పిల్లలు చదువు నేర్చుకోవడంలో కాక, విజయవంతంగా జీవించడానికి కూడా ఇదే కారణం. పిల్లల గెలుపు ఓటములకూ ఇదే ముఖ్య కారణంగా చెప్పవచ్చు. కానీ, ప్రస్తుత పరిస్థితులలో కేవలం అత్యధిక మార్కులు సాధించి, ఉత్తీర్ణతకు ప్రాధాన్యతను ఇచ్చి, సామాజిక, ఉద్వేగపరంగా జరిగే అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంవల్ల లోకరీతికి సర్దుకోలేక పిల్లలు చివరకు పరాజితులౌతున్నారు. కాబట్టి, పిల్లలను చక్కగా పెంచడంలో, సామాజిక, ఉద్విగ్నతా సామర్థ్యాలను పెంపొందించడంలో జాగ్రత్త వహించాలి. పిల్లలను కాబోయే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఐక్యవేదిక సమావేశాలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
ప్రసిద్ధ మానసిక శాస్త్రవేత్త 'సిగ్మండ్ ఫ్రాయిడ్ ' చెప్పిన ప్రకారం, ప్రతీ పిల్లకీ /పిల్లవానికీ తన చిన్నతనంలో కలిగిన అనుభవాలే భావిజీవిత విధానానికి మూలం అవుతాయి.'స్కాఫ్'అనే మనస్తత్వ శాస్త్రవేత్త నిర్థారించిన దాని ప్రకారం, మంచి కుటుంబ వాతావరణం నుంచి వచ్చిన పిల్లలు మంచి ప్రవర్తనతో, ఎవరితోనైనా సర్దుకు పోగలరు. చెడ్డ కుటుంబం నుండి వచ్చిన పిల్లలు ఇతరులతో కలవడానికి ప్రయత్నం చేయరు, అలా అని సర్దుకొని పోనూ లేరు. వీరు, సమాజంలో ఏది చూస్తారో దానిని అనుకరించడానికి ప్రయత్నిస్తారు. కుటుంబం, బడి, తోటివారు కలిగిన వాతావరణంలో ఒక పిల్ల / పిల్లవాడు తన జీవితంలోకి చేరువైన అంశాలనుండే సామాజికతని నేర్చుకొంటారు.
శిశువు క్రమాభివృద్ధికి సక్రమ సామాజికత తప్పనిసరి. సత్ప్రవర్తనకు మొదటి కారణం కుటుంబమైతే, రెండోది పాఠశాల. పిల్లలు జీవితంలోని మొదటిదశ బడిలో గడుపుతారు. బడి, పిల్లలకు ఒక కొత్త సమాజం. సంపూర్ణ మూర్తిమత్వానికి మూడు పరిధులున్నాయి. అధ్యయన సామర్థ్యం, సామాజికాభివృద్ది, ఉద్వేగ వాతావరణం. వీటిని పిల్లల పెంపకంలోనూ, అభివృద్దిలోనూ ముఖ్యంగా పరిగణించాలి.
నేర్చుకునే రీతిలో పిల్లలలో ఒకరితో మరొకరికి చాలా వ్యత్యాసం ఉంటుంది. విభిన్నరీతులు గల పిల్లల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు, మందబుద్ధిగల విద్యార్థులుంటారు. కొంతమంది కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో, అంటే, అభ్యసనరీతిలో చదవడంలో, వ్రాయడంలో, లెక్కల్లో, సరిగ్గా చదువలేక, వ్రాయలేక, లెక్కించలేక పోవడం జరుగుతుంది. పిల్లలకు నేర్చుకోవడంలో ఏర్పడే ఈ లోపాలకు చికిత్స చేయలేకపోవచ్చు. కానీ, ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల సహకారంతో చక్కటి అవగాహనతో అటువంటి విద్యార్థులు నేర్వడంలో ప్రావీణ్యతను సాధించగలరు. పిల్లలు నేర్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారు. అభ్యసనంలో గల సామర్థ్య లోపాలను గనక గుర్తించగల్గితే, పిల్లల్లో ఉం డే సమస్యలను గమనించి, దానికి తగ్గట్టు బోధనా పద్దతులను మలచుకోగలరు. సరైన బోధన కోసం ఉపాధ్యాయులు కొంత కృషి చెయ్యవలసి ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల అభ్యసన రీతిలో గల లోపాలను ఒప్పుకుంటే, ఉపాధ్యాయులు పిల్లలను తగిన విధంగా సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు.
