెబ్‌సైట్: http://nfscnagpur.nic.in/

యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, డెహ్రాడూన్
డెహ్రాడూన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్(యూపీఈఎస్)... నాలుగేళ్ల బీటెక్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తోంది. యూపీఈఎస్ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా 80 శాతం సీట్లును, జేఈఈ మెయిన్ స్కోరు ద్వారా 20 శాతం సీట్లను భర్తీ చేస్తారు.
వెబ్‌సైట్: www.upes.ac.in

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్, జైపూర్

జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్... ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో కలిసి కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇంటర్మీడియెట్, డిగ్రీ అర్హతతో ప్రవేశాన్ని కల్పిస్తోంది.

కోర్సుల వివరాలు:

 • గ్రాడ్యుయేట్ లెవల్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్
 • పోస్టు గ్రాడ్యుయేట్ లెవల్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్
 • గ్రాడ్యుయేట్ లెవల్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
 • పోస్టు గ్రాడ్యుయేట్ లెవల్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
 • సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్(పైర్‌మన్)
 • సబ్‌ఫైర్ ఆఫీసర్స్ కోర్స్

వెబ్‌సైట్: www.nifesmindia.net

కాలేజ్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్, ఔరంగాబాద్
ఔరంగాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ పలు ఫైర్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తోంది. పదోతరగతి, ఇంటర్మీడియెట్ అర్హతలతో ప్రవేశం కల్పిస్తోంది. కోర్సుల వివరాలు...

 • బీఎస్సీ ఫైర్ సేఫ్టీ
 • అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ
 • డి ప్లొమా ఇన్ ఫైర్ సర్వీస్ ఇంజనీరింగ్
 • డిప్లొమా ఇన్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్
 • డిప్లొమా ఇన్ సేఫ్టీ, హెల్త్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్
 • ఫైర్ ఇంజనీరింగ్(ఫైర్‌మన్)/ సేఫ్టీ ఇంజనీరింగ్
 • సివిల్ సూపర్‌వైజర్
 • బిల్డింగ్ సైట్ సూపర్‌వైజర్
 • ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనే జ్‌మెంట్
 • సెక్యూరిటీ అండ్ ఫైర్ ప్రివెన్షన్

వెబ్‌సైట్: www.fireengg.in

హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్

హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ రెగ్యులర్, దూరవిద్యా విధానంలో పలు ఫైర్ కోర్సులను అందిస్తోంది.

కోర్సుల వివరాలు...

 • పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
 • డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
 • సేఫ్టీ ఆఫీసర్ మేనేజ్‌మెంట్

వెబ్‌సైట్: www.hifeindia.in

గ్లోబల్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్

ఈ విద్యాసంస్థ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్‌లో పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేషన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది.

కోర్సుల వివరాలు:

 • పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
 • పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
 • డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
 • డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
 • ఫైర్ ఫైటింగ్ ట్రైనింగ్

వెబ్‌సైట్: www.glifse.com

హైదరాబాద్‌లో ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సులు..
ఎన్‌ఐఎఫ్‌ఎస్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్ట్ మేనేజ్‌మెంట్):

హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా 50కి పైగా కేంద్రాల్లో ఈ ఇన్‌స్టిట్యూట్ ఫైర్ సేఫ్టీ కోర్సులను ఆఫర్ చేస్తోంది.

కోర్సుల వివరాలు...

 • ఎంబీఏ సేఫ్టీ మేనేజ్‌మెంట్
 • డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ
 • డిప్లొమా ఇన్ హెల్త్ అండ్ సేఫ్టీ ఎన్విరాన్‌మెంట్
 • పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ
 • పీజీ డిప్లొమా ఇన్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్
 • డిప్లొమా ఇన్ క్వాలిటీ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్‌మెంట్
 • డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్
 • పీజీ డిప్లొమా ఇన్ క్వాలిటీ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్‌మెంట్
 • బీఎస్సీ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ

వెబ్‌సైట్: www.nifsindia.net/

డిమాండ్‌కు తగిన సిబ్బంది లేరు
‘‘ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌లో అవసరాలకు తగిన సిబ్బంది అందుబాటులో లేరు. దీనికి కారణం విద్యార్థుల్లో ఈ కోర్సులపై తగిన అవగాహన లేకపోవడమే. ప్రస్తుతం అగ్ని ప్రమాదాల నివారణకు దాదాపు అన్ని పరిశ్రమలు ముందస్తు చర్యలను పటిష్టం చేస్తున్నాయి. వాటిని నిత్యం పర్యవేక్షించడానికి అగ్నిమాపక నిపుణులకు అవకాశాలను కల్పిస్తున్నాయి. అలాగే ప్రమాదాలు సంభవించిన ప్పుడు ఈ విభాగంలో శిక్షణ పొందిన వారి అవసరం ఏర్పడుతోంది. కాబట్టి ఫైర్ ఇంజనీరింగ్ కోర్సులను పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో పుష్కలమైన అవకాశాలుంటాయని నిస్సందేహంగా చెప్పొచ్చు’’
- సునీల్ మహంతి, డెరైక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్ట్ మేనేజ్‌మెంట్.

