స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కులు మొదలైన వాటన్నిటికీ సుదీర్ఘ పోరాట చరిత్ర ఉంది. వాటిని సాధించే క్రమంలో గొప్ప అనుభవాల్ని సంపాదించాం. కానీ, ఆ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కుల విస్తారంలోకి పిల్లల్ని చేర్చం.
నేటి ఈ ప్రజాస్వామ్య ప్రపంచంలో సైతం తల్లిదండ్రులు, టీచర్లు, పనిచేసేచోట్ల యజమానులు ఇంకా బయట ప్రతీచోటా పెద్ద వాళ్ళు పిల్లల్ని కొట్టటం, తిట్టటం, అవమానించటం, స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించుకోవడం, సరియైన ఆహారం అందించకపోవడం జరుగుతోంది, ఇది ఘోరమైన నేరం.
జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో మానవహక్కుల దృక్పధం అనేక కోణాల్లో సమాజంలోకి చొచ్చుకొనిపోయింది. కానీ పిల్లల హక్కుల గురించిన జ్ఞానంగానీ, చైతన్యంగానీ, ప్రయత్నంగానీ అంతగా జరుగలేదన్నారు గనుక తల్లిదండ్రులకు పిల్లల మీద సర్వహక్కులూ ఉంటాయనుకునే దుష్టనీతి నుంచి మనం ఇంకా బయటపడలేదు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, బుద్ధి జీవులనబడే వాళ్ళు కూడా - దారిద్ర్యం, నిరుద్యోగం, వివక్షత వంటి పరిస్ధితుల్ని మూలకారణాలుగా పరిగణిస్తూ - పిల్లలకు చేస్తున్న అన్యాయాన్ని సమర్ధిస్తున్నారు.
అందుకే పిల్లల హక్కులు, పిల్లల సంరక్షణ అనే దృక్పథాలు బలపడటానికి ఒక బృహత్ ప్రచారం, ఒక ఉద్యమం అవసరమయ్యాయి. ఈ నేపధ్యంలోనే ఐక్యరాజ్య సమితి 1989లో బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించింది. దీనికి ముందు కూడా పిల్లల హక్కులకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు, ఒడంబడికలు, అనేక ప్రయత్నాలు, కార్యక్రమాలు జరిగినప్పటికీ ఈ ఒడంబడిక విశిష్టమైనది, విలక్షణమైనది, సమగ్రమైనది. ఇది పిల్లల పౌర రాజకీయ, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు పూనుకున్న ఏకైక ఒప్పందం, అన్ని దేశాల్లోను, అన్ని పరిస్ధితుల్లోను పిల్లలందరికీ వర్తించే సార్వత్రిక ఒప్పందమిది. పరిమితవనరులున్న ప్రభుత్వాలు కూడా పిల్లల హక్కులు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించిన బేషరతు ఒప్పందమిది. రెండు దేశాలు తప్ప ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలన్నీ ఈఒడంబడికను ఆమోదించాయి. భారత ప్రభుత్వం 1992 డిసెంబరు 11 న ఈ ఒడంబడికను ఆమోదించి సంతకం చేసింది.
ఈ తీర్మానంలో పేర్కొన్న బాలల హక్కుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే, అలాగే పిల్లల హక్కుల్ని పరిరక్షించడానికి ఎవరికైనా హక్కునిస్తుంది. ఈ తీర్మానం.
మార్గదర్శక సూత్రాలు: అన్ని హక్కలకు సాధరణంగా ఉండే నియమాలు
ఆర్టికల్ - 1
- ప్రస్తుత సదస్సు ప్రకారం 18 సంవత్సరాల వయసులోపు మానవులు బాలలుగా పరిగణించబడతారు
ఆర్టికల్ - 2
- ఈ సదస్సులో తీర్మానించిన బాలల హక్కులను భాగస్వామ్య దేశాలు - ఆ పిల్లల తల్లిదండ్రుల, వారి సంరక్షకుల, కులం, జాతి, వర్గం, భాష, మతం, రాజకీయాభిప్రాయం, జాతీయత, తెగ, అంతస్తు, సామర్ధ్యం, పుట్టుక మరే ఇతర హొదాలను బట్టి వివక్ష చూపకుండా బాలలందరికీ సమానంగా అందించాలి.• పిల్లల తల్లిదండ్రుల, వారి చట్టబద్ధ సంరక్షకుల లేదా కుటుంబ సభ్యుల హొదా, కార్యకలాపాలు, వారి అబిప్రాయాలు లేదా నమ్మకాలను బట్టి పాటించే వివక్ష, శిక్షల నుండి బిడ్డను కాపాడేందుకు భాగస్వామ్య దేశాలు తగిన చర్యలు తీసుకుంటాయి.