అభ్యసన లోపాలు గల పిల్లలు, తమ చదువులో సాధించగల అభ్యసన లక్ష్యాన్ని వాస్తవిక దృష్టితో గమనించాలి.
తల్లిదండ్రుల అభిలాష పిల్లలపై ప్రభావం చూపకూడదు. చాలామంది తల్లిదండ్రులు, ఇతర పిల్లలతో తమ పిల్లలని పోలుస్తూ ఎక్కువగా ఆశిస్తారు. ఇలా చూసే రీతివల్ల పిల్లల ప్రవర్తనలో అత్యధిక ఉద్రిక్తత చోటుచేసుకొని, అకస్మాత్తుగావారి అభ్యసనాస్థాయి నిలిచిపోతుంది.
తల్లిదండ్రులు తమ పిల్లలు తమకు మూసపోతలు కారని, స్వతంత్రవ్యక్తులని వాస్తవికతను గుర్తించలేకపోతున్నారు.
చదువులో ఉత్తీర్ణత సాధించడం ఒక్కటే జీవనసరళిలో విజయవంతమైన సోపానం కాదని, గెలుపూ ఓటములకు ఇది ఒక కారణం మాత్రమేనని గుర్తించాలి.
చూడడానికి మాములుగా ఉన్న పిల్ల / పిల్లవాడ్ని చూసి, ఉపాధ్యాయుడు వారిలో నేర్వడంలో లోపాలున్నాయనే విషయాన్ని ఒప్పుకోలేరు.
ఈ పిల్లలు మొద్దులు, బద్దకస్థులు, తప్పించుకునేవారని, నిర్లక్ష్యంగా, అశ్రద్దతో ఉన్నారని అనుకొని వారు బాగా చదవాలని బాధపడ్తూ దండిస్తూంటారు.
నేర్వడంలో గల లోపాలున్న పిల్లలపట్ల, బాధ్యతతో దోషనివారణ చర్యలు చేపట్టి, పిల్లలు లోపాలను అధిగమించే రీతిలో బోధించాలని వారనుకోవడం లేదు.
ఉపాధ్యాయులు ఈ పిల్లలను వేరుగా చూడడం, తరచుగా దండించడం, మనం రోజు దినపత్రికల్లో చూసేదే. తల్లిదండ్రుల ఫిర్యాదుల మేరకు కొంతమంది ఉపాధ్యాయులు వేరే చోటుకి బదిలీ అవుతున్నారు. కొంతమంది సస్పెండ్ అవుతున్నారు. చట్టబద్ద చర్యలు జరుగుతున్నాయి.
పిల్లలు బాగా చదవాలనే సదుద్దేశంతో దండిస్తున్నామని ఉపాధ్యాయులు చెప్తున్నారు.
పిల్లలను నిర్దాక్షిణ్యంగా దండించడం వల్ల అతడు నియమాలను అనుసరించే ఉద్యోగి కాగలడే తప్ప, బోధనాభ్యాసనరీతిని సక్రమంగా నిర్వర్తించే ఉపాధ్యాయులు కాలేరు.
ఉపాధ్యాయ విద్యార్థి సత్సంబంధాలు ప్రభావితం కావాలంటే ఉపాధ్యాయుడు ఆశావాదిగా, దండన విధించకుండా, మంచిశ్రోతగా, పిల్లలను ప్రోత్సాహపరచడం, లోప నివారణకు బాధ్యతాయుతంగా మెలగడం చేయాలి.
