డ్రామా... నాటకం... నటన... అంటే నిజం కానిది.
మనం కానిది... మరి మనకెందుకు?
నటన మనిషికి సహజ సిద్ధంగా ఉండేదే. ‘వచ్చేది’ కాదు.
ఊహ తెలిసినప్పటి నుంచీ పిల్లలు నటిస్తూనే ఉంటారు.
ఏడాది కూడా లేని పిల్లలు పిల్లిలా... మ్యాచ్ అంటూ పాకుతారు.
కుక్కలా భౌ...భౌ... అంటూ మనమీదకొచ్చి భయపెడతారు.
మన ఎదురుగానే ఉన్న చిన్నారిని మనం చూడనట్టు నటిస్తూ “ఏదీ నా బంగారు తల్లీ? ఎక్కడుంది??”
అంటూ వెతుక్కుంటుంటే సంభ్రమంతో సంబర పడిపోతుంది.
అది మొదలు జీవితంలోని అన్ని దశలలో ప్రతినిత్యం కాకపోయినా ఎంతోకొంత నటనా చాతుర్యం ఆపద్ధర్మంగా అందరం ప్రదర్శిస్తూనే ఉంటాం.
మరి ప్రత్యేకించి డ్రామాలు ఎందుకు?
ప్రదర్శించే కళారీతుల్లో డ్రామా ప్రముఖమైంది అని అందరికీ తెలుసు.
డ్రామా ద్వారా పిల్లలలో పెంపొందే ఎన్నో నైపుణ్యాలను, వికాసాలనూ దృష్టిలో పెట్టుకుని Central & State Educational Boards అన్నీ కూడా ఈ ప్రక్రియను పాఠ్యాంశాలలో చొప్పించాయి.
సంవత్సరంలో ఓసారి వేదికమీద ప్రదర్శనకో, పోటీలకో కాక విద్యా ప్రణాళికలో భాగంగా డ్రామా ఉండాలని, అందరి పిల్లలకూ అవకాశాలు రావాలనీ నిర్దేశించాయి.
ఎందుకు పిల్లల వికాసంలో డ్రామా అంత ప్రముఖంగా చెప్పబడుతోందంటే… చాలా కారణాలున్నాయి.
మానసిక వికాసానికి
- డ్రామాలో తాము పోషించే పాత్ర యొక్క భావోద్వేగాలను (తాత్కాలికంగానైనా కానీ) పిల్లలు అనుభవిస్తారు. తద్వారా ఒకో పరిస్థితిలో వేరే వాళ్ళ స్పందనలు, ఎలా ఉంటాయో అర్థం చేసుకోగలిగే అవకాశం ఉంటుంది.
- ప్రపంచాన్ని తన దృష్టి తోనే కాక, జంతువుల, ఇతర మనుష్యుల దృష్టి కోణం నుండి చూడడం అలవడుతుంది. దీని వల్ల జీవుల పట్ల, మనుష్యుల పట్ల సహానుభూతి కలిగి ఉంటారు.
- పంచతంత్రం, తెనాలి రామకృష్ణుడి కథల వంటివి డ్రామాల రూపంలో వేస్తున్నపుడు అందులోని పాత్రల తెలివి తేటలు, సమయ స్ఫూర్తి వంటివి వారిలో కూడా పెంపొందేలా చేస్తాయి.
- విలువలతో కూడిన కథలను ప్రదర్శించే క్రమంలో అంతర్లీనంగా అవి వారిపై ప్రభావం చూపిస్తాయి. కష్ట పడి సాధన చేశాక విజయవంతమైన డ్రామా ప్రదర్శన పిల్లలలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఇది వారి వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకమైనది.
భాషాభివృద్ధికి
- భాషాభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. పుస్తకాల ద్వారా, వినడం ద్వారా వచ్చిన భాషా పరిజ్ఞానం ఇందుకు ఉపకరిస్తుంది.
- నిత్య జీవితంలో మన చుటూ ఉన్న వారితో సత్సంబంధాలు నెరపడంలోను, కావలసిన పనులు జరిగేలా చూసుకోడంలోనూ మన సంభాషణా చాతుర్యం పెద్ద పాత్ర వహిస్తుంది.
- డ్రామాల్లోని వివిధ సందర్భాలలో రకరకాల పాత్రల పోషణలలో పిల్లలు సంభాషించడంలో నైపుణ్యాలు పెంచుకుంటారు.
- డ్రామా ద్వారా పరిచయమైన పదజాలాన్ని వాక్య నిర్మాణాలను పిల్లలు చాలా బాగా సొంతం చేసుకోవడం, మరల మరల వాటిని నిత్య జీవితంలో ప్రదర్శించడం చూస్తుంటాం.
- ప్రాథమిక స్థాయి పిల్లలకు వీలైనంత వరకు సంభాషణలు అప్పటికప్పుడు వారే కల్పించుకునే అవకాశమిచ్చినటైతే వాళ్ళ భాష విశేషంగా మెరుగవుతుంది. పెద్ద పిల్లలకు కూడా ఈ అవకాశం తప్పక ఉండాలి.
- రోల్ ప్లే, మోనో యాక్షన్ వంటి తక్కువ సమయం పట్టి, అందరికీ అవకాశాలుండే ప్రక్రియల వల్ల కొందరి పిల్లలలో మాట తడబాటు, నత్తి, వంటివి తగ్గి స్పష్టంగా సంభాషించగలిగే అవకాశం ఉంది.
- ఈ రకమైన కృత్యాలు పదిమంది ముందు మాట్లాడలేని పిల్లల బిడియం, బెదురు, సంకోచం పోగొట్టి ధైర్యంగా మాట్లాడే ప్రోత్సాహాన్నిస్తాయి.
- మంచి ఉచ్చారణ నేర్చుకోవడానికి పిల్లలకు ఇష్టమైన మార్గం రోల్ ప్లేలు, డ్రామాలు.
- డ్రామా వెయ్యడం వల్ల ఆ భాషతో దగ్గరితనం ఏర్పడుతుంది.
- తెలుగు, హిందీ, ఇంగ్లీషులలాంటి భాషలలోని ఐతిహాసిక కథలను డ్రామాల రూపంలో వేయడం వాటి భాష, అందులోని పాత్రలు వారి మనసులలో గాఢంగా హత్తుకు పోతాయ్. మరింత చదివేందుకు స్పూర్తినిస్తాయి.
- పుస్తకాలకు పిల్లలను దగ్గర చెయ్యడానికి ఇదో మంచి ఉపాయం.
- హావభావాలతో, అభినయంతో, స్పష్టంగా మాట్లాడడం తెలుస్తుంది. ఎలా చెప్లే ఇతరులకు చక్కగా అర్థమవుతుందో, ఏ పరిస్థితిలో ఎలా మాట్లాడాలో అర్థమవుతుంది. ఇది ఇతరులతో సంబంధాలను మెరుగు పరుస్తుంది.
బృందంలో చక్కగా ఇమడగలగడానికి
- మోనోయాక్షన్, పప్పెట్రీ. రోల్ ప్లే వంటివి ఒక్కరే చేసినా, డ్రామా అంటే అంటే బృందం చేసే పనే. కథను ఎంచుకోవడం, సంభాషణలు తయారు చేసుకోవడం దగ్గర నుంచీ ప్రదర్శించే వరకు అన్ని పనులలోను అందరికీ అందరి సహకారం కావాలి. సహకారం ఇచ్చిపుచ్చుకునే విధానాలు అలవడతాయి.
- డ్రామా విజయవంతమైతే అది ఒక్కరి విజయం కాదు. బృందంగా అందరూ సంతోషం పంచుకుంటారు.
సృజనాత్మక వ్యక్తీకరణకు
- డ్రామా ప్రయోజనం వేదిక మీద ప్రదర్శించడానికో, పోటీకో కానప్పడు అంతిమంగా ప్రదర్శనకంటే కూడా, ప్రక్రియ అంతా ముఖ్యమే అవుతుంది.
- కథ ఎన్నుకోవడం దగ్గర నుంచి, సంభాషణలు వ్రాసుకోవడం, దుస్తులను, స్టేజిని రూపొందించు కోవడం, ప్రదర్శనా ప్రణాళిక వరకు అన్ని అంశాలలో పిల్లల సృజనాత్మకతను వ్యక్తీకరించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
డ్రామా ఎన్నో అంశాల కలబోత. వ్రాయడంలో కొందరిది పాత్ర అయితే, దర్శకత్వం కొందరు, దుస్తుల ఎంపికలో మరి కొందరు, స్టేజి నిర్వహణ మరికొందరు - ఇలా ఒక్కో అంశాన్ని చిన్న బృందాలుగా వారు నిర్వహించుకోవడంలో అందరికీ తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను పెంపొందించుకునే, వ్యక్తీకరించుకునే అవకాశం ఉంటుంది. డ్రామాల వల్ల పెంపొందే వివిధ నైపుణ్యాలు - భాషాపరంగా గానీ, నిర్వహణాపరంగా గానీ, సృజనాత్మకత విషయంలో గానీ - పిల్లలు చదువులో మెరుగు పడడానికి తోడ్పడతాయనడం పరిశీలనలో తేలిన విషయం. డ్రామా పిల్లలలో తీసుకు వచ్చే మార్పులు మరే ఇతర ప్రక్రియ తేలేదనేది అతిశయోక్తి కాదు. ఎందుకంటే చిత్ర లేఖనం, పాట, డాన్స్ వంటివి అందరూ చెయ్యలేరు. సాధనలో అందరు పిల్లలూ ఎంతోకొంతగానీ, అద్భుతంగా గానీ చెయ్య గలగడం డ్రామా ఓ ప్రధాన భాగంగా నడిచే ఏ బడిలోనైనా అనుభవంలోకి వచ్చే విషయమే. అందుకే, నాటకం, తదితర ప్రక్రియలైన పప్పెట్రీ, మోనో యాక్షన్, రోల్ ప్లే వంటి వాటికి పెద్దపీట వేయాలనీ, పాఠ్య ప్రణాళికలో భాగం చెయ్యాలనీ, అందరికీ పిల్లల తరపున విన్నపం.