ఆర్టికల్ - 3
- ప్రభుత్వంగానీ, ప్రైవేట్ సాంఘిక సంక్షేమ సంస్ధలుగానీ, కోర్టులుగానీ, పాలక సంస్ధలుగానీ లేదా బాలలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే సంస్ధలుగానీ అన్నింటికీ బిడ్డ ప్రయోజనాలే ముఖ్య కర్తవ్యంగా ఉండాలి.
- భాగస్వామ్య దేశాలు బిడ్డ శ్రేయస్సుకు అవసరమైన శ్రద్ధ, సంరక్షణా బాధ్యత తీసుకోవాలి. దానితో పాటు బిడ్డ యొక్క తల్లిదండ్రుల, చట్టబద్ధ సంరక్షకుల, చట్టపరంగా బిడ్డకు బాధ్యులైన ఇతర వ్యక్తుల యొక్క హక్కులు విధులను దృష్టిలో పెట్టుకొని ఉంచుకోవాలి. అంతిమంగా అందుకోసం తగిన శాసనపరమైన, పాలనపరమైన చర్యలను తీసుకోవాలి.
- బిడ్డల శ్రద్ధ, సంరక్షణకు ఉద్దేశించిన సంస్ధలు, సేవలు సదుపాయాలను నిపుణులు నిర్దేశించిన ప్రమాణాలను బట్టి ( ముఖ్యంగా ఆరోగ్యం పారిశుద్ధ్యం విషయంలో) పనిచేసే విధంగా భాగస్వామ్య దేశాలు జాగ్రత్త తీసుకోవాలి.
ఆర్టికల్ - 4
- ఈ సదస్సులో గుర్తించిన హక్కులను అమలు జరపటం కోసం భాగస్వామ్య దేశాలు తగిన శాసనపరమైన, పాలకపరమైన కార్యక్రమాలను చేపట్టాలి. ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల విషయంలో భాగస్వామ్య దేశాలు తమ శక్తి మేరకు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అంతర్జాతీయ సహకారాన్ని తీసుకోవాలి.
ఆర్టికల్ - 6
- జీవించే హక్కు బాలల జన్మహక్కుగా భాగస్వామ్య దేశాలు గుర్తిస్తున్నాయి.
- పిల్లల మనుగడకు వారి అభివృద్ధికి భాగస్వామ్య దేశాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి.
ఆర్టికల్ - 12
- అందుకోసం, జాతీయ చట్ట నిబంధనల పరిధిలో బిడ్డ ప్రత్యక్షంగాగానీ, వేరొక ప్రతినిధి ద్వారాగాన, ఒక సంస్ధ ద్వారాగానీ కోర్టులో పాలకవ్యవస్ధలో తన గోడు వినిపించుకొనే అవకాశం బిడ్డకు ఇవ్వబడుతుంది.
అభివృధ్ధి మరియు జీవించే హక్కు: జీవించేందకు ముఖ్యమైన హక్కు మరియు సంపూర్ణమైన గౌరవమైన జీవితం
ఆర్టికల్ - 7
- బిడ్డ పుట్టగానే పేరు నమోదు చేయించుకునే హక్కు ఉంది. పుట్టగానే పేరు కలిగి ఉండే హక్కు ఉంది. జాతీయతను పొందే హక్కు ఉంది. వీలైనంత వరకు జ్ఞానం పొందే హక్కు ఉంది. తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు ఉంది.
