పాఠశాలల్లో బాలల సంరక్షణ ప్రణాళిక ఎందుకు ఉండాలి?
బాలల హక్కులు, బాలల పరిరక్షణ అంశాలు అభ్యుదయ రీతిలో, సమగ్రంగా, బాలలే కేంద్రంగా రూపు దిద్దుకుంటున్నాయి. అందువల్ల పిల్లలతో ప్రమేయం కలిగి ఉండే ప్రతి ఒక్కరూ పిల్లల రక్షణ చర్యలకు సంబంధించి అవగాహన కలిగి ఉండాలి.
ఇల్లు తరువాత పాఠశాలలే బాలలకు సురక్షితమైనవి సంతోషాన్ని అందించేవి. కాబట్టి పాఠశాలల్లో శిశు సంరక్షణా పథకం అవసరం.
రాజ్యాంగంలోని అధికరణ 21 గౌరవంతో జీవించే హక్కును తెలుపుతుంది. అలాగే 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ విద్యా హక్కును కూడా ఈ అధికరణమే వివరిస్తుంది.
విద్యాహక్కు చట్టం ప్రకారం : పిల్లలను శారీరకంగా శిక్షించడం (ఉపాధ్యాయులు కొట్టడం వంటివి) వారిపై దాడిగానే పరిగణిస్తారు. ఇది వారి స్వేచ్చ, గౌరవాలకు భంగకరం. శారీరక శిక్షలకు భయపడి పిల్లలు బడికి వెళ్లటానికి నిరాకరిస్తారు లేదా శాశ్వతంగా బడికి వెళ్లటం మానేస్తారు. ఈ విధంగా శారీరక శిక్షలు పిల్లల విద్యా హక్కుకు భంగం కలిగిస్తున్నాయి.
బాలల హక్కులు, సంరక్షణ, సంస్థాపరమైన బాధ్యతలు
ఉంక్రసీ (యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్) నిబంధన 19 ప్రకారం ఈ ఒప్పందంలోని భాగస్వామ్య దేశాలన్నీ పిల్లల తల్లిదండ్రులు, చట్టబద్ధ సంరక్షకులు లేదా బాగోగులు చూసుకునే మరెవరి సంరక్షణలోనైనా ఉన్నప్పుడు లైంగిక వేదింపు, శారీరక లేదా మానసిక హింస, గాయం లేదా వేదింపు, నిర్లక్ష్యం, నిరక్ష్య వైఖరి, తిండిపెట్టక పోవడం లేదా దోపిడీలకు గురి కాకుండా చట్ట, పాలనాపర, సామాజిక, విద్యాపరమైన చర్యలను తీసుకోవాలి. అన్ని రకాల వేదింపులు, నిర్లక్ష్యాల నుంచి రక్షణ పొందే హక్కు బాలలకు ఉందని UNCRC స్పష్టం చేస్తోంది.
బాలల విద్యార్థి దశలో వారందరికీ రక్షణ కలిగించడమనేది విద్యార్థి దశలో క్లిష్టమైనది. బాలలు 12 సంవత్సరాల పాటు పాఠశాలలలో గడుపుతారు కాబట్టి పాఠశాల యాజమాన్యం, పిల్లల కుటుంబాలు వారి సంరక్షణకై ప్రధాన భూమికను నిర్వహించాలి.
విద్యాహక్కు చట్టం 2009 - బాలల హక్కులపై అధ్యయనబాధ్యతలు
విద్యా హక్కు చట్టం సెక్షన్ 29 ఏమి చెబుతుందంటే చట్టంలోని సబ్ సెక్షన్ (ఉప నిబంధన) (1) కింద పాఠ్య ప్రణాళిక రూపొందించేటప్పుడు పాఠశాల లేదా విద్యాధికారులు కింది అంశాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి:
- పాఠ్యాంశాలు రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఉండాలి.
- బాలుడు/బాలిక బహుముఖాభివృద్ధి లక్ష్యం కావాలి.