భౌతిక సామర్థ్యాల వల్లే సామాజిక స్థాయి సామర్థ్యాలు వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. సమాజంలోగల స్నేహితులు, తోటివారు, ప్రసార మాధ్యమాలు పిల్లలపై ప్రభావం చూపుతున్నాయి.
తోటిపిల్లలతో, బంధువులతో కలుస్తూ సామాజికతా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి తగిన అవకాశాన్ని పిల్లలకు ఇవ్వాలి. తగిన మార్గదర్శకతను అందించాలి. సంఘీభావాన్ని ఆచరించేరీతిలో పిల్లలు తమకు నచ్చని విషయాలలో కూడ ఒప్పుదలను, కొత్త పరిస్థితులను, సంఘటనలను ఎదుర్కోవడం జరుగుతుంది.
తల్లిదండ్రులే పిల్లలకు ఆదర్శం. స్నేహపూర్వక, సౌఖ్యవంతమైన స్వేచ్ఛను పిల్లలకు కల్పించాలి. విలువలకు, లక్ష్యాలకు చక్కటి రూపాన్ని ఇవ్వడంలో తల్లిదండ్రులే కీలకం. లక్ష్యాలు వాస్తవికతకు అద్దంపట్టేటట్లుగా ఉండాలే తప్ప అద్బుతంగా ఉండకూడదు.
జీవితంలో అనుక్షణం ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడంలో పిల్లలకు నైతిక విలువలతో కూడిన మార్గదర్శకత, తగు శిక్షణలను అందించాలి.
పిల్లల్లో సత్ శీలానికి ఉపాధ్యాయులే ప్రధానపాత్రధారి. పిల్లలు, తెలిసోతెలియకో ఉపాధ్యాయుడ్ని అనుసరిస్తారు. ఉపాధ్యాయులు సత్ర్పవర్తకులు, సత్సీలురయితే పిల్లలూ అలాగే అవుతారు. ఉపాధ్యాయులు వివిధ పరిస్థితులను ఎట్లా తట్టుకొంటారో, ఎట్లా మెలకువతో సర్దుబాటు అవుతారో గమనించి, ఉపాధ్యాయులను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల ఉపాధ్యాయులే ఆదర్శం కావాలి. సమాజంలో సర్దుబాటు, సమస్యలను ఎదుర్కోవడం, జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవడమెలాగో పిల్లలకు నేర్పాలి. అనుకూలమైన, ఆరోగ్యవంతమైన, ఇష్టపూర్వకమైన వాతావరణాన్ని కల్పించాలి.
ప్రతివ్యక్తి మస్తిష్కంలో ఉద్వేగం సామాన్యకారకంగా ఉంటుంది. వివిధస్థాయిలలో విభిన్నమైన ఉద్విగ్నతలుంటాయి. వాటిని నియంత్రించడానికి అనేక కారణాలున్నాయి.
ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు, పిల్లల ఉద్విగ్నతాభివృద్దిని ప్రభావితం చేస్తారు. భయం, కోపం, ఈర్ష్య, ప్రేమ వంటి కొన్ని సామాన్య ఉద్విగ్నతలు పిల్లల్లో ఉంటాయి. ఇవి పిల్లల ఉద్విగ్నతాభివృద్దికి ప్రధానపాత్ర వహిస్తాయి. అలసట, ఆరోగ్యం, తెలివితేటలు, సామాజిక పరిస్థితులు, కుటుంబ సంబంధబాంధవ్యాలు ఉద్విగ్నాభివృద్దిని ప్రభావితం చేసి చూపుతాయి.