ఆర్టికల్ - 20
- కుటుంబ జీవనం కోల్పోయిన బిడ్డలకు, లేదా కుటుంబ వాతావరణంలో తమ ఇష్టాయిష్టాలకు అవకాశం లేని పిల్లలకు ప్రభుత్వం రక్షణ, సహాయం కల్పించాలి.
- అలాంటి పిల్లలకు భాగస్వామ్య దేశాలు తమ జాతీయ చట్టాల ననుసరించి ప్రత్యామ్నయ సంరక్షణ కల్పించాలి.
- ఆ రక్షణ అనేది బిడ్డ భద్రత కోసం - పోషణ స్ధానం, ఇస్లామిక్ చట్టంలో కఫాలా, ఇతర సమాజాల్లో దత్తత, ఇంటర్ ఏలియా మొదలైన అంశాలకూ సంబంధించి ఉంటుంది.
ఆర్టికల్ - 23
- మానసికంగా, శారీరకంగా వికలాంగులైన పిల్లలు సంపూర్ణమైన గౌరవమైన జీవితాన్ని గడపాలి. వారి గౌరవాన్ని ఆత్మ విశ్వాసాన్ని పెంచాలి. అలాంటి శిశువుల జనజీవనంలో చురుకుగా పాల్గొనేలా వీలు కల్పించాలి. అది భాగస్వామ్య దేశాలు గుర్తించాలి.
ఆర్టికల్ - 24
అత్యున్నతమైన ఆరోగ్య ప్రమాణాలను పొందేందుకు - రోగానికి చికిత్స పొందేందుకు, ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు, బిడ్డకు ఉన్న హక్కును భాగస్వామ్య దేశాలు గుర్తించాలి. అలాంటి ఆరోగ్య సేవల్ని పొందే హక్కు నుండి ఏ బిడ్డా దూరం కాకుండా భాగస్వామ్య దేశాలు శ్రద్ధ తీసుకుంటాయి.
ఈ హక్కును దేశాలు అమలు చేసేందుకు భాగస్వామ్య దేశాలు పాటుపడతాయి. ప్రత్యేకించి -
- శిశు మరణాలు, పిల్లల మరణాల్ని తగ్గించేందుకు,
- ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అభివృద్ధి చేస్తూ పిల్లలలందరికీ అవసరమైన వైద్య సహాయం, ఆరోగ్య రక్షణలు కల్పించేందుకు,
- ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు తగిన పౌష్టికాహారం, పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం ద్వారా, పర్యావరణ కాలుష్యం వల్ల ఏర్పడే ఇబ్బందులు ప్రమాదాలను గుర్తించడం ద్వారా పౌష్టికాహార లోపాన్ని, వ్యాధులను ఎదుర్కొనేందుకు,
- తల్లులకు ప్రసవానికి ముందు, ప్రసవానంతరం తగిన ఆరోగ్య సంరక్షణలు అందించేందుకు,
- సమాజంలో అన్ని శాఖలకు ప్రత్యేకించి తల్లిదండ్రులకు, పిల్లలకు విద్య పొందేందుకు, పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం గురించిన ప్రాధమిక విజ్ఞాన్నాన్ని వినియోగించటంలో సహకరించేందుకు, తల్లి పాల వల్ల ప్రయోజనాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ప్రమాదాల నివారణ గురించి వివరించేందుకు
- వ్యాధి నిరోధక ఆరోగ్య సంరక్షణ, తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
- పిల్లల ఆరోగ్యం గురించిన సంప్రదాయ విధానాలను నిర్మూలించేందుకు భాగస్వామ్య దేశాలు తగిన చర్యలు తీసుకోవాలి.
ఆర్టికల్ - 25
- శారీరక, మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం సంబంధిత అధికారులు నిర్దేశించిన ఒక శిశువుకు చికిత్స చేసే క్రమంలో భాగస్వామ్య దేశాలు ఆ బిడ్డకు ఉన్న హక్కును ఇతర పరిస్ధితులను గుర్తించాలి.