ఆధారము: సాక్షి

పారా మెడికల్ పై భవిత

వైద్య రంగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ వైద్య సేవలు విస్తరించడం. ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడం. వెరసి రోగులకు చికిత్సనందించడంలో వైద్యులకు సహాయంగా నిలిచే పారా మెడికల్ సిబ్బందికి డిమాండ్ పెరిగింది. రక్త పరీక్ష నుంచి రేడియాలజీ వరకు. సిటీస్కాన్ నుంచి ఎండోస్కోపి వరకూ. పారామెడికల్ సిబ్బంది సేవలు ఎంతో కీలకమైనవి. ఒక రకంగా చెప్పాలంటే వీరి తోడ్పాటు లేకుండా ఆయా విభాగాల పర్యవేక్షణ సాధ్యం కాదు. స్వల్ప వ్యవధి గల కోర్సుల ద్వారానే ఎలాంటి ఒడిదుడుకులు లేని స్థిరమైన ఉపాధిని, ఉద్యోగ అవకాశాలను అందించే పారామెడికల్ కెరీర్ గురించి తెలుసుకుందాం....

వైద్య సేవల విస్తరణ వేగంగా జరుగుతోంది. కార్పొరేట్ ఆస్పత్రులు నగరాల్లోనే కాకుండా చిన్నచిన్న పట్టణాల్లో సైతం ఏర్పాటవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. దీంతో పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన వారికి తక్షణమే ఉపాధి లభిస్తోంది. పారామెడికల్ కోర్సులు విద్యార్థుల పాలిట కల్పతరువుగా మారాయి అంటున్నారు నిపుణులు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ అర్హతతో ప్రవేశం కల్పించే ఈ కోర్సుల్లో చేరితే ఆకర్షణీయమైన కెరీర్‌కు మార్గం పడినట్లే.

అవకాశాలు: విస్తరిస్తున్న కార్పొరేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్‌లో డాక్టర్‌కు అనుబంధంగా సేవలు అందించ డానికి పారా మెడికల్ సిబ్బంది తప్పనిసరి. డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఎక్స్-రే యూనిట్లు, సిటీ స్కానింగ్, ఎం.ఆర్‌.ఐ., ఈ.సీ.జీ. సెంటర్లు, ఆపద సమయాల్లో రక్తం అందించే బ్లడ్ బ్యాంక్‌లు మనకు ప్రతి మండలం, జిల్లా కేంద్రాల్లోను కనిపిస్తాయి..వీటికి సుశిక్షితులైన పారామెడికల్ సిబ్బంది చాలా అవసరం.. ఇటీవల కాలంలో గుండె సంబంధ శస్త్ర చికిత్సల సంఖ్య పెరిగింది. హృద్రోగ చికిత్సను అందించే ఫిజిషియన్‌కు సహకరించే పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్లు పాత్ర కీలకంగా మారింది. ఈ విభాగాల్లో సిబ్బందికి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కాబట్టి పారామెడికల్ కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం లభించడం ఖాయం.

అర్హత: పారామెడికల్ కోర్సుల్లో ఇంటర్మీడియెట్ (సైన్స్) విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. సంబంధిత పర్యవేక్షణ విభాగం జారీ చేసే నోటిఫికేషన్ ఆధారంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్), గాంధీ మెడికల్ కాలేజీ వంటి ప్రభుత్వ సంస్థలతోపాటు పలు ప్రైవేట్ సంస్థలు కూడా పారామెడికల్ కోర్సులను అందిస్తున్నాయి.

కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా పారామెడికల్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. అందులో నైపుణ్యం ఉన్న వారిని నేరుగా రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఎయిమ్స్ కూడా ఇటువంటి కోర్సులను అందిస్తోంది.

సాధారణంగా ఈ కోర్సుల కాలవ్యవధి ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది.

వేతనాలు: కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వేతనం లభిస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్స్‌లోనైతే రూ.10 వేల నుంచి 12 వేల వరకు అందుతుంది. తర్వాత అర్హత అనుభవం ఆధారంగా నెలకు రూ.30 వేల వరకు సంపాదించవచ్చు. పారామెడికల్‌కు సంబంధించి చాలా ఇన్‌స్టిట్యూట్‌లు వివిధ రకాల కోర్సులను అందజేస్తున్నాయి. వీటికి సరైన గుర్తింపు ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతే ఇన్‌స్టిట్యూట్‌లలో చేరడం మంచిది.

ఎన్‌.ఎస్‌.డీ.సీ. - హెచ్‌.ఎస్‌.ఎస్‌.సీ. ఏర్పాటు: దేశంలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కూడా సుశిక్షితులైన పారామెడికల్ సిబ్బందిని తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎన్‌.ఎస్‌.డీ.సీ. - జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ).. హెల్త్‌కేర్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ (హెచ్‌.ఎస్‌.ఎస్‌.సీ.) ను ఏర్పాటు చేసింది. ఇది పారామెడికల్‌కు సంబంధించి 29 విభాగాలను గుర్తించింది.

