ఉపోద్ఘాతం: ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైన అవార్డులలో “నోబెల్ అవార్డులు” ఎంతో ప్రాముఖ్యమైనవి. డైనమైట్ కనుగొన్న అల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రతి ఏటా ఈ అవార్డులను ప్రధానం చేస్తారు.
అల్ఫ్రెడ్ నోబెల్ జీవిత విశేషాలు:
జననం : అక్టోబర్ 21, 1833
మరణం : డిసెంబర్ 10, 1896
వృత్తి : రసాయనశాస్త్రవేత్త, ఇంజనీరు, డైనమైట్ కనుగొన్నవాడు. ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ - (21 అక్టోబర్ 1833, స్టాక్‌హోం, స్వీడన్ – 10 డిసెంబర్ 1896, సన్రీమో, ఇటలీ)
ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల తయారీదారు మరియు డైనమైట్ ఆవిష్కారకుడు. ఒక పాత ఇనుము మరియు స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ఈయన ఆఖరి వీలునామాలో నోబెల్ బహుమతి స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు. సైన్స్, సాహిత్యం, శాంతి విభాగాల్లో విశేష కృషిచేసిన వారికి వీటిని అందజేస్తారు , 1885లో ఆల్ ఫ్రెడ్ నోబెల్ తన వీలు నామా లో నోబెల్ శాంతి బహుమతి ఎలాంటి వారికి ఇవ్వాలో చాలా వివరంగానే ప్రస్తావించారు. కృత్రిమ మూలకము నోబెలియం ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు. ఆల్ఫ్రెడ్ నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ (1801-1872)మరియు ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ (1805-1889) మూడవ సంతానం. స్టాక్‌హోంలో అక్టోబర్ 21 1833 లో జన్మించాడు. తరవాత ఇతని కుటుంబంతో 1842లో సెయింట్ పీటర్స్బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ కి వివాహము కాలేదు . తన జీవితాంతము బ్రహ్మచారిగానే ఉండి శాస్త్ర పరిశోధనకే జీవితాన్ని అంకితం చేశారు.
అవార్డులుకు మనీ ఎవరు ఇస్తారు : ఎకానమీ : బ్యాంకు అఫ్ స్వీడన్ (రిస్క్ బ్యాంకు) మిగతా కేటగిరి అవార్డులు : నోబెల్ ఏర్పాటు చేసిన ఫండ్ నుండి ఇస్తారు . అవార్డులు ఎవరు ఇస్తారు : ఓస్లో - నార్వే : నోబెల్ శాంతి బహుమతి స్టాక్ హోం -స్వీడన్ : మిగతా కేటగిరి అవార్డులు నోబెల్ ప్రైజ్ మీద ఏమి రాసిఉంటుంది :
ఆర్ధిక శాస్త్ర నోబెల్ : ఏమి రాసి ఉండదు
శాంతి : For the peace and brotherhood of men.
మిగతా కేటగిరి అవార్డులు : And they who bettered life on earth by new found mastery
2016 నోబెల్ అవార్డుల వివరాలు:
1.వైద్యశాస్త్ర నోబెల్: జపాన్ శాస్త్రవేత్త యొషినోరీ ఒషుమీ