ఆర్టికల్ - 27
- బిడ్డ యొక్క శారీరక, మానసిక, భౌతిక, నైతిక, సాంఘిక అభివృద్ధికి అనువుగా జీవన ప్రమాణాన్ని కలిగియుండటం అనేది ప్రతీ బిడ్డకూ ఉండే హక్కుగా భాగస్వామ్య దేశాలు గుర్తించాలి.
- బిడ్డ తల్లిదండ్రులు, సంరక్షక బాధ్యులు తమకు ఉన్న ఆర్ధిక స్థోమత, సామర్ధ్యం, జీవన పరిస్ధితుల్ని బిడ్డ అభివృద్ధి కోసం వినియోగించటం వారి ప్రాథమిక బాధ్యత.
- ఈ హక్కు అమలు కోసం బిడ్డ తల్లిదండ్రులు, బాధ్యులకు సహాయపడేందుకు భాగస్వామ్య దేశాలు తమ దేశ స్ధితిగతులు విధానాల బట్టి తగిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే మంచి తిండి, బట్ట వసతి కోసం వస్తురూంగా కార్యక్రమాల రూపం గా సహాయం చేయాలి.
- బిడ్డ తల్లిదండ్రులు లేదా సంరక్షక బాధ్యులు వేరే దేశంలో నివసిస్తున్నట్లయితే బిడ్డకు రావలసిన భరణాన్ని ఇప్పించేందుకు భాగస్వామ్య దేశాలు తగిన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి.
ఆర్టికల్ - 28
- బిడ్డకు చదువుకొనే హక్కు ఉంది. ఈ హక్కు సమాన అవకాశాల ప్రాతిపదికతో ప్రగతిశీలంగా ఉండాలి. దీన్ని భాగస్వామ్య దేశాలు గుర్తించాలి.
- బాలలందరికీ నిర్భంధ ఉచిత ప్రాథమిక విద్య.
- సాధారణ విద్య, వృత్తివిద్యలతో ఉండే వివిధ రూపాల సెకండరీ విద్యాభివృద్ధిని ప్రోత్సహించటం, వాటిని బాలలందరికీ అందుబాటులో ఉండేలా అవసరమైతే ఆర్ధిక సహాయం, ఉచిత విద్య అందించటం వంటి చర్యలు తీసుకోవాలి.
- ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- విద్యాపరమైన, వృత్తిపరమైన సమాచారాన్ని, మార్గదర్శకత్వాన్ని బాలలందరికీ అందుబాటులో ఉంచాలి.
- పాఠశాలల్లో రోజువారీ హాజరు సరిగా ఉండేలా, బడి మానేసి విద్యార్థుల శాతం తగ్గేలా చర్యలు తీసుకోవాలి.
- పాఠశాల క్రమశిక్షణ అనేది బాలుని ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఉండేలా, ప్రస్తుత సదస్సు నిర్దేశాలకు అనుగుణమన విధానాలతో ఉండేలా భాగస్వామ్య దేశాలు అన్ని చర్యలు తీసుకోవాలి.
- విద్యకు సంబంధించి, ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా అజ్ఞానం, నిరక్షరాస్యత నిర్మూలన కృషిలో పాలు పంచుకునేందుకు భాగస్వామ్య దేశాలు అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించాలి. అలాగే శాస్త్రీయత, సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆధునిక బోధనా పద్ధతులను సమకూర్చాలి. ఈ విషయంలో వర్ధమాన దేశాల అవసరాలను ప్రత్యేకించి పరిగణించాలి.
ఆర్టికల్ - 30
- ఏ దేశంలో నైనా తెగపరంగా, మతపరంగా, భాషాపరంగా మైనారిటీ ప్రజలు ఉంటే అలాంటి మైనారిటీ వర్గానికి చెందిన బిడ్డకు ఆ మైనారిటీ వల్ల ఒనగూడే ప్రయోజనాలను, ఆచరించే హక్కు ఉంటుంది. తన సంస్కృతి అనుభవించేందుకు, తన మతాన్ని కలిగి ఉండేందుకు, ఆచరించేందుకు, తన భాషను కాపాడుకునే హక్కు ఉంటుంది.