ప్రస్తుత అవసరాలకనుగుణంగా కోర్సు సిలబస్‌ను రూపొందించడంలో నిమగ్నమైంది. హెచ్‌.ఎస్‌.ఎస్‌.సీ. వివిధ అనుబంధ సంస్థల ద్వారా అందజేసే ఈ కోర్సులకు నిర్ణీత కాల వ్యవధి అంటూ ఉండదు. అభ్యర్థులు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారని భావిస్తే వారిని హెచ్‌ఎస్‌ఎస్‌సీ పరీక్ష (అసెస్‌మెంట్) కు పంపొచ్చు. ఇందుకోసం సంబంధిత రంగ నిపుణులతో కూడిన ప్యానెల్ ఉంటుంది. ఈ ప్యానెల్ సదరు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, రిపోర్ట్ కార్డు అందజేస్తుంది. దాని ఆధారంగా దేశ వ్యాప్తంగా పారామెడికల్ ఉద్యోగాల కోసం ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్

వివిధ రకాల రక్త పరీక్షలు, మల, మూత్ర పరీక్షలు నిర్వహణ, రిపోర్టింగ్ చేయడం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ విధి. ఈ కోర్సు తర్వాత సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీగా బీఎస్సీ(ఎంఎల్‌టీ) చేయొచ్చు. అంతేకాకుండా ఇంటర్మీడియెట్ (సైన్సెస్) తర్వాత బీఎస్సీ ఎంఎల్‌టీలో ప్రవేశం పొందొచ్చు..

డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్

కేన్సర్ సంబంధిత చికిత్సలో రేడియోథెరపీ టెక్నీషియన్లు పాల్పంచుకుంటారు. కేన్సర్ ఏ స్థాయిలో ఉంది..? దానికి రేడియేషన్ ఎంత ఇవ్వాలి.. రేడియేషన్ అవసరం ఉందా, లేదా అనే అంశాలను వీరే నిర్ణయిస్తారు.

డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్

అవుట్ పేషంట్ డయాలసిస్ విభాగాల్లో డయాలసిస్ టెక్నీషియన్‌లు కీలక పాత్ర పోషిస్తారు. డయాలసిస్ చేసేటప్పుడు వినియోగించే పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి? ఆ పరికరాల నిర్వహణ, సంబంధిత అంశాలు ఈ కోర్సులో ఉంటాయి.

డిప్లొమా ఇన్ పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్

హృద్రోగ చికిత్స నిర్వహించే బృందంలో పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్ ది కీలక పాత్ర. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లకు సహాయపడటం.. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేటప్పుడు ఉపయోగించే హార్ట్ - లంగ్ మిషిన్ ఎంపిక, అమరికలో పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్‌లు బాధ్యత తీసుకుంటారు. ఆపరేషన్ తర్వాత రోగికి అన్నివిధాలుగా సేవలు అందిస్తారు. ప్రస్తుతం గుండె సంబంధ శస్త్ర చికిత్సలు పెరుగుతుండటంతో వీరి అవసరం పెరుగుతోంది.

డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్

ఎం.ఆర్‌.ఐ., ఎక్స్‌రే, సిటీస్కాన్, ఆల్ట్రా సౌండ్ వంటి పరీక్షల్లో రేడియాలజిస్ట్‌లకు వీరు సహాయపడతారు.

డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్

ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిర్థారణ, ‘బ్రోంకే స్కోపి’ టెస్ట్ చేయడంలో రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్‌లు సంబంధిత వైద్యులకు సహాయపడతారు.

సర్టిఫికెట్ ఇన్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్

బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహించడంలో వీరి పాత్ర ముఖ్యమైంది. రక్తాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం, బ్లడ్‌బ్యాంక్‌కు సంబంధించిన అన్ని రికార్డులను, ఇతర విధులను నిర్వహించడం వీరి ప్రధాన బాధ్యత.

సర్టిఫికెట్ ఇన్ అనస్థీషియా టెక్నీషియన్

శస్త్ర చికిత్స నిర్వహించే రోగికి అనస్థీషియా (మత్తుమందు) ఇవ్వడంలో.. సంబంధిత అంశాల నిర్వహణలో అనస్థీషియా టెక్నీషియన్‌లు, డాక్టర్లకు తగువిధంగా సహాయపడుతుంటారు.

సర్టిఫికెట్ ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్

ల్యాబ్ నిర్వహణ, ఫిల్మ్స్ డెవలప్‌మెంట్, ఇమేజింగ్ టెక్నాలజిస్ట్/రేడియాలజిస్ట్‌లకు సంబంధిత వ్యవహారాల్లో తగిన విధంగా సహాయం చేయడం వంటి బాధ్యతలను వీరు నిర్వహిస్తుంటారు.

సర్టిఫికెట్ ఇన్ ఎమర్జెన్సీ పారా మెడిక్ టెక్నాలజిస్ట్

ఎమర్జెన్సీ సమయంలో గోల్డెన్ అవర్‌గా పరిగణించే సమయంలో ప్రమాదానికి గురైన వ్యక్తికి కావల్సిన రెస్పిరేటరీ, కార్డియాక్ సపోర్ట్ అందివ్వడం, రిహ్రై డేషన్, రక్తం పోకుండా చూడడం వంటి అత్యవసర విధులను వీరు పర్యవేక్షిస్తుంటారు.

సర్టిఫికెట్ ఇన్ టెలిమెడిసిన్ టెక్నాలజిస్ట్

ఒక వ్యక్తికి ఏదైనా ఆనారోగ్యం కలిగితే.. దానికి సంబంధించిన మెడికల్ డయోగ్నోసిస్, ట్రీట్‌మెంట్ వంటి అంశాలపై సమాచారాన్ని టెలిమెడిసిన్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ నెట్‌వర్క్ కమ్యూనికేషన్ ఉపయోగించి టెలిమెడిసిన్ టెక్నాలజిస్ట్‌లు అందిస్తారు. ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు ఈ తరహా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి ఈ కోర్సు చేసినవారికి జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.

డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ థెరపీ

పుట్టుకతో మాట్లాడటంలో వచ్చిన లోపాలు, పదాలు/శబ్దాలను స్పష్టంగా పలకలేకపోవడం, మాటలు సరిగ్గా రాకపోవడం వంటి లోపాలను లాంగ్వేజ్ టెక్నిక్స్ ద్వారా సరిచేయడం వీరి ప్రధాన బాధ్యత.

సర్టిఫికెట్ ఇన్ ఈ.సీ.జీ. టెక్నీషియన్

ఈ.సీ.జీ. టెక్నీషియన్ హృదయ స్పందనను రికార్డ్ చేసే ఈక్విప్‌మెంట్ ద్వారా రోగి హార్ట్ బీట్, తదితర అంశాలను రికార్డ్ చేసి సంబంధిత ఫిజీషియన్‌కు ఆ రికార్డులను అందజేస్తాడు. తద్వారా హార్ట్, వ్యాస్కులర్ ప్రాబ్లమ్స్‌కు చికిత్స అందించడంలో సహాయపడతాడు.

సర్టిఫికెట్ ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్

వివిధ పరీక్షల్లో భాగంగా తీసిన ఎక్స్‌రే ఫిల్మ్స్‌ను డెవలప్ చేయడం, సంబంధిత ల్యాబ్ నిర్వహణ వంటి బాధ్యతలను డార్క్ రూమ్ అసిస్టెంట్ నిర్వహిస్తాడు.

ఆధారము: సాక్షి

ఉజ్వల కెరీర్.. బ్యాంకింగ్.

‘బ్యాంకింగ్ రంగం.. బ్యాంకుల్లో కొలువులు అంటే కేవలం మనకు కనిపించే క్లరికల్, ఆఫీసర్ పోస్ట్‌లు మాత్రమే కాదు. బ్యాంకింగ్ రంగంలో మరెన్నో విభాగాల్లో సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలోనూ టెక్నాలజీ ఆధారిత సేవలు పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా బ్యాంకుల్లో ఐటీ విభాగంలో ఎన్నెన్నో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి’ అంటున్నారు..  టెక్నాలజీ ఆధారిత బ్యాంకింగ్ సేవల ఆవశ్యకతను గుర్తించి ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) డెరైక్టర్ డాక్టర్ ఎ.ఎస్.రామశాస్త్రి.  బ్యాంకింగ్ రంగంలోనూ రీసెర్చ్ అవకాశాలకూ కొదవ లేదని ఆయన పేర్కొంటున్నారు. ఐఐటీ చెన్నైలో పీహెచ్‌డీ చేసి ఆర్‌బీఐలో పలు విభాగాల్లో మూడు దశాబ్దాలకుపైగా అనుభవం గడించి.. ప్రసుతం ఐడీఆర్‌బీటీ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న రామశాస్త్రితో ప్రత్యేక ఇంటర్వ్యూ.

అకడమిక్ + ప్రొఫెషనల్ అప్రోచ్ లక్ష్యంగా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1995లో ఏర్పాటు చేసిన సంస్థ ఐడీఆర్‌బీటీ. దీనికి ప్రధాన కారణం ఆ రోజుల్లో బ్యాంకుల్లో టెక్నాలజీ వినియోగం, అవగాహన తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో బ్యాంకులు టెక్నాలజీని అనుసరించేందుకు, అవసరమైన విధానాలు, మార్గదర్శకాలు రూపొందించేందుకు ఐడీఆర్‌బీటీని ప్రారంభించింది. ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటైన నాటి నుంచి బ్యాంకింగ్ టెక్నాలజీలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ దిశగా చర్యలు చేపడుతోంది. మరోవైపు ఎంటెక్ వంటి అకడమిక్ కోర్సులు, బ్యాంక్ ఆఫీసర్లకు శిక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

బ్యాంకింగ్‌లోనూ రీసెర్చ్ అవకాశాలు
రీసెర్చ్ అంటే కేవలం సైన్స్, ఇంజనీరింగ్‌కే పరిమితం కాదు. బ్యాంకింగ్‌లోనూ ఈ అవకాశం ఉంది. ఉదాహరణకు మ్యాథమెటిక్స్‌లోని క్రిప్టోగ్రఫీ ఫండమెంటల్ రీసెర్చ్ బ్యాంకింగ్‌లో ఆవిష్కరణలకూ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ రంగంలో మొబైల్ పేమెంట్స్, అనలిటిక్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్‌వర్క్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బయో మెట్రిక్స్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ మొదలైనవి ముఖ్యమైన రీసెర్చ్ అంశాలుగా ఉన్నాయి.