- బాలల జ్ఞానం, సమర్ధత, ప్రజ్ఞలను అభివృద్ధి చేయాలి.
- పిల్లల శారీరక, మానసిక సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి.
- పిల్లలే కేంద్రంగా స్నేహ పూరిత వాతావరణంలో స్వయంగా వారే కనుగొనడం, వెలికి తీయడం వంటి వివిధ కార్యక్రమాల ద్వారా నేర్చుకునేటట్లు చేయాలి.
- బోధన సాధ్యమైనంత వరకు వారి మాతృభాషలోనే సాగాలి.
- పిల్లలు ఎటువంటి భయం, బాధ, ఆందోళన లేకుండా స్వేచ్ఛగా వారి భావాలను వ్యక్తం చేసే వాతావరణం సృష్టించాలి..
- బాలుడు/బాలిక యొక్క జ్ఞాన అవగాహన స్థాయిని, దానిని వారు అనువర్తించే సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు, సమగ్రంగా మూల్యాంకనం చేయాలి.
ఈ నిబంధనలన్నీ శిశువుకు భయరహిత వాతావరణాన్ని కల్పించడం, పాఠశాలలో ఎలాంటి దాడికి అవకాశం లేకుండా వారి సంరక్షణా యోగక్షేమాలకు ఆస్కారం కల్పించడం ముఖ్యం.
POCSO చట్టం, 2012 ప్రకారం బాలలపై లైంగిక దుశ్చర్య అంటే ఏమిటి?
కింది సందర్భాల్లో బాలుడు/బాలిక ఏదైనా లైంగిక కార్యక్రమంలో పాల్గొనడం లేదా ప్రమేయం కలిగి ఉండడాన్ని బాలుడు/బాలిక పై లైంగిక దుశ్చర్యగా చెప్పవచ్చు
ఆ సందర్భాలు ఏమిటంటే
- బాలుడు/బాలికకు జరుగుతున్నది అర్థం కాకపోవడం.
- బాలుడు/బాలిక తన అసమ్మతిని తెలియచేయలేని అశక్తత.
- బాలుడు/బాలికకు తమ సమ్మతిని తెలియజేసే పరిపక్వత లేనప్పుడు.
- చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు లేదా సామాజిక కట్టుబాట్లను అతిక్రమించినపుడు.
ఒక బాలుడు లేదా బాలికను లైంగికానందం కోసం వయోజనుడు లేదా పెద్ద వాడు లేదా జ్ఞానం ఉన్న బాలుడు/బాలిక ఉపయోగించుకుంటే, ఆ చర్య లైంగిక దుశ్చర్య అవుతుంది. ఈ దాడి శారీరకమైనది, మాటలు లేదా ఉద్వేగాలతో కూడుకున్నది కావచ్చు.
అవి ఏమిటంటే –
- వస్త్రాన్ని తొలగించి కాని లేదా వస్త్రం పై నుంచి కాని శరీరంలోని ఏ భాగాన్నయినా లైంగికంగా తాకడం
- చొప్పించే లైంగిక దాడి (నోటి ద్వారా చొప్పించడం కూడా వస్తుంది).
- బాలుడు/బాలిక ముందు ఉద్దేశపూర్వకంగా లైంగిక చర్యకు పాల్పడడం
- పిల్లలకు అశ్లీల సాహిత్యాన్ని, చిత్రాలను చూపడం లేదా అశ్లీల చిత్రాల తయారీకి పిల్లను ఉపయోగించుకోవడం.
- ఒక వయోజన వ్యక్తి అతని/ఆమె రహస్యాంగాలు లేదా మర్మాంగాలను పిల్లలకు చూపడం (ఎగ్జిబిషనిజం).
- పిల్లలను వ్యభిచారం లేదా పడుపు వృత్తిలోకి ప్రోత్సహించడం.
- పిల్లలతో అశ్లీల సంభాషణలు చేయడం..
ఉపాధ్యాయుడు ఇలా ఆలోచించాలి...