ఆర్టికల్ - 31
- విశ్రాంతి, విరామాలకు, ఆడుకొనేందుకు, వినోదించేందుకు, వయసుకు తగ్గట్లుగా కళలు సాంస్కృతిక జీవనంలో స్వేచ్ఛగా పాల్గొనేందుకు బిడ్డకు హక్కు ఉందన్నది భాగస్వామ్య దేశాలు గుర్తించాలి.
- కళా సాంస్కృతిక జీవనంలో బిడ్డ పూర్తిగా పాల్గొనేందుకు ఉన్న హక్కును భాగస్వామ్య దేశాలు గౌరవించాలి.
రక్షణ హక్కులు : అపాయము నుంచి సంరక్షణ పొందటము
ఆర్టికల్ - 19
- తల్లిదండ్రులుగానీ, చట్టబద్ధ సంరక్షకులుగానీ, పిల్లల పెంపకం చూస్తున్న ఏ వ్యక్తిగానీ పెంచేటప్పుడు తిట్టినా, కొట్టినా, అసభ్యంగా ప్రవర్తించినా, లైంగికదూషణ చేసినా, దోపిడీ చేసినా, గాయ పరచినా, దౌర్జన్యం చేసినా, ఎలాంటి మానసిక శారీరక హింస నుంచి హింస అయినా సరే బిడ్డను సంరక్షించేందుకు భాగస్వామ్య దేశాలు చట్టపరంగా, పాలనాపరంగా తగు చర్యలన్నీ చేపట్టాలి.
- పిల్లలకు వారి పెంపకందారులకు సహాయంగా కొన్ని సామాజిక కార్యక్రమాలను నెలకొల్పే విధానాలు కూడా తగు విధంగా చేపట్టాలి. పైన వివరించిన దౌర్జన్యం, దౌష్ట్యాల సంఘటనల వివరాలను న్యాయస్ధానాల జోక్యం కోసం పరిశోధించటం, అన్వేషించటం, నివేదించడం మొదలైన వాటికోసం భాగస్వామ్య దేశాలు తగిన చర్యలు చేపట్టాలి.
ఆర్టికల్ - 32
- ఆర్ధిక దోపిడీ నుండి బిడ్డను రక్షించాలి. తన చదువుకు, ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఉండే పనుల నుండి బిడ్డను రక్షించాలి. లేదా బిడ్డ శారీరక, మానసిక, భౌతిక, నైతిక, సాంఘిక అభివృద్ధిని ఆటంకపరిచే పనుల నుండి బిడ్డను రక్షించాలి.
ఆర్టికల్ - 36
- బిడ్డ సంక్షేమానికి సంబంధించిన అంశాలకు ఏ రూపంలో ఉన్న హానినైనా దోపిడీనైనా ఎదుర్కొని భాగస్వామ్య దేశాలు బిడ్డను రక్షించాలి.
ఆర్టికల్ - 34
- భాగస్వామ్య దేశాలు అన్ని రకాల లైంగిక దూషణ, లైంగిక దోపిడీ నుండి బిడ్డను రక్షించే చర్యలు తీసుకోవాలి.
- వ్యభిచారం, తదితర అక్రమ లైంగిక వ్యవహారాల్లో పిల్లలను వినియోగించే దోపిడీని.
- బూతుబొమ్మలు, బూతు విషయాల్లో పిల్లలను వినియోగించుకొనే దోపిడీని అడ్డుకొనేందుకు భాగస్వామ్య దేశాలు తగిన జాతీయ, ద్వైపాక్షిక, బహూపాక్షిక పద్ధతులన్నిటినీ వినియోగించాలి.
ఆర్టికల్ - 37
- పిల్లలను శారీరకంగా హింసించరాదు. క్రూరంగా అమానుషంగా, నికృష్టంగా శిక్షించరాదు. 18 సంవత్సరాల లోపు వయస్సు పిల్లలకు విడుదల చేయడానికి వీల్లేని నేరాల్లో ఉరిశిక్షగానీ, యావజ్జీవశిక్షగానీ విధించరాదు.