బ్యాంకు కొలువులకు సరితూగే అకడమిక్స్

నేటి యువతలో బ్యాంకు కొలువులంటే ఎనలేని క్రేజ్ అనేది నిస్సందేహం. అకడమిక్స్ పరంగా ఎకనామిక్స్, బ్యాంకింగ్, కామర్స్, అకౌంటెన్సీ, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, ఆడిటింగ్ నేపథ్యం ఉంటే సంప్రదాయ బ్యాంకు కొలువులకు సరితూగుతారు. కానీ బ్యాంకులు అన్ని నేపథ్యాల అభ్యర్థులను నియమించుకుని తమకు అవసరమైన రీతిలో శిక్షణనిస్తున్నాయి. మరోవైపు గత కొన్నేళ్లుగా బ్యాంకులు నిర్వహిస్తున్న కార్యకలాపాలు, సేవల్లో సాంకేతికతను (ఉదా: ఏటీఎం, ఇంటర్నెట్ సేవలు, మొబైల్ బ్యాంకింగ్) అమలు చేస్తున్నాయి.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. కొత్త టెక్నాలజీలను వినియోగించి మరిన్ని కొత్త సేవలు, ఉత్పత్తులు రూపొందించడంలో కృషి చేస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ రంగంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. జనరల్ పోస్ట్‌లతోపాటు ప్రత్యేకంగా ఐటీ విభాగాల్లో టెక్నాలజీ స్పెషలిస్ట్‌ల నియామకాలు చేపడుతున్నాయి.

ఐడీఆర్‌బీటీలో అకడమిక్ ఎంట్రీ
ప్రస్తుతం ఐడీఆర్‌బీటీ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులను నిర్వహిస్తోంది. హెచ్‌సీయూ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా సీట్ల భర్తీ జరుగుతుంది. ఎంటెక్‌లో బ్యాంకింగ్ టెక్నాలజీ, పేమెంట్ సిస్టమ్స్ టెక్నాలజీ, క్వాంటిటేటివ్ మెథడ్స్ ఫర్ ఫైనాన్స్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేసిన విద్యార్థులకు బ్యాంకులతోపాటు సాఫ్ట్‌వేర్ సంస్థలు, బ్యాంకింగ్ ప్రాజెక్ట్‌లు చేపడుతున్న ఐటీ సంస్థల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. పీహెచ్‌డీ విషయానికొస్తే ఎన్నో అంశాలపై రీసెర్చ్ చేసే అవకాశం ఉంది. బ్యాంకింగ్ అప్లికేషన్స్‌కు సంబంధించి రీసెర్చ్ ఎక్కువగా జరుగుతుంది.

భవిష్యత్తు ఉజ్వలం
బ్యాంకింగ్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోంది. కారణం.. ఈ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులే. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, జన్‌ధన్ యోజన వంటి పథకాల ప్రారంభం కారణంగా బ్యాంకులు దేశంలో ప్రతి ఒక్కరికీ సేవలందించే ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. వీటి సమర్థ అమలుకు కార్యకలాపాల విస్తరణ ఆవశ్యకత... ఫలితంగా భారీఎత్తున మానవ వనరుల అవసరం ఏర్పడుతుంది. అదే విధంగా కొత్త బ్యాంకులకు లెసైన్స్‌లు మంజూరు వంటివి కూడా ఈ రంగంలో ఉద్యోగాల కల్పనకు మార్గం వేస్తున్నాయి. మరెన్నో చిన్న బ్యాంకులు కూడా ఈ రంగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా బ్యాంకుల్లో వేల సంఖ్యలో కొలువులకు మార్గం వేసేవే. కొత్తగా వచ్చే బ్యాంకులు కూడా టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు అధిక శాతం అవకాశాలు కల్పించనున్నాయి. కారణం.. అవి ప్రారంభంలో పూర్తి టెక్నాలజీ బ్యాంకులుగా రానుండటం.

అవసరమైన నైపుణ్యాలు
బ్యాంకులు ఇప్పుడు అన్ని నేపథ్యాలు ఉన్న అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. ఔత్సాహికులకు కావాల్సిందల్లా నిబద్ధతతో పని చేయాలనే దృక్పథం. ప్రస్తుతం బ్యాంకులు ఆప్టిట్యూడ్ టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ టెస్ట్‌లలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్‌లను పరీక్షిస్తాయి. కాబట్టి అభ్యర్థులు ఈ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. అటు టెక్నాలజీ కోణంలోనూ డేటా సెంటర్స్, నెట్‌వర్క్స్, డేటా బేసెస్ తదితర విభాగాల్లో.. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీపైనా బ్యాంకులు ఇప్పుడు ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిటర్స్, ఎథికల్ హ్యాకర్స్ వంటి నిపుణుల అవసరం ఏర్పడుతోంది. వీటికితోడు డేటా వేర్ హౌసింగ్, డేటా మైనింగ్, అనలిటిక్స్‌లో నైపుణ్యాలు కూడా బ్యాంకు కొలువులకు మార్గం వేస్తాయి.

అకడమిక్స్, కమ్యూనికేషన్ రెండూ ఉంటేనే
నేటి పోటీ ప్రపంచంలో ఏ రంగమైనా ఔత్సాహికులకు అకడమిక్స్‌తోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధానంగా మారాయి. దీంతో విద్యార్థులు ముందుగా అకడమిక్స్‌లో పట్టు సాధించాలి. తర్వాత కెరీర్ లక్ష్యంగా ఎంచుకున్న రంగానికి సంబంధించి ఆప్టిట్యూడ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా కష్టపడే తత్వం, నిరంతరం నేర్చుకునే నైపుణ్యాలు ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు!