పిల్లలకు కావలసినది ఆహారం, నీరు, నీడ కాకుండా ఇంకొన్ని అవసరాలున్నాయి. తమతో అందరూ మాట్లాడాలని, తమ కోరికలు, ఆశలు, సమస్యలు తీర్చాలనీ కోరుకుంటారు. ప్రతిరోజు తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి మాట్లాడాలి. స్నేహితులు కావాలని కోరుకుంటారు. స్నేహితులవల్ల వారి జీవితంలో అనుకోని మార్పులు వస్తాయి. తమ ఇష్టాయిష్టాలకు తగ్గ వ్యక్తులను స్నేహితులుగా కోరుకుంటారు.
''చెడు సావాసం చెరుపు'' అనేది సామెత. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల స్నేహాన్ని అతి చేరువతో గమనించాలి. తమకు 'గుర్తింపుకావాలని' పిల్లలు కోరుకుంటారు. ఒక పిల్ల / పిల్లవాడు వేరొకరితో భిన్నంగా ఉంటారు. పిల్లలందరూ వారి వారి మనోభావాలను ననుసరించి భిన్న లక్షణాలను వ్యక్తపరుస్తారు. తమ పిల్లల్లో గల అటువంటి అంశాన్ని గమనించి సరైన రీతిలో ప్రోత్సహించాలి.
పిల్లల అభ్యసనానుభవాలు, తెలివితేటలు, పరిపూర్ణతాస్థాయిని బట్టి వారి ఉద్వేగాభివృద్ది ఉంటుంది. పిల్లల తెలివితేటలను దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు పిల్లల పట్ల ప్రవర్తిస్తారే తప్ప వారి ఉద్వేగకారణాలను అంతగా పట్టించుకోరు. అంతర్ముఖులు, బహిర్ముఖులుగా ఉన్న పిల్లలను గుర్తించలేకపోతున్నారు. అలాటి పిల్లలకు ఉపాధ్యాయులు అవకాశమిచ్చి వారికి గల అర్హతను బట్టి ప్రోత్సహించి, వారి సృజనాత్మక ప్రతిభను వ్యక్తపరిచెలా చూడాలి. దీనికొరకు ప్రతి పిల్ల / పిల్లవాడ్ని లోతుగా అధ్యయనం చేయడం ముఖ్యం.
పిల్లలపై అవగాహన పెంచుకోవడానికి ఉపాధ్యాయ-తల్లిదండ్రుల సమావేశాన్ని ఐక్యవేదికగా మలచుకోవాలి. బడి-ఇల్లు సంబంధాన్ని పిల్లల సాంఘిక, ఉద్వేగ, విద్యాభ్యసనాభివృద్దిని సాధించడానికి, మెరుగుపరుచుకోవడానికి వాడాలి.
ఉపాధ్యాయ - తల్లిదండ్రుల సమావేశం
బడి - ఇల్లు సంబంధబాంధవ్యాలను పెంచడానికి కృషి చేయడంలో ఉపాధ్యాయ – తల్లిదండ్రుల సమావేశం క్రింది విధంగా అవకాశం కల్పిస్తుంది.పిల్లల ఇష్టాలను బట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను అర్థంచేసుకోవడం.
'చదువు' అనే విషయం పై అవగాహన ఏర్పరచుకోవడం. ఇతర పిల్లల తల్లిదండ్రులను కలుసుకోవడం, పరస్పర అనుభవాలను పంచుకోవడం, శిక్షణ ఇవ్వడంలో, పిల్లలను చూడడంలో కొత్త మెలకువలపై అవగాహన ఏర్పరచుకోవడం.
ఈ లక్ష్యాలన్నింటినీ సాధించినట్లైతే ఇంట్లో, పాఠశాలల్లో స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడి పిల్లలు మెరుగైన అభివృద్దిని సాధించగల్గుతారు.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
జాతిని సవాలు చేస్తున్న బాలకార్మిక సమస్య ఇంకనూ కొనస...
“నా వరకు చదువు నేర్పడంలోనే మానవాళికి ముక్తి అనిపిస...
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఖమ్మం జిల్లా మరియు చత్తీస్ ఘఢ...
లైంగిక నేరాల నుండి బాలల రక్షణకు POCSO ఇ-బాక్స్ గు...