- చట్టరహితంగా లేదా నిరంకుశంగా బిడ్డ స్వేచ్ఛను అరికట్టరాదు. బిడ్డను అరెస్టు చేయటంగానీ, నిర్భంధించటంగానీ, జైలులో ఉంచటంగానీ చట్టబద్ధంగానే చేయాలి. అది కూడా తప్పని పరిస్ధితుల్లోనే చేయాలి. అలాగే కొద్ది కాలం మాత్రమే ఉంచాలి.
- స్వేచ్ఛను అరికట్టవలసి వచ్చిన ప్రతీ బిడ్డనూ మానవతా దృష్టితో చూడాలి. ఆ వయసులో పిల్లలకు ఉండే అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని భర్తీ చేయాలి. నిర్భంధిచిన బిడ్డను అవసరమైతే తప్ప, వయోజనుల నుంచి వేరు చేయాలి. అలాగే బిడ్డ ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సందర్శన ద్వారా తన కుటుంబ సభ్యులతో సంబంధాలు కలిగియుండే ఏర్పాట్లు చేయాలి.
- నిర్భంధంలో ఉన్న బిడ్డ తన నిర్భంధం గురించి న్యాయస్ధానంలో చట్టబద్ధంగా పోరాడేందుకు, చట్టాన్ని ఇతర సహాయాన్ని తీసుకునే హక్కు ఉంది.
భావ ప్రకటన హక్కులు : భావ ప్రకటనను స్వేచ్ఛగా తెలియ జేయట
ఆర్టికల్ - 13
- భావ ప్రకటన స్వాతంత్ర్యం పిల్లల హక్కుగా ఉంటుంది. నేర్చుకొనేందుకు స్వేచ్ఛ, సరిహద్దులతో పనిలేకుండా ముఖ్య సమాచారాన్ని అన్ని రకాలైన అభిప్రాయాలను అందుకొనేందుకు స్వేచ్ఛ కూడా ఆ హక్కులో అంతర్భాగమై ఉంటాయి. మౌఖికంగాగానీ, లిఖితరూపంలోగానీ, ముద్రణరూపంలోగానీ, కళారూపంలోగానీ బిడ్డ ఎంచుకునే ఏ ఇతర మాధ్యమం ద్వారానైనా జ్ఞానాన్ని పొందవచ్చు.
ఆర్టికల్ - 14
- పిల్లల భావ ప్రకటన స్వాతంత్ర్యహక్కును, ఆత్మాభిమాన్నాన్ని, మత స్వాతంత్ర్యహక్కును భాగస్వామ్య దేశాలు గౌరవించాలి.
- బిడ్డ సామర్ధ్యాన్ని బట్టి తన హక్కులను వినియోగించుకొనేలా చేసేందుకు వారి తల్లిదండ్రులకు, చట్టబద్ధ సంరక్షకులకు ఉన్న హక్కులను, బాధ్యతలను భాగస్వామ్య దేశాలు గౌరవించాలి.
- మతం లేదా విశ్వాసాలను ప్రచారం చేసుకొనేందుకు ఉన్న హక్కుకు చట్టపరంగా కొన్ని నియంత్రణలున్నాయి. ప్రజల రక్షణ కోసం, శాంతిభద్రతల కోసం, లేదా ఆరోగ్యం, నైతిక విలువలు, ఇతరుల హక్కులు, ప్రాధమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఆ హక్కుకు నిరోధం ఉంటుంది.
ఆర్టికల్ - 16
- పిల్లల పట్ల నిరంకుశంగా ప్రవర్తించరాదు. పిల్లల ఏకాంతంలో, కుటుంబంలో, గృహవాతావరణంలో వారి సంప్రదింపుల్లో చట్ట విరుద్ధంగా దాడి చేయరాదు. అలాంటి జోక్యానికి దాడులకు వ్యతిరేఖంగా న్యాయాన్ని కాపాడుకొనే హక్కు పిల్లలకు ఉంది.
ఆర్టికల్ - 17
ప్రసార మాద్యమం యొక్క ప్రాముఖ్యతను భాగస్వామ్య దేశాలు గుర్తించాలి. విభిన్న రీతులలో ఉన్న జాతీయ, అంతర్జాతీయ సమాచారాన్ని ఆ మాధ్యమం ద్వారా బిడ్డకు అందించాలి. ప్రత్యేకించి బిడ్డకు సామాజిక, భౌతిక, నైతిక పరిపూర్ణత శారీరక, మానసిక ఆరోగ్యాలను పరిజ్ఞానాన్ని ప్రసార మాధ్యమం ద్వారా అందించాలి. అందుకోసం భాగస్వామ్య దేశాలు ఈ క్రింది చర్యలు తీసుకోవాలి.
- ఆర్టికల్ 29 కి అనుగుణంగా బిడ్డకు సామాజిక, సాంస్కృతిక పరిజ్ఞానాన్ని, సమాచారాన్ని ప్రసారం చేసేందుకు భాగస్వామ్య దేశాలు ప్రచార సాధనాలను ప్రోత్సహించాలి.
- విభిన్న సాంస్కృతిక, జాతీయ, అంతర్జాతీయ వనరుల నుండి అలాంటి సమాచారాన్ని పరిజ్ఞానాన్ని రూపకల్పన చేయడానికి, ప్రచారం చేయడానికి, ఇచ్చి పుచ్చుకోడానికి భాగస్వామ్య దేశాలు అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించాలి.
- పిల్లల పుస్తకాలను తయారుచేయడానికి, ప్రచురించడానికి ప్రోత్సహించాలి.
- మైనారిటీ భాషకు లేదా మాండలికానికి చెందిన పిల్లల భాషా అవసరాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేలా ప్రసార మాధ్యమాన్ని ప్రోత్సహించాలి.
- ఆర్టికల్ 13, ఆర్టికల్ 8 నిబంధనలను దృష్టిలో ఉంచుకొని, పిల్లల శ్రేయస్సుకు హానికరమైన సమాచారం పరిజ్ఞానాల హాని నుండి పిల్లలను రక్షించేందుకు తగిన మార్గదర్శకత్వాన్ని అభివృద్ధి చేయడానికి భాగస్వామ్య దేశాలు ప్రోత్సహించాలి.
నలభైకోట్ల మంది పిల్లలున్న దేశం భారతదేశం, సాంఘికంగా, ఆర్ధికంగా ఎంతో ప్రగతి సాధించినా, ఇంకా చాలా మంది పిల్లలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. దయనీయమైన, అమానుష మైన పరిస్ధితుల్లో బతుకుతున్న పిల్లలు లక్షల్లో ఉన్నారు. మగపిల్లల కన్నా ఆడపిల్లలు మరింతగా బాధలు ఎదుర్కొంటున్నారు. సరైన ఆహారం లేక, ఆశ్రయం లేక, వీదుల్లో బతుకుతూ, అనారోగ్యం పాలై అనేక రకాల లైంగిక హింసలకి గురవుతూ, వ్యభిచారం కోసం అక్రమ రవాణాకి గురవుతూ వారుపడే బాధలు అన్నీ ఇన్నీ కావు. బాల కార్మికులుగా పసితనంలోనే బాల్యం కోల్పోతున్న కొందరైతే, బాల్య వివాహం వల్ల బతుకునే కోల్పోతున్నవారు మరికొందరు. అలాంటి పిల్లలకి ప్రత్యేక రక్షణ, ఆదరణ కావాలి. వారు విద్యావంతులవ్వాలి. అకృత్యాల బారిన పడకుండా, ఎవరి దోపిడీకి గురి కాకుండా, సురక్షణతో, గౌరవంతో బతికే జీవితం వారికి కావాలి. దీనికి గాను సమాజంలో అందరి భాగస్వామ్యం అవసరం.
ముఖ్యంగా అంగన్ వాడి కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పంచాయితీ సభ్యులు, యువజన సేవకులు సమిష్టిగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా తమ సేవల్ని అందించాలి.
పంచాయితీ సభ్యులంటే సమాజంలో గౌరవమేకాక, మహిళా శిశురక్షణకు ఎంతో కృషి చెయ్యగలిగిన వారుగా ప్రజలకి ఆశ ఉంది. ప్రజలచే ఎన్నుకోబడిన వీరికి ప్రజల సంక్షేమంతో పాటు, పిల్లల సంక్షేమం విషయంలో గురుతర బాధ్యత ఉంది.
బోధన వల్లే మనుషుల జీవితాలు బాగుపడతాయి అన్న ఆశ నాకు - ప్రఖ్యాత మేధావి జార్జి బెర్నార్డ్ షా ఉవాచ ఇది. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడన్న విశ్వాసం వున్న సంప్రదాయం మనది. అందువల్ల మన సమాజంలో అంగన్ వాడి కార్యకర్తలను, ఉపాధ్యాయులను ఎప్పుడూ ఉన్నత గౌరవస్ధానంలోనే ఉంచుతున్నాము.
తల్లిదండ్రుల ప్రభావంలాగే అంగన్ వాడి కార్యకర్తల, ఉపాధ్యాయుల ప్రభావం కూడా పిల్లల మీద బలంగా ఉంటుంది. అందువల్ల పిల్లల బతుకుల్ని తీర్చిదిద్దటంలో వీరి పాత్ర ప్రముఖమైనది. ఉపాధ్యాయులు, అంగన్ వాడి కార్యకర్తలు పిల్లల్ని బడిలోనే కాదు, బతుకులో కూడా సంరక్షించగలరు. పసితనంలో వారికి అలవాటు చేసే మంచి చెడ్డలు, పర్యవేక్షణ పిల్లల భావి జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. అంతేకాక ఉపాధ్యాయులకి, అంగన్ వాడి కార్యకర్తలకి తమ పరిసర సమాజంతో ఉండే బంధం ఎంతో గాఢమైంది.
అంగన్ వాడి కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పంచాయితీ సభ్యులు పిల్లల సంక్షేమం విషయంలో, బాధ్యతాయుతంగా చెయ్య గలిగిన పనులేమిటో పరిశీలిద్దాం.
- సురక్షిత వాతావరణంలో పిల్లలు ఉండేలా చూడటం.
- వీలున్నంత ఎక్కువగా పిల్లలతో సంభాషిస్తూ వారి మనసు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవడం.
- పిల్లలకు సురక్షిత బాల్యమే కాక ఇంకా ఎన్నో రకాల హక్కులు ఉన్నాయని పెద్దలందరికీ తెలియజేసి, వాటిని సంరక్షించేలా చూడటం.
- పిల్లలకి, వారి కుటుంబానికి వీలున్నంతగా సాయపడటం.
- పిల్లల రక్షణకి ప్రమాదం కలిగించే వాటిని తెలుసుకుని, అలాంటి ప్రమాదాల నివారణకి కృషి చెయ్యటం.
- అవసర సమయాల్లో పోలీసులకి / పిల్లల సంరక్షణా సంస్ధలకి ఫిర్యాదు చేసి అవసరమైన చట్టబద్ధ భద్రతని కలిగించటం. పిల్లలు కష్టపడుతున్నప్పుడు అది వారి ఖర్మ అని బావించకూడదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఇబ్బందులతోనే పెరిగారు అన్న ఉదాసీనత ఉండకూడదు. ఇది మన సంప్రదాయం. ఎప్పట్నుంచో ఇలాగే జరుగుతోందన్న ధోరణి ఉండకూడదు. పేదరికం, లంచగొండితనం వల్లే పిల్లలకి బాధలు అన్న అలక్ష్య ధోరణి పనికిరాదు. పిల్లల కష్టాలకు తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబమే కారణం అన్న భావన సరైంది కాదు. ఆ పిల్లలకి మనకి ఏం సంబంధం లేదు అన్న ఉదాసీనతా కూడదు.
పిల్లలకీ హక్కులున్నాయి. పరిరక్షణకి ఎంతో కృషి జరుగుతోంది. సమాజంలోని అందరూ మరింత బాధ్యతగా కృషి చేస్తే త్వరితంగా ఎందరో పిల్లల బతుకులు మెరుగుపడతాయి.
ఆధారము: UNICEF