వృత్తిపరమైన సంతృప్తి
దేశంలో బ్యాంకింగ్ రంగం నిరంతరం వృద్ధి చెందుతున్న రంగం. సమీప భవిష్యత్తులో మరింత వృద్ధి సాధిస్తుందని అంచనా. కెరీర్ పరంగా ఎంతో క్రేజ్ ఉన్న రంగం బ్యాంకింగ్. ఒకవైపు సుస్థిర భవిష్యత్తును, మరో వైపు సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఎన్నో గ్రామాల్లో బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది.. అన్ని వర్గాల ఉన్నతికి ఎంతో కీలక పాత్ర వహిస్తున్నారు. అదే విధంగా ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ వంటి చర్యల కారణంగా పేద ప్రజలకు కూడా సహకారం అందించగలుగుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే బ్యాంకుల్లో పనిచేయడం వల్ల వ్యక్తిగత లబ్ధితోపాటు వృత్తిపరమైన సంతృప్తిని కూడా పొందొచ్చు.

ఆధారము: సాక్షి

అవకాశాల మేఘం.. క్లౌడ్ కంప్యూటింగ్

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ అనుబంధ సంస్థల్లో కెరీర్స్ అంటే సాధారణంగా గుర్తొచ్చే విభాగాలు.. ప్రోగ్రామింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డేటా మైనింగ్, అప్లికేషన్స్. వీటితోపాటు ఐటీ రంగంలో ఇప్పుడు ఎమర్జింగ్ సెగ్మెంట్‌గా మారుతున్న విభాగం.. క్లౌడ్ కంప్యూటింగ్. తాజాగా ఐఐటీల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఐటీ రంగ నియామకాల్లో 20 నుంచి 25 శాతం మేర క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొఫైల్స్‌కు చెందినవే.

కంపెనీలు ఇతర మార్గాల ద్వారా భర్తీ చేస్తున్న వాటిల్లోనూ క్లౌడ్ కంప్యూటింగ్‌కు ప్రాధాన్యం లభిస్తోంది. భవిష్యత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్‌లో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. సాఫ్ట్‌వేర్ సేవలను సరళతరం చేస్తూ పుష్కల అవకాశాలకు దోహదం చేస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్‌పై విశ్లేషణ..

‘ఆధునిక ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ రూపొందించి వినియోగదారుల ఆదరణ పొందాలి. ఇప్పుడు ఇందుకు సరైన సాధనం.. క్లౌడ్ కంప్యూటింగ్. యువ సాఫ్ట్‌వేర్ నిపుణులు క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో రాణించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి’.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలివి. సాఫ్ట్‌వేర్ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్ ఆవశ్యకతను తెలిపే మాటలివి. దేశంలో అనేక సాఫ్ట్‌వేర్ సంస్థలు వినియోగదారులకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాయి. పోటీదారుల కంటే ముందుండేందుకు నిరంతరం కొత్త టెక్నాలజీపై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాధాన్యం పెరుగుతోంది.

క్లౌడ్ కంప్యూటింగ్ అంటే

ఐటీ సంస్థలు తమ క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తుంటాయి. అందులో భాగంగా ఎన్నో ప్రోగ్రామ్స్, అప్లికేషన్ టూల్స్, నెట్‌వర్క్ ఛానెల్స్‌ను రూపొందిస్తుంటాయి. వీటన్నిటి స్టోరేజ్ కంపెనీలకు వ్యయభారంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా ఆవిష్కృతమైన సరికొత్త టెక్నాలజీ.. క్లౌడ్ కంప్యూటింగ్! భౌతికంగా ఎలాంటి డేటా స్టోరేజ్, లాన్ లేకుండానే ఇంటర్నెట్ ఆధారంగా ఈ-మెయిల్స్ ద్వారా నిర్దిష్ట సేవలను అవసరమైనప్పుడు అందించడమే.. క్లౌడ్ కంప్యూటింగ్. ఇది కంపెనీల వ్యయ భారాన్ని, సమయాన్ని ఆదా చేస్తుంది.

సాఫ్ట్‌వేర్ సేవలను సదరు ప్రొవైడర్ నుంచి సులువుగా ఈ-మెయిల్ ద్వారా పొందొచ్చు. ఇప్పటివరకు ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినప్పుడు దానిపై అవగాహన వచ్చే వరకు ప్రొవైడింగ్ సంస్థల ప్రతినిధులు వినియోగదారుల వద్ద ఉండాల్సి వచ్చేది. క్లౌడ్ కంప్యూటింగ్‌తో ఈ-మెయిల్స్, ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోంది. ఉదాహరణకు: ఒక వినియోగదారుడి కంప్యూటర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కే పరిమితమైంది. కానీ దానికి భిన్నంగా ఉండే మరో అప్లికేషన్(ఉదా: యాపిల్ మ్యాక్) పొందాల్సిన అవసరం ఏర్పడింది.

అలాంటప్పుడు యాపిల్ మ్యాక్ ప్రొవైడర్స్ నుంచి సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసి, ఈ-మెయిల్ ద్వారా సొంతం చేసుకుని యాపిల్ మ్యాక్ అప్లికేషన్స్‌ను వినియోగించుకోవచ్చు. దీనికి ఆ ప్రొవైడర్స్ నిర్దేశించే మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. అంటే.. స్థూలంగా ఇంటర్నెట్ ఆధారంగా ఎలాంటి సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్/సర్వీసెస్‌ను అయినా అందించే, సొంతం చేసుకునే వెసులుబాటు కల్పించే విభాగం.. క్లౌడ్ కంప్యూటింగ్.