కణాలు తమలోని దెబ్బతిన్న భాగాలను స్వీయ విధ్వంసం చేసుకుని, పునరుద్ధరించుకునే ప్రక్రియ(ఆటోఫేజీ) గుట్టు తేల్చిన జపాన్ శాస్త్రవేత్త యొషినోరీ ఒషుమీకి ఈ ఏడాది వైద్య శాస్త్ర నోబెల్ దక్కింది. కణాల ఆత్మహత్య లేదా కణాల స్వీయ విధ్వంసంగా పేర్కొనే ఈ ప్రక్రియలో లోపం వల్లే మనలో వృద్ధాప్యం వస్తుందని, కణాలు దెబ్బతిని పార్కిన్సన్స్, మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులు వస్తాయని శాస్త్రవేత్తలుతేల్చారు. టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఒషుమి వయసు 71 ఏళ్లు. డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో నోబెల్ అవార్డుతో పాటు 8 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు (రూ.6.23 కోట్లు) బహుమతిగా అందుకోనున్నారు. గతేడాది వైద్య నోబెల్‌ను సూక్ష్మజీవుల ద్వారా వచ్చే వ్యాధులను ఎదుర్కొనే చికిత్సలను అభివృద్ధి చేసిన విలియం కాంప్‌బెల్(అమెరికా), సతోషి ఒముర(జపాన్), టు యూయూ(చైనా)లు సంయుక్తంగా అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా నోబెల్ గెలుచుకున్న ఒషుమీతోజపాన్ మొత్తంగా 23వనోబెల్ గెలుచుకుంది. వైద్య రంగంలో ఆ దేశానికి ఇది 6వ నోబెల్ బహుమతి కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఒషుమీ మాట్లాడుతూ.. ‘‘ఇతరులు చేయాలనుకోని పనులు చేయాలనేది నా ఆలోచన. ఆటోఫేజీ చాలా ఆసక్తికరమైన అంశం. అంతా మొదలయ్యేది దానివద్దే. కానీ గతంలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అందరి దృష్టీ దానిపై ఉంది. నోబెల్ రావడం ఓ పరిశోధకుడికి అత్యుత్తమ గౌరవం’ అని పేర్కొన్నారు.
2.భౌతికశాస్త్ర నోబెల్: బ్రిటిష్ శాస్త్రవేత్తలు డేవిడ్ థౌలెస్, డంకన్ హాల్డేన్, మైఖేల్ కోస్టార్లిట్జ్.
పదార్థానికి ఉండే అసాధారణ స్థితిగతులపై పరిశోధన చేసిన ముగ్గురు బ్రిటిష్ శాస్త్రవేత్తలు డేవిడ్ థౌలెస్, డంకన్ హాల్డేన్, మైఖేల్ కోస్టార్లిట్జ్‌లకు సంయుక్తంగా ఈ ఏడాది భౌతిక శాస్త్రం(ఫిజిక్స్)లో నోబెల్ దక్కింది. గణిత శాస్త్ర ప్రత్యేక విభాగమైన టోపాలజీలో పరిశోధన చేసి, మన చుట్టూ ఉండే పదార్థం మనకు తెలియని అసాధారణ స్థితిగతులను కలిగి ఉంటుందన్న రహస్యాన్ని వీరు ఛేదించారని నోబెల్ జ్యూరీ రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొంది. ‘భవి ష్యత్తులో అతి చిన్న, వేగవంతమైన క్వాం టమ్ కంప్యూటర్ల తయారీకి, అత్యుత్తమ ఎలక్ట్రానిక్ ఆవిష్కరణలకు, సూపర్ కండక్టర్ల అభివృద్ధికి వీరి పరిశోధన మార్గం సుగమం చేసింది. ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసే (ఓవర్ హీటింగ్) సమస్య లేకుండా విద్యుత్‌ను, సమాచారాన్ని ప్రసారం చేసేందుకు వీలవుతుంది’ అని తెలిపింది. ఈ ముగ్గురు ప్రస్తు తం అమెరికాలో పనిచేస్తున్నారు. థౌలెస్ వర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో, హాల్డెన్, కోస్టార్లిట్జ్ బ్రౌన్ వర్సిటీలో ప్రొఫెసర్లు. అవార్డు కింద రూ.6.18 కోట్లు (8 మిలియన్ల స్వీడన్ క్రోనార్లు) బహుమతిగా అందజేయనుండగా... డేవిడ్ థౌలెస్కు 50 శాతం, హాల్డేన్, కోస్టర్లిట్జ్లు 25 శాతం చొప్పున అందుకోనున్నారు. పదార్థ అసాధారణ స్థితిపై పరిశోధనకు బహుమతి.
3.రసాయనశాస్త్ర నోబెల్: జీన్ పియర్ సావేజ్(ఫ్రాన్స్), జె ఫ్రేజర్ స్టోడార్ట్(బ్రిటన్), బెర్నాండ్ ఫెరింగా(నెదర్లాండ్స్).