ఎ) బాలలపై లైంగిక దాడి మా పాఠశాలలో ఒక సమస్య కాదు.
దీ) నా బాధ్యత విద్యా బోధన, పిల్లల రక్షణ కాదు.
జ) బాలలపై లైంగిక వేధింపుల నిరోధం పట్ల చట్టాలు, నియమాలు నేనెందుకు తెలుసుకోవాలి?
విద్యావేత్తలు / ఉపాధ్యాయులు తమవంతు బాధ్యతగా అనుమానాస్పద లైంగిక దాడి లేక అవమానకరమైన పరిస్థితులను తరగతి గదుల్లో భయరహిత వాతావరణం నెలకొల్పడంలో వారి ఫిర్యాదు ముఖ్యం.
ఆకలి లేదా అనారోగ్యాలవలే ఇతరులు కీడు చేస్తారోమేనన్న భయం, వాటికి సంబంధించిన అనుభవాలు కూడా పిల్లల అభ్యసనను దెబ్బతీస్తాయి. అందువల్ల ఇటువంటి ప్రమాదాలను ముందుగానే పసిగట్టి, తగిన నివారణ చర్యలను తీసుకోవడం పాఠశాల సిబ్బందికే సాధ్యమవుతుంది. అందువల్ల వారి నిరంరత పర్యవేక్షణ ఎంతో కీలకం.
పిల్లల రక్షణ, సంక్షేమాలను పెంపొదించడానికి, వారిని అపాయకర పరిస్థితుల నుంచి తప్పించడానికి పాఠశాలలు, వాటి సిబ్బంది సామాజిక కార్యక్రమాలు; పోలీస్, చట్టం, ఆరోగ్య సేవల్లో పాల్గొని తమ వంతు పాత్రను పోషించాలి.
పాఠశాల సిబ్బంది తమ పిల్లలు (విద్యార్థులు) లైంగిక దాడికి లేదా నిర్లక్ష్యానికి గురవుతున్నారని తెలిసినా లేదా లైంగికదాడికి, నిర్లక్ష్యానికి గురైనా లేదా ప్రస్తుతం అటువంటి పరిస్థితుల్లో ఉన్నా వెంటనే వారు ఎటువంటి అలస్యం చేయకుండా సమాచారాన్ని నిర్దేశిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.
POGO చట్టం - 2012లోని సెక్షన్ 21(1) ననుసరించి బాలలపై లైంగిక దాడుల గురించి ఫిర్యాదుచేయడంలో న్యాయశాఖ తగు చర్యలు గైకొనడం, తల్లిదండ్రులు, వైద్యులు, పాఠశాల సిబ్బందికి బాధ్యత కల్పించారు. ఇందులో విఫలమైతే ఫిర్యాదుపై అనుమానం వస్తే అది నేరంగా పరిగణించబడుతుంది. ఈ చట్టం ఫిర్యాదు చేయడంలో సమాచారం అందించడంలో ఆటంకాలు ఉంటే అవి వృత్తిపరమైన విధుల్లో లోపంగాను, విషయ గుప్తతను పాటించడంలో బాధ్యతను గుర్తు చేస్తుంది.
సమస్యను ఫిర్యాదు చేస్తే ఇక నేను ఆ క్లిష్టమైన విధానాలు, ఇబ్బందుల్లో ఇరుక్కుంటానని చింతపడుతున్నాను. నిజమేనా?
ఫిర్యాదు చేసినంత మాత్రాన మొత్తం అన్నీ మీరు ఒక్కరే చూసుకోవాల్సిన పని లేదు. పాఠశాల ఉపాధ్యాయుడు /ఉపాధ్యాయురాలిగా ఒక బాలుడు/బాలిక పై లైంగిక దాడి జరిగిందని తెలిసినా లేదా జరిగే ప్రమాదం ఉందని అనుమానం ఏర్పడినా కేవలం ఆ విషయాన్ని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో మీ బాధ్యత ముగుస్తుంది.
అయితే, మీరు పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు నిబంధలను పాటించాలి. అవి:
- బాలుడు/బాలిక చెప్పింది వినాలి. జరిగిన విషయాన్ని వెల్లడించి మంచి పని చేశారని వారికి మద్దతు ఇచ్చి ధైర్యం చెప్పాలి. ఇక భద్రంగా ఉంటామన్న భావన పిల్లల్లో కలిగించాలి.
- విషయాలను గోప్యంగా ఉంచుతామన్న హామీ ఇవ్వొద్దు. భద్రత కోసమే వివరాలను అవసరమైన వారికి వెల్లడించడం జరుగుతుందని వారికి అర్థమయ్యేలా వివరించాలి
- నిర్దేశిత అధికారికి లేదా పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి లేదా హెల్ప్లైన్ కు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
- అన్ని సంభాషణలు, తీసుకున్న చర్యల వివరాలను భద్రపరచాలి. ఆలస్యం చేయవద్దు.
- విచారణ మీ బాధ్యత కాదు. పిల్లల రక్షణ కోసం విధుల నిర్వహించే నిపుణులకు ఫిర్యాదు ఇవ్వడంతో మీ పాత్ర ముగుస్తుంది.
పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నా పాఠశాలలో భద్రతా వాతావరణాన్ని ఎలా సృష్టించగలను?
కనీస అవసరాలు
- స్పష్టమైన ఫిర్యాదు మరియు స్పందన వ్యవస్థ కలిగిన ఒక బాలల రక్షణ ప్రణాళిక లేదా విధానాన్ని రూపొందించుకోవాలి.
- స్కూలు సిబ్బందిలో ఒకరిని ఈ బాలల రక్షణ ప్రణాళికకు ఇన్ చార్జిగా నియమించాలి. అవసరం అయినపుడు సహకారం అందించడానికి డిప్యూటీ ఇన్ చార్జీని కూడా ఏర్పాటు చేయాలి.
- బాలల సంరక్షణ చట్టాలు వాటికి సంబంధించిన మార్గదర్శకాలు, రిఫరల్ ఏజెన్సీల గురించి అవగాహన కలిగి ఉండాలి.
- భద్రతా నియమాలు, పాఠశాల విధానాల గురించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి. పాఠశాల యాజమాన్య సంఘ సభ్యులకు కూడా వీటి పట్ల అవగాహన ఉండాలి.
- పిల్లలు తాము భద్రమైన, మర్యాదకరమైన, తమను పట్టించుకునే వాతావరణంలో ఉన్నామన్న భావన కలిగించేలా పాఠశాల సంస్కృతి ఉండాలి. అటువంటి వాతావరణాన్ని అభివృద్ధి చేయాలి. వ్యక్తిగత, ఉద్వేగ అభ్యసన, ప్రవర్తన పై కార్యక్రమాలు, వేధింపు నివారణ పట్ల అవగాహన, కార్యక్రమాలలో పాల్గొనడం, విద్యార్ధి వేదికలు వంటివి బాలల్లో ఆత్మ విశ్వాసం, తట్టుకునే శక్తి, నమ్మకం వంటి రక్షణాత్మక లక్షణాలు వారి వ్యక్తిత్వంలో రూపుదిద్దుకునేలా చేస్తాయి.
- విద్యార్థులందరికీ వ్యక్తిగత భద్రత గురించి ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. లైంగిక దాడి జరిగాక ఫిర్యాదు చేయడం కంటే అటువంటి పరిస్థితులను పసిగట్టి ముందుగానే ఫిర్యాదు చేసి నివారించడం మంచిది.
- భద్రమైన మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన ప్రాంతాలు, తరగతి గదులు, టాయ్లెట్లు (మరుగుదొడ్లు), ఆట స్థలాలు శుభ్రంగా, ఆరోగ్య కరంగా ఉండడం కూడా పాఠశాల భద్రతలో భాగమేనని గుర్తించాలి.
బాలలపై లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదుచేయడం ఎలా?
ఫిర్యాదుచేసే విధానంలో బాలల యొక్క స్టేట్ మెంటును POCSO చట్టం ప్రకారం రికార్డు చేయాలి.
రికార్డు చేసేది ఎవరు?
లైంగిక నేరానికి సంబంధించిన బాధ్యతలుగాని, సామాజిక మాధ్యమాల వ్యక్తులు, హాస్టళ్ళు, నివాస గృహాలు, వైద్యశాలలు, క్లబ్బులు, స్టూడియోలు లేదా ఫోటోగ్రఫీ సౌకర్యాలు ఉన్నవారు ఇలాంటి సందర్భం తమ దృష్టికి వచ్చినప్పుడు లైంగిక వేధింపులకు గురైన బాలల గురించి ఫిర్యాదు చేయవచ్చు.
అలాంటి ఫిర్యాదు చేయడంలో వైఫల్యాలున్నట్లైతే వారు శిక్షార్హులే కాకుండా ఆరు మాసాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూనూ, ఈ జరిమానా శిశువులకు వర్తించదు.
ఈ కేసును ఎవరికి రిపోర్టు చేయాలి?
కేసు గురించి స్పెషల్ జువనైల్ పోలీస్ యూనిట్ (SJPU) లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కేసు రాగానే పోలీసులు లేదా SJP యూనిట్ ఫిర్యాదును రాత పూర్వకంగా తీసుకుని దానికి ఒక నమోదు సంఖ్యను కేటాయిస్తారు. తర్వాత సదరు ఫిర్యాదును ధ్రువీకరణ కోసం ఫిర్యాదుదారుకు చదివి వినిపిస్తారు. తర్వాత దానిని ఒక పుస్తకంలోకి ఎక్కిస్తారు. నమోదు చేసిన ప్రథమ సమాచార నివేదిక(FIR) ప్రతిని ఒక దానిని ఫిర్యాదుదారు లేదా సమాచారం ఇచ్చిన వ్యక్తికి ఎటువంటి రుసుము వసూలు చేయకుండా ఇస్తారు.
ఫిర్యాదు భాష
ఒక వేళ కేసును బాలుడు/బాలిక ఫిర్యాదు చేస్తే మాట్లాడినది మాట్లాడినట్టుగా సరళమైన భాషలో నమోదు చేయాలి. ఇలా చేయడం వల్ల బాలుడు/ బాలిక ఫిర్యాదులో ఏమి నమోదు చేశారో అర్థం చేసుకోగలుగుతారు. ఒక వేళ వారికి అర్థం కాని భాషలో ఫిర్యాదును నమోదు చేస్తే ఒక అర్హత కలిగిన అనువాదకుడి ద్వారా తర్జుమా చేసి వినిపించాలి.
POCSO చట్టం - నిబంధనలు 2018లో తీసుకొనిరాబడిన మార్పులు - చేర్పులు ఏవి?
POCSO చట్టం - నిబంధనలు 2018లో తీసుకొనిరాబడిన మార్పులు - చేర్పులు :
- ఇండియన్ పీనల్ కోడ్ - సెక్షన్ 376 ప్రకారం బాలికలపై అత్యాచారం జరిపిన వారికి 7 నుండి 10 సంవత్సరాలు కనీస శిక్షగా నిర్ధారించడం.
- పై సెక్షన్ 376(3) ప్రకారం 16 సంవత్సరాలలోపు బాలికలపై జరిగే అత్యాచారాలకు కనీస జైలు శిక్ష 20 సంవత్సరాలు/ఆజీవాంతం వరకు పొడిగించబడింది.
- పై సెక్షన్ 376 - A, B ప్రకారం 12 సంవత్సరాలలోపు బాలికలపై అత్యాచారాలకు కఠిన జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించడం.
- పై ఆర్డినెన్సు ప్రకారం 16 సంవత్సరాలలోపు బాలికలపై సామూహిక అత్యాచారాలకు జీవిత ఖైదు మరియు జరిమానా కూడా విధించడం. ఈ ఆర్డినెన్సు ప్రకారం 12 సంవత్సరాలలోపు బాలికలపై సామూహిక అత్యాచారాలకు కూడా కఠిన జీవిత ఖైదు మరియు జరిమానా విధించడం.
ప్రతి క్షణం విలువైనదే! ప్రతి శిశువు కూడా! ఆ విషయానికొస్తే బాల్య దశ ఎంతో విలువైనది. - కైలాష్ సత్యార్థి
శరీరం, వ్యక్తిగత భద్రత
ఉపాధ్యాయుల పాత్ర
- తల్లిదండ్రులు పిల్లలకు శరీర భద్రత గురించి 3 నుంచి 5 సంవత్సరాల వయసు మధ్య కాలం నుంచి బోధించడం ప్రారంభించాలి. ఈ విషయం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.
- పిల్లలకు శరీరాంగాలైన జననేంద్రియాలు, శిశ్నం (లింగం), యోని వంటి రహస్యాంగాలతో పాటు శరీరంలోని అన్ని అంగాలను వివరించి వాటి సరైన పేర్లు చెప్పాలి.
- నిపుణుడు లేదా తల్లిదండ్రులు భాష లేదా పదాల పట్ల ఇబ్బందిగా భావిస్తే చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా వాడుక పదాలను ఉపయోగించాలి. పిల్లలు కొంచం పెద్దయ్యాక వారికి సరైన పదాలను తెలియ చెప్పాలి. జననాంగాల గురించి చెప్పేటపుడు వాడుక (వ్యవహారిక) పదాలు స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలి. అసహ్యం. అవమాన భావనలు కలిగేలా వాటిని పువ్వు, చిలక, సిగ్గు-సిగ్గు, చీ-ఛీ వంటి పదాలతో వివరించరాదు. ఈ విషయాన్ని విద్యా బోధకులు, తల్లిదండ్రులు గుర్తు పెట్టుకోవాలి.
- చిన్న వయసు నుంచే పిల్లలను సొంతంగా మల విసర్జన, స్నానం, దుస్తులు ధరించడం నేర్పాలి.
- పిల్లలకు గోప్యత, నమ్రత, వ్యక్తిగత ప్రవర్తనలు, హద్దులు చాల ముఖ్యమని నేర్పాలి.
- పిల్లలకు తమ ఏకాంతాన్ని లేదా గోప్యతను భగ్న పరచేవారిని లేదా హద్దులు దాటి ప్రవర్తించేవారిని అనుమతించకూడదని, అది తప్పు అని తెలియచెప్పాలి. అలాగే ఇతరులు వారి రహస్యాంగాల వైపు చూడడం లేదా తాకడం వంటివి కూడా భావ్యం కాదని చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా అవి వారి వ్యక్తిగత అవయవాలని వాటిని గోప్యంగా ఉంచుకోవాలని వివరించాలి.
- ఇతరులు చేసే ఇటువంటి పనులకు 'వద్దు' అని చెప్పడం సరైన పద్దతి అని పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి.
- పిల్లలకు ఇష్టంలేని వ్యక్తులను ముద్దులు పెట్టుకోమని, కౌగిలించుకోమని తల్లిదండ్రులు బలవంతం చేయరాదు. ముద్దు లేదా కౌగిలింత తనకు ఇష్టం లేదని ఎవరికైనా చెప్పడానికి పిల్లలకు హక్కు ఉంది. వారికి ఉన్న ఆ హక్కును పెద్దలు గౌరవించాలి.
- ఎవరైనా రహస్యాంగాల వంక చూడడం, వాటిని తాకడానికి ప్రయత్నించడం జరిగితే అ విషయాన్ని వెంటనే తల్లిదండ్రులకు తెలియచేయాలన్న విషయాన్ని పిల్లలకు తెలియ చెప్పాలి. పిల్లలు చెప్పేది విని సరిగా అర్థం చేసుకుంటారని, నమ్ముతారని, తగిన భద్రత కల్పిస్తారన్న విశ్వాసాన్ని పిల్లలకు తల్లిదండ్రులు కలిగించాలి.
- సహజంగా తాకడం, తగలడం తప్పు లేదని, అయితే ముట్టుకోవడంలో తేడా అనిపించినా లేదా తాకే విధానం భయం కలిగించినా వెంటనే 'నో' చెప్పాలని ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియచేయాలని పిల్లలకు చెప్పాలి.
పిల్లలకు మూడు శరీర భద్రత నియమాలు బోధించండి
నేను వ్యక్తిగత శరీర భద్రత నియమాలను పాటిస్తాను
నియమం 1: వస్త్రానికి సంబంధించిన
నియమాలు: ఇతరుల ముందు నా రహస్యాంగాలను కప్పి ఉంచుకుంటాను.
నియమం 2 : తాకడానికి సంబంధించిన
నియమాలు: ఇతరుల ముందు నా రహస్యాంగాలను తాకను.
నియమం 3 : సంభాషణ నియమాలు: నేను రహస్యాంగాల గురించి నమ్మదగిన పెద్దవారితోనే మాట్లడతాను. ఈ భాగాల గురించి నా సందేహాలు, భయాలను వారితో చర్చించి నివృత్తి చేసుకుంటాను.
వ్యక్తిగత శరీర భద్రత నియమాలను తాను పాటిస్తూ ఇతరుల పట్ల కూడా అలానే ప్రవర్తించే వారిని నమ్మదగిన వ్యక్తి (సేఫ్ పర్సన్) అంటారు.
ఎవరైనా నా పట్ల వ్యక్తిగత శరీర నియమాలను ఉల్లంఘిస్తే నేను
- “వద్దు' (నో) అని స్పష్టంగా ఆ వ్యక్తికి చెబుతాను.
- 'వెళ్ళు' (గో) ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్లి పోతాను.
- చెబుతాను' (టెల్) ఆ వ్యక్తి గురించి నేను విశ్వసించే వ్యక్తి (సేఫ్ పర్సన్)తో చెబుతాను.
నా భద్రతకు సంబంధించి నష్టం గాని, సమస్య గాని ఎదురైతే నేను సహాయం కోసం '1098' కి కాల్ చేస్తాను.
లైంగిక దాడికి గురైన బాలల ప్రవర్తన సంకేతాలు
లైంగిక దాడికి గురైన బాలుడు/బాలికను అనేక ఇతర లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ముఖ్యంగా ప్రవర్తనా పరంగా వారు
- దుడుకుగా, తిరస్కార భావంతో ఉంటారు.
- పిరికిగా ఉంటారు లేదా పెద్ద వాళ్లను చూసి భయపడిపోతారు.
- దౌర్జన్యం లేదా విధ్వంసక ప్రవర్తన కలిగి ఉంటారు.
- ఇతరులకు లేదా స్వయం వినాశకారులుగా ఉంటారు.
- స్కూలుకు చాలా త్వరగా వస్తారు లేదా స్కూలు విడిచి వెళ్లడానికి ఇష్టపడరు. అలాగే ఇంటిని విడిచి వెళ్లడానికి ఇష్టపడరు.
- నిర్భయత్వాన్ని లేదా తీవ్రమైన తెగింపును ప్రదర్శిస్తారు.
- సాధన శక్తి తక్కువై పోతుంది (సామన్యంగా పిల్లలు తమలోని దూకుడు శక్తిని అభ్యసనగా మార్చుకుంటారు. సంఘర్షణలో చిక్కుకున్న పిల్లలు ఈ పని చేయలేరు).
- సహచరుల (సహ విద్యార్థులు)తో స్నేహ సంబంధాలు ఏర్పరుచుకోలేరు.
- వాతావరణం వేడిగా ఉన్న కాలంలో కూడా ఒంటి నిండా దళసరి దుస్తులు కప్పుకుని వస్తారు (అయితే ఇది సంస్కృతికి సంబంధించిన అంశమని కూడా గుర్తించాలి).
- ప్రతి దానికి వెనుకాడతారు లేదా తక్కువ అపరిపక్వత ప్రదర్శిస్తారు.
- భౌతికంగా కలవడానికి ఇష్టపడరు లేదా ముడుచుకుపోతారు.
- ఎక్కువగా ఏడుస్తారు.
- ఎక్కువగా చిరాకు పడతారు లేదా పెంకితనం ప్రదర్శిస్తారు
- ప్రత్యేకించి ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు అంటే భయపడతారు.
- అమర్యాదకర ప్రవర్తన కలిగి ఉంటారు
- ఇతరుల పట్ల దౌర్జన్యపూరితంగా ప్రవర్తిస్తారు.
- బడి కార్యక్రమాల్లో వెనుకబడి ఉంటారు
- పక్క తడపడం (నిద్రలో మూత్ర విసర్జన) లేదా బట్టల్లోనే మల విసర్జన చేస్తారు.
- ప్రవర్తనలో అనూహ్య మార్పు కనబరుస్తారు. (అంటే అన్నిటా ఉత్సాహం ప్రదర్శించే పిల్లలు నిరాసక్తత వ్యక్తం చేస్తారు)
- ఆ వయసు కంటే ఎక్కువగా లైంగిక ప్రవర్తన గురించి తెలుసుకుని ఉంటారు.
- బాలుడు/బాలిక తన జననాంగాలను ద్వేషిస్తారు లేదా తీవ్రమైన రీతిలో అత్యంత గోప్యతను పాటిస్తారు.
- పిల్లలు వారి సొంత జెండర్ ను ఇష్ట పడరు. అంటే బాలిక స్త్రీత్వాన్ని, బాలుడు పురుషత్వాన్ని ఇష్టపడరు.
- బాలలు తమ సొంత పదజాలాన్ని తగని భాషలో నిరంతరం ఉపయోగిస్తారు లేదా సమాజం ఆమోదించని యాసలో మాట్లాడతారు.
శారీరక సంకేతాలు
- నోరు, జననాంగం లేదా గుద ప్రాంతంలో వివరించలేని నొప్పి, వాపు, రక్త స్రావం లేదా ప్రకోపం
- లైంగిక సాంక్రమిక వ్యాధులు (పుండు, స్రావం, జననాంగాల్లో నిరంతరం దురద)
- నడకలో చెప్పశక్యంగాని కష్టం
- తల నొప్పి లేదా కడుపు నొప్పులు పెరగడం
జాగో! బదలో!! బోలో!!!
పోలీసు, పాఠశాల విద్య, వైద్య - ఆరోగ్య, మహిళా శిశు సంరక్షణ శాఖలు వారి స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ సంవత్సరం కోసం ఓ నినాదాన్ని జాగో! బదలో!! బోలో!!! రూపొందించి అక్టోబర్, 2017లో ప్రారంభించారు.
శిశు భద్రతా రక్షణ అనేది మా బాధ్యత.
పాఠశాలలన్నీ అభ్యసనా కేంద్రాలుగా రూపుదిద్దుకొని బాలలకు సంతోషకరమైన, సురక్షితమైన బాల్య దశను అందించాలి.
ఈ ప్రపంచం బాలలతో నిండి ఉంది. దీనికి మించిన | పవిత్ర విశ్వాసం మరొకటి లేదు. బాలల హక్కులను గౌరవించడానికి మించిన మరొక ప్రధాన బాధ్యత అంటూ లేదు. వారి భద్రతను సంరక్షించాల్సి ఉంది. భయ రహిత ప్రశాంత వాతావరణంలో వారు పురోగమించాలి. - కోఫీ అన్నాన్
ఆధారము : సమగ్ర శిక్ష అభియాన్,వృత్యంతర శిక్షణ కార్యక్రమము 2018 -19 యస్ ఇ ఆర్ టి ,హైదరాబాద్