పెరుగుతున్న డిమాండ్

పోటీ ప్రపంచంలో సంస్థలు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ప్రతి రెండు, మూడేళ్లకు కొత్త కొత్త వెర్షన్‌లు ఆవిష్కృతమవుతున్నాయి. దాంతో అన్నిటినీ కొనుగోలు చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా కంపెనీలకు డేటా స్టోరేజ్ అనేది పెద్ద సమస్యగా మారుతోంది.

క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ద్వారా అవసరమైన మేరకే సదరు సర్వీసెస్ పొందే అవకాశం లభిస్తుంది. అందుకే గత రెండుమూడేళ్లుగా క్లౌడ్ కంప్యూటింగ్‌కు డిమాండ్ పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్.. ఇలా ఐటీ రంగంలో దాదాపు అన్ని కంపెనీలు ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలు ఉన్న వారి కోసం అన్వేషిస్తున్నాయి.

లక్షల్లో అవకాశాలు

ఐటీ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్ నియామకాల సంఖ్య లక్షల్లో నమోదు కానుంది. నాస్‌కామ్, సీఐఐ, ఐబీఎం వంటి సంస్థల సర్వేల ప్రకారం- క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఈ ఏడాది భారీగా రిక్రూట్‌మెంట్ జరుగనుంది. మరోవైపు 2015 చివరి నాటికి అంతర్జాతీయంగా క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం 70 బిలియన్ డాలర్ల మేర కార్యకలాపాలు నమోదు చేసుకోనుంది.

26 శాతం వార్షిక వృద్ధి సాధిస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఈ ఏడాదిలోనే 15 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించనుందని నిపుణుల అంచనా. వీటిలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలో నిలవనుంది. భారత్ మూడు లక్షలకుపైగా ఉద్యోగావకాశాలతో మూడో స్థానం పొందనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

అవసరమైన నైపుణ్యాలు

క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో స్థిరపడాలనుకునేవారికి హెచ్‌టీఎంఎల్, వర్చువలైజేషన్ టెక్నాలజీస్, జావా, సీ++, డాట్ నెట్ వంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్, డేటా మేనేజ్‌మెంట్, డేటా అనాలిసిస్, డేటా మైనింగ్ వంటి కోర్ నైపుణ్యాలు అవసరం. అదేవిధంగా వెబ్ డెవలప్‌మెంట్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, అప్లికేషన్ డెవలప్‌మెంట్, బిజినెస్ అనాలిసిస్ తదితర యూజర్ రిలేటెడ్ స్కిల్స్ కూడా ఉద్యోగ సాధనకు ఉపకరించే అదనపు నైపుణ్యాలు.

క్లౌడ్ కోర్సులు

క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించి ప్రస్తుతం అకడమిక్‌గా ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయిలో పూర్తిస్థాయి కోర్సులు లేవు. దీంతో కంపెనీలు బీటెక్ స్థాయిలో ఈసీఈ, సీఎస్‌ఈ బ్రాంచ్‌ల విద్యార్థులను నియమించుకుని, సొంతంగా శిక్షణనిచ్చి క్లౌడ్ నైపుణ్యాలు నేర్పిస్త్తున్నాయి. జేఎన్‌టీయూ, ట్రిపుల్‌ఐటీ, సీ-డాక్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్ చేసే సాఫ్ట్‌వేర్ కోర్సుల్లోనే క్లౌడ్ కంప్యూటింగ్ మాడ్యూల్స్‌ను అందిస్తున్నాయి.

క్లౌడ్ కంప్యూటింగ్‌కు గ్రాడ్యుయేషన్‌లో పూర్తి స్థాయి కోర్సులు లేకున్నా.. రీసెర్చ్ స్థాయిలో పలు ఇన్‌స్టిట్యూట్‌ల్లో అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ-బాంబే, ఐబీఎం-ఇండియా రీసెర్చ్ ల్యాబ్, టీసీఎస్ ఇన్నోవేషన్ ల్యాబ్, హెచ్‌పీ లేబొరేటరీల్లో క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఆర్ అండ్ డీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇందుకోసం అవి ప్రత్యేక ప్రవేశ ప్రక్రియల ద్వారా ఔత్సాహికులను ఎంపిక చేస్తున్నాయి.

సర్టిఫికేషన్స్

పూర్తి స్థాయిలో కోర్సులు లేని క్లౌడ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యాల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పలు ఇన్‌స్టిట్యూట్‌లు సర్టిఫికేషన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఐబీఎం, సిస్కో, హెచ్‌పీ టెక్నాలజీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నాయి. వీటితోపాటు క్లౌడ్ క్రెడెన్షియల్ కౌన్సిల్, ఈఎంసీ, వీఎంవేర్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లు పలు సర్టిఫికేషన్‌‌స ఆఫర్ చేస్తున్నాయి.

అవి.. ప్రొఫెషనల్ అడ్మినిస్ట్రేటర్, ప్రొఫెషనల్ క్లౌడ్ డెవలపర్, ప్రొఫెషనల్ క్లౌడ్ సెక్యూరిటీ మేనేజర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, వెండార్ అలైన్‌మెంట్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ సర్టిఫికేషన్, వర్చువలైజేషన్ ఆఫ్ డేటా సెంటర్ అండ్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్టిఫికేషన్ వంటివి.