అణువుల స్థాయిలో పనిచేసే యంత్రాల (మాలిక్యులర్ మెషీన్స్)ను అభివృద్ధి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది రసాయన శాస్త్ర(కెమిస్ట్రీ) నోబెల్ వరించింది. జీన్ పియర్ సావేజ్(ఫ్రాన్స్), జె ఫ్రేజర్ స్టోడార్ట్(బ్రిటన్), బెర్నాండ్ ఫెరింగా(నెదర్లాండ్స్)లను రసాయన నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ బుధవారం ప్రకటించింది. వీరు అత్యంత సూక్ష్మమైన మోటార్లను రూపొందించి, విజయవంతంగా నియంత్రించగలిగారని పేర్కొంది. అత్యాధునిక సెన్సర్లు, సరికొత్త పదార్థాలు, విద్యుత్‌ను నిల్వ చేసుకోగలిగే వ్యవస్థల అభివృద్ధికి మాలిక్యులర్ మెషీన్స్‌పై పరిశోధన తోడ్పడుతుందని తెలిపింది. డిసెంబర్ 10న బహుమతి కింద అందించే రూ.6.19 కోట్ల (8 మిలియన్ స్వీడిష్ క్రోనార్ల)ను ఈ ముగ్గురు సమానంగా పంచుకుంటారు.
అణువుల స్థాయిలో అత్యంత సూక్ష్మంగా రూపొందించినవే మాలిక్యులర్ మెషీన్స్(అణు యంత్రాలు). వీటికి శక్తిని అందిస్తే మోటార్ల తరహాలో తిరుగుతాయి. తమకన్నా ఎన్నో రెట్లు పెద్దవైన వాటినీ కదిలిస్తాయి. సూక్ష్మమైన రోబోట్లను రూపొందించడానికి, కృత్రిమ అవయవాల రూపకల్పనకు కూడా ఈ మాలిక్యులర్ మెషీన్స్ ఉపయోగపడతాయి. మన శరీరంలోని ప్రొటీన్లు కణాంతర్గత స్థాయిలో బయోలాజికల్ యంత్రాల లాగా పనిచేస్తాయి. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు... కేవలం కొన్ని అణువులు లేదా పరమాణువులను అనుసంధానించి మాలిక్యులర్ మెషీన్లను అభివృద్ధి చేశారు. వీటినే నానో యంత్రాలు లేదా నానోబోట్స్గా కూడా వ్యవహరిస్తుంటారు. కాం తిని పంపడం, ఉష్ణోగ్రతలో మార్పు చేయడం ద్వారా ఈ మెషీన్లను నియంత్రించగలిగేలా రూపొందించారు. వీటిని నానో స్థాయిలో మోటార్లుగా, చక్రాలుగా, పిస్టిన్లుగా, ఇతర నానో పదార్థాలను కదిలించగలిగే పరికరాలుగా వాడుకోవచ్చు.
రానున్న కాలం మాలిక్యులర్ యంత్రాలదే!
ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ (విద్యుత్‌తో నడిచే) మోటార్ కూడా 1830 సమయంలో అత్యంత ప్రాథమిక స్థాయిలో ఉంది. అప్పుడు అతిపెద్ద మోటార్ కూడా ఓ మోస్తరుగానే పనిచేసేది. ఇప్పుడు ఫ్యాన్లు, మిక్సీలు, వాషింగ్ మెషీన్ల దగ్గరి నుంచి ఎలక్ట్రిక్ రైళ్లు, కార్ల దాకా మనచుట్టూ అన్నీ ఎలక్ట్రిక్ మోటార్లతోనే పనిచేస్తున్నాయి. ఇదే తరహాలో భవిష్యత్తులో మాలిక్యులర్ మెషీన్ల వినియోగంవిస్తృతమవుతుందని రాయల్ స్వీడిష్ అకాడమీ జ్యూరీ పేర్కొంది. కొత్త పదార్థాల రూపకల్పన, సెన్సర్లు, శక్తిని నిల్వ చేసే వ్యవస్థలతో పాటు ఎన్నో రంగాల్లో మాలిక్యులర్ మెషీన్లు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించింది.
4.శాంతి నోబెల్: కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్. కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్‌ను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం వరించింది. కొలంబియాలో ఐదు దశాబ్దాలుగా సాగుతున్న అంతర్యుద్ధానికి తెరదించేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా నోబెల్ కమిటీ 2016 సంవత్సరానికిగాను శాంటోస్ పేరును ఈ అవార్డుకు ఎంపిక చేసింది. దేశంలో శాంతి నెలకొల్పేందుకు నాలుగేళ్లుగా తిరుగుబాటు దళం రివల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా(ఎఫ్ఏఆర్సీ) చీఫ్ రోడ్రిగో లండనో అలియాస్ టిమోలియన్ టిమోచెంకో జిమెనేజ్తో శాంటోస్ చర్చలు జరుపుతున్నారు. సెప్టెంబర్ నెల 26న వీరి మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. అయితే ఈ చారిత్రక ఒప్పందానికి సంబంధించి ఈ నెల 2న నిర్వహించిన రెఫరెండంలో ఓటర్లు దానికి వ్యతిరేకంగా ఓటు వేసి దేశ భవితవ్యాన్ని సందిగ్ధంలో పడేశారు. అయినా కూడా నోబెల్ కమిటీ శాంటోస్ పేరును నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంపిక చేయడం విశేషం.
నోబెల్ కమిటీ చైర్పర్సన్ కచీ కుల్మన్ ఫైవ్ స్పందిస్తూ.. 50 ఏళ్ల అంతర్గత పోరాటానికి ముగింపు పలకడం కోసం శాంటోస్ చేసిన అవిరళ కృషికి గుర్తింపుగా ఆయన పేరును అవార్డుకు ఎంపిక చేసినట్టు చెప్పారు. యుద్ధ మేఘాలు కమ్మేసిన దేశంలో శాంతిని నెలకొల్పడమే తమ లక్ష్యమని చెప్పారు. శాంతి కోసం చేపట్టే చర్యలకు ఊతం ఇచ్చేందుకు, అలాగే అన్ని వర్గాలు ఈ ప్రక్రియలో పాలుపంచుకునేందుకు ఈ అవార్డు దోహదం చేస్తుందని తెలిపారు. ఈ అవార్డు శాంతిపై నమ్మకం కోల్పోని కొలంబియన్లకు.. అలాగే అంతర్గత పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అంకితమన్నారు. అయితే ప్రస్తుతం కొలంబియా ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య ఉందని శాంటోస్‌ను నోబెల్ కమిటీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాలను చర్చలకు ఆహ్వానించి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించేందుకు శాంటోస్ కృషి చేయాలని సూచించింది. ఐదు దశాబ్దాల అంతర్గత పోరు.. దక్షిణ అమెరికా ఖండ దేశమైన కొలంబియాలో అంతర్యుద్ధం వల్ల 2,60,000 మంది ప్రాణాలు కోల్పోగా, 45 వేల మంది ఆచూకీ లేకుండా పోయారు. 60 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వామపక్ష గెరిల్లా గ్రూపులు, రైట్ వింగ్ పారామిలిటరీ దళాలు, డ్రగ్ ముఠాల మధ్య దాడులతో దేశం అల్లకల్లోలంగా మారింది. అయితే రెఫరెండం ఫలితం వల్ల కొలంబియాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశాలు తక్కువని నిఫుణులు భావిస్తున్న తరుణంలో కమిటీ శాంటోస్ పేరును ఎంపిక చేయడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. శాంటోస్‌తో పాటు తిరుగుబాటు నాయకుడు జిమేనేజ్కు బహుమతి ప్రకటించకపోవడంపైనా వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
శాంటోస్ ... వ్యూహం.
శాంటోస్.. కొలంబియాలో రాజకీయ, రాజ్యాంగ సంస్కరణలకోసం తీవ్రంగా శ్రమించారు. కానాస్ వర్సిటీ(యూఎస్), లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ఉన్నతవిద్యను అభ్యసించిన శాంటోస్.. తన కుటుంబం ఆధీనంలో ఉన్న ‘ఎల్ టింపో’ అనే వార్తాపత్రిక బాధ్యతలూ చూసుకున్నారు. కొలంబియా కాఫీ తోటల యజమానుల సంఘానికి ఆర్థిక సలహాదారుగా.. కొలంబియా అంతర్జాతీయ కాఫీ ఆర్గనైజేషన్ సభ్యుడిగా పనిచేశారు. రాజకీయాల్లోకి వస్తూనే.. కొలంబియా తొలి వాణిజ్య మంత్రి అయ్యారు. కొంత కాలానికి రక్షణ శాఖ బాధ్యతా తీసుకున్నారు. ఆ సమయంలో ఫార్క్ రెబల్స్‌పై ఉక్కుపాదం మోపారు. అయితే.. 2010లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక వ్యూహాన్ని మార్చి.. ఫార్క్ దళంతో శాంతి చర్చలకోసం ప్రయత్నించారు.
5.సాహిత్యనోబెల్ : బాబ్ డిలాన్( అమెరికా) - గ్రేటెస్ట్ లివింగ్ పోయెట్: 1960 నుంచి తన ప్రభావవంతమైన గీతాలతో ఒక తరానికి ప్రతినిధిగా, స్వరంగా నిలిచిన అమెరికన్ గీత రచయిత, పాటగాడు బాబ్ డిలాన్ను అత్యున్నత నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. అత్యున్నత సాహిత్య పురస్కారంగా భావించే నోబెల్ అవార్డును ఇప్పటివరకు కవులకు, రచయితలకు ఇస్తూ వస్తుండగా.. ఈసారి అనూహ్యరీతిలో సంగీత రంగానికి చెందిన గాయకుడికి ప్రకటించడం గమనార్హం. "బ్లోవిన్ ఇన్ ద విండ్', "మాస్టర్స్ ఆఫ్ వార్', "ఏ హార్డ్ రెయిన్స్ ఏ గాన్నా ఫాల్', "ద టైమ్స్ దే ఆర్ ఏ చేంజింగ్', "సబ్టెరానియన్ హోస్సిక్ బ్లూ', "లైక్ ఏ రోలింగ్ స్టోన్' వంటి తన గీతాలతో బాబ్ డిలాన్ అసమ్మతిని, తిరుగుబాటును, స్వతంత్రకాంక్షను ప్రకటించారు. "డిలాన్లో ఒక ఐకాన్ ఉన్నారు. సమకాలీన సంగీతంపై ఆయన ప్రభావం అపారం' అని స్వీడిష్ అకాడెమీ పేర్కొంది. నోబెల్ పురస్కారం కింద డిలాన్‌కు ఎనిమిది మిలియన్ స్వీడిష్ క్రౌన్లు (9.30లక్షల డాలర్లు.. రూ. 6.22 కోట్లు) బహుమానం లభించనుంది. 50 ఏళ్లకుపైగా కొనసాగుతున్న తన గీత ప్రస్థానంలో ఇప్పటికే డిలాన్ గీతాలు రచిస్తున్నారు. అప్పుడప్పుడు ప్రపంచ పర్యటనలు చేపడుతున్నారు. ప్రస్తుతం జీవిస్తున్న వారిలో ఆయన అత్యున్నత కవి (గ్రేటెస్ట్ లివింగ్ పోయెట్) అయి ఉంటారు’ అని అకాడెమీ సభ్యుడు పెర్ వాస్ట్బర్గ్ పేర్కొన్నారు. డిలాన్‌కు నోబెల్ ప్రకటించడంలో ప్యానెల్ ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుందని అకాడెమీ శాశ్వత కార్యదర్శి సరా డెనియస్ పేర్కొన్నారు. డైనమేట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట 1901 నుంచి ప్రతి సంవత్సరం విజ్ఞానం, సాహిత్యం, శాంతి రంగాల్లో విశేష కృషి చేసినవారికి పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.
6.ఆర్ధిక నోబెల్: ఓలివర్ హార్ట్(బ్రిటన్-అమెరికా), బెంట్ హోమ్‌స్ట్రామ్(ఫిన్లాండ్) ప్రముఖ ఆర్థికవేత్తలు
ఓలివర్ హార్ట్(బ్రిటన్-అమెరికా), బెంట్ హోమ్‌స్ట్రామ్(ఫిన్లాండ్)లను ఈ ఏడాది ఆర్థిక శాస్త్ర నోబెల్ పురస్కారం వరించింది. ‘కాంట్రాక్ట్ థియరీ’లో చేసిన విశేష కృషికి గానూ వీరిని సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు జ్యూరీ సోమవారం ప్రకటించింది. బీమా పాలసీల రూపకల్పన, అధికారుల వేతనంతో పాటు జైళ్ల నిర్వహణ వంటి వాటికి ఈ సిద్ధాంతం ఎంతో ఉపయోగపడుతుందని నోబెల్ జ్యూరీ చెప్పింది. అత్యున్నత స్థాయి అధికారులకు పనితీరు ఆధారిత వేతనం, ఇన్సెంటివ్‌లు, బీమాలో మినహాయింపులు, పాలసీదారుల క్లెయిమ్‌లు, ప్రభుత్వ సంస్థల కార్యకలాపాల ప్రైవేటీకరణ, ఒప్పందాల రూపకల్పనలో లోటుపాట్ల వంటి విభిన్న అంశాలెన్నింటినో సమగ్రంగా విశ్లేషించడం ద్వారా కాంట్రాక్ట్ థియరీని ఓలివర్, హోమ్ స్ట్రామ్లు అభివృద్ధి చేసినట్టు తెలిపింది. ‘కాంట్రాక్ట్ థియరీ’ ఒక అద్భుత సాధనం... వాస్తవిక ఒప్పందాలు, సంస్థల గురించిన అవగాహన, సమస్యల పరిష్కార మార్గాలతో పాటు టీచర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు, జైలు గార్డులు నిర్దేశిత లేదా పని ఆధారిత వేతనం పొందేందుకు ఈ సరికొత్త సైద్ధాంతిక ఉపకరణాలు సహాయపడతాయని నోబెల్ కమిటీ సభ్యుడు పర్ స్ట్రాంబర్గ్ చెప్పారు. దివాలా చట్టం నుంచి రాజకీయ రాజ్యాంగం వరకు సంస్థలు, విధానాల రూపకల్పనకు ఇది మేథో పునాది వేసినట్టు పేర్కొన్నారు. సమస్యేమిటో తెలుసుకోవడానికే కాకుండా, వాస్తవ పరిస్థితులను విశ్లేషించే అవకాశం కాంట్రాక్ట్ థియరీ వల్ల కలుగుతుందని, తద్వారా షేర్హోల్డర్లు, కార్పొరేట్ బోర్డులు మరింత మెరుగైన ఒప్పందాలు రూపొందిం చుకోవడానికి అద్భుత సాధనంగా సహాయపడుతుందని తెలిపారు. హార్ట్... హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ఆచార్యుడిగా సేవలందిస్తున్నారు. ఈయన 1948లో జన్మించారు. హోమ్‌స్ట్రామ్ (67) మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అర్థశాస్త్రం, మేనేజ్మెంట్ ప్రొఫెసర్. విడివిడిగానూ, కలిసి పనిచేసిన వీరు నోబెల్ అవార్డు కింద ఇచ్చే సుమారు రూ.6.14 కోట్ల (924 వేల డాలర్లు) నగదు బహుమతిని పంచుకోనున్నారు. గత ఏడాది అర్థశాస్త్ర నోబెల్ అమెరికా-బ్రిటన్ పరిశోధకుడు అంగస్ డేటన్కు దక్కింది. ఏటా ఇచ్చే ఆరు నోబెల్ పురస్కారాల్లో ఐదింటిని ఇప్పటికే జ్యూరీ ప్రకటించింది. చివరిదైన సాహిత్య పురస్కార గ్రహీతెవరన్నది గురువారం తెలుస్తుంది. డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో జరిగే వేడుకలో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. హార్ట్, హోమ్స్ట్రామ్లు ఈ గౌరవానికి అర్హులంటూ 2008 ఆర్థిక నోబెల్ పురస్కార గ్రహీత పాల్ క్రుగ్మన్ అభినందించారు.
ఆధారము: https://www.nobelprize.org/