ఆకర్షణీయ వేతనాలు

సర్టిఫికేషన్ కోర్సులు లేదా కంపెనీల సొంత శిక్షణ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యాలు పొందినవారికి.. ఈ విభాగంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్; నెట్‌వర్క్ ఆర్కిటెక్ట్/ప్లానర్; ప్రొడక్ట్ మేనేజర్; సేల్స్ ఎగ్జిక్యూటివ్; క్లౌడ్ డెవలపర్/ప్రోగ్రామర్, క్లౌడ్ కన్సల్టెంట్; క్లౌడ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ సిస్టమ్స్ ఇంజనీర్ వంటి హోదాలు లభిస్తాయి. ఈ రంగంలో స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్‌కు ఎంట్రీ లెవల్‌లోనే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో వార్షిక వేతనం లభిస్తుంది. మిడ్-లెవల్ ప్రొఫెషనల్స్‌కు దాదాపు రూ.15 లక్షలు; ఆరేడేళ్ల అనుభవం ఉన్న వారికి రూ.20 లక్షల మేర వార్షిక వేతనం ఖాయం.

క్లౌడ్ సర్టిఫికేషన్స్- ముఖ్య వెబ్‌సైట్స్

 • http://www-03.ibm.com/certify/certs/50001201.shtml
 • http://www8.hp.com/us/en/training/portfolio/cloud.html
 • education.emc.com
 • www.cloudschool.com
 • www.microsoft.com/learning
 • https://www.itpreneurs.com/it-training-products/cloud-computing/cloud/
 • www.cdac.in
 • www.snia.org
 • www.cloudcomputingtraining.co.in
 • www.cloudcredential.org

సరికొత్త వేదిక

ఐటీ రంగంలో రెగ్యులర్ జాబ్స్‌కు విభిన్నంగా విధులు నిర్వర్తించాలనుకునే వారికి సరికొత్త వేదిక.. క్లౌడ్ కంప్యూటింగ్. మారుతున్న పరిస్థితులు, క్లయింట్ల అవసరాలు, అన్ని స్థాయిల్లోని క్లయింట్లకు చేరుకొని ఎండ్ యూజర్స్ సంఖ్యను పెంచుకునేందుకు కంపెనీలు అనుసరిస్తున్న విధానం.. క్లౌడ్ కంప్యూటింగ్. దీన్ని విద్యార్థులు అందిపుచ్చుకుంటే కచ్చితంగా మంచి అవకాశాలు సొంతమవుతాయి.

క్లౌడ్ కంప్యూటింగ్‌లో సుస్థిర భవిష్యత్తు కోరుకునే ఔత్సాహికులకు విషయ పరిజ్ఞానంతోపాటు, క్లయింట్స్‌తో సంప్రదింపులు సాగించే చాతుర్యం; మార్కెట్లో మారుతున్న పరిస్థితులపై అవగాహన; తమ క్లయింట్లకు చెందిన రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను గమనించే నైపుణ్యాలు అవసరం.

- టి.కోమల్, జీఎం-(క్లౌడ్ వింగ్- ఐబీఎం)

ఇద్దరికీ అనుకూలం.. అందుకే అవకాశాలు

క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇటు సర్వీస్ ప్రొవైడర్స్, అటు వినియోగదారులు.. ఇద్దరికీ అనువైన విధానంగా మారింది. దాంతో ఇప్పుడు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలన్నీ క్లౌడ్ కంప్యూటింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి.

ఇదే క్రమంలో నిపుణులైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో కోర్సులు అందుబాటులో లేకపోయినా.. ఆన్‌లైన్, మూక్ విధానాల్లో లభించే కోర్సులు పూర్తి చేయడం ద్వారా అవగాహన పెంచుకోవచ్చు. అదేవిధంగా పీజీ స్థాయిలో సీఎస్‌ఈలో క్లౌడ్ కంప్యూటింగ్‌ను కొన్ని ఇన్‌స్టిట్యూట్‌ల కరిక్యులంలోనూ పొందుపరుస్తున్నారు. భవిష్యత్‌లో అకడమిక్‌గా పూర్తి స్థాయి కోర్సులు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

- ప్రొఫెసర్ వాసుదేవ వర్మ,డీన్, ఆర్ అండ్ డీ, ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్

స్టోరేజ్, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు

క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా సేవలన్నీ దాదాపు ఆన్‌లైన్‌లోనే సాగుతాయి. కానీ ఒక ప్రొడక్ట్‌కు సంబంధించిన యూజర్ ఎప్పుడు కోరినా క్షణాల్లో పంపించే విధంగా డేటా స్టోరేజ్, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు క్లౌడ్ కంప్యూటింగ్‌లో కీలకం. యూజర్, సెగ్మెంట్‌లను పరిగణనలోకి తీసుకుంటూ.. ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్‌ను రూపొందించేటప్పుడే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించే దూరదృష్టి ఉంటే ఈ విభాగంలో రాణించడం సులభమే.

- ఎం. రాజేశ్,డెలివరీ మేనేజర్, క్లౌడ్ సపోర్ట్- శాప్ ల్యాబ్స్

ఆధారము: సాక